సెనెకా ఉత్తరాలు-4

తొమ్మిదవ ఉత్తరం

అంటే జ్ఞానికి మిత్రులుండరా? స్నేహితుల్తో పనిలేదా? తనొక్కడూ తనకై తాను, తనలో తాను జీవిస్తాడా? ఈ ప్రశ్నకి జవాబుగా తొమ్మిదవ ఉత్తరం నడుస్తుంది. ఇట్లాంటి ప్రశ్నలే ఎవరో ఎపిక్యూరస్ అని అడిగితే ఆయన వాళ్ళని మందలించాడు అని చెప్తూ, జ్ఞానికి కూడా స్నేహితులుంటారు, కాని ఏ కారణం చాతనయినా తన స్నేహితులు తనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే జ్ఞాని వాళ్ళకోసం శోకిస్తూ కూచోడు అని చెప్తాడు. ఒక వర్గం వాళ్ళేమంటారంటే, సత్యం లేదా ఈశ్వరుడు ఏ పేరుతోనైనా పిలవండి, ఆ అంతిమ సత్యం వ్యక్తిగత సుఖదుఃఖాలకి అతీతం కాబట్టి, జ్ఞాని కూడా ఎవరో ఒకరు తన జీవితంలోకి రావాలని ఎదురుచూడడు అని. కాని సెనెకా వాళ్ళకీ, తమకీ, అంటే స్టోయిక్కులకీ మధ్య ఉన్న భేదం చెప్తూ, వాళ్ళ జ్ఞాని ఎలాంటి సుఖదుఃఖాల్నీ అనుభూతి చెందడు, కాని తమ దృష్టిలో జ్ఞానికి సంతోషమూ, బాధా కలుగుతాయిగాని, వాటిని ఓర్చుకుంటాడు, వాటి ప్రభావాన్ని అతిక్రమిస్తాడు అని. తన దృష్టిలో జ్ఞానికి, అతడు ఎంత తనలో తానుగా జీవిస్తున్నా కూడా, అతడికి కూడా స్నేహితులు కావాలి, ఇరుగుపొరుగు కావాలి, సహచరులు కావాలి. కాని ఏ కారణం చేతనయినా ఆ స్నేహితులు, సహచరులు దూరమైపోతే, అందుకు విలపించడు. అంతే తేడా. ఈ సందర్భంగా ఇలా రాస్తున్నాడు:

నేన్నీకో వశీకరణ కషాయం చూపిస్తాను, అందులో అన్ని రకాల మూలికలూ, మందులూ, మంత్రాలూ కలిపిపెట్టాను చూడు. ఆ మంత్రమేమిటో తెలుసా? నిన్నెవరన్నా ప్రేమించాలనుకుంటే, ముందు, నువ్వు ప్రేమించడం మొదలుపెట్టు అన్నాడు హెకాటో. ఎన్నాళ్ళుగానో కొనసాగుతున్న మన స్నేహాల్నీ, స్థిరపడ్డ అనుబంధాల్నీ నిలుపుకోవడంలో ఎంత ఆనందం ఉందో, కొత్త స్నేహాలు మొదలుపెట్టడంలో కూడా అంతే ఆనందం ఉంది.. అట్టలస్ అనే తత్త్వవేత్త , పాత స్నేహాల్ని నిలుపుకోవడం కన్నా కొత్త స్నేహాల్ని మొదలుపెట్టడంలోనే ఎక్కువ సంతోషం ఉంది అన్నాడు. ఎందుకంటే ఒక చిత్రలేఖనాన్ని పూర్తిచెయ్యడంలోకన్నా వేస్తూ ఉండటంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది కదా అన్నాడు.

కొత్తస్నేహాల వెంట పడటం ఆకర్షణల వెంట పడటం కాదా? తన అవసరాలు, ప్రయోజనాలు తీర్చుకోవడం కోసం మనుషుల్ని వెతుక్కోవడం కాదా? కాదంటున్నాడు. ఎందుకంటే, ఇదిగో, ఇలా చెప్తున్నాడు:

జ్ఞాని తనలో తానే సంతోషంగా గడిపేవాడే అయినప్పటికీ, స్నేహం చెయ్యడం ఒక సాధనగా కొత్త స్నేహాలు చేపడతాడు. ఆ విధంగా అతడిలోని ఉదాత్త లక్షణాలు నిద్రాణంగా ఉండిపోకుండా చూసుకుంటాడు.  జబ్బు పడ్డప్పుడు పక్కన కూచోడానికీ, జైల్లో ఉన్నప్పుడో, లేదా సమస్యలో ఉన్నప్పుడో సాయం చెయ్యడానికీ జ్ఞానికి స్నేహితులు అవసరమని ఎపిక్యూరస్ అన్నాడు. కాని జ్ఞాని మరొకరెవరేనా జబ్బు పడి ఉంటే తానే వెళ్ళి వాళ్ళకి సపర్య చేయాలనుకుంటాడు. తన మిత్రులు జైల్లో వుంటే తానే వెళ్ళి విడుదల చేస్తాడు… నువ్వు తనకి ఉపయోగపడతావు కాబట్టి నీతో స్నేహం చెయ్యాలనుకునేవాడు, నీకు నిజంగా అవసరమైనప్పుడు, ముందే మొహం చాటేస్తాడు.

ఇంకా ఇలా అంటున్నాడు:

మరయితే నేను దేనికోసం స్నేహం చెయ్యాలి? నువ్వేమంటావంటే నాకు స్నేహితులు ఎందుకు అవసరమంటే, అవసరమైతే నేను తన కోసం మరణించడానికి నాకో స్నేహితుడు కావాలి, అవసరమైతే తనకోసం ప్రవాసానికి వెళ్ళడానికి, తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డుపెట్టడానికి, చివరికి తల తాకట్టు పెట్టడానికి కూడా అంటావు నువ్వు. నువ్వు చిత్రించే ఈ స్నేహం నా దృష్టిలో స్నేహంకాదు, ఒక బేరసారం మాత్రమే అనిపిస్తున్నది. ఎందుకంటే ఇది ఒక అవకాశాన్నీ, దాని వల్ల రాగల ఫలితాల్నీ మాత్రమే పైకెత్తి చూపిస్తోంది. ప్రేమలో కూడా స్నేహం లాంటిదే అనడంలో సందేహం లేదు. బహుశా పిచ్చి స్థాయికి చేరుకున్న స్నేహాన్నే ప్రేమ అనవచేమో. అయినప్పటికీ, ఎవరైనా ఏదైనా ప్రతిఫలమో,లాభమో, సన్మానమో ఆశించి ప్రేమిస్తారా? నిజమైన ప్రేమ వీటిని వేటినీ పట్టించుకోదని నీకు తెలుసు. ఎట్లాంటి ప్రతిఫలాపేక్ష, చివరికి, ఎదుటి వ్యక్తి కూడా తనలాగే తనని ప్రేమించాలని కూడా ఆశించకుండా మనిషి సౌందర్యాన్ని ఆరాధించడమే ప్రేమ అనిపించుకుంటుంది.

కాబట్టి జ్ఞాని కోరుకునే స్నేహాలు ప్రేమలాంటివి, ప్రతిఫలాపేక్షతో సంబంధం లేనివి.

అతడికి మరో మనిషితో పనిలేకపోయినప్పటికీ, జ్ఞానికి స్నేహాలు కావాలి. అతడు వీలైనతమందితో స్నేహంకోసం తపిస్తాడు. వాళ్ళవల్ల తాను సంతోషంగా గడపవచ్చునని మాత్రం కాదు, ఎందుకంటే వాళ్ళెవరూ లేకపోయినా కూడా అతడి సంతోషానికేమీ లోటు రాదు కాబట్టి.

జ్ఞాని స్నేహితుల్ని కోరుకుంటాడని సెనెకా రాసిన ఈ మాటలు చదువుతున్నంతసేపూ నాకు సంజీవదేవ్ గారే గుర్తొస్తూ ఉన్నారు. ఆయన జీవితమంతా వీలైనంత మంది స్నేహితులకోసం తపించాడు. వాళ్ళ ఇళ్లకి తాను వెళ్ళేవాడు, వాళ్ళని తన దగ్గరికి ఆహ్వానించేవాడు. వాళ్ళకి ఉత్తరాలు రాసేవాడు. ఆ ఉత్తరాల్తో పాటు ఒక కవితనో, చిన్న బొమ్మనో కూడా పంపించేవాడు. కాని ఏ మిత్రుడైనా ఉత్తరాలు రాయడం మానేస్తేనో లేదా ఆదానప్రదానాలు ఆగిపోతేనో ఆయన ఎప్పుడూ విలపించినట్టు కనిపించదు. అన్ని వందల ఉత్తరాల్లో ఒక్క ఉత్తరంలో కూడా ఎవరి పట్లా నిష్ఠూరంగా ఒక్క మాట కూడా వినిపించదు.

పదవ ఉత్తరం

పదవ ఉత్తరంలో కూడా ఈ చర్చనే కొనసాగిస్తూ ఇలా ముగిస్తాడు:

ఏ రోజైతే దేవుణ్ణి బహిరంగంగా ప్రార్థించడానికి నువ్వు సందేహించవో, ఆ రోజున నువ్వు నిజంగా అన్ని కోరికలనుంచీ విముక్తుడివి అయ్యావని గుర్తించు అన్నాడు అథెనొడొరస్. మనుషులు ఎంత మూర్ఖులు! వాళ్ళు చేసే ప్రార్థనలు ఎవరూ వినగలిగేవి కావు. వాటిని ఎవరన్నా వింటున్నట్టు అనుమానమొచ్చిందనుకో. వెంటనే ప్రార్థిఃచడం ఆపేస్తారు. తోటిమనుషులు వినడానికి దుర్భరంగా ఉండే ప్రార్థనలన్నమాట అవి. ఇట్లాంటి మనుషుల మధ్య నేన్నీకు ఇవ్వగల సలహా అంటూ ఉంటే ఇదే: నువ్వు మనుషుల మధ్య ఎలా మసలుకోవాలంటే సదా దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు అన్నట్టు. దేవుణ్ణి ఎలా ప్రార్థించాలంటే, నీ ప్రతి ఒక్క మాటా మనుషులు వింటున్నారన్నట్టు.

పదకొండవ ఉత్తరం

పదకొండో ఉత్తరంలో కూడా ఇటువంటి వాక్యాలే రాస్తాడు. చూడండి:

లుసిలియస్, ఎపిక్యూరస్ చెప్పిన ఈ మాట చూడు:  గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఒక మనిషిని నీ కళ్ళముందు ఊహించుకో. అతడు ఎప్పుడూ నిన్నే చూస్తున్నట్టూ, నీ ప్రతి ఒక్క చేష్టనీ అతడు సరిదిద్దుతున్నట్టూ ఊహించుకో. ఈ మాటలు, ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో, ఎంత స్వీకరించదగ్గవిగా ఉన్నాయో కదా. ఈ ఒక్క వాక్యం ద్వారా అతడు మనకి ఒక సంరక్షకుణ్ణీ, ఒక అంగరక్షకుణ్ణీ కూడా ఇచ్చినట్టు కదా. మనం ఏ పనిచేస్తున్నా మననొక సాక్షి గమనిస్తున్నాడు అనగానే దాదాపుగా మనం అన్ని రకాల పాపాలనుంచీ బయటపడ్డట్టే. ఆ సాక్షి మన పక్కనే ఉండి, మనం ఏ పొరపాటూ చెయ్యకుండా కనిపెడుతూ ఉన్నట్టే అనుకో. ప్రతి మనిషికీ తాను గౌరవించదగ్గవాళ్ళంటూ ఒకరుండాలి. ఆ వ్యక్తిత్వపు వెలుగులో మన అంతరంగ మందిరం కూడా ప్రకాశించాలి. తాను వాళ్ళ మధ్య ఉన్నప్పుడే కాదు, తన తలపులు వాళ్ళ మనసులో మెదిలినప్పుడు కూడా మనుషులు తమ ప్రవర్తనని మెరుగుపర్చుకునేలాగా చెయ్యగలిగినవాడు ఎంత ధన్యజీవి! అంతే కాదు, అలాంటి ఒక మనిషిని గుర్తుచేసుకోగానే తన తలపులు అడగిపోయి తాను నిశ్చలం కాగలిగినవాడు కూడా ఎంత ధన్యజీవి! ఒకరిని అలా గౌరవించగల మనిషి తప్పకుండా తొందర్లోనే తాను కూడా పూజనీయుడిగా మారిపోతాడు.

మామూలుగా మనం రోల్ మోడల్స్ గురించి మాట్లాడతాం. ప్రతి ఒక్కరికీ తాము అనుసరించదగ్గ గొప్ప వ్యక్తులు తమముందు ఉండాలని చెప్తాం. లేదా గురుశిష్యసంప్రదాయం గురించి మాట్లాడతాం. రోల్ మోడల్ మరీ సంకుచితమైన పదం. గురువు మరీ విశాలమైన పదం. ఈ రెండూ కాదు, నువ్వు గౌరవించదగ్గ ఒక వ్యక్తి నీకు జీవితంలో ఉంటే, ఆ వ్యక్తి నువ్వేం చేస్తున్నా నిన్ను పరిశీలిస్తున్నాడనే భావన నీలో నిలుపుకుంటే అది నీ ప్రవర్తనని అనూహ్యంగా మెరుగుపరుస్తుందనే మాట నిజంగా గొప్ప మాట. ఈ మాటలు చదివినప్పుడు నా జీవితంలో అటువంటి మనిషి ఎవరై ఉండవచ్చునా అని ఆలోచించాను. ఏదైనా ఒక ప్రత్యేక రంగంలో నేను అపారంగా గౌరవించే వ్యక్తులు చాలామందే ఉన్నారుగాని, నా వ్యక్తిత్వాన్ని మెరుగుదిద్దుకోడానికి, అనుసరించదగ్గ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎవరూ కనిపించలేదు. నా చిన్నప్పుడు నా తండ్రి నా మీద అటువంటి మానసిక ప్రభావం చూపించేవాడు. హైస్కూల్లో ఉన్నప్పుడు హీరాలాల్ మాష్టారు, కొంతవరకూ. కాని ఆ తర్వాత? సంక్లిష్టమయిన జీవితసందర్భాల గుండా నేను నడవవలసి వచ్చినప్పుడు, తెలిసి, తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తూ వచ్చినప్పుడు, చాలా ఏళ్ళు నాకు నా మనసు విప్పి చెప్పుకోగల మనుషులెవ్వరూ కనిపించలేదు. నెమ్మదిగా నా అంతరంగాన్నే అటువంటి సాక్షిగా నేను ఆవిష్కరించుకోగలిగాను. పాపపుణ్యాల చీలుదోవల మధ్య ప్రతి సారీ నన్ను కాపాడుతూ వస్తున్నది నా అంతరంగమే, సందేహం లేదు. కాని ఒక మనిషికి తన అంతరంగం మిత్రుడిగా మారడం అంత సులభసాధ్యం కాదు. అందుకు మధ్యలో ఎన్నో నరకాలు దాటవలసి ఉంటుంది.

నాకు కనిపించలేదు సరే, నేనెవరి మనసులోనైనా ఒక ఆదర్శంగా, నా గురించిన తలపులు కలిగితే చాలు, వాళ్ళని వాళ్ళు మెరుగుపర్చుకోవాలని కోరుకునేవాళ్ళెవరైనా ఉన్నారా? ఉండరనే అనుకుంటాను. ముందు నేను వందనీయుడిగా మారితే కదా, మరొకరు నన్ను వందనీయుడిగా భావించేది!

సెనెకా ఇంకా ఇలా అంటున్నాడు:

ఎవరి జీవితం, సంభాషణలు, అతడి మనసు ప్రతిఫలించే ముఖవర్ఛస్సు నిన్ను గొప్పగా సంతృప్తిపరచగలవో అటువంటి ఒక మనిషిని వెతుక్కో. అతడు నిన్ను సదా సంరక్షిస్తున్నట్టుగా భావించుకో. మన శీలాన్ని, నడతని చక్కదిద్దుకోడానికి అటువంటి మనుషులు ఎవరో ఒకరు ఉండితీరాలి. రూళ్ళకర్ర లేకుండా తిన్నగా గీతగియ్యలేము కదా.

ఇటువంటి ఆలోచనలు బహుశా మన పూర్వతరాల వాళ్ళకి ఉండి ఉండేవనుకుంటాను. గాంధీ తన సమకాలికుల మీద చూపించిన నైతిక ప్రభావం ఇటువంటిదే. కాని మన తరానికీ, మన ముందు తరానికీ వచ్చిన సమస్య ఏమిటంటే, మనం ఏ మనిషీ పరిపూర్ణుడు కాడనీ, ఒక మనిషి లోపాల గురించి కూడా మనం మాట్లాడుకోకపోతే మనం ఆ మనిషిని సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు కాదనీ చెప్పుకుంటూ వచ్చాం. దీనివల్ల మన జీవితాల్లో ఆదర్శవ్యక్తులంటూ ఎవరూ మిగల్లేదు. వాస్తవ జీవితంలో లోపాల్లేని మనుషులు ఉండకపోవచ్చుగాక, కానీ నీ మనసులో, నీ జీవితంలో కనీసం ఒకరినైనా నువ్వు ఆ స్థానంలో నిలుపుకోకపోతే, నీ ప్రవర్తన ఎప్పటికి సంస్కరణకు నోచుకుంటుంది?

మన సోషల్ మీడియా యుగంలో మనం మరొక అడుగు ముందుకు వెళ్ళాం. మన జీవితాల్లో ఆదర్శవ్యక్తులు లేకుండా చూసుకోవడమేకాక, పక్కవాళ్ళ జీవితాల్లో కూడా లేకుండా చూస్తున్నాం. ఎవరేనా ఎవర్నేనా ఆదర్శంగా తీసుకున్నారని తెలియగానే మనం మొదటచేసేపని ఆ ఆదర్శవ్యక్తిత్వాన్ని శాయశక్తులా కించపరచడం. ఆదర్శాల్ని చేజేతులా నీ జీవితంలోంచి బయటికి గెంటేసావు, ఇప్పుడు నీ పిల్లల జీవితాల్ని కూడా ఆదర్శరహితం చేస్తున్నావు. తీరా వాళ్ళు సమస్యల్లో కూరుకుపోయినప్పుడు నువ్వు చెయ్యగలిదేమిటి? ఫామిలీ కౌన్సిలరుకు ఫోన్ చెయ్యడమే కదా!

అందుకే చెప్తుంటాను. ఆదర్శ వ్యక్తుల గురించి రాయండి, పిల్లలకు పరిచయం చెయ్యండి అని. అసలు మరొకర్ని ఆదర్శంగా ప్రతిపాదించవలసిన పని ఏముంది? ఆ ఆదర్శవ్యక్తి ఎవరో నువ్వే కావచ్చు కదా. నిజమే పరిపూర్ణమైన మనిషి అంటూ ఎవరూ ఉండరు. అలాగని పరిపూర్ణత్వం కోసం ప్రయత్నించడం మానెయ్యక్కర్లేదు. నువ్వు నీ పిల్లల ఎదట ఒక ఆదర్శవ్యక్తిగా నిలబడగలిగితే, రేపు నువ్వీ లోకంలో లేకపోయినప్పుడు కూడా, వాళ్ళు నీ సజీవ సన్నిధిని అనుభవంలోకి తెచ్చుకుంటూనే ఉండగలుగుతారు.

19-12-2022

Leave a Reply

%d bloggers like this: