
నాలుగవ ఉత్తరం
మనిషి అంతిమంగా భయపడేది రెండింటికే. ఒకటి పేదరికం, రెండోది మరణం. ఈ రెండు భయాలూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నవే. అందుకనే మృత్యువు కలిగించే భయాందోళనలనుండి బయటపడటం ఎలా అంటో, సెనెకా రాసిన నాలుగవ ఉత్తరంలో, పేదరికాన్ని ఐచ్ఛికంగా వరించడంలోని సాంత్వన గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఉత్తరంలో చివరి వాక్యాలు చూడండి:
ఈరోజు నాకు సంతోషం కలిగించిన ఒక వాక్యం నీతో పంచుకోనివ్వు. అది మరొకరి తోటనుంచి ఏరి తెచ్చుకున్న వాక్యం. ‘ ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఎంచుకున్న పేదరికాన్ని మించిన ఐశ్వర్యం లేదు.’,ప్రకృతి నియమాలు మనమీద విధించే అవసరాలేమిటో తెలుసునా? ఆకలిదప్పులు తీర్చుకోడానికీ, చలినుంచి కాపాడుకోడానికీ మనం డబ్బున్నవాడి ఇంటిముందు పడిగాపులుపడనక్కర్లేదు. కోపిష్ఠిముందు మోకరిల్లనక్కర్లేదు. దయార్ద్రహృదయుడిముందు మనల్ని మనం చిన్నబుచ్చుకోనక్కర్లేదు. అందుకు సముద్రాలు దాటనక్కర్లేదు. దండయాత్రలు చెయ్యనక్కరలేదు. ప్రాకృతిక అవసరాల్ని తీర్చుకోవడం సులభం. ఆ పాటి సాధనసంపత్తి మనకి అందుబాటులో ఉండనిదేమీ కాదు. నిజానికి మనుషులు చెమటోడ్చేది అనవసరమైన విషయాల గురించే. మనం తలపాగాలు ధరించి పరుగులుపెట్టేది, యుద్ధశిబిరాల్లోనే మగ్గిపొయ్యేదీ, పరాయినేలలకు పయనించేది, బొత్తిగా అనవసరమైన వాటికోసమే. నిజానికి మనకి ఏది అందుబాటులో ఉందో అది మనకి సరిపోతుంది. పేదరికంతో సవ్యంగా ఒడంబడిక కుదుర్చుకున్నవాడికన్నా సంపన్నుడు మరొకడు లేడు.
అయిదవ ఉత్తరం
సాధారణంగా ప్రపంచం మనుషుల ముందు రెండు దారులు చూపిస్తుంది. ఒకటి ఈ లోకంలో కూరుకుపోవడం, రెండోది, ఈ లోకానికి చెందకుండా అడవుల్లోకో, లేదా తమ తమ ఏకాంత ప్రపంచాల్లోకో కూరుకుపోవడం. గొప్ప్ప తత్త్వవేత్తలు ఈ రెండు దారులకీ మధ్యస్థంగా ఉండే దారి ఎంచుకొమ్మని చెప్తూ వచ్చారు. బుద్ధుడు చెప్పిన మధ్యేమార్గం మనకు తెలుసు. సెనెకా కూడా ఆ మాటలే చెప్తున్నాడు. ‘తత్త్వవేత్తలు అనుసరించవలసిన మధ్యేమార్గం ‘ అనే తన ఉత్తరంలో ఆయనిలా రాస్తున్నాడు:
నువ్వెంత నిశ్శబ్దంగా సాధనచేస్తున్నా సరే, తత్త్వ్వశాస్త్రమనే పేరు వింటేనే చాలు, మనుషులు ముఖం చిట్లిస్తారు. అలాంటిది, మనం మన తోటిమనుషులనుంచి పూర్తిగా వేరుపడిపోతే ఇంక చెప్పేదేముంది? మనం మన అంతరంగంలో వాళ్ళకన్నా పూర్తిగా భిన్నంగా ఉండాలి, ఒప్పుకుంటాను, కాని మన బయటి జీవితం మాత్రం సమాజానికి అనుగుణంగా ఉండాలి. మరీ ఖరీదైన తలపాగా చుట్టకు, అలాగని మరీ మురిగ్గుడ్డకూడా తలకి చుట్టుకోకు. బంగారం అంచుపొదిగిన వెండిపళ్ళెం అక్కర్లేదు. అలాగని వెండిబంగారాల్ని పరిత్యజించడమే మన సరళ జీవితానికి నిరూపణ కాకూడదు కూడా. ప్రజాబాహుళ్యంకన్నా ఉనంతమైన జీవనప్రమాణాల్ని నిలుపుకుందాం, అంతే తప్ప వారికి విరుద్ధంగా ఉండేలాగా జీవనశైలిని ఎంచుకోవద్దు. అలా చేసేమో అనుకో మనం ఎవరి జీవితాల్ని మెరుగుపర్చాలనుకుంటున్నామో వాళ్ళనే భయభ్రాంతుల్ని చేసి తరిమేసేవాళ్ళమవుతాం. వాళ్ళు భయంతో మనల్ని అనుకరించే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని ఏ కోశానా అనుకరించకుండా చూసుకుందాం.
ఈ వాక్యాలకు వ్యాఖ్యానం అవసరం లేదు. కానీ ఈ మాటలు ఒకప్పటికన్నా నేటి ప్రపంచానికి ఎక్కువ అవసరంగా కనిపిస్తున్నాయన్నదే నేను అదనంగా చెప్పగల మాట. తమ ఆలోచనల్లో తాము తక్కిన సమాజం కన్నా ఉన్నతంగా ఉన్నామని పదేపదే నిరూపించుకోవడం కోసం తక్కిన మనుషుల్ని కించపరుస్తూ, ఎద్దేవా చేస్తూ, శపిస్తూ, విరుచుకుపడుతూ, కానీ, ఇదంతా వాళ్ళ మంచికే, వాళ్ళ మేలు కోసమే చేసామని చెప్పుకోవడంలోని అనౌచిత్యం ఏమిటో ఈ మాటలు చెప్పడం లేదూ!
ఆయాన ఇంకా ఇలా రాస్తున్నాడు:
తత్త్వవేత్త మొట్టమొదటగా చెయ్యవలసిన పని తన తోటిమనుషులకు సహానుభూతిని పంచడం. మరో మాటలో చెప్పాలంటే ఒక సామాజికతను, సంఘీభావాన్ని ప్రోదిచెయ్యడం. మనం తక్కిన మనుషుల్లాగా లేకపోతే ఈ సూత్రానికి కట్టుబడలేం. తోటిమనుషులనుంచి మనం అభిమానాన్నీ, ఆరాధననీ కోరుకునే మార్గం అసంబంద్ధంగానూ, జుగుప్స కలిగించేదిగానూ ఉండకూడదు… తత్త్వశాస్త్రం సరళజీవితాన్ని కోరుకుంటుందే తప్ప శుష్కజీవితాన్ని కాదు. మనం సరళంగానూ, శుభ్రంగానూకూడా ఉండవచ్చు. కాబట్టి నేను సమర్థించే మధ్యే మార్గం ఇది: మన జీవితం ఒక సాధువు జీవనశైలికీ, సాధారణ జనజీవితానికీ మధ్యస్థంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ దాన్ని అభిమానించేదిగా ఉండాలి, దాంతో పాటు వారు దాన్ని అర్థం చేసుకోగలిగేదిగా కూడా ఉండాలి.
ఇది చాలా ముఖ్యమైన మాట. తోటిమనుషులు నీ జీవితాదర్శాలని ఆరాధిస్తే సరిపోదు, వారు దాన్ని అర్థం చేసుకోగలగాలి కూడా. సాధారణంగా తమ ఆలోచనల్లోనూ, జీవనపద్ధతుల్లోనూ విప్లవాత్మకతను కోరుకునే వారు, ప్రజల అవగాహనా పరిథిని దాటిపోతూండటం మనం చూస్తూ ఉన్నదే కద! ఇంకా ఈ వాక్యాలు చూడండి:
అంటే మనం కూడా తక్కినవాళ్ళల్లాగే బతకాలా? అప్పుడు మనకీ ప్రపంచానికీ మధ్య తేడా ఏమిటి అనడుగుతావు నువ్వు అవును, చాలా పెద్ద తేడానే ఉంది. దగ్గరగా చూస్తే మనం తక్కిన ప్రజాబాహుళ్యంగా లేమని వాళ్ళని గ్రహించనివ్వు. వాళ్ళు మన ఇంటికి వస్తే, చూడవలసింది, మనల్ని తప్ప, మన ఇంట్లో వస్తుసామగ్రిని కాదు. తన ఇంట్లో మట్టిపాత్రల్నే వెండిపాత్రలుగా భావించి వాటితో పనులు చేసుకునే మనిషి నిజంగా గొప్పవాడు. కాని వెండిపాత్రల్ని కూడా మట్టిపాత్రలుగా భావించేవాడు కూడా గొప్పవాడే. సంపదల్ని సహించలేకపోవడం కూడా ఒకలాంటి మనోదౌర్బల్యమే.
ఇదీ ఒక సజ్జనుడు, ఒక స్థితప్రజ్ఞుడు, ఒక స్టోయిక్కు ఆలోచించే తీరు.
ఆరవ ఉత్తరం
తాను ఒక వ్యక్తిగా రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నానని చెప్తూ ఆరవ ఉత్తరం మొదలుపెడతాడు. తనలో జరుగుతున్నది వట్టి సంస్కరణ కాదు, పరివర్తన అని చెప్తాడు. అయితే, తనకు తెలిసినదాన్ని నలుగురితో పంచుకోవడంలోనే తనకు ఎక్కువ ఆనందం కలుగుతున్నదని చెప్తూ ఇలా అంటున్నాడు:
నేను పొందుతున్న జ్ఞానం ఎంత శ్రేష్ఠం కానీ, ఎంత ప్రయోజనకారిగానీ, దాన్ని అచ్చంగా నా కోసమే మిగుల్చుకుంటే అది నాకు ఏ విధంగానూ సంతోషం కలిగించదు. జ్ఞానాన్నీ, వివేకాన్నీ అందిస్తాంగానీ, దాన్ని ఎవరితోనూ పంచుకోకూడదనీ, దాని గురించి ఎక్కడా మాట్లాడకూడదనీ నాకు ఎవరేనా షరతు విధించారనుకోండి, అట్లాంటి జ్ఞానం నాకు వద్దనే అంటాను. స్నేహితులతో పంచుకోడానికి వీలుకాని ఏ మంచి విషయమూ మనం పొందడానికి పనికిరానిదే.
కానీ ఇక్కడొక సున్నితమైన అంశం ఉంది. నువ్వు తోటిమనుషుల్తో నీ జ్ఞానాన్ని, వివేకాన్నీ పంచుకునే క్రమంలో నిన్ను నువ్వు కోల్పోకుండా చూసుకోవాలి. మనం చాలామందిమి చేసే పొరపాటు ఇదే. ఏ జ్ఞానాకర్షణవల్ల మనుషులు మనకి చేరువ అవుతారో, అనతికాలంలోనే వారు మననుంచి దూరంగా వెళ్ళిపోవలసి రావడం కూడా ఇందుచాతనే. కాబట్టి తక్కినవాళ్ళ కన్నా ముందే జ్ఞాని తనకు తనే మంచి స్నేహితుడు కావాలి. అందుకని, ఉత్తరం చివరలో ఏమంటున్నాడో చూడండి:
నేనీ మధ్య సాధించిన పురోగతి ఏమిటంటావా? నేను నాకు స్నేహితుణ్ణి కావడం మొదలుపెట్టాను అంటాడు హెకాటో. ఇది నిజంగా గొప్ప విషయం. అట్లాంటి మనిషి ఎప్పటికీ ఒంటరి కాడు. అంతేకాదు, అలాంటి మనిషి మొత్తం మానవాళికే మిత్రుడు కాగలుగుతాడు.
ఏడవ ఉత్తరం
మనం మన సామాజిక సంబంధాల్లో ఎదుర్కొనే సమస్యలకి చాలావరకూ కారణం, మనం మనుషులకీ, మందికీ మధ్య తేడా గుర్తించలేకపోవడం. అందుకని ‘నువ్వు తప్పనిసరిగా దూరం పెట్టవలసిందేమిటి అని అడిగిగే మందిని, మూకని అని చెప్తాను’ అంటున్నాడు సెనెకా ఏడవ ఉత్తరం మొదలుపెడుతూ. ఈ విషయంలో ఇంకా ఇలా రాస్తున్నాడు:
చాలామంది అదే దారిన నడిచారని నువ్వు కూడా వాళ్ళని అనుకరించకు. అలాగని వాళ్ళు నీలా లేరు కాబట్టి వాళ్ళని ద్వేషించకు. ఎంతగా వీలైతే అంతలా నీలోకి నువ్వు చూపు తిప్పుకో. నిన్ను మరింత మంచి మనిషిగా ఎవరు మార్చగలరో వారితోనే జతకూడు. నువ్వు ఎవరిని మెరుగుపర్చగలవో వారినే స్వాగతించు. ఈపరస్పరం జరిగే ప్రక్రియ ఇది. మనుషులు బోధించడం ద్వారానే నేర్చుకుంటారు.
కాని మనని అర్థం చేసుకోగలిగేవారూ, మనని మెరుగుపరుస్తూ తాము కూడా మెరుగవ్వాలని కోరుకునేవారూ ఎక్కువమంది ఉండరు కదా, ఇంకా చెప్పాలంటే, ఒకరిద్దరికి మించి ఉండరు కదా అనవచ్చు. అందుకు సెనెకా చెప్పేదేమంటే, నువ్వు నీ ప్రయత్నాలు మానకు, అందువల్ల నువ్వు నష్టపోయేదేమీ లేదు, ఆ ప్రక్రియలో నువ్వు నేర్చుకున్నది నీకే ఉపయోగపడుతుంది అని. అదీకాక, నిజానికి, నీ హృదయాన్ని అర్థం చేసుకునేవాళ్ళు ఎంతమంది ఉండాలి? ఈ మాటలు వినండి:
నా వరకూ ఒక్కమనిషే ఒక ప్రజాబాహుళ్యంతో సమానం, అలాగే ప్రజాబాహుళ్యం కూడా నా దృష్టిలో ఒక్క మనిషికంటే ఎక్కువేమీ కాదు అన్నాడు డెమోక్రిటిస్. ఈ మాటలు కూడా చూడు. ఇవి ఎవరి వాక్యాలో తెలియవు గాని, చాలా ఉదాత్తంగా మాట్లాడిన మాటలు. ఎవరో కొద్దిమందికి మాత్రమే చేరగల కళమీద ఎందుకు అంత అధ్యయనం చేపట్టావని అడిగితే అతడు అన్నాడట: ‘అది ఏ కొద్దిమందికి చేరినా నాకు సంతోషమే, ఒక్కరికి చేరినా సంతోషమే, అసలు ఎవ్వరికీ చేరకపోయినా కూడా సంతోషమే’ అని. ఇంకో మాట, ఎపిక్యూరస్ చెప్పింది, అది కూడా గుర్తుపెట్టుకోదగ్గదే. తన అధ్యయనంలో పాలుపంచుకుంటున్న ఒక మిత్రుడికిట్లా రాసాడట: ‘నేను దీన్ని వందలాదిమందికోసం రాయడం లేదు. నీకోసం మాత్రమే రాస్తున్నాను. నీకు నువ్వూ, నాకు నేనూ చెప్పుకోగలిగితే చాలు’ అని. ఈ మాటలు మనసుపెట్టి వింటే, లుసిలియస్. అత్యధిక సంఖ్యాకులు నిన్ను ప్రశంసించడం వల్ల కలిగే సంతోషాన్ని నిరాకరించగలుగుతావు. మనుషులు చాలామందే నిన్ను పొగడవచ్చు, కాని నిన్ను నువ్వు సంతోషపరుచుకోగలిగావా లేదా? ముందు అది చూడు.
ఎనిమిదవ ఉత్తరం
కానీ మనుషులనుంచి దూరంగా ఉండమని చెప్పడం స్టోయిక్కు తత్త్వశాస్త్రానికి విరుద్ధం అని కూడా సెనెకాకి తెలుసు. అందుకని ఎనిమిదో ఉత్తరం మొదలుపెడుతూనే ఇలా అంటున్నాడు:
అలాగైతే మమ్మల్ని గుంపుని వదిలిపెట్టి మాలోకి మమ్మల్ని ముడుచుకుపొమ్మని చెప్తున్నావా? నువ్వే కదా చివరినిమిషందాకా ఏదో ఒక పని చేస్తూ ఉండాలని సలహా ఇచ్చింది? నిజానికి తలుపులు మూసుకుని మీతోనే మీరు గడపండని నేను చెప్తూ వచ్చిన సలహా వెనక ఉన్నది కూడా బహుజనహితమే. నేను ఒక్కరోజు కూడా సోమరిగా గడిపింది లేదు. చివరికి రాత్రి పూట కూడా చాలాసేపు అధ్యయనంలోనే గడుపుతాను. .. నేను మనుషులనుంచి మాత్రమే కాక, తక్కిన వ్యవహారాలనుంచి కూడా నన్ను నేను దూరంగా పెట్టుకోడానికి కారణం రాబోయే తరాలకోసం పనికొచ్చే పనులు చెయ్యడం కోసమే.
తాను భవిష్యతరాల కోసం రాసే రచనలు వారికి ఔషధంలాగా ఉపయోగపడతాయని తన నమ్మకం అని చెప్తూ, ఒకవేళ అవి రాబోయే తరాలకు ఉపయోగపడకపోయినా కనీసం తన రుగ్మతలకైనా చికిత్సగా పనికొస్తున్నాయని కూడా చెప్తాడు.
‘మందిని సంతోషపరచడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి’ అనేదే సెనెకా పదే పదే చెప్తున్న అంశం. మందిని సంతోషపరచడమంటే ఏమిటో మనకన్నా సెనెకా కే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆయన కాలం నాటి రోమ్ లో ప్రజల తీరికసమయపు వ్యాపకం గ్లాడియేటింగ్ చూడటం. ఒకరినొకరు చంపుకునేదాకా గ్లాడియేటర్లు ఒకరినొకరు నరుక్కుంటూ ఉంటే చూడటం రోమన్ కాలపు పౌరవినోదం. రెండు వేల ఏళ్ళ తరువాత మనమేమీ ముందుకు జరగలేదు. ఇప్పుడు కూడా మనుషులు ఒకరినొకరు నరుక్కుంటూనే ఉన్నారు. రక్తం కారడం లేదు, అంతే తేడా. కాని మన రాజకీయనాయకులు, మన సినిమా తారలు, మన సోషల్ మీడియాలో ట్రాలర్లు క్షణక్షణం పాల్పడుతున్నది పరస్పర హననం కాదా? ఒక్కొక్కప్పుడు నిజంగానే అనుమానం వస్తుంది: నన్ను నలుగురు ప్రశంసిస్తున్నారంటే నేనేదన్నా తప్పు చేస్తున్నానా అని. మందిని సంతోషపరచడం అంటే నువ్వొక ఎంటర్ టెయినర్ గా మారడమన్న మాట. నలుగురు నీ దగ్గర ఆగారంటే నువ్వు రోడ్డుపక్క మోళీ చెయ్యడం లేదు కద!
నిజానికి స్వాతంత్య్రాలన్నింటిలోనూ విలువైన స్వాతంత్య్రం ఏమిటంటే మరొకరిని సంతోషపెట్టవలసిన బాధ్యత నీకు లేకపోవడం. నువ్వు రచయితవా? అయితే పాఠకుల సంతోషం కోసం చూడకు. వారిని మెప్పించే ప్రయత్నాల్లో నీకు తెలీకుండానే నువ్వు సత్యం నుంచి దూరంగా జరిగిపోతావు.
ఎనిమిదవ ఉత్తరంలో సెనెకా ఒక వాక్యం ఉల్లేఖిస్తాడు. ఎపిక్యూరస్ అన్నాడట: ‘నీకు నిజమైన స్వాతంత్య్రం కావాలా? అయితే తత్త్వశాస్త్రానికి ఊడిగం చెయ్యి’ అని. తత్త్వశాస్త్రమంటే సత్యాన్ని వెతుక్కోవడం, సత్యాన్ని మటుకే ప్రేమించడం. మనుషుల్ని ప్రేమించు, కానీ, వాళ్ళకి ఊడిగం చెయ్యకు. తత్త్వశాస్త్రానికి నిన్ను నువ్వు సమర్పించుకుంటే మనుషులకు బానిస కావలసిన ప్రమాదం నుంచి బయటపడతావు.
18-12-2022
Part 3 చదివిన తరువాత మీకు కృతజ్ఞతాలు చెప్పలనా బలంగా ఉంది సార్ 🙏
ధన్యవాదాలు
భయంగా ఉంది సార్