సెనెకా ఉత్తరాలు-2

సెనెకా రాసిన ఉత్తరాల్లో మనం మొదట 18 వ ఉత్తరంతో మొదలుపెడదాం. ‘పండగలూ, ఉపవాసాలూ ‘అనే విషయం మీద రాసిన ఆ ఉత్తరం మొదలుపెడుతూనే ఆయన డిసెంబరు నెల వచ్చిందనీ, అయినా ఈ సమయాన నగరమంతా చెమటలు కక్కుతోందనీ, ఎందుకంటే మనుషులకి తినడానికీ, తాగడానికీ దొరికిన పూర్తిస్వేచ్ఛతో అంతా ఉరుకులు పరుగుల మీద ఉన్నారనీ చెప్తాడు. అది శాటర్నేలియా సంరంభం. ఎటు చూసినా బానిసలకీ, యజమానులకీ మధ్య భేదాలు తొలగిపోయాయనడానికి గుర్తుగా తినడమూ, తాగడమూ మాత్రమే కనిపిస్తుండటం సెనెకాని కొంత కలవరపరిచిందనే చెప్పాలి. అసలు శాటర్నేలియా ఉద్దేశ్యం ఏమిటి? అది బానిసత్వం ప్రసక్తిలేని కాలాన్ని స్మరించుకోవడం కోసం ఏర్పడ్డ వేడుక. కాని ఒకరోజో, రెండురోజులో కట్టుబాట్లు సడలించినందువల్ల జరిగేదేముంటుంది? తప్పతాగి వళ్ళు మరవడం తప్ప?

ఆ విచ్చలవిడితనం నుంచి మనం ఎన్నో యుగాల దూరం ముందుకు వచ్చేసాం. మన క్రిస్మస్ వేడుకల్లో, ధనుర్మాసపు వ్రతాల్లో ఉన్నది సాహచర్య సంతోషం మాత్రమే. ప్రతి ధనుర్మాసంలోనూ నాకు తిరుప్పావై గుర్తొస్తుంది. ఈ సారి కూడా నేను బాల్కనీలో క్రిస్మస్ స్టార్ వెలిగించాను. రంగురంగుల విద్యుద్దీపాల సిరియల్ సెట్ తో ఇంటిని అలంకరించాను. కాని మనుషులు అణచిపెట్టుకున్న ఉద్రేకాలు మళ్ళా డిసెంబరు 31 రాత్రి ఒక్కసారిగా బయటపడతాయి. పల్లెల్లో సంక్రాంతి రోజుల్లో పేకాటల్లోనూ, కోడిపందాల్లోనూ కనవచ్చేది విచ్చలవిడితనం కాదా!

కాని మనుషుల సంతోషం, అది కూడా మనుషులు ఒక మందిగా మారినప్పటి కోలాహలంలో నువ్వు భాగం పంచుకోవాలా వద్దా? ఈ ప్రశ్న ప్రతి డిసెంబరు 31 నా నాకు ఎదురవుతూనే ఉంటుంది. ఇప్పటికి రెండువేల ఏళ్ళ కిందట రోమ్ లో సెనెకా కూడా ఈ ప్రశ్న వేసుకున్నాడు. సెనెకా శాటర్నేలియాలోని ఆడంబరాన్నీ, విచ్చలవిడితనాన్నీ ఇష్టపడలేదు. అలాగని ప్రజాసమూహం సంతోషంగా గడుపుతుంటే వారి సంతోషం నుంచి దూరంగా జరగాలని కూడా కోరుకోలేదు. అందుకని ఇలా చెప్తున్నాడు తన మిత్రుడితో:

ప్రజాసమూహం తాగుతో, తుళ్ళింతలాడుతో ఉంటే నువ్వు తాక్కుండానూ, మడిగట్టుకు కూచోడానికి చాలా ధైర్యం కావాలి. కాని, మంది తాలూకు సంతోషంలో భాగం పంచుకోడానికి మరింత ఆత్మనిగ్రహం కావాలి. నువ్వు కూడా వాళ్ళ సంతోషంలో భాగం పంచుకోవచ్చు, కాని మరో పద్ధతిలో.’

అడ్డూ అదుపూ లేకుండా వేడుక జరుపుకోవడానికి సమాజం కొన్ని రోజులు కేటాయించుకున్నట్టే తనమీద తాను పూర్తి అదుపునీ, నిగ్రహాన్నీ చూపించుకోడానికీ, అందుకు అవసరమైన క్రమశిక్షణ అలవాటు చేసుకోవడానికీ కూడా కొన్ని రోజులు కేటాయించుకోవాలంటాడు సెనెకా. ఆయన ఇలా రాస్తున్నాడు:

కొన్ని రోజులు పక్కన పెట్టుకో. ఆ కాలమంతటా నీ ఖర్చులు పూర్తిగా తగ్గించుకో. ముతగ్గా ఉండే దుస్తులే వేసుకో. ఇలాంటి పరిస్థితి వస్తుందనేనా నేను భయపడింది ఇన్నాళ్ళూ అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. సంరక్షణ కరువైన రోజుల్లోనే నిన్ను నువ్వు  గట్టిపరుచుకోవలసి ఉంటుంది. రేపు క్లిష్టమైన సమయాలు తటస్తించినప్పుడు ఈ శిక్షణ నీకు ఉపయోగపడుతుంది. నీ విధి తల్లకిందులు కాకముందే అది నీ పట్ల దయగా ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్త పడటం మంచింది. సైనికులు చూడు, శాంతిసమయాల్లో శత్రువులెవరూ కనిపించని రోజుల్లో ఎట్లాంటి కాయకష్టం చేస్తూ ఉంటారో! ఎందుకంటే రేపు తాను యుద్ధం తప్పించుకోలేనప్పుడు, ఆ కష్టం దీనికన్నా కష్టంగా ఉండకూడని అనుకుంటాడు. సంక్షోభం మీదపడ్డప్పుడు మనిషి ముఖం చాటేసి పారిపోకుండా ఉండాలంటే అది మీదపడకముందే అతణ్ణి సంసిద్ధుణ్ణి చెయ్యి. పేదరికాన్ని అనుకరించి బతకడం సాధన చేసినవారు గతంలో ఇలాగే జీవించారు. అందుకే వాళ్ళు ప్రతి నెలా దాదాపుగా దారిద్య్రం అంచులదాకా వెళ్ళగలిగినా కూడా వెనక్కి జారిపోకుండా నిలబడగలిగారు.

మనుషులు పండగకోసం రోజులు కేటాయించుకున్నట్టే ఉపవాసాలకు కూడా రోజులు కేటాయించుకోవడం కొత్తదేమీ కాదు. దాదాపుగా అన్ని మతాల్లోనూ ఉపవాస దినాలున్నాయి. కాని సెనెకా మాట్లాడుతున్నది ఆహారం మీద అదుపు మాత్రమే కాదు, తక్కిన జీవితావసరాల మీద అదుపు కూడా. అతడింకా ఇలా అంటున్నాడు:

నువ్వేదో గొప్ప పని చేస్తున్నావని అనుకోకు. ప్రతిరోజూ వేలాదిమంది బానిసలూ, మరెన్నో వేలమంది బీదవాళ్ళూ జీవిస్తున్నట్టే నువ్వు కూడా జీవించడానికి ప్రయత్నిస్తున్నావని తెలుసుకో. అయితే ఒక్కటే తేడా. నువ్వీ పని ఏదో ఒక నిర్బంధం వల్ల చెయ్యడం లేదు. ఈ ప్రయోగాన్ని ఎప్పటికప్పుడు చేస్తూ ఉండటడానికి నువ్వు సదా సంసిద్ధుడిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నావనుకో. గ్లాడియేటర్లు ద్వంద్వ యుద్ధానికి శిక్షణపొందడంకోసం ముందు బొమ్మల్తో యుద్ధం చేసినట్టు మనం దారిద్య్రాన్ని దగ్గరగా ఎదురుకుంటున్నాము అనుకో. రేపొద్దున్న విధి తోద్రోపులకి మనం బెదిరిపోకుండా మన జాగ్రత్తలో మనం ఉంటున్నట్టు. పేదరికం ఒక బరువు కాదని తెలుసుకున్న రోజున మన సంపదలో మనం మరింత సౌకర్యంగా కుదురుకోగలం.

ఈ జీవితం మనకున్నది సుఖసంతోషాలు పొందడం కోసమే అని భావించిన ఎపిక్యూరస్ కూడా ఇలాంటి పద్ధతులు పాటించేవాడని చెప్తాడు సెనెకా. నీళ్ళూ, ఇంత బార్లీ అన్నమూ, బార్లీ రొట్టె ముక్కలూ ఆకర్షణీయమైన భోజనం కాకపోవచ్చుగానీ ఇటువంటి ఆహారం నుంచి పొందగల ఆనందం మాత్రం అపరిమితం అని చెప్తాడు. ఇంకా ఇలా అంటున్నాడు:

జైల్లో పెట్టే తిండి కూడా చాలా ఉదారంగా ఉంటుంది. ఉరిశిక్ష విధించిన ఖైదీలకు కూడా వాళ్ళని ఉరితీసేవాళ్ళతో సమానంగా ఆహారం పెడతారు. అటువంటిది, అంతకన్నా తక్కువస్థాయి అన్నాన్ని తనంత తాను ఐచ్ఛికంగా కోరుకునే మనిషి ఆత్మ ఎంత ఉదాత్తమయింది అయి ఉండాలి! రేప్పొద్దున్న విధి బల్లెపుపోట్లు బాధించకుండా ఉండాటానికి ఇంతకన్నా మించిన రక్షణ ఏముంటుంది?

Establish business relations with poverty. ఇది నిజమైన సోఫిస్టు వైఖరి. సోఫిస్టులనుంచి తొలిక్రైస్తవులు, వారినుంచి అసిసీకి చెందిన ఫ్రాన్సిస్ లాంటి సాధువుల మీదుగా టాల్ స్టాయి, గాంధీలదాకా ఐచ్ఛిక దారిద్య్రం గొప్ప ఆత్మరక్షణసాధనంగా ఉపయోగపడుతూ వచ్చిందనడంలో సందేహం లేదు. మామూలుగా మనం పండగరోజులు విందువినోదాల రోజులుగానూ, ఉపవాసదినాలు వేరే రోజులుగానూ భావిస్తాం. కాని సెనెకా దృష్టిలో ఉపవాసదినాలకన్నా మించిన పండగరోజులు లేవు.

ఇప్పుడు మనం వరసగా ఒక్కొక్క ఉత్తరం చూద్దాం.

మొదటి ఉత్తరం

సెనెకా మొదటి ఉత్తరంలో సహజంగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి రాస్తాడు. అందులోంచి కొన్ని వాక్యాలు:

కాబట్టి, లుసిలియస్, నువ్వేమి చేస్తున్నావని నాతో చెప్తున్నావో ఆ పనులు చేస్తూనే ఉండు. ప్రతి ఒక్క గంటనీ నీ గుప్పెట్లో బిగించిపట్టుకో. ఇవ్వాళ చెయ్యవలసిన పని మీద దృష్టిపెట్టు, అప్పుడు రేపటిమీద పెద్దగా ఆధారపడవలసిన పని ఉండదు. మనం ఎంతగా వాయిదా వేస్తుంటామో, జీవితం కూడా అంతగా పరుగుపెడుతూ ఉంటుంది. లుసిలియస్, కాలం తప్ప నిజంగా మరేదీ మనది కాదు. ప్రకృతి మనకు ధారాదత్తం చేసిన ఆస్తి ఇదొక్కటే. కాని ఇదెంత అస్థిరమంటే, ఎవరన్నా కూడా దీన్ని మననుంచి సునాయాసంగా లాగేసుకోగలరు. మనుషులు ఎంత మూర్ఖులు! ఏ మాత్రం విలువలేని, పనికిమాలిన వస్తువుల్ని ఎంతో భద్రంగా దాచుకుంటారు. అవి ఒకసారి పోతే మళ్ళా పోగుచేసుకోగలిగేవే. కాని కాలం అట్లా కాదే! అది ఒకసారి నీ చేతుల్లోకి వచ్చాక నువ్వెంత ఋణగ్రస్తుడవైపోతావు! చేసిన బాకీలు చిన్నవీ పెద్దవీ కూడా ఎవరికి బాకీపడకుండా తీర్చాలనుకున్నవాడు కూడా తీర్చలేని బాకీ అంటూ ఉంటే అదొక్కటే- సమయం!

రెండవ ఉత్తరం

పుస్తకాలు చదవడం మీద ఆసక్తి ఉన్నవాళ్ళకి తరచూ ఎదురయ్యే బలహీనత ఏదో ఒక్క పుస్తకం పట్టుకుని దాన్ని పూర్తిచెయ్యకుండా మరో నాలుగు పుస్తకాలు కూడా ఆత్రుతతో తిరగెయ్యడం. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తరువాత నాలాంటివాడికి ఈ బలహీనత మరీ పెద్ద సమస్య. ఏదో పుస్తకం చదువుతూంటాం. అక్కడ ఏదో కొత్త రచయిత, లేదా కొత్త భావన లేదా కొత్త పద్యమో కనబడగానే మనసు ఒక సీతాకోకచిలుకలాగా ఆ కొత్త పుస్తకం వెంట పడుతుంది. అక్కణ్ణుంచి మరో పుస్తకం, మరో రచయిత. ఈ discursiveness ని, ఈ శాఖా చంక్రమణాన్ని  సెనెకా లాంటి వాడు సహజంగానే ఇష్టపడడు. లుసిలియస్ కి రాసిన రెండవ ఉత్తరంలో,  దీనిగురించే, ఆయన ఇలా రాస్తున్నాడు:

నువ్వు కొద్ది మంది గొప్ప చింతకుల రచనలదగ్గరే తచ్చాడుతుండు. వాళ్ళ ఆలోచనలు నీ మనసులో నిలబడాలంటే ముందు వాళ్ళ రచనలు పూర్తిగా చదివి జీర్ణం చేసుకో. అన్నివైపులా పరుగెత్తడమంటే ఏ ఒక్కదిక్కుకీ పయనించినట్టే కాదు. ఉదాహరణకి ఎవరేనా విదేశాలకు వెళ్ళాడనుకో, అక్కడ ఉన్నప్పుడు అతడికి చాలా మంది పరిచయమవుతారు, కాని ఏ ఒక్కరూ స్నేహితులు కాలేరు. ఏ ఒక్క రచయితకీ సన్నిహితుడు కాలేకుండా ఆదరాబాదరాగా  అన్ని పుస్తకాలు చదవాలనుకునేవాళ్ళ పరిస్థితి కూడా ఇలాంటిదే.

చాలా చక్కటి పోలిక. కానీ నాలాంటి వాడు ఏమంటాడంటే, ‘కనీసం ఆ పుస్తకాల్లో ఏముందో ముందు చూస్తాను, తర్వాత తీరిగ్గా చదువుకుంటాను’ అని. దానికి కూడా సెనెకా దగ్గర జవాబు ఉంది. ఆయనిలా అంటున్నాడు:

కాబట్టి, నీదగ్గరున్న పుస్తకాలన్నీ నువ్వు చదవడం ఎలానూ సాధ్యపడదు కాబట్టి, నువ్వు చదవగలిగినన్ని పుస్తకాలు మటుకే సంపాదించిపెట్టుకో. కాని నువ్వేమంటావంటే, ముందు ప్రతి పుస్తకంలోకీ ఒకసారి తొంగిచూస్తాను అని. నువ్వు విందుకు వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రతి శాకపాకం మూత తెరిచి చూడ్డంలాంటిదే ఇదీను. కాబట్టి ప్రామాణికమైన రచయితలెవరో వాళ్లని అంటిపెట్టుకో. కొంతసేపు చదివాక మార్పుకావాలనిపించిందా, అంతకు ముందు చదివిన పుస్తకాలు మళ్ళా తిరగెయ్యి.పేదరికం నుంచీ, మరణం నుంచీ, అన్నిరకాల దురదృష్టాలనుంచీ నిన్ను నువ్వు గట్టిపరుకోడానికి రోజూ కొంత కూడగట్టుకో. అట్లా చాలా ఆలోచనల్ని నువ్వు పోగుచేసుకున్నాక, ఆ రోజుకి ఒక్క ఆలోచన ఎంచుకో. దాన్ని పూర్తిగా నమిలి, మింగి, జీర్ణం చేసుకో. ఇదే నేను పాటించే పద్ధతి. నేను చదివిన పుస్తకాల్లో ఎంతో కొంత మేర నాలోపల ఇంకించుకోగలిగానని నిశ్చయంగా చెప్పగలను.

ఈ మాటలు చదువుతుంటే నాకు బోర్హెస్ సంభాషణ ఒకటి గుర్తొచ్చింది. స్టోయిసిజం గురించి మాట్లాడుతూ ఆయన షోపెన్ హోవర్ మాట ఒకటి గుర్తు చేసుకుంటాడు. షోపెన్ హోవర్ అన్నాడట: మనం పుస్త్కం కొనుక్కునేటప్పుడు దాన్ని చదువుకోగల సమయాన్ని కూడా సంపాదించుకోగలిగితే బాగుంటుందని. నేను కూడా ఇన్నాళ్ళూ పుస్తకాలు చదవడానికి  సమయమొక్కటే పరిమితి అనుకునేవాణ్ణి. కాని సమస్య సమయం చాలకపోవడంతో కాదు, చదివిన పుస్తకం దగ్గర మనం మరికొంత సమయం ఆగకపోవడంతో. మా మాష్టారికి అన్ని పద్యాలు నోటికి ఎలా వచ్చేయా అని ఆశ్చర్యంగా ఉండేది. కాని ఆశ్చర్యం లేదు, ఆయన తనకు నచ్చిన ప్రతి పద్యాన్నీ నమిలి, మింగి, జీర్ణం చేసుకుని తన శరీరంలో భాగంగా మార్చేసుకునేవారు. మనం కూడా చదువుతాం, అందులో ఎదురైన కొత్త ఆలోచనలకు, గొప్ప ఆలోచనలకు పరవశిస్తాం. కాని అక్కడ ఆగం. వెంటనే దాన్ని వడివడిగా దాటి మరో ఆలోచనవైపు, మరో అభివ్యక్తి వైపు తరలిపోతాం. అందుకే మనం పుస్తకాలు చదివిన తర్వాత కూడా అంతకు ముందట్లానే ఏ మార్పూ లేకుండానే కొనసాగుతుంటాం. , ‘నువ్వు పుస్తకం స్వతం చేసుకున్నంతమాత్రాన దాన్లోని విషయాన్ని స్వంతం చేసుకున్నట్టు కాదు’ అని బోర్హెస్ అన్నాడు. సెనెకా రాసిన ఈ ఉత్తరం చదివాక నాకు అనిపించిందేమంటే, నువ్వు పుస్తకం పూర్తి చేసినంతమాత్రాన అందులో విషయాన్ని నువ్వు స్వంతం చేసుకున్నట్టు కాదు’ అని. అందుకే మా మాష్టారు అనే వారు ‘నేను ప్రస్తుతం మాష్టర్స్ ని తప్ప మరెవర్నీ చదవాలనుకోవడం లేదు ‘ అని.

మూడవ ఉత్తరం

లుసిలియస్ ఒక ఉత్తరం రాసి ఒక మనిషికిచ్చి సెనెకాకి పంపించాడు. అందులో ఆ ఉత్తరం తెచ్చినవాడు తన మిత్రుడు అని రాస్తూ, ఆ తర్వాత వాక్యంలో, అతడితో తనకి సంబంధించిన విషయాలేవీ మాట్లాడవద్దని రాసాడు. సెనెకా సరిగ్గా ఈ వైరుధ్యం గురించే తన మూడవ ఉత్తరంలో రాస్తాడు. నువ్వొకణ్ణి స్నేహితుడని పరిచయం చేసిన తర్వాత, అతడితో నీ గురించిన విషయాలు మాట్లాడవద్దు అంటే అర్థమేమిటి? అతడు నీ స్నేహితుడు కాడన్న మాట. అయినా నువ్వు అతణ్ణి నువ్వు స్నేహితుడని పరిచయం చేసావంటే అర్థమేమిటి? స్నేహితుడనే మాట పట్ల నీకేమీ శ్రద్ధ లేదన్నమాట. ఈ వైరుధ్యం మొదటి శతాబ్ది రోమ్ కన్నా 2022 నాటి సోషల్ మీడియాకి బాగా వర్తిస్తుంది. ఇక్కడ మనకి పరిచయమైన ప్రతి ఒక్కర్నీ మనం స్నేహితులనే పిలుస్తాం. కాని ‘ఫలానావాళ్ళు నీ ఫోన్ నంబరు అడుగుతున్నారు, ఇవ్వొచ్చునా’ అని మరీ అడుగుతాం. ఈ ఉత్తరంలోనే సెనెకా మరో తరహా మనుషుల గురించి మాట్లాడతాడు. వాళ్ళు ఎవరేనా తమకి పరిచయం కావడం ఆలస్యం, తమ విషయాలన్నీ ధారాళంగా ఏకరువు పెట్టడం మొదలుపెడతారు. కానీ ఈ రెండు రకాల మనుషులు చేసేదీ పొరపాటేననీ సెనెకానే చెప్పనక్కర్లేదు, మనమే చెప్పగలం. కాని మనం చేస్తున్నదేమిటి? పరిచయానికీ, స్నేహానికీ మధ్య తేడా తెలియకుండా పోతున్న ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కర్నీ అనుమానిస్తున్నాం లేదా ఫ్రెండ్స్ లిస్ట్ లో చేరగానే ప్రతి ఒక్కరి ముందూ మన జీవితచరిత్ర పరిచిపెడుతున్నాం. ఎవరినీ నమ్మకపోవడం ఎంత తప్పో, ప్రతి ఒక్కర్నీ నమ్మడం కూడా అంతే పొరపాటు. మొదటిది అతిమెలకువ, రెండోది అతివిశ్రాంతి. ఈ రెండింటినీ సమన్వయపరచుకోవడం నేర్చుకోమని సెనెకా తనమిత్రుడికి చెప్పకుండా ఎలా ఉంటాడు?

17-12-2022

One Reply to “సెనెకా ఉత్తరాలు-2”

  1. Absolutely 💯truth Sir👍
    మనము పుస్తకాలు📚 వెంట సుగృవుడిలా అగకుండా పరుగెత్తుచున్నము 🙏

Leave a Reply

%d bloggers like this: