సెనెకా ఉత్తరాలు-1

ఈ రోజు నుంచీ ధనుర్మాసం మొదలవుతోంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడానికి ముందు ఈ నెలరోజులూ ధనురాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈ కాలం కొత్త వెలుగులోకి ప్రవేశించే కాలం. ఈ నెలరోజులూ దక్షిణాదిన శైవులు తిరువెంబావై స్తోత్రాలూ, వైష్ణవులు మార్గళి వ్రతం పట్టి తిరుప్పావై గీతాలూ పాడుకుంటారు. క్రైస్తవులు ఈ క్రిస్మస్ నుండి కొత్తసంవత్సరందాకా వేడుక జరుపుకుంటారు. ఈ వేడుకలు ఒకటి రెండు మతాలకో, ఒకటి రెండు దేశాలకో పరిమితమైనవి కావు. ఉత్తరార్థగోళమంతటా అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఈ కాలాన్ని రకరకాల పేర్లతో, పద్ధతుల్తో పండగగా జరుపుకుంటూనే ఉన్నారు.

శాటర్నేలియా

ప్రాచీన గ్రీసులో దీన్ని క్రోనియా అని జరుపుకునేవారు. క్రోనియా క్రోనస్ పండగ. క్రోనస్ మన శనిదేవుడు. పూర్తిగా పృథ్వీ దేవత. ప్రాచీన గ్రీసులో ఆయన వ్యవసాయాధిపతి. పంటల దేవుడు. మన సంక్రాంతిలానే అక్కడ కూడా పంట చేతికొచ్చే తరుణం ఒక పండగలాగా ఉండేది. రోమన్ కాలానికి వచ్చేటప్పటికి క్రోనియా శాటర్నేలియాగా మారింది. శాటర్నేలియా శాటర్న్ పండగ మాత్రమే కాదు. అది అతీతకాలం నాటి సర్వమానవసమానత్వాన్ని సూచించే పండగ కూడా. ప్రాచీన కాలంలో లోకాన్ని శని పరిపాలించిన కాలాన్ని స్వర్ణయుగంగా రోమన్లు భావించేవారు. శని అత్యంత న్యాయప్రదమైన దేవుడనీ, ఆయన పరిపాలనలో ఏ ఒక్క మనిషీ ఎవరికీ బానిసగా బతకలేదనీ, ఏ ఒక్కరికీ ప్రత్యేకంగా వ్యక్తిగత ఆస్తి అంటూ ఉండేదికాదనీ, సంపద మీద అందరికీ యాజమాన్యమూ, భాగస్వామ్యమూ ఉండేవనీ, కాబట్టి ఆ కాలాన్ని తలుచుకుంటూ చేసే పండగలో పూర్తి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు వెల్లివిరిసేవనీ చెప్తారు. మరీ ముఖ్యంగా శాటర్నేలియా రోజుల్లో బానిసలు యజమానులతో స్వతంత్రంగా మాట్లాడవచ్చుననీ, ఎంత తిన్నా ఎంత తాగినా ఎవరూ అడిగేవారు కారనీ చెప్తారు.

మొదట్లో శాటర్నేలియా పండగ ఒక్కరోజు అంటే డిసెంబరు 17 న మాత్రమే జరిగేది. తర్వాత రోజుల్లో అది వారం రోజులపాటు అంటే 17 నుంచి 23 దాకా జరిగేది. ఆ తర్వాత దాన్ని పదిహేను రోజుల పాటు అంటే డిసెంబరు 31 దాకా జరుపుకోవడం మొదలయ్యింది. రోమ్ క్రైస్తవంలోకి మారిన తరువాత శాటర్నేలియా వేడుకలు క్రిస్మస్ వేడుకలుగా పరిణమించాయని చరిత్రకారులు చెప్తున్నారు. ఆ రెండు పండగల్లోనూ చాలా పోలికలు ఉన్నాయి.

క్రోనియా, శాటర్నేలియా శని చుట్టూ అల్లుకోవడం వెనక కూడా సూర్యుడి మకరసంక్రమణమే ఉంది.  సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడంతో దక్షిణాయణం ముగిసి ఉత్తరాయణం మొదలవుతుంది. అందుకని హేమంత విషువత్తు సంభవించే తరుణాన్ని అత్యంత ప్రాచీన కాలం నుంచీ చీకటినుంచి వెలుగులోకి ప్రయాణంగా భావించేవారు. రోమన్లు హేమంత విషువత్తు ప్రతి ఏటా డిసెంబరు 23 న జరుపుకునేవారు. ఆ రోజు భూధ్రువాలు సూర్యుడినుంచి అత్యంత దూరానికి జరిగే కాలం. ఆ రోజు తర్వాతనుంచీ చీకటి తగ్గి వెలుగు పెరుగుతూ వస్తుంది కాబట్టి రోమన్లు డిసెంబరు 25 ని  Sol Invictus (The Unconquered Sun) కి సంబంధించిన పండగగా జరుపుకునేవారు. తర్వాత రోజుల్లో అది క్రిస్మస్ గా మారిందని ఒక ఊహ. మనం మార్గశిర శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం వెనక, ఆ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని అనుకోవడం వెనక ఉన్నది కూడా ఈ ఈ సూర్యారాధననే.

ఈ సారి ఈ రెండు వారాలూ శాటర్నేలియా, ధనుర్మాసం, క్రిస్మస్ అన్నీ కలిపి జరుపుకుందామనిపించింది. అందుకు ఈసారి నేను ఎంచుకున్న రచయిత సెనెకా. మీతో పంచుకోవాలనుకున్న రచన ఆయన ఉత్తరాలు.

సెనెకా

స్టోయిక్కు ఆలోచనని ప్రజలదగ్గరకు చేర్చిన ముగ్గురు ప్రసిద్ధ చింతకుల్లో ఎపిక్టెటస్, అరీలియస్ లతో పాటు సెనెకా కూడా ఉన్నాడు. ఎపిక్టెటస్, అరీలియస్ గ్రీకులో రాస్తే, సెనెకా లాటిన్ లో రాసాడు.  సెనెకాని చరిత్ర రోమన్ తత్త్వవేత్తల్లో అగ్రశ్రేణి చింతకుడిగా గుర్తుపెట్టుకుంది.

అతడు ఇప్పటి స్పెయిన్ లోని కార్డొబా లో క్రీ.పూ. 4 వ సంవత్సరంలో పుట్టాడు. అతడి తండ్రి పేరు కూడా సెనెకా నే. అందుకని అతణ్ణి పెద్ద సెనెకా అనీ, సెనెకా ని చిన్న సెనెకా అని పిలుస్తారు. పెద్ద సెనెకా పేరెన్నికగన్న పండితుడు. సెనెకాని పసితనంలోనే అతడి పిన్ని రోమ్ కు తీసుకువెళ్ళిపోయింది. అక్కడ అతడికి స్టోయిక్, పైథాగరస్ చింతనలో అత్యుత్తమమైన విద్య లభించింది. అతడు ఒక తత్త్వవేత్తగా, వక్తగా సుశిక్షితుడయ్యాడు. ఇరవయ్యేళ్ళ వయసురాగానే సెనెకా జబ్బు పడ్డాడు. దాన్నుంచి కోలుకోవడానికి ఈజిప్టు వెళ్ళాడు. అక్కడే అతడి పిన్ని, చిన్నాన్నల సంరక్షణలో పదేళ్ళ పాటు గడిపాడు. సా.శ 31 లో అతడు రాజకీయంగా ఒక జీవికను వెతుక్కుంటూ మళ్ళా రోమ్ లో అడుగుపెట్టాడు. వక్తగా అప్పటికే సెనెకా రోమన్ల దృష్టిని ఆకర్షించి ఉన్నాడు. అతడి వాగ్ధాటికి గాయపడ్డ రోమన్ చక్రవర్తి కలిగులా అతడికి మరణశిక్ష విధించాడుగాని, రోగిష్టి సెనెకా ఎక్కువ కాలం ఎలానూ జీవించడన్న ఉద్దేశ్యంతో ఆ శిక్ష రద్దు చేసాడు.

కలిగులా ని వధించి క్లాడియస్ రోమన్ సింహాసనం అధిష్టించాక సెనెకా మీద లైంగిక నేరారోపణలు చేసి విచారణ మొదలుపెట్టాడు. కాని సెనేట్ సెనెకా వైపు నిలబడి అతడి శిక్షని దేశబహిష్కారానికి తగ్గించింది. ఆ తర్వాత ఎనిమిదేళ్ళ పాటు సెనెకా కోర్సికా ద్వీపంలో జీవించాడు. అక్కడే రచయితగా మారాడు. ఈలోగా క్లాడియస్ భార్య సెనెకా ని మళ్ళా రోమ్ కు పిలిపించి తమ కుమారుడికి ఉపాధ్యాయుడిగా నియమించింది. ఆ విద్యార్థినే రోమన్ చక్రవర్తి నీరో.

నీరో అధికారంలోకి వచ్చిన మొదట్లో సెనెకా పట్ల భక్తిప్రపత్తులు చూపించాడు. కొన్నాళ్ళ పాటు రోమన్ పరిపాలన సెనెకా కనుసన్నల్లో జరిగిందని చెప్పినా అతిశయోక్తి కాదు. కాని తొందర్లోనే నీరోలో నియంతృత్వలక్షణాలు పొడసూపడం మొదలుపెట్టాయి. వాటిని సరిదిద్దబోయిన సెనెకాని నీరో ద్వేషించడం మొదలుపెట్టాడు. అయినా నీరో చక్రవర్తి చేయి వదల్లేదు. విధేయుడైన రాజభక్తుడిగానే కొనసాగాడు. కొన్నాళ్ళకి సెనెకా ని ఒక కుట్రలో ఇరికించారు. చక్రవర్తి మీద హత్యాప్రయత్నం చేసాడని ఆరోపించారు. అతడికి మరణశిక్ష విధించారు. అయితే అతడి మీద ఉన్న గౌరవం కొద్దీ, ఆ మరణశిక్షను ఆత్మహత్యగా మార్చుకోడానికి అనుమతించారు.

తన స్నానపు తొట్టెలో పడుకుని మణికట్టు దగ్గర రక్తనాళాలు తెగ్గోసుకుని మృత్యుశిక్షను స్వీకరించిన సెనెకా మరణం ఒక స్టోయిక్కు మృత్యువు ను ఎలా స్వీకరిస్తాడో నిరూపించే ఉదాహరణగా నిలిచిపోయింది. తదనంతరకాలంలో ఎందరొ చిత్రకారులకి అది ఇతివృత్తం, ఎందరో రూపకర్తలు ఆ మరణం చుట్టూ రూపకాలు అల్లారు. ఏథెన్సు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ సోక్రటీసు చేసిన విషపానంతో సమానంగా రోమన్ రాజాజ్ఞని శిరసావహిస్తూ సెనెకా చేసుకున్న ఆత్మహత్యని కూడా తత్త్వవేత్తలు గుర్తుపెట్టుకున్నారు. పరీక్షకు గురికాని జీవితం జీవితమే కాదని సోక్రటీసు అన్నాడని మనకు తెలుసు. అటువంటి పరీక్షలు అందరినీ వరించవు. సెనెకా ఆ పరీక్షను ధీరత్వంతో ఎదుర్కోవడమే కాక, తాను జీవితమంతా ఏమి మాట్లాడుతూ వచ్చాడో, దానికి కట్టుబడి ఉన్నట్టుగా తన మరణంతో నిరూపించుకోగలిగాడు కూడా.

సెనెకా నాటకకర్త కూడా. సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో సెనెకా నాటకాల్ని యూరోప్ ఆసక్తిగా చదువుకుంది. తర్వాత రోజుల్లో యూరపియన్ నాటక వికాసం మీద సెనెకా ముద్ర చాలా బలంగా ఉందనీ, అతణ్ణి తాను ప్రధానంగా నాటకకర్తగానే గుర్తించడానికి ఇష్టపడతాననీ ఎడిత్ హామిల్టన్ రాసింది. అసలు గ్రీకు సంస్కృతికీ, రోమన్ సంస్కృతికీ మధ్య మనం విభజనరేఖను గుర్తుపట్టడానికి సెనెకా నాటకాలు చదవడం దగ్గరి దారి అనీ, ఆధునిక పాశ్చాత్య ప్రపంచానికి లభించిన వారసత్వం గ్రీసు కాదు రోమ్ అని చెప్పడానికి సెనెకానే యథార్థమైన సాక్ష్యం అని కూడా రాసింది ఆమె.

ఆధునిక యుగ ప్రారంభంలో సెనెకా వ్యాసాలకూ, ఉత్తరాలకూ కొత్త ఆరాధకులు దొరికారు. సుప్రసిద్ధ ఫ్రెంచి వ్యాసకర్త మాంటేన్ సెనెకాని ఎంతగా అభిమానించాడంటే, మాంటేన్ ని ఫ్రెంచి సెనెకా అని పిలిచేటంతగా. అలానే జోసెఫ్ హాల్ అనే ఇంగ్లిషు సెనెకా కూడా ఉన్నాడు. ఇరవయ్యవ శతాబ్దంలోనూ, ఇటీవలి కాలంలోనూ స్టోయిసిజం ఒక వ్యక్తిత్వవికాస దర్శనంగా రూపుదిద్దుకోవడం మొదలుపెట్టాక, సెనెకా ఆలోచనలకు కొత్త ప్రాసంగితకత లభించడం మొదలుపెట్టింది.

సెనెకా ఉత్తరాలు

అతడి రచనల్లో వ్యాసాలతో పాటు చెప్పుకోదగ్గవి లుసిలియస్ అనే మిత్రుడికి రాసిన ఉత్తరాలు. మొత్తం 124 ఉత్తరాలు. వాటిని ఉత్తరాలు అనేకంటే వ్యాసాలనడమే సమంజసం. ఒక స్టోయిక్కు జీవితంలో ఎదుర్కొన్నే వివిధ సందర్భాల్లో, సన్నివేశాల్లో ఎలా ఆలోచించాలి అనడానికి ఈ ఉత్తరాలు ఉదాహరణగా నిలబడతాయి. ఆ ఉత్తరాల్ని Richard M. Gummere అనే పండితుడు ఇంగ్లిషులోకి అనువదించి మూడు సంపుటాలుగా వెలువరించాడు. ఆ మూడు సంపుటాలూ ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఆ ఉత్తరాలు గత ఇరవై శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆలోచనాపరులకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఉన్నాయి. అవి ఒక స్టోయిక్కు రాసిన ఉత్తరాలే అయినప్పటికీ, వాటిలో ఒక సార్వజనీనత ఉంది. మంచి ఆలోచనలు ప్రపంచానికంతటికీ చెందుతాయనే శుభప్రదమైన నమ్మకం ఉంది. మరే స్టోయిక్కు రచయితా తలచుకోనంతంగా ఎపిక్యూరస్ ని ఆ ఉత్తరాల్లో తలచుకోవడమే అందుకు నిరూపణ. తమ ఆలోచనలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలనీ, తమ కళ్ళముందు ప్రపంచం ఎప్పటికప్పుడు పొయ్యే కొత్త పోకడలకు తాము చలించకుండా ఉండాలనీ, జీవితం మరికొంత కాలం జీవించాలనీ, అది కూడా ధీరహృదయంతో జీవించాలనీ అనుకునేవాళ్ళు ఆ ఉత్తరాలు తప్పకుండా చదవాలి.

సెనెకా తన చివరి దినాల్లో, మరణానికి ముందు రెండేళ్ళ కాలంలో ఇటలీలో పర్యటిస్తూ ఈ ఉత్తరాలు రాసాడు. కాబట్టి ఒక జీవితకాలపు అధ్యయనం, రాజనీతి, పరిణతి ఈ ఉత్తరాల్లో కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కాని అంతకన్నా కూడా మనల్ని ఆకర్షించేది, ఒక నిజమైన విద్యావంతుడు తన తీరికసమయాన్ని ఏ విధంగా గడిపాడనేది, ఏ విధంగా గడుపాలనేది. అతడి రచనల్లో అతడి పూర్వులూ, సమకాలికులూ అయిన ఎందరో తత్త్వవేత్తలు, ఆలోచనాపరులు మనకి తారసపడతారు.

అవి ఉత్తరాలు కావనీ, ఉత్తరాల్లో ఉండవలసిన వ్యక్తిగత ఆత్మీయత వాటిలో కొరవడిందనీ, రినైజాన్సు రోజుల్లో ఎరాస్మస్, ఎన్లైటెన్ మెంట్ యుగంలో బేకన్ వంటి వారు వాటిని విమర్శించారు. కాని సెనెకా వంటి ఆలోచనపరుడు తన వ్యక్తిగత విశేషాల్ని ఏకరువు పెట్టుకోడానికి ఉత్తరాలు రాస్తాడని మనం ఊహించలేం. వాటిని ఉత్తరాలు కాదు, వ్యాసాలు అన్నా కూడా, వాటి ప్రయోజనమే కాదు, సాహిత్యవిలువ కూడా ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే ఆ ఉత్తరాల్ని ఇంగ్లిషులోకి అనువదించిన గుమ్మెర్ చెప్పినట్లుగా, ఆ ఉత్తరాలన్నిటిలోనూ ఒక నిర్మాణ వ్యూహం ఉంది. ప్రతి ఒక్కదానికీ శిల్పసౌష్టవం ఉంది. ప్రతి ఉత్తరం మొదట ఒక సంఘటన, లేదా ఏదో ఒక వార్త, ఒక ప్రయాణం గురించో, విందు గురించో, మిత్రుల కూడిక గురించో ప్రస్తావించడంతో మొదలవుతుంది. అప్పుడు రచయిత గంభీరమైన ఏదో ఒక తాత్త్విక విషయాన్ని లోతుగా పరిశీలించడానికి పూనుకుంటాడు. ఉత్తరం ముగించే ముందు ఎవరో ఒక రచయిత తాలూకు చక్కటి వాక్యమొకటి ప్రస్తావిస్తాడు. ఆ వాక్యం కోసం మనం కూడా ఆ ఉత్తరం చివరిదాక ఉత్కంఠగా ఎదురుచూసేట్టు చేస్తాడు. కాని ఏ ఉత్తరం కూడా నాలుగైదు పేజీలు మించి ఉండదు. నిజానికి వీటిని ఉత్తరాలుగా కాక వ్యాసాలుగా రాసిఉంటే ఇవి ఇప్పుడున్నంత ఆకర్షణీయంగా ఉండేవా అన్నది అనుమానమే.

కాని వీటన్నిటినీ మించి, ఆ ఉత్తరాల్లో మనకి ఒక సజ్జనుడు కనిపిస్తాడు. ఒక మనిషి రాజ్యవ్యవహారాల్లో తలమునకలుగా ఉంటూ కూడా తనలోని సజ్జనుణ్ణి ఏ మనోబలం వల్ల కాపాడుకున్నాడో ఈ ఉత్తరాల్లో కనిపిస్తుంది. అలాగని సెనెకా మీద ఆరోపణలేమీ తక్కువ కాదు. రస్సెల్ లాంటి వాడు సెనెకా వడ్డీవ్యాపారం చేసాడనే అభియోగం మోపకుండా ఉండలేకపోయాడు. ఇంతకీ  సెనెకా మీద ఆరోపణలకి ఏకైక ఆధారం ఒక సమకాలికుడు రాసిన కథనం. కాని సెనెకా మొత్తం సాహిత్యం మరొక వైపు ఉంది. సెనెకా రాతల్లోనే కాక, జీవితంలో కూడా సజ్జనుడు కాకపోయి ఉంటే అతడు రాజాగ్రహానికి గురై ఆత్మహత్య చేసుకోవలసిన అవసరమే వచ్చి ఉండేది కాదని చెప్పవచ్చు.   సెనెకాలోని సజ్జనుడికి నిజమైన నిరూపణ అతడిమీద వచ్చిన ఆరోపణలే అని, ప్రభుత్వోద్యోగం అంటే ఏమిటో తెలిసిన నా బోటివాడికి, సహజంగానే అనిపిస్తుంది.

16-12-2022

2 Replies to “సెనెకా ఉత్తరాలు-1”

  1. సెనేకా మిత్ లకు ఈయనకు ఏమైనా సంబంధం ఉందా గురుజీ

    1. సెనెకా అని ఉత్తర అమెరికాలో ఒక ఆదిమ తెగ ఉంది. సెనెకా మిత్ లంటే వాళ్లు చెప్పుకునే పురాణాలు. ఆ సెనెకాకి, ఈ సెనెకాకి ఏమీ సంబంధం లేదు.

Leave a Reply

%d