ఎవరో ఒకరు ఏదో ఒక కాలంలో

Reading Time: 4 minutes

నాడు శాఫో విరహకంఠనాళ వేణు వాలపించిన యరుణారుణాంధగీతి

యేడ్చు, నిట్టూర్పు, కోపించు నిపుడు సంధ్య యటుల, కాలవిశాలవిహాయసమున !

అని కృష్ణశాస్త్రి ఊర్వశీ గీతాలు రాస్తున్నప్పుడు ఆయన వెనక పూర్వ సంస్కృతాంధ్ర కవులతో పాటు బ్రిటిష్ రొమాంటిసిస్టు కవులు కూడా ఉన్నారని మనకు తెలుసు. కొద్దిగా మరింత లోతుకు పోయి చూస్తే ఆ తొలితరం ఇంగ్లీషు, స్కాటిషు రొమాంటిక్ కవుల వెనక జర్మన్ రొమాంటిక్ కవులు గొథే, షిల్లర్ లు ఉన్నారని కూడా మనకి అర్థమవుతుంది. కాని మనకి మన సాహిత్య చరిత్రకారులు చెప్పనిదేమిటంటే, ఆ తొలితరం జర్మన్ రొమాంటిక్ కవుల వెనక, జర్మన్ పల్లెపాటలు ఎంత బలంగా ఉన్నాయో, ప్రాచీన గ్రీకు లిరిక్ కవులు కూడా అంతే బలంగా ఉన్నారనేది. లేకపోతే ఊర్వశి గురించి గానం చేస్తూ కృష్ణశాస్త్రి శాఫో ని ఎందుకు తలుచుకున్నాడు? ఇరవయ్యవ శతాబ్దంలో రొమాంటిక్ గీతాలు రాసిన ప్రతి భారతీయ కవి వెనకా సుదూర కాలం నుంచీ ఎన్నో సరిహద్దుల్ని, సముద్రాల్నీ దాటి ప్రాచీన గ్రీకు లిరిక్ కవులు కూడా వినిపిస్తున్నారని పోల్చుకోవడంలో గొప్ప సాహిత్యసంతోషముంది.

గ్రీకు కవిత ప్రధానంగా మూడు విధాలుగా ఉండేది. మొదటిది ఎపిక్ కవిత. అంటే హోమర్, హెసియోద్ లు రాసిన కవిత. అది ఆరుగణాల పద్యపాదంతో గంభీరంగా నడిచే కవిత. రెండవది ఎలిజీ. శోకాకుల పద్యం. మూడవది లిరిక్. అంటే మన భాషలో చెప్పాలంటే లలిత గీతం. మూడూ సంగీత ప్రధానాలే. ఎపిక్ ని చితార అనే ఒక పెద్ద తంత్రీవాద్యానికి అనుసంధానించి పాడేవారు. రామాయణం కూడా తంత్రీవాద్యాలకు అనుగుణంగానే వినిపించేవారని బాలకాండలో ఒక ప్రస్తావన ఉంది. ఎలిజీ సన్నాయి, పిల్లంగోవి లాంటి గాలి వాయిద్యాలమీద వినిపించేది. లిరిక్ లైర్ అనే చిన్నతంత్రీవాద్యం మీద వినిపించేది. ఇప్పటి భాషలో చెప్పాలంటే గిటార్ లాంటి వాద్యమన్నమాట.

గ్రీకు కవిత్వం అనగానే బయటి దేశాలకూ, బయటి పాఠకులకూ, అంటే యూరోప్ తో సహా తక్కిన ప్రపంచానికి ముందు గుర్తొచ్చేది హోమర్. ఆయన రాసిన ఇలియడ్, ఒడెస్సీ మహేతిహాసాలూ, కొన్ని స్తోత్రాలూను. ఆ తర్వాత హెసియోద్ అనే కవి. ఆయన రాసిన Works and Days, Theogony. ఆ తర్వాత ఎక్కువమందికి తెలిసినవాడు పిండార్. ఆయన రాసిన ఓడ్స్ జగత్ప్రసిద్ధాలు. ఈ ముగ్గురివీ పూర్తి గ్రంథాలో లేదా గీతాలో పూర్తిగా లభ్యమవుతున్నాయి. కాని పూర్తికవిత్వం కాక, చిన్నచిన్న శకలాలు మాత్రమే లభ్యమవుతున్న శాఫో గ్రీకు కవులందరిలోనూ సర్వోన్నతురాలైన కవయిత్రి. ప్లేటో లాంటి వాడు ఆమెని Tenth Muse గా నుతించాడు. ఈ నలుగురూ తప్ప ప్రాచీన గ్రీకు కవుల గురించి మనలాంటి పాఠకులకు తెలిసింది చాలా స్వల్పం.

అలాగని ఆ కవిత్వం సంకలనాలుగా రాలేదని కాదు, లేదా ఇంగ్లిషులోకి అనువాదం కాలేదనీ కాదు. కాని ఆ అనువాదకులు ప్రధానంగా పండితులు. రెండు వేల ఏళ్ళ కిందటి ఆ కవిత్వాన్ని ఇంగ్లిషులోకి అనువదిస్తున్నప్పుడు వాళ్ళు వీలైనంత మూలవిధేయంగా ఉండటానికే ప్రాధాన్యమిచ్చారు. తాము ఎక్కడ స్వతంత్రించినా, ఆ ప్రాచీన వాక్కు పవిత్రతను తామెక్కడ మసకబరుస్తామో అన్న భయం, జాగ్రత్త, సందేహం వారిని ఎప్పటికప్పుడు మరింత స్వేచ్ఛ తీసుకోకుండా అడ్డుపడుతూ ఉండింది. కాని వారు చేసిన సేవ నిరుపమానం. ప్రాచీన గ్రీకుకి సంబంధించి ఏ శకలం దొరికినా, అది ఎక్కడ దొరికినా, అది పగిలిపోయిన కుండపెంకులమీద కానివ్వండి, శిథిలమైపోతున్న పేపైరీ మీద కానివ్వండి, మరేదో తత్త్వశాస్త్ర గ్రంథంలోనో, చరిత్ర పుస్తకాల్లోనో, ఎవరో రచయిత చేసిన చిన్న పాటి ప్రస్తావనలోంచి కానివ్వండి, వారు ప్రతి ఒక్క శకలాన్నీ ఏరి భద్రంగా ఆధునిక ప్రపంచానికి అందచేసారు. ఆ కవితా శకలాల మీద ఉన్న దుమ్ము దులిపి, వాటి చుట్టూ ఉన్న చరిత్రను, ఇతర పాఠ్యవిశేషాలను, పాఠాంతరాలను ఎంతో శ్రద్ధగా, బాధ్యతగా నవ్య ప్రపంచం చేతుల్లో పెట్టారు.

ఆ గ్రీకు కవులు, వారి గీతాలు ఒక్కొక్కటే బయటపడుతున్నకొద్దీ, పద్ధెనిమిది, పందొమ్మిది శతాబ్దాల యూరపియన్ భావుకులు, మరీ ముఖ్యంగా జర్మన్ భావుకులు పరవశించిపోయారు. ఆ పారవశ్యంలో హోల్డర్లిన్, నీషే లాంటి వాళ్ళు ఉన్మాదులు కూడా అయిపోయారు. బైరన్ లాంటి వాడు మహోద్వేగభరితుడైపోయాడు. ఆ బైరనీయ ఉద్వేగమే మన కృష్ణశాస్త్రి దాకా ప్రవహించింది. కృష్ణశాస్త్రి ఉన్మాది కాకపోవడం ఆశ్చర్యమే కాని, ఆయన స్వరపేటిక మూగపోవడం యాదృచ్ఛికం అనిపించదు.

గ్రీకు లిరిక్ కవులకు తెలుగులో చెప్పుకోదగ్గ అనువాదాలేవీ నా దృష్టికి రాలేదు. శాఫో గురించి ఎవరైనా ప్రస్తావించి ఉండవచ్చునేమోగాని, చెప్పుకోదగ్గ పరిచయ వ్యాసం కూడా ఏదీ నేనిప్పటిదాకా తెలుగులో చదవలేదు. ఆ మాటకొస్తే,  Sherod Santos అనువదించి సంకలనం చేసిన Greek Lyric Poetry (2005) చదివినదాకా నాకు కూడా గ్రీకు లిరిక్ గురించి ఏమీ తెలియదనే చెప్పాలి.

షెరోద్ శాంటోస్ పుస్తకం నా విష్ లిస్ట్ లో ఉండటం చూసి పదేళ్ళ కింద ఒక మిత్రురాలు ఆ పుస్తకం తెప్పించి నాకు కానుక చేసింది. అది కూడా పుట్టినరోజు కానుక. ఆ కవిత్వసంకలనం మన వైతాళికులు లాగా గ్రీకు భావకవితా సంకలనం అని చెప్పవచ్చు. అందులో ఆ సంకలన కర్త గ్రీకు కవిత్వాన్ని నాలుగు చారిత్రిక దశలనుంచి ఏరి తెచ్చాడు. మొదటిది, చరిత్రతొలికాలం, ఇతిహాస కాలం. అంటే క్రీ.పూ. ఎనిమిదో శతాబ్దం నుంచి నాలుగవ శతాబ్దం దాకా. మహోన్నతులైన గ్రీకు లిరిక్ కవిత్రయం ఆర్ఖిలోకస్, త్యూడియస్, ఆల్క్ మన్ లతో పాటు శాఫో, పిండార్ లు ఈ కాలానికి చెందిన కవులు. ప్లేటో,  సోక్రటీసు కూడా ఈ కాలానికి చెందిన వాళ్ళే.  ఆ తర్వాత కాలం క్రీ.పూ 323 నుంచి 31 దాకా హెలెనిస్టిక్ యుగం. ఆ తర్వాత సా. శ. ఆరవశతాబ్దిదాకా రోమన్ యుగం. ఆ తర్వాత మరొక శతాబ్దం పాటు తొలి బైజాంటియన్ యుగం. దేశ భాషల్లో కవిత్వం మొదలయిన తర్వాత కూడా, ఆ మాటకొస్తే, ఆధునిక యుగంలో కూడా సంస్కృతంలో కవిత్వం కొనసాగుతున్నట్టే, ప్రాచీన గ్రీకు కవిత్వం బైజాంటియన్ కాలం దాకా కొనసాగింది. ఆ తర్వాతదంతా మధ్యయుగాల, ఆధునిక కాలానికి చెందిన గ్రీకు కవిత్వం. కాని ఈ సంకలన కర్త తొలి బైజాంటియన్ యుగం దాకా మాత్రమే కవితల్ని ఏరిపెట్టాడు.

పదేళ్ళుగానూ ఈ పుస్తకం తెరుస్తూనే ఉన్నాను, తిరగేస్తూనే ఉన్నాను. దీనికి అనువాదకుడు రాసిన విపులమైన ముందుమాట చదివిన తర్వాత గ్రీకు నేర్చుకోవాలనే కోరిక కలక్కుండా ఉండటం అసాధ్యం. ఎందుకంటే గ్రీకుని ఇంగ్లీషులో చదవడం సంస్కృతాన్ని ఇంగ్లిషులో చదివినట్టే. రెండు భాషల్లోనూ ఛందస్సులు గణబద్ధ, మాత్రాబద్ధ ఛందస్సులు. కాని ఇంగ్లిషు ఛందస్సు ఊనిక మీద ఆధారపడ్డ ఛందస్సు. కాబట్టి గ్రీకు కవిత్వంలోని నాదమాధుర్యం, ఆ సంగీతాత్మకత ఎలా ఉంటుందో మనం ఇంగ్లిషులో పోల్చుకోవడం దాదాపుగా అసాధ్యం.  అయినా ఈ అనువాదకుడు పండితులచర్చలకు మాత్రమే పరిమితమైన ప్రాచీన గ్రీకు కవిత్వాన్ని సాధారణ పాఠకుడికి సన్నిహితంగా తీసుకురావడానికి ప్రయత్నించాడు.

గ్రీకు లిరిక్ కవిత్వం ప్రపంచ సాహిత్యానికి ఇచ్చిన కానుక ఏమిటి? అనువాదకుడు తన ముందుమాటలో ఈ ప్రశ్నని ఎత్తుకుని, చెప్పేదేమంటే, అప్పటిదాకా పౌరాణిక ప్రపంచానికీ వీరోచిత సాహసకృత్యాలకూ మాత్రమే పరిమితమయిన కవిత్వాన్ని లిరిక్ కవులు రోజువారీ జీవితంలోకి తీసుకువచ్చారు అని. గ్రీకు లిరిక్ కి ఆదికవి అని చెప్పదగ్గ ఆర్ఖిలోకస్ కవిత్వాన్ని ఒక వ్యక్తి జీవితంలోని దైనందిన సంఘటనల్నీ, వ్యక్తిగత సంతోషాల్నీ, సల్లాపాల్నీ పంచుకోవడానికి వాడుకోవడం మొదలుపెట్టాడనీ, అనంతరకాలంలో, మరీ ముఖ్యంగా, ఆధునిక కాలంలో పాశ్చాత్యకవిత్వం ఆ నమూనాలోంచే తనని తాను తీర్చిదిద్దుకున్నదనీ చెప్తాడు. దేవతలూ, వీరాధివీరులూ, మహాసముద్రాలూ, నౌకాయుద్ధాలతో కిక్కిరిసిపోయిన హోమరికా నుంచి కవిత్వాన్ని రోజువారీ సంఘటనలవైపూ, చిన్న చిన్న ఆశలవైపూ, నిరాశల వైపూ మళ్ళించగలగడం మామూలు విషయం కాదు. అది కూడా ఎప్పుడని? కవి అంటే దైవసమానుడుగానూ, ఒక భిషక్కుగానూ, ఒక గురువుగానూ భావించే కాలంలో శాఫో తన దేహం గురించీ, ప్రేమ గురించీ రాయడంలోని విప్లవాత్మకత మన ఊహకి అందేది కాదు.

చరిత్రకీ, కవిత్వానికీ మధ్య తేడా ఉందని అరిస్టాటిల్ చెప్తున్నప్పుడు, ఎలా జరిగిందో చెప్పడమే చరిత్రకి చాతనవుతుందనీ, ఎలా జరగ్గలదో చెప్పడం కవిత్వానికి మాత్రమే చాతనయ్యే విశేషమని చెప్పడం వెనక లిరిక్ కవుల ప్రభావం ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ఒక లిరిక్ కవి, మానవ ఊహాశాలీనతని గ్రహగతులనుంచీ, చారిత్రిక శక్తుల ఉధృతినుంచీ పక్కకు తప్పించి, ముందు మనుషుల మధ్య మానవసంబంధాలు ఎట్లానెలకొనాలో ఊహించే దిశగా నడిపిస్తాడు. కవులు కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తారంటే దాని అర్థం వాళ్ళు యుద్ధాలు చేసి కొత్త రాజ్యాలు స్థాపిస్తారని కాదు. మనుషులు తమ తోటిమనుషులతో, పశుపక్ష్యాదులతో, మట్టితో, మనసుతో ఎలా మమేకంకావాలో నేర్పుతారు. వాళ్ళు కొత్త ఇంద్రియాలిస్తారు. దాంతో అప్పటిదాకా అలవాటుగా మారిపోయి బండబారిన ప్రపంచం మళ్ళా విప్పుకుని కొత్తగా కనిపించడం మొదలుపెడుతుంది.

ఈ దృక్కోణం మనకు తెలుసు. ఇస్మాయిల్ గారి వంటి కవులూ, భావుకులూ మనకి ఈ విషయాలు ఎంతో విశదంగా చెప్పారు. కాని నాకై  నేను ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటున్నదేమంటే, ఒక  కృష్ణశాస్త్రి వెనక, ఒక ఇస్మాయిల్ వెనక, సుదూరకాలాలకు చెందిన ప్రాచీన గ్రీకు లిరిక్ కవులు కూడా ఉన్నారని.

ఇంత రాసాకా ఆ కవితలు ఎలా ఉండి ఉంటాయో అని మీరు ఎదురు చూస్తుంటారని తెలుసు. మీ కోసం మూడు కవితలు:

1

ఆర్ఖిలోకస్

ప్రార్థన

సముద్రం మీద దారి చూపించంటూ

ఆ పొడవు జళ్ళ దేవతని

నావికులు దేంతో ప్రార్థిస్తారో తెలుసునా

ఇంత సముద్రపు నురగతో!

2

శాఫో

శకలం, 147

ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో, మనల్ని తలుచుకునేవాళ్ళు

ఎవరో ఒకరు ఏదో ఒక కాలంలో ఉండనే ఉంటారు.

3

ఆఫ్రొడైట్ పునరాగమనం: మూడు శకలాలు

…నువ్వు క్రీట్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు, ఆపిల్ తోట దగ్గర, మన చిన్ని దేవళంలో కలుసుకుందాం. నీ కబరీభరం నుంచి వీచే ఖనిజ సుగంధాలు ఆ అర్చా వేదికను పరిమళాల్తో నింపేస్తాయి.

… నీలి సరోవర జలాల మీంచి తేలియాడుతూ ఒక శీతపవనం మన యాపిల్ తోటమీంచి ప్రసరిస్తుంది. ఆ చెట్ల కొమ్మల్లోంచి గుసగుసలాడే ఆకుల మధ్య నుంచి ఆపిల్ మధువు మత్తుగా కనురెప్పల్ని బరువెక్కిస్తుంది.

… గడ్డిబయళ్లలో యుద్ధాశ్వం పచ్చికమేసేచోట, మైదానమంతా వసంతపుష్పాలు విరజిమ్ముతాయి. నీలిరంగు కుప్పపోసిన సరస్సుని గాలితరగలు గిలిగింతలు పెడతాయి.

4

సైమొనిడిస్

కవిత్వం

తన కలల్ని

సుగంధంతో, మకరందంతో కలపడానికి

తేనెటీగలాగా, ఆమె,

పూలపంచన చేరుతున్నది.

~~

Featured photo: the poetess of Lesbos island Sappho and Alcaeus the guitar player. Courtesy: Wikicommons

15-12-2022

Leave a Reply

%d bloggers like this: