భూమ్మీద మొలకెత్తిన నక్షత్రాలు

చెట్ల మీద మన దగ్గర ఏవైనా కవితా సంకనాలు వచ్చాయా? చెట్ల మీదనే ఎవరైనా కవి మొత్తం కవితలతో ఒక కవితల సంపుటి ఏదైనా వెలువరించాడా? చెట్లకు ఎవరైనా ఉత్తరాలు రాసారా? Conversations with God లాగా Conversations with Trees అంటూ ఎవరైనా చెట్లతో తన సంభాషణలు గ్రంథస్తం చేశారా? అసలు ఎవరైనా రోజూ చెట్లతో సంభాషిస్తూ ఉన్నారా?

నా జీవితంలో నేను కలుసుకున్న మనుషులు కలిసి తిరిగిన స్నేహితులు, చదివిన పుస్తకాలు, చూసిన స్థలాలు నాకు ఎంత గుర్తో, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న చెట్లు కూడా అంతే గుర్తు. కొన్ని చెట్లు అయితే అవి నేను ఎక్కడికి వెళితే అక్కడికి నాతో వస్తూనే ఉన్నాయి. నా చిన్నప్పటి ప్రపంచం, అంటే నేను మా ఊరు దాటి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టక ముందటి ప్రపంచం గురించి, కొన్ని తలపులు రాసుకుందామని మొదలుపెట్టాను. అందులో మా ఊరి చుట్టూ కొండల గురించి, ఏటి గురించి, చెరువుల గురించి, కప్పల బెకబెక గురించి ఎంత రాసుకుంటానో, చెట్ల గురించి, మరీ ముఖ్యంగా కొన్ని చెట్ల గురించి తప్పనిసరిగా తలుచుకుంటాను, రాసుకుంటాను.

మా ఊరి నుంచి వణకరాయి వెళ్లే దారిలో, దారి పక్క మలుపులో, పెద్ద నెమలి చెట్టు ఒకటి ఉండేది. దాన్ని నెమలి చెట్టు అని అంటారనే తెలుసు. దాని శాస్త్రీయ నామం ఏమిటో ఎప్పుడూ పరిశీలించుకోలేదు. పల్చటి కాయలు కాసి నేల మీద రాలి పడ్డప్పుడు ఆ ఎండిన కాయలు చూడటానికి నెమలి పించం మీద కన్నుల్లా కనిపిస్తాయి కాబట్టి దాన్ని నెమలి చెట్టు అనేవారేమో. ఆ నెమలి చెట్టు నా చిన్నప్పుడు మా ఊర్లో చూసిన ఒక గిరిజన మహిళలాగా, గ్రామీణ రైతులాగా లేదా మా కుటుంబ పెద్దల్లో ఒకరిలానో నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ చెట్టు నేను మొదటిసారి కలుసుకున్నప్పుడు ఆ చెట్టు నాకేమి చెప్పిందో కానీ అది నేరుగా నా హృదయంలోకి ఇంకిపోయింది అనుకుంటాను. అది ఏమి చెప్పిందో నాకై నేను ఎప్పుడు విప్పి చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఆ చెట్టు గుర్తొచ్చినప్పుడల్లా ఒక కవిత చదివినట్టుగా నాలో ఏదో ఒక తృప్తి కలుగుతుంది.

దానికి నేను ఏ పేరూ పెట్టలేదు గాని ఇదిగో ఇప్పుడు ఈ Poems about Trees పుస్తకం చదువుతుంటే దాన్ని gladness అంటారు అని తెలిసింది. చెట్లను చూస్తే మనకు కలిగేది gladness. We feel glad. కానీ ఈ gladness మన ప్రపంచంలో నుంచి వెళ్లిపోయిందని అంటున్నాడు ఈ కవిత్వ సంకలనకర్త హ్యారీ థామస్. ఈయన చెప్పేదేమంటే చరిత్రయుగం మొదలైనప్పటి ఇతిహాస కవులకు, ఒక హోమర్ లాంటి వాళ్లకు, మాత్రమే ఆ gladness అంత ఫ్రెష్ గాను అనుభవంలోకి వచ్చిందనీ, ఇప్పుడు చెట్లను తలుచుకుంటే మనం ఆ తొలినాళ్ళ ఆనందానుభూతిని పొందలేక పోతున్నామనీ అంటాడు. అతను చెప్పలేదు కానీ బహుశా ఇప్పుడు చెట్లను చూస్తే మనకు కలిగేది sadness. మరీ ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ కి అటూ ఇటూ నెత్తి నిండా దుమ్ముపోసుకుని నిలబడే చెట్లను చూసినప్పుడు, మనకీ వాటికీ మధ్య దుఃఖంలోనూ దైన్యం లోనూ ఏమీ తేడా లేదనిపిస్తుంది.

గొప్ప కావ్యాలు, గొప్ప దేవాలయాలు, మహానదులు వీటిల్లో కొన్ని తరాల్ని, యుగాల్ని దాటిన మానవానుభూతి పవిత్ర ఐశ్వర్యం లాగా పోగుపడి ఉండడం మనకు అనుభవమే. చెట్లదగ్గరా, అడవుల్లోనూ దొరికేది కూడా అటువంటి మహదైశ్వర్యమే. కాలిఫోర్నియాలో మెథుసెల అనే ఒక చెట్టు ఉందట. అది దాదాపుగా 5000 ఏళ్లుగా జీవిస్తూ ఉన్నదట. అంటే ఆ చెట్టుతో పోలిస్తే సోక్రటీస్, బుద్ధుడు, హోమరు, కాళిదాసు వీళ్లంతా చిన్న పిల్లలు. సుమేరియన్ ఇతిహాసం గిల్గమేష్ ఇంకా ఆవిర్భవించక ముందే ఆ చెట్టు అక్కడ ఉంది. వాల్మీకి శోకం శ్లోకం కాకముందే ఆ చెట్టు ఈ భూమ్మీద నిలబడి ఉంది. ఎన్ని నక్షత్రాల కాంతులు ఆ చెట్టు శాఖోప శాఖల్ని ఇన్ని యుగాలుగా తడుపుతూ వస్తున్నాయో కదా! ఇప్పుడు నాకు ఆ చెట్టును చూడటం కోసం ఎంత తొందరగా కాలిఫోర్నియా వెళదామా అనిపిస్తున్నది! బహుశా ఆ చెట్టు దగ్గర నిల్చున్నప్పుడు చరిత్ర యుగంలో ప్రభవించిన కవులందరి కావ్యాలూ ఒక్కసారి అక్కడ వినబడతాయేమో అనిపిస్తున్నది.

నేను అనుకుంటాను ప్రతికవి తాను చూసిన, చూస్తూ వస్తున్న చెట్ల మీద ఒక ఆల్బమ్ రాసి పెట్టుకోవాలి అని. ప్రతి చెట్టు భూమ్మీద మొలకెత్తిన ఒక నక్షత్రం. నక్షత్రాల నుంచి చెట్లకు కాంతి ప్రసరించడమే కాదు, చెట్ల మీంచి కూడా నక్షత్ర లోకాల్లోకి కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. నువ్వు ఒక చెట్టు కింద నిల్చుని మనసారా ఒక కవిత పలికితే నీ తలపులు అనంత కాంతి సంవత్సరాల పాటు విశ్వాంతరాళం వైపు పయనిస్తూనే ఉంటాయని నమ్మకంగా చెప్పగలను.

ఎవరు మెన్ లైబ్రరీ వారు సంకల్పం చేసిన Poems about Trees (2019) నిజంగానే అత్యంత స్ఫూర్తిదాయకమైన సంకలనం. ఇందులో ఎక్కువ కవితలు ఆంగ్లో అమెరికన్ ప్రపంచానికి చెందిన కవులవే అయినప్పటికీ ఆ కవులు, ఆ కవితలు మనల్ని మన ఉద్యానవనాల వైపు, తపోవనాల వైపు, మన మహా రణ్యాల వైపు నడిపిస్తాయి. నాకు ఆశ్చర్యం కలిగించిందేమంటే ఈ సంకలనకర్త చెట్ల ఎదుట ఐరోపా మానవుడు పొందిన gladness కి మొదటి గుర్తుగా ఒడె న్యూస్ ని పట్టుకున్నాడు. ఒడెస్సీ ఆరవ కాండలో ఒడెస్యూస్, నౌసికాను చూసిన తొలి క్షణంలో, ఆమె సౌందర్యాన్ని ప్రశంసిస్తూ, ఆమె అందం తనకు తాను ఒకప్పుడు చూసిన ఖర్జూర వృక్షపు చిగుళ్ళని గుర్తుకు తెస్తున్నదని చెప్తాడు. Gladness అంటే అది. అపోలో దేవత అర్చావేదిక దగ్గర ఒక ఖర్జూర వృక్షం అప్పుడే లేలేత చివుర్లు తొడుగుతున్న దృశ్యం. ఆ నవపల్లవాన్ని చూసినప్పుడు తనకు కలిగిన సంతోషం లాంటి సంతోషం మళ్లా ఆ మహా సౌందర్యవతిని చూసినప్పుడు కలిగిందని ఒడెస్యూస్ చెప్తాడు. ఒక మనిషి ఒక చెట్టు తనలో రేకెత్తించగల gladness ను నమోదు చేసుకున్న తొలి క్షణం అది అని ఈ సంకలనకర్త అంటున్నాడు. ఒడెన్యూస్ తిరిగి ఇథాకాకు వచ్చినప్పుడు తన తండ్రి, తన భార్య తనని గుర్తుపట్టలేక పోతున్నప్పుడు, ఆనవాళ్లుగా తాను నాటిన తోట గురించి, తాను పెంచిన చెట్టు గురించి చెప్తాడని, చెట్లు ఒక కథలో అంతగా అంతర్భాగం అవడం కూడా గొప్ప విశేషమని అంటున్నాడు. అసలు ఒడెస్సీ మహాకావ్యం లోని ఈ అంశాన్ని ఇప్పటిదాకా ఏ వ్యాఖ్యాతా ఎందుకు గుర్తించలేదో తనకు అర్థం కాలేదు అంటాడు.

ఈ సంకలనకర్త సంస్కృతం చదివి ఉంటే వాల్మీకి రాముణ్ణి ‘గిరివన ప్రియుడు’ అన్నందుకు బహుశా నాట్యం చేసి ఉండేవాడేమో అనిపిస్తుంది. రాముడికి చెట్లంటే ఇష్టమని వాల్మీకి నేరుగా చెప్తాడు గాని, పువ్వులు అంటే ఇష్టమని మాత్రం నేరుగా చెప్పకుండా భరతుడితో చెప్పిస్తాడు. ఇంతకీ ఆ తొలి ఖర్జూర వృక్షపు చివుళ్లని చూసినప్పుడు ఆ gladness కలిగింది ఒడెస్యూస్ కా? హోమర్ కా? గిరివన ప్రియుడు వాల్మీకినా? రాముడా?

ఇతిహాసకర్తలకి ఒక విషయమైతే తెలుసు: ఒక మానవుడు సముద్రానికి వంతెన కట్టినందుకో లేదా సముద్రాన్ని ఈది తిరిగి ఇంటికి చేరుకున్నందుకో ఆరాధ్య మానవుడు కాలేదు. చిగురించిన చెట్లను చూసినప్పుడు తన హృదయం పులకిస్తుందని గుర్తుపట్టగలిగినవాడు కాబట్టే అట్లాంటి మానవుడు ఈ భూమి మీద విజయం సాధించాలనీ, తన రాజ్యం స్థాపించాలనీ ఇతిహాసకారులు కోరుకున్నారు.

బాగా పళ్ళు పండిన ఒక నల్ల జీడి చెట్టును చూసి రాముడు లక్ష్మణుడితో నేను ఈ చెట్టు కింద నా జీవితమంతా సంతోషంగా జీవించగలనని అనిపిస్తోందని చెప్పాడే, అది కూడా ఎప్పుడని రాజ్యం వదులుకుని వనవాసానికి బయలుదేరిన తొలి రోజుల్లోనే, అప్పుడే మనకు రాముడు నిజంగా రాముడిగా పరిచయమవుతాడు.

14-12-2022

4 Replies to “భూమ్మీద మొలకెత్తిన నక్షత్రాలు”

 1. మీకు నేనేరులు అంతే వేరే పదాలు లేవు నా దగ్గర గురూజీ

 2. చాలా బాగుంది sir
  చెట్టును చూస్తూ అలానే రోజంతా ఉండాలని నాకు అనిపించే ఆ భావాన్ని gladness అంటరాని తెలుసుకున్నాను.
  నాకు నేనుగా మొన్న ఒక చెట్టు గురించి వ్రాసుకున్న కవితని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను

  నేనొక ముళ్ళ చెట్టును
  నాగరికతకు దూరంగా ఎక్కడో పల్లెటూళ్ళో
  ఏవో పంట చేల మధ్య
  ఒంటరిగా ఒక్కదాన్నే
  తుమ్మ చెట్టును.
  ఎవరికీ తెలియకుండా…! ఎందుకో తెలియకుండా…?
  నల్లని బెరడుతో, చిక్కని ముళ్ళతో
  చిన్ని ఆకులతో…ఒక పిచ్చి చెట్టును.
  పంటచేలని కాపలా కాస్తూ
  తాకితే ఒళ్ళు చీరి పోతుందేమో అని
  గాలి కూడా భయపడే ముళ్ళతో
  గంభీరంగా నేను.
  తలపాగా చుట్టుకునే వంకతో
  నాపై కొడవలి వేటు,
  అమ్మా……!
  కన్నీటిని చిందించే గాటు,
  నా కన్నీరంతా గడ్డకట్టి జిగురులా
  వాళ్ళ చిరిగిన పుస్తకాలకు అతుకులా,
  ఎక్కడి నుండి వచ్చాయో
  గిజిగాళ్లు నాపై నమ్మకంతో
  చిగురు కొమ్మల చివరన
  అజంతా గుహలు లాంటి గూళ్ళు
  కట్టుకున్నాయి.
  వందల గూళ్ళతో వయో భారంతో వంగిన
  నిండు ముత్తైదువ లా నేను,
  ఇంతలో వసంతం వెల్లువలా వచ్చింది.
  చిన్ని చిన్ని పసుపు పూల మొగ్గలు
  సిగ్గు తొడిగి ఉన్నాయి
  ఈ తుమ్మి పూల మకరందాన్ని
  తాగే తుమ్మెదలు ఎక్కడ ఉన్నాయో ఏమో
  ఎప్పుడు వస్తాయో ఏమో
  ఇవి పరవశించి
  పరిమళించే వేళకు
  నా ఒళ్ళంతా కప్పేస్తు,
  నా పరువానికి పరువిస్తూ వచ్చి పరుచుకున్నాయి
  వెచ్చని మధువంతా జుర్రుకున్నాయి,
  ఎక్కడికో దూరంగా తేనెపట్టు గమ్యంగా
  చేరుకున్నాయి
  ఆ తేనె ఒడుసుకొనేదెవరో
  పట్టి పంచేదెవరో.
  పసి బాలల నాలుకపై రాసేదెవరో
  ఆ మధువు మత్తును,
  గమ్మత్తును
  ఆస్వాదించేదెవరో,
  అనుభవించేదెవరో
  ఆనందించేదెవరో…….
  నేను మాత్రం ఒంటరిగా, దూరంగా…. ఏకాంతంలో
  ఒక్కదాన్నే….
  ఆశావహంగా
  సానుకూలంగా,
  నాలో నేనే రమిస్తూ…నిశ్చలంగా
  నిర్మలంగా….నిత్య యవ్వనంగా
  తరువునై….. తరళనై….. ప్రకృతినై
  ప్రశాంతంగా…… పరాశ్రీ
  031022.

Leave a Reply

%d bloggers like this: