నూరువిధాలుగా నేలని ముద్దాడచ్చు

ఒకప్పుడు మన జీవితాలు చిన్న చిన్న ఊళ్ళల్లో పరిమితమైన సమాజాల్లో గడిచేవి. అప్పుడు మనుషుల మధ్య ప్రతిభలోకాని, వనరుల్లోగాని, సామాజిక స్థాయిలోగాని కనిపించే అంతరాలకి మనం అలవాటు పడిపోయి ఉండేవాళ్ళం. ఎక్కడో వాటిని మౌనంగా అంగీకరించడానికి కూడా అలవాటు పడిపోయి ఉండేవాళ్ళం. కాని ఇప్పుడు మన ప్రపంచం అనూహ్యంగా విస్తరించింది. అవకాశాల్ని బాగా అందిపుచుకున్నవాళ్ళూ, అందిపుచ్చుకోలేక చాలా వెనకబడిపోయినవాళ్ళూ మనకి అనునిత్యం తారసపడుతూనే ఉంటారు. అన్యాయాలకు గురయ్యేవాళ్ళూ, వాళ్ళకోసం పోరాడేవాళ్ళూ, అవేవీ పట్టించుకోనివాళ్ళూ కూడా మన భుజాల్ని రాసుకునేటంత దగ్గరగా, బిగ్గరగా, తొందగరగా మన చుట్టూ మసలుతూనే ఉంటారు. ఈ కొత్త ప్రపంచం విశాల ప్రపంచమే కాదు, దాని వైశాల్యం మన మనసులమీద కలిగించే ఒత్తిడి వల్ల అత్యంత సంకుచితం కూడా.

ప్రతి రోజూ మనం దైత్యదేశంలో అడుగుపెట్టిన గలివరులాగా ఒక క్షణం అత్యంత గరిమతోనూ, మరుక్షణం అత్యంత లఘిమతోనూ సమాధానపడవలసి వస్తున్నది. ఒక క్షణం మనకన్నా ఎంతో ఎత్తుగా కనిపించే దీర్ఘకాయులు, మరు క్షణం మనకన్నా ఎంతో చిన్నగా కనిపించే అల్పకాయులు. వీరి మధ్య తిరుగాడుతూ, ఒకక్షణం నేను చాలా అదృష్టవంతుణ్ణి అనుకోవడం, మరుక్షణం నేను చాలా దురదృష్టవంతుణ్ణి, నన్ను జీవితం కరుణించలేదు అనుకోవడం. ఇది మన మీద అత్యంత స్వల్పవ్యవధిలోనే కలిగించే అత్యంత తీవ్రమైన ఒత్తిడి మనల్ని సదా పరుగులుపెట్టిస్తూనే ఉంటుంది. మనమేదో పొందవలసింది పొందలేదనీ, ఏదో మిస్సయ్యామనీ, ఆ మోడల్ కారు కొని ఉంటే బాగుంటేది, అప్పుడే అక్కడ ఆ ప్లాటు రిజిస్టరు చేసుకుని ఉంటే ఎంతో బాగుండేది, ఈ పుస్తకం చదివి ఉంటే, ఈ సినిమా చూసి ఉంటే, ఈ స్థలానికి వెళ్ళి ఉంటే, ఇతణ్ణి నా మిత్రుడిగా చేసుకుని ఉంటే, ఆమెని ప్రేమించి ఉంటే.. ఈ తలపులకి అంతు ఉండదు.

మనం అనుక్షణం కుంభాకార,పుటాకార కటకాల అద్దాల మందిరంలో తిరుగాడుతున్నట్టే ఉంటుంది. ఒక క్షణం ఉబ్బిపోతూ ఉంటాం, మరుక్షణం మనల్ని మనం పలచన చేసుకుంటూ ఉంటాం. కాని కావలసింది, మన యథార్థ స్వరూపాన్ని యథార్థ పరిమాణంలో చూపించగల అద్దం. అటువంటి స్వస్వరూప దర్శనం ఎలా సాధ్యపడుతుంది?

అదేమీ బ్రహ్మవిద్య కాదు. దానికి తీవ్ర ఆధ్యాత్మిక సాధన లేదా నిష్ఠురమైన క్రమశిక్షణ కూడా అవసరం లేదు. అది చాలా సరళం, సులభం, సత్వరం. మనం చెయ్యవలసిందల్లా, ఇప్పుడు, ఇక్కడ మనం ఇలా ఉన్నందుకు అన్నిటికన్నా ముందు దేవుడికో, ప్రకృతికో, తల్లిదండ్రులకో, గురువులకో లేదా నీ చుట్టూ ఉన్న సమాజానికో ధన్యవాదాలు సమర్పించుకోవడం.

కృతజ్ఞతా సమర్పణని మించిన ఔషధం లేదు. అది మన అన్ని వికారాల్నీ, వికృత రూపాల్నీ పరిహరించగల సర్వరోగనివారిణి. మనం చెయ్యవలసిందల్లా, పొద్దున్నే లేవగానే, ఇంకా మొబైల్ ఫోన్ చేతుల్లోకి తీసుకోకముందే, ఇంకా వాట్సప్ గ్రూపుల్లోకి చూపు సారించకముందే, అసలు అన్నిటికన్నా ముందు పొద్దున్నే, నువ్వింకా జీవించి ఉన్నందుకు, ప్రశాంతంగా నిద్రలేవగలిగినందుకు, నీ కోసం మరొక రోజు ఉదయిస్తున్నందుకు మనసారా ధన్యవాదాలు చెప్పుకోవడం. నీకు నువ్వే శుభాకాంక్షలు ప్రకటించుకోవడం. తిరిగి మళ్ళా రాత్రి నీ పక్క మీదకు చేరినప్పుడు, ఇక అన్ని వార్తాప్రసార సాధనాల్నీ మూసిపెట్టి, నీ అంతరంగాన్ని తెరిచిపెట్టుకుని, ఒక రోజుకి నువ్వు ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ప్రయోజనకరంగా గడపగలిగినందుకు, ఆ రోజు కలవగలిగినవాళ్ళని కలుసుకోగలిగినందుకు, చెయ్యగలిగిన పనులు చేయగలిగినందుకు, తలుచుకోగలిగినవాళ్ళని తలుచుకోగలిగినందుకు, హృదయపూర్వకంగా నమోవాకాలు అర్పించుకోవడం.

నేను ప్రతిరోజూ ఈ రెండు పనులూ చేస్తాను. లేవగానే మంచం దిగగానే ముందు నేలమీద మోకరిల్లుతాను. రాత్రి పడుకోబోయేముందు మరొకసారి మోకరిల్లుతాను. అలా రెండు సార్లు మోకరిల్లగలిగిన ప్రతి రోజూ నాకు నా జీవితం సంపూర్ణంగా జీవించాననే అనుభూతితోనే నిద్రకి ఉపక్రమిస్తాను. పెద్దవాళ్ళు చెప్పినమాటనే నేను కూడా చెప్తున్నాను. అన్ని భాషల్లోని అన్ని డిక్షనరీల్లోనూ ఒకే ఒక్క పదం అత్యంత అమూల్య పదం. Gratitude. ఆ ఒక్క పదాన్ని పట్టుకుని ఈ జీవితసాగరాన్ని ఎంత దూరమేనా ఈదగలమనే నమ్మిక నాకు నానాటికీ మరింత బలపడుతున్నది.

ఇదిగో, నా ముందు ఎవ్రిమేన్ లైబ్రరీ వారి Poems of Gratitude (2017) ఉంది. ఎప్పుడు నిరాశ ఆవరిస్తుందనిపించినా ఈ పుస్తకం తెరుస్తాను. మళ్ళా మళ్ళా ఈ కవితలు మీతో ఎలానూ పంచుకుంటాను కాని, ఇప్పటికి, ఈ మూడు కవితలు, ఈ సుప్రభాతాన.


1

జలాలుద్దీన్ రూమీ

ఈ రోజు కూడా ప్రతిరోజు లానే

ఈ రోజు కూడా ప్రతిరోజులానే మనం శూన్యంగా, భయభ్రాంతుల్లో మేల్కొన్నాం
తొందరపడి ఆ గది తలుపు తెరవకు, పుస్తకపఠనం మొదలుపెట్టకు.
ముందొక సంగీత వాద్యం చేతుల్లోకి తీసుకో.
మనం ఆరాధిస్తున్న సౌందర్యం మనమే కావాలి
తెలుసుకో, మోకాళ్ళ మీద వంగి నూరువిధాలుగా నేలని ముద్దాడచ్చు.


2

ఛార్లెస్ రెజ్ఞికోఫ్

కృతజ్ఞతా స్తుతి

విజయాలు సాధిస్తున్నామని
నేను పాడబోవడం లేదు
నేను పాటలు పాడితే అందుకు కారణం
అందరిమీదా కురుస్తున్న సూర్యకాంతి
మందపవనం,
ఉదారమైన వసంతం తప్ప మరేమీ కాదు.

నేను పాటలు పాడితే అది విజయాల కోసం కాదు,
ఒక రోజంతా చెయ్యగలిగినంత పని చేసినందుకు.
వేదిక మీద కాదు,
నలుగురితో కలిసి బల్ల దగ్గర కూర్చున్నందుకు.

3

చెస్లా మీవోష్

కానుక

సంతోషకరంగా రోజు మొదలయ్యింది
పొగమంచు తొందరగా విచ్చుకుంది, తోటపని చేసాను
తేనెలూరుతున్న పూలమీద పికిలిపిట్టలు వాలుతున్నాయి
ఈ భూమ్మీద నాకేదీ సొంతం చేసుకోవాలనిలేదు
నాకు అసూయపుట్టిస్తున్నవాళ్ళంటూ ఎవరూ లేరు
నేనేదైనా కష్టాలకు లోనై ఉంటే, అవన్నీ మర్చిపోయాను.
గతంలోకూడా నేనిలానే ఉండేవాణ్ణని అనిపిస్తే
అందుకు నాకేమీ చింతలేదు.
నా ఒంట్లో ఎలాంటి నలతా లేదు
నన్ను నేను సర్దుకుని తలెత్తి చూస్తే
నీలి సముద్రమూ, తెరచాపలూనూ.

13-12-2022

Leave a Reply

%d bloggers like this: