ప్రళయాంతవేళ

Reading Time: 2 minutes

వనవాసంలో భాగంగా పాండవులు కామ్యకవనానికి వెళ్ళినప్పుడు వారిని చూడటానికి శ్రీకృష్ణుడితో పాటు మార్కండేయుడు కూడా వచ్చాడు. కృష్ణుడు మార్కండేయుడితో పాండవులకు పూర్వకాలపు రాజుల గురించీ, స్త్రీల గురించీ, ఋషుల గురించీ చెప్పమని అడిగాడు. అప్పుడు మార్కండేయుణ్ణి యుధిష్ఠిరుడు అనేక ప్రశ్నలు అడిగాడు. వాటన్నిటితో పాటు కాలం గురించి కూడా అడిగాడు.

యుధిష్ఠిరుడు

చెప్పండి మహాత్మా, ఆ అనుభవం గురించి
యుగాంతవేళ, కదిలేవీ, కదలనివీ కూడా
కరిగిపోయేవేళ, దైత్యులకీ, దేవతలకీ
మధ్య హద్దులు చెరిగిపోయేవేళ, మనం
నిలబడ్డ నేలని మోసే దిజ్ఞాగాలు కూడా
పక్కకు తప్పుకునే వేళ, కాళ్ళకింద నేల
జారిపోయిన వేళ, మీరేమి చూసారు? దేన్ని
అసరా చేసుకుని నిలబడ్డారు? ఏ ఆశతో
మళ్ళా సృష్టిని స్వాగతించారు?

మార్కండేయుడు

నిజమే, నీవన్నది, నీవడిగింది, నేనెన్నో
యుగాంతాల్ని చూసాను, కల్పాంతాల్ని చూసాను
యుగాంతమెప్పుడో సంభవించేది కాదు. మనిషి
మనిషిని మోసగించిన ప్రతి క్షణం నాకొక
యుగం ముగిసిపోయినట్టే ఉంటుంది. ఉజ్జ్వల
జీవితాశయాలతో వికసించవలసిన ఏ యువకుడైనా
వృద్ధుడిలాగా మాట్లాడినప్పుడు కాలం ఆగిపోయినట్టే.
పరిమళద్రవ్యాలు పరిమళహీనాలుగా మారే ప్రతి ఒక్క
క్షణం నాకు సృష్టి ముడుచుకుపోయినట్టే ఉంటుంది.
నువ్వొకణ్ణి ఎంతగానో నమ్ముతావు, వాడొక గోవులాంటి
వాడని తలుస్తావు. చూస్తూండగానే వాడు పులిలాగా
మారిపోతాడు. నీ కళ్ళముందే తప్పుడు తూకం
మొదలుపెడతాడు. చెయ్యవలసిన పని చెయ్యడం
మానేస్తాడు. ప్రేమారా పలకవలసిన నోటితో
శాపాలు కుమ్మరిస్తాడు. నీ ఎదట నవ్వుతాడు,
నీ వెనక వెక్కిరిస్తాడు. నిన్ను పైకెగరేసి
పట్టుకుంటానంటాడు. తీరా నువ్వు నేలమీద
పడే సమయానికి చేతులు తప్పిస్తాడు.

మనిషి తన ముఖం చూపడం మానేసి అసురముఖం
చూపినప్పుడల్లా వేడిగాడ్పు వీచినట్టనిపిస్తుంది
కళ్ళముందే చెరువులు ఎండిపోయినట్టుంటుంది.
ఆ క్షణం, నీ తోటివాడు, పైవాడు, పక్కవాడు
ఎవడన్నా కానీ, సురుడో, అసురుడో
పోల్చుకోలేకపోయినప్పుడల్లా నన్నొక
సముద్రకెరటం తాడించిపడేస్తుంది.

చూసాను అట్లాంటి క్షణాలు, లోకమంతా
ఏకార్ణవంగా మారి, దైత్యులకీ, మిత్రులకీ మధ్య
తేడాలు తుడిచిపెట్టుకుపోయిన క్షణాలు, సందర్భాలు-

నాకు తారసపడ్డ ప్రతి ఒక్క మనిషితోనూ
నేను తక్షణమే ప్రేమలో పడతాను, అపురూపమైన
ఒక లోకం, నేనెన్నడో పోగొట్టుకున్న లోకమొకటి
నా చేతులకు అందినట్టే అనిపిస్తుంది. ఆ ఏదోను
ఉద్యానవనం, ఆ ఉత్తరకురుభూమి, ఆ పాలపళ్ళవాగు-

ఇంతలోనే ఏదో ముంచుకొస్తుంది, వాడు వాడు కాకుండా
పోతాడు. ఆమె ఆమె కాకుండా తప్పుకుంటుంది, సరిగ్గా
అట్లాంటి వేళల్లోనే మళ్ళా ఒక నిశీథి కమ్ముకుంటుంది
అయినా వాళ్ళని వదులుకోలేను,
But to what purpose
Disturbing the dust on a bowl of rose-leaves
I do not know*

ఒకసారి కాదు ఎన్నో సార్లు నా ఎదట లోకం
మరణించడం నేను చూస్తూనే ఉన్నాను, రంగులన్నీ
వెలిసిపోయి, కాంతులన్నీ మాసిపోయి, మనుషుల
వదనాలకీ, కథనాలకీ మధ్య పొంతన
చెరిగిపోయిన వేళ
నన్ను చుట్టు ముట్టిన సముద్రాన్ని
నేనెన్నిసార్లు ఈదానని!

అట్లాంటి ప్రళయాగమవేళ
దేవతలుండరు, దానవులు కూడా
చెట్లు లేవు, పశువులు లేవు, యక్షుల్లేరు
పువ్వుల్లేవు. నువ్వు నమ్మవు, నేను
తలదాచుకోడానికి ఇంత అంతరిక్షం కూడా లేదు.
ఒక భుజం లేదు, ఒక హృదయం లేదు
వణుకుతున్న నీ చేతుల్ని పట్టుకోడానికి
స్నేహస్నిగ్ధమైన మరొక మానవహస్తం లేదు.

మనుషులు మరణానికి భయపడతారు
నేను మరణాన్ని చూసి కాదు, రిక్తహృదయాన్ని
చూసి భయపడతాను.
నిన్ను చూస్తున్న ఆ కళ్ళల్లో
చిన్నప్పుడు వీథరుగుమీద అమ్మ వెలిగించిన
సాయంకాలపు దీపం కనిపించకపోతే
ఆ నేత్రాలెందుకు? ఆ నేస్తాలెందుకు?
తోటిమనిషి నుంచి నాకు ప్రమాదముందనే
భయం లేదు నాకు, నేనూ, అతడూ కూడా
అంతరించిపోతామనే ఆందోళన అసలే లేదు.
నా వ్యథ ఒక్కటే, నాలో మనిషిని
చూడనప్పుడల్లా ఈ లోకం తన మానవత్వాన్ని
పోగొట్టుకుంటున్నదనే.

నేను ఉండీ నువ్వు మనిషిగా మనలేకపోతే
నా ఉనికికి అర్థం లేదు, నువ్వుండీ ఈ లోకం
లోకం కాకపోతే నా మనుగడకి ప్రయోజనం లేదు.
ప్రళయమంటే, సముద్రం
ముంచెత్తడం కాదు, నీ కోసం చాచిన
ఏ కరచాలనమైనా చేతికి చల్లగా తగలడమే.
మీరు పరస్పరం ఆలింగనం చేసుకున్నప్పుడు
ఒక పిచికలాగా గుండె
కువకువలాడకపోతే కల్పాంతమే.

నేనట్లా ఎంతకాలం గడిపానో తెలీదు, ప్రళయమంటే
సముద్రాలన్నీ ఒక్కటే కావలసినపనిలేదు
ఒక్కొక్కప్పుడు ఒక కన్నీటిచుక్క కూడా కడలిసమానం.
రూపురేఖలు చెరిగిపోయిన జగత్తులో
ఆ ఉప్పునీళ్ళమధ్య ఎన్నాళ్ళు ఈదులాడానో తెలీదు,
ఒక్క ఆశ్రయమేనా నన్ను పైకి తేలుస్తుందని
ఆశగా ఎదురుచూసాను.
మళ్ళీ ఎప్పుడొస్తాయి ఆ రోజులు, ఆ కాగితం పూలు
ఆ గాలిపటాలు, సంతలో కొన్న పంచదారచిలుక
వర్షాకాలపు రాత్రుల్లో మంగలమ్మీద అమ్మ కాల్చిపెట్టిన
ఆ మొక్కజొన్న?

“జ్ఞాపకముందా నీకు?..
మన చిన్నతనంలో వసారాపక్క కాలువలో
వాననీళ్ళు వచ్చినప్పుడు కాగితాల పడవలు తయారు చేసి
వదిలిపెట్టే వాళ్ళం మనం:
అప్పుడు చిన్నతనం
లేపచ్చని నారుమడిలో చల్లగాలి…
అప్పుడు వెలిగించేవారు దీపాలు.”**

సరిగా అట్లాంటివేళ చూసాను, చూడటం కాదు
దర్శించాను, కళ్ళతో కాదు, నా సమస్త అస్తిత్వంతో
అనుభవంలోకి తెచ్చుకున్నాను, సరిగ్గా అరచేతిలో
పట్టేటంత విమలకాంతి, అన్ని చప్పుళ్ళూ అణిగిపోయినప్పుడు మాత్రమే వినిపించే సుశబ్దం,
తప్పిపోయిన నా కోసం ఎక్కడో మరో వీథిలో నోరారా పిలుస్తున్న మా అమ్మ పిలుపు,
ఆడుకుందాం రమ్మని పిలిచే ఒక బాలుడు,
తనతో తాను ‘ఆడుకుంటున్న బాలిక’-

ఆ ఒక్కసారే కాదు,
నరోత్తమా, సరిగ్గా ఇదే నేను చెప్పాలనుకున్నదిదే:
ప్రళయం ముంచెత్తిన ప్రతి యుగాంతవేళా,
నాతో పాటు, వటపత్రప్రమాణంకలిగిన కించిదూర్జిత
స్ఫూర్తికూడా ఒకటి జీవించి ఉండటం కనుగొన్నాను
ఆ స్ఫూర్తి దానికదే ఒక లోకం
ఒకసారి నీకది తారసడ్డాక నీకు మరేదీ పట్టదు
మరిదేంతోనూ పనిపడదు.
ఎంత చిన్న వెలుగు! ఆ కాంతిలేశం నా కంటపడగానే
మళ్ళా కనిపించడం మొదలుపెట్టాయి హిమాలయాలు
మందరగిరి, మహేంద్రగిరి, మలయ, మేరుపర్వతాలు
మళ్ళా దృగ్గోచరమవడం మొదలుపెట్టాయి
చరాచరాలు, పారిజాతాలు, పులులు, పందులు కూడా.

శ్రీమంతమైన ఆ కాంతిపుంజం ఎదట నేనొక
బాలకుడిగా మారాను,
నాకు జీవితం మీద మళ్ళా ఆశ పుట్టింది
అప్పటిదాకా మునిగిపోయిన లోకాల్ని మళ్ళా పైకి లాగడం
మొదలుపెట్టాను
మళ్ళా ఒక్కొక్కరే వచ్చి పలకరించడం మొదలుపెట్టారు
దైత్యులు, ఆదిత్యులు.

మరణభయం ముందే లేదు, అప్పుడు నేను
ప్రళయభయం నుంచి కూడా బయటపడ్డాను.
ఎన్ని ప్రళయాలు సంభవించనివ్వు
ప్రతి యుగాంతవేళా నాతో పాటు
నవజీవనోత్సాహం కూడా నిలిచే ఉంటుందని గ్రహించాను.


  • టి.ఎస్.ఎలియట్: The Four Quartets, Burnt Norton
    **బైరాగి: నూతిలో గొంతుకలు, 3

Leave a Reply

%d bloggers like this: