సంగీత విద్య

నిన్న మళ్ళా చేతన ఆశ్రమంలో గడిపాను. చేతన బాలకుటీర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్వర్గీయ గరిగె ప్రభావతిగారి జ్ఞాపకాల్ని తలచుకుంటూ ప్రతి ఏడాదీ డిసెంబరు 10 న వెంకటేశ్వర బాల కుటీర్ వారు ఉత్సవాలు జరుపుతారు. ఆ సందర్భంగా డా.మంగాదేవి బాలసాహిత్య పురస్కారం, మాలతీచందూరు పేరు మీద మాలతీప్రమదాసాహితీ పురస్కారాలతో పాటు ప్రతిభా పల్లవం అనే పురస్కారాన్ని కూడా ప్రదానం చేస్తారు.

ఈ ఉత్సవాలకు నిన్న పాతికేళ్ళ పండగ. ఈ సారి బాలసాహిత్య పురస్కారం సమ్మెట ఉమాదేవికి లభించింది. ‘నిక్ అంటే ప్రేరణ ‘అని ఆమె నికొలస్ జేమ్స్ వుయిచిచ్ విజయగాథ పైన రాసిన పుస్తకానికి ఈ పురస్కారం లభించింది. ఉమాదేవి పిల్లల ప్రేమికురాలు. తన బడిపిల్లలతో తన అనుభవాల్ని ఆమె పుస్తకాలుగా వెలురించారు కూడా. మాలతీ ప్రమాదా పురస్కారం ఈ సారి మా అక్కకి లభించడంతో ఆ పండగలో పాల్గొందామని నేను కూడా వెళ్ళాను. ఎలానూ గుంటూరు వెళ్తున్నాను కాబట్టి, ఒకసారి చేతన ప్రాంగణంలో కొంతసేపు గడపమని డా.మంగాదేవిగారూ, మరుద్వతిగారూ ఆహ్వానించడంతో సంతోషంగా అడుగుపెట్టాను.

తీరాన్ని కమ్ముకున్న మబ్బు ఇంకా తుపానుగా మారకపోవడంతో, వాతావరణం ఆహ్లాదంగానే ఉండింది. మామూలుగానే శరత్-హేమంతాల మధ్య కాలం చేతనలో ఒక్కరోజేనా గడపవలసిన కాలం. కోవిదార పుష్పాలు, పున్నాగ పుష్పాలు, పారిజాతాలు విరిసి గాలినిండా సుమసౌరభం తప్ప మరే ఊసులూ వినబడని కాలం. నిన్న మరీ అందంగా, మరీ ఆత్మీయంగా ఉంది.

సెలవురోజు కావడంతో ప్రాంగణమంతా నిశ్శబ్దంగా ఉంది. పూలు ఆడుతున్న గుగుసలూ, వాటిమధ్య ఏవేవో పక్షులు పలుకుతున్న సంగతులూ తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా పిల్లలు సంగీత సాధన చేస్తున్న స్వరసందోహం నన్ను ఒక కెరటంలాగా తాకింది. చేతన ప్రాంగణంలో కళాభవనం అని చెప్పదగ్గ సృజన వరండాలో పిల్లలు పాటలు రిహార్సల్స్ చేస్తున్నారు. వాళ్ళ గీతాలాపన వినగానే నాకు కలిగిన పులకింత ఇంతా అంతా కాదు.

పాఠశాలల్లో చదువు ఎంతేనా నడవనీ, అక్కడ భవనాలూ, సౌకర్యాలూ, తోటలూ, పాఠాలూ ఎట్లాగేనా వర్ధిల్లనీ, అక్కడ పాటలు వినబడకపోతే మాత్రం నేను దాన్ని పాఠశాలగా పరిగణించలేను. ఆ పాఠశాల ఎన్ని అరకొర సౌకర్యాలతోనైనా ఉండనివ్వు, అక్కడ ఎన్ని సమస్యలైనా నడుస్తుండనివ్వు, అక్కడ కనీసం ఒక్క ఉపాధ్యాయుడేనా, పొద్దుటిపూటనో, సాయంకాలమో పిల్లలతో ఒక గీతం ఆలపిస్తే, అది నా దృష్టిలో సర్వోన్నత పాఠశాల.

అటువంటి దృశ్యాలు నా కళ్ళల్లో ఇప్పటికీ కొన్ని సజీవంగా కదలాడుతూనే ఉంటాయి. నేను పార్వతీపురంలో పనిచేసినప్పుడు గుమ్మలక్ష్మీపురం వెళ్ళాలంటే టిక్కబాయి ఆశ్రమపాఠశాల పక్కనుంచే వెళ్ళవలసి ఉండేది. అలా గుమ్మలక్ష్మీపురం, ధర్మలక్ష్మీపురం లాంటి వూళ్ళకి వెళ్తూ, వస్తూ ఉన్నప్పుడు, సాయంకాలాల్లో గంటేడ గౌరునాయుడు, టిక్కబాయి పాఠశాల ఆవరణలో చెట్లనీడన పిల్లకు ఎప్పుడూ ఏదో పాట నేరుతూ కనబడేవాడు. ఒక్కొక్కప్పుడు ఇప్పపూలగాలీ, ఆ పాటల గాలీ కలగలిసి నన్ను చుట్టుముట్టేవి. నా జీవితంలో నేను పదిలంగా దాచుకున్న క్షణాలు అవి.

అయిదారేళ్ళ కిందట ఋషివేలీ పాఠశాల చూడ్డానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక సంప్రదాయం చూసాను. మామూలుగా స్కూళ్ళల్లో జరిగే మార్నింగ్ అసెంబ్లీకి బదులు, అక్కడ పిల్లలంతా ఒక మందిరంలో కూచుని పాటలు పాడుకుంటారు. ఆ తర్వాతే క్లాసులకి వెళ్తారు. అటువంటి ఒక ప్రభాతగానసమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. ఆ రాగాల రంగులు నా మనసులో ఎప్పటికీ వెలిసిపోవు.

రెండేళ్ళ కిందట గుంటూరులో కేంద్రీయ విద్యాలయం స్కూలుకి వెళ్తే, అక్కడ పిల్లలు వివిధ భారతీయ భాషలకు చెందిన దేశభక్తిగితాలు పాడారు. ఆ ఉపాధ్యాయుడు ఆ పాటలన్నిటికీ రాగాలు కూర్చి పిల్లల్తో బాండు మీద వినిపించాడు. ప్రతి పాఠశాలలోనూ అటువంటి ఒక పాటల గుత్తి ఉండాలని అనుకున్నాను.

పదేళ్ళ కిందట, హైదరాబాదు దగ్గర బండ్లగూడలో సరస్వతీ శిశుమందిర్ వారు తమ ప్రాతఃకాల ప్రార్థనాసమావేశానికి నన్ను ఆహ్వానించేరు. అక్కడ దీపప్రజ్వలనం అయ్యాక సరస్వతీ స్తుతి చేసారు. పిల్లలదే గాత్రం, వాద్యం. ఆ ప్రాతఃకాల ప్రార్థన నన్ను ఎంతగా ముగ్ధుణ్ణి చేసిందంటే, తిరిగి ఆఫీసుకు రాగానే కవితాప్రసాద్ కి చెప్పి, మళ్ళా ఆయన్ని ఆ ప్రార్థనాసమావేశానికి పట్టుకుపోయాను.

కాని అన్నిటిలోకీ మరవలేని అనుభవం కిందటేడాది ఏప్రిల్లో చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు పీలేరు దగ్గర కోటపల్లి జిల్లా పరిషత్తు హైస్కూలుకి వెళ్ళినప్పటి అనుభవం. ఆ పాఠశాలని ఆ ప్రధానోపాధ్యాయినీ, ఆమె సిబ్బందీ, తల్లిదండ్రుల సంఘం కలిసి అద్భుతంగా తీర్చి దిద్దుకున్నారు. అది బాలికల పాఠశాల. అన్ని క్లాసులు తిరుగుతూ, తొమ్మిదో తరగతి క్లాసులో పిల్లల్తో మీకు పాటలు వచ్చా అని అడిగితే, వచ్చన్నారు. పాడమన్నాను. వాళ్ళు కూర్చున్న డెస్కుల మీద తాళం వాయిస్తూ పాట కాదు, ఏకంగా ఒక రాగమే ఆలపించారు. అటువంటి దృశ్యం ఒకటి ఒక ప్రభుత్వపాఠశాలలో చూడగలనని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇది ఏమి రాగం అని అడిగాను. ‘ఆభేరి ‘అన్నారు. ఎవరు నేర్పారని అడిగాను. పాఠశాలలో పనిచేస్తున్న సంగీతం టీచర్ ను చూపించారు. ఆమె సమగ్ర శిక్ష ప్రాజెక్టు కింద నియమించిన పార్టు టైం టీచర్. ఎన్ని రాగాలు నేర్పారు అని అడిగాను ఆమెని. ప్రతి తరగతిలోనూ కనీసం పది పన్నెండు రాగాలు పాడగలరని చెప్పిందామె. వెంటనే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆ పాఠశాల భూమ్మీద ఒక స్వర్గపు తునకలాగా కనిపిస్తున్నదని మెసేజి పెట్టాను.

తిరిగి విజయవాడ వచ్చాక ఎస్.సి.ఇ.ఆర్.టి డైరక్టరును పిలిచి మూజిక్ టీచర్లతో ఒక వర్క్ షాపు ఏర్పాటు చెయ్యమని చెప్పాను. ప్రతి పాఠశాలలోనూ పాడుకోదగ్గవి కనీసం వంద పాటలేనా ఎంపిక చేసి, పుస్తకరూపంలోనూ, సిడి రూపంలోనూ కూడా ఇద్దామని చెప్పాను. అందులో గుంటూరు కె.వి లో చూసినట్లుగా ఇతర భారతీయ భాషల దేశభక్తిగీతాలు కూడా చేరుద్దామని చెప్పాను.

కాని దురదృష్టవంతుణ్ణి. నెరవేరని నా ఎన్నో కలల్లో అది కూడా ఒక కలగా మిగిలిపోయింది.

నిన్న చేతనలో అడుగుపెట్టినప్పుడు, ఆ చిన్నారులు ఒక సెలవు దినం అలా పాటలు ప్రాక్టీసు చేస్తూ ఉంటే నాకు కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. ప్రతి పాఠశాలలో పిల్లలకి శ్రేష్ఠమైన విద్య ఎంత అవసరమో, పుష్టికరమైన మధ్యాహ్న భోజనం ఎంత అవసరమో, శ్రావ్యమైన సంగీత విద్య కూడా అంతే అవసరం అని నాకు నేను మరోమారు చెప్పుకున్నాను.

11-12-2022

9 Replies to “సంగీత విద్య”

  1. మంచి సంగతులు పంచే దేవదూత మీరు. తరగతులలో పాటలు అద్భుతం. మా ప్రభుత్వపాఠశాలలో కొన్ని రోజులు సంగీతపు తరగతు జరిగాయి.

  2. ఒక పాఠశాల పునాది ఏమిటో మీ కుటీరం ద్వారా తెలుసుకోగలుగతారు. మంచి పసందైన సంగీతం మీ కుటీరం

  3. నేను నవోదయా విద్యాలయ పాలేరు,ఖమ్మం లో చదువుతున్నానండి. మా స్కూల్ కొక బాండ్ వుండేది. నేను (choir) పాటలు పాడే వాళ్ళలో ఒకదాన్ని. కనీసం వందపాటలైనా నేర్చుకున్నాం, అందులో యాభైయైనా గుర్తున్నాయ్ ఇప్పటికీ. మంచి జ్ఞాపకాల తుట్టెను కదిల్చారు.

Leave a Reply

%d bloggers like this: