కథల సముద్రం-2

ఆధునిక కథకు జవసత్త్వాలు సమకూర్చిన ఆంటోన్ చెహోవ్ గురించి తెలుగు వాళ్ళకి బాగానే తెలిసినా, ఆయన కథలు నలభైకి మించి ఇప్పటిదాకా తెలుగులోకి రాలేదు. ఆ లోటు తీర్చడానికి ప్రసిద్ధ రచయిత, రష్యన్ సాహిత్య ప్రేమికుడు కుమార్ కూనపరాజు చెహోవ్ కథల్ని ప్రత్యేకంగా అనువాదం చేయించి తెలుగులోకి తీసుకురావడానికి పూనుకున్నారు. అందులో భాగంగా మొదటగా వంద కథలు ఈ నెల 23 న పుస్తకంగా విడుదల చేస్తున్నారు. డాస్టొవిస్కీ రాసిన కరమజోవ్ సోదరులు నవలను తెలుగులోకి సమర్థవంతంగా అనువదించిన అరుణా ప్రసాద్ నే ఈ కథల్ని కూడా తెలుగు చేసారు. ఆ కథాసంపుటానికి నేను రాసిన ముందుమాట నుంచి రెండవ భాగం మీ కోసం.

కథలు రాయడం నేర్పే పాఠాలు-2

ఈ భావాల్ని మరింత స్పష్టంగా ఆయన తన సోదరుడు అలెగ్జాండర్‌ చెహోవ్‌కి 1886 లో రాసిన ఉత్తరంలో రాసిపెట్టాడు.  కథకుడికి ఉండవలసిన ఆరులక్షణాలుగా వాటిని ఇలా లెక్కపెట్టుకున్నాడు:

నువ్వు రాసిన కథ మంచి కళాకృతి కావాలంటే ఈ లక్షణాలుండాలి: 1) రాజకీయ-సామాజిక-ఆర్థిక విషయాల మీద దానిలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఉండకూడదు. 2) పూర్తి నిష్పాక్షికత 3) మనుషుల్నీ, సంగతుల్నీ నిజాయితీగా చిత్రించడం, 4) అపారమైన క్లుప్తత, 5) చెప్పదలుచుకున్నది నిర్భయంగా చెప్పడం, నీ సొంతగొంతుతో చెప్పడం, మూసపాత్రల్నీ, పడికట్టు ప్రయోగాల్నీ పక్కనపెట్టెయ్యడం 6) సహానుభూతి.

ఆయన కథకుడిగా రూపొందే క్రమంలో కీలకమైన ఒక మలుపు దగ్గర నిలబడి మాట్లాడిన మాటలు ఇవి. ఈ మాటల్లోనూ, ఇంకా ఈ కాలంలో రాసిన మరెన్నో ఉత్తరాల్లోనూ, వీటిలో మరీ రెండు లక్షణాల్ని ప్రధానంగా  ఎత్తిచూపుతూ ఉన్నాడు. అవి: మొదటిది, నిష్పాక్షికత. అంటే, జీవితాన్ని ఎటువంటి ముందస్తు అపోహలూ లేకుండా సమీపించడం. సైన్సు అంటే ఇదే. గొథే ఏకకాలంలో కవిగానూ, శాస్త్రవేత్తగానూ జీవించాడనీ తాను కూడా ఏకకాలంలో శాస్త్రవేత్తగా, రచయితగా తన అన్వేషణ కొనసాగించాలనీ ఆయన కోరుకున్నాడు. తన అభిమానీ, శిష్యురాలూ అయిన కిసెల్యోవాకు 1887 లో రాసిన ఉత్తరంలో ఇలా రాస్తున్నాడు:

ఒక రసాయన శాస్త్రజ్ఞుడి దృష్టిలో ఈ ప్రపంచంలో ఏదీ కూడా కల్మష పూరితం కాదు. రచయితకి కూడా ఒక రసాయన శాస్త్రజ్ఞుడికి    ఉన్నంత నిష్పాక్షికతా ఉండాలి. తన దైనందినజీవితంలో తనని సదా అంటిపెట్టుకుని ఉండే ఆత్మాశ్రయతని అతడు విదిలించుకోగలగాలి. పేడా, పెంటా కూడా ప్రకృతిలో గౌరవనీయమైన పాత్ర పోషిస్తాయనీ, మానవ బలహీనతలూ, దౌర్బల్యాలూ కూడా సద్గుణాల్లానే మానవ జీవితంలో విడదీయరాని భాగమనీ రచయితలు తెలుసుకోవాలి.

ఈ దృక్పథమే చెహోవ్‌ కథల్ని అజరామమరం చేసింది. అతడు తన కథల్లోని పాత్రల పట్ల ఎటువంటి తీర్పూ ఇవ్వడు. తన అభిప్రాయాల్ని వారిమీద రుద్దడు. వాళ్ళ సమస్యలకు తాను పరిష్కారాలు ఆలోచించడు. అన్నిటికన్నా ముందు అతడు వారిపట్ల అపారమైన సహానుభూతి కనపరుస్తాడు. వారి మానవమర్యాదను హృదయపూర్వకంగా గౌరవిస్తాడు. కథలు రాయాలనుకున్నవాళ్ళు అలవరచు కోవలసిన క్రమశిక్షణ ఇది.

అబద్ధాల్నీ, కాపట్యాన్నీ ఏ రూపంలో కూడా సహించలేకపోవడం రెండవది. ఒక ఉత్తరంలో అయన ఇలా రాసుకున్నాడు:

రచయితలు అస్సలు చెయ్యకూడని పని అబద్ధాలు ఆడటం. కళ తాలూకు అత్యున్నత లక్షణమేమిటంటే అది అసత్యాన్ని ఏ రూపంలోనూ సహించజాలదు. మనుషులు ప్రేమిస్తున్నప్పుడో, రాజకీయాల్లో పాల్గొంటున్నప్పుడో, చివరికి రోగానికి మందులిస్తున్నప్పుడో అబద్ధాలు ఆడవచ్చేమో, ప్రజల్ని తప్పుదోవపట్టించవచ్చేమో, చివరికి దేవుడిముందు కూడా అబద్ధాలు ఆడవచ్చేమో గాని, కళలో మాత్రం అబద్ధాలకు చోటు లేదు.

4

ఈ సూత్రాల్ని చెహోవ్‌ తన కథారచనలో ఎలా వినియోగించుకున్నాడో చూడటానికి ఈ పుస్తకం గొప్ప అవకాశాన్నిస్తుంది. నేను కథలు రాయడం మొదలుపెట్టిన రోజుల్లో ఇటువంటి పుస్తకం దొరికి ఉంటే నాకు ఎంతో ఉపయోగకరంగా ఉండి ఉండేది. ఎన్నో సందేహాలకు, ఎవర్ని అడిగినా తీర్చలేని ఎన్నో ప్రశ్నలకు నేరుగా ఇక్కడే జవాబులు దొరికి ఉండేవి. కుమార్‌ కూనపరాజు గారి వల్ల ఇప్పుడు మీకు ఆ భాగ్యం చిక్కింది. చదవండి, ఇందులో కథలు అన్నీ చదవండి, ప్రతి ఒక్కటీ చదవండి. చెహోవ్‌ తాను చూస్తున్న జీవితాన్ని చిత్రించడంలో చూపించిన మెలకువల్నీ, కథానిర్మాణ పద్ధతుల్నీ అధ్యయనం చెయ్యండి. వాటిని ఎవరికి వారు స్వయంగా తెలుసుకోవడంలో ఒక సంతోషం ఉంటుంది. కాని నేను చాలా స్థూలంగా రెండు మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను.

మొదటిది, చెహోవ్‌ చాలా సూటిగానూ, సరళంగానూ రాస్తాడు. అలంకారాల్తో కూడిన భాషవాడడు. ఆడంబర చిత్రణలు చెయ్యడు. అతడు చూసినదాన్నీ, అనుభవంలోకి వచ్చినదాన్నీ చిన్న చిన్న వివరాల్తో, ఏ వివరాలు మనకి చెప్తే ఆ సన్నివేశం మన ముందు దృగ్గోచరం కాగలుగుతుందో అటువంటి వివరాల్ని కథలో పొందుపరుస్తాడు. ఇటువంటి లక్షణం వల్ల చెహోవ్‌ కథలు ఇంప్రెషనిస్టు చిత్రలేఖనాల్లా ఉంటాయని టాల్‌ స్టాయి అన్నాడు. అప్పణ్ణుంచీ, చెహోవ్‌ కథాశిల్పం గురించి ఆ తర్వాత ఎవరు మాట్లాడినా ఆయన్ని ఇంప్రెషనిస్టుగా పేర్కోవడం పరిపాటి అయిపోయింది. కథ చదవడం పూర్తయ్యాక కథ మనమీద విడిచే ఒక ముద్రను మనం పోలుచుకునేటట్టుగా కథ చెప్ఫే పద్ధతి ఇదే. చాలా సూక్ష్మవివరాలు, బయటా, మనుషుల అంతరంగాల్లోనూ కూడా నెలకొన్న శీతోష్ణతలు, హావభావాలు, దుస్తులు, ఆహారం, అలవాట్లు- ప్రతి ఒక్కదాన్నీ ఎంతో నిశితంగా పరిశీలించగలగడం కథకుడికి ఉండవలసిన మొదటి అర్హత అని చెహోవ్‌ కథలు చదివితే తెలుస్తుంది. కథలు ‘మనిషి’ గురించి కాదు, నిర్దిష్ట వ్యక్తుల గురించి, ‘జీవితం’ గురించి కాదు, నిర్దిష్ట సన్నివేశాల గురించీ, సంఘటనల గురించీ అని మనకు అర్థమవుతుంది. తాము ఎవరి గురించి రాస్తున్నారో, ఏ అనుభవాల గురించి రాస్తున్నారో వాటిని విశ్వసనీయంగా పాఠకులకు అందించకపోతే ఆ కథలు గుర్తుండటం కష్టం. అందుకనే ఒక యువతి గురించో, వంటమనిషి గురించో రాయడంకన్నా సోక్రటీసు గురించి రాయడం తేలిక అని చెహోవ్‌ రాసాడొక ఉత్తరంలో.

రెండవది చెహోవ్‌ చిత్రించిన జీవితం పరిమితం కాదు. ఆయన తన చుట్టూ గీతలు గీసుకు కూర్చోలేదు. అనా కరెనినా నవల్లో లేనిదేదీ రష్యాలో కనిపించదని డాస్టొవిస్కీ అన్నాడని అంటారుగాని, ఈ మాట చెహోవ్‌ కథలకి బాగా వర్తిస్తుంది. చెహోవ్‌ కథల్లో కనిపించే రష్యా మరింత విశాలమైన దేశం. రాజధాని నగరాల్లో, ప్రావిన్సుల్లో, నగరాల్లో, గ్రామాల్లో, కొత్తగా పెరుగుతున్న పారిశ్రామిక వాడల్లో, యూరోప్‌కి ఆనుకుని ఉన్న రష్యాలో, దూరప్రాచ్య రష్యాలో, సైబీరియాలో, క్రిమియాలో- రష్యాని అన్నిచోట్లా, దాని పొడవు వెడల్పుల్లో విస్తృతంగా దర్శించాడు, చిత్రించాడు చెహోవ్‌. అతడి కథల్లో కులీనులు, గుమస్తాలు, అధికారులు, మఠాధిపతులు, గ్రామస్థాయి పాస్టర్లు, భూస్వాములు, పనివాళ్ళు, రైతులు, వర్తకులు, చిల్లరవ్యాపారులు, ఖైదీలు, ప్రవాసితులు, నిర్వాసితులు, స్త్రీలు, వృద్ధులు,  పిల్లలు, కళాకారులు, కార్యశూరులు, సోమరులు, ఉద్రిక్తులు, దుర్బలులు, ఆరోగ్యంగా   ఉండేవాళ్ళు, రోగిష్టివాళ్ళు, పుణ్యశీలురు, పాపులు- ప్రతి ఒక్కరూ కనిపిస్తారు. రష్యాని చెహోవ్‌ పట్టుకున్న తీరు అనితరసాధ్యం, అద్వితీయం అన్నాడొక విమర్శకుడు.

అయితే ఇంత విస్తృతంగా మానవసమాజాన్ని చిత్రించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇంత విస్తృతంగా లోకం తెలిసే అవకాశాలు కూడా అందరికీ లభించకపోవచ్చు. మనం దీన్నుంచి గ్రహించవలసిన పాఠమంటూ ఉంటే, అదొక్కటే, వస్తువు విషయంలో, చిత్రించవలసిన జీవితం విషయంలో గీతలు గీసుకు కూచోవద్దు అన్నదే. ఎంత వీలయితే అంతగా మనం చూసిన జీవితపు వీలైనన్ని కిటికీలు తెరిచే పని చెయ్యాలన్నదే.

మూడవది ఇంతకు ముందు చెప్పిందే, చెహోవ్‌ తాను చూస్తున్న జీవితాన్ని వీలైనంత నిష్పాక్షికంగా, ఒక వైద్యశాస్త్ర విద్యార్థి ఒక జీవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినంత నిర్మమత్వంతో చిత్రిస్తాడు. అయితే ఈ పని ఆయనకన్నా ముందు మపాసా లాంటి నాచురలిస్టులూ, గొగోల్‌, జోలా లాంటి రియలిస్టులూ కూడా చెయ్యకపోలేదు. కాని వాళ్ళ కథల్లో కనిపించని అదనపు ఆకర్షణీయత ఒకటి చెహోవ్‌ కథల్లో కనిపిస్తుంది. ఏమిటది?

చెహోవ్‌ కథలు మొదటిసారి చదివినప్పుడు పాశ్చాత్య పాఠకుడు అతడిలో ఒక నిరాశావాదిని చూసాడు. ఆ కథల్లో కథానాయకులు గట్టినిర్ణయాలు తీసుకోలేరనీ, మనుషుల్నీ, సమాజాన్నీ ముందుకో వెనక్కో బలంగా నెట్టగలిగే ఉద్రేకం చెహోవ్‌ కథల్లో కనిపించదనీ భావించారు. కాని చెహోవ్‌ రాసిన కథల్ని మళ్ళా మళ్ళా చదవకుండా ఉండలేమని కూడా చెప్పుకున్నారు. ఎందుకని? ‘చెహోవ్‌కి మంచి హృదయముంది, ప్రతిభావంతుడైన రచయిత, కాని ఇప్పటిదాకా అతడికి తనదని చెప్పుకోదగ్గ దృక్పథమేమీ కనిపించటం లేదు’ అని రాసుకున్నాడు టాల్‌స్టాయి తన డైరీలో, 1895లో. అప్పటికే చెహోవ్‌ ‘వార్డు నంబరు 6’ (1892) లాంటి కథ రాసి ఉన్నాడు. ఆ కథ ఈ సంపుటిలో ఉంది. చదవండి, చదివాక చెప్పండి, టాల్‌ స్టాయి రాసుకున్న మాటలు నిజమేనా?

చెహోవ్‌ కథారచనలోని అత్యంత విలువైన అంశం నేను చెప్పాలనుకున్న వాటిలో మూడవదీ, ముఖ్యమైందీ, ఈ అంశం గురించే. చెహోవ్‌ జీవిత వాస్తవాన్ని ఒక సైంటిస్టులాగా నిష్పాక్షికంగా, తటస్థంగా చిత్రించాలనుకున్నాడు నిజమేకాని, దానికి ఒక అనుభూతిని, ఒక కవితాత్మకతని, ఒక సంగీతాత్మకతని జోడిరచాడు. దీన్ని విమర్శకులు ఇంప్రెషనిస్టు లక్షణంగా భావించారని చెప్పాను, కాని అది చెహోవ్‌ శిల్పానికి పాక్షిక వివరణ మాత్రమే. అతడు తాను చూస్తున్న యథార్థాన్ని మనకి వివరిస్తున్నప్పుడు, ఏ ఒక్క పక్షమో తీసుకోకుండా, తద్విరుద్ధమైన వాస్తవాల్ని కూడా మనముందు పెడుతుంటాడు. అంటే జీవితంలో ముందుకు నడవమని ఒకడు చెప్తున్నాడనుకో, వెనక్కి పోవాలని చెప్పేవాణ్ణి కూడా ఆ క్ష్హణంలోనే గుర్తు చేస్తుంటాడు. అతడి సుప్రసిద్ధమైన కథ ‘ఉసిరికాయలు’ లో లాగా జీవితం చాలా సుఖంగానూ, సంతోషంగానూ ఉందనిపించే క్షణాల్లో మన వెనక నిలబడి జీవితంలో ఉన్న కడగండ్ల గురించీ, దురదృష్టాల గురించీ సుత్తితో మోదుతున్నట్టు చెప్తాడు. జీవన వైరుధ్యాల్ని ఇలా మనముందు ఏకకాలంలో ప్రవేశపెట్టడం వల్ల, రెండింటిలో, ఏ ఒక్కదాని పక్షమూ వహించకుండా, రెండు వాదనల్నీ మనముందు ప్రతిపాదిస్తున్నందువల్లా అతడి కథనం ఒక నాటకీయతను సంతరించుకుంటుంది. చెహోవ్‌ గొప్ప నాటక కర్త కావడంలో ఆశ్చర్యం లేదు.  పాశ్చాత్యమానవుడి సంక్షోభాన్ని చూపగలిగినన్ని సన్నివేశాల్లో చూపించడంలో నాకు తెలిసి, షేక్‌ స్పియర్‌ తో పోల్చదగ్గవాడు చెహోవ్‌ ఒక్కడే.

అందుకనే అతడి కథలు ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మళ్ళీ మళ్ళీ చదవాలి. జీవితపు ప్రతి మలుపులోనూ చదవాలి. జీవితం మనల్ని మార్చిందనుకున్న ప్రతి సందర్భంలోనూ చదవాలి. ఉదాహరణకి చెహోవ్‌ కథల్లో మనుషులు నిరాశావాదులుగా ఉంటారనే ఆరోపణలు ఉన్నాయన్నాను కదా. ఆయన ఒకసారి ఇవాన్‌ బునిన్‌తో మాట్లాడుతూ, తాను రాసిన ‘విద్యార్థి’ కథ మరొకసారి చదవమని చెప్పాడు. ఆ కథ ఈ సంపుటిలో ఉంది. చదవండి. తాను రాసిన కథలన్నిటిలోకి తనకు ఎంతో ఇష్టమైన కథ అని చెప్పుకున్నాడు చెహోవ్‌ దాని గురించి. రెండు మూడు పేజీలు దాటని ఆ కథ గొప్ప శుభాకాంక్షస్తోత్రం లాంటిది. అంతేనా! పైకి నాస్తికుడిగా కనిపించే చెహోవ్‌, ఆ కథ చదివితే, అత్యంత విశ్వాసభరితుడైన క్రైస్తవుడిగా కనిపిస్తాడని ఒక విమర్శకుడు అన్న మాటల్లో అతిశయోక్తి లేదనిపిస్తుంది.

ఇదంతా బాగానే ఉంది గాని, ఒక్క మాటలో చెప్పు, చెహోవ్‌ నుంచి ఈ విషయంలో మనం ఏమి నేర్చుకోగలం అంటారా? అయితే వినండి. ఏ జీవిత సన్నివేశంగాని, అనుభవంగాని, అనుభూతి గాని మిమ్మల్ని కథగా మార్చమని ప్రేరేపించినా, మీరు దాన్ని చిత్రించేటప్పుడు ఏదో ఒక కోణం దగ్గరే ఆగిపోకండి. ఆ సన్నివేశాన్ని 360 డిగ్రీల్లో చూడటానికి ప్రయత్నించండి అనే. చెహోవ్‌ సమకాలికుడు  పాలె షెజానె (1839-1906) చిత్రకళలో చేసిందిదే. చెహొవ్‌కి దాదాపుగా సమవయస్కుడైన గురజాడ (1862-1915), ఇక్కడ తెలుగులో, చేసింది కూడా ఇదే.

5

ఇందులో చెహోవ్‌ రాసిన కథల్లో వంద కథలకు అనువాదాలున్నాయి. ఇవి దాదాపుగా చెహోవ్‌ తొలిదశ అంటే 1884 నుంచి 1890 దాకా రాసిన కథలు. ఇందులో కూడా మలిదశకు చెందిన కథలు ‘వార్డు నంబరు.6’ (1892), ‘ఒక కళాకారుడి కథ’ (1896), ‘నా బ్రతుకు’ (1896) లాంటివి లేకపోలేదు. ఇవి కాక, చెహోవ్‌ మలిదశకు చెందిన ముఖ్యమైన కథలు, అంటే 1890 నుంచి 1904 దాకా రాసినవి, రాబోయే కాలంలో మరొక సంపుటంగా వెలువడనున్నాయి. అయితే కథకుడిగా ఇంతదాకా చెహోవ్‌ గురించి మాట్లాడుకున్న మాటల్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి ఈ కథలు చాలు. మరీ ముఖ్యంగా మలిదశ కథల్లో లేనిదీ, ఈ కథల్లో ఉన్నదీ అద్వితీయమైన క్లుప్తత. కథారచనని ఒక అభ్యాసంగా సాధన చేస్తున్నవారికి ఈ సంపుటిలో ప్రతి కథా ఒక డిమాన్‌స్ట్రేషన్‌ లెసన్‌ అనవచ్చు.

ఈ అపురూపమైన సాహిత్యభాండాగారాన్ని తెలుగులోకి తీసుకురావడానికి పూనుకున్న కుమార్‌ కూనపరాజుగారికి తెలుగు సాహిత్యలోకం సదా ఋణపడి  ఉంటుంది. ఇప్పటికే డాస్టొవిస్కీ రాసిన కరమజోవ్‌ సోదరులు నవలను ప్రశంసనీయంగా అనువాదం చేసిన అరుణా ప్రసాద్‌ ఈ కథల్ని అనువదించడం తెలుగు కథకులకు ఊహించని వరం. ఈ కానుకకు మనం ఏమీ బదులివ్వలేం. కాని ఈ కథలు చదివి కథారచన పట్లా, జీవితం పట్లా తమ వైఖరిని కథకులు ఏ మాత్రం మెరుగుపర్చుకోగలిగినా అదే ఆమెకు మనం చెయ్యగల ప్రత్యభివాదం అని భావిస్తాను.

Featured photo: Ivan Constantinovich Aivazovsky – Little Russian Ox Cart in Winter, 1886, Courtesy: Wikicommons

2-12-2022

3 Replies to “కథల సముద్రం-2”

Leave a Reply

%d bloggers like this: