
ఆధునిక కథకు జవసత్త్వాలు సమకూర్చిన ఆంటోన్ చెహోవ్ గురించి తెలుగు వాళ్ళకి బాగానే తెలిసినా, ఆయన కథలు నలభైకి మించి ఇప్పటిదాకా తెలుగులోకి రాలేదు. ఆ లోటు తీర్చడానికి ప్రసిద్ధ రచయిత, రష్యన్ సాహిత్య ప్రేమికుడు కుమార్ కూనపరాజు చెహోవ్ కథల్ని ప్రత్యేకంగా అనువాదం చేయించి తెలుగులోకి తీసుకురావడానికి పూనుకున్నారు. అందులో భాగంగా మొదటగా వంద కథలు ఈ నెల 23 న పుస్తకంగా విడుదల చేస్తున్నారు. డాస్టొవిస్కీ రాసిన కరమజోవ్ సోదరులు నవలను తెలుగులోకి సమర్థవంతంగా అనువదించిన అరుణా ప్రసాద్ నే ఈ కథల్ని కూడా తెలుగు చేసారు. ఆ కథాసంపుటానికి నేను రాసిన ముందుమాట నుంచి మొదటిభాగం మీ కోసం.
కథలు రాయడం నేర్పే పాఠాలు
చెహోవ్ కథలన్నీ తెలుగులోకి తీసుకువస్తున్నామని కుమార్ కూనపరాజు గారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమనిపించింది. అది ఇంత తొందరలో కార్యరూపం ధరిస్తుందనీ, మొదటి వంద కథలు ఇలా పుస్తక రూపంలో మీ చేతుల్లోకి వస్తాయనీ నేను ఊహించలేకపోయాను. ఇది తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా కథా ప్రక్రియకి అపురూపమైన కానుక అని భావిస్తున్నాను.
సాధారణంగా కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళు, కొన్నాళ్ళు గడిచేక, తాము రాస్తున్న కథల వస్తువు పట్ల కాక, శిల్పం గురించి ఆలోచిస్తూ ఉండటం సహజం. కథలు ఎలా రాయాలి, కథని నిర్మించడంలో పాటించవలసిన నియమాలు, పద్ధతులూ ఉన్నాయా అనే విచికిత్స వాళ్ళల్లో మొదలవుతూండటం సహజం. ఈ మధ్య నేను పాల్గొన్న రైటర్స్ మీట్ లో కూడా నన్ను ఈ విషయం మీదనే మాట్లాడమని అడిగారు కూడా.
కథ అంటే అధునిక కథానిక, ముఖ్యంగా, పాశ్చాత్య ప్రభావంతో రూపుదిద్దుకున్న చిన్నకథ అనుకుంటే, ఆ కథాశిల్పం గురించి తెలుగులో చెప్పుకోదగ్గ పుస్తకాలు లేవు. ఉన్న ఒకటీ అరా కూడా కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళని చేయిపట్టుకు నడిపించడానికి ప్రయత్నిస్తాయి తప్ప, దారి చూపించేవిగా లేవు. ఈ నేపథ్యంలో చెహోవ్ కథలు మొత్తం తెలుగులోకి అనువాదం కావడం నిస్సందేహంగా ఎంతో ప్రయోజనకారి.
ఒకప్పుడు బ్రిటిష్ యువరాజు ఒక ప్రసిద్ధ నీటిరంగుల చిత్రకారుణ్ణి తనకు చిత్రాలు ఎలా గియ్యాలో నేర్పమని అడిగాడట. అందుకు ఆ చిత్రకారుడు తనకి బొమ్మలు వెయ్యడం మాత్రమే తెలుసనీ, ఎలా వెయ్యాలో నేర్పడం తెలియదనీ, రాకుమారుడు చిత్రాలు గియ్యడం నేర్చుకోదలచుకుంటే, తాను బొమ్మలు వేస్తుండగా చూడటమొక్కటే మార్గమనీ చెప్పాడట. ఈ మాట కథానికా ప్రక్రియకి కూడా వర్తింపచెయ్యవచ్చు. కథలు ఎలా రాయాలో ఎవరో చెప్తే నేర్చుకోవడం కన్నా చెహోవ్ కథలు మనమే నేరుగా చదవడం వల్ల కథా రచన సూత్రాలు సులభంగా పట్టుబడతాయి. ఇవి కథలు రాయడమెలానో నేర్పే పాఠాలు. జీవితాన్ని ఒక కథకుడు ఎలా సమీపించాలి, తన అనుభవాన్ని కథగా ఎలా మలచాలి, ఎలా ఎత్తుకోవాలి, ఎలా నడపాలి, ఎలా ముగించాలి వంటివన్నీ చెహోవ్ కథల్ని చదివే ఇరవయ్యవ శతాబ్ది కథకులు నేర్చుకున్నారు. మనకి కూడా అదే దగ్గరి దారి.
2
ఆంటన్ పావ్లొవిచ్ చెహోవ్ (1860-1904) రష్యాలో అజొవ్ సముద్రతీరాన తగన్‌రాగ్ అనే చిన్నపట్టణంలో జన్మించాడు. అతడి తాత ఒక వ్యవసాయ బానిస. 1861 లో వ్యావసాయ బానిసత్వాన్ని నిషేధించి వ్యవసాయ బానిసలకి విముక్తి లభించకముందే అతడు తన బానిసత్వం నుంచి విడుదల అయ్యాడు. చెహోవ్ కథల్లో చాలాచోట్ల తన తాత గురించీ, అతడు ఒక సెర్ఫ్‌గా జీవించాడు అనే సంగతి గురించి ప్రస్తావనలు కనిపిస్తూ ఉంటాయి. చెహోవ్ తండ్రి చిన్న కిరాణా వ్యాపారి. కాని అప్పుల్లో కూరుకుపోయి ఆ ఒత్తిడి తట్టుకోలేక మాస్కో వెళ్ళిపోయాడు. దాంతో చెహోవ్ తన బాల్యం, కౌమారం బీదరికంలో, బోర్డింగు స్కూళ్ళల్లో గడపవలసి వచ్చింది. తాను జీవితం నుంచి నేర్చుకున్న సత్యాల్ని తన యవ్వనాన్నే వెలగా చెల్లించి తెలుసుకున్నానని రాసాడు ఒకచోట.
చెహోవ్ వైద్యవిద్యని అభ్యసించినప్పటికీ పూర్తిస్థాయి వైద్యుడిగా వృత్తి సాగించలేదు. తన తొలిరోజుల్లో అంటే 1880 నుండి 1890 దాకా చిన్నపాటి ఆర్థిక అవసరాల కోసం కథలు రాసినవాడు, ఆ తర్వాత కథా రచననే తన ముఖ్యవ్యాపకంగా జీవించాడు. ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుకున్నాక, మెలిఖోవో ప్రాంతంలో చిన్న ఎస్టేటు కొనుక్కుని తల్లిదండ్రుల్ని తీసుకువచ్చి తన దగ్గర పెట్టుకుని చూసుకున్నాడు. అక్కడే అతడు ఒక ఆసుపత్రి నెలకొల్పాడు. రెండు పాఠశాలలు కూడా ఏర్పాటు చేసాడు. గ్రామీణ గ్రంథాలయాలకు పుస్తకాలు సమకూర్చాడు. చివరిరోజుల్లో తన ఆరోగ్య అవసరాలకోసం యాల్టాలో స్థిరపడ్డాక అక్కడ సముద్ర జీవశాస్త్ర పరిశోధనకి సహాయం చేసాడు కూడా.
కాబట్టి చెహోవ్ కథారచనలో రెండు దశలున్నాయి. 1880 నుంచి 1890 దాకా మొదటి దశ. 1890 లో అతడు సైబీరియా వెళ్ళి అక్కడి సాఖాలిన్ ద్వీపాన్నీ, అక్కడి స్థితిగతుల్నీ కళ్లారా చూసాక, అప్పణ్ణుంచీ తాను మరణించేదాకా, అంటే 1904 దాకా రెండో దశ.
అతడు ఈ రెండు దశల్లోనూ కూడా ముగ్గురు జార్ చక్రవర్తుల్నీ, రెండు చారిత్రక మహాసంఘటనల్నీ చూసాడు. 1861 లో రెండవ అలెగ్జాండర్ రష్యన్ సెర్ఫ్ వ్యవస్థను రద్దు చెయ్యడం రష్యా చరిత్రను సమూలంగా మార్చివేసింది. కాని 1881 లో రెండవ అలెగ్జాండర్ తనమీద జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించాక అతడి కుమారుడు మూడవ అలెగ్జాండర్ రాజయ్యాడు. అతడు తండ్రి చేపట్టిన సంస్కరణలకి స్వస్తి పలికి దేశాన్ని బయటనుంచీ, లోపలనుంచీ కూడా బంధించేసాడు. తండ్రి పాశ్చాత్యీకరణకు తలుపులు తెరిస్తే కొడుకు పూర్తిగా రూసిఫికేషన్ మీద దృష్టిపెట్టాడు. 1894 లో మూడవ అలెగ్జాండర్ అర్థాంతరంగా మరణించి అతడి కొడుకు రెండవ నికొలస్ అధికారంలోకి వచ్చాడు. అతడికి ప్రభుత్వ యంత్రాంగం మీదగాని, ఆర్థికవ్యవస్థ మీద గాని పట్టులేదు. అప్పటికే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చెకోవ్ మరణించిన కొన్ని నెలలకే, 1905 జనవరిలో సెంట్ పీటర్స్ బర్గ్ నగరంలో శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న ప్రజలమీద సైన్యం కాల్పులు జరిపింది. ఆ రోజు రక్తసిక్తమైన ఆదివారంగా చరిత్రలోకి ఎక్కడమే కాకుండా, 1905 రష్యన్ విప్లవానికి దారితీసింది.
1860-70 మధ్యకాలంలో రష్యాలో, రచయితలకి సామాజిక స్పృహ ఉండాలనీ, వాళ్ళు పాఠకులకి నీతిబోధ చెయ్యాలనీ సాహిత్యవిమర్శకులు వాదించారు. 1880 లో చెకోవ్ కథారచన మొదలుపెట్టేటప్పటికి ఆ వాదం ఇంకా బలంగా నిలిచే ఉంది. కాని జార్ చక్రవర్తి ప్రవేశపెట్టిన సంస్కరణలవల్ల కొత్తగా స్థానిక పరిపాలన మొదలయ్యింది. వాటికోసం పెద్ద ఎత్తున తక్కువ జీతాలకు పనిచేయగల ఉద్యోగులూ, ఉపాధ్యాయులూ అవసరమయ్యారు. ఆ ఉద్యోగాల్లో కుదురుకున్న వాళ్ళు ప్రధానంగా సగం చదువు మానేసినవాళ్ళూ లేదా ప్రజల్ని ఉద్ధరించాలనే ఉద్దేశ్యంతో ముందుకొచ్చినవాళ్ళూ. వాళ్ళింకా అరవైల నాటి భావజాలంలోనే కూరుకుపోయినందువల్ల కొత్త మార్పుల్ని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. మరోవైపు 80ల్లో ప్రవేశించిన సింబలిజం కొత్త కళారూపాల్ని అన్వేషిస్తూ ఉంది. వాటిని ప్రజలు వెంటనే స్వీకరించే పరిస్థితిలో లేరు.
బీదరికంతోనూ, సామాజిక అసమానతలతోనూ నలుగుతున్న రష్యాలో విద్యావంతుడైన, బాధ్యతాపరుడైన, సామాజికచైతన్యశీలుడైన మనిషి ఏమి చెయ్యాలి? ప్రశ్న ఒక్కటే, సమాధానాలు అనేకం. పాశ్చాత్యసానుభూతి పరులు రష్యా పాశ్చాత్యదేశాల్లాగ పారిశ్రమీకరణ చెందాలనీ, ప్రజాస్వామికం కావాలనీ, ఆధునీకరింపబడాలనీ వాదించారు. స్లావోఫిల్ వర్గాలు (రష్యా సంప్రదాయ అనుకూల భావజాలం కలిగినవాళ్ళు) రష్యా సంప్రదాయ శక్తుల్నే నమ్ముకోవాలని భావించారు. నరొదక్న్‌లు (ప్రజాపక్షవాదులు) ప్రజలకు చేరువకావాలని పోవాలని తపించారు. సొషలిస్టులూ, నిహిలిస్టులూ, అనార్కిస్టులూ ఒక విప్లవంతో రష్యాని గతం నుంచి బయటపడెయ్యాలని కోరుకున్నారు. అందరీ ప్రశ్నా అంతిమంగా ఒక్కటే. తనలో తను అనుకుంటున్నట్టుగా, రష్యా అంతా వినేలాగా, ప్రపంచమంతా వినబడేలాగా టాల్ స్టాయి వేసుకున్న ప్రశ్న: What is to be done?
చెకోవ్ ది కూడా ఇదే ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ మన ప్రశ్న కూడా ఇదే. చెకోవ్ చేసిందేమంటే, పై మూడు ధోరణుల్లో ఏ ఒక్కదానికీ చెందని ఒక శైలినీ, రచనావిధానాన్నీ ఎంచుకోవటం. అంటే, తన రచనలు పైకి సరళంగా కనిపిస్తాయి, కాని నిగూఢమైన అంతరార్థాలతో కూడి ఉంటాయన్నమాట. ముఖ్యంగా 1894 తర్వాత అతడు రాసిన కథలన్నిటిలోనూ సమాజం పట్ల గొప్ప అవేదన, మానవుడి కర్తవ్యం పట్ల ఒక మెలకువా కనిపిస్తాయి. అలాగని అతడి సామాజిక స్పృహ ఎక్కడా వాచ్యంగా ఉండదు. చెకోవ్ కథల్ని అజరామరం చేసిన సాహిత్యశిల్ప రహస్యం ఇదే.
3
చెహోవ్ సాహిత్య శిల్పాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ నేపథ్యం మనకి ఎంతో ఉపకరిస్తుంది. ఇప్పుడు మనం కూడా ఇటువంటి చీలుదారిలోనే ఉన్నాం. కథలు రాయాలనుకున్నప్పుడు మనకి ఒక జీవిత దృక్పథం ఉండాలని, రాజకీయ-సామాజిక పరిస్థితులపట్ల మనం ఏ వైపు నిలబడ్డామో చెప్పాలనీ మన చుట్టూ ఒత్తిడి పెరుగుతున్న కాలం. చాలాసార్లు కథకన్నా, కథల్లో కనిపిస్తున్న పాత్రల కన్నా, వారు వెతుక్కుంటున్న సత్యం కన్నా కూడా కథకుడు నేరుగా తన అభిప్రాయాలు ప్రకటించడమే కథా ప్రయోజనం అనే పరిస్థితి కూడా మన చుట్టూ నెలకొని ఉంది. ఇటువంటి ఒత్తిడిని మనలాంటి కథకులందరికన్నా ముందుగా, ఎంతో తీవ్రంగా అనుభవించినవాడు చెహోవ్. కాని, ఏ ఆసరాతో అతడు ఆ ఒత్తిడిని దాటగలిగాడు?
డాస్టవిస్కీకి మిత్రుడూ, ప్రచురణ కర్తలకు పరిచయం చెయ్యడం ద్వారా చెహోవ్ అనే కథకుణ్ణి ప్రపంచానికి కానుక చేసినవాడూ అయిన ద్మీత్రీ గ్రిగొరొవిచ్ కి 1888 లో రాసిన ఒక ఉత్తరం లో చెహోవ్ ఇలా రాస్తున్నాడు:
నాకు రాజకీయ- మతధార్మిక-తాత్త్విక దృకప్థమంటూ ఏదీ లేదు. ఉన్నా దాన్ని నేను ప్రతి నెలా మార్చేసుకుంటూ ఉంటాను. కాబట్టి నేను చెయ్యగలిగిందల్లా నా కథానాయకులు ఎలా ప్రేమించుకుంటారో, పెళ్ళి చేసుకుంటారో, పిల్లల్ని ఎలా కంటున్నారో, ఎలా మరణిస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో వాటిని చిత్రించడానికే పరిమితం కావడం.
ఆ ఏడాదే తన కాలం నాటి సుప్రసిద్ధ సాహిత్య వేత్త, తన ప్రోత్సాహకుడూ అయిన అలెక్సీ సువోరిన్ కి రాసిన ఒక ఉత్తరంలో ఇలా రాసాడు:
ప్రత్యేక నైపుణ్యంతో పరిశీలించవలసిన సమస్యల్ని పరిష్కరించడం కళాకారుడి పని కాదు. తనకి అర్థం కాని విషయాల్ని అతడు నెత్తికెత్తుకోవడం సముచితం కాదు. ప్రత్యేక సమస్యల్ని పరిష్కరించడానికి మనకు ఆ రంగంలోనే విశేషకృషి చేసిన ప్రత్యేకనిపుణులు ఉన్నారు. రైతుల్ని ఎలా సంఘటితపరచాలి, పెట్టుబడిదారీ విధానం భవిష్యత్తు ఏమిటి, మద్యపాన దుష్పరిణామాలు, మనం ఎలాంటి బూట్లు వేసుకోవాలి, స్త్రీల సమస్యలు- ఇలాంటి విషయాల్లో తగిన నిర్ణయాలు తీసుకోవలసింది ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు మాత్రమే. కళాకారుడు తనకి అర్థమయిన విషయాల మీద మాత్రమే తీర్పులివ్వడానికి సాహసించాలి. .. కళాకారుడి పరిథి ప్రశ్నలు వెయ్యడం కాదు, పరిష్కారాలు వెతకడం మాత్రమే అనేవాళ్ళు ఎప్పుడూ ఏ రచనలూ చెయ్యనివాళ్ళేనా అయి ఉండాలి లేదా ఊహాశాలీనత అంటే ఏమిటో తెలియని వాళ్ళేనా అయి ఉండాలి. కళాకారుడు అన్నిటికన్నా ముందు పరిశీలిస్తాడు, ఎంచుకుంటాడు, ఊహిస్తాడు, తన ఆలోచనల్ని ఒక పద్ధతిలో అమరుస్తాడు. ఇందులో అతడి ప్రతి ఒక్క పని వెనకా ఒక ప్రశ్న ఉండి తీరుతుంది. ముందు అసలు తనను తాను ఏదో ఒక ప్రశ్న వేసుకోకుండా అతడు పైన చెప్పిన ఏ ఒక్క పని కూడా చెయ్యలేడు..కాబట్టి నేనేమంటానంటే, మీరు రెండు విషయాల మధ్య పొరపడుతున్నారని. అవి: ఒకటి, సమస్యని పరిష్కరించడం, రెండోది, సమస్యని సరిగ్గా అర్థం చేసుకోవడం. కళాకారుడు కోవలసింది రెండోది.
తన మిత్రుడూ, ప్రచురణకర్తా అయిన అలెక్సీ ప్లెశ్చ్యయేవ్ కు ఆ ఏడాదే రాసిన ఒక ఉత్తరంలో చెహోవ్ రాసిన వాక్యాలు సుప్రసిద్ధాలు. ఆయన ఇలా రాస్తున్నాడు:
నేను ఉదారవాదిని కాను, మార్పు నెమ్మదిగా, క్రమానుగతంగా వస్తుందని వాదించేవాణ్ణీ కాను, సన్న్యాసిని కాను, అలాగని ఉదాసీన వాదినీ కాను. నేనొక స్వతంత్ర కళాకారుడిగా జీవించాలి అనుకునేవాణ్ణి తప్ప మరేమీ కాను. దేవుడు నాకు అందుకు తగినంత శక్తిని ఇవ్వనందుకు చింతిస్తున్నాను. అసత్యాన్నీ, హింసనీ వాటి సమస్త రూపాల్లోనూ నేను ద్వేషిస్తాను. మఠాధిపతుల్ని ఎంతగా భరించలేనో, వామపక్ష పాత్రికేయులు, నొటొవిచ్, గ్రడోవ్స్కీల్ని కూడా అంతగానూ భరించలేను. మూర్ఖత్వమూ, వివక్షా, కాలం చెల్లిన నీతిసూత్రాలూ కేవలం వ్యాపారస్థుల ఇళ్ళల్లోనూ, పోలీసు స్టేషన్లలోనూ మాత్రమే లేవు. అవి సైన్సులోనూ, సాహిత్యంలోనూ, యువతరంలోనూ కూడా కనిపిస్తున్నాయి. అందుకనే పోలీసులపట్ల గాని, మాంసవిక్రేతల పట్లగాని, శాస్త్రవేత్తల పట్లగాని, రచయితలపట్ల గాని లేదా యువతరం పట్లా గాని నాకు ఏ ప్రత్యేక ఆసక్తీ లేదు. ఎవరికైనా టాగులు తగిలించడం, ముద్రలు వెయ్యడం నా దృష్టిలో దురభిప్రాయాలతో సమానం. మానవదేహం, ఆరోగ్యం, ప్రజ్ఞ, ప్రతిభ, మనుషుల్ని ఉత్తేజపరచగల స్ఫూర్తి, ప్రేమ, అపారమైన స్వేచ్ఛ, హింసనుంచీ, అబద్ధాల నుంచీ విముక్తి- ఇవి మాత్రమే నా దృష్టిలో పవిత్రాతిపవిత్రమైన విషయాలు. హింస, కపటం రూపుదాల్చగల సమస్త రూపాలనుంచీ విముక్తి కోసం నా అన్వేషణ. నేను నిజంగా గొప్ప కథకుడిగా రూపొందితే, నేను అనుసరించే ప్రణాళిక వీటిని అన్వేషించడమే, చిత్రించడమే.
Featured photo: Ruhige See by Iwan Aiwasowski, 1887, Courtesy: Wikicommons
9-12-2022
చాలా బాగుంది ఆర్టికల్. కళాకారుల తత్వాన్ని చక్కగా చెప్పారు.
Thank you very much
ఇటువంటి పుస్తకం కోసం ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్నాను.