కొత్తగా, సరి కొత్తగా

మూడు నాలుగురోజుల కిందట సురేష్ కొలిచాల మా ఇంటికి వచ్చారు. అటువంటి భాషావేత్త, పండితుడు, అనువాదకుడు, సాంకేతిక నిపుణుడు నన్ను చూడటానికి రావడమే ఒక కానుక కాగా, ఆయన మరొక కానుక కూడా తీసుకొచ్చారు. అది Song Offerings (2000)పేరిట Joe Winter అనే ఆయన గీతాంజలికి చేసిన అనువాదం.

‘గీతాంజలి గీతాలు బెంగాలీలో ఎలా ఉన్నాయో అలా చేసిన అనువాదం ఇది’ అన్నారు సురేష్ ఆ పుస్తకం నా చేతుల్లో పెడుతూ. ‘William Radice చేసింది ఇదే కదా. పెంగ్విన్ సంస్థ ఆ పుస్తకం కూడా వేసింది’ అన్నాను. టాగోర్ 150 వ పుట్టినరోజు నాడు హైదరాబాద్ లో బెంగాలీ సమాజం వారు ఏర్పాటు చేసుకున్న ఒక సభలో రాడిస్ తన అనువాదాలు వినిపించినప్పుడు నేను కూడా ఉన్నాను. కొంతసేపు మా సంభాషణ బెంగాలీ గీతాల మాధుర్యం గురించీ, వాటిని అనువాదంలోకి తేలేకపోవడం గురించీ నడిచింది.

కాని ఆయన వెళ్ళిన తరువాత ఆ పుస్తకం తీసి చూద్దును కదా, అది నిజంగానే గొప్ప కానుక అనిపించింది. ఎందుకంటే, అది టాగోర్ ఇంగ్లీషు గీతాంజలికి బెంగాలీ మూలం కాదు. టాగోర్ బెంగాలీలో గీతాంజలి అనే పేరిట ఒక గీతసంపుటి 1910లో వెలువరించాడు. అందులో గీతాలు ఆయన 1906-10 మధ్యకాలంలో రాసినవి. అందులో అత్యధిక గీతాలు 1910లో మూడు నెలల వ్యవధిలో రాసినవి. ఆ గీతసంపుటిలో మొత్తం 157 గీతాలు ఉన్నాయి.

1912 లో టాగోర్ ఇంగ్లాండు వెళ్తున్నప్పుడు ఓడ ప్రయాణంలో తన గీతాల్ని ఇంగ్లిషులోకి అనువాదం చేసుకున్నప్పుడు బెంగాలీ గీతాంజలిలోంచి 53 గీతాల అనువాదాలు మాత్రమే ఇంగ్లిషు గీతాంజలిలోకి తీసుకున్నాడు. గీతాంజలిలోని మొత్తం 103 వచనకవితల్లోనూ 53 గీతాలు గీతాంజలినుంచే తీసుకోవడంతో ఆయన తన ఇంగ్లిషు పుస్తకానికి కూడా గీతాంజలి అనే పేరుపెట్టుకున్నాడు. దాంతో బెంగాలీ గీతాంజలి బెంగాల్ కి బయట పరిచయం కావలసినంతగా పరిచయం కాకుండా ఉండిపోయింది.

బెంగాలీ గీతాంజలిలోని 157 గీతాల్లో 53 గీతాలు ఇంగ్లిషు గీతాంజలిలోకి అనువదిస్తూ, టాగోర్ మరొక పన్నెండు గీతాల్ని కూడా ఇంగ్లిషులోకి అనువదించాడు. అవి The Gardener, The Fruit Gathering, Crossing, Poems అనే నాలుగు సంపుటాల్లో చేర్చాడు. అంటే మొత్తం 157 గీతాల్లో మనకి ఇప్పటిదాకా 65 మాత్రమే ఇంగ్లిషులో టాగోర్ అనువాదంలో లభ్యమవుతున్నాయన్నమాట.

ఇప్పుడు జో వింటర్ అనే ఈ అనువాదకుడు మొత్తం 157 గీతాల్నీ, బెంగాలీ గీతనిర్మాణానికి విధేయంగా ఇంగ్లిషులోకి అనువదించాడు. అంటే గీతాంజలి బెంగాలీ కావ్యం ఇప్పటికి పూర్తిగా ఇంగ్లిషులో లభ్యమవుతున్నదన్నమాట.

సురేష్ కొలిచాల నాకు టాగోర్ కవిత్వం కానుకగా ఇస్తున్నప్పుడు, ‘టాగోర్ గీతాంజలి వాల్ట్ విట్మన్ లాగా ఎన్ని ఎడిషన్లయినా, ఏ ప్రచురణకర్తలు ప్రచురించిందైనా ఇంట్లో పెట్టుకోవలసిందే’ అన్నాను నవ్వుతూ. కాని నాకు లభించింది అపూర్వమైన కానుక అని ఇప్పుడు ఈ పుస్తకం తెరిచాకనే అర్థమయింది.

బెంగాలీలో టాగోర్ వెలువరించిన గీతాంజలి నేపథ్యం చాలా విలువైనది. ఆయన 1902-07 మధ్యకాలంలో తన ఇద్దరు పిల్లల్నీ, భార్యనీ కూడా కోల్పోయాడు. 1884 లో తన వదినగారు కాదంబరీదేవి ఈ లోకం నుంచి అర్థాంతరంగా వెళ్ళిపోయిన ఆఘాతం నుంచి బయటపడకముందే తన భార్యనీ, పిల్లనీ పోగొట్టుకోవడం మామూలు విషాదం కాదు. ఆ శూన్యంలో ఆయన భగవంతుడి పదధ్వనిని వినడంలో ఆశ్చర్యం లేదు. కాని ఆ పాదాల్ని ఆయన గట్టిగా పట్టుకున్నాడు. 1905 లో బెంగాల్ విభజన సందర్భంగా తలెత్తిన నిరసన ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ ఆయన హృదయం అక్కడ లేదు. అది వికసిస్తున్న పద్మంలోనూ, రేవులో నవ్యపురుషుడు ఎవ్వరో వినిపిస్తున్న వీణావాదనంలోనూ, దారిమలుపులో కమ్ముకున్న బాబ్లా పూల పరిమళంలోనూ, సముద్రతీరాన ఆడుకుంటున్న చిన్నపిల్లల్లోనూ, అర్థరాత్రి అకస్మాత్తుగా తన ఇంటి తలుపు తట్టిన అతిథి అడుగుల చప్పుడులోనూ లీనమై ఉంది. జీవితం లో ఒకవైపు తలుపు మూసుకోగానే మరొకవైపు భగవంతుడి మందిరం వైపు తలుపు తెరుచుకోవడంలో, టాగోర్ జీవితానికి, ఇతర భారతీయ భక్తికవుల జీవితానికీ ఏమంత తేడా లేదు.

ఇప్పుడు ఈ గీతాలు ఆ రోజుల్ని, ఆ శూన్యప్రాంగణంలో వెలుగు రేఖలు పరుచుకున్న ఆ ప్రభాతాల్ని, ఆ సాయంత్రాల్ని నాకు దగ్గరగా తీసుకువచ్చాయి. రానున్న రోజుల్లో అప్పుడూ, అప్పుడూ ఈ గీతాల్ని తెరిచిచూడబోతున్నాను. నిజమే, తన బెంగాలీ గీతాల్లోని సంగీతాన్ని ఏమి చేసీ ఇంగ్లిషులోకి తేవడం అసాధ్యం అని టాగోర్ కి తెలుసు. గీతాంజలి గీతాల్ని ఆయన ఇంగ్లిషు వచనంలో కూర్చుకుంటున్నప్పుడు ‘మాటలనియెడు మంత్రమహిమ’ ఏదో ఆ ఇంగ్లిషు వచనానికి సిద్ధించింది. ఇక ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆ బెంగాలీ సంగీతాన్ని మరే భాషలోకీ తేజాలలేకపోయారు. ఆ ఇంగ్లిషుని ఎన్ని భాషల్లోకి అనువదించినా, ఎందరు ఎన్ని సార్లు అనువదించినా, ఆ మంత్రమహిమ ఆ ఇంగ్లిషుని దాటి ప్రవహించకుండా ఆపలేకపోయారు కూడా.

జో వింటర్ కి కూడా ఈ సంగతి తెలుసు. ఆయన ఇలా అంటున్నాడు : The voice the outside world came to know the Gitanjali by was magical, compelling. A more faithful rendering of the proms in itself offers no magic. (p.22)

అయినా ప్రాయికంగా కవిత్వం కాబట్టి, ఎంత బలహీనమైన అనువాదంలోనైనా ఆ బెంగాలీ మూలంలోని ఆర్తి, సంగీతం శ్రోతకి కొంతేనా చేరగలవన్న ఆశతో తానీ అనువాదానికి పూనుకున్నానని అతడు చెప్పుకున్నాడు.

అతడు చేసింది నిజంగా మంచిపని. నాలాంటి టాగోర్ ఆరాధకులకి అతడు ఎంత మంచి కానుక ఇచ్చాడో అతడికి తెలియకపోవచ్చు. భగవంతుడు తన జీవితంలో కొత్తగా, సరికొత్తగా అడుగుపెట్టినట్టే, టాగోర్ కూడా అడుగుపెడుతున్నాడు, నా జీవితంలో, ఎప్పటికప్పుడు కొత్తగా, సరికొత్తగా.

ఈ కవిత చూడండి (7), ఆ ఇంగ్లిషుకి నా తెలుగులో:

అడుగుపెట్టు నా జీవితంలో, కొత్తగా, సరి కొత్తగా

అడుగుపెట్టు నా జీవితంలో, కొత్తగా, సరి కొత్తగా
పరిమళంగా, రంగులుగా, గీతాలుగా.
అడుగుపెట్టు నా దేహంలో, అడుగుపెట్టు నా మనసులో.
నన్ను కంపింపచేసే ప్రతి పులకింతలోనూ అడుగుపెట్టు
సంతోషంలో, సమ్మోహపరిచే నిద్రలో, ప్రభూ
అడుగుపెట్టు నా జీవితంలో, కొత్తగా, సరికొత్తగా.

సుందరంగా, ప్రకాశభరితంగా, దయామయంగా
నిర్మలంగా, వైభవంగా, శాంతమయంగా
అపారంగా, అనంత వైవిధ్యంతో
సుఖంలో, దుఃఖంలో, హృదయాంతరంగంలో
నా దైనందిన కార్యకలాపమంతటిలోనూ
మా పనులన్నిటి సమాప్తక్షణంలోనూ
హే! అడుగుపెట్టు నా బతుకులో, కొత్తగా, సరికొత్తగా.

7-12-2022

6 Replies to “కొత్తగా, సరి కొత్తగా”

  1. జీవితపు ఆస్వాదన మీ నుంచి నేర్చుకోవాలి ..చక్కటి పరిచయం తో మనసుకు సరికొత్త దారులు వేస్తారు

      1. Sir..గీతాంజలి ప్రపంచానికి టాగోర్ ఇచ్చిన కానుక ఎవరికి వారు అనుభవించవలసిన ఆధ్యాత్మిక సౌరభం..మీ మాటల్లో మరొక్క సారి దాని సుగంధం పరిమళించింది.. ధన్యవాదాలు

Leave a Reply

%d bloggers like this: