పూలబాసలు

సాయంకాలం అవుతుండగానే పారిజాతం మొగ్గలు నెమ్మదిగా విచ్చుకోవడం మొదలుపెడుతున్నాయి. ఇప్పట్లో పూయదులే అని మేడ మీద పెట్టిన మొక్కని తీసుకొచ్చి బాల్కనీలో పెట్టాను. కాని వారం రోజులుగా తెల్లవారేటప్పటికి దాని చుట్టూ రాలిన పూలు నా హృదయాన్ని లయ తప్పిస్తున్నాయి. అయిదో అంతస్తులో ఉన్నామేమో మాకూ ఆకాశానికీ మధ్య ఏ అడ్డూ లేకపోవడంతో మార్గశిర చంద్రుడు పూర్తి ప్రభాసమానుడిగా సాక్షాత్కరిస్తున్నాడు. ప్రమోద్ బాల్కనీలో కూచుంటే చెప్పాను: పారిజాతం మొగ్గలు విచ్చుకుంటున్నప్పుడు ఏవేవో ఊసులు చెప్పడం మొదలుపెడుతుంది, విను అన్నాను. ఎందుకంటే, కవి ఎంకి గురించి చెప్పిన మంచిమాటలన్నిటిలోనూ నాకు చాలా ఇష్టమైన మాట ‘పూల బాసలు తెలుసు ఎంకికి ‘అన్నాడే, ఆ మాట. పూలమాటలు వినగలగడం ఈ జీవితంలో ఒక మనిషికి లభించగల భాగ్యాలన్నిటిలోనూ మహద్భాగ్యం.

పారిజాతాలు కవిత్వంతో నా స్నేహం అల్లుకున్న తొలిరోజుల్ని గుర్తుకు తెస్తాయి. అప్పుడు తాడికొండలో ఎనిమిదో తరగతి చదువుకుంటున్న రోజులు. మేము బి-డార్మిటరీలో ఉండేవాళ్ళం. తర్వాత రోజుల్లో దాన్ని టాగూర్ డార్మిటరీ అని కూడా పిలిచేవారు. ఆ డార్మిటరీ ఎదట ఒక పారిజాతం చెట్టు ఉండేది. మేము ఆ డార్మిటరీ అరుగుమీదనే చదువుకుంటూ అక్కడే పడుకునిపోయేవాళ్ళం. తెల్లవారి లేచేటప్పటికి మా ముందు చెట్టుకింద పారిజాతాలు పరుచుకుని ఉండేవి. ఇదీ అని చెప్పలేని అత్యంత ఆత్మీయ సూక్ష్మ సుమగంధమొకటి ఆ చెట్టు చుట్టూ, మా అరుగుమీదా, ఆ గాలిలోనూ, మా మనసుల్లోనూ కూడా ఆవరించి ఉండేది. ఆ రోజుల్లోనే మా స్కూలుకి హీరాలాల్ మాష్టారు వచ్చారు, సుగంధ ద్రవ్యాలు నింపుకున్న ఓడలాగా ఆయన దేశదేశాల కవిత్వాన్నీ తన వెంటపెట్టుకొచ్చారు. ఆయనదగ్గరే మొదటిసారి చూసాను ‘దీపావళి ‘కావ్యం. ఇక, ఆ పద్యాలూ, ఆ పారిజాతాలూ నా మనసులో అల్లిబిల్లిగా అల్లుకుపోయాయి.

భావకవిత్వం వైతాళికులు వల్ల పరిచయమైనా నేను మొదటిసారిగా పూర్తిగా విహరించిన భావకవితోద్యానం వేదుల కవిత్వమే. బహుశా ఆ కవిత్వంలో మరీ గాఢమైన అనుభూతి కాకుండా, శ్రోతని సత్వరమే సమ్మోహితుణ్ణి చేయగల పదలాలిత్యమో, నాదమాధుర్యమో ఉండటం వల్ల కాబోలు. ఆ తర్వాత కృష్ణశాస్త్రికి చేరువ కావడానికి ఎన్నేళ్ళు పట్టిందని! కాని వేదుల అనే పారిజాతాల తోటలో గడిపినందువల్లనేమో, మరే భావకవిని సమీపించడానికీ నాకు ఏమంత ప్రయాసగా తోచలేదు.

భావకవిత్వ యుగంలో కృష్ణశాస్త్రి తర్వాత వేదుల పేరే చెప్పేవారని విన్నాను. ముద్దుకృష్ణ వైతాళికుల్లో కృష్ణశాస్త్రికి ఇరవై ఖండకావ్యాలతో అగ్రతాంబూలం ఇచ్చాడు. కాని ఆ తర్వాత స్థానం ఎవరిదో ఇదమిత్థంగా తేల్చకుండా, విశ్వనాథవీ, వేదులవీ, నండూరి సుబ్బారావువీ పన్నెండు ఖండకావ్యాల చొప్పున ఏరిపెట్టాడు. నాయని సుబ్బారావుది కూడా ఆ తర్వాత స్థానమే, పదకొండు ఖండకావ్యాలు. కాని గమనించవలసిందేమంటే వేదులకి విశ్వనాథతో సమానస్థానం దక్కడం.

నా వరకూ నాకు అప్పుడు ఈ లెక్కలు తెలియవుగాని, వేదుల, కరుణశ్రీ- ఈ ఇద్దరి కవుల పద్యాలూ, నా చిన్నప్పుడు మా బామ్మగారి నోటవెంట విన్న పోతన పద్యాల్లాగా వినడానికీ, పదే పదే అనుకుంటూ ఉండటానికి ఎంతో హాయిగా ఉండేవి. ఆ తొలి కౌమార దశలో, ఇంటినుంచి దూరంగా ఉన్న నాకు, మా ఊళ్ళో ఆ వెన్నెల రాత్రులు గుర్తొచ్చినప్పుడల్లా చెప్పలేని బాధ గుండెని కోసేస్తున్నప్పుడు, వేదుల ఎంతో సన్నిహితంగా అనిపించేవాడు.

ఈ పద్యాలైతే ఎప్పుడూ నోట్లోనే నానుతుండేవి:

పవనపులకిత చంద్రాతపప్రసన్న
చారుశారదయామినీసమయమందు
వీథివీథుల మధురలో వెదకివెదకి
చేరుకొంటిని బృందావిహారు నిన్ను.

దూరముననుండి నీ మురళీరవమ్ము
హృదయమున సోకినంత మే నెల్ల మరచి
తిరుగుచుంటిని యమునానదీ వివిక్త
పులినసీమల వెఱ్ఱినైపోయి నేను.

రవికరోద్దీప్తహిమశీకరమ్మువోలె
రమ్యపింఛము చిత్రవర్ణములఁ దొలుక
శిరము నూపుచు మోవిపై మురళి నూని
యేది మరియొకమారు వాయింపు మోయి!

మంజులసుమామృతములోని మధురిమమ్ము
మధురచంద్రాతపములోని మార్దవమ్ము
మృదుసమీరమ్ములోని పరీమళమ్ము
కలవు గోపాల! నీ వేణుగానమందు.

ప్రకృతి పులకింప, యమునాస్రవంతి పొంగ
భావము చిగుర్పఁ, బిల్లనగ్రోవి నూది
పరవశం జేసి నన్ను, గోపాలకృష్ణ!
ప్రేమ తనివార నొకముద్దుఁ బెట్టుకొనుము.

ఆ పద్యాల్లో పారిజాతాల్లోని మకరందమంతా ఉందనిపించేది. ‘వీథివీథుల మధురలో వెదకి వెదకి చేరుకుంటిని బృందావిహారు నిన్ను ‘, ‘మోవిపై మురళి నూని యేది మరియొకమారు వాయింపు మోయి ‘ఈ వాక్యాలు నాకు నేనే వినిపించుకుంటూ ఉండేవాణ్ణి. ‘యేది హృదయేశ్వర మరియొకమారు, ఊదగదోయి, ఊదగదోయి..’కరుణశ్రీ రాసిన ఈ మాటలు కూడా.

ఇక ‘గోపాల కృష్ణ, ప్రేమ తనివార నొకముద్దు పెట్టుకొనుము ‘అనే పాదంలో ఆ గోపాలకృష్ణ అనే సంబోధన ఎలా ఉండేదంటే, ఆ గోపాలకృష్ణుడు నా ఎదటే ఉన్నట్టూ, నేనే ఆ మాటలు అంటున్నట్టూ ఉండేది.

చంద్రుణ్ణీ, వెన్నెలనీ భావకవులూ ఒక్కొక్కరూ ఒక్కోపద్ధతిలో చూసారు. ఎంకిపాటల్లో వెన్నెల- ఆ వెన్నెలని వివరించడానికి నా దగ్గర మాటల్లేవు. ‘ఎన్నెలంతా మేసి ఏరు నిదరోయింది అనే వాక్యంలోంచి నేనిప్పటికీ పైకి తేలలేదు. కృష్ణశాస్త్రి, నాయని ల వెన్నెల రాత్రుల్లో ఒక విషాదపు జీర ఉంటుంది. కాని పూర్తి వెలుగులో, పాలకడలిలాంటి వెన్నెలని చూసింది వేదుల మాత్రమే. మరీ ముఖ్యంగా, ‘సుధాకరా!’ అనే ఆ ఖండకావ్యం.ఆ పదకొండు పద్యాలూ, అర్థం కోసం చూడకండి, ఒకసారి మీలో మీరే బిగ్గరగా చదువుకోండి. నిండువెన్నెల్లో తడిసిపోతున్నట్టుగా అనిపించకపోతే, అది తెలుగు భాషా కాదు, అవి పద్యాలూ కావు. చూడండి:

ఓయి సుధాకరా! నిలువు మొక్క నిమేషము; నీ మహోదయ
చ్ఛాయలు సోకి నాయెడఁద సాగర మట్టులు పొంగుచున్న దే
వో యనుభూతజీవితసుఖోర్ము లపూర్వవిముగ్ధనాట్యముం
జేయుచుఁ బాడుచున్నవి వినిర్మలమోహనరాగగీతికల్‌

నా కిపు డీ ప్రపంచ మొక నందన మట్టులు నీ యనంతలో
కైకపవిత్రకాంతిసుధలందున విచ్చిన మూగసోయగం
బై కనుపట్టె! మానవులయాశలతో విధికిన్‌ నిరంతరా
నీకము సాగు నీ కటికినేల మనోజ్ఞత యింత నిల్చునే?

ఈయది మోదమో, యెడఁద నేర్చెడు ఖేదమొ, యంతలంతలై
పోయెడు మోహమో, తొలగిపోవని స్వప్నమొ, చెప్పలేని దే
దో యనుభూతి దివ్యపవనోర్మిపరీమళ మట్లు ముగ్ధునిం
జేయుచునుండె న న్నిపుడు నీ తెలికాంతులకౌగిలింతలన్‌

నీవొక యప్సరఃప్రణయనీ కబరీచ్యుత పారిజాతమా
లావిసరంబవో, మఱి యిలాతల మంట సుధాతుషార వ
ర్షావిమలావకుంఠనము జార్చుచుఁ బోవు శరద్విభావరీ
దేవి లలాటికామణివొ దీపికవో సురరాజ్యలక్ష్మికిన్‌

అలసటఁ జెందె దేమొ, యుదయాస్తమయమ్ములె జీవనమ్ముగా
దలచెడు మర్త్యపాళి కమృతప్రభలన్‌ వెదఁజల్లి; యింత సొం
పు లొలుకు వెన్నెలం గనులుమూయనిపేదలకై కృపారసం
బొలికెడు నీ సుధామురళి నూదుదువో భువనాలు సోలగన్‌

చిరవిరహైకవాసనలఁ జిమ్ము సుఖస్మృతు లేవొ పై పయిం
బొరలుచు, దుఃఖపుం గసటు వోవని యాశల మేలుకొల్ప, సుం
దరతర చంద్రికా పులకిత మ్మగు నింతటి తీయనైన రా
తిరి తెలవారి పోవక యిదే గతి నాకయి నిల్వరాదొకో!

ఓ యమృతాంశుమూర్తి! యెటకో పరువెత్తెదు వాయులీనమై
పోయెడు రాగరేఖవలె, మోయగరాని ప్రవాసదుఃఖమో
తీయని ప్రేమవేదనయొ, తీరని కోరికయో, యెదో యెదం
గోయునొ యేమొ రాల్చెద వనూనహిమాశ్రుకణాల నావలెన్‌

విరిసిన పూలవెన్నెలల వెల్లువఁ జక్కదనాల హంసవై
యరిగెడు నిన్నుఁ జూచు నిశలందున నాకగు బాష్పశాంతి నీ
వెరుఁగుదు; దుఃఖతాపముల కిల్లగు పాడుప్రపంచమం దెరుం
గరు కరుణైకముగ్ధుల యగాధహృదంతరబాష్పమాధురిన్‌

ప్రేమపిపాసచే నమృతవీథులఁ జేరిన యప్సరోంగనా
స్తోమసితావగుంఠనతతుల్‌ సుమి యీ తెలిమబ్బుదొంతరల్‌
నీ మృదుశయ్యలై సుధలు నిండిన నీ స్మితరోచిరూర్మికా
కోమలఫేనరాసులయి కూర్చెడు నాయెద కింతవేదనన్‌

నేను నిరంతరప్రళయనిష్ఠుర మీ బ్రదుకున్‌ భరింపఁగా
లేను, క్షుధాగ్ని నార్పుకొనలేక తపించెడు ప్రేమకాంక్ష యిం
తేని నశింప కుంట మరణింపఁగలే నిటు లే నిరోధముల్‌
లేని మహాప్రవాహము చలింపక నిల్చిన దొక్క నా యెడన్‌

ఆ మృదుచంద్రికా యవనికావృత నీలనభోనిశాంత శో
భామయసీమలం దమృతవాటుల స్వప్నపథాల నొక్క యీ
యామినిమాత్రమే తిరుగులాడెద నే జిఱుమబ్బువోలె, నీ
తో మనసార, నొక్కపరిఁ దోడ్కొనిపొ మ్మట కో సుధాకరా!

అది యేమి భాష! తెలుగు అక్షరాల ఐశ్వర్యాన్ని అంతలా కొల్లగోట్టుకున్న కవుల్ని ఆధునిక కవుల్లో వేళ్ళమీద మాత్రమే లెక్కపెట్టగలం. మరీ ముఖ్యంగా ఈ పద్యం:

ఓ యమృతాంశుమూర్తి! యెటకో పరువెత్తెదు వాయు లీనమై
పోయెడు రాగరేఖవలె, మోయగరాని ప్రవాసదుఃఖమో
తీయని ప్రేమవేదనయొ, తీరని కోరికయో, యెదో యెదం
గోయునొ యేమొ రాల్చెద వనూనహిమాశ్రుకణాల నావలెన్‌

(అమృతంలాంటి కిరణాలు రూపుదాల్చినవాడా! గాలిలో కలిసిపోయే ఒక రాగరేఖనో, మోయజాలని ప్రవాసదుఃఖమో, తీయని ప్రేమవేదననో, తీరని కోరికనో ఏదో నా హృదయాన్ని కోస్తున్నదా అన్నట్టుగా, నాకు లానే మంచుబిందువుల్ని కన్నీరుగా కారుస్తూ, ఎటో పయనమైపోతున్నావు)

ఇవాళ బాల్కనీలో నిలబడ్డప్పుడు విచ్చుకుంటున్న పారిజాతాలు ఈ పద్యమూ, ఆ చిన్నప్పటి పారిజాత సుమగంధమూ నా రక్తంలో కలిసిపోయాయని గుర్తుచేస్తున్నాయి.

6-12-2022

Image courtesy:  Gali Nasara Reddi

2 Replies to “పూలబాసలు”

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%