
ఇరవయ్యో ఏడు నాకు మళ్ళీ
ఎలా వస్తుంది చెప్పూ?
శ్రీశ్రీ
ఇవాళ తమ్ముడు పంపిన ఫోటో చూస్తుంటే
హేమంతచంద్రమా, మిత్రమా
నాకు అనిపించింది ఇదే:
ఇరవయ్యో ఏడు
నేను నిజంగా దాటిందెప్పుడని?
అప్పుడు ఆ చూపులు దేన్ని చూస్తున్నాయా
ఇప్పటికీ అటే చూస్తున్నాయి.
జీవితం పట్ల ఆ కుతూహలం ఇసుమంతైనా
చెదిరింది లేదు.
మధ్యలో ఎన్నో ఏళ్ళు గడిచాయి నిజమే,
ఎన్నో అనుభవాలు వరదలాగా
ముంచెత్తిపోయినమాటా నిజమే.
కానీ అవేవీ గుర్తులేవిప్పుడు,
గుర్తుకు రావడం లేదిప్పుడు.
ఇంకా నేను ఆ గోదావరి ఒడ్డునే ఉన్నట్టుంది,
నాలుగు కవితావాక్యాలు నెమరేసుకోడానికి
నలుగురి మిత్రుల కోసం
పరితపిస్తున్నట్టే ఉంది.
మాన్ సూన్ గాలి తిరగ్గానే
గోల్డ్ ఫ్లేక్ చిన్న సైజు సిగరెట్టు మీదకు
మనసుపోతూనే ఉంటుంది.
తెరచాప విప్పిన ఏ పడవని చూసినా
అవతలి ఒడ్డుమీంచి ఎవరో పిలుస్తున్నట్టే ఉంటుంది.
రసమయ కావ్యప్రపంచం ఎవరి దగ్గర ఉందని తెలిసినా
వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర కూచోవాలన్న కోరిక
అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది
ఇంకా చెప్పాలంటే మరింత బలంగా ఉంది.
మా ఊరిదగ్గర ఏటి ఒడ్డునో
గోదావరి గట్టుమీదనో
నలుగురు మిత్రుల్ని
కలుసుకోడానికి
సాయంకాలం ఎప్పుడవుతుందా
అని ఎదురుచూస్తున్నట్టే ఉంది.
ఆకాశంలో నువ్వు ఎప్పుడు కనబడ్డా
పాటలు పాడుకుందాం రమ్మని
ప్రతి ఇంటి తలుపూ తట్టాలనిపిస్తుంది.
నీతో మాట్లాడుతూనే ఉన్నానుగాని
ఇప్పటికీ ఆ అస్పష్ట స్వప్నసుందరికోసం
నా హృదయం నలుదిక్కులూ గాలిస్తూనే ఉంది.
నా ఉత్తరాలకి ఆమె జవాబు కోసం
పోస్ట్ మేన్ ఎప్పుడొస్తాడా అని
రోజూ ఎదురుచూస్తున్నట్టే ఉంది.
గుర్తుందా, ఆ నవంబరు రాత్రి
రెండెడ్ల బండిమీద ధాన్యం మూటలు గట్టుకుని
తాళ్ళపాలెం నుంచి ఇంటికి వచ్చిన రాత్రి
హేమంత చంద్రమా, మిత్రమా
నువ్వూ నేనూ కలిసి పయనించామే
ఆ ప్రయాణమింకా కొనసాగుతూనే ఉందనిపిస్తుంది.
ఈ ప్రపంచంలో ఈ అన్యాయం, ఈ అసమానతలు
ఉండకూడదనే ఆ అమాయికమైన కోర్కె
అప్పట్లానే ఇప్పుడూ
జ్వాలలాగా లోపల మండుతూనే ఉంది.
ఎన్ని చెప్పు,
ఈ ప్రపంచం ఇంతే, ఇలాగే ఉంటుందని
ఇన్నేళ్ళయినా, ఎందుకో, ఇంకా సరిపెట్టుకోలేనితనం
అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది.
ఈ ప్రపంచం మారాలనీ, మార్చాలనీ
ఆ మాటలేవీ నాకు చాతకాదు గానీ
అప్పుడూ, ఇప్పుడూ నాకెందుకనో-
నలుగురు మనుషులు కలిసినప్పుడల్లా
ఒక కుటుంబం కలుసుకున్నట్టుగా ఉండాలనిపిస్తుంది.
5-12-2022
“అప్పుడూ, ఇప్పుడూ నాకెందుకనో-
నలుగురు మనుషులు కలిసినప్పుడల్లా
ఒక కుటుంబం కలుసుకున్నట్టుగా ఉండాలనిపిస్తుంది.”
అద్భుతం. ఇలా అనడం అంత తేలిక కాదు. ధన్యోస్మి.
Thank you very much for your response.
రసవాహిని లో తడిసి ముద్దయినట్టుంది sir
Thank you very much!
ఎంతో బావుంది…. మీరు చెప్పిన చివరి వాక్యాలు .. మదినిండుగా వెన్నెలను నింపింది… Thank you
ధన్యవాదాలు మరీ మరీ.
నన్ను నేను చదివినట్టు ఉంది . Superb expression
ధన్యవాదాలు సుజాత గారూ!