ఒక ఆంతరంగిక సమాధానం

Reading Time: 8 minutes

వైకుంఠవాసి కవిభూషణ కప్పగల్లు సంజీవమూర్తిరావుగారు రాసిన ‘శ్రీ గీతాసుధాసారము’ నా చేతికి వచ్చి ఏడాది పైనే గడిచింది. ఆయన శిష్యులూ, నా మీద అపారమైన అభిమానాన్ని వర్షించే శ్రీ జోళదరాశి చంద్రశేఖరరెడ్డిగారు ఈ పుస్తకానికి నన్నొక ముందుమాట రాయమని అడిగారు. కాని నేనా సాహసం చేయలేకపోయాను. అందుకొక కారణముంది.

ముఫ్ఫైఏళ్ళ కిందటి మాట. రాజమండ్రిలో ఒక ఆధ్యాత్మికసమాజం వారెవరో భగవద్గీత మీద ప్రసంగించమని శ్రీ ఆర్.ఎస్.సుదర్శనంగారినీ, శ్రీ మల్లంపల్లి శరభయ్యగారినీ అడిగారు. ఒక సాయంకాల సమావేశం. సుదర్శనంగారు సహజంగానే అద్వైతి కాబట్టి భగవద్గీతలోని తాత్త్వికాంశాల్ని వివరిస్తూ,ఆ గ్రంథం భారతీయచింతనమీద చూపించిన ప్రభావాన్ని విశదీకరిస్తూ చక్కటి ప్రసంగం చేసారు. ఇక, మహనీయుడైన సాహితీవేత్తగా శరభయ్యగారు భగవద్గీత మీద ఏం మాట్లాడతారా అని మేమంతా ఎదురుచూసాం. కాని మాష్టారు చాలా క్లుప్తంగా ‘భగవద్గీత అనుష్ఠించవలసిన విషయంతప్ప ప్రసంగించవలసిన విషయం కాద’ని ఊరుకున్నారు.

ఆ మాటలు నన్ను ఇన్నాళ్ళూ వెంటాడేయి, బహుశా జీవితమంతా వెన్నాడుతూనే ఉంటాయి. అయినా, ఈ పుస్తకానికి ముందుమాట రాయడానికి సాహసించడానికి ఒక కారణముంది. నేను తాడికొండ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు మాకు సాయంకాల ప్రార్థనా సమావేశాలు జరిగేవి. అందులో వివిధమతాల ప్రార్థనలతోపాటు శ్లోకాలు, స్తోత్రాలు కూడా చదివించేవారు. పూర్వకాలపు గురుకులాల్లో ఉండివుంటారని ఊహించదగ్గ ఋషీశ్వరుడిలాంటి ఉపాధ్యాయుడొకాయన, ఆయన పేరు నరసింగరావు, మాతో సాంఖ్యయోగంలోని స్థితప్రజ్ఞ లక్షణాల్ని వివరించే శ్లోకాలన్నీకంఠస్థం చేయించారు. లోకమెలా ఉంటుందో, మంచిచెడులేవో తెలియని ఆ పసివయసులో ఆయన నేర్పించిన ఆ శ్లోకాలు నాలోపలకి ఇంకిపోయాయనుకుంటాను. ఆ తరువాత జీవితంలో నేను వాటిని అనుష్టించగలిగానని చెప్పలేను. కాని స్థితప్రజ్ఞుడి గురించిన ఒక అపురూపచిత్రమైతే నా మనసులో నాటుకుపోయింది.అది నా భావదిగంతం మీద ఒక కొండగుర్తుగా నిలిచిపోయింది. ఈ లోకంలో నేను కూరుకుపోకుండా, ఇక్కడి శక్తులకీ, వస్తువులకీ బానిసని కాకుండా ఉండగలిగానంటే, ఈ సముద్రం ఒడ్డున ఒక పడవలాగా ఆ శ్లోకసారాంశం నా మనసులో నిలిచిపోవడమే కారణమనుకుంటాను.

ఆ తరువాత గ్రాడ్యుయేషన్ రోజుల్లో భగవద్గీత ఆసాంతం చదివాను. శంకరభాష్యం, తిలక్ గీతారహస్యం, వివేకానంద వివరణలతో పాటు అనాసక్తి యోగం పేరిట గాంధీజీ ప్రసంగాలు కూడా చదివాను. కానీ ఆ నా పసితనంలో నాతో కంఠస్థం చేయించిన స్థితప్రజ్ఞ శ్లోకాలు నామీద వేసిన ముద్రల్ని ఆ వ్యాఖ్యానాలేవీ మరపించలేకపోయాయి. కానీ, ఒకసారి రాజమండ్రిలో సుదర్శనంగారితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన ‘చూడు విచిత్రం, భగవద్గీత స్థితప్రజ్ఞుడి బాహ్యలక్షణాల్ని వివరించింది. మనవాళ్ళు అ బాహ్యలక్షణాల్ని అనుకరిస్తే మనం స్థితప్రజ్ఞులమై పోతామనుకుంటారు. ఇంతకన్నా హాస్యాస్పదమైన విషయం మరొకటుండదు. స్థితప్రజ్ఞత ఒక ఆంతరంగిక సమాధానం. సాక్షాత్కారం. అదెలా పొందాలో గీత తక్కిన అధ్యాయాలంతటా వివరించింది. ఆ మార్గాన్ని అర్థం చేసుకోకుండా, సాధన చెయ్యకుండా కేవలం బాహ్యలక్షణాల్ని అనుకరిస్తే ఆ స్థితప్రజ్ఞత ఎలా సాధ్యమవుతుంది చెప్పు?’ అనడిగారు. ఆ మాట నాకొక గొప్ప మెలకువ. గీత ఒక సమగ్ర రచన అనీ, అందులో ఉన్నదంతా సాకల్యంగా అర్థం చేసుకుని అనుష్ఠిస్తే తప్ప ఆ రచనాపరమార్థం నెరవేరదనీ గ్రహించాను.

2

కాని మన సమాజంలో భగవద్గీత మీద ప్రసంగించడానికి వెనుకాడని వక్త లేడు. గత ఇరవయ్యేళ్ళుగా భగవద్గీత మీద మాట్లాడని స్వామిలేడు. చివరికి అదొక మానేజిమెంటు గ్రంథంగానూ, వ్యక్తిత్వ వికాసవాచకంగానూ కూడా మారిపోయింది. గీతాచార్యుడైన యోగేశ్వర కృష్ణుణ్ణి ‘కృష్ణ, సి.యి.ఓ’ గా అంగడిలో అమ్మకానికి నిలబెట్టారు.అయితే విన్నదాన్ని తిరిగి మననం చేసుకుని అనుష్టించాలనుకునే శ్రోత కూడా లేడు.

భారతదేశంలో భగవద్గీత చరిత్రని పరిశీలిస్తే కొన్ని అంశాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. గీతారచనాకాలం ఇతమిత్థంగా తేల్చగలిగిందికాకపోయినప్పటికీ, అది క్రీ.పూ 5 వ శతాబ్దం నుంచి క్రీ.శ.2 వశతాబ్దందాకా పరిణామానికి గురవుతూనే ఉందనుకుంటే, దాని గురించి ప్రముఖంగా మాట్లాడిన మొదటివ్యక్తి శంకరాచార్యులు మాత్రమే. అంతకుముందు కాళిదాసు, బాణభట్టు, భాసుడు గీత గురించి ప్రస్తావించారని చెప్తున్నప్పటికీ, ఆ ప్రస్తావనలు స్పష్టమైనవీ, గీతప్రాముఖ్యానికి తగినవీ కావు. చీనా యాత్రీకుడు హ్యుయన్ త్సాంగ్ ‘సి-యు-కి’ లో చేసిన ప్రస్తావన గీత గురించిన స్పష్టమైనప్రస్తావనల్లో మొదటిది. ఆ తరువాత శంకరాచార్యులు భాష్యం రాసేదాకా, అంటే క్రీ.శ. 8-9 శతాబ్దాలదాకా, ఇంత ముఖ్యమైన గ్రంథంగురించి భారతీయ వాజ్మయం, సాహిత్యం ఎందుకు మౌనం వహించాయన్నదొక ప్రశ్న. ఆ మౌనాన్ని వివరించలేక కొందరు శంకరాచార్యుణ్ణే గీతాకారుడిగా భావించకపోలేదు కూడా.

క్రీ.పూ. 5 వ శతాబ్దం నుంచి శంకరాచార్యుల భాష్యకాలందాకా గీతాచరిత్రలో మొదటిదశ అని చెప్పవచ్చు. ఆ దశలో గీత అజ్ఞాతరచననుంచి అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక గ్రంథంగా ఎదిగింది.ఇక శంకరాచార్యుల భాష్యకాలం నుంచి 1785 దాకా గీత చరిత్రలో రెండవ దశ అని చెప్పవచ్చు. ఈ కాలమంతటా గీత పండితులు, తత్త్వవేత్తలు మాత్రమే అధ్యయనం చేసే గ్రంథంగా మిగిలిపోయింది. అందుకు ఒక్క మినహాయింపు 13 వ శతాబ్దానికి చెందిన మహారాష్ట్ర సాధుపురుషుడు జ్ఞానేశ్వర్ ప్రజలభాషలో రాసిన జ్ఞానేశ్వరి. కాని విశాలభారతదేశంలో సుమారు వెయ్యేళ్ళపాటు గీత ఆధ్యాత్మిక గ్రంథంగా, కొంతమంది శిష్టపురుషులకీ, ముముక్షువులకీ మాత్రమే పరిమితమైన గ్రంథంగా ఉండిపోయినదనడంలో అతిశయోక్తిలేదు. అది కూడా అద్వైత తాత్త్వికులకి సంబంధించిన అధ్యయనాంశంగానే గుర్తింపు పొందింది. శంకరుల తరువాత, రామానుజులు, మధ్వాచార్యులు, నింబార్కులు, వల్లభాచార్యులు వంటి ఆచార్యులు దానిమీద భాష్యాలు రాస్తూ వచ్చారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలతో కలిసి భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా ప్రతి ఆచార్యుడికీ ఒక జీవితకాల ఆధ్యయనాంశంగా గుర్తింపు పొందింది.

1785 లో ఛార్లెస్ విల్కిన్స్ అనే ఆంగ్లేయుడు భగవద్గీతని ఇంగ్లీషులోకి అనువదించడంతో గీతా చరిత్రలో మూడవ దశ మొదలయ్యింది. ఆ ఇంగ్లీషు అనువాదాన్ని ష్లీగెల్ అనే జర్మన్ రచయిత 1823లో లాటిన్ లోకి అనువదించాడు. అ తరువాత 1855 లో థాంప్సన్ అనేవాడు మరొక మెరుగైన ఇంగ్లీషు అనువాదం తీసుకొచ్చాడు. 1875లో’ సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ద ఈస్ట్’ సంపుటాలకోసం కె.టి.తెలంగ్ గీతను ఇంగ్లీషులోకి అనువదించిన మొదటి భారతీయుడిగా గురింపు పొందాడు. అయితే సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ 1885 లో గీతని ‘ ద సాంగ్ సెలెస్టియల్’ పేరిట ఇంగ్లీషులోకి అనువదించడంతో అది ఒక మోహన దాస్ గాంధిని మహాత్మాగాంధిగా మార్చిన పుస్తకంగా చరిత్రలో మిగిలిపోయింది.

19, 20 వ శతాబ్దాల్లో భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథం స్థాయినుంచి రాజకీయగ్రంథంగా మారడం మొదలుపెట్టింది. భారతజాతీయోద్యమకాలంలో హింసాత్మకంగానూ, అహింసాత్మకంగానూ కూడా బ్రిటిష్ వారితో పోరాడాలనుకున్నవారికెంతమందికో గీత ఆరాధ్యగ్రంథంగా, స్ఫూర్తిగా, ఉత్తేజకారకంగా కనిపించడం మొదలుపెట్టింది. విప్లవకారుడు ఖుదీరాం బోసు గీతను హృదయానికి హత్తుకుని ఉరికంబానికెక్కినప్పుడు భగవద్గీత రాజకీయవిముక్తి చిహ్నంగా మారిపోయింది. దయానందులు, బంకించంద్రుడు, వివేకానందుడు, లోకమాన్య బాలగంగాధర తిలక్, అరవిందులు, మహాత్మాగాంధీ వంటి మహనీయులైన సంస్కర్తలు, స్వాతంత్య్రోద్యమ నాయకులు గీతమీద ప్రసంగాలు, భాష్యాలు రాయడంతో గీత భారతీయ సామాజిక-రాజకీయ జీవితానికి సంబంధించిన ముఖ్యగ్రంథంగా రూపొందడం మొదలుపెట్టింది.20 వ శతాబ్దంలో రాధాకృష్ణన్, సురేంద్రనాథ్ దాస్ గుప్తా, యదునాథ సిన్హా వంటి తత్త్వశాస్త్ర ఆచార్యులు గీతగురించి ఎంతో మౌలికమైన పరిశోధన చేసారు. అయితే, దామోదర ధర్మానంద్ కోశాంబి, దేవీ ప్రసాద్ ఛటోపాధ్యాయ, అంబేద్కర్ వంటి వారు గీతపైన సామాజికకోణం నుంచి చేసిన విమర్శతో గత యాభయ్యేళ్ళుగా గీతని సామాజికశాస్త్రదృష్ట్యా అధ్యయనం చేయడం మొదలయ్యింది.

అయితే ఈ మూడు దశల్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, గీత తన మొదటివెయ్యేళ్ళ ప్రయాణంలో ఒక సుస్పష్టతను సాధించే దిశగా ఎదిగిందని అర్థమవుతుంది. రెండవ దశలో అద్వైత భాష్యకారులచేతుల్లో గీత తన మౌలిక సమగ్రతను కొద్దికొద్దిగా పోగొట్టుకోవడం మొదలయ్యిందని చెప్పవచ్చు. అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత శాఖలకు చెందిన గొప్ప ఆచార్యులంతా గీతని తమ భావాలకు అనుగుణంగా వ్యాఖ్యానించడం వల్ల గీత వేదాంత గ్రంథంగానూ, అందులో మళ్ళా వివిధశాఖలకు మాత్రమే చెందిన అధ్యయన గ్రంథంగానూ పరిమితమైపోతూవచ్చింది. ఇక గత రెండువందల యాభయ్యేళ్ళుగా రాజకీయనాయకులూ, సామాజికవేత్తలూ, ఆధ్యాత్మికగురువులూ, మానేజిమెంటు పండితులూ,-ఇలా ప్రతి ఒక్క రంగానికి చెందినవారూ గీతమీద వ్యాఖ్యానానికి పూనుకోవడంతో నిజమైన గీతాసారమేదనే అంశం మీద ఎన్నడూలేనంత గందరగోళం నేడు నెలకొందని చెప్పడానికి సందేహించనక్కర్లేదు.

3

ఆ మాటకొస్తే మనం చదువుతున్నది అసలైన భగవద్గీతనేనా అనే సందేహం కూడా చాలామందికి కలిగింది. అసలు గీతకీ, మహాభారతానికీ సంబంధం లేదనీ, దాన్నెవరో మహాభారతం భీష్మపర్వంలో 23-40 అధ్యాయాలుగా చొప్పించారనీ కూడా అభిప్రాయం బలపడుతూ వచ్చింది. యుద్ధభూమిలో అర్జునుడికి విషాదం కలిగినప్పుడు దాన్ని నివృత్తి చేయడానికి శ్రీకృష్ణుడు 700 శ్లోకాలు చెప్పవలసిన పనిలేదనీ, ఆ సమయంలో చేసిన గీతాబోధని మనం 2:31-38 శ్లోకాలతో సరిపెట్టవచ్చునని రాధాకృష్ణన్ వంటివాడే అభిప్రాయపడ్డాడు. ప్రముఖ ఓరియెంటలిస్టు హెర్మన్ జాకోబి గీతాశ్లోకాలు 2:1-12, 18, 25-27, 30-37, 18:73 మాత్రమే అసలైన భగవద్గీతగా భావించవచ్చన్నాడు.

ఇటువంటి ఆలోచనల ప్రోద్బలంతో డా.గజానన్ శ్రీపత్ ఖేర్ అనే మహారాష్ట్ర సంస్కృతపండితుడు ఒకాయన The Quest for Original Gita (1969) అనే రచన వెలువరించాడు. ఇంకా అంతగా ప్రాచుర్యం పొందని ఈ రచనలో ఆయన గీతకర్త ఒకరుకారనీ, కనీసం ముగ్గురనీ ప్రతిపాదించాడు. మొదటి గీతాకర్త బుద్ధుడికాలానికి ముందు అంటే క్రీ.పూ 6 వ శతాబ్దానికి చెందిన వాడనీ, అతడు గీతలోని 1-6 అధ్యాయాలను రచించాడనీ, దాన్ని ప్రధానంగా పండితుల్నీ, ధీరుల్నీ, తత్త్వదర్శుల్నీ దృష్టిలో పెట్టుకుని రాసాడనీ, దాని ముఖ్యసారాంశం సన్న్యాసమూ, కర్మయోగమూ అనీ ఆయన ప్రతిపాదన. ఇక రెండవ కర్త బుద్దుడిసమకాలికుడనీ అతడు గీతలోని 8, 13-15, 17 వ అధ్యాయాలూ, 18 వ అధ్యాయం కొంతభాగం రాసాడనీ, ఆ రచయిత జ్ఞానుల్నీ,మునుల్నీ, యతుల్నీ, యోగుల్నీ దృష్టిలో పెట్టుకుని రాసాడనీ, అతడి ఉద్దేశ్యంలో కర్మ-జ్ఞాన సమన్వయం, సాత్వికత ముఖ్యాంశాలనీ ఖేర్ ప్రతిపాదన. ఇక గీతని మనం ఇప్పుడు చదువుతున్న రీతిలో పరిష్కరించిన మూడవ రచయిత, క్రీ.శ.2వ శతాబ్దానికి చెందినవాడనీ, అతడి ఉద్దేశ్యం బౌద్ధానికి వ్యతిరేకంగా బ్రాహ్మణవాదాన్ని ప్రతిష్టించడమనీ, అతడు గీతలోని 7, 9-16 అధ్యాయాలతో పాటు చాలాచోట్ల తన భావాల్ని చొప్పించాడనీ, తద్వారా గీతనొక భక్తిప్రతిపాదక గ్రంథంగా ప్రతిపాదించాలనుకున్నాడనీ ఖేర్ ప్రతిపాదన. దాదాపుగా ఈ అంశాల్నే సమర్థిస్తూ ఇటీవలనే మేఘనాథ్ దేశాయి అనే రచయిత Who Wrote the Bhagavadgita? (2014) అనే పుస్తకం తీసుకొచ్చాడు.

భగవద్గీత లో మూడు పాయలున్నాయనేది మొదటినుంచీ చాలామంది ఒక ఊహ చేస్తూ వచ్చారు. వారిలో మొదటి వ్యాఖ్యాత ప్రసిద్ధ విశిష్టాద్వైతి యామునాచార్యులు. ఆయన గీత మొదటి ఆరు అధ్యాయాల్లోనూ కర్మ-జ్ఞాన సమన్వయం గురించి ఉందనీ, మధ్యలోని ఆరు అధ్యాయాల్లో భక్తియోగం గురించి ఉందనీ, మొదటి పన్నెండు అధ్యాయాల్లోనూ చెప్పకుండా వదిలిపెట్టినవాటిగురించి చివరి ఆరు అధ్యాయాల్లోనూ చెప్పబడిందనీ తన గీతార్థ సంగ్రహంలో ప్రస్తావించారు. పాల్ డుస్సెన్ దీన్నే కొంత మార్చి మొదటి ఆరు అధ్యాయాల్లోనూ నీతిశాస్త్రమూ, మధ్య ఆరు ఆధ్యాయాల్లో తత్త్వశాస్త్రమూ, చివరి ఆరు అధ్యాయాల్లో మనస్తత్వశాస్త్రమూ ఉన్నాయన్నాడు. మరికొందరు వ్యాఖ్యాతలు మరింత భావగర్భితంగా గీత మొదటి ఆరు అధ్యాయాలూ ‘ఓం’ గురించీ, మధ్యలో ఆరు అధ్యాయాలూ ‘తత్’ గురించీ, చివరి ఆరు అధ్యాయాలూ ‘సత్’ గురించీ వివరిస్తున్నాయన్నారు.

అసలైన గీత ఏదనే అన్వేషణ ఒకటైతే, ఇంతకీ గీత ఏం చెప్పిందనేది మరొక సుదీర్ఘాన్వేషణ. గీతలో కర్మ సన్న్యాసమూ, జ్ఞాననిరూపణా ఉన్నాయని శంకరులు భావిస్తే, భక్తి ప్రధానంగా ఉందని విశిష్టాద్వైతులూ,ద్వైతులూ వాదించారు. అందులో అనాసక్తి ప్రధానవిషయమని గాంధీజీ భావిస్తే, స్వధర్మం గురించి నొక్కిచెప్పిందని అరవిందులు వాదించారు. షోపెన్ హోవర్, ఎమర్సన్, థోరో మొదలుకుని ఇలియట్ దాకా పాశ్చాత్య తత్త్వవేత్తలూ, కవులూ గీతని చదవగానే భౌతికప్రపంచాన్ని దాటి చూడగల మహిమాన్విత దర్శనమేదో తమకు సిద్ధించిందని పరవశించిపోయారు.

ఇక గీత గురించి తమ అత్యాధునిక ఆశ్రమాల్లో రోజూ ప్రవచించే స్వాములూ, టెలివిజన్ లో ప్రసంగాలు చేసే వ్యాఖ్యాతలూ తమకు తెలిసిన పరిభాషనంతా యథేచ్ఛగా వాడుతున్నందువల్ల మనలో ప్రతి ఒక్కరూ గీతాసారాంశం తమకి తెలిసిందేనననీ, కొత్తగా తెలుసుకోవలసిందేమీలేదనీ భావిస్తూ ఉన్నారు. కొద్దిపాటి పరిజ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరూ ‘కర్మణ్యేవాధికారస్తే’ శ్లోకం అప్పచెప్పి గీతాసారాంశం నిష్కామకర్మ తప్ప మరేమీ కాదని కూడా చెప్పేస్తారు. కాని నిజంగా గీత అంతా ఇంతేనా?

4

గీతని ప్రస్తుతించేవాళ్ళు, అందులో వివిధ ధర్మాల సమన్వయముందనే ప్రస్తుతిస్తున్నారు. విమర్శించేవాళ్ళు కూడా సరిగ్గా ఆ కారణం మీదనే, అంటే, గీతలో వివిధధర్మాల వివరణ ఉందిగాని, గీతాకారుడు ఆ ధర్మాలన్నిటినీ తనకై తాను సరిగ్గా సమన్వయించుకోలేకపోయాడని విమర్శిస్తున్నారు. నిజంగా గీతాకారుడు తనకై తాను సమన్వయం సాధించుకోగలిగాడా లేదా అనేది ఎవరికి వారు అధ్యయనం చేసి తెలుసుకోవలసిన విషయం. ఆ అధ్యయనం కూడా కొన్నాళ్ళో, కొన్ని నెలలో చేసేది కాదు. అది బహుశా మా మాష్టారు అన్నట్లుగా అనుష్ఠానపూర్వక అధ్యయనం కావాలి. గీతా పరిభాష కొంత అధ్యయనం వల్ల బోధపడుతుంది. కొంత అనుష్ఠానం వల్ల బోధపడుతుంది.

ఉదాహరణకి గీతని యోగగ్రంథంగా, సాంఖ్యరచనగా, వేదాంతసూత్రంగా భావించడం సర్వసాధారణం. కాని గీత మాట్లాడిన యోగానికీ, పతంజలి యోగసూత్రాలకీ సంబంధం లేదనీ, గీతలో ఉన్న సాంఖ్యానికీ, ఈశ్వరకృష్ణ సాంఖ్యకారికలకీసంబంధం లేదనీ, గీతలో ఉందని వేదాంతులు భావించిన వేదాంతం కేవలం వారి భాష్యం మాత్రమేననీ సురేంద్రనాథ్ దాస్ గుప్తా ఎంతో సహేతుకంగా వివరించాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆయన రచించిన The History of Indian Philosophy (1991) రెండవసంపుటం చూడవచ్చు. అంతేకాదు, గీత బౌద్ధంవల్ల ప్రభావితమైందనీ, స్థితప్రజ్ఞ శ్లోకాలు బౌద్ధ విజ్ఞానాన్ని సంస్కృతీకరించడమేనననీ కోశాంబి మొదలైనవారంతా చేసిన వాదనలో నిజమెంతో తెలుసుకోవాలనుకునేవాళ్ళు కూడా దాస్ గుప్తా రచన చదివితీరాలి. గీతకి ముగ్గురు రచయితలున్నారనీ, మూడవ రచయిత బౌద్ధంతో బ్రాహ్మణవాదం తలపడుతున్న రోజుల్లో భక్తిని ప్రధానంగా చేసుకుని గీతను పునః పరిష్కరించాడని భావించిన డా.ఖేర్ ఆ మూడవ రచయిత గీతలో ‘నారాయణ’ పదాన్ని ఎక్కడా ఎందుకు చొప్పించలేదో కూడా ఆలోచించిఉండవలసింది. గీత గుప్తులకాలం నాటికి పూర్తి స్వరూపం పొందిందని వాదించేవారు, ఒకవైపు గుప్తులు విష్ణువుకి ఆలయాలు నిర్మిస్తుండగా గీత విష్ణుస్తుతి ఎందుకు చెయ్యలేదో కూడా ఆలోచించాలి. విష్ణువు గురించి గీత మౌనం వహించినందువల్లనే భారతం మరొక చోట ‘విష్ణుసహస్రనామగానం’ చేసిందనీ, గీతలో ఎక్కడా నారాయణ శబ్దం కనిపించనందువల్లనే, మహాభారతం ‘నారాయణీయం’ పేరిట ప్రత్యేక అధ్యాయాలు కేటాయించవలసివచ్చిందనీ మనం గుర్తుపెట్టుకోవాలి.

అంతేకాదు, అన్నిటికన్నా ముఖ్యంగా అంతర్గత సాక్ష్యమంటూ ఒకటుంటుంది. మనకు తెలిసినంతవరకూ పాణిని కాలం విశ్వసనీయంగా క్రీ.పూ 4వ శతాబ్దమని భావిస్తే, గీతలో ఎన్నో పదప్రయోగాలు వ్యాకరణరీత్యా అపాణినీయాలున్నాయని దాస్ గుప్తా పేర్కొన్నాడు. ఆయన అపాణినీయ ప్రయోగాలుగా పేర్కొన్నవన్నీ దాదాపుగా ఖేర్ మూడవ గీతాకర్తగా పేర్కొన్న రచయిత రాసాడని భావిస్తున్న శ్లోకాల్లోనే కనవస్తున్నాయి. అంటే వ్యాకరణరీత్యా ఆ రచయిత క్రీ.పూ 4వ శతాబ్దానికి చెందినవాడుగానూ, భావజాలం ప్రకారం క్రీ.శ 2వ శతాబ్దానికి చెందినవాడుగానూ ఉండాలన్నమాట!

నాకై నేను గీతని ఏ వ్యాఖ్యానం సహాయం లేకుండా ఒక సాధారణమైన మనిషిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఒక పాశ్చాత్యుడు ఇంగ్లీషులో గీతని చదివినట్టుగా తెలుగు అనువాదాల్లో గీతని చదివిచూసాను. ప్రతి పదం వెనకా, యుగాలుగా పోగుపడ్డ రూఢ్యర్థాన్ని బద్దలుగొట్టి, ఆ పదాన్ని మొదటిసారి వింటున్నట్టుగా భావించి, అలా వింటున్నప్పుడు అది నాకెటువంటి సంకేతాల్ని అందిస్తున్నదో గ్రహించడానికి ప్రయత్నించాను.

అత్యంత సాధారణ శ్రోతగా గీతని సమీపించినప్పుడు అందులో నాకు మూడు ముఖ్యాంశాలు కనిపించాయి. మొదటిది, గీత ఉపనిషత్తుల తరహాలోనే శాశ్వతమైన, అవ్యయమైన , అవినాశి అయిన ఆత్మ పదార్థమంటూ ఒకటుందని పదేపదే చెప్తుండటం. మన పనులవల్లా, భావాలవల్లా ఆ సనాతన పదార్థం ఏ విధంగానూ ప్రభావితం కాదన్నప్పుడు, మనకి సహజంగానే ఏ పని పట్లా బుద్ధిపుట్టదు. మనకి కర్మ పట్ల విముఖత కలుగుతుంది. కాని గీతలో నాకు కనబడ్డ రెండవ అంశం, మనం కర్మలనుంచి తప్పించుకోలేమన్నది. మనం గుణాలవల్ల రూపొందాం కాబట్టి, గుణాలున్నంతకాలం కర్మ చెయ్యకుండా తప్పించుకోలేమని గీత చెప్తున్నది. అయితే కర్మనుంచి తప్పించుకోలేం కాబట్టి, ఏదో ఒక కర్మ చేస్తూ ఉండటం కన్నా ఉన్నతమైన కర్మచెయ్యడం మీద దృష్టిపెట్టడం మంచిదనేది గీత అభిప్రాయం. ఏది ఉన్నతకర్మ అంటే, ఏది సాత్త్విక కర్మనో, ఏది మనని కిందకు దిగలాగకుండా పైకి నడిపిస్తుందో అది ఉన్నత కర్మ అంటుంది గీత. అయితే కిందకు దిగలాగడమంటే ఏమిటి, పైకి నడిపించడమంటే ఏమిటనే ప్రశ్న వస్తుంది. అందుకు జవాబుగా కర్మ ఫలితం పట్ల ఆసక్తి కిందకు లాగుతుందనీ, ఆసక్తిని వదిలిపెట్టి చేసే కర్మ పైకి నడిపిస్తుందనీ గీత ఎంతో విశ్వసనీయంగా వాదిస్తుంది. చివరకు సన్న్యాసం కూడా ఏదో ఫలితాన్ని ఉద్దేశించి చేసేదే కాబట్టి అది కూడా కిందకు దిగలాగే కర్మలాంటిదేనని, ఒక త్యాగం మాత్రమే పైకి నడిపించే కర్మ అనీ గీత చెప్తుంది. ‘త్యాగేనైకేనేవ అమృతత్త్వమానశుః’ అని ఉపనిషత్తులు ఈ మాటే చెప్పినప్పటికీ, తాము చూసిన సత్యాన్ని అవి గీతలాగా తార్కికంగా ప్రతిపాదించలేకపోయాయి.

అనాసక్తితో కర్మలు చెయ్యడం కర్మయోగం మాత్రమే కాదు, అక్కడ అనాసక్తి అనే జ్ఞానం ప్రధానం కాబట్టి, అది జ్ఞానయోగం కూడా. కాని కేవలం కర్మయోగం, కేవలం జ్ఞానయోగం అత్యధికప్రజానీకానికి అర్థమయ్యే విషయంకాదనే ఎరుక గీతలోని మూడవముఖ్యాంశానికి ప్రాతిపదిక. అది సర్వధర్మాల్నీ వదిలిపెట్టి తననే ఆశ్రయించమనే ఈశ్వరవాక్యం. భక్తియోగం.

ఈ మూడు అంశాల్నీ విడివిడిగా చూస్తున్నవారు గీతలో మూడు భాగాలున్నాయనీ, వాటిని వివిధకాలాల్లో ముగ్గురు రచయితలు కాలానుగుణంగా రాసారనీ వాదిస్తున్నారు. కాని ఈ మూడు అంశాలూ ఒకదానికొకటి అంతర్లీనంగా అనుసంధానమయ్యే ఉన్నాయనీ, వాటిని తనకై తాను సమన్వయపరుచుకున్నకనే గీతాచార్యుడు గీతాబోధకు ఉపక్రమించాడనీ మనం గ్రహించినట్లయితే గీత మనని కలవరచపరచదు.

గీతలో కనబడే ఈశ్వరుడు, Personal God, బౌద్ధంవల్లనో, క్రైస్తవంవల్లనో గీతలోకి ప్రవేశించలేదు. యజ్ఞం, దానం, తపస్సు వదిలిపెట్టకూడని కర్మలే అయినప్పటికీ, వాటికన్నా కూడా ఒక పత్రంతోనో, పుష్పంతోనో, తోయంతోనో తనని సమీపించేవాళ్ళే తనకి ఎక్కువ ప్రీతికారకులని చెప్పిన గీతాచార్యుడు ఏకాంతికుల, వాసుదేవ కృష్ణారాధకుల, పాంచరాత్ర శాఖకు చెందిన అహిర్బుధ్న్య సంహితనుంచి నుంచి గీతలో ప్రవేశించాడని దాస్ గుప్తా ఎంతో సవివరంగా నిరూపించాడు. ‘వాసుదేవః సర్వమితి ‘అని అనుకోగలగడం సమత్వం, కర్మల్లో కుశలం సాధించినవాడికే సాధ్యమవుతుంది. కాని ‘స మహాత్మా సుదుర్లభః ‘ అని కూడా గీతాచార్యుడికి తెలుసు.

అలాగే గీతను మహాభారతంలో చొప్పించారనే వాదన కూడా సహేతుకంగా కనిపించదు. వేదంగురించీ, యజ్ఞం, దానం, తపస్సు ల గురించీ, సర్వేశ్వరుడి పట్ల శరణాగతి పొందడం గురించీ గీత కనబరచే వైఖరి మొత్తం మహాభారతమంతటిలోనూ అంతర్లీనంగా ఉంది. వేదాలను యజ్ఞ పూర్వకంగా అర్థం చేసుకున్న బ్రాహ్మణాల్నీ, జ్ఞానప్రధానంగా అర్థం చేసుకున్న ఉపనిషత్తుల్నీ భారతం తనదైన దారిలో తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆ స్వాధ్యాయ సారాంశమే భగవద్గీత ఆనుకోవచ్చు.

గీతలో కనవచ్చే ఈ మూడు అంశాలూ ఎవరూ కొత్తగా చెప్పినవి కావు. ప్రతి అధ్యాయం చివరా గీత తన గురించి చెప్పుకుంటూ ‘ఉపనిషత్తు’, ‘బ్రహ్మవిద్య’, ‘యోగశాస్త్రం’ అనే మూడు పదాలతో తనని తాను సంజ్ఞానపరుచుకున్నది. ఆత్మనిత్యత్వం గురించి మాట్లాడినందువల్ల ఉపనిషత్తు. త్యాగం గురించి మాట్లాడినందువల్ల ఉపనిషత్తు. బ్రహ్మన్ గురించి మాట్లాడినందువల్ల ఉపనిషత్తు. కర్మల్లో కౌశల్యమూ, సమత్వమూ యోగమవుతాయని చెప్పినందువల్ల యోగశాస్త్రం. ఆ కౌశల్యాన్ని సాధించే క్రమాన్ని ఒక పాఠంలాగా వివరించినందువల్ల యోగశాస్త్రం. ఇక ప్రపంచమంతా ఆవరించిన మహావిషయం మీద వెలుగు ప్రసరింపచేసినందువల్ల బ్రహ్మవిద్య. వాస్తవానికి ఈ మూడూ ఒకటే. ఉపనిషత్తు అంటేనే విద్య. ప్రతి విద్యా మనని జ్ఞానంతో సంయోజనం చేసే యోగశాస్త్రమే.

ఈ భావాలను నాకై నేను సమన్వయం చేసుకుంటూండగా,పరమయోగి శ్రీ వై. హనుమంతరావుగారు నాకు ఫోన్ చేసారు. నేను గీత చదువుతున్నాననీ, గీతాసారాంశాన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాననీ చెప్తే, ఏమర్థం చేసుకున్నారని అడిగారు. నేను నాకు అర్థమైన మూడు విషయాల గురించీ చెప్తే, ఆయన ఆ మూడు విషయాలూ యథార్థానికి ఒక్కటే, అది నిశ్చలస్థితికి చేరుకోవడమే అన్నారు. నిశ్చలత్వమన్నా, స్థితప్రజ్ఞత్వమన్నా ఒకటే కదా అని కూడా అన్నారు.

5

భగవద్గీతాసారాంశం గురించి నెలకొన్న విస్తారమైన అయోమయానికి చాలావరకు గీత మీద విస్తారంగా వచ్చిన భాష్యాలే కారణం. కాబట్టి ఒక్కొక్కప్పుడు గీతాసారాంశాన్ని సంక్షిప్తంగా చెప్పడం ద్వారా బహుశా మనకి గీతాహృదయం నేరుగా బోధపడవచ్చు. ఒకప్పుడు యామునాచార్యులు ఈ పని చేసారు. గీతార్థ సంగ్రహమనే పేరిట 32 శ్లోకాల్లో ఆయన గీతాతాత్పర్యాన్ని సుబోధంకంగానూ, స్మరణీయంగానూ కూర్చిపెట్టారు.

ఇప్పుడు మన చేతుల్లో ఉన్న శ్రీగీతా సుధాసారం మళ్ళా అటువంటి ప్రయత్నం. భగవద్గీతలోని ప్రతి ఒక్క అధ్యాయంలో చెప్పబడ్డ విషయాన్నీ తేటతెలుగులో ఒక్కొక్క సీసపద్యంగా మార్చిన తీరు అనితరసాధ్యం. జీవితమంతా గీతాబోధనని అనుష్టించడానికి పూనుకున్న వారు మాత్రమే చెయ్యగల పని ఇది. ఎటువంటిమహాత్ముడు దుర్లభుడని గీతాకారుడు భావించాడో అటువంటి మహాత్ముడు కవిభూషణ కప్పగల్లు సంజీవమూర్తిరావుగారనడానికి ఈ ప్రయత్నమే సాక్ష్యం. వారి ప్రయత్న బలం ప్రభావమెటువంటిదంటే, వారినెప్పుడూ చూసిఉండని, నా వంటి అల్పజ్ఞుడి చేతకూడా గీతాప్రశంస చేయించింది.

వారికీ, వారి శిష్యులు చంద్రశేఖరరెడ్డిగారికీ, ఈ గీతాయజ్ఞంలో భాగస్వాములైనవారందరికీ పేరుపేరునా నా నమస్సులు.

(2014 లో రాసిన ఈ వ్యాసం గీతాజయంతి సందర్భంగా మళ్లా మిత్రులతో పంచుకోవాలనిపించింది.)

Image courtesy: The Delivery of the Bhagavad Gita.jpg, Wikicommons

3-12-2022

Leave a Reply

%d bloggers like this: