
నాసరరెడ్డి నావి రెండు కవితలు పంపించాడు. నా దగ్గర లేకపోవడంతో ఇప్పటిదాకా ఏ సంపుటాల్లోనూ చేర్చుకోలేకపోయినవి. మొదటిది, బిమల్ రాయ్, సుజాత సినిమా చూసినప్పటి అనుభూతి. ఆ కవిత పేరు ‘సుజాత.’ పాతికేళ్ళ కిందట, హరిహర కళాభవన్ లో బిమల్ రాయ్ రెట్రాస్పెక్టివ్ జరిపినప్పుడు చూసాను ఆ సినిమా. సుజాత, బందిని- ఆ రెండు సినిమాల్నీ మరవడం కష్టం. ఈ కవితల్ని నాకు పంపినందుకు నాసరరెడ్డికి ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా సరిపోదు.
~
సుజాత
ఊరిపొలిమేరల్లో
వెలిసిన అమ్మవారి కోవెల్లో
వెలిగే మట్టిప్రమిదలో దీపం ఆమె.
పండిన వరి పైర్లలో
పంటకోతలప్పుడు
పాడుకునే పాటల మధ్య
ప్రసరించే పసిడి సంధ్యాకాంతి ఆమె.
నల్లని కొండల తొడిమలోంచి
రోజుకొక్క రేక చొప్పున
విప్పారే
వెండిరేకల జాబిల్లి పువ్వు ఆమె.
అనాథ బాలికలకు
నీడనిచ్చే ఆకాశ పందిరిలో
అన్నిటికన్నా ముందు
విప్పరే తొలి నక్షత్రపుష్పం ఆమె.
గోదారి కాలువలో కునికే
గూటిపడవ మూగి నిద్దట్లో
కలల కాంతిరేఖలా
ఊగాడే చిరుదీపం ఆమె.
సముద్ర ప్రచండ తరంగాల యెదట
వలలు పన్ని నిరీక్షించే
ఎడతెగని ఇసుక తిన్నెల నడుమ
మినుకుమనే ఇలాయి దీపం ఆమె.
మట్టిబాట వెంబడి
చిత్మతోపుల్లోంచి
కిర్రుమంటో కాళ్ళీడ్చుకునే
ఎడ్లబండికి
వేలాడే పలకల దీపం ఆమె.
ఆవరించిన
కారుమొయిళ్ళ నడుమ
తటిల్లున మెరిసే
శంపాలత ఆమె.
మొరటుగోడల పైన
పూసిన ఎర్ర గడ్డిపువ్వులా
ప్రతి నిశాంతానా
భగవంతుడు చిత్రించే
భానుగీత ఆమె.
దైనందిన జీవన పంకంలో
సదా నవజాత ఆమె
సుజాత.
(బిమల్ రాయ్ సుజాత ని ప్రేమించినారందరికీ కాన్కగా)
2-12-2022
Preci💝US gift 🙏
Thank you