వనవాసిని-2

ధరణీ రుహ అంటే చెట్టు. ధరణి అంటే నేల. రుహ అనే పదం ‘రుహ్’ అనే ధాతువు నుంచి వచ్చింది. దాని అర్థం పెరగడం, పైకి ఎక్కడం, ఎగబాకడం. ఆరోహణ అనే పదం రుహ్ ధాతువునుంచి వచ్చిందే. ధరణినుంచి పైకి పెరిగేది కాబట్టి మొక్క లేదా చెట్టు. కాని ఆ పదంలో ఒక ఆరోహణా స్ఫూర్తి ఉంది. అది ఔన్నత్యం వైపు చేతులు చాచే జీవలక్షణాన్ని సూచిస్తోంది. ఈ పుస్తకానికి ధరణీరుహ అని పేరుపెట్టడం ఎంతో సముచితమనిపించింది.

అలాగని ఇది అంతరించిపోతున్న అడవుల గురించిన విలాపం ఒక్కటే కాదు. అన్నిటికన్నా ముందు మనిషిలో రసహృదయం, సౌందర్యభావుకత, సహానుభూతి మృగ్యం కాకూడదనే ఆవేదన ఈ పుస్తకానికి అంతర్వాహిని. నేనింతకుముందు ఒకాకురో కకుజో రాసిన తేనీటి పుస్తకాన్ని తెలుగులోకి అనువదించడానికి ఇదే కారణం. ఆ పుస్తకం తేనీటి నెపం మీద ఒక ఈస్తెటిక్స్ ని వివరించే ప్రయత్నం అనిపించింది. అలాగే ఈ పుస్తకం కూడా అడవులూ, చెట్లూ ఆలంబనగా మనిషి ప్రకృతిని ప్రేమిస్తో గడపడంలోని సౌందర్యాన్నీ, సమతౌల్యాన్నీ వివరించే ప్రయత్నం.

మనిషి ప్రకృతిని ప్రేమించడం వల్ల అతడి హృదయం మెత్తబడుతుందనీ, జీవితం నవనవోన్మేషమవుతుందనీ ఇటువంటి ప్రకృతిప్రేమికుల రచనలు చదివితే మనకు తెలుస్తుంది. ఈ వాక్యాలు చూడండి:

అటూఇటూగా గత నెలనుంచీ విపరీతమైన క్షేత్ర సందర్శనలూ, సమావేశాలు..ఒత్తిడి అని అనలేనుగానీ, మడతలు విప్పుకున్న ఋతువొకటి నా కళ్ళముందునుంచే హడావిడిగా వెళ్ళిపోయినట్టూ, ఆరుబయట నిలబడి అపురూపమైన వర్ణచిత్రాన్ని చిత్రించదలిచిన చిత్రకారుడు జోరువానలో తడిచి లక్ష్యం వంక జాలిగా చూసినట్టూ, వానాకాలం చుట్టూరా అల్లుకున్న నా ఆలోచనలన్నీ తడిలేని నేలలా బిగుసుకుపోయాయి.  (గొల్లవంపులు, పే.89)

ఏమీలేని చోట పిల్లదారికి పక్కపక్కలుగా వాననీటి ప్రవాహానికి అనుగుణంగా ధారలు కట్టిన ఈ రాతిగుళికలు నా కాన్వాసుమీద ఈస్టమన్ రంగు దారి తామే అయ్యి మిలమిల మెరవడం, మట్టిపరుపులో ఒక విన్యాసం. నా కాళ్ళకి ఉన్న షూస్ తీసి ఆ గుళికల మీద ఉంచాను. అది గోరువెచ్చని స్పర్శ. పసిబిడ్డకు స్నానం చేయిస్తున్న అమ్మ వేడినీళ్ళు, చల్లనీళ్ళు కలిపి పోసే వేడినీళ్ళ చర్య.  చల్లగా వీస్తున్న అడవి గాలి మధ్య పాదాన్ని వెచ్చబరుస్తున్న స్పర్శ. (పే.93)

వెన్నెల మరింతగా వెలుగుతుండగా గోరుకొయ్యలు పొడిచే వేళ దగ్గరపడుతున్నది. సప్తర్షి మండలం, జరుగుతున్న సమయానికి అనుగుణంగా కదిలినట్టు భావన. చలి ఉందిగానీ మరీ ముదురుచలి కాదు. ఇది కూడా ఒక అనుభూతే కదా. . వెన్నెల ఆకాశంలో చుక్కలు చూడగలగడం. ..కాలగమనంలో ఒక పొద్దుపొడిచే సమయానికి సాక్ష్యంగా తూరుపుకు ఎదురుగా నిలబడడం.. సన్నని వెలుగురేఖలు నీలాకాశపు సముద్రం మీద ఎర్రెర్రగా విచ్చుకోవడం..బాగుంటుంది. ఒక అడవిదారి మీద నేను చూసిన పొద్దుపొడుపుని ఇలా కాగితం మీదకు అనువదిస్తున్నాను. నా ఈ అనువాదం  భావస్ఫోరకమో కాదో గానీ ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉన్న అడవిలో ఒక శరత్ కాలపు వెన్నెలను మాత్రం చూడకుండా జీవితాన్ని ముగించడం ఒక విలుప్త నదీ ప్రవాహమే అవుతుందని చెప్పగలను. (వ్యథశాల, పే.104)

నిలబడి కురుస్తున్నట్లుగా వర్షంలో కూడా ఒక హుందాతనం. సంధ్య చీకటి తెలియడం లేదు. అంతా వాన. ..ఒకలాంటి వెండి తెలుపు. ఆ తెలుపులోనూ ఎర్రని లేత కొమ్మలతో పూసుగు చెట్టు దూరం నుంచి కూడా స్పష్టంగానూ, ప్రత్యేకంగానూ కనిపిస్తుంది. బాగా పండిన గోరింటాకు చూపెడుతున్న అమ్మాయి చేతులలాగా పూసుగు కొమ్మల లాలిత్యం వర్షంలో మరింత సుందరంగా కనిపిస్తున్నది. (పే.120)

ఇంతలో జీపు వచ్చేసింది. తిరిగి బయలుదేరాం. దారిలో ఇంటికి చేరుకుంటున్న పశువులు. కురుస్తున్న వర్షానికి తీరిగ్గా తోకలు వూపుకుంటూ మెల్లగా కదులుతూ ఉంటే నల్లని వాటి శరీరాలు వాననీటితో శుభ్రపడుతున్నాయి. పైన నల్లని మేఘాలు, కింద నడుస్తున్న మేఘాలతో ఒక వారధిగా నేలతో పాటు మా మనసునూ తడుపుతూ ఆకాశపాయ ప్రవహిస్తున్నది (ఆకాశపాయ, పే.120)

చెరువు పరిసరాలు ఒకసారి చూసుకుని తిరిగి గుండం చెరువు వైపుగా వెళ్ళాం. మునిమాపువేళ రెండు చెరువుల సాన్నిధ్యంలో సూర్యుడు కిందకు దిగుతున్నాడు. కెంజాయ రంగు నీలి ఆకాశంలో ప్రతిఫలిస్తున్నది. చిన్న చిన్న నీటితెరలు ఒడ్డుకు కొట్టుకుంటూ గాలి కదలికలకు అనుగుణంగా నర్తిస్తున్నాయి. గాలి మంద్రంగా వీస్తున్నది. ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కోసమే వెతుక్కుంటాను..ఈ సాయంకాలం నేను ఈ శిథిలమందిర ప్రభను కొంతైనా స్వీకరించాలని అనుకుంటున్నాను. (జలపాత్రలు, పే.128)

చెట్టు శాఖల మీద కుచ్చెలుగా అమరుకున్న ఆకులమధ్యనుంచి చిల్లులు చిల్లులుగా ఎండపొడ కురుస్తున్నది.ఎండపొడకు గాలిలో ధూళి రేణువులు కదులుతూ రాలిపడుతున్నాయి. .గాలికి శాఖలు ఊగినప్పుడల్లా ఆకులమధ్యనుంచి చిల్లులు చిల్లులుగా ఎండపొడ కురుస్తున్నది. ఎండపొడకు గాలిలో ధూళి రేణువులుసందుల్లోంచి జారుతున్న ఎండబొట్లు అటూ ఇటూ కదులుతున్నాయి. మనం పట్టించుకోంగానీ ఒక్క క్షణం ఆగి చూస్తేగానీ ప్రతి కదలికలోనూ ఒక అదృశ్యహస్తం ఉన్నదనీ, అది నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుందనీ తెలుసుకుంటాం. నేను ఆ అదృశ్యహస్త విన్యాసాన్ని గమనించడానికి ఉవ్విళ్ళూరుతుంటాను. నాకు నేను ఆశ్చర్యపోతూంటాను. ఎన్ని నిమిషాలో గంటలో అటువంటి ఆశ్చర్యసముద్రంలో మునకలేస్తూ గడిపేస్తుంటాను. ఆ భావనలో నాకు ఒంటరితనం తెలియదు. ఆ స్పృహలో నాకు భయమూ తెలియలేదు. ( అ’మృత’ వృక్షం, పే.154-55)

నేనిప్పుడు నా ముందు ఎగురుతున్న సీతాకోక చిలుకలను చూస్తున్నాను. ఎంత సౌందర్యం అది, ఎంతటి సౌకుమార్యం! మరి ఎంత అల్పమైన జీవితమైతే అంత సులభంగా జన్మల పరంపర దాటావచ్చునా, అంతటి అల్పమైన జీవితంతో ఎంతటి ప్రాకృతిక పరోపకారం! అలా నేనెప్పటికీ జన్మనెత్తలేనా లేక ఇదివరకే ఎత్తి ఉన్నానా..?? ప్రతీ జన్మ వారి కర్మలతో లభిస్తుంది అనుకున్నట్లయితే యే కర్మ చేస్తే నేనీ జన్మనెత్తగలను? నాకు ఈ క్షణం నీడనిస్తున్న చెట్టు ఒకప్పుడు.. అంటే ఒకానొక జన్మలో నా తల్లే అయి ఉంటుందా లేదా ఒకవేళ నాకు తన దీర్ఘశాఖలను చామరం చేసిన చెట్టుది కర్మేనా..నేను పొందుతున్న హాయికి తగిన కర్మను నేను ఇదివరకే చేసి ఉన్నానా లేదా కొత్త కర్మకు ఇది ప్రారంభమా..నాకు చెప్పండి ఏ కర్మ చేయడం వల్ల నేను మళ్ళీ చెట్టునవుతాను, నా ముందు ఎగురుతున్న సీతాకోకచిలుకనవుతాను..?బాలకృష్ణుడు రోలుతో పడగొట్టిన రెండు మద్దిచెట్లు ఇద్దరు యక్షులుగా బయటపడ్డట్టూ నా పక్కనే ఉన్న ఈ మద్దిచెట్టూ ఎవరో ఒకరా..?!ప్రేమగా సాకుకుంటున్న నా కుండీలోని మొక్కలన్నీ నా పిల్లలేనా..అవి నాకు మళ్ళీ జన్మలో తల్లి అవుతాయా.. అలా అయితే నేనెప్పటికీ ఈ జన్మల పరివృతాలయం నుంచి విడిపోలేనా.. నేను మనిషిగానే ఎందుకు పుట్టాలి..? ఇది చెట్టుగానే ఎందుకు పుట్టాలి..? (సరిహద్దు రేఖ, పే.166)

ఈ వర్ణనల్ని, ఈ భావనల్ని ఇంతగా ఉల్లేఖించడానికి కారణం ఈమె తాదాత్మ్యాన్ని పరిచయం చేయడానికే. తెలుగులో ఎందరో కథకులు, కవులు, నవలాకారులు ఉండవచ్చు, సమాజాన్నీ, తమని చిత్రించడంలో వారు సిద్ధహస్తులై ఉండవచ్చు. కాని తమ జీవితానుభవాల్ని మనతో పంచుకోవడంలో ఒక జయతి, ఒక వీణావాణి చూపిస్తున్న authenticity అద్వితీయమనిపిస్తుంది. ఎందుకంటే వారు సిద్ధాంతాలమీదగానో, లేదా సాంఘిక విమర్శదారిలోనో కాక, చిన్న చిన్న నిశ్శబ్దాలమీంచీ, పచ్చని చెట్లదారుల్లోంచీ జీవితసాఫల్యాన్ని వెతుక్కుంటున్నారనిపిస్తుంది. ఈ వాక్యాలు చూడండి:

వెన్నెల కాస్తుంది. వెన్నెల వెలుగులు చెరువు మీదనుంచి ఒక స్పష్టమైన వెండి మెరుపు.. మందిరం నీడ నా నడకను బట్టి ఒక్కోసారి ఒక్కోవైపు కనిపిస్తున్నది. ఈ క్షణం నాకేమనిపించిందంటే కొన్నిసార్లు నీదైనలోకంలో బతకాల్సిన అవసరం ఉంటుంది లేదా అటువంటి పరిస్థితి వస్తుంది. అందులో మన ప్రమేయం ఉందా లేదా అన్నది పక్కనబెడితే అటువంటి స్థితి అసాధారణమైంది, ఉత్కృష్టమైనది. ఎందుకంటే అది నిన్ను నిన్నుగా నిలబెడుతుంది. నీవేమిటో నీకు చెబుతుంది..నాలో ఏదో అర్థం కాని ప్రకృతి జ్ఞానం ప్రవహిస్తున్నట్టుంది. నిరంతరం అడవుల్లో తిరిగే ఇటువంటి దృశ్యపరిచయం వంటివి కూడా మమ్మల్ని ఇటువంటి సందర్భాలకు సన్నద్ధం చేస్తుంటాయేమో. ఇటువంటి మనోస్థిరతకోసమే ఋషులు వనవాసం చేసి ఉంటారు. అఖండ ఏకాంతంలో వారు దర్శించిన విషయాలు వాజ్ఞ్మయం అయ్యాయా.. అంతే అయ్యుంటుంది. ఇటువంటి శక్తిని ప్రత్యక్షంగా పొందడం కోసమే హెన్రీ డేవిడ్ థోరో వాల్డన్ సరస్సు పక్కన రెండేళ్ళు నివసించి ప్రాకృతిక దివ్యత్వాన్ని అనుభూతి చెందాడనుకుంటాను.. (జలపాత్రలు, పే.131)

ప్రపంచమంతటా గొప్ప తత్త్వవేత్తలు, గొప్ప ఆలోచనాపరులు ఇలానే ప్రభవిస్తారు. తమ దైనందిన జీవితంలో, మనం అనుభవిస్తూ కూడా దాటిపోయే క్షణాల దగ్గర వారు ఆగి, మనం చూడలేని ఏ ఉదాత్తతనో, గాంభీర్యాన్నో దర్శించి మనతో పంచుకుంటారు. అది చిత్రకారులైతే బొమ్మలు గీస్తారు. గేయకారులైతే పాటలు కడతారు. ఒక సంజీవదేవ్ లాగా చిత్రకారులూ, ఆలోచనాపరులూ కూడా అయితే వ్యాసాలు రాస్తారు. లేదా తమ అనుభవాల్ని కథలుగా, కవితలుగా మలుస్తారు.

కాని తెలుగులో సృజనాత్మక రచయితల్లో అధ్యయనం, నిశిత పరిశీలన చాలా తక్కువగా కనిపిస్తాయి. చిరుగాలికి కూడా కంపించిపోగల సున్నితత్త్వం కృష్ణశాస్త్రి, చలం, తిలక్, రేవతీదేవిల తర్వాత మన కవుల్లో అంతగా కనిపించదు. తమ వృత్తినీ, ప్రవృత్తినీ ఒకటిగా చేసుకోగల, జాగ్రత్తగా చూసుకోగల జీవననైపుణ్యం మన రచయితల్లో దాదాపుగా అరుదు. ఏకాలంలో అనేక కాలాల్లో జీవించగల అనుభవం గురించి శ్రీశ్రీ ఎంతగానో చెప్పాడుగానీ, ఆ విద్య మన రచయితలకు అంతగా పట్టుబడ్డట్టు కనిపించదు.

సరిగ్గా ఈ కారణాల వల్లనే ఈ ధరణీరుహ నాకు చెప్పలేనంత సంతోషాన్ని  కలిగించింది. తెలుగు భావనాశీలత పట్ల కొత్త ఆశలు రేకెత్తించింది. వీణావాణి ఇటువంటి మూజింగ్సు మరిన్ని వెలువరించాలని కోరుకుంటున్నాను. వెలువరించిన ఈ పుస్తకం అవశ్యం ఇంగ్లిషులోకి రావాలని కూడా కోరుకుంటున్నాను.

పుస్తకం ముఖచిత్రం గురించి కూడా ప్రస్తావించాలి. ఇది వీణావాణి గారి అమ్మాయి, ఏడో తరగతి చదువుకుంటున్న బాలిక చిత్రించిన బొమ్మ. కాని నేను చూడగానే వర్లి, గోండు చిత్రకారులో, సంతాల్ పటచిత్రకారులో చిత్రించి ఉంటారనుకున్నాను. ఆ బొమ్మలో కొమ్మలు ఉద్గమస్థానంలో సన్నగానూ, పైకి పోయేకొద్దీ లావుగానూ కనిపిస్తున్నాయి చూడండి. ఇది ప్రకృతి విరుద్ధం కాదు, ప్రకృతి సహజం. మామూలు కొమ్మలు పైకిపోయే కొద్దీ సన్నబడతాయి. కానీ ఆశారేఖలు ఎంత దూరం సాగితే అంతకంతగా బలపడతాయి.

ఇటువంటి పుస్తకాలు పక్షుల మీద రావాలి, కొండల మీద రావాలి, గనుల చుట్టూ రావాలి, సముద్రతీరాల మీద రావాలి, ఆదివాసి సమాజాల మీద రావాలి, మత్స్యకారగ్రామాల మీద రావాలి. అలాగని వట్టి ప్రకృతి చిత్రణనో, సాంఘిక కథనాలో కాదు, అక్కడి జీవితాల్తో మమేకంగా పెనవైచుకుపోయే హృదయాల ఆత్మనివేదనలు కావాలి. ఈ పుస్తకం అటువంటి రచనలకు నాందీవచనం కాగలదని భావిస్తున్నాను.

30-11-2022

Leave a Reply

%d bloggers like this: