వనవాసిని-1

విభూతి భూషణ బందోపాధ్యాయ రాసిన వనవాసి నవల చదవని వారు మీలో ఎవరూ ఉండరనుకుంటాను. ఆయన బెంగాలీలో ఆరణ్యక పేరు మీద రాసిన ఆ నవలను సూరంపూడి సీతారాం వనవాసి పేరిట తెలుగు చేసారు.

అందులో సత్య శరణ్ అనే ఒక బెంగాలి యువకుడు ఉపాధి వెతుక్కుంటూ బీహార్ లోని పూర్ణియా, ముంగేర్ ప్రాంతంలో ఒక ఎస్టేటు మేనేజరుగా పనిచేస్తాడు. ఎస్టేటు పనుల్లో భాగంగా అడవిని నరికించి వ్యవసాయ భూమిగా మార్చడం అతడి పని. ఎప్పుడూ కలకత్తా వదిలి వెళ్ళని అతడి జీవితంలో అడవిలో అడుగుపెట్టిన మొదటిరోజు చాలా నిరుత్సాహంగా, బెంగగా అనిపిస్తుంది. కాని అక్కడి పనివాడు అతడితో ‘అడవి తొందరలోనే మిమ్మల్ని ఆవహిస్తుంది’ అని చెప్తాడు. ఇక ఆ తరువాత కథ అంతా అడవి అతణ్ణి ఎలా సమ్మోహపరిచిందో, సమ్ముగ్ధం చేసిందో, ఆ కథనం.

ఒక అలౌకిక, రసాత్మక భాషలో విభూతి భూషణుడు అడవి సౌందర్యాన్ని మన ముందు ఆవిష్కరిస్తాడు. ఆ నవల చదివినవాళ్ళు ఒక్కసారిగా చదివెయ్యాలనుకోరు. మిఠాయి దాచుకున్నట్టుగా, రోజూ కొద్దికొద్దిగా ఎక్కడ అయిపోతుందోనన్న బెంగతో నెమ్మదిగా చదువుకుంటారు, చదివిన పేజీలే మళ్ళా వెనక్కి తిప్పి మరోసారి చదువుకుంటారు. ఒక పేరా చదవగానే పుస్తకం అట్లానే చేతుల్లో పెట్టుకుని ఏవో ఊహల్లోకి తేలిపోతారు.

నలభై ఏళ్ళ కిందట, రాజమండ్రిలో సరస్వతి పవర్ ప్రెస్ లో ఆ నవలనీ, అమృతసంతానాన్నీ కనుగొన్న ఆ రోజుల సంతోషాన్ని నేనెప్పటికీ మరవలేను. ఆ రెండు పుస్తకాలూ నాకు గొప్ప మహారణ్యాల్ని పరిచయం చేసాయి. మా ఊరికి నన్ను మరింత సన్నిహితుణ్ణి చేసాయి. మా అడవిని మరింత కొత్త సౌందర్యంతో పరిచయం చేసాయి.

నమ్ముతారా! నలభై ఏళ్ళ తర్వాత నేను అటువంటి ఒక పుస్తకాన్ని తెలుగులో కనుగొన్నాను. అటువంటి ఒక రచయిత్రి తెలుగులోనే ఉన్నదనీ, మన మధ్యనే మసలుతున్నదనీ తెలిసినప్పుడు, ఆశ్చర్యం అలా ఉంచి, ముందు నాకు నమ్మశక్యం కాలేదు.

జయతి రాసిన పుస్తకాలు మినహాయిస్తే, దేవనపల్లి వీణావాణి ఇటీవల వెలువరించిన ధరణీ రుహ (2022) వ్యాససంపుటి లాంటి రచన నేను ఈ మధ్యకాలంలో తెలుగులో చదవలేదు. ఇంగ్లిషులో కూడా ఆ స్థాయి రచనలు నేను ఎన్ని చదివానో వేళ్ళ మీద లెక్కపెట్టవలసి ఉంటుందేమో!

నిన్నా, మొన్నా ఆ పుస్తకాన్ని నేను అపురూపంగా చదివాను, ఆ పుటల్లో ఆవిష్కారమవుతున్న ఆ అపురూపమైన హృదయం ముందు పదే పదే మోకరిల్లుతూ చదివాను. పట్టుమని రెండు వందల పేజీలు కూడా లేని ఆ రచన ఎక్కడ అయిపోతుందోనన్న బెంగతో చదివాను. చదివాక మీకు పరిచయం చేయాలని కూచున్నప్పుడు, ఆ పుస్తకంలో ఏ వాక్యం వదిలిపెట్టేస్తానో అన్న ఆందోళనలో కూరుకుపోతున్నాను.

దేవనపల్లి వీణావాణి వృత్తి రీత్యా డివిజనల్ ఫారెస్టు అధికారి. ఆమె వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు ఆ అడవుల్లో తనకు ఎదురయిన అనుభవాల్ని, ఆ అడవితో తన అనుబంధాన్ని 15 వ్యాసాలుగా రాసి ‘ధరణీరుహ ‘గా వెలువరించారు. ఈ వ్యాసాలు ఇంతకుముందు విహంగ పత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి. ఇప్పుడు పుస్తక రూపంలో మనముందుకు వచ్చాయి.

ఇవన్నీ అడవి గురించిన తలపోతలు. ఈ పుస్తకం అంకితమిచ్చింది కూడా అడవికే. కాని ఇందులో చిత్రితమయ్యింది అడవి ఒక్కటే కాదు. వృక్షజాలంతో పాటు జంతుజాలం, పుష్పజాతులు, గడ్డిమొక్కలు, పుట్టగొడుగులు లాంటి వాటి గురించి రాస్తున్న నెపం మీద కవిత్వం, చరిత్ర, జీవపరిణామం, తత్త్వశాస్త్రం- ఎమర్సన్ నుంచి థోరో దాకా, బెర్గ్ సన్ నుంచి రామాయణం దాకా, సంజీవని నుంచి సలీం ఆలీ దాకా, ఇది అడవిపుస్తకం మాత్రమే కాదు, సంస్కృతిపుస్తకం కూడా.

వనవాసి, అమృత సంతానం పుస్తకాలు దొరికినప్పుడే నాకు కాకాసాహెబ్ కాలేల్కర్ రాసిన జీవనలీల కూడా దొరికింది. పురాణం సుబ్రహ్మణ్య శర్మ అనువాదం. కాలేల్కర్ గుజరాతీ రచయిత, గాంధేయవాది, రాజనీతిజ్ఞుడు. ఆయన భారతదేశంలోని వివిధ జలవనరులు- నదులు, జలపాతాలు, తటాకాలు, సముద్రాలు- సందర్శించినప్పుడు, వాటి మీద రాసుకున్న తలపోతలు. అచ్చంగా ఈ పుస్తకం కూడా అలాంటి పుస్తకమే అనిపించింది.

ఇందులో విజ్ఞానం, పరిజ్ఞానం నిజంగా విశేషమైనవి. చాలా సంగతులు నేను మొదటిసారి వింటున్నవి. ఇందులో రచయిత్రి వాడిన భాష లోని అక్షర రమ్యత అపురూపమైనది. కాని వీటన్నిటివెనకా రచయిత్రి హృదయ వైశిష్ట్యం మరింత గొప్పది. ఆ అనుభూతి సాంద్రత, ఆ ఆవేదన తీవ్రత-అవే నన్ను అంతగా ముగ్ధుణ్ణి చేసినవి.

పుస్తకం మొత్తం ఎలానూ ఎత్తి రాయలేను. కాని ఇంతగా పలవరిస్తున్నాక, అందులో ఏముందో తెలుసుకోవాలని మీకు అనిపించడం సహజం. చూడండి:

ఈ రోజు ఇక్కడ మొలిచినట్టే ఈ వర్ష ఋతువులో అంతటా ఈ చిన్ని చిన్ని పూలవనాలు నిద్రలేచి ఉంటాయి. మళ్ళీ ఏడాదిదాకా ఆ మట్టిలోనే తమ చిన్న విత్తనాలను దాచిపెట్టి మళ్ళ్ళీ ఏడాది కోసం ఎదురుచూస్తాయి. వాటి భాగ్యం కొద్దీ ఆ మట్టి, నిర్లక్ష్యంగా విసిరి వేసిన అగ్గికి అర్పితం కాకపోతేనో, సాగు చేయబడకపోతేనో, చేసినా గట్టుమీద, మొలకల శిరసు మీద కలుపుమందు చల్లకపోతేనో. మొగ్గ పట్టకముందే  గడ్డికోసం కోత కోయకపోతేనో, తప్ప మళ్ళీ ఈ రోజు నా ముందు కనిపించినట్టుగా నవ్వలేవు. వాటి సంతతిని కొనసాగించలేవు, మళ్ళీ కనిపించలేవు. (ప్రతి చోటూ పూలవనమే, పే.22)

జీవం ఒక అవిచ్ఛిన్న ధార. దానిని అంటిపెట్టుకునే విశ్వాసాలతో దానికి పనిలేదు. అది తన దిశలో తాను ప్రయాణం చేస్తూనే ఉంటుంది. కాని మానవులకు ఈ గమనం ఒక సంక్లిష్ట దృగ్విషయం. వారికి నమ్మదగిన విధంగా విశ్వాసం అవసరమవుతుంది. ఆ విశ్వాసాల్ని పెనవేసుకునే మనుగడ సాగిస్తారు. అందుకు తగిన తాత్త్వికతను ఏర్పరచుకుంటారు. దానికి తగిన జీవనవిధానం, నైతిక అనువర్తనం ఏర్పరచుకుంటారు. అలా ఒక సమాజం, ఒక సమూహం, ఒక కుటుంబం మనుగడ కొనసాగిస్తుంది. వీటన్నిటికీ భూమిక అక్కడి ప్రకృతి. ఒక్కోచోట ఒక్కో జీవనవిధానం, ఒక్కో విశ్వాసం, ఒక్కో మనుగడ. మనుషులు పరిణామక్రమంలో ఇటువంటి స్థాయికి చేరడం ఒక అద్వితీయమైన విషయం. మరే జీవులూ ఇటువంటి స్థాయి పొందకపోవడం వెనుక ప్రకృతి యొక్క ఉత్కృష్ట మార్మిక శక్తి ఉందని నేను భావిస్తాను. (పురస్థాపనం, పే.33)

అయితే ఆ తర్వాత తెలుసుకున్నది ఏమిటంటే, గత నలభై ఏళ్ళలో దేశంలోని అనేక కప్ప జాతులు అంతరించే దశకు చేరుకున్నాయని!ఎంత విషాదం. మన కళ్ళముందే ఒక విశాలమయిన తెరమీద ఒక్కొక్కరే అదృశ్యమై పోతున్నట్టు, ఒక బృహన్నాటకంలో విరమించుకుంటున్న పాత్రలు చివరి అంకం మొదటిభాగం మొదలుపెట్టినట్టుగా తోస్తుంది నాకు. (మండూక శోకం, పే.39)

అసలు ఈ మండూక శోకం అనే ఈ అధ్యాయం మొత్తం ఒక ఎలిజి. ఈ చివరి వాక్యాలు చూడండి:

అడవిలో పులులలాగా, పంచెవన్నె సీతాకోకచిలుకల లాగానో మండూకాలు ఆకర్షణీయమైనవి కాకపోవచ్చు. మనకు దూరదూరంగా జరుగుతూ ఎక్కడో ఏ బురదలోనో తలదాచుకోవచ్చు. వాటి బెకబెకల శబ్దం కర్ణకఠోరంగా వినిపించవచ్చు. నేను వాటి అందాన్ని ఆరాధించమని చెప్పనుగానీ, వాటిని జీవించనీయండి అని మాత్రం వేడుకోగలను. (పే.44)

ఇలా పుట్టగొడుగుల ప్రత్యక్ష-అదృశ్యాలను గమనించే ప్రసిద్ధ అమేరికన్ కవయిత్రి ఎమిలీ డికిన్సన్ వీటిమీద కవిత రాస్తూ పుట్టగొడుగులను మొక్కల యొక్క మోహినిగా, elf of plants, అభివర్ణించింది. ప్రకృతి పుట్టగొడుగులపట్ల విధేయంగా ఉన్నదా లేక ధిక్కరిస్తున్నదా అంటూ ఆశ్చర్యపోతుంది. ఈ కవిత్వం చదివినప్పుడు నా చుట్టూ ఉన్న లోకాన్నే మరో దివ్యచక్షువుతో అనుభూతి చెందుతున్నట్టు అనిపించింది నాకు. అంతకు ముందెప్పుడూ ఇంత లోతుగా వీటి గురించి ఆలోచించలేదు కానీ నిజంగానే ఈ కాలం అంతా ఎంతో ప్రత్యేకమైంది. ప్రకృతి కూడా ఒక ఇంద్రజాలానికి సిద్ధపడినట్లు రెండు ఋతువుల సరిహద్దుని గీయడానికి ఇటువంటి అవతారాలను సృష్టించినట్టు తోస్తుంది. (పుట్టగొడుగులు, పే.47)

కలప డిపోలో ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని నడుస్తున్నాను. నా పాదానికి దగ్గరగా ఒక చిన్న మొగ్గ లాంటి తెల్లని తల. నేను కూర్చుండిపోయాను. అది పుట్టగొడుగా, కుక్కగొడుగా అని దగ్గరగా చూస్తున్నాను. ఆ తెల్లని మొగ్గ నా చెవిలో ఇలా- ‘నువ్వు నా చిన్నప్రపంచంలోకి ఎలా ప్రయాణం చేస్తావోగాని ఇక్కడ నిజానికి ప్రపంచానికి చెందనది ఏదీలేదని చెప్పాలనే మొలుస్తుంటాను. మీ కళ్ళముందుకు రాని జీవితాలని చూడమని తల ఎత్తి పిలుస్తుంటాను..ఈ విశాల మృణ్మయదేహం మీద నా పాదముద్రలు చిత్రించి గతించిపోతాను. ఇప్పుడు నువ్వు రాసే పేజీలో నా గమనం గురించి ఏం రాయబోతున్నావు?’ అన్నట్టు అనిపించింది. (పే.56)

అడవి గురించి రాయడమంటే సముద్రాన్ని తవ్వడమే. (వృక్ష సాక్ష్యం, పే.57)

ఇలా చదువుకోవటానికి పుస్తకం వెంట తెచ్చుకోవడం ఒక తరాన్ని మోసుకు తెచ్చుకుంటున్నట్టుగా తోస్తుంటుంది. (అక్కర్లేని మొక్కలు, పే.68)

మానవాళికి ఏమీ తెలియదన్న ఒక్క విషయమే ఆయన (మసనోబు ఫుకువొక) నిరూపించదలచుకున్న పరమసత్యం. (పే.69)

ఇలా మందులు వాడి పెరుగుదలను నియంత్రించడం వలన అవి వాటి జీవితచక్రాన్ని పూర్తి చేసుకోలేవు. వాటి జీవితచక్రాలు మధ్యలో ఆగిపోయి అనుసంధానమైన జీవులు మనలేవు. ఇక పూలులేని కొమ్మలు, తుమ్మెదలు లేని పూలు, చిలకలు కొట్టలేని కాయలు, మట్టికి చేరని విత్తులు, మెత్తబడని నేల, ఒకదానికొకటి పెనవేసుకున్న బతుకులు తెగిన పూసలదండలాగా విడిప్ఫ్తాయి. (పే.75)

పక్షి గుడ్లను, గూళ్ళను ఫొటోలు తీయకూడదు. గుడ్లకు ఏ చిన్నపాటి కాంతికిరణం తగిలినా వాటి పెరుగుదలలో తేడావస్తుందట. పక్షి గుడ్లు అంత సున్నితమైనవన్నమాట. అందుకే నేను పక్షి గుడ్లను ఫొటోలు తీయను. (గడ్డిపరకలు, పే.84)

ఇంకా మరికొన్ని వాక్యాలు రాసి చూపించాలి మీకు. కానీ ఈ లోపు రెండు మాటలు చెప్పవలసి ఉంది. వనవాసి లో కథానాయకుడు అడవిని ప్రేమిస్తాడుగాని, ఉద్యోగ రీత్యా అడవిని తొలగించే బాధ్యత నెత్తికెత్తుకున్నవాడు. కాని ధరణీరుహ రచయిత్రి అడవిని కాపాడే ప్రభుత్వశాఖలో ఉన్నతాధికారి. అడవిని ప్రేమించడమే కాదు, ప్రేమించుకున్నదాన్ని మనసారా కాపుకాచుకునే అవకాశం ఒక బాధ్యతగా ఆమెకి లభించింది. ఈ పుటల్లో ఆమె ఉద్యోగజీవితం, హృదయస్పదనం రెండూ విడదీయలేనంతగా అల్లుకుపోయాయి. ఇది ఆమెకి మాత్రమే దక్కిన అపురూపమైన భాగ్యం.

మా చిన్నప్పుడు మా ఊళ్ళో చింతంనీడి రాజారామ్మోహన రావు అనే ఒక ఫారెస్టరు ఉండేవారు. ఆయన మెహర్ బాబా భక్తుడు. చిత్రకారుడు, గాయకుడు. తన ఇంటిని ఒక పొదరిల్లులాగా అల్లుకుని దానికి మెహెర్ కుటీర్ అని పేరుపెట్టుకున్నాడు. మెహర్ బాబా మీద ఒక బుర్ర కథ రాసి దాన్ని తన ముగ్గురు పిల్లల్తో అభినయింపచేసేవాడు. ఫారెస్టరు అటవీశాఖలో గ్రామస్థాయి ఉద్యోగి. కాని ఆయన జీవితంలో మేము చూసిన అభిరుచి, ఆ ఈస్తెటిక్స్ నేను మళ్ళా అటవీ శాఖలో మరే ఉన్నతాధికారిలోనూ కూడా చూడలేకపోయాను. అది నాకు తలచుకున్నప్పుడల్లా ఆశ్చర్యం కలిగేది కూడా.

కాని ఇన్నాళ్ళకు అటవీశాఖలో అత్యున్నత స్థాయి అభిరుచి, స్పందనశీల హృదయం, పాండిత్యం, రసజ్ఞత, అకుంఠితమైన బాధ్యత ఇవన్నీ కలగలిసిన ఒక అధికారిని చూడగలిగాను. ఈమెను వనవాసిని అని నోరారా పిలవకుండా ఉండలేకపోతున్నాను.

~

ఈ పుస్తకం అన్ని పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది.  http://www.kinige.com ని కూడా సంప్రదించవచ్చు.

30-11-2022

3 Replies to “వనవాసిని-1”

  1. ఎన్నో సార్లు చదువుకున్నాను సర్…
    వేవేల ధన్యవాదాలు

Leave a Reply

%d bloggers like this: