
48 గంటలు.శుక్రవారం సాయంకాలం సోమాజి గూడ ప్రెస్ క్లబ్ నుండి రైటర్స్ మీట్ శీతాకాల ఉత్సవానికి వెళ్ళి, తిరిగి ఇవాళ సాయంకాలం ఇంటికి చేరే దాకా, 48 గంటలు. అంటే పూర్తిగా రెండు రోజులు, పూర్తి సాహిత్య వాతావరణంలో, నిండుగా, ఉత్సాహంగా గడిచింది. చాలా రోజుల తర్వాత, సాహిత్యం తప్ప మరేదీ పట్టని, పట్టించుకోని, సాహిత్యబృందంతో గడిపిన అనుభవం. ఇవాళ మధ్యాహ్నం ఫీడ్ బాక్ సెషన్ లో నన్ను కూడా నా అభిప్రాయం చెప్పమంటే ఇదే చెప్పాను: ఈ రెండు రోజులూ వర్క్ షాపు కాదు, నా మటుకు ట్రైనింగ్ ప్రోగ్రాములాగా గడిచింది. ఎవరు ఫాకల్టీ అంటే, అందరూ, పాల్గొన్న ప్రతి ఒక్కరూ. వయసులో పెద్దవాళ్ళూ, చాలా కాలంగా కథలు రాస్తున్నవాళ్ళూ యువకథకులకీ, నవయువకథకులకీ అధ్యయనం గురించీ, కథా శిల్పం గురించీ చెప్తే, నవయువతరం నేటి ప్రపంచం గురించి, తాము కళ్ళారా చూస్తున్న, అనుభవంలోకి తెచ్చుకుంటున్న జీవితం గురించి పెద్దవాళ్ళకు బోధించారు. రెండు రోజుల సమ్మేళనాన్ని నడిపిన సూత్రం ఏమిటని అడిగితే ‘తేజస్వి నావధీతమస్తు, మావిద్విషావహై ‘అన్న మాటలే గుర్తొస్తున్నాయి.
మహమ్మద్ ఖదీర్ బాబు, కె.సురేష్ అనే ఇద్దరు మిత్రులు రెండు దశాబ్దాల కిందట మొదలుపెట్టిన ఒక ప్రయత్నం. కాలం తాలూకు ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ, ఇప్పటిదాకా పదిహేను సార్లు రచయితల, కథకుల సమావేశాలు నిర్వహించగలగడం చిన్న విషయం కాదు. ఇంతకు ముందు జరిగిన రెండు మూడు సమావేశాల్లో నేను కూడా ఒక పూటనో, లేదా ఒక గంటనో రచయితలని కలిసి మాట్లాడేనుగాని, ఇలా రెండురోజులు అందరితోనూ, అందరిమధ్యా గడపడం నాకు ఇదే మొదటిసారి.
45 మంది రచయితలు, పాత్రికేయులు, ఫిల్మ్ నిపుణులు, సామాజిక ఉద్యమకారులు- పాతికేళ్ళనుంచి డెబ్భై అయిదేళ్ళ వయోపరిమితికి చెందిన రచయితలూ, రచయిత్రులూ పాల్గొన్న సమావేశం. అందులో ఇప్పటికే కథలు రాస్తున్న వారితో పాటు, ఇప్పుడిప్పుడే కథలు రాయడం మొదలుపెట్టినవాళ్ళు కూడా ఉన్నారు. కాని నాలాంటివాళ్ళంసమావేశానికి మేము ఇచ్చిన దానికన్నా, సమావేశం నుంచి మేము పొందిందే చాలా ఎక్కువ అని చెప్పకతప్పదు. అందరికన్నా వయసులో, అనుభవంలో పెద్దవాడు, సీనియర్ కథకుడు రాజారామ్మోహన రావు ముగింపు సమావేశంలో ప్రధాన ప్రసంగం చేస్తూ, మాతరానికి ఇంకా ప్రపంచం పట్ల, జీవితం పట్ల కన్ఫ్యూజన్ పోలేదుగాని, కొత్త తరంలో అటువంటి అయోమయం ఏమీలేకపోగా, చాలా సూటిదనం, సాహసం, స్పష్టత కొట్టొచ్చినట్టుగా కనిపించాయన్నాడు. ఆ మాట అక్షర సత్యం.
సమావేశం మొత్తం ప్రొసీడింగ్స్ ప్రతి గంటనీ పూర్తిగా నివేదించాలని ఉందిగాని, అన్నిటికన్నా ముందు, నా అనుభూతి తాజాదనం చెదరకముందే ఈ నాలుగు మాటలూ మీకు నివేదించడం అత్యవసరం అనిపించింది. ఈసారి మీట్ లో కేవలం కథ పైన, కథాప్రక్రియ పైన చర్చలు మాత్రమే కాక, ఒక ఫొటో ఎగ్జిబిషన్, ఒక చలనచిత్ర ప్రదర్శన, ఒక పుస్తక ఆవిష్కరణ, ఒక కల్చరల్ నైట్ కూడా ఉన్నాయి. అసలు ఈ కార్యక్రమాలకు వేదికగా ఎంచుకున్న Land of Love (LoL) దానికదే ఒక సృజనాత్మక భూమి. షామీర్ పేట్ మండలంలో, కేశవరం గ్రామంలో పది ఎకరాల భూమిలో నెలకొల్పిన ఈ ప్రేమభూమి ఒక cultural hub. మినీ స్టూడియో. అటువంటి సృజనాత్మక ప్రాంగణంలో, గ్రామీణ ఆకాశం కింద, పాదాలకు మట్టి తగిలే నేలమీద, మామిడితోటలో కలుసుకోవడంకన్నా రచయితలకు సంతోషం కల్గించే అంశం మరేముంటుంది?

రఘు మందాటి అనే యువ సినిమాటోగ్రాఫరు తన ఊహలకు సాకారం ఇచ్చిన చోటు అది. ఈ రెండు రోజులూ, రఘు, అతడి బృందం చేసిన వసతి, భోజన సదుపాయాలు, ఆ నిర్వహణ ఎంతో శ్రద్ధతో, ప్రేమతో, గౌరవంతో చేసినవి. అందుకు వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన సరిపోదు. ఈ సమావేశాల్లో భాగంగా, Thunder Dragon పేరిట రఘు ఫొటోగ్రఫీ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. భూటాన్ ప్రపంచంలోనే అత్యంత సంతోషభూమి అని మనకు తెలుసు. ఆ దేశంలోని రంగుల్ని, బౌద్ధారామాల్లోని ప్రశాంతిని, వెలుగుని రఘు కెమెరా గొప్ప కౌశల్యంతో పట్టుకోగలిగింది. నేనన్నిటికన్నా ముందు ఫొటోగ్రాఫర్ని అని రఘు చెప్పుకోవడం సమంజసమే అనిపిస్తుంది.
నిన్న రాత్రి శ్రీ పాల్ సామ అనే తెలుగు దర్శకుడు చిత్రించిన How is that for a Monday (2021) అనే చిత్రం ప్రివ్యూ వేసారు. ఆ సినిమా ఇంకా విడుదల కావలసి ఉంది. ఆ సినిమాకి సాయిప్రణీత్ గౌరవరాజు, శ్రీపాల్ సామ కలిసి చిత్రకథ సమకూర్చారు. ఇంగ్లిషు, తెలుగు భాషల్లో రెండింటిలోనూ నడిచే తెలుగు,అమెరికన్ పాత్రల చుట్టూ తిరిగే కథ. ఆ సినిమాలో ప్రధాన పాత్రధారి కౌశిక్ కూడా ఆ ప్రివ్యూలో పాల్గొన్నాడు. కథకుల వర్క్ షాప్ లో ఆ సినిమా ప్రదర్శన చాలా సముచితంగా ఉందనిపించింది. ఎందుకంటే, ఆ కథనం, ఆ చిత్రీకరణ, సంభాషణలు అత్యున్నత ప్రమాణాల్తో ఉన్నాయి. A highly tight narrative. ఒక తెలుగు యువకుడు అటువంటి సినిమా తీసాడంటే, తెలుగు ఫిల్మ్ జీనియస్ మీద నాకు నమ్మకం కలుగుతున్నది.
ఈ రోజు పొద్దున్న ఝాన్సి పాపుదేశి కథాసంపుటి ‘దేవుడమ్మ’ ఆవిష్కరణ సభ జరిగింది. ఝాన్సి పాపుదేశి రైటర్స్ మీట్ కోర్ కమిటి సభ్యురాలు. ఆమె కథలు రాయడం వెనక, రైటర్స్ మీట్ ప్రభావం, ప్రోత్సాహం ఉన్నాయి అని ఆమెనే చెప్పుకున్నారు.

ఈ రెండు రోజుల్లోనూ దాదాపు పది పన్నెండు సెషన్లు నడిచాయి. శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా, చిత్తూరు నుంచి సిద్ధిపేట దాకా ఎందరో కథకులు, ఎన్నో అనుభవాలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో పునరాలోచనలు. ఒక బాహుదానుంచి మరొక బాహుదా దాకా ప్రవహించిన కథాస్రోతస్సు. కథాశిల్పం మొదలుకుని, తెలుగు కథకుడు జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి వేయవలసిన అడుగుల దాకా ఎన్నో అంశాలు చర్చకొచ్చాయి. మీట్ లో పాల్గొన్న ప్రతి ఒక్క రచయితకీ తన గళం విప్పే అవకాశం లభించింది. తనను నడిపిస్తున్న ప్రేరణల గురించీ, తనను వేధిస్తున్న ప్రశ్నల గురించీ ప్రతి ఒక్క రచయిత, రచయిత్రి ఏదో ఒక సెషన్ లో నాలుగు మాటలు మాట్లాడగలిగారు. అది కాక, విడివిడిగా, భోజనాలవేళలో, టీ తాగుతూనో, తీరికవేళల్లోనో చిన్న చిన్న బృందాలుగానో, ఒకరితో మరొకరు ముఖాముఖిగానో మాట్లాడుకున్న సమయాలు సరే సరి.




ప్రభుత్వాలు చెయ్యవలసిన పని. కాని చెయ్యలేవు. ఎందుకంటే అక్కడ హయరార్కీ ప్రధానంగా ఉంటుంది. విశ్వవిద్యాలయాలు చెయ్యవలసిన పని, కాని చెయ్యలేవు, ఎందుకంటే, అక్కడ కిటికీలు తెరిచి ఉండవు. కార్పొరేట్ సంస్థలు చెయ్యవలసిన పని, కాని చెయ్యకపోవడం మంచిది. అవి గాని పూనుకుంటే, ఈ రైటర్స్ మీట్ ఎవరో ఈవెంట్ మానేజరు చేతుల్లోకి పోయి ఉండేది. ఇది ఖదీర్ బాబు అనే వ్యక్తి, కొందరు మిత్రులతో కలిసి చేసిన పని. ఇంకా చెప్పాలంటే ఖదీర్ బాబు మాత్రమే చెయ్యగల పని. అందుకే ఇవాళ మధ్యాహ్నం సదస్సుల్లో పాల్గొన్న మిత్రులంతా అతనికి standing ovation ఇచ్చారు.
కథలు ఈ ప్రపంచానికి నిజంగా అవసరమా? ఈ ప్రశ్న ఎప్పటికప్పుడు ప్రపంచం వేసుకుంటూనే ఉంది. కాని 1980 తర్వాత ప్రపంచం ఒక narrative turn తీసుకున్నాక, ఇప్పుడెవరూ కూడా what is your truth అని అడగడం లేదు, what is your story అని మాత్రమే అడుగుతున్నారు. నీ జీవితం నీకో సత్యాన్ని అనుభవంలోకి తెచ్చి ఉంటే, ఆ సత్యాన్ని నలుగురితో పంచుకోదలుచుకుంటే, దాన్ని కథగా మార్చడం కన్నా దగ్గరదారి మరేదీ లేదన్నది ఇప్పుడు మనకి కలుగుతున్న కొత్త మెలకువ.
27-11-2022