శ్రీపారిజాత సుమాలు

Reading Time: < 1 minute

ఈ నెల మొదటి తారీకు నాడు నేనూ, ఆదిత్యా ఉట్నూరు నుండి వెనక్కి వస్తున్నాం. సాయంకాలం. మాటల మధ్యలో ఆదిత్య కృష్ణశాస్త్రి మీద నా ప్రసంగాన్ని గుర్తు చేశాడు. కృష్ణశాస్త్రి సినిమా పాటల మీద నేనెప్పుడో మోహనరాగంలో చేసిన ప్రసంగం. దాన్ని మళ్లీ శ్రీ రాగంలో పునఃప్రసారం చేశాను. ఆ ప్రసంగం వింటున్నంత సేపూ అది నేను మాట్లాడింది కాదనీ, నాలోంచి ఎవరో మాట్లాడారనీ నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని మరో మారు ఇద్దరం ఆ ప్రసంగం విన్నాం.

ఎలా విన్నామంటే- ప్రతి ఒక్క పాట గురించి నేను చేసిన పరిచయం వినడం విన్నాక, ఆ పాటని స్పాటిఫై లోనో, యూట్యూబ్లో నో మరొకసారి వినటం. అలా వింటున్నప్పుడు కృష్ణశాస్త్రి భాషని, ఆ పదప్రయోగాల్లోని ఆపురూపమైన రామణీయకత, ఆ మనోజ్ఞ లోకం వాటిగురించి మళ్లీ మళ్లీ మాట్లాడుకున్నాం.

తెలుగులో నిజమైన గీతకర్త అంటూ ఉంటే అది కృష్ణశాస్త్రి మాత్రమే. ఆయన హృదయం అంతటి తోటి గీతాలు పాడాడు. గుండెని గొంతు గా మార్చుకుని పాడాడు. అందుకని చలం గారికి ఆధునిక తెలుగు కవిత్వం అనగానే ఎంకి, కృష్ణశాస్త్రి మాత్రమే గుర్తు రావడంలో ఆశ్చర్యం లేదనిపించింది.

ఆ మర్నాడు తెలిసింది, మేము కృష్ణశాస్త్రిని తలుచుకున్న రోజే ఆయన పుట్టినరోజు కూడా అని. ఇప్పుడు ఈ మార్గశిర ప్రత్యూషాల్లో పారిజాత సుమ దళాలు, మామూలు పారిజాతాలు కాదు, శ్రీపారిజాతాలు పరుచుకుంటూ ఉంటే మరొక్కసారి కృష్ణశాస్త్రి గురించిన నా మాటలు మీతో పంచుకోవాలనిపిస్తుంది. వినండి. ముప్పావు గంట. ఈ ఆదివారం మీ వీలును బట్టి వినండి.

26-11-2022

Leave a Reply

%d bloggers like this: