
ఈ సారి పిల్లలపండగలో కిరణ్ కుమారి గారిని కలుసుకునే భాగ్యం దక్కింది. ఆమె ఫేస్ బుక్ లో నా మిత్రురాలు కావడంతో చాలాకాలంగా ఆమె చిత్రలేఖనాలు చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆ స్టిల్ లైఫ్ చిత్రాలు. వాటిని చూసి ఆమె చిత్రకళకు అభిమాని కాకుండా ఉండటం కష్టం. అటువంటి చిత్రలేఖకురాల్ని కలుసుకుంటాననీ, కొంతసేపు ఆమెతో చిత్రలేఖనం గురించి మాట్లాడతాననీ నేను ఊహించలేదు.
ఆమె చిత్రలేఖనాలు చూడాలనుకున్నవారు Kiran Kumari అనే ఆమె ఫేస్ బుక్ వాల్ ని గాని లేదా, bikiranarts.com అనే ఆమె వెబ్ సైట్ గానీ చూడవచ్చు.
చిత్రలేఖనంలో స్టిల్ లైఫ్ ప్రత్యేక శాఖ. ఐరోపీయ చిత్రకళలో పదిహేడో శతాబ్దంలో మొదలయ్యింది. కాని చాలా కాలం పాటు ఈ genre కి తగిన గౌరవం, గుర్తింపు లేవు. ఐరోపాలో చిత్రకళకి ఎంచుకునే విషయాల్లో మొదటినుంచీ చారిత్రిక అంశాలది అగ్రస్థానం. అది పూర్వకాలం మాత్రమే కాదు, ఆధునిక కాలంలో కూడా అని చెప్పడానికి పికాసో చిత్రించిన గుయెర్నికా కు లభించిన ప్రకాస్తినే ఒక ఉదాహరణ. చరిత్ర, మత సంబంధమైన విషయాల తర్వాత రెండవస్థానం ముఖచిత్రాలది. మొదట్లో చారిత్రిక విషయాల్ని చిత్రిస్తున్నప్పుడు అంతగా ప్రసిద్ధి పొందని లాండ్ స్కేప్ చిత్రలేఖనం నెమ్మదిగా ప్రాధాన్యం సంతరించుకుని మూడవస్థానానికి చేరుకుంది. స్టిల్ లైఫ్ ది వీటన్నిటి తర్వాతి స్థానం. కాని పందొమ్మిదో శతాబ్దం చివరిరోజుల్లో, ఇరవయ్యవ శతాబ్దం మొదటిరోజుల్లో పోస్ట్-ఇంప్రెషనిస్టులు స్టిల్ లైఫ్ మీద దృష్టి పెట్టాక, ఆధునిక చిత్రకళలో అదొక ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుంది. అప్పణ్ణుంచీ ఒక్క స్టిల్ లైఫ్ చిత్రమేనా గియ్యని ఆధునిక చిత్రకారుడు లేడంటే అతిశయోక్తి కాదు.
స్టిల్ లైఫ్ ని సంజీవ దేవ్ గారు స్థిర జీవన చిత్రం అన్నారు. ఆ చిత్రకళని ఎవరు ఎక్కడ ప్రారంభించారో ఎవరు దానికి ఆద్యులో మనం చెప్పలేం. చీనా చిత్రకారులు చిత్రించిన పూల బొమ్మల్లోంచి ఐరోపా దాన్ని అందుకుని ఉండవచ్చును. పదిహేడో శతాబ్దంలో నెదర్లాండ్స్ లోని ఫ్లాండర్సు పట్టణం చిత్రకళకు రాజధానిగా ఉండేది. ఆ పట్టణంలో చిత్రించిన చిత్రకళా సంప్రదాయాన్ని ఫ్లెమిష్ చిత్రకళ అంటారు. ఆ చిత్రకారులు పుష్పగుచ్ఛాల్నీ, పూలబుట్టల్నీ, పూల అమరికనీ చిత్రించడం కొన్ని తరాల పాటు సాధన చేసారు. వారు ఆ చిత్రలేఖనాల్ని తైలవర్ణాల్లో చిత్రించినప్పుడు, ఒక్కొక్క పూతా ఓపిగ్గా వేసుకుంటూ, నెమ్మదిగా ఆకృతుల్ని మలుచుకుంటూ ఉండేవారు. ఇంగ్లిషులో దాన్ని glazing అంటారు. అలా పూత మీద పూత వేసుకుంటూ వెళ్ళినప్పుడు, కాలం గడిచేకొద్దీ, ఆ పూతల్లోని తైలధార సరికొత్త ప్రకాశాన్ని సంతరించుకుని చూపరుల్ని అబ్బురపరుస్తూంటుంది. లియోనార్డో డావిన్సీ చిత్రించిన తైలవర్ణాలు కాలం తాకిడికి నిలబడలేకపోగా, ఫ్లెమిష్ చిత్రకారుల తైలవర్ణాలు కాలంగడిచే కొద్దీ సరికొత్త translucence ని సంతరించుకోవడం విశేషం. ఫ్లెమిష్ చిత్రకారుల స్టిల్ లైఫ్ చిత్రాలు ఎలా ఉంటాయో ఒకటి రెండు ఉదాహరణలు చూడండి:


Images courtesy: https://struchaieva.art/en/blog/gollandskij-natyurmort
కాని స్టిల్ లైఫ్ కు ఒక తాత్త్విక గౌరవాన్ని, సాంకేతిక శ్రద్ధని సమకూర్చిన చిత్రకారుడు పాల్ షెజానె (1839-1906). తన కాలం నాటి ఇంప్రెషనిస్టులు కాంతిని పట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటే షెజానె వారికన్నా ఒక అడుగుముందుకు వేసి, ఆకృతిని పట్టుకోడానికి ప్రయత్నించాడు. అంటే వస్తువుల మీదా, దృశ్యాల మీదా వెలుతురు పడుతున్నప్పుడు, ఆ క్షణిక విభ్రమను, సౌందర్యాన్ని మోనె, మానె, డేగా, రెనోయిర్, పిసారో వంటి ఇంప్రెషనిస్టులు చిత్రించాలని ప్రయత్నించేరు. కాని కాంతి చలనంతో సంబంధం లేకుండా, వస్తువులకు, దృశ్యాలకు సౌందర్యాన్ని సమకూరుస్తున్న మౌలిక ఆకృతుల్నీ, వాటి అమరికనీ వాటి మధ్య సమన్వయాన్నీ, సంఘర్షణనీ షెజానె చిత్రించడానికి ప్రయత్నించాడు. ఆ తపస్సు ఆయన జీవితకాలంలో గుర్తింపుకు నోచుకోకపోయినప్పటికీ, ఆధునిక యుగం మొదలుకాగానే హెన్రీ మాటిస్సే ఆయన్ని ఆధునిక చిత్రకళకు తల్లిలాంటివాడని ప్రస్తుతిస్తే, పికాసో ఆయన్ని తండ్రిలాంటివాడన్నాడు.
షెజానె చిత్రించిన స్టిల్ లైఫ్ చిత్రాలు ప్రతీకాత్మకాలు కావు. అవి అసలు మన దృక్పథాన్నే తల్లకిందులు చేసే చిత్రాలు. వాటిల్లో ఏదో మిలమిల ఉంది. నిన్ను మత్రముగ్ధుల్ని చేసే మహిమ ఏదో ఆ అమరికలో ఉంది. ఒకటి రెండు ఉదాహరణలు ఇక్కడ చూడండి:


Image courtesy: Wikicommons
షెజానె బాటలో వాన్ గో స్టిల్ లైఫ్ చిత్రలేఖనాన్ని మరిన్ని అడుగులు ముందుకు వేయించాడు. అంతదాకా పూలూ, పళ్ళూ, కూజాలూ, శిల్పాలూ మాత్రమే స్టిల్ లైఫ్ కు విషయాలుగా భావిస్తున్న కాలంలో వాన్ గో ఒక జత పాతబూట్లు, ఒక కుర్చీ, కుర్చీ మీద సగం ఆరిపోయిన పైపు లాంటివి కూడా స్టిల్ లైఫ్ కు విషయాలు కాగలవని నిరూపించాడు. ఆయన చిత్రించిన బూట్ల జతమీద తత్త్వశాస్త్రంలో పెద్ద చర్చనే నడిచింది. అది మరో మారు. వాన్ గో చిత్రించిన స్టిల్ లైఫ్ కు రెండు మూడు ఉదాహరణలు ఇక్కడ చూడండి.


Image courtesy: Wikicommons
అయితే రాను రాను స్టిల్ లైఫ్ లో ఆకృతుల్ని చిత్రించడం మీద మాత్రమే కాక, వాటిమీద వెలుగునీడల కలయికని చిత్రించడం మీద కూడా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కిరణ్ కుమారి గారి చిత్రలేఖనాలు చూడండి. ఒక చిత్రం మీద వెలుగు, నీడ పడటం అనేది స్థూలంగా వెలుగు, నీడ అని విడదీసినట్టుగా ఉండదు. ఒక ఆకృతి మీద వెలుగు పడుతున్నప్పుడు, ఆ ఆకృతిచుట్టూ వెలుగు, నీడ, cast shadow అని మూడు భాగలుంటాయి. వెలుగులో కూడా ఆకృతి మీద ఎక్కడ వెలుతురు పూర్తిగా పడుతుందో అక్కడ రంగు పూర్తిగా అదృశ్యమై, కేవలం తెల్లటి చుక్క మాత్రమే ఉంటుండి. దాన్ని highlight అంటారు. ఆ హైలైట్ చుట్టూ half-tone light ఉంటుంది. దాన్నుంచి ఒక సన్నని గీత ఆ ఆకృతిలోని చీకటిభాగాన్ని వేరు చేస్తుంది. ఆ చీకటి పార్శ్వంలో మూడు భాగాలుంటాయి. ఒకటి ఆ చీకటిలో ఆ ఆకృతితాలూకు దట్టమైన చీకటి భాగం, దాని చుట్టూ పరుచుకున్న పలచని చీకటి భాగం. ఇవి రెండూ కాక, పక్కనున్న వస్తువులు లేదా ఆ వస్తువు నిల్చున్న బల్లతాలూకు వెలుగు ఆ ఆకృతిమీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. దాన్ని reflected light అంటారు. ఇక మూడవది ఆ ఆకృతి వల్ల పడే నీడ. దానిలో మళ్ళా మూడు భాగాలుంటాయి. మొదటిది, ఆ నీడలో దట్టమైన భాగం, రెండవది దాని చుట్టూ పరుచుకున్న పలచని భాగం, మూడవది ఆ పలచని నీడ అంచుల్లో వ్యాపించిన మరీ పలచని పొర. ఈ విషయం మీద ఇంకా తెలుసుకోవాలనుకున్నవారు ఈ వ్యాసం చూడవచ్చు. https://willkempartschool.com/a-beginners-guide-to-shadow-light-part-1-drawing/
ఒక పువ్వునో, పండునో చిత్రించాలనుకున్న చిత్రకారుడు ఈ వెలుగునీడల సయ్యాటను ఎంత అర్థం చేసుకుంటే ఆ చిత్రం అంతగా రాణిస్తుంది. చిత్రలేఖనం నేర్చుకోవాలనుకునేవారికి స్టిల్ లైఫ్ చిత్రలేఖనం గొప్ప అభ్యాసం. అందులో తలమునకలయ్యేవారికి అదొక గొప్ప సవాలు. ఆ సవాలును స్వీకరించేవారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన చిత్రలేఖకుల కోవలో కిరణ్ కుమారి ముందు వరసలో ఉంటారు.
ఇప్పుడు కిరణ్ కుమారి గారి స్టిల్ లైఫ్ చిత్రలేఖనాలు ఇక్కడ ఒకటి రెండు ఉదాహరణలు చూడండి. ఆమె కౌశల్యం ఏమిటో మీకు బోధపడుతుంది.

Lemon on white cloth,oils on Canvas,6×8″

Dabbakaaya,oils on Paper,6×8″
ఇంకా చూడాలనిపిస్తే ఆమె ఫేస్ బుక్ గోడ, ఆమె వెబ్ సైటూ ఎలానూ ఉండనే ఉన్నాయి.
Featured photo: Lemons with jar,6×8″,oils, 2019 by Kirankumari
25-11-2022