
మొన్న పిల్లల పండగలో భగవంతం కలిసినప్పుడు డా.కేదార నాథ్ సింగ నూరు కవితలు పుస్తకం ఆత్మచిత్రం నా చేతుల్లో పెట్టాడు. కిల్లాడ సత్యనారాయణ అనువాదం చేసిన ఈ పుస్తకం గురించి విన్నానుగాని ఇంత త్వరగా నా చేతికి అందుతుందనుకోలేదు. డా.సింగ్ పేరు గతంలో విని ఉన్నప్పటికీ, నాకు ఆయన కవిత్వంతో ఇంత దగ్గరి పరిచయం ఇదే మొదటిసారి.
పుస్తకంలో మొదట రెండు మూడు కవితలు చదివేటప్పటికే నేనొక అసాధారణమైన వ్యక్తిని కలుసుకోబోతున్నాను అనిపించింది. నాలుగైదు కవితలు చదివేటప్పటికి, నాసరరెడ్డి, ప్రసాద మూర్తి వంటి కవులు ఎందుకు ఈయనంటే అంతగా వివశులవుతున్నారో అర్థమయింది. పుస్తకం ముగించేటప్పటికి, ఆయన చరణాల దగ్గర కూచునే అభిమానుల్లో నేను కూడా ఒకడిగా చేరిపోయాను.
తెలుగులో ఇటువంటి కవిలేడుకాబట్టి ఇటువంటి కవిత్వం కూడా లేదు. ఈ పుస్తకం తీసుకుని మొన్న రాజవొమ్మంగి దాకా వెళ్ళి వస్తున్నప్పుడు ఈ కవిత్వం ఎలా ఉంది అని అడిగింది అక్క. ‘గ్రామీణ జీవితం గురించి ఇస్మాయిల్ గారు రాసినట్టు ఉంది ‘ అన్నాను. శిల్పంలో బహుశా ఇస్మాయిల్ తో కొంతవరకూ పోల్చవచ్చు. కాని, ఆ జీవనదర్శనం అద్వితీయం.
అది ఈ దేశానికి వెన్నెముకగా జీవిస్తున్న ఒక గ్రామీణుడి జీవితదర్శనం. అలాగని ఆ గ్రామీణుడు తన గ్రామం తప్ప మరేమీ తెలియని వాడు కాడు. ప్రపంచపుపోకడలు, ఉద్యమాలు, సిద్ధాంతాలూ అన్నీ తెలిసినవాడే. ముక్తిబోధ్ బ్రహ్మరాక్షసుడికి ఎన్ని తెలుసో ఈ కవికి కూడా అన్నీ తెలుసు. కాని తాను బ్రహ్మరాక్షసుడు కాకుండా తనని తాను కాపాడుకున్నాడు. అదే తేడా. ఇంకా చెప్పాలంటే తనని తాను బ్రహ్మరాక్షసుడు కాకుండా కాపాడింది గ్రామీణ జీవితపు విలువలు. తన మూలాలు, తన మట్టి, తన ఊళ్ళోని ఎడ్లు, నాగలి, పొలాలు, పక్షులు, ధాన్యం కంకులు, చెరువు, బురద, ఇరుగు, పొరుగు.
ఆధునిక జీవితం కవిని అభిశప్తుడిగా మార్చింది. అతడి చదువు అతణ్ణి మరింత కూపస్థమండూకంగా మార్చింది. అతడు పూర్వకాలపు కవిలాగా ఆదర్శాల్ని ప్రేమించలేడు. అలాగని తానొక ఆదర్శమూర్తిగానూ రూపొందలేడు. తనకి దారి దొరకదు, మరొకడికి దారి చూపలేడు. అశక్తత ఆధునిక కవిని పట్టిచ్చే గుర్తు. కాని, డా.కేదార్ నాథ్ సింగ్ ఎట్లా దాటాడో ఈ వైతరణిని దాటాడు. ఆయనకు దారి దొరికింది. ఆ కవితలు చదువుతున్నంతసేపూ మనకి కూడా ఏదో ఒక తోవ చిక్కుతున్నట్టే ఉంటుంది. ఆయన ఇలా అంటున్నాడు:
పట్టణ కేంద్రిత ఆధునిక సృజనాత్మకత, గ్రామాధారిత చైతన్యాల మధ్య ఒక విధమైన ఘర్షణను గమనించాను. ఈ ఘర్షణ మన దైనందిన జీవనవాస్తవికత. దీనివైపు మన దృష్టి తక్కువ పోతుంది. నా రచనల్లో ఈ రెంటినీ సమాహితం చేస్తున్నాను. ఇందులో నేను ఎంతవరకూ సఫలీకృతం అయ్యానో చెప్పలేనుగానీ, అది నా రచనాప్రక్రియ అంతర్భాగం అని చెప్పగలను.
ఇంకా ఇలా అంటున్నాడు:
మన సమాజంలోని విరోధాభాస నాకు బోధపడింది. ఒక వృద్ధ రైతుకు అర్థమయ్యేలా కవిత చెప్పకపోవడం కవిత తప్పుకాదు, పరిమితి అవొచ్చు. దీని గురించి మనం మనస్తాపం చెందనక్కరలేదు. మన సంవేదనల్లో ఎక్కడో లోయ ఏర్పడింది. అంతే.
బహుశా ఆధునిక కవి వైఫల్యం అతడు తన కవిత మీద మరీ ఎక్కువ బరువు మోపడంలో ఉందనుకుంటాను. అతడికి తన పరిమితులు, తన కవిత్వపు పరిమితులు అర్థం కాలేదు. సరిగ్గా డా.సింగ్ సఫలమయింది ఇక్కడే అనుకుంటున్నాను. అతడికి ఒక కవిత చేయగలదో స్పష్టంగా తెలుసు. ఈ మాటలు చూడండి:
ఎలాగైతే ఒదులుగా వున్న ఒక నట్టును ఒక మేస్త్రీ బిగించినట్టు, తప్పిపోయిన గొర్రెల్ని గొర్రెల కాపరి వెతికినట్టు. అది ఎంత ఇవ్వగలదో, అంతే నేను కవితను అడుగుతాను. కవిత లోకాన్ని మార్చి సుఖసంతోషాల్ని అందిస్తుందన్న భ్రమ నాకు లేదు.
ఈ చిన్న మరమ్మత్తులోనే కవిత్వ బృహత్ ప్రయోజనం ఇమిడి ఉంది. ఉంది అని నా వరకూ నాకు ఈ కవితలు చదువుతున్నంతసేపూ తెలుస్తూనే ఉంది. ఉదాహరణకి ఈ కవిత చూడండి:
కోట్ల సంవత్సరాల పురాతనమైనది
నాకు లెక్కలేనన్ని మిత్రులున్నారు
శత్రువులు ఎవరూ లేరు.
బ్రహ్మాండమంతా వ్యాపించిన
నాకు తెలిసిన-తెలియని
మిలియన్ల మిత్రులారా
వినండి-
ఈ బ్రహ్మాండం కోట్ల సంవత్సరాల
పురాతనమైన ఒక ఎడ్లబండి
దాని ఇరుసును
మరమ్మత్తు చేయాల్సిన అవసరం వచ్చింది.
ప్రపంచాన్ని మార్చవలసిన అవసరం ఉందనే మన యుగంలో ప్రతి ఒక్క కవీ గొంతు చించుకుంటూ ఉన్నాడు.కాని వాళ్ళ మాటలు మన చెవికి ఎక్కడం మానేసాయి. ఈ చిన్న కవిత మాత్రం మనల్ని చెవి పట్టుకు మరీ దగ్గరగా లాక్కుంది. ఏమిటి దీని రహస్యం. బహుశా ఆ ఎడ్లబండి అన్న రూపకాలంకారం అనుకుంటాను. అక్కడ ఎడ్లబండి అనే బదులు మరే మాట వాడినా మనం ఆ కవిత వైపు చూసి ఉండేవాళ్ళం కాము.
సాధారణంగా మన కవులు తమ బాల్యాన్ని తలుచుకోడానికి మాత్రమే గ్రామాల వైపు చూస్తారు. వలసల్ని చిత్రించడానికి కూడా గ్రామాల్ని తలుచుకుంటారుగానీ, ఆ గ్రామాలు అప్పటికే చెదిరిపోయి ఉంటాయి. కాని డా.సింగ్ చూసిన, చూస్తున్న గ్రామాలు సజీవ గ్రామాలు. అవి తాము బతుకుతూ, ఈ దేశాన్ని బతికిస్తున్నాయి. మనమింకా ఇలియట్ ని చదువుకుంటూ పిడికెడు మట్టిలో భయోత్పాతాన్ని చూస్తూ ఉండగా, ఆయన ఉప్పు, నిప్పు, పత్తి, గాడిద, గోధుమ, చెయ్యి, చేతిపార లాంటి వస్తువుల్లోంచి జీవనోద్రేకాన్ని పుట్టిస్తున్నాడు.
ఈ కవితలు చదువుతున్నంతసేపూ నాకు గంగాస్నానం చేస్తున్నట్టుంది. ఏవేవో మాలిన్యాలు కొట్టుకుపోతూనే ఉన్నాయి. ఎటువంటి మాలిన్యాలు అవి! చెప్పవలసినవి సరిగ్గా చెప్పకపోవడం వల్ల ఏర్పడ్డ మాలిన్యం, వివిధ సందర్భాల్లో కలుగుతున్న అనుభూతిని సరిగ్గా గుర్తుపట్టకపోవడంవల్ల పేరుకున్న మురికి. చాలా రోజులు ముసురుపట్టి, వదిలి, మబ్బులు విచ్చి, సూర్యకాంతి పరుచుకున్నప్పుడు కలిగే లాంటి విముక్తి ఏదో ఈ కవితలు నీకు ప్రసాదిస్తాయని చెప్పగలను.
అలాగని ఆయన పల్లెటూరి కవి కాడు. ఆధునిక కవిత పూర్తి వికాసం తరువాత ఎక్కడికి చేరుతుందో అక్కడ కూచునే ఆయన ఈ కవితలు రాస్తున్నాడు. ఆ దృక్పథం, ఆ అభివ్యక్తి, ఆ శిల్పం- అవి పూర్తిగా ఆధునికం. ఈ రెండు మూడు కవితలు చూడండి:
పేరు
పేరు సంపాదించే పనిలో
నేను ఇక్కడికి చేరుకున్నాను
అప్పుడు నాకు తెలిసింది-
ప్రతి పేరూ
ఏ పక్షీ గుడ్లు పెట్టని
ఒక గూడు అని.
హాకర్
ఈ నగరంలో
ప్రతి వ్యక్తీ
తన ప్రియురాలు పేరును దాస్తున్నాడు.
రోడ్డు మీద
వియత్నాం వియత్నాం అని
అరుస్తున్న ఆ హాకర్ తప్ప.
కాని ఆయన చేసిందేమిటంటే తన ఆధునిక చైతన్యాన్ని, ఆయన తన స్వగ్రామం ‘చకియా ‘తో అనుసంధానించే ప్రయత్నం చేసాడు. మన విప్లవకవులు పాటల్తో ప్రజల్ని చేరడానికి ప్రయత్నించినట్టు. భారతదేశ విముక్తి ఈ రెండింటి మిలనంలోనే ఉందని ఆయన నమ్మినట్టు కనిపిస్తుంది. ఈ కవిత చూడండి:
ప్రపంచం మారిపోతుంది
వెదురుతో చేటలు చేస్తారు
లేదా చీపుర్లు తయారు చేస్తారు
ప్రజలు బజార్లలో
కోటు వేసుకుని
చీపురు కోసం వెదుకుతారు
కోటూ చీపురూ
ఈ రెంటినీ కలపగలిగితే
ప్రపంచం మారిపోతుంది.
గాంధీ చెయ్యడానికి ప్రయత్నించింది అదే. గాంధీ అంటే గుర్తొచ్చింది. ఈ సంపుటిలో మేక-గాంధీజీ అనే కవిత కూడా ఉంది. అది కూడా చదివి తీరాలి మీరు.
ఈ కవితలు చదివాక మీకు డా.సింగ్ పుట్టిపెరిగిన చకియాకి వెళ్ళాలనీ, భోజ్ పురీలో మాట్లాడాలనీ, తూరుపు ఆకాశంలో వేలాడుతున్న మాంఝి వంతెన చూడాలనీ, నూర్ మియా, ఝుమ్మన్ మియా లాంటి కవిగారి గ్రామవాసుల్ని కలుసుకోవాలనీ, ఆయనకు దారి చూపిన త్రిలోచన్ లాంటి వారి కవిత్వం కూడా చదవాలనీ అనిపించకుండా ఉండదు. అదే సమయంలో మీకు మీ ఊరు వెళ్ళాలనీ, ఆ మట్టిబాట వెంబడి, ఆ పొలాలకి అడ్డంగా నడుచుకుంటూ, మీరు మర్చిపోయిన మీ గ్రామవృద్ధుల్ని ఒక్కొక్కర్నీ పేరుపేరునా గుర్తుచేసుకుంటూ పోయి కలవాలని అనిపించకుండా ఉండదు.
తెలుగు కవికి బిగ్గరగా ఏడవడం ఇష్టం. అరవడం ఇష్టం, నినదించడం ఇష్టం. మొత్తం మీద తెలుగు కవిత్వం వింటూంటే ఉపన్యాసం వింటున్నట్టు ఉంటుంది. కేదార్ నాథ్ సింగ్ కవిత్వం చదువుతుంటే ఒకాయన ఊరిమధ్య చింత చెట్టు కింద కూచుని ఏవో ముచ్చట్లు ఆగీ ఆగీ చిన్న చిన్న వాక్యాల్లో చెప్పుకున్నట్టు ఉంటుంది. ఆ కళ నిస్సందేహంగా తెలుగు కవి నేర్చుకోవలసిన కవిత్వ కళ.
కిలాడ సత్యనారాయణ ఇండియన్ పోలీసు సర్వీసుకు చెందిన ఉన్నతాధికారి. ఉత్తర ప్రదేశ్ కేడర్ అధికారి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో అఖిల భారత సర్వీసుకు చెందిన ఏ అధికారీ, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చినవారు, ఇలా ఒక తెలుగు కవిని వెతుక్కుంటూ వెళ్ళి, ఆ కవిత్వాన్ని తెలుగులో చదివి, తమ మాతృభాషలోకి అనువాదం చేసినట్టు చూడలేదు. ఈ ఒక్క అంశం చాలు, సత్యనారాయణ విశిష్టత ఏమిటో తెలియడానికి.
మూడేళ్ళ కిందట ఆయన కవిత్వ సంపుటి, బహుశా మొదటి సంపుటి అనుకుంటాను, విజయవాడ పుస్తకప్రదర్శనలో ఆవిష్కరించి పరిచయం చేసే అవకాశం నాకు దొరికింది. ఆయన రాసిన మరొక పుస్తకం, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది, దాని మీద లయోలా కళాశాలలో మాట్లాడేను. కాని ఈ అనువాదంతో సత్యనారాయణ ఎంతో ఎత్తుకు చేరుకున్నాడని చెప్పగలను. ముఖ్యంగా నాలాంటి వాళ్లం ఎందరమో ఈ పుస్తకంతో ఆయనకు ఋణగ్రస్తులమయిపోయాం.


~
పుస్తకం కావలసిన వారు K.Satyanarayana, Door No.49/54a/4b, Balayya Sastry Layout, Near Velama Kalyanamantapam, Seetammadhara, Visakhapatnam- 531117 కు రాయగలరు లేదా 83333987838 ను సంప్రదించగలరు. వెల రు.150/-
24-11-2022