మనం కలుసుకున్న సమయాలు-3

మరొక రెండు మాటలు కూడా చెప్పాలని ఉంది. మొదటిది, అడవిలో ఉంటున్నందుకో, ప్రకృతిని ఆరాధిస్తున్నందుకో జయతి పట్ల నాకు అభిమానం కలగలేదు. అన్నిటినీ వదిలిపెట్టి ప్రకృతి మధ్యకు వెళ్ళి బతికేవాళ్ళూ, కొన్నాళ్ళు అక్కడ ఉండి, తిరిగి వచ్చేవాళ్ళూ, తిరిగి వచ్చాక పుస్తకాలు రాసేవాళ్ళూ ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. ఆ మధ్య Sylvain Tesson అనే అతను సైబీరియాలో బైకాల్ సరస్సు దగ్గర ఒక కేబిన్లో ఒక్కడూ ఆరునెలలు గడిపి వచ్చి, The Consolations of the Forest: Alone in a Cabin on the Siberian Taiga (2013) పుస్తకం రాసాడు. అది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాని అతడు సైబీరియాలో గడిపింది ఆరునెలలే. జయతి దారపల్లిలోనూ, ఇక్కడ కుటీరంలోనూ అంతకన్నా ఎక్కువ కాలమే గడిపింది.

ప్రకృతి ఆరాధకులకు కూడా ఈ ప్రపంచంలో కొదవలేదు. తాము చూసింది బొమ్మలుగా గీసేవాళ్ళూ, చిత్రాలుగా మలిచేవాళ్ళూ కూడా తక్కువేమీ కాదు. ప్రకృతి ఆరాధన నా దృష్టిలో దానికదే ఒక విలువ కాదు. కాని జయతి విశిష్టత ఈ పరిమితమైన అంశాలని దాటిన విశిష్టత.

అలాగే వాళ్ళు ఏకాంత వాసం చెయ్యడం లేదనీ, ఏకాంతంగా ఎక్కడున్నారు, వాళ్ళ అనుభూతి, అనుభవాలూ ప్రతి రోజూ మిత్రులతో పంచుకుంటూనే ఉంటున్నారుకదా అని కూడా ఎవరన్నా అనవచ్చును. సరిగ్గా,ఈ కారణం వల్లనే జయతి అంటే నాకు ఎక్కువ ఆరాధన. తాను చూసిన సత్యాన్నో, సౌందర్యాన్నో తోటిమనిషితో పంచుకోవాలని కోరుకోకపోతే, తహతహలాడకపోతే ఆ మానవానుభవానికి అర్థమే లేదు. సిద్ధార్థ గౌతముడికి జ్ఞానోదయం అయిన తర్వాత ఆయన గయనుండి సారనాథ్ దాకా అంటే దాదాపు 250 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చేసాడు. ఎందుకు? తాను చూసిందేదో గయదగ్గర కూడా ప్రబోధించవచ్చు కదా! కాదు, తాను అన్వేషణ మొదలుపెట్టినప్పుడు తనతో కలిసి నాలుగు అడుగులు నడిచి అక్కడే ఆగిపోయిన మిత్రులున్నారు, తాను చూసిందేదో అందరికన్నా ముందు వారితో పంచుకోవాలనుకున్నాడు ఆయన.

జయతిజీవితంలో నన్ను అమితంగా ఆకర్షించినవి రెండు అంశాలు. ఒకటి ఆమె సరళ జీవనం, రెండవది ఆమె విరళ చింతనం. విరళమంటే ఇక్కడ అర్థం అరుదైన అని. కాని ఆమె చింతించే  విషయం మాత్రం అవిరళం.

నేను నిన్న foraging గురించి మాట్లాడేను. అది నిజంగా అంత అత్యున్నత జీవితాదర్శమే అయి ఉంటే, మానవుడు తన పరిణామక్రమంలో ఆ దశని ఎప్పటికీ వదిలిపెట్టి ఉండేవాడు కాడు. ఇంత దూరం ప్రయాణించి ఉండేవాడు కాడు. అయినా ఎందుకని ఇంత దూరం, ఇన్ని మహాయుగాల పాటు ప్రయాణిస్తో వచ్చేడు? ఎందుకంటే, ఏ జంతువునీ వేటాడకుండా, తోటిమనిషిని బానిసగా మార్చకుండా కేవలం ఆకులూ, అలములూ ఏరుకుంటూ గడపడం ఎంతో ఆరాధనీయమైన విషయమే అయినప్పటికీ, అది మనిషి తన చైతన్యంతో ఇష్టపూర్వకంగా ఎంచుకున్న జీవన విధానం కాదు. అప్పటి ప్రకృతి పరిమితుల వల్ల, ఇంకా ఎదగని అతడి మెదడు వల్ల, వికసించని చైతన్యంవల్ల సాధ్యమైన ఒక పరిణామ దశ మాత్రమే. మానవపరిణామంలో ఏడు దశలుంటాయని వివరిస్తో Duane Elgin రాసిన  Awakening Earth: Exploring the Evolution of Human Culture and Consciousness (1993) లో దాన్ని surface consciousness అంటాడు. అంటే అది పై పై చైతన్యం మాత్రమే. ఆ చైతన్యం పూర్తిగా వికసించి లోపలకీ ఇంకిన చైతన్యం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ foraging ఏ మాత్రం కూడా voluntary foraging కాదు. కాబట్టి ఆ మానవుణ్ణి మనం ఆదర్శమానవుడిగా భావించలేం.

Duane Elgin మరో పుస్తకం కూడా రాసేడు. Voluntary Simplicity: Toward a Way of Life That Is Outwardly Simple, Inwardly Rich (1981) అని. అంటే ఐచ్ఛిక నిరాడంబరత్వం గురించి. అసిసీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్, వారణాసికి చెందిన కబీరు, మన కాలంలో గాంధీ మాట్లాడింది ఆ ఐచ్ఛిక దారిద్య్రం గురించే. నాకు తెలిసి, నేను చూసిన వాళ్ళల్లో అంత ఐచ్ఛికంగా వస్తుసంచయాన్ని నిరాకరించిన ఉదాహరణలు జయతి, లోహి తప్ప మరొకరు లేరు.

అటువంటి నిరాడంబర జీవితం నగరంలో కూడా సాధ్యపడవచ్చు కదా అంటే సాధ్యమనే అంటాను. అలా జీవించాలనే నా సాధన కూడా.కాని నగర జీవితంతో ఉన్న సమస్య ఏమిటంటే అది ఎప్పటికీ ‘అది తే’, ‘ఇది తే’ అంటో పోరుపెడుతూనే ఉంటుంది. రవీంద్రకుమార శర్మ దీన్ని భలే వివరించేవారు. పూర్వకాలపు పల్లెటూళ్ళల్లో వీథరుగుల గురించి చెప్తూ ఆయన అవే మన డ్రాయింగు రూములనీ, మన అతిథుల్నీ, చుట్టపక్కాల్నీ అక్కడే కలుసుకునే వాళ్ళమనీ, ఆ అరుగులమీద చాపలు పరిచినా పరచకపోయినా, తివాసీలు పరిచినా, పరచకపోయినా, అలికి ముగ్గుపెట్టినా పెట్టకపోయినా వాటిమీద కూచుని కబుర్లు చెప్పుకోడానికి మనకి ఏమీ అభ్యంతరం ఉండేది కాదంటాడు ఆయన. అదే పట్టణాల్లో మన డ్రాయింగు రూములు చూడండి. అక్కడ, ఆ హాల్లో వట్టి చాపలు వేసి అతిథుల్ని ఆహ్వానించగలమా? అలాగని సోపాలు వేస్తే సరిపోతుందా? ఆ సోఫాల్లోకి మెత్తలు కావాలి, వెనక ఆనుకోడానికి దిళ్ళు కావాలి, కింద తివాసీ ఉండాలి, సోపా మీద యాష్ ట్రే ఉండాలి, ఎదురుగా టెలివిజన్ సెట్టు ఉండాలి, వెనక గోడ మీద ఆకర్షణీయమైన అలంకరణలేవో ఉండాలి. అన్నిటినీ మించి, మనం మాట్లాడుకుంటూ ఉండగా ఎదురింటి ఫ్లాట్ లో ఉన్నవాళ్ళకి ఇబ్బంది కలక్కుండా గుమ్మానికి పరదా వేలాడాలి.

నగర జీవితంలోనే కాదు, ఇప్పుడు గ్రామజీవితానికి కూడా ఇదే నమూనా. ఒక కుటుంబం ఆర్థికంగా ఒకమెట్టు పైకి ఎక్కిందనడానికి గ్రామాల్లో కొలమానం ఏమిటో తెలుసా? ఇంట్లోకి డైనింగు టేబుల్ రావడం. కాని ఇటువంటివేవీ లేకుండానే మనుషులు బతగ్గలరని మనని ఒప్పించేవారంటూ ఎవరో ఒకరు ఉండాలి కదా. జయతి, లోహిలు చేస్తున్నది అదే. వాళ్ళు సైకిలు యాత్ర కోసం విజయనగరం నుంచి బయలుదేరినప్పుడు చేసిన మొదటి పని, ఇదుగో, ఇంట్లో పేరుకున్న ఈ వస్తుసంచయాన్ని వీథిలోకి గిరవాటు పెట్టడమే.

ఇప్పుడు మనం వస్తువులు పోగేసుకుంటూ ఉండే ఈ దశ కూడా దాటిపోయాం. వస్తువులు సమకూర్చుకోవడం colonial modernity. ఇప్పుడు మనం post-colonial modernity లో ఉన్నాం. ఆ సమకూర్చుకున్న వస్తువుల్ని ఎప్పటికప్పుడు కొత్తవాటితో రిప్లేస్ చేసుకుంటే తప్ప స్తిమితం చిక్కని దశకు చేరుకున్నాం. దుస్తులు, ఫోన్లు, టెలివిజన్లు, కార్లు, గృహోపకరణాలు- ప్రతి ఒక్కటీ మూడు నెలలనుంచి మూడేళ్ళ వ్యవధిలో మార్చెయ్యకపోతే, కొత్త నమూనాలు కొనుక్కోకపోతే మనకి నిశ్చింత లేదు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇళ్ళు కూడా వచ్చి చేరాయి. రెండేళ్ల కిందట, నేను విజయవాడలో అద్దెకి ఉండటానికి ఇళ్ళు వెతుక్కుంటున్నప్పుడు ఒక విషయం గమనించాను. అక్కడ చాలా అపార్ట్ మెంటుల్లో ఫ్లాట్లు ఖాళీగా ఉంటాయి, కాని వాటికి అద్దెకి ఇవ్వరు. ఎందుకంటే వాటి యజమానులు అమెరికాలోనో మరో చోటనో ఉంటూంటారు, వారెప్పుడన్నా ఇక్కడకి వస్తే వాళ్ళకోసం అని ఆ ఫ్లాట్లు ఖాళీగా పెట్టుకుంటారు అని విన్నాను. కానీ ఆ ఇళ్ళు చూస్తే గత అయిదారేళ్ళల్లో ఎవరూ అక్కడ అడుగుపెట్టిన సూచనలేవీ కనిపించేవి కావు.  ఏదైనాగానీ, ఇప్పుడు భారతదేశనగరాలకీ, గ్రామాలకీ కూడా affluenza అనే జబ్బు పట్టుకుంది. ఇది కోవిడ్ కన్నా ప్రాణాంతకమైన మహమ్మారి.

అఫ్లుయెంజా అంటే ఏమిటి? ఒక రచయిత ఈ జబ్బుని ఇలా నిర్వచించాడు: “Affluenza” is a social condition that arises from the desire to be more wealthy or successful. It can also be defined as the inability of an individual to understand the consequences of their actions because of their social status or economic privilege.

John De Graaf అనే ఒక రచయిత  Affluenza: How Overconsumption Is Killing Us–and How to Fight Back (2013) అని ఇటీవల దీనిమీద ఏకంగా ఒక పుస్తకమే రాసాడు. ఈ జబ్బు వూహాన్ లో కాదు, అమెరికాలో పుట్టింది. ప్రపంచమంతా ఈ తరహా జీవనవిధానాన్ని అనుసరిస్తే, ఒక్క భూగోళం కాదు, వంద భూగోళాలు కూడా ఈ ఆకలి తీర్చలేవని రాసాడు ఆ రచయిత. అలాగని అమెరికాని నేను తక్కువ చెయ్యడం లేదు. అమెరికన్ల క్రమశిక్షణ, సమయపాలన, వైజ్ఞానిక స్పృహ, చేస్తున్న పనిపట్ల శ్రద్ధలు- ఇవి ఆదర్శం కావడం మానేసి, వాళ్ళ నిక్కర్లూ, వాళ్ళ మల్టిప్లెక్సులూ, వాళ్ళ పాప్ కార్న్ మనకి నమూనాలుగా మారాయి.

తెలిసో తెలియక ఈ వ్యాధి మనకి బాగానే సోకింది. ఇందుకు విరుగుడు మందు దుకాణంలో దొరకదు. అసలు దుకాణాల్లోంచే వ్యాపించిన రోగం ఇది. ఇందుకు ప్రకృతి చికిత్స ఒక్కటే మార్గం. ఒకప్పుడు అదిలాబాదులో రవీంద్ర కుమార శర్మ, ఇప్పుడు జయతి మాత్రమే దీన్నుంచి మనల్ని బయటపడేయగల వైద్యులు.

ఇదంతా సరళ జీవనం గురించి. విరళ చింతనం గురించి కూడా ఒక మాట చెప్పాలి. మొన్న జయతి, లోహి ఉంటున్న ఇల్లు చూసినప్పుడు నాకేమీ కొత్తగా అనిపించలేదు. అట్లాంటి ఇళ్ళు నా జీవితకాలం పొడుగునా గిరిజన ప్రాంతాల్లో నేను చూస్తూనే ఉన్నాను. ఇంకా వాళ్ళకి తలదాచుకోడానికి ఒక కప్పు ఉంది. ఎందరో యానాదులకి, చెంచువారికి అది కూడా లేకపోవడం చూసాను. నల్లమల అడవిలో ఒక కుటుంబం రెండు చెట్లకు అడ్డంగా ఒక చీర కట్టుకుని దాని నీడలో తలదాచుకుంటున్న దృశ్యం చూపించి, మా డిపార్ట్ మెంటులో ఒక సీనియర్ అధికారి, యాంత్రొపాలజిస్టు నాతో ‘వాటినే wind breakers అంటారు ‘అన్నాడు. ఆదిమానవుడు చెట్టుతొర్రలనుంచి, కొండగుహల నుంచి బయట అడుగుపెట్టాక చాలాకాలం పాటు అటువంటివే అతడికి నీడనిచ్చాయి. కాని ఆ పేదజీవితాల్ని చూస్తే జాలి కలుగుతుంది, సమాజ సంపద వారిదాకా చేరకపోవడం పట్ల ఆగ్రహం కలుగుతుంది. కాని అదే జీవితం జీవిస్తున్న జయతి పట్ల ఆరాధన కలుగుతుంది. ఎందుకని?

మొదటిది నిర్బంధ దారిద్య్రం కావడం వల్ల, రెండవది ఐచ్ఛిక దారిద్య్రం కావడం వల్ల అని ఇంతకు ముందే చెప్పాను. కాని ఇది సగం మాత్రమే నిజం. నిరాడంబరత కేవలం దానికదే ఆరాధనీయం కాదు. ఆ నిరాడంబర జీవితంలో, తక్కిన వ్యాపకాల్నీ, వ్యమోహాల్నీ వదులుకున్న ఆ ఖాళీ జాగాలో, ఆ తీరిక దనంలో కళ, సాహిత్యం, సంస్కృతి చేరాలి. విరళ చింతనం అంటే అది. మనుషులు జీవికకోసం పాటుపడవలసిన పనిగంటలు తగ్గి, కాయకష్టం నుంచి ఏ మాత్రం తీరిక దొరికినా అది నక్షత్రాల వెలుగును చూడటానికో, లేదా కవిత్వం గురించో, కళల గురించో చర్చించుకోడానికో వినియోగించకపోతే, ఆ తీరిక దక్కీ ఏమి ప్రయోజనం? అందుకనే ప్రాచీన చీనాలో ఋషిలాంటి కవి తావో-యువాన్-మింగ్ రైతులాగా జీవించడం మొదలుపెట్టాక, ప్రతి సాయంత్రం తన ఇరుగుపొరుగుతో  కూచుని ప్రాచీన కవుల పద్యాలు చదువుకోవాలని పరితపించేడు. ఇదుగో, సరిగ్గా, ఇందుకే, జయతి జీవితం నాకు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నది.

మేము మా చిన్నప్పుడు జీవించింది ఇట్లాంటి జీవితాన్నే. తమ చివరి క్షణాల దాకా మా తల్లిదండ్రులు జీవించింది ఇలాంటి జీవితాన్నే. తాటాకు ఇల్లు, మట్టి అరుగులు, ఉప్పు, బొగ్గు నూరిన పళ్ళపొడి తప్ప సబ్బు, టాల్కం పౌడరు, వాసననూనెలు, సెంట్లు తెలియవు. రేడియో లేనేలేదు. టేప్ రికార్డరు, టివి ఊహకి అందవు. కంప్యూటరు, నెట్, మొబైలు ఊహల్లో కూడా లేవు. కాని ఆ జీవితంలో మా అక్క తెచ్చి పరిచయం చేసిన రచయితలు, ఆ కవిత్వాలు లేకపోయుంటే, అది నిజంగానే నిరుపేదబతుకుగా మిగిపోయుండేది. ఇక సాహిత్యమూ, సంగీతమూ, తత్త్వశాస్త్రమూ జీవితంలోకి ప్రవేశించాక వాటికి ఎక్కడ దూరమైపోతానో అన్న భయం చేత నా బతుకుని వస్తువులు తినెయ్యకుండా కాపాడుకోడమెట్లాగు అని ఇన్నేళ్ళూ ఆందోళన చెందుతూనే ఉన్నాను. అందుకనే ఎంత బాగా అన్నాడు కబీరు, పడవలోకి నీళ్ళూ, ఇంట్లోకి వస్తువులూ చేరకండా చూసుకోమని.

తక్కినవాళ్ళ సంగతి నాకు తెలియదు గాని, జయతి, లోహిలు ప్రయాణిస్తున్నది మాత్రం మునగని పడవ.

Featured photo courtesy: R.Ramadevi

23-12-2022

2 Replies to “మనం కలుసుకున్న సమయాలు-3”

Leave a Reply

%d bloggers like this: