
మనం కలుసుకున్న సమయాలు ఇప్పటిదాకా జయతి వెలువరించిన పుస్తకాల్లో మూడవది. ‘అడవి నుండి అడవికి’, ‘అడవి పుస్తకం’ తరువాత వచ్చిన పుస్తకం. ఇందులో నాలుగు ప్రదేశాలూ, ఇరవై వ్యాసాలూ ఉన్నాయి. చిట్టచివరి భాగం, ప్రస్తుతం ఆమె నివసిస్తూ, తానున్నచోట అల్లుకున్న కుటీరం చుట్టూ పోగుచేసుకున్న అనుభవాలు.
ఈ వ్యాసాల్నిగాని, ఇందులో ఉన్న అంశాల్నిగాని నేనిక్కడ పరిచయం చెయ్యబోవడం లేదు. ఇవి చాలావరకూ ఫేస్ బుక్ మాధ్యమంలో ఆమె ఇంతకుముందు మనతో పంచుకున్నవే, కానీ, ఇక్కడ ఇలా చదవడంలో మనకొక మృదువైన అనుభూతి సిద్ధిస్తుంది. మీరు పొందబోతున్న ఆ అనుభూతికి అడ్డు నిలబడాలని లేదు. చదవండి, ఈ పుస్తకం తెప్పించుకుని, ఒకటీ ఒకటీ అప్పుడూ అప్పుడూ మీకు తోచినప్పుడల్లా చదువుకుంటూ ఉండండి.
జయతి ఈ పుస్తకం ఆవిష్కరణ కుటీరంలో చెయ్యాలని అనుకుంటున్నామని చెప్తూ నన్ను పుస్తకం మీద మాట్లాడమని అడుగుతూ సాఫ్ట్ కాపీ పంపించారు. 116 పేజీల పుస్తకం. అది చదువుతున్నంతసేపూ నా గుండె ఊడి కళ్ళల్లోంచి కిందపడి పోతుందేమో అనిపిస్తూ ఉంది. అది కుమ్మరి ఆవంలో కుండలు కాల్చినట్టుగా, పైకి పొగ వస్తుంది తప్ప, ఆ జ్వాల అంతా లోపల్లోపలే వెలుగుతూ ఉండింది. తీరా అక్కడ లేచి ఆ పుస్తకం గురించి మాట్లాడటం మొదలుపెట్టేవేళకి గుండె కరిగి కన్నీరుగా జలజలచెంపల మీంచి రాలింది.
చాలా చాలా ఏళ్ళ కిందట నా మిత్రుడొకడు తాను మార్క్సిజం చదువుకుంటున్న ఉద్వేగంలో గాంధీ గురించి అన్నాడు కదా, ‘ఆయన నిరాడంబరంగా ఉండటంలో విశేషమేముంది? ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులు రోజూ జీవిస్తున్నది ఆ చాలీచాలని జీవితమే కదా’ అన్నాడు. ‘కాబట్టే వాళ్ళతో ఐడెంటిఫై అవ్వాలనుకున్నాడు’ అన్నాను. ‘ఏముంది అందులో? బీదవాళ్ళకి అందులో ఏమీ గొప్పదనం కనిపించదు. మధ్యతరగతి, ఉన్నత తరగతి ఆయనలాగా ఎలానూ జీవించరు. ఎలా చూసినా ఆయన తనకు తాను భ్రమపెట్టుకోవడం తప్ప మరేమీ కాదు’ అన్నాడు. నా మిత్రుడు మాట్లాడుతున్న మాటల్లో ఏదో లోపం ఉందనిపించింది. కాని అదేమిటో గుర్తుపట్టి చెప్పగల జ్ఞానం, అనుభవం ఆ రోజు నాకు లేకపోయాయి.
కాని ఇప్పుడు చెప్పగలను. టాల్ స్టాయినీ, రస్కిన్ నీ, థోరోనీ, ఋషీశ్వరులని చెప్పదగ్గ చీనాకవుల్నీ, జెన్ సాధువుల్నీ, సూఫీ యోగుల్నీ, క్రైస్తవ మిస్టిక్కుల్నీ, ఇప్పటి పర్యావరణ ఉద్యమకారుల్నీ చదివిన పరిజ్ఞానంతో చెప్పగలను, ఇన్నేళ్ళుగా ఈ సమాజాన్నీ, ప్రపంచాన్నీ దగ్గరగా చూసిన అనుభవంతో చెప్పగలను: నువ్వు నిజంగా మనుషుల్ని ప్రేమిస్తే, ఇప్పటికే ఈ సమాజం నుంచీ, నలుగురి శ్రమనుంచీ నువ్వెంతో తీసుకున్నావనీ, కాని నువ్వు తిరిగి తీర్చవలసిన ఋణంలో సహస్రాంశం కూడా తిరిగి చెల్లించనేలేదనీ తెలుస్తున్నకొద్దీ, నువ్వు వీలైనంత నిరాడంబరంగా తప్ప మరోలా జీవించలేవు. నీ అవసరాల్ని, వస్తు సంచయాన్నీ ఎంత తగ్గించుకోగలవో అంతగా తగ్గించుకున్నాక కూడా, ఇంకా వదిలిపెట్టవలసింది ఏదో ఉండనే ఉందనిపిస్తుంది.
నిజానికి ఆదిమానవుడు ఇట్లానే జీవించేవాడు. తనకి ప్రకృతినుంచి అవసరమైందానికన్నా, ఒక్క పండుగాని, ఒక్క కాయగాని, ఒక్క కుందేలుపిల్లగాని, దేన్ని అదనంగా తీసుకున్నా పాపం చేసినట్టే వణికిపొయ్యేవాడు. ఆ ఒక్క పండు కూడా ఎంతో వినమ్రంగా, అడవిముందు మోకరిల్లి, దాన్ని చేతుల్లోకి తీసుకున్నాక కూడా, ముందు దాన్ని అడవి ముందు పెట్టి ‘నువ్వూ తిను, మేమూ తింటాం ‘ అనేవాడు. ఏ మనిషైనా, అప్పుడు గాని, ఇప్పుడు గాని, జీవించడానికి ఇంతకనా గౌరవప్రదమైన మరో మార్గం లేదు. చిన్నప్రాణి మీద పెద్ద ప్రాణి, పెద్ద ప్రాణిమీద అంతకన్నా పెద్ద ప్రాణి ఆధారపడి బతికే ఈ జీవచక్రం నిజానికి హింసాచక్రం. ఈ చక్రాన్ని మనం తుంచలేం, అలాగని కళ్ళు మూసుకుని కొనసాగిస్తూనూ ఉండలేం. కాని ఎవరో ఒకరు, ఒక తావో యువాన్ మింగ్ లాంటి వాడు, ఒక టాల్ స్టాయి లాంటి వాడు, ఒక గాంధీలాంటివాడు తాను తింటున్న ప్రతి ఒక్క ముద్దకు తాను ప్రకృతికీ, ప్రపంచానికీ కూడా జీవితకాలం ఋణపడి ఉన్నామని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అట్లాంటి వాళ్ళు జీవించిన స్థలాలు నిజమైన దేవాలయాలు. ఎందుకంటే అక్కడ మాత్రమే మనిషి వీలైనంత అహింసాత్మకంగా జీవిస్తాడు కాబట్టి. ఈ ప్రపంచంలో బతకడానికి తనకన్నా పిట్టలకీ, పురుగులకీ ఎక్కువ హక్కు ఉందని నమ్ముతాడు కాబట్టి.
నేనొకప్పుడొక కొండరెడ్ల గ్రామానికి వెళ్ళాను. హేమంత ఋతువు. వాళ్ళ పొలాల్లో అలసందలు విరగకాసాయి. కాని వాటికి బాగా పురుగుపట్టింది. ఆ బొబ్బర కాయల్లో ప్రతి ఒక్కదానిమీదా పురుగు గాట్లు కనిపిస్తున్నాయి. ‘అయ్యో, ఈ పంటకి పురుగు పట్టింది, మందు కొట్టించలేదా?’ అనడిగాను.కాని వాళ్ళల్లో ఎట్లాంటి ఆదుర్దా కనిపించలేదు. నేల తల్లి అందిస్తున్న ఆహారంలో ఎవరి వాటా వారిది అన్న ప్రశాంతనిర్లిప్తతనే వాళ్ళ వదనాల్లో కనిపించింది.
మనిషి రైతుగా మారడానికి ముందు ఎన్నో వేల ఏళ్ళు వేటగాడిగా బతికాడని మనకు తెలుసు. వేట-ఆహారసేకరణ అనే మాటని మనం కొన్నిసార్లు ఒకే పదబంధంగానూ, కొన్నిసార్లు పర్యాయపదాలుగానూ వాడుతుంటాం. కాని మనిషి వేటకాడు కావడానికి ముందు ఎన్నో లక్షల ఏళ్ళు ఆహారసేకరణ మీదనే బతికాడు. దాన్ని foraging అంటారు. తెల్లవారి లేచి తనకి అడవిలో ఏది దొరికితే అది మాత్రమే తిని జీవించిన కాలం. ఆ రోజుల్లో మనిషికి రోజంతటికీ కావలసిన పౌష్టిక ఆహారం కొన్ని గంటల్లోనే దొరికిపొయ్యేదని ఇప్పుడు పరిశోధకులు చెప్తున్నారు. ఏ రోజు దొరికింది ఆ రోజే తినెయ్యాలికాబట్టి కూడగట్టడం, పోగెయ్యడం అనే క్రియాపదాలకి అక్కడ తావులేదు. ఆస్తిలేదు కాబట్టి, రాజ్యం లేదు, జైళ్ళు లేవు, విప్లవాలు లేవు, విద్రోహాలు లేవు. అంతేనా? ఆ రోజుల్లో స్త్రీపురుషుల మధ్య ఎట్లాంటి జెండర్ కూడా లేదనే ఇప్పుడు గ్రహిస్తున్నారు. ఆహారం ఎవరేనా సేకరించుకోవచ్చు. పురుషుడు మాత్రమే ఆహారం సేకరించాలి, స్త్రీ ఇంట్లో కూచుని వంట చెయ్యాలి అనే పనివిభజన కూడా లేని కాలం అది. బహుశా మానవ చరిత్రలోనే అత్యంత అహింసాత్మక కాలం అది అని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత వేట, పశుపోషణ, వ్యవసాయం తలెత్తాక కూడా, ఆ జ్ఞాపకాలు మనుషుల అంతరంగాన్ని వదల్లేదు. ఆ జ్ఞాపకాలింకా ఎవరి ఆత్మల్లో బలంగా ఉన్నాయో వారు తమ తమ జీవితాల్ని అత్యంత అహింసాత్మకంగా జీవించడమెలా అని ఆవేదన చెందడం మానలేదు. అలా జీవించడాన్ని వేదకాల మానవుడు ఉంఛవృత్తి అన్నాడు. అంటే రైతులు పొలాల్లో పంట కోసుకుని కళ్ళాలకు ఎత్తాక, కోతలు పూర్తయిన పొలాల్లో రాలిపడ్డ పరిగె ఏరుకుని దాని మీద బతకడం. అత్యంత స్వతంత్ర మానవులు అత్యంత గౌరవప్రదంగా పొట్టపోసుకోవడంగా దాన్ని వైదిక యుగం భావించింది.
ఒకప్పుడు అట్లా పరిగె ఏరుకుని ఇంటికి తెచ్చుకుని ఆ యవధాన్యాన్ని పిండిచేసుకుని ఒక కుటుంబంలో నలుగురూ నాలుగు ముద్దలు చేసుకుని తినబోతూ ఉండగా ఒక అతిథి వాళ్ళ తలుపు తట్టాడు. అతడి ఆకలి తీర్చడం కోసం ఆ నలుగురూ తమ వంతు ముద్దలు తాము ఆ అతిథికోసం త్యాగం చేసారు. అతడు అది తిని చేతులు కడుక్కున్నప్పుడు, ఆ నీళ్ళల్లో ఒక ముంగిస పొర్లాడింది. ఆ పొర్లాడినంతమేరా దాని వీపుకి ఒకపక్క బంగారంగా మారిపోయింది. అప్పణ్ణుంచీ అది మిగిలిన వీపు కూడా బంగారంగా మారే సమయంకోసం ఎదురు చూస్తూ ఉంది. ,ధర్మరాజు కురుక్షేత్రంలో గెలిచాక అశ్వమేధ యాగం చేసినప్పుడు అది మళ్ళా అక్కడికొచ్చి ఆ యాగశాలలో పొర్లాడింది. కాని తన వీపు బంగారంగా మారలేదని ఆ ముంగిస నిండుసభలో ధర్మరాజుని ఎద్దేవా చేసింది.
‘నాకు forager ని కావాలని ఉంది’ అన్నారు జయతి ఒకసారి నాతో. ఆ మాటలు వింటూనే ఉలిక్కిపడ్డాను. నా సమకాలికుల్లో ఒక్క రచయితగాని, ఒక్క కవిగాని, ఒక్క ఉద్యమకారుడు గాని ఇట్లాంటి మాటలు అనగా వినలేదు నేను. ఒక మనిషి forager కావాలని అనుకోవడమంటే ఏమిటి? All property is theft అని ప్రౌధాన్ అన్నాడని మనకు తెలుసు. అంటే ఎవరన్నా తనదగ్గర తన అవసరానికి మించి ఒక్క జత గుడ్డలు కూర్చుకున్నా కూడా అది దోపిడీనే. ఆస్తి కలిగి ఉండటం దోపిడీమాత్రమే కాదు, అది నువ్వు నిరంతర హింసకి పాల్పడుతూండటం కూడా. నిజమే, ఎంతో కొంత హింసలేకుండా ఈ జీవచక్రం కొనసాగదు. అందుకనే, సున్నిత హృదయుడైన ప్రతి ఒక్కడూ అన్నిటికన్నా ముందు ఈ భవచక్రం నుంచి బయటపడాలనీ, ఏ రూపంలోగాని, మరోసారి మరో జన్మ ఎత్తకూడదనే కోరుకుంటూ ఉన్నాడు.
మార్క్స్, ప్రౌధాన్, రూసో- ఆస్తి హక్కు అమానుషమైన హక్కు అని భావించడం వెనక, వారికి తెలిసో, తెలియకో క్రైస్తవ మిస్టిక్కుల ప్రభావం ఉంది. తొలిక్రైస్తవులు క్రీస్తు చెప్పిన ప్రతి ఒక్కమాటనీ తుచతప్పకుండా నమ్మడానికి ప్రయత్నించారు. ‘మీకు దుస్తుల గురించి చింత ఎందుకు? పొలంలో వికసిస్తున్న పూలని చూడండి. అవి వడకవు, నేతనెయ్యవు’ అని క్రీస్తు అన్నాడని (మత్తయి, 6:28) మనకు తెలుసు. అక్కడితో ఆగకుండా ‘తన సమస్త వైభవంతో కూడిన సొలోమోను కూడా వాటిలాగా విరాజిల్లడం లేదని చెప్పగలను’ అని కూడా (లూకా,12:27) అన్నాడు.
ఆ వైభవం ఆస్తిని త్యజించడంలోని వైభవం, అహింసలోని వైభవం. మొన్న ఆ గుట్టమీద జయతి కుటీరాన్ని చూసినప్పుడు, అది నేనిప్పటిదాకా చూసిన రాజమందిరాలన్నింటినీ మించిన వైభవంతో విరాజిల్లుతుండటం చూసాను.
ఈ ప్రపంచంలో మనిషి పాల్పడగల అత్యంత హింసాత్మక చర్య అంటూ ఉంటే అది ఆస్తి కూడగట్టుకోవడమే. ఆస్తి ఏమి చేస్తుంది? అది మరొక మనిషిని నీకు బానిసగా మార్చుకోవడానికి తాపత్రయపడటం మొదలుపెడుతుంది. అంటే మీరు అడగవచ్చు. ఆస్తికి హద్దు ఏమిటని? రెండు జతల దుస్తులు కలిగి ఉండటం కూడా అపరాధమేనా? రూసో ఒక మాటన్నాడు. ఏ మనిషీ తన తోటిమనిషిని కొనుగోలు చేసేటంత ధనికుడు కాకూడదు, ఏ మనిషీ తన తోటిమనిషికి బానిసగా మారేటంత దరిద్రుడు కాకూడదు అని. ఆస్తికి హద్దులేమిటనేది ఎవరికి వారు ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండవలసిన ప్రశ్న. ఈ సౌకర్యం, ఈ డివైస్, ఈ అభిప్రాయం నాకు ఆస్తిగా మారుతున్నదా అనే కాదు, అసలు అన్నిటికన్నా ముందు, ఇది ప్రపంచంలో ఆస్తిహక్కుని నిలబెట్టడానికి పూనుకుంటున్నదా అని చూసుకోవాలి. ఆస్తి బానిసత్వానికి దారితీస్తుంది. ఇది భౌతికమైన ఆస్తికే కాదు, జ్ఞానం రూపేణా కూడగట్టుకునే ఆస్తికి కూడా వర్తిస్తుంది. ఒక మనిషిని బానిసగా మార్చడమంటే, ప్రౌధాన్ చెప్పినట్టు, అతణ్ణి హత్యచెయ్యడమే.
ఆస్తినీ, సంచయాన్నీ,వ్యామోహాన్నీ ఎవరు ధిక్కరించినా, అది మిస్టిక్కులుగానీ, సోషలిస్టులుగానీ, కమ్యూనిస్టులుగాని, అనార్కిస్టులుగానీ, చలంగారు, గాంధీగారు-ఎవరైనాగానీ వారు నాకు ఆరాధనీయులు. ఈ జీవితంలో నేను చేరుకోవలసిన తీరానికి వాళ్ళు కొండగుర్తు.
ఇప్పుడు ఆ కొండగుర్తుల్లో జయతి కూడా చేరింది.
తనకి forager గా బతకాలని ఉంది అని ఆమె నాతో చెప్పిన మాట మూడునాలుగేళ్ల కిందటి మాట. కాని ఆమె తన కలని నిజం చేసుకున్నదని ఈ పుస్తకంలో ‘కడుపునిండిన తియ్యని మామిడిపండ్లు ‘ (పే.51-52) చదివితే తెలిసింది. ఈ పుస్తకం నుంచి మీరు చదవకముందే ఏ వాక్యాలూ ముందే ఎత్తి రాయకూడదనుకున్నానుగాని, ఈ వాక్యాలు మాత్రం రాయకుండా ఉండలేకపోతున్నాను. చూడండి:
పండ్లొక్కటే కాదు, ఇదని చెప్పలేనివెన్నో చెట్టు ఇచ్చింది. నలుగురు చెట్టుని చూడాలనుకుంటారు. ఫొటోలు తీస్తాను. చెట్టుకింద కూర్చునే పని ఎవరిస్తారు? దానికి జీతం ఎవరు చెల్లించరు. ఎవరికి జీతం కావాలి? చెట్టుకిందకు చేరుకోవాలంటే ఉద్యోగం ఒక్కటే కాదు, ఒక్కొక్కటి ఎన్నో వదులుకోవలసి ఉంటుంది. నా నాలుగ్గోడలనుండి ధైర్యం, సాహసం అనే మాటలకర్థం తెలియకుండానే ప్రపంచపు అంచులపైకి, చెట్టుకిందకి నడిచిపోయాను. .
ఒకప్పుడు గాలిబ్ కి ఎవరో అతడి సమకాలికుడు మోమిన్ రాసిన ఒక్ షేర్ వినిపించారు. ఆ రెండు పంక్తులూ వినగానే గాలిబ్ చలించిపోయాడు. ‘ఈ షేర్ కనుక మోమిన్ నాకు ఇచ్చేస్తానంటే, నా దివాన్ మొత్తం మోమిన్ కి ఇచ్చేస్తాను’ అన్నాడట గాలిబ్. జయతి గాని ఈ రెండుపేజీలు నాకు ఇచ్చేస్తానంటే, నేనింతదాకా రాసిన నా రచనలు మొత్తం వదులుకోడానికి నాకెట్లాంటి సంకోచం లేదు.
~
పుస్తకం కావలసిన వారు Putta Pustaka Shibiram, Aalagadapa, Miryalaguda, Nallagonga, Telangana వారికి రాయవచ్చు లేదా 9848015364 ను సంప్రదించవచ్చు. వెల: రు.200/-
Featured photo courtesy: R. Ramadevi
22-11-2022