మనం కలుసుకున్న సమయాలు-1

జయతిని నేనిప్పటి దాకా కలుసుకున్నది నాలుగు సార్లే. మొదటిసారి జయతి, లోహి ఇద్దరూ హైదరాబాదులో మా ఇంటికి వచ్చారు. రెండోసారి వాళ్లు హైదరాబాద్ శివార్లలో, ఇబ్రహీంపట్నంలో ఉంటున్నప్పుడు, నేనూ, నిర్మలా వాళ్ళ దగ్గరికి వెళ్లాం. మూడోసారి ఆమె మొదటి పుస్తకం ‘అడవి నుండి అడవికి’ రవీంద్రభారతిలో ఆవిష్కరణ సభ జరిగినప్పుడు. నిన్న నాలుగో సారి బూరుగుపూడి దగ్గర, లోపల, పోలవరం కాలువ దాటిన తర్వాత, చిన్న గుట్ట మీద వాళ్లు కట్టుకున్న కుటీరంలో.

కానీ ఈ నాలుగు సార్లు జయతి అనే నెపం మీద నేను కలుసుకున్నది మిమ్మల్నే. ఈ నాలుగు సమయాలూ మనం కలుసుకున్న సమయాలే. డా.రాధాకృష్ణన్ రాసిన వాక్యం ఒకటి గుర్తొస్తోంది. ఆయన అన్నాడు కదా : ప్లేటోని ప్రేమించే ప్రతి జిజ్ఞాసి లోను ప్లేటో ఉన్నాడు, క్రీస్తును ఆరాధించే ప్రతి అనుయాయిలోనూ క్రీస్తు ఉన్నాడు అని. నిన్న మధ్యాహ్నం కాకినాడ నుంచి, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుండి, ఎన్నో దూరాలనుండి ఆ డొంకదారిన, ఆ గుట్ట దారిన, ఆ మెట్ట దారిన, ఆ పూల ఋతువులోకి జయతిని వెతుక్కుంటూ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిలోనూ జయతి ఉంది.

మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టాడు అని మనం గర్విస్తాం కానీ చంద్రుడి మీద అడుగు పెట్టింది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మనం కాదు. కాని ఆర్మ్ స్ట్రాంగ్ అడుగుపెట్టగానే చంద్రుడి మీద మనిషి అడుగు పెట్టాడు అని చెప్పుకున్నాం. అది చాలు మనకి. ఒక్క మనిషి చంద్రుడి మీద అడుగుపెట్టినా, అది ప్రపంచ జనాభా 800 కోట్ల మందీ చంద్రుడి మీద అడుగు పెట్టినట్టే.

జయతి జీవిస్తున్న జీవితం లాంటి జీవితం జీవించాలని మనలో చాలామందిమి అనుకోకపోవచ్చు. జీవించడానికి మనకి ఆ సాహసం కూడా ఉండకపోవచ్చు. కాని మనుషులు ఎవరూ సంచరించని ఆ తావులో, ఆ గుట్టమీద, చుట్టూ పూల మొక్కలు పెంచుకొని వాటి మధ్య ఆ సహచరులు ఇద్దరే జీవించగలడం చూసిన తర్వాత మనకందరికీ మనం కూడా ఆ జీవితంలో పాలుపంచుకుంటున్నావని అనిపించింది కదా! బహుశా మనం ఇప్పటిదాకా కలుసుకుంటూ వస్తున్న సమయాల్లో నిన్నటి సాయంకాలం లాంటి సమయం మరొకటి ఉండదని చెప్పగలను.

మనుషులు తోటి మనుషుల్ని, తోటి మనుషుల పట్ల తమ రాగద్వేషాల్ని, జీవితం ఇస్తున్న సౌకర్యాల్ని వదులుకోలేకపోవచ్చు. అదేమీ దోషం కాదు. మనుషులు కలిసి ఉండటం కోసమే ఈ ప్రపంచం ఇంకా ఇలా కూలిపోకుండా ఉందని నేను నమ్ముతాను. నిజానికి జయతి, లోహి ఆ కొండమీద కుటీరంలో, అనుక్షణం వాళ్ళు ఒక్కరే లేరనీ, మనమంతా వాళ్ళతో పాటే ఉంటున్నామనీ కూడా నిన్న నాకు బాగా అర్థమైంది.

మనుషుల్ని వదులుకోకపోతే మరి అంత దూరం పోవటం ఎందుకు అని అడగవచ్చు ఎవరైనా, నిన్న మనతోపాటు రానివాళ్లు లేదా రావాలని అనుకోని వాళ్ళు. ఒకప్పుడు జపాన్ లో సైగ్యొ అని ఒక జెన్ సాధువు ఉండేవాడు. ఆయన తొలి రోజుల్లో సమురాయిగా రాజాస్థానాల్లో ఉద్యోగం చేశాడు. ఎక్కడో ఆ జీవితం పట్ల విరక్తి పుట్టింది. జెన్ సాధువుగా జీవిత మొదలుపెట్టాడు. రాజధాని నుంచి దూరంగా వెళ్లిపోయాడు కానీ ఆ తర్వాత ఆయన రాసిన కవిత్వం చదువుతూ ఉంటే ఆయన మనుషుల నుంచి దూరంగా ఎక్కడ వెళ్ళాడు? సౌందర్యం నుంచి దూరంగా ఎక్కడికి వెళ్లాడు? చంద్రుడి నుంచి, కోకిల నుంచి దూరంగా ఎప్పుడు వెళ్ళాడు? అని అనిపిస్తుంది. సైగ్యొ తర్వాత, జపాన్ కవులందరికీ సైగ్యొ ఒక ఆదర్శంగా మారాక, బషొ లాంటి కవి సైగ్యొ తిరిగిన దారుల్లో తాను కూడా జపాన్ అంతా తిరిగేక, వాళ్ళ జీవితంలోనూ, వాళ్ళ కవిత్వంలో కూడా మళ్లా మనకి అదే లక్షణం కనిపిస్తుంది. అంటే ఏమిటి? వాళ్లు ప్రాపంచిక వాసనల నుంచి దూరంగా జరిగారు కానీ, ప్రపంచం నుంచి కాదని. ప్రపంచ బంధాలనుంచి దూరంగా జరిగారు గాని ప్రపంచంతో అనుబంధం నుంచి కాదని.

సైగ్యొ అడవికి వెళ్లి ఒక కొండ లోయలో కట్టెలు కొట్టుకుని ఏటి ఊటనుంచి నీళ్లు తెచ్చుకుని అన్నం వండుకుందామని కూర్చున్నప్పుడు , అతనికి ఒక కోయిల కూత వినిపించింది. అతడు ఆ కోయిలని ఉద్దేశిస్తూ అన్నాడు కదా: నేనిక్కడికి వచ్చిందే అన్నిటి నుంచి దూరంగా ఉందామని, కాని, ఇదేమిటి నువ్వు నన్ను వదలట్లేదు అని. ఎవరు ఎవరిని వదల్లేదు? కోకిల సైగ్యొని వదల్లేదు, సైగ్యొ కోకిలని వదలలేదు, వాళ్ళిద్దర్నీ జపాన్ వదల్లేదు, మనం వదల్లేదు.

టాగోర్ అన్నాడు వైరాగ్యంలో తనకు ఊపిరాడదని. జయతి లోహిల జీవితంలో ఉన్నది వైరాగ్యం కాదు. మనుషుల పట్ల అప్రమేయమైన ప్రేమ. జమా ఖర్చులకి, ఇచ్చి పుచ్చుకోడాలకి, లాభనష్టాలకీ అతీతమైన ప్రేమ. బహుశా మనమందరం మన కుటుంబంలో, మన కార్యాలయంలో, మన తోటి మనుషులతో కనీసం ఒక్కరితోనైనా, కనీసం ఒక్కరోజైనా, కనీసం ఒక్క గంట పాటు అయినా ఇట్లాంటి అనుబంధం కోరుకుంటున్నాం కాబట్టే నిన్న ఆ కుటీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళాం.

వదులుకోవడం ద్వారా పొందమని చెప్పాయి ఉపనిషత్తులు. వదులుకోవడం ద్వారా పొందడం అంటే ఏమిటో నాకు చాలా కాలం పాటు అర్ధం కాలేదు. అదొక విరుద్ధ వాక్యంగానూ, ఒక పేరడాక్స్ గానూ అనిపించేది. కానీ వదులుకోవడం ద్వారా పొందడం అంటే ఏమిటో నిన్న నాకు బాగా అర్థమైంది. జయతి, లోహి ప్రపంచాన్ని వదులుకున్నారు కాబట్టి ప్రపంచాన్ని పొందగలిగారు. కనీసం ఆ కొద్ది సేపైనా తక్కినవన్నీ పక్కన పెట్టగలిగాం కాబట్టి నిన్న మనం వాళ్ల సన్నిధి పొందగలిగాం.

జీవితంలో ఇదొకటి బాగా గుర్తుపట్టగలిగాను. ఎవరు తమ కుటుంబాలకు దూరమయ్యారో, తమ వాళ్లని వదులుకోవలసి వచ్చిందో వాళ్లకి ఎన్నో కుటుంబాలు దగ్గరగా జరగడం చూసాను. మాకెంతో ఇష్టమైన మా ఊరిని 1985 లో మేము పెట్టవలసి వచ్చింది. కానీ రెండేళ్లు తిరగకుండానే నాకు గిరిజన సంక్షేమ శాఖలో ఉద్యోగం దొరికి, అన్ని గిరిజన గ్రామాలూ నావే అయిపోయాయి. మరొక చిత్రం కూడా చూశాను- ఎవరు దేన్ని వదులుకోలేక, ఏ ఇంటిని, బంధాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపకాన్ని, చివరకు ఐడియాలజీని వదులుకోలేక పట్టుకు వేలాడుతుంటారో, వారి నుంచి తక్కిన వారు నెమ్మదిగా దూరంగా జరిగిపోతుండడం కూడా చూసాను. బహుశా మనందరిలోనూ స్వేచ్ఛ గురించిన అపరిమితమైన కాంక్ష ఒకటి మనకే తెలియకుండా చాలా బలంగా ఉంటుందనుకుంటాను. అందుకే జిబ్రాన్ అన్నాడు: ప్రతిరోజు నీ ఇంటికి మరలి వచ్చే నీలోనే ఎల్లలేని సంచారి కూడా ఒకడున్నాడు అని. మన ఇంటిని, మన cosy homes ని, మన నెట్ ఫ్లిక్స్ ని, ఆమెజాన్ ప్రైమ్ ని, మన డ్రాయింగ్ రూమ్ గోష్ఠి ని మనం ఇష్టపడుతున్నట్టు అనుకుంటున్నాము కానీ, మనకు కూడా రెక్కలు ఉన్నాయనీ, ఆ రెక్కలతో ఒకసారి అయినా ఎక్కడికో ఎగిరి పోవాలనీ లేదా కనీసం ఎగిరి రావాలనీ మనలో మనని ఏదో తెలియకుండానే వేధిస్తోనో, ప్రోత్సహిస్తూనో ఉంటుందనుకుంటాను. నిన్న ఆ కుటీరంలో సమావేశమైన ప్రతి ఒక్కరికి ఆ రెక్కలు పూర్తిగా విప్పారి ఉండడం నేను కళ్లారా చూశాను.

జయతి, లోహిలకు మనం అవసరం. ఎందుకంటే వాళ్లు పూల తోటి, పిట్టల తోటి, పురుగుల తోటి మాట్లాడుకుంటున్న మాటలు చెప్పుకోవటానికి, వినటానికి మనం కావాలి. కానీ అంతకన్నా కూడా ఎక్కువగా మనకి జయతి, లోహి కావాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కలుసుకుందాం అనుకుంటే, ఒక సమయం చిక్కాలి అంటే, అట్లాంటి వాళ్ళు మనకి ఉండాలి. ఎంత దూరంలో కానీ ఏ కొండకొమ్ము మీద కానీ ఏ సముద్రపు ఒడ్డున కానీ ఎక్కడో ఒక చోట, వాళ్లు జీవించే ఒక తావు ఉండాలి. అందుకని వాళ్లు చల్లగా ఉండాలి. మనకీ, వాళ్ళకీ మధ్య ఒక uninterrupted network సదా కొనసాగుతుండాలి.

21-11-2022

Leave a Reply

%d bloggers like this: