పిల్లలపండగ

Reading Time: 3 minutes

క్రియ సంస్థ నిర్వహించే పిల్లల పండగ కాకినాడలో నిన్న ఎంతో ఉత్సాహంగా మొదలయ్యింది. పిల్లల పండగ అంటే పదేళ్ళ కిందటి దాకా కొత్తగూడెంలో వాసిరెడ్డి రమేష్ బాబు గారు నిర్వహిస్తూ ఉండే బాలోత్సవం గుర్తు వస్తుంది. ప్రభుత్వాలో, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలో అంగ బలం, అర్థబలం పుష్కలంగా ఉండేవాళ్లు నిర్వహించవలసిన ఉత్సవాలు. కానీ రమేష్ బాబు గారు ఒక్కడు వంటి చేత్తో ఒక ఏడు కాదు రెండేళ్ళు కాదు పాతికేళ్లపాటు నిర్వహించారు. అట్లాంటి బాలోత్సవానికి ఒక ఏడాది నన్ను కూడా అతిథిగా పిలిచారు. రకరకాల కారణాలవల్ల కొత్తగూడెంలో బాలోత్సవం జరగడం ఆగిపోయాక ఆ దివిటీని క్రియ అందిపుచ్చుకుని ముందుకు నడిచింది. 2013 నుంచి గత పదేళ్ళుగా కాకినాడలో పిల్లల పండగని ఎంతో ప్రేమతో శ్రద్ధతో సమర్థవంతంగా నిర్వహిస్తోంది.

కిందటేడాది కరోనా వల్ల నిర్వహించలేకపోయిన పండగ కావడంతో ఈ ఏడాది ఈ పండగకి గొప్ప స్పందన లభించింది. మొదటి రోజే 8000 నుంచి 10000 మంది దాకా పిల్లలు పాల్గొన్నారు.

పిల్లల పండగ పోటీల పండగ కాదు. అయినా పిల్లల ప్రతిభా సామర్ధ్యాలు చూపించడానికి ఎన్నో రకాల పోటీలు- వక్తృత్వం, వ్యాసరచన, నాటకాలు, పద్యపఠనం లాంటి సంప్రదాయకమైన పోటీలే కాదు స్పెల్లింగ్ పోటీ, మేప్ పాయింటింగ్ లాంటి కొత్త పోటీలతో పాటు, అన్నిటికన్నా విశేషం కథా రచన, కథా విశ్లేషణ లాంటి కొత్త అంశాలకు కూడా ఇక్కడ పిల్లలకు అవకాశం ఇచ్చారు.

నిన్న ప్రారంభోత్సవం నాడు కథా రచన పోటీ ప్రారంభిస్తూ నన్ను కథలు రాయడం గురించి పిల్లలకు చెప్పమన్నారు. మా చిన్నప్పుడు ఇలా కథలు రాయడం గురించి పోటీ పెట్టి ఉంటే, కథా విశ్లేషణ చేయమని చెప్పి ఉంటే ఎంతో మంచి కథకులుగా రూపొంది ఉండేవాళ్ళం. కథలు రాసే విద్య తరగతి గదుల్లో చెప్పరు. టాగోర్ర్ ఒక కథలో అంటాడు: పిల్లవాడికి చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ సప్తసముద్రాలు దాటి వెళ్ళే రాకుమారుడి గురించి కథ చెప్పడం మొదలుపెట్టగానే బడిపంతులు వచ్చి మూడు పన్నెండ్లు ముప్ఫై ఆరు అంటూ ఎక్కం వల్లించడం మొదలుపెడతాడు అని. తరగతి గదులు పిల్లల్లోని సృజనాత్మక ప్రపంచాన్ని మేల్కొల్పడం నుంచి ఎప్పుడో దూరంగా జరిగిపోయాయి. ఇప్పుడు పిల్లల్ని పోటీ సామర్ధ్యాలకు నిలబడగల intellectual athlets గా మార్చడం ఎలా అన్నదాని గురించి ఆలోచిస్తున్నాయి. కానీ పిల్లలు పుడుతూనే వాళ్లకి సహజంగా రెండు విద్యలు పట్టు పడతాయి-ఒకటి బొమ్మలు గీసే విద్య, రెండవ కథలు చెప్పే విద్య. పసితనంలో ఈ రెండు పనులూ చేయని పిల్లవాడు ఉండడు. కానీ పెద్దయ్యే కొద్దీ నూటికో, కోటికో ఏ ఒక్కరో మాత్రమే ఈ విద్యల్ని కాపాడుకోగలుగుతారు, తక్కిన వాళ్లంతా ఉద్యోగస్తులుగా మారిపోతారు.

అందుకని ఈసారి పిల్లల పండుగలో, ఈ కథారచన పోటీకి, పిల్లలకి కథ గురించి చెప్పటం నాకు చాలా సంతోషం కలిగించింది. రెండేళ్ల కిందట పాఠశాల విద్యాశాఖ అధిపతిగా నేను పిల్లల పండగలో పాల్గొన్నప్పటి కన్నా సరిగ్గా ఈ కారణం చాతనే, ఈసారి నా భాగస్వామ్యం నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది.

ఈసారి పండగలో మరో విశేషం రెండు రాష్ట్రాల నుంచీ, ఒకరు అమెరికానుంచి కూడా, పెద్ద ఎత్తున కవులు, రచయితలు ఈ పండగలో పాల్గొనడం. దాదాపు నలభై యాభై మంది సాహిత్యవేత్తలు తమ బాల్యాన్ని వెతుక్కుంటూ ఈ పండగ ప్రాంగణంలో ఉత్సాహరంగా తిరుగుతుండడం చూశాను.

బహుమతి ప్రదానం చేస్తూ

నిన్న సాయంకాలం మరో విశేషం వాసిరెడ్డి రమేష్ బాబు గారి జీవన వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని మిత్రులు ఆయన పైన ఒక అభినందన సంచిక వెలువరించటం. ఆయన్ని సర్ప్రైజ్ చేస్తూ ‘నది లాంటి మనిషి’ పేరిట వెలువరించిన ఆ సంచికని డా. జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. ఆ వేదిక మీద రమేష్ బాబు గారిని అభినందించే అవకాశం నాకు కూడా కలగడం నా భాగ్యం.

మొదటి రోజు రాత్రి డిన్నర్ పూర్తయ్యాక మిత్రులందరూ మళ్లా జమయ్యారు. రమేష్ బాబు గారితో తమ సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని మిత్రులు ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా పంచుకున్నారు. మధ్యలో ఇద్దరు ముగ్గురు గాయకులు చక్కటి పాటలు పాడారు.

ఇలాంటి పండగలు ప్రభుత్వాలు ఎందుకు నిర్వహించలేవు అని ఎవరో ప్రశ్నించారు. ఉపాధ్యాయ సంఘాలైనా ఎందుకు ఇలాంటి ఆలోచనలు చెయ్యవని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. పిల్లల్ని సమీకరించడం, నిజానికి, ప్రభుత్వాలకి చాలా సులభమైన పని. ఉపాధ్యాయుల్ని సమీకరించడం ఉపాధ్యాయ సంఘాలవృత్తి. కానీ పిల్లల పండగ నిర్వహించాలంటే అన్నిటికన్నా ముందు పిల్లల పట్ల ప్రేమ ప్రధానం కావాలి. తక్కిన వాటిని పక్కన పెట్టెయ్యగల ఔదార్యం ఉండాలి, అందుకు అపారమైన ఆత్మధైర్యం కావాలి. కాబట్టే ప్రభుత్వానికీ, ఉపాధ్యాయ సంఘాలకీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సాధ్యం కాదనుకుంటాను.

20-11-2022

Leave a Reply

%d bloggers like this: