హిందువులూ, ముస్లిములూ కాదు, మనుషుల కథలు

ఎన్నో ఏళ్ళ కిందట జగన్నాథ రావు గారు ఆ కథ చెప్పిన మొదటిసారి నన్ను ఎవరో బాకుతో పొడిచినట్టనిపించింది. బహుశా ఆ కథ చదివిన ప్రతి ఒక్కరి అనుభవం అలాగే ఉంటుందనుకోవచ్చు. ఆ తర్వాత చాలా కాలానికి తెలిసింది, ఆ కథ పేరు ‘ఖోల్ దో ‘అనీ, ఆ రచయిత సాదత్ హసన్ మంటో అనీ.

పూర్ణిమ తమ్మిరెడ్డి అనువాదంలో ఆ చివరి పేరా-

సాయంకాలం అవుతుండగా కాంపు దగ్గర సిరాజుద్దీన్ కూర్చున్నాడు. ఆ దగ్గరలోనే ఏదో గడబిడ అయింది. నలుగురు మనుషులు ఏదో మోసుకుంటూ వచ్చారు. అతడు ఆరా తీస్తే తెలిసింది, ఎవరో అమ్మాయి స్పృహ తప్పిపోయి రైల్వే లైను దగ్గర పడుందని. జనాలు ఆమెను మోసుకొని తీసుకొచ్చారని. సిరాజుద్దీను వాళ్ళ వెనుకే వెళ్ళాడు. జనాలు అమ్మాయిని వాళ్లకి అప్పగించి వెళ్ళిపోయారు. అతడు కొద్దిసేపటి వరకూ ఆసుపత్రి బయటున్న చెక్క స్తంభం పట్టుకుని నుంచున్నాడు. తర్వాత మెల్లిగా లోపలకి వెళ్ళాడు. గదిలో ఒక్కసారిగా వెలుతురు వచ్చింది. సిరాజుద్దీను శవంలా పాలిపోయిన మొహం మీద పెద్ద పుట్టుమచ్చ చూసి, అరిచాడు, ‘సకీనా!’

గదిలోకి వెలుతురు వచ్చేలా చేసిన డాక్టరు సిరాజుద్దీను ని అడిగాడు: ‘ఏంటి?’

సిరాజుద్దీను నాలుక నుండి ఈ మాత్రమే బయటకి వచ్చాయి: ‘అదీ ..నేను..నేను..దీని నాన్నను.’

డాక్టర్రు స్ట్రెచరు పై పడున్న శవం వైపు చూసాడు. ఆమె నాడిని చూసి కిటికీ తెరవమని సూచిస్తూ సిరాజుద్దీన్ తో అన్నాడు:

‘ఖోల్ దో!’

మృతశరీరంలో కదలిక పుట్టింది. జీవంలేని ఆమె చేతులు నాడాను విప్పి, సల్వారుని కిందకి జార్చాయి. ముసలి సిరాజుద్దీను ఆనందంగా అరిచాడు.:’బతికే ఉంది.. నా బిడ్డ బతికే ఉంది.’

డాక్టరు తలనుంచి పాదం వరకూ చెమటలో తడిసి ముద్దయ్యాడు.

ఇంత బీభత్సంగా ఉన్న ఈ దృశ్యాన్ని రంగస్థలం మీద చూపించగలమా? చూపిస్తే అంతే ప్రభావశీలంగా ఉండగలదా?

చూపించగలమనే అనుకున్నారు బి స్టూడియో వారు. చూపించారు కూడా. అంతే శక్తిమంతంగా.

11 వ తారీకు రాత్రి రంగభూమిలో మంటో కథలమీద నాటకం ప్రదర్శిస్తున్నారు రమ్మని ఆదిత్య పిలిస్తే వెళ్ళాను. నాతో పాటు యువకుడు, సంస్కారి, ఆదర్శవాది ఇప్పుడు ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారిగా పని చేస్తున్న విజయభాస్కర్ కూడా వచ్చాడు

మంటో కథల్ని ఇటీవల పూర్ణిమ తమ్మిరెడ్డి చేసిన అనువాదాన్ని ‘సియా-హాషియే ‘పేరిట ఎలమి ప్రచురణల వారు వెలువరించారు. అందులో సహాయ్ అనే ఒక కథ, పైన చెప్పిన ఖోల్ దో కథ, రెండు కథల్ని తీసుకుని ‘పరాయి’ అనే నాటకంగా మలిచారు. అయితే ఈ రెండూ విభజన కాలం నాటి కథలు. డెబ్భై ఏళ్ళ కిందటి కథలు. విభజన విషాదం ఇప్పటికీ మూడు దేశాల్నీ వెంటాడుతూనే ఉంది. దేశవిభజన నాటి కన్నీళ్ళను ఇంకా కవులూ, కథకులూ కథలుగా మారుస్తూనే ఉన్నారు. ఈ మధ్య బుకర్ ప్రైజు పొందిన నవల The Tomb of Sand కూడా ఆ నేపథ్యంలోంచి వచ్చిన రచననే.

అయితే విద్వేషం విభజనకు ముందు ఉంది, కాని అది విభజనతో చల్లారలేదు. రాను రాను మరింత తీవ్రరూపం ధరిస్తూనే ఉంది. మతసహనానికీ, భిన్న సంస్కృతుల సహజీవనానికీ పాదు అని మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న భారతదేశం ఇప్పుడు మతవిద్వేషంతో మరింత రగిలిపోతూ ఉంది. అయితే విభజనకు దారితీసిన పరిస్థితుల్లో కనవచ్చే స్థూల రూపానికి ఇప్పుడు ఆ విద్వేషం అనేక సూక్ష్మ రూపాల్లో కొనసాగుతూ ఉంది. అది ఈ దేశంలో అల్పసంఖ్యాకులుగా మిగిలిపోయిన ముస్లిముల అసిత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తూ ఉంది. ప్రతి ఒక్కచోటా వారు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోడానికి పోరాడవలసి వస్తోంది, కొన్ని సార్లు పరియాచన చెయ్యవలసి వస్తోంది, మరికొన్ని సార్లు తమ ముఖాలే తమవి కావని చెప్పుకోవలసి వస్తోంది. సూక్ష్మ రూపంలో కొనసాగుతున్న ఈ విద్వేషాన్ని, వివక్షని మరొక కథగా దర్శకుడు పై రెండు కథలకు జమచేసి నాటకాన్ని మరింత సమకాలికం, మరింత ప్రాసంగికం చేసాడు.

రూపకం నడుస్తున్నంతసేపూ మనం మనలోకి చూపుసారిస్తాం. మనల్ని మనం ఎన్నో ప్రశ్నలు వేసుకుంటాం, ఏవో జవాబులు చెప్పుకోడానికి ప్రయత్నిస్తాం. కానీ ఏ ఒక్క జవాబూ తృప్తి కలిగించదు. మనలో ఈ కలవరం కలిగించడమే నాటక బృందం ఉద్దేశ్యమయితే వారు అనుకున్నది సాధించారనే చెప్పాలి.

ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది నాటకం అని రాయవలసిన పనిలేదు. కథల్ని రంగానువాదం చేసిన అనంతు చింతలపల్లి, ప్రియాంక, దర్శకుడు ఉస్మాన్ ఘని కృతకృత్యులయ్యారు. నటీనటవర్గంతో పాటు నేపథ్యసంగీతానిది కూడా పెద్ద పాత్ర. కిక్కిరిసిన కాందిశీకుల్ని మోసుకు పోతున్న రైలు, తప్పిపోయిన వాళ్ళ పేర్లు నిర్విరామంగా వినిపిస్తుండే అనౌన్సుమెంట్లు, బొంబాయి నుండి కరాచీ బయల్దేరిన ఓడ చుట్టూ ఘూర్ణిల్లే సముద్ర కెరటాలు, వారణాసిలో ఒక బ్రోతల్ హౌసు- ఆ వాతావరణాల్ని మన కళ్ళముందుకు తీసుకువస్తాయి. సరళంగా, సూటిగా ఉండే మాటలు, మధ్యలో ఒకటి రెండు కవితలు.

నాటకం పూర్తయ్యాక ప్రేక్షకుల స్పందన చెప్పమని అనంతు విమలని, డానీని, నన్నూ పిలిచాడు. అందరిదీ ఒకటే మాట. ఈ ప్రదర్శన ఇక్కడితో ఆగకూడదు. వీలైనన్ని సార్లు వీలైనన్ని చోట్ల ప్రదర్శించాలని. ఒక ప్రదర్శనకి నలభై వేల దాకా అవుతుందిట. కనీసం.

ఇంకో మాట కూడా చెప్పాలి. నటీనటబృందంలోనూ, సాంకేతిక నిపుణుల్లోనూ హిందువులున్నారు, ముస్లిములున్నారు. వాళ్ళంతా యువతీయువకులు. రేపటి భారతదేశం మీద నమ్మకం పుట్టింది వాళ్ళని చూస్తే.

16-11-2022

Leave a ReplyCancel reply

Exit mobile version
%%footer%%