పురాణపాత్రలపై కొత్తవెలుగు

రావెల సోమయ్యగారు, అరుణ గారు నేను జీవితంలో చూసిన అత్యున్నత సంస్కారవంతుల్లో మొదటివరసలో వస్తారు. వారి స్నేహశీలత, జ్ఞానం పట్ల తృష్ణ, మనుషుల పట్ల గౌరవం నాకు ఎంతో ఆరాధనీయంగా గోచరిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల వారికి ఉండే కుతూహలం, అలా తెలుసుకునేవాటిపట్ల వారికుండే openness తక్కినవాళ్ళల్లో అంత సులభంగా కనిపించేవి కావు.

ఈ సంస్కారం, ఈ openness వారికి బహుశా పుట్టుకతోటే వచ్చి ఉండవచ్చు, కాని వారిలో వాటిని ప్రోజ్వలంగా నిలబెట్టినవాడు మాత్రం లోహియా అనే చెప్పాలి. వారిద్దరికీ రామ్ మనోహర్ లోహియా మిత్రుడు, గురువు, మార్గదర్శకుడూనూ. సోమయ్యగారి జీవితంలో లోహియా ఎంతగా భాగమైపోయాడంటే ఆయన తన కొడుక్కి మనోహర్ అనే పేరు పెట్టుకున్నారు. తాను ఎమర్జెన్సీ రోజుల్లో అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎక్కడైనా హోటల్లో తలదాచుకోవలసి వస్తే తన పేరు మనోహర్ అని రాసుకునేవారు. ఒక మనిషి తన స్నేహితుడిని ఇంత ప్రాణప్రదంగా దగ్గరకు తీసుకున్న ఉదాహరణలు నాకు తెలిసి మరొకటి కనిపించడం లేదు.

‘మా లోహియా ఏమి రాసినా నాకు నచ్చుతుంది’ అన్నారు సోమయ్యగారు ఒకసారి నాతో. అది లోహియాలోని openness వల్ల. అన్నిటికన్నా ముందు openness ని ఒక విలువగా గుర్తించడాన్ని లోహియా సోమయ్యగారికి నేర్పినందువల్ల. నాకు సోమయ్యగారు 1995 లో పరిచయం. దాదాపు మూడు దశాబ్దాలు కావొస్తోంది. వారితో స్నేహం ఏర్పడ్డాక వందసార్లేనా వారి ఇంటికి వెళ్లి ఉంటాను. ఆయన ఎన్నో సార్లు మా ఆఫీసుకు వచ్చ్చారు, మరెన్నో సార్లు మేము ఏ సమావేశాల్లోనో కలుసుకున్నాం. జీవిత ప్రథమార్థంలో నాస్తికులుగా ప్రయాణం మొదలుపెట్టిన ఆ దంపతులు, భారతీయ ఇతిహాసాల గురించి, పురాణాల గురించి, ఋషుల గురించి, దర్శనాల గురించి నన్ను అడిగే ప్రశ్నలు, వాటి గురించి ఇంకా తెలుసుకోవలసింది చాలా మిగిలిపోయిందనే sense of urgency తో వారు చేసే సంభాషణలు నన్నెంతో ఆశ్చర్యానికి లోనుచేస్తుంటాయి.

భారతదేశం తన గురించి తాను తెలుసుకోవలసింది చాలానే ఉందనీ, అది ఒకవైపు మన గతం, మన సంస్కృతి, మరొకవైపు మన గ్రామాలు, మన ప్రజలు అని సోమయ్యగారి నమ్మకం. అందుకనే ఆయన మన పురాణాల గురించి లోహియా రాసిన కొన్ని వ్యాసాల గురించి చాలా సార్లు నాతో పదే పదే చెప్పేవారు. అవి హిందీలోనే ఉండిపోయి, ఇంగ్లిషులోకి రానందువల్ల తెలుగులోకి రాకుండా ఉండిపోయాయి. అందుకని, ఇప్పుడు, సోమయ్యగారు తన 87 ఏళ్ళ వయసులో ఆ వ్యాసాల్ని తన మిత్రులకి ఇచ్చి తెలుగులోకి అనువదింపచేసి పుస్తకరూపంగా వెలువరించారు. ఆ పుస్తకాన్ని నిన్న జవహర్ లాల్ జాతీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆనదమోహన్ ఆవిష్కరించి ప్రసంగించారు. ఆ సభలో సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి సుదర్శనరెడ్డి, రామచంద్రమూర్తి, భాస్కరం, నాగసూరి వేణుగోపాల్, రావెల సాంబశివ రావు, అవధానం రఘుకుమార్ లు కూడా ప్రసంగించారు. ఆ సభకి అధ్యక్షత బాధ్యత సోమయ్యగారు నాకు అప్పగించారు.

పురాణ పాత్రలపై కొత్త వెలుగు అనే పేరిట వెలువరించిన ఆ పుస్తకంలో లోహియా రాసిన అయిదు వ్యాసాలు ఉన్నాయి. ద్రౌపది, సావిత్రి పాత్రల పరిశీలన, కృష్ణుడి పైన విశ్లేషణ, రాముడి, కృష్ణుడి, శివుడి అమేయవ్యక్తిత్వాల ప్రశంస లు ప్రధాన వ్యాసాలు. 1957 లో లోహియా ఉత్తరప్రదేశ్ లో సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్ళిన సందర్భంలో అప్పటి జైళ్ళ శాఖామంత్రి, పండితుడు సంపూర్ణానంద్ కు రాసిన ఒక సుదీర్ఘ లేఖతో పాటు, 1961 లో చిత్రకూటంలో రామాయణ తిరునాళ్ళు జరపడానికి చేసిన సన్నాహాల వ్యాసం కూడా ఉన్నాయి. ఈ అయిదువ్యాసాలమీదా అయిదుగురి పరిశీలనాత్మక ప్రశంసలతో పాటు, మొత్తం పుస్తకానికి కల్లూరి భాస్కరం గారు రాసిన సమగ్రమైన, సుదీర్ఘమైన పరిచయ వ్యాసం కూడా ఉంది. ఈ పుస్తకాన్ని వివేకానందుల స్మృతికి అంకితమిచ్చారు.

ఇందులో లోహియా రాసిన అయిదు వ్యాసాలూ  భారతరామాయణాల పట్ల జీవితకాలం మననం చేస్తూ ఉన్న భావుకుడు రాసినవి. అందులోనూ కృష్ణుడు పైన రాసిన వ్యాసం వట్టి వ్యాసం కాదు. అది ఒక కవి మాత్రమే రాయగల వ్యాసం. లోహియా ఒక మీరాగా, ఆండాళ్ గా ఒక స్త్రీగా మారి రాసిన వ్యాసం. ఈ అయిదు వ్యాసాల్లోనూ పురాణాలపైన నిజంగానే కొత్త వెలుగు ప్రసరిస్తోంది. కాని ఆ వెలుగు ఒక విద్యార్థి వెతుక్కునే వెలుగునో లేదా ఒక భక్తుడు కోరుకునే వెలుగునో కాదు. సమకాలిక భారత రాజకీయ ప్రస్థానాన్ని ఎంతో దగ్గరగా గమనించే ఏ సామాజిక, రాజకీయవేత్తకైనా సరే తటిల్లున గోచరించే వెలుగు. ఆ వ్యాసాల్లో చర్చించింది అయిదు వేల ఏళ్ళ కిందటి పురాణస్త్రీపురుషుల గురించి కాదు, సమకాలిక రాజకీయ శక్తుల గురించి అని అర్థమవుతుంది. లోహియా ఈ వ్యాసాలు రాసి అరవై ఏళ్ళకు పైనే కావొస్తున్నది గాని, ఆ రోజు రాజకీయనాయకులు, ప్రభుత్వాలు ఆ వ్యాసాల్లోని ప్రాసంగితకను గుర్తించి ఉంటే, తమ విధానాలను తాము సరిదిద్దుకుని ఉంటే, ఈ రోజు భారతదేశ రాజకీయ పరిస్థితి ఇలా ఉండేది కాదు అని అనిపిస్తుంది.

ఉదాహరణకి, లోహియా తలపెట్టిన రామాయణ మేళా సంగతే చూడండి. ఆ మేళా గురించిన ఆయన తలపులు, ఏర్పాట్లు, చర్చనీయాంశాలు, ప్రజలకీ, ప్రభుత్వాలకీ విజ్ఞప్తులు, చివరకు ఏ ఒక్కరూ కలిసి రాక ఆయన ఆ మేళా ఆలోచన విరమిస్తూ రాసిన మాటలు చూడండి. నాకైతే ఆ మొత్తం వ్యాసమంతా ఒక విషాదాంత రూపకంగా కనిపించింది. అసలు లోహియా రామాయణ మేళా జరపడానికి చిత్రకూటాన్ని ఎంచుకోవడంలోనే రామాయణ రహస్యమూ, రాజకీయ వివేకమూ కలగలిసి ఉన్నాయి. రామాయణమంతా చదివినప్పుడు మనకి రాముడు అపారమైన సంతోషాన్ని అనుభవించింది అయోధ్యలోనో, పంచవటిలోనో, తాను జయించిన లంకలోనో కాదనీ, అది రెండే చోట్ల- చిత్రకూటం, పంపాసరస్సు దగ్గరా అని తెలుస్తుంది. అన్నిటికన్నా పంపాతీరాన్ని ఆయన ఎంతో ఇష్టపడ్డాడుగాని, అప్పుడు ఆయన పక్కన సీతలేదు. సీతతో కలిసి అడవిలో గడిపిన మరొక ఆనందధామం చిత్రకూటం. అక్కడ సీతారాముల విహారానికి ప్రకృతి మొత్తం పరవశించింది. అంతేనా? రాముణ్ణి వాల్మీకి ‘గిరివనప్రియుడు’ అన్నాడు. అంటే కొండల్నీ, కోనల్నీ ప్రేమించేవాడని. కొండకోనల్ని ఇష్టపడే రాముడి గురించి చిత్రకూటం దగ్గర మాట్లాడుకోవడంలో ఎంత ఔచిత్యం ఉంది! ఎంత రసమయభావన అది! అంతేనా? రామాయణ గానవేదికగా రామ్ మనోహర్ లోహియా చిత్రకూటాన్ని ఎంచుకోవడంతో అయోధ్య మరుగునపడిపోలేదా! ఆ రోజు ఆయన తలపెట్టినట్టుగా రామాయణ మేళా చిత్రకూటంలో జరిగి ఉంటే తర్వాత రోజుల్లో అయోధ్యలో రామాలయం కట్టాలనే ఆ రాజకీయ తహతహకు అధికసంఖ్యాకుల మద్దతు లభించి ఉండేది కాదు కదా. రాముడుండేది రామకథాశ్రవణం జరిగేచోటతప్ప ఒక మసీదు కింద కాదని ప్రజలు సులభంగా గ్రహించి ఉండేవారు కదా. లోహియా ప్రతిపాదనలోని దీర్ఘదృష్టి, రాజకీయ వివేకాల్ని ఆనాటి పాలకులు గ్రహించని దాని పర్యవసానం 1992 నుంచి 2022 దాకా మనం చూస్తూనే ఉన్నాం.

Myth  గురించి మాట్లాడేటప్పుడు మనుషులు అది ఎప్పుడో పురాణకాలంలో తలెత్తి కాలం చెల్లిపోయిన విషయంగా భావిస్తుంటారు. లేదా దాన్ని సైన్సుతో పోటీకి పెట్టి, సైన్సు రావడంతో మిత్ అవసరం తీరిపోయిందని వాదిస్తారు. కాని మిత్ ever recurrent. అది ఎప్పటి సామాజిక-రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా అప్పటికప్పుడు రూపం మార్చుకుని మళ్ళా ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. సైన్సు వల్ల మిత్ పక్కకు తప్పుకోదు సరికదా, టెక్నాలజీ వల్ల మిత్ కి కొత్త అభివ్యక్తి రూపాలు దొరుకుతూనే ఉంటాయి. ప్రాకృతిక రహస్యాల్ని విప్పిచెప్పేదిగా ఒకప్పుడు మిత్ ని భావించి ఉండవచ్చు. ఇప్పుడు సైన్సు సమర్థవంతంగా ఆ పని చేస్తున్నది కాబట్టి మిత్ అవసరం తీరిపోయిందంటారు కొందరు. కాని మానవ ప్రకృతి మాట? అందుకనే మిత్ గురించి రాస్తూ ఒక విశ్లేషకుడు myth and ritual are ways of coping not with nature but with human nature-with human aggression  అన్నాడు (Robert A Segal, Myth, A Very Short Introduction, Oxford, పే.117).

పురాణాలకు సంబంధించి ఇప్పుడు రెండు వైఖరులు బలంగా ఉన్నాయి. ఒక వైఖరి పురాణాల అర్థాన్ని ఎప్పటికప్పుడు స్థిరపరిచే ప్రయత్నం చేస్తుంది. అంటే రాముడు అయోధ్యలోనే పుట్టాడు, కాబట్టి రాముడు ఎంత ఆరాధనీయుడో, అయోధ్యకూడా అంతే ఆరాధనీయం అనే లాంటి వాదన. రెండో వైఖరి, అసలు రాముడు ఆరాధనీయుడే కాదనే వైఖరి. కాని అత్యధిక సంఖ్యాకులకి అయోధ్యతో నిమిత్తం లేకుండా రాముడు ఆరాధనీయుడు. వాళ్ళు రాముడికోసం అయోధ్యలో కాదు, తమ గుండెలో గుడికట్టుకున్నారు. రామరాజ్యం కోసం ‘జై శ్రీరాం’ నినాదంలో వెతకరు, రామనామంలో వెతుక్కుంటారు. వారిని ఉద్దేశించి వారి విశ్వాసాల్నీ, మన్నననీ, మర్యాదనీ ఉద్దేశించి మాట్లాడే ఒక కబీరు, ఒక కంబరు, ఒక త్యాగయ్య నేడు ఎక్కడున్నారు? వాళ్ళకి మనం చోటు ఇవ్వనందువల్లనే కదా, మనుషులు మందగా మారి పక్కవాళ్ళ ప్రార్థనాస్థలాలు కూలగొడుతున్నారు!

ఇన్నాళ్ళకు ఈ వ్యాసాలు ఆ చోటుని మనముందుకు తీసుకొచ్చాయి. రండి, కొంతసేపు ఇక్కడ విహరిద్దాం. అయితే ఇక్కడ అహ్లాదం ఎంత ఉందో ఆవేదన కూడా అంతే ఉంది. నిన్న నేను ప్రసంగిస్తూండగా, ముందు వరసలో ఒక శ్రోత పుస్తకానికి పరిమితమై మాట్లాడండి అన్నాడు. నేనన్నాను కదా, ‘ఇదే లోహియా చెప్తున్నది, ముందు నేనేం చెప్తున్నానో విను, ఎందుకు చెప్తున్నానో ఆలోచించు, అప్పుడు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. నన్ను మాట్లాడనివ్వకపోతే రేపు నిన్ను కూడా మాట్లాడనివ్వరు గుర్తుపెట్టుకో’ అన్నాను.

~

పుస్తకం కావలసినవారు Southern Springs Publishers Pvt.Ltd, Hyderabad వారిని southernspringspublishers@gmail.com ద్వారాగాని, 91009 42260/74/75 ను ఫోన్ ద్వారా గాని సంప్రదించవచ్చు. వెల రు.200/-

4 Replies to “పురాణపాత్రలపై కొత్తవెలుగు”

  1. ‘ముందు నేనేం చెప్తున్నానో విను, ఎందుకు చెప్తున్నానో ఆలోచించు, అప్పుడు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. నన్ను మాట్లాడనివ్వకపోతే రేపు నిన్ను కూడా మాట్లాడనివ్వరు గుర్తుపెట్టుకో’ relevent advise

  2. ఈ పుస్తకంలోని భావాలు చాలా గొప్పవి. ఇవి నిజంగానే రాముణ్ణీ, కృష్ణుణ్ణీ, ఆయన చిటికెన వ్రేలు నొప్పినీ, వ్రజాన్నీ, ఇంకా ఆనాటి సమస్త వాతావరణాన్నీ కొత్తగా చూపిస్తున్నాయి. రసమయ, తేజోమయ కర్తవ్యం గురించి కూడా చాలా మంచి వ్యాఖ్య ఇచ్చారు మీరు. ఆ పుస్తకం మీరు చదువుతూ ఉంటే మీ నవ్వూ, మీ pause కూడా ఆ కొత్త వెలుగుకి జోడీ కుదిరాయి.

Leave a Reply

%d bloggers like this: