గోండీ సాహిత్యం కోసం

‘మేము తెలుగునుంచి బాలసాహిత్యం గోండీలోకి అనువాదం చేయడానికి ఉట్నూరులో వర్క్ షాప్ పెడుతున్నాం. మీరు వచ్చి మా రచయితల్ని కొద్దిగా మోటివేట్ చేస్తారా’ అనడిగాడు పత్తిపాక మోహన్. ఈ ఏడాది సాహిత్య అకాదెమీ బాలసాహిత్యపురస్కారం పొందిన రచయిత. తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రాజెక్టు మేనేజరు.

ఉట్నూరు వెళ్ళడం నాకు ఎప్పుడూ ఇష్టమే. ముప్పై ఏళ్ళకింద, నా పెళ్ళయి వారం రోజులు కూడా తిరక్కుండానే విజ్జితో కలిసి వెతుక్కుంటూ వెళ్ళిన ఊరు. ఏణ్ణర్థం పని చేసి ఉంటాను, అక్కడ జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా. కాని నా హృదయంలో ఆ ఊరూ, ఆ మనుషులూ, వాళ్ళ హృదయాల్లో నేను బందీలమైపోయాం.

వెళ్ళాను ఈ సారి కూడా. గోదావరి దాటి, ఆ land of Saraswati లో అడుగుపెట్టాను.నాతో పాటు ఆదిత్య, నందకిశోర్. ఒక రాత్రి ఉట్నూరులో గడిపాను. తెల్లవారి ఆ పొలాలు, ఆ చెరువు, ఆ పక్షుల కూజితాలూ విన్నాను. ఆ వర్క్ షాపులో పాల్గొన్నాను. ప్రధాన ప్రసంగం చేసాను. కాని మోహన్ కోరుకున్నట్టుగా వాళ్ళని మోటివేట్ చెయ్యలేదు, provoke చేసాను.

చేసానంటే చెయ్యనా? ఆ మధ్య ఒక తెలుగుసినిమాలో గోండుల్ని అర్థనగ్నంగా చూపించి ఆ సినిమా బృందం వాళ్ళతో ‘నీ బాంచన్ నీ కాల్మొక్త ‘అనిపించినప్పటినుంచీ నా ఆవేదనకి అంతం లేదు. ఎటువంటి జాతి గోండులు! ఎటువంటి చరిత్ర వారిది! ఎటువంటి భాష, సంస్కృతి, సంప్రదాయాలు! వాళ్ళ గురించి బయటి ప్రపంచానికి ఏమీ తెలియకపోగా, వాళ్ళ గురించిన విరుద్ధ చిత్రణ ఈ రోజు ప్రపంచమంతా తెరమీద చూస్తున్నారే!

గొండులు ఒకప్పుడు రాజులు. 14-16 శతాబ్దాల్లో వాళ్ళు గోండుభూమిని పాలించారు. మరాఠాలాతో, మొగల్ సైన్యాలతో పోరాడి తమ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు. ఆ కోవలో చివరివాడు కుమ్రం భీమ్.ఆయన నిజాం పాలనతో పోరాడేడు. ఆ రాజవంశీకుల్లో చివరి రెండు శాఖల్లో ఒకరు ఉట్నూరులోనూ, మరొకరు కంచన్ పల్లిలోనూ స్థిరపడ్డారు. ఒకప్పుడు హైమండార్ఫ్ మళ్ళా అదిలాబాదు చూడటానికి వచ్చినప్పుడు కంచన్ పల్లి రాజా ఆత్రం భగవంత రావుని కలవాలని ఉంది అని చెప్పినప్పుడు, పక్కనే ఉన్న ఒక ప్రభుత్వోద్యోగి జీపు పంపించి అతణ్ణి తీసుకువస్తానని చెప్పాడట. ఆ మాట వినగానే హైమండార్ఫ్ కి కోపం, దుఃఖం రెండూ కలిగేయట. ‘ఎంత మాట! గోండు రాజుని జీపు పంపించి తీసుకువస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజావారిని మన వెళ్ళి కలవాలి కదా’ అన్నాడట. ఈ ఉదంతం ఫణికుమార్ గారి గోదావరి గాథల్లో చదివినప్పణ్ణుంచీ ఆ రాజాని నేను కూడా స్వయంగా వెళ్ళి చూడాలని అనుకున్నాను. ఒకరోజు మా ప్రాజెక్టు ఆఫీసరు నన్ను కంచన్ పల్లి తీసుకువెళ్ళారు. చిన్నపాటి గడ్డికుటీరం ఎదుట, ఒక నులకమంచం మీద కూచుని మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన ఆ గోండురాజుని చూసాను. అటువంటి దృశ్యాలు కదా తెరమీదకు ఎక్కవలసింది!

భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజనదేశం. చైనాతో సహా మరే దేశంలోనూ ఇంతమంది ఆదివాసులు లేరు. ఇప్పటి లెక్కలు ఇంకా తియ్యలేదుగాని నా దృష్టిలో దాదాపు పధ్నాలుగు కోట్లమంది ఉంటారు. 645 తెగలున్నాయి. ఆరేడువందల మౌఖికభాషలు ఉన్నాయి. జనసంఖ్యరీత్యా చూసినా, విస్తృతిని బట్టి చూసినా, గోండులు భారతదేశంలోని అతి పెద్ద గిరిజన తెగల్లో రెండవస్థానంలో ఉంటారు. సంతాల్ తెగది నాలుగవ స్థానం. కాని ఇప్పుడు సంతాల్ సాహిత్యానికి లభించిన జాతీయ స్థాయి గుర్తింపు మనకి అచ్చెరువు కలిగిస్తుంది. 2013 నుంచీ సివిల్ సర్వీసు పరీక్షల్లో సంతాల్ సాహిత్యం కూడా ఒక ఆప్షనల్ పేపరు. 2005 నుంచీ సాహిత్య అకాడెమీ ఇచ్చే పురస్కారాల్లో సంతాల్ సాహిత్యానికి కూడా అవార్డులు లభిస్తున్నాయి. ఒక సంతాల్ భాషావేత్తకి భాషా సమ్మాన్ అవార్డు కూడా లభించింది. అంతేకాదు, ఇతర భాషలనుంచి సంతాలీలోకి చేసే అనువాదాలకు కూడా పురస్కారాలు లభిస్తున్నాయి. ఇటీవల లభించిన పురస్కారం కాళిదాసు మేఘసందేశానికి సంతాలీ అనువాదానికి!

మరి గోండీ స్థానం ఏమిటి? గోండీ రచయితలెవరు? గోండీ నుంచి తెలుగు, ఇంగ్లిషు, హిందీలోకి, ఇతరభాషలనుంచి గోండీలోకి ఏమైనా పుస్తకాలు అనువాదమయ్యాయా?

గోండీనుంచి ఇంగ్లిషులోకి అనువాదమైన చివరి పుస్తకం, బహుశా మొదటి పుస్తకం కూడానేమో- Songs of the Forest పేరిట వెరీయర్ ఎల్విన్ 1935 లో వెలువరించిన అనువాదం. అప్పణ్ణుంచి ఇప్పటిదాకా మరొక పుస్తకం రాలేదంటే, ఆ భాషకి ప్రభుత్వాలు, ప్రజలూ కూడా ఎటువంటి గుర్తింపునిస్తున్నారో వేరే చెప్పనక్కర్లేదు.

రెండు పదాలున్నాయి: భాష, యాస. భాష అంటే మర్యాదస్తులు మాట్లాడుకునేదీ, గౌరవప్రదమైందీ, యాస అంటే నిరక్షరాస్యులు మాట్లాడుకునేదీ అనే అపోహ ప్రజల్లో ఉంది. ఇంగ్లిషులో ఈ రెండింటినీ language అనీ, dialect అనీ అనుకోవచ్చు. తెలుగులో డయలెక్టు ని మాండలికం అని కూడా అంటూంటారు. అంతేకాదు, సాధారణంగా డయలెక్టులకి లిపి ఉండదు, లేదా ‘ప్రామాణిక భాష ‘ ఏ లిపిని వాడుకుంటుందో అదే లిపిని డయలెక్టులు కూడా వాడుకుంటూ ఉంటాయి.

కాని గత శతాబ్దంలో భాష గురించిన మన అభిప్రాయాలు చాలావరకూ మారాయి. ప్రతి ఒక్క భాషా కూడా ఒక యాసనేననీ, ప్రతి ఒక్క యాసా కూడా ఒక భాషనేననీ మనం గ్రహించగలుగున్నాం. ఉదాహరణకి గ్లోబల్ భాషగా వ్యాప్తి చెందిన ఇంగ్లీషు ఆంగ్లో-సాక్సన్ మాండలికమే. భారతదేశంలో అత్యధికసంఖ్యాకులు మాట్లాడుతున్నారని భావిస్తున్న హిందీ, ఖడీబోలీ, అవధీ, దక్కనీ, భోజ్ పురీ, రాజస్తానీ, మైథిలీ వంటి వివిధ మాండలికాల సమాహారమే.

అయినా కూడా కొన్ని మాండలికాల్లో ఒక మాండలికంతోనే ఒక భాషని ప్రధానంగా మనం ఎందుకు గుర్తుపడుతున్నాం? ఒక భాషావేత్త language కీ dialect కీ మధ్య ఉన్న తేడా గురించి చెప్తూ, a language is a dialect backed by an army అన్నాడు. పద్ధెనిమిది, పందొమ్మిది శతాబ్దాల్లో ఇంగ్లాండు తన నౌకాబలంతోనూ, ఫిరంగులతోనూ, మందుగుండుతోనూ ప్రపంచాన్ని ఒక కాలనీగా మార్చబట్టే నేడు ఇంగ్లిషు గ్లోబల్ భాష గా మరడానికి అవకాశం దొరికిందనే విషయం కాదనలేం.

కాని నేనేమంటానంటే, ప్రత్యేకించి ఒక మాడలికమే భాషగా గుర్తింపుపొందడానికి ప్రధాన కారణం కవులూ, రచయితలూను. ఆ భాషావేత్త చెప్పిన మాటని నేనిలా సవరిస్తున్నాను: a language is a dialect backed by poets and writers.

తెలుగు విషయమే తీసుకోండి. అది మధ్యద్రావిడ భాష. దానితో పాటు గోండీ, కోయ, కొలామీ, పర్జీ, కొండ, కువి లాంటి గిరిజన భాషలు కూడా మధ్యద్రావిడ కుటుంబానికి చెందినవే. పదిహేనువందల సంవత్సరాల కిందట, ఈ భాషలన్నీ దాదాపుగా ఒకే స్థాయిలో ఉండేవి. కాని మొదట్లో శాసనభాషగా వాడుకలోకి వచ్చిన తెలుగును గత వెయ్యేళ్ళుగా తెలుగు కవులు, రచయితలు గొప్ప సాహిత్యభాషగా మార్చేసారు. సాహిత్యప్రమాణాల దృష్ట్యా నేడు తెలుగు ప్రపచంలోని మొదటి పది లేదా ఇరవై భాషల్లో ఒకటిగా ఉందని చెప్పవచ్చు. కాని గిరిజన భాషలు మాత్రం పది పదిహేను శతాబ్దాల కింద ఎక్కడున్నాయో, ఇప్పటికీ అక్కడే ఉండిపోయాయి.

ఈ పరిస్థితి అత్యవసరంగా మారాలి. ముందొక భాష సాహిత్యభాషగా మారితే, నెమ్మదిగా అది బోధనామాధ్యమంగా కూడా మారుతుంది. పాలనాభాషగా మారుతుంది. అప్పుడు ఆ భాషలో పత్రికలు, టెలివిజను ఛానెళ్ళు, సినిమాలు, సోషల్ మీడియా కూడా వస్తాయి. దాదాపు 130 లక్షలమంది మాట్లాడే గోండీలో సాహిత్యం విరివిగా రావాలి. సాహిత్యసమ్మేళనాలు జరగాలి. చర్చలు జరగాలి. అప్పుడు కదా, ఆ భాష మాట్లాడేవాళ్ల ఆత్మగౌరవం నిలబడేది!

చాలా పెద్ద ప్రయత్నం చెయ్యాలి. సుదీర్ఘమైన ప్రయాణం మొదలుపెట్టాలి. మోహన్ చేపట్టిన ప్రయత్నం అందులో మొదటి అడుగు. ఆ సదస్సు ప్రారంభ సమావేశంలో పాల్గొన్న ఐ టి డి ఏ ప్రాజెక్టు అధికారి నాతో మీ మాటలు నన్ను ఇన్ స్పైర్ చేసాయి, మేము గోండీ సాహిత్యసమ్మేళనం చెయ్యాలనుకుంటున్నాం అన్నాడు.

సమావేశం ముగిసి బయటకు రాగానే ఇద్దరు యువకులు నా దగ్గరకి వచ్చారు. ‘మేము జంగుభాయి యూట్యూబు ఛానెలు నడుపుతున్నాం. మీరు ఇప్పుడు మాట్లాడిన మాటల్లోంచి మా ఛానెల్ కోసం రెండు మూడు మాటలు చెప్పండి’ అన్నారు. మైకు నా ముందు పెట్టి ఆ యువకుడు తన ప్రేక్షకుల్ని ఉద్దేశించి గోండీలో మాట్లాడటం మొదలుపెట్టాడు.

నేను ఆశిస్తున్న భవిష్యత్తు అప్పుడే నా కళ్ళముందు ప్రత్యక్షమైందనిపించింది.

6-11-2022

One Reply to “గోండీ సాహిత్యం కోసం”

Leave a Reply

%d bloggers like this: