
మెడిటేషన్స్ పన్నెండు అధ్యాయాల్నీ స్థూలంగా పరిచయం చేసుకున్నాం. కాని, మొత్తం పుస్తకం చదవడానికి మించింది ఏదీ లేదు. ఒక పండితుడు ఆ గ్రంథాన్ని Eternal Gospel అంటే, ‘శాశ్వత సువార్త’ అన్నాడు. ఆధునిక యుగం మొదలైనప్పటినుంచీ ఆ రచన ఎందరో జిజ్ఞాసువుల్ని ఆకర్షిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా గత ఇరవై ముప్పయ్యేళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా స్టోయిజం మీద పెరుగుతున్న ఆసక్తి ఎందరినో మెడిటేషన్స్ వైపు రప్పిస్తూ ఉంది.
అలాగని మార్కస్ అరీలియస్ ని అందరూ గొప్పగా భావించారనడానికి లేదు. పాశ్చాత్య తత్త్వశాస్త్ర చరిత్రమీద ప్రామాణిక గ్రంథం రాసిన బెర్ట్రాండ్ రస్సెల్ ఆయన్ని pathetic man అన్నాడు. రస్సెల్ స్కెప్టిక్కులమీదా, స్టోయిక్కులమీదా కూడా ఏమంత ఆదరం చూపించలేదు. స్కెప్టిసిజం, అంటే సంశయవాదాన్ని ఆయన అసలు తత్త్వశాస్త్రంగానే పరిగణించలేదు. స్టోయిసిజాన్ని కూడా ఆయన లోతైన తాత్త్వికశాఖగా గుర్తించడానికి ఇష్టపడలేదు. కాని రస్సెల్ రాసింది ఇప్పుడు చదువుతుంటే, అతడు సమ్యక్ చిత్తంతో రాసినట్టుగా కనిపించదు. అందుకనే ఇటీవల ఒక బ్లాగరు అరీలియస్ మీద రస్సెల్ రాసిందాన్ని విమర్శిస్తూ, రస్సెల్ ఒక తత్త్వశాస్త్ర ఆచార్యుడిగా కాక, అరకొర వికీపీడియా సమాచారం చదివి రాసినట్టు అనిపిస్తుందన్నాడు.
అరీలియస్ ని pathetic అనుకుంటే, అందరికన్నా ముందు సోక్రటీస్ ని అనుకోవలసి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దర్శనాల్లోనూ రెండు పార్శ్వాలున్నాయి. ఒక పార్శ్వంలో ప్రతి తత్త్వశాస్త్రమూ సత్యమీమాంసని అంటే metaphysicsనీ, జ్ఞానమీమాంస, అంటే epistemology ని చేపట్టింది. కాని మరొక పార్శ్వంలో అది నీతిమీమాంస, అంటే ethics కూడా. నీతిచింతన చాలా చిత్రమైంది. మతాలు దాన్ని తత్త్వశాస్త్రంగా పరిగణిస్తాయి, తత్త్వశాస్త్రం దాన్ని మతంగా చూస్తుంది. మతాలకి క్రతువుల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వాటికి దేవుడూ, నీతీ రెండూ కూడా ఏమంత ముఖ్యం కాదు. అందుకనే ప్రతి మతంలోనూ సరళజీవితాన్నీ, విశాలదృక్పథాన్నీ ప్రోత్సహిస్తూ, క్రతువుల్నీ, ఆచారవ్యవహారాల్నీ, సంప్రదాయాల్నీ పక్కనపెట్టినవాళ్ళని పూజారులూ, పురోహితులూ, రాజ్యయంత్రాంగమూ కూడా ఏమంత గొప్పగా పరిగణించలేదు. సరికదా, చాలాసార్లు హింసకీ, బహిష్కారానికీ గురిచేస్తూనే వచ్చారు. చీనాలో డావోయిజం, భారతదేశంలో ఉపనిషత్తులు, మధ్య ఆసియాలో హీబ్రూ ప్రవక్తలు, యూరోపులో స్కెప్టిక్కులు, స్టోయిక్కులు, సినిక్కులూ, తొలి క్రైస్తవులూ, అమెరికాలో థోరో, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవాదులు అటువంటి వాళ్ళు.
మనం గమనించవలసిందేమంటే, philosophy అనే పదం యూరోపులో పుట్టింది. ఇంకా చెప్పాలంటే, ప్రాచీన గ్రీసులో, ఏథెన్స్ లో పుట్టింది. అది సోఫిజానికి వ్యతిరేకంగా పుట్టిన పదం. సోక్రటీసు దాని సృష్టికర్త. సోఫిజం అంటే తార్కిక నైపుణ్యం, వాదనాపటిమ, వాక్చాతుర్యం, మనుషుల్ని పౌరులుగా రూపొందించడానికి పనికొచ్చే ఒకలాంటి వ్యక్తిత్వవికాస కళ. దానికి సత్యం మీద కన్నా, సత్యం తెలిసినట్టు కనిపించడం మీద ఎక్కువ దృష్టి. అంటే మతంలో ఎలాగైతే క్రతువులు ముఖ్యంగా భావించే పూజారులూ, దేవుడితో సహజీవనం ముఖ్యంగా భావించే ప్రవక్తలూ అంటో రెండు శాఖలు ఉన్నాయో, అలాగే జ్ఞాన మీమాంసలో కూడా సత్యం గురించి మాట్లాడేవాళ్ళూ, సత్యసమ్మతంగా జీవించేవాళ్ళూ అనే రెండు శాఖలున్నాయి. సోక్రటీసు రెండవ తరహాకి చెందినవాడు. సత్యాన్ని జీవితానుభవంలోకి తెచ్చుకోవడాన్నే ఆయన philosophy అంటే love for wisdom అన్నాడు. కాని ఆశ్చర్యంగా, ఆ పేరు మీద ఇప్పుడు యూరోపులోనూ, అమెరికాలోనూ విశ్వవిద్యాలయాల్లో పుస్తకాలు రాసేవాళ్ళూ, పాఠాలూ బోధించేవాళ్ళూ సోఫిస్టుల్లాగా వృత్తి తత్త్వవేత్తలు తప్ప సోక్రటీసులాగా సరళజీవితం జీవిస్తో, సత్యాన్ని తమ నడవడికలోకి తెచ్చుకోవాలనుకునేవాళ్ళు కారు.
వాళ్ళు ప్రధానంగా దేని గురించి మాట్లాడుతూ ఉంటారు? గత 2500 ఏళ్ళుగా యూరోపియన్ తత్త్వశాస్త్రం ప్రధానంగా చర్చించేది ఒకటే అంశం- ఈ ప్రపంచం గురించిన జ్ఞానం మనకి ఎలా వస్తుంది? మనకి ఈ ప్రపంచం గురించి ఇంద్రియాలుగాని, బుద్ధి గాని అందిస్తున్న జ్ఞానం నమ్మదగ్గదేనా? కాని ఈ ప్రశ్నల్ని సోక్రటీసు ఎప్పుడో వదిలేసాడు. ప్రపంచం గురించిన మనం జ్ఞానం విషయంలో మనం ఎప్పటికీ ఒక సందిగ్ధ స్థితిలోనే ఉండకతప్పదని ఆయన భావించాడు. దాన్ని గ్రీకు భాషలో aporia అంటారు. ప్లేటో సంభాషణల్లో తొలి సంభాషణలు, సోక్రటీసు మాటలకి దగ్గరగా ఉండేవని భావించే సంభాషణల్ని aporetic dialogues అని కూడా అంటారు. సోక్రటీసు ఈ ప్రపంచం గురించిన సత్యం తాను నిశ్చయంగా ఏమీ చెప్పలేననీ, కాని తాను అజ్ఞానిని అని మాత్రం తనకి స్పష్టంగా తెలుసుననీ అన్నాడు. కాబట్టి ఆయన జ్ఞాన మీమాంస కన్నా కూడా, నిజాయితీకి, తన నిజాయితీకి తాను చెల్లించవలసిన మూల్యానికీ ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చాడు.
స్టోయిక్కులకి సోక్రటీసే మార్గదర్శి. అందుకని స్టోయిక్కుల్ని కొందరు సోక్రటిక్ శాఖ గా పరిగణిస్తుంటారు. అరీలియస్ గురుపరంపర సోక్రటీసుతోనే మొదలవుతుంది. ఆయన తన జీవితకాలంలో ఒకసారి ఏథెన్సులో అడుగుపెట్టాడు కూడా. తాను సోక్రటీసును ఎందుకు ఆదర్శంగా తీసుకున్నాడు? మెడిటేషన్స్ లో ఏడవ అధ్యాయంలో (7:66) లో ఈ మాటలు చూడండి:
ఫలానావాడు సోక్రటీసుకన్నా ఉత్తముడు కాడని మనం ఎలా చెప్పగలం? సోక్రటీసు అత్యంత ఉదాత్తంగా మృత్యువుకి ఎదురేగాడనీ, లేదా సోఫిస్టులతో ఎంతో చాకచక్యంగా వాదించేవాడనీ లేదా ఒక చలికాలపురాత్రి ఆరుబయట గడపగలిగాడనీ లేదా ఒక పౌరుణ్ణి అరెస్టు చెయ్యమని అధికారులు ఆదేశించినప్పుడు ఆ ఆదేశాల్ని ఉల్లంఘించడమే సముచితం అని భావించాడనీ లేదా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ వీథుల్లో దారితప్పేవాడనీ, ఇలాంటి విషయాల్ని బట్టి ఆయన్ని ఉత్తముడని చెప్పలేం. నిజానికి ఈ విషయాలు నమ్మదగ్గవి అవునో కాదో కూడా సందేహమే. కాని అతడు మనుషుల పట్ల న్యాయసమ్మతంగానూ, దేవతల పట్ల పవిత్రభావంతోనూ జీవితం గడిపేడనీ, మనుషుల దుర్మార్గాల్ని ఊరికినే కూచుని ఏకరువు పెడుతూ గడపలేదనీ, అదే సమయంలో మనుషుల అజ్ఞానానికి తానొక బానిస కాలేదనీ, ఈ విశ్వక్రమంలో తన వంతుగా తనకి లభించినదాన్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదనీ, దాన్ని భరించడం కష్టంగా భావించలేదనీ, దేహం తన మీద కలిగించే ఒత్తిడికీ, ఉద్రేకాలకీ ఎప్పుడూ లొంగిపోలేదనీ-ఇట్లాంటి విషయాల మీంచి సోక్రటీసుని మనం అంచనా వేసుకోవాలి.
స్పష్టంగా ఉంది కదా, ఈ మాటల్లోంచే అరీలియస్ తన జీవితాదర్శమేమిటో కూడా, తాను సోక్రటీసునుంచి ఏమి నేర్చుకున్నాడో కూడా చెప్పకనే చెప్పాడు.ఈ మాటలు నేను రస్సెల్ గురించి చెప్పలేను. పైగా చలంగారు రాసుకున్న ఒక మాట గుర్తొస్తోంది. రస్సెల్, షా వంటి రచయితలు చెప్పిన మాటల్లాంటివే తాను కూడా చెప్పాననీ, అయితే తాను వాటిని జీవితంలో అనుసరించడానికి ప్రయత్నించినందువల్లనే సంఘం దృష్టిలో చెడ్డ అయ్యాననీ, రస్సెల్, షా వంటి వాళ్ళు మాత్రం చెప్పారే తప్ప, చేసి చూపించాలనుకోలేదనీ, అందుకే వారిని సంఘం నెత్తిమీద పెట్టుకుందనీ రాసుకున్నాడు.
ఓషో తాను బాగా ఇష్టపడ్డ పుస్తకాల గురించి కొన్ని ప్రసంగాలు చేసాడు. వాటిలో ఆయన 119 పుస్తకాలు పరిచయం చేసాడు. కాని వాటిలో మెడిటేషన్స్ లేదు. ఒకచోట ఆయన మార్కస్ అరీలియస్ గురించి ప్రస్తావిస్తూ, అతడు సజ్జనుడే గాని సాక్షాత్కారం పొందినవాడు కాడనీ, ఒక కబీరు, ఒక బషో ముందు అతడు నిలబడలేడనీ అన్నాడు. బోధిధర్ముడే కనుక అరీలియస్ కి పరిచయం అయి ఉంటే ఆయనకి నిజమైన సాక్షాత్కారం లభించి ఉండేదన్నాడు.
ఓషో తత్త్వ శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసాడు కాబట్టి ఆయన మెడిటేషన్ చదివి ఉండడు అని అనలేను గాని, అతడు కూడా తక్కిన వృత్తి తత్త్వవేత్తల్లాగా పొరపడ్డాడనే చెప్పగలను. ఎందుకంటే, జ్ఞానమీమాంసతో పనిలేకుండా నైతిక జీవితాన్ని అనుష్టించాలని కోరుకున్నవాళ్ళల్లో కూడా రెండు మార్గాలున్నాయి. ఒకటి యాగమార్గం, మరొకటి యోగమార్గం. యాగాన్ని నమ్మినవాళ్ళు పూర్వకాలపు వైదిక ఋషుల్లాగా, కన్ ఫ్యూసియన్ అనుయాయుల్లాగా, మార్క్సిస్టుల్లాగా సమష్టికర్మకి ప్రాధాన్యమిచ్చారు. ఈ ప్రపచం ఎలా పుట్టింది, దేవుడున్నాడా లేడా, మరణానంతరం మనం ఏమవుతాం లాంటి ప్రశ్నల్లో వాళ్ళకి ఆసక్తి లేదు. వాళ్ళు కోరుకున్నది నియమిత కర్మలు అనుష్టిస్తూ నలుగురూ కలిసి పనిచేసుకుంటూ నూరేళ్ళు సంతోషంగా జీవించడం. యోగమార్గాన్ని నమ్మినవాళ్ళది ప్రధానంగా వ్యక్తికోణం. వాళ్ళు బయటి ప్రపంచాన్ని సంస్కరించడం మీదకన్నా తమని తాము సంస్కరించుకోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. లావోత్సే, ఆయన అనుయాయులూ, ఉపనిషత్కారులూ, జైన శ్రమణులూ, సూఫీ సాధువులూ, జెన్ సన్న్యాసులూ ఈ కోవలోకి వస్తారు. ఇక బుద్ధుడూ, శంకరాచార్యుడూ, గాంధీ వంటి వారు రెండు మార్గాల్నీ సమన్వయం చేసే పనిచేసారు. వారు మధ్యేవాదులు.
ఓషో డావోయిస్టు దృష్టికోణం నుంచి మార్కస్ అరీలియస్ ను చూసి అతడికి సాక్షాత్కారం కలగలేదని అన్నాడు.
కాని మార్కస్ అరీలియస్ కూడా బుద్ధుడిలాగా, గాంధీలాగా సమన్వయవాది. ఆయన తనకీ, లోకానికీ మధ్య ఒక సమన్వయసేతువు నిర్మించుకునే ప్రయత్నం చేసాడు. వివేచన, సాంఘికతా- ఈ రెండే ఆయన దర్శనంలో ముఖ్యసూత్రాలు. మనిషి తన దేహాన్నీ, మనసునీ కాని లేదా చుట్టూ ఉన్న మనుషుల్నీ, వాళ్ళ అభిప్రాయాల్నీగాని పట్టించుకోకూడదు. అతడు వివేచనశీలమైన తన అంతరంగాన్ని నమ్ముకుని, సదా సామాజిక హితం కోసం పనిచేస్తూ ఉండాలి. ఆ పనికి ప్రతిఫలం కోరకూడదు. అలాగని ఏదో మొక్కుబడిగా చెయ్యకూడదు. సంతోషంగా చెయ్యాలి, దయార్ద్రహృదయంతో చెయ్యాలి. కాబట్టి నేనేమనుకుంటానంటే, కబీరు, బషో కూడా మెడిటేషన్స్ చదివి ఉంటే అరీలియస్ కూడా తమలాంటివాడే అని దగ్గరికి తీసుకుని ఉండేవారు.
మెడిటేషన్స్ లో నాకు నచ్చిన మరో అంశం అరీలియస్ తాను నిలబడే ప్రయత్నం పూర్తిగా తనకు తానుగా చెయ్యడం. తన కన్నా ముందు నడిచినవాళ్ళ, గురువుల, సాధువుల ప్రభావాలు ఉన్నాయి, కాదనను. కాని సహచరులు, మంత్రతంత్రాలు, క్రతువులు- వీటితో వేటితోనూ పనిలేకుండా కేవలం మంచి చెడ్డల్ని వేరు చేసి చూడగల తన విచక్షణ మీదా, వివేచన మీదా మాత్రమే ఆధారపడి తనకు తాను దారి చూపించుకున్నాడు. చివరి అధ్యాయంలో ఈ మాటలు (12:9) చూడండి:
నువ్వు నమ్మిన సూత్రాల్ని ఆచరణలో పెట్టుకోడానికి నీకు గ్లాడియేటరు కన్నా బాక్సరు మంచి నమూనాగా నిలబడతాడు. ఎదుకంటే గ్లాడియేటరు ఒకసారి తన కత్తి బయటి తీస్తాడు, మరోసారి పక్కన పెడతాడు. బాక్సరుకి ఉన్నదల్లా కేవలం తన రెండు చేతులు మాత్రమే. అవసరమైనప్పుడల్లా వాటితోటే పిడికిలి బిగిస్తాడు.
కేవలం తన రెండుచేతుల్నీ నమ్ముకుని పోరుకి సిద్ధపడటంలో గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. మరే ఆయుధాలూ, ఆయుధమనే మాట ఇక్కడ రూపకాలంకారంలో వాడుతున్నాను, అంటే ఆయుధాలనే కాదు, ఏ సిద్ధాంతాలూ, మరే సాధనసంపత్తితోనూ పనిలేకుండా తాను దారి వెతుక్కోగలిగాడు. దీన్నే సంస్కృత సుభాషితం ‘క్రియాసిద్ధి సత్త్వే భవతి మహతామ్ నోపకరణే ‘ అంది.
ఈ వ్యాసాల్ని ఆదరించిన మీకు ధన్యవాదాలు. మెడిటేషన్స్ మొత్తం పుస్తకం చదవాలనుకునే వారికీ, మరింత లోతుగా అధ్యయనం చేయాలనుకునేవారికీ ఉపయుక్త గ్రంథాల వివరాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.
~
For further reading:
https://www.gutenberg.org/files/15877/15877-h/15877-h.htm జార్జి లాంగ్ చేసిన ఈ అనువాదాన్నే నేను నా తెలుగు అనువాదాలకు ఉపయోగించుకున్నాను.
Meditations, Marcus Aurelius, Translated with notes by Martin Hammond, Penguin Classics, 2014 ఈ పుస్తకంలో ప్రతి అధ్యాయానికీ విపులమైన నోట్సు ఉన్నాయి.
Meditations, Marcus Aurelius, Pigeon Books, 2020 ఈ ఇంగ్లిషు అనువాదం చాలా సూటిగానూ, సరళంగానూ ఉంటుంది.
The Inner Citadel: The Meditations of Marcus Aurelius, Pierre Hadot, Translated from French to English, Michael Chase, Harvard University Press, 1998
R.B.Rutherford, The Meditations of Marcus Aurelius Antoninus, Oxford, 1997
The Daily Stoic, 366 Meditations on Wisdom, Perseverance and the Art of Living, Ryan Holiday and Stephen Hanselman, Profile Books, 2016
14-11-2022
సరాళీయ జీవితాన్ని జీవించడం ఎలాగో చెప్పిన గొప్ప రచనను అనువాదం చేసి అందించిన మీకు కృతజ్ఞతలు