మెడిటేషన్స్-14

మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ ఏ క్రమంలో రాసుకున్నాడో మనకి తెలియదు అంటే ఏది ముందు రాసుకున్నాడో, ఏది వెనక రాసుకున్నాడో తెలియదు. ఆ గ్రంథంలో పన్నెండు అధ్యాయాల్నీ పన్నెండు పుస్తకాలుగానూ, మొత్తం 488 మెడిటేషన్స్ ని అధ్యాయాలుగానూ వ్యవహరించడం పరిపాటి. నేను నా వ్యాసాల్లో పుస్తకాల్ని అధ్యాయాలుగానూ, అధ్యాయాల్ని మెడిటేషన్స్ గానూ వ్యవహరించాను. నేను వ్యవహరిస్తున్నదాని ప్రకారం ఇప్పుడు మనం పన్నెండవ అధ్యాయానికి వచ్చాం. ఇది గ్రంథంలో చివరి అధ్యాయం. దీన్ని ఆయన ఎప్పుడు రాసాడో మనకి తెలియకపోయినా, ఇందులోని మెడిటేషన్స్ స్వరాన్ని బట్టి, ఆ భావాల్లోని అనుభూతిని బట్టి, దీన్ని చివరి అధ్యాయంగా భావించవచ్చునని, ఇది ఆయన దాదాపుగా తన చివరిరోజుల్లో రాసి ఉంటాడని పరిశోధకులు చెప్తారు. ఆ మాటలు నమ్మదగ్గట్టే అనిపిస్తుంది.

గీతాంజలిలోని చివరి కవితల్లోలాగా, పన్నెండవ అధ్యాయంలోని మెడిటేషన్స్ లో కూడా మృత్యువే ప్రధాన ఇతివృత్తం. మృత్యువు గురించి ఎదురుచూడటం, మృత్యువుకి భయపడకపోవడం, అవసరమైతే, తన పని ముగిసిపోయిందనుకుంటే హుందాగా ఈ లోకం నుంచి సెలవుతీసుకోవచ్చనుకోవడం ముందు అధ్యాయాల్లో కూడా విస్తారంగానే ఉంది గాని, ఆ మాటల్లో కనిపించని ఒక శాంతి ఈ అధ్యాయంలో ఎంతో నిండుగా కనిపిస్తుండటం ఈ మెడిటేషన్స్ కు ఒక గాంభీర్యాన్నీ, పూర్ణత్వాన్నీ తీసుకువచ్చింది. ఇక చిట్టచివరి మెడిటేషన్ (12:36) అయితే శాంతిమంత్రమే. దాన్ని చివరలో విందాం.

నిజానికి మృత్యువు గురించి తలుచుకున్నప్పుడలా అరీలియస్ జీవితానికి అదనంగా మరొక రోజుని జోడిస్తూనే ఉంటాడు. మృత్యువు తప్పదన్న భావనవల్ల జీవితం మరింత విలువైందిగా గోచరించడమే కాక, బతకనున్న ప్రతి ఒక్క క్షణాన్ని మరింత సార్థకంగా జీవించాలన్న కోరిక మనలో ద్విగుణీకృతమవుతుంది. ఏడవ అధ్యాయంలో ఈ మాటలు (7:69) చూడండి:

నీ శీలం పరిపూర్ణత పొందింది అనడానికి కొండగుర్తు ఇదే. ప్రతి రోజూ ఇదే నీ చివరి రోజు అన్నట్టుగా గదపడం, ఎట్లాంటి పిచ్చి ఆవేశాలకీ లోనుకాకుండా, ఉదాసీనత లేకుండా, ఎట్లాంటి నటనలూ లేకుండా జీవించడం.

మృత్యువు నీ ఇంటివాకిటకి ఎంతో దూరంలో లేదన్న భావన వల్ల నీ జీవితానికి ఏదో ప్రయోజనం ఉందని హటాత్తుగా ఒక మెలకువ కలుగుతుంది నీకు. ఇదిగో, ఎనిమిదో అధ్యాయంలో ఈ మాటలు (8:19) చూడండి:

ఈ ప్రపంచంలో ప్రభవించిన ప్రతి ఒక్క ప్రాణి కూడా ఒక ప్రయోజనం నెరవేర్చడం కోసమే పుట్టింది, అది ఒక అశ్వంగానీ లేదా ఒక లత గానీ. ఈ మాటలు నీకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయా? ఆ మాటకొస్తే, సూర్యుడు కూడా ‘నేనొక ప్రయోజనం కోసమే ఉదయిస్తున్నాను’ అని అనగలడు. అలాగే తక్కిన దేవతలు కూడా. మరి నువ్వే ప్రయోజనం కోసం జన్మనెత్తావు? నీ సుఖం కోసమేనా? ఆలోచించు.

ఇప్పటిదాకా చెదురుమదురుగా ఉన్న ఈ ఆలోచనలు చివరి అధ్యాయంలో ఒక్కసారిగా గుప్పమన్నాయి. అసలు అధ్యాయం మొదలుపెడుతూనే ఆయన ఇలా (12:1) చెప్పుకుంటున్నాడు:

ఇంతదాకా నువ్వు చుట్టు తిరిగి చేరాలనుకున్నవన్నీ ఇప్పుడు నీకు అందుబాటులోకి వచ్చాయి- కావలసిందల్లా నువ్వు నీ పట్ల కొంత ఉదారంగా ఉండటం, అంతే. అంటే, నువ్వు చెయ్యవలసిందల్లా, గతాన్ని మర్చిపోవడం, భవిష్యత్తుని విధికి అప్పగించడం, ఇప్పుడు నీ ముందు నీ చేతుల్లో ఉన్న వర్తమానాన్ని న్యాయసమ్మతంగానూ, పవిత్రంగానూ జీవించడం. పవిత్రత అంటే నీకు ఏ కర్తవ్యం నీకు అప్పగించబడిందీ దాన్ని విధిగా చేపట్టడం. దాన్ని ప్రకృతి నీకోసమే సంకల్పించింది. న్యాయసమ్మతంగా జీవించడం అంటే ఎట్లాంటి ముసుగులూ లేకుండా సత్యాన్ని ఉన్నదున్నట్టుగా మాట్లాడటం, ధర్మం తప్పకుండా, ఏది ఏ మేరకు చేయడం సముచితమో ఆ మేరకు చేయడం. మరొకడి కుయుక్తులు లేదా వాడి అభిప్రాయాలు లేదా వాడి బలహీనతలు నీ దారికి అడ్డురాకుండా చూసుకోవడం, అలాగే నీ లోపల చెలరేగే ఆవేశాలు, తక్షణ ఉద్రేకాలు కూడా నిన్ను వెనక్కి లాగకూడదు. అలాంటి సంవేదనలు కలిగితే నీ అంతరంగమే వాటి సంగతి చూసుకుంటుంది.

ఈ ఆలోచనల్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. తర్వాతి వాక్యాలు (12:2) చూడండి:

ఇక అప్పుడు ఈ ప్రపంచం నుంచి సెలవు తీసుకునే సమయం ఆసన్నమైనప్పుడు తక్కినవన్నిట్నీ పక్కన పెట్టి నీలో నిన్ను నడిపిస్తున్న ఆ అంతరంగ నిర్దేశానికీ, నీలోని దైవత్వానికీ మాత్రమే ప్రణమిల్లడం మొదలుపెట్టు. నువ్వు భయపడవలసింది, ఇంక జీవితం ఎక్కడ ముగింపుకొస్తుందో అన్న భావనకి కాదు, అసలు నీ అంతరంగస్వభావానికి అనుగుణంగా జీవించడం ఇంకా మొదలుపెట్టనేలేదే అన్న భావనకి. ఆ భయమే నీలో కలిగితే నిన్ను ఏ ప్రయోజనం కోసం ఈ విశ్వం సృష్టించిందో ఆ ప్రయోజనానికి యోగ్యుడివిగా రూపొందుతావు. నీ స్వదేశంలో అపరిచితుడివిగా జీవించవలసిన పని ఉండదు. రోజూ ఏమి జరిగినా అదేదో ఊహించనిది జరుగుతున్నట్టు ఆశ్చర్యపోవలసిన పని ఉండదు. దానిమీదా దీనిమీదా ఆధారపడవలసిన పని ఉండదు.

తక్కినవాటి గురించి ఆలోచించడం అనవసరం. పట్టించుకోవలసింది ఒకే ఒక్కటి, అది నీలో, నాలో సదా మార్మ్రోగుతుండే అంతర్వాణి. మనల్ని మంచి దారి వైపు నడిపించడానికి తాపత్రయపడే అంతరంగ నిర్దేశం. చాలా సూటిగా చెప్తున్నాడు (12: 33) ఈ విషయాన్నే.

నీలోపల ఉండి నిన్ను నడిపిస్తున్న ఆ అంతరంగ నిర్దేశం దేని గురించి ఆలోచిస్తూ ఉంది? అదొక్కటే సమస్తం. తక్కిందంతా నువ్వు కోరుకోనీ, కోరుకోకపోనీ, వట్టి కళేబరమూ, ధూమమూనూ.

మొడట్లోనే ఈ విషయాన్ని మరింత వివరంగా చెప్పుకొచ్చాడు. ఈ మాటలు (12:3) వినండి:

నువ్వు మూడు పదార్థాలతో రూపొందావు: ఒకటి నీ చిన్ని దేహం, రెండవది చిన్ని శ్వాస, మూడవది నీ ప్రజ్ఞ. వీటిలో మొదటి రెండూ నీవి, కాబట్టి వాటి గురించి శ్రద్ధ వహించడం నీ బాధ్యత. కాని మూడవది మాత్రం పూర్తిగా నీదే. కాబట్టి, తక్కిన వాళ్ళు ఏమంటున్నారో, ఏమి చేస్తున్నారో, అలాగే నీకు నువ్వేమి చేసుకుంటున్నావో, నీకు భవిష్యత్తులో ఏమి సంభవించనున్నదో, అదంతా నీనుంచి వేరు చేసి చూసుకో. అలాగే నీ ప్రమేయంలేకుండానే నీ దేహమూ, శ్వాసా నీకు ఏమేమి కొనితెచ్చిపెడుతున్నాయో వాటినీ, అలాగే మనచుట్టూ సుళ్ళు తిరుగుతున్న చక్రవాతాల్నీ, నువ్వు నీ నుంచి వేరుచేసి చూసుకోగలిగితే, నీ ప్రజ్ఞ ఈ విధివిలాసాలనుంచి విడివడి స్వేచ్ఛగా, నిర్మలంగా తన బతుకు తాను జీవించగలుగుతుంది, తనకి ఏది సంభవిస్తే దాన్ని స్వీకరిస్తూ, తనకి ఏది సమ్మతమో ఆ పనులు చెయ్యగలుగుతుంది, సత్యం మాట్లాడగలుగుతుంది. అదే కదా చెప్తున్నాను, తన మీద ఇంద్రియానుభవాలు వదిలే నీడల్ని నీ ప్రజ్ఞ విదుల్చుకోగలిగితే, గతాగతాల స్పృహని వదులుకోగలిగితే, ఎంపిడొకిల్స్ చెప్పినట్టుగా తన ఏకాంతసంతోషంలో నిశ్చలంగా నిలిచి ఉండే గోళంలాగా జీవించగలుగుతావు. నిజంగా నీదనే జీవితమేదన్నా ఉంటే అది ఈ వర్తమానమే. దాన్ని జీవించడం కోసమే సాధన చేస్తే ఇక నీ మరణవేళదాకా మిగిలిన జీవితాన్ని ఉదాత్తంగా, సంక్షోభరహితంగా, నీ సంతోషానికే నువ్వు విధేయుడిగా జీవించగలుగుతావు.

తనలోంచి తనని విడదీసి చూసుకోగలడం. అంటే తన దేహం నుంచీ, తన శ్వాసనుంచీ తనను వేరు చేసి చూసుకోగలగడం, ఇదే యోగం, ఇదే యాగం. నిజానికి, మెడిటేషన్స్ పన్నెండవ అధ్యాయాన్ని గ్రీకు భాషలో ఒక రోమను రాసుకున్న కఠోపనిషత్తు అనడానికి నాకు ఎటువంటి సంకోచమూ కనిపించడమూ లేదు.  కఠోపనిషత్తు (6:17) లో ఈ మంత్రం చూడండి:

అంగుష్ఠమాత్రః పురుషోంతరాత్మా

సదా జనానాం హృదయే సన్నివిష్టః

త్వం స్వాచ్ఛరీరాత్ ప్రవృహేన్ముంజాదివేషీకాంధర్వేణ

తంవిద్యాచ్చుక్రమమృతం తంవిద్యాచ్చుక్రమమృతమితి.

బొటనవేలంత పరిమాణంలో అంతరాత్మ జనులందరి  హృదయాల్లో సదా నివసిస్తుంటాడు. నీ శరీరం నుంచి అతణ్ణి గడ్డిపోచనుండి ఈనెను బయటికి లాగినట్టు వేరు చేయాలి. అతడే పరిశుద్ధుడు, మరణరహితుడూనూ. అవును, అతడే శుద్ధుడూ, అమృతుడూనూ.

ఎంపిడొకిల్స్ చెప్పిన perfect round rejoicing in the solitude it enjoys నే ఉపనిషత్తు యోగం అంటోంది. కఠోపనిషత్తులో ఈ మంత్రం (6:11) చూడండి:

తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణాం

అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ.

ఆ సుస్థిరమైన ఇంద్రియనిగ్రహాన్నే యోగమని అంటున్నారు. ఆ యోగస్థితి పట్ల యోగి సదా జాగరూకుడిగా ఉండాలి, ఎందుకంటే దాన్ని పొందనూవచ్చు, పోగొట్టుకోనూ వచ్చు.

పన్నెండో అధ్యాయం నిజంగానే హంసగీతి. అందులో ఆయన మనుషుల పట్లా, దేవతల పట్లా కూడా ఎటువంటి ఫిర్యాదులూ పెట్టుకోలేదు. ఈ మాటలు (12:12) ముఖ్యంగా:

మన స్వభావానికి అనుగుణంగా మనకేది సంభవిస్తున్నదో దానికి దేవతల్ని నిందించవలసిన పనిలేదు. వాళ్ళు తెలిసిగాని తెలియకుండా గాని మనకి ఎటువంటి చెడునీ తలపెట్టలేదు. అలాగే మనుషులు కూడా. వాళ్ళు కూడా కావాలని గాని, అనుకోకుండా గాని మనకేమీ హాని చెయ్యడం లేదు. కాబట్టి మనం ఏ ఒక్కరినీ నిందించవలసిన పనిలేదు.

తక్కిన స్టోయిక్కులనుండి అరీలియస్ ని వేరుచేసేవాటిలో ముఖ్యమైనది దేవతల మీద ఆయనకున్న నమ్మకం. ఈ విషయంలో ఆయన ఉపనిషత్తుల కన్న గీతకు ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు. దేవతల ఉనికి గురించి ప్రశ్నించేవారికి జవాబుగా అన్నట్టు రాసుకున్న ఈ మాటలు (12: 28) చూడండి:

నువ్వు దేవతల్ని ఎక్కడ చూసావు అనిగాని లేదా వాళ్ళున్నారని నీకెలా తెలుసునని వాళ్ళని ఆరాధిస్తున్నావు అని అడిగేవాళ్ళకి నేనిలా చెప్తాను: మొట్టమొదటిది, వాళ్ళని కళ్ళతో కూడా చూడవచ్చు అని. రెండవది, ఆ మాటకొస్తే, నేను నా అంతరంగాన్ని కూడా కళ్ళతో చూడటం లేదు కదా, అయినా దాన్ని గౌరవిస్తున్నాను కదా. అలాగే దేవతల విషయంలో కూడా వారి ప్రభావం నాకు అనుభవంలోకి వస్తూన్న విషయమే కాబట్టి నేను వాళ్ళున్నారని నమ్ముతున్నాను, ఆరాధిస్తున్నాను.

అరీలియస్ నమ్మిన మతంలో క్రతువులకి పెద్దగా ప్రాధాన్యత కనిపించదుగాని, ప్రార్థనకి అపారమైన ప్రాముఖ్యం ఉంది. నిజానికి ఆయన ఆలోచనల్ని ప్రార్థనతో ప్రయోగాలు అన్నా కూడా అతిశయోక్తి కాదు. తొమ్మిదవ అధ్యాయంలో ఈ అంశం మీద కొంత సుదీర్ఘమైన ఆలోచన (9:40) చేసాడు, చూడండి:

దేవతలకి శక్తి ఉండవచ్చు లేదా ఉండకపోయి ఉండవచ్చు. వారికి శక్తి లేదనుకుంటే మరి నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు? ఒకవేళ వారికేగనక శక్తి ఉంటే, వారిని నీకు అదిమ్మనీ, ఇదిమ్మనీ కోరుకునే బదులు,  నువ్విప్పుడు వేటివేటిని చూసి భయపడుతున్నావో వాటికి భయపడకుండా ఉండే శక్తిని ఇమ్మనమనీ, వేటికోసం వెంపర్లాడుతున్నావో వాటికోసం పాకులాడకుండా ఉండేట్టు చెయ్యమనీ, దేన్నుంచీ కష్టం కలక్కూడనీ ఎందుకు కోరుకోకూడదు? దేవతలు మనుషులకి సహకరించేవాళ్ళే అయితే, ఈ విషయంలో కూడా సహకరిస్తారు కదా. కాని ఆ శక్తి దేవతలు ఎప్పుడో నీ చేతుల్లోనే పెట్టారంటావు నువ్వు. అయితే ఒక బానిసలాగా అవి కావాలి ఇవి కావాలి అని కోరుకునే బదులు, ఆ శక్తినే ఉపయోగించుకోరాదా? కాని నీ చేతుల్లో ఉన్నదాని విషయంలో దేవతలు నీకు సహకరించరని ఎవరు చెప్పారు? అయితే మొదలుపెట్టు, ఇలా ప్రార్థించడం- ఆ స్త్రీతో నాకు పొందు సమకూర్చు అని ప్రార్థిస్తాడు ఒకడు. అసలు ఆ పొందు గురించిన తలపులే నాకు లేకుండుగాక అని ప్రార్థించు నువ్వు. నేను ఫలానా దాన్నుంచి బయటపడటమెట్లాగ అని మరొకడు ప్రార్థిస్తాడు, అసలు ఆ బయటపడాలన్న కోరిక, ఆ అవసరమే నాకు రాకుండు గాక అని ప్రార్థించు నువ్వు. నా బిడ్డని నేను పోగొట్టుకోకుండా కాపాడు అని ప్రార్థిస్తాడు ఇంకొకడు. కాని ఏ వియోగాలకీ ఏ నష్టాలకీ భయపడకుందునుగాక అని ప్రార్థించు నువ్వు. మార్చుకో నీ ప్రార్థనల్ని ఇలాగ, అప్పుడేమవుతుందో నువ్వే చూడు.

మెడిటేషన్స్ లో చివరి అధ్యాయమంతా ఇటువంటి ప్రార్థన.

మెడిటేషన్స్ లో చివరి అధ్యాయమంతా ఇటువంటి ప్రార్థన. ఈ ఎరుకతో ఈ అధ్యాయంలో చివరి మెడిటేషన్ (12: 36) చూడండి:

మిత్రమా, నువ్వీ మహానగరంలో ఒక పౌరుడిగా జీవిస్తూ ఉన్నావు. ఆ జీవితం అయిదేళ్ళపాటు అయితే ఏమిటి, యాభై ఏళ్ళు అయితే ఏమిటి?ఎన్నేళ్ళు జీవించినా ఏ సూత్రాలకు అనుగుణంగా జీవించవలసి ఉందో ఆ సూత్రాల్లో ఏ మార్పూ ఉండదు. మరింక కష్టమేమిటి? ఏ నియంత ఆదేశాలకో లేదా ఏ అన్యాయ న్యాయాధికారి తీర్పుకో కట్టుబడి నువ్విక్కణ్ణుంచి వెళ్ళిపోవడం లేదు. ఏ ప్రకృతి నిన్నిక్కడికి తీసుకువచ్చిందో ఆ ప్రకృతినే నిన్నిక్కడనుంచి తీసుకువెళ్తోంది. అదెలాంటిదంటే ఒక ప్రయోక్త తాను నాటకంలోకి తీసుకున్న నటుణ్ణి తానే ఇంటికి పంపించెయ్యడం లాంటిది. కాని అయిదంకాల నాటకంలో నేనిప్పటికి మూడంకాలే నటించాను అనవచ్చు నువ్వు. కాని జీవితంలో మూడంకాలే మొత్తం నాటకానికి సమానం. ఎందుకంటే నాటకం ఎంత సేపు నడిపించాలో దాన్ని రచించినవాడికే బాగా తెలుసు. నాటకానికి తెరతీసేవాడూ అతడే, తెరవేసేవాడూ అతడే. రెండూ నీ చేతుల్లో లేవు. కాబట్టి మిత్రమా, సెలవు తీసుకో సంతోషంగా. నిన్ను విడుదల చేసినవాడు కూడా సంతోషిస్తాడు.

ఇక్కడ సంతోషం అనే మాటని కొందరు అనువాదకులు శాంతి అని కూడా అనువదించారు. అప్పుడు ఈ చివరి వాక్యాన్ని ఇలా కూడా చదవవచ్చు.

కాబట్టి శాంతిగా నిష్క్రమించు. నిన్ను విడుదలచేసినవాడుకూడా నీపట్ల శాంతివహిస్తాడు.

ఈ మాటలు రాసుకున్నాక, తన యాభై తొమ్మిదవ ఏడు పుట్టినరోజుకి ఇంకా ఒక నెల ఉందనగా, 180 మార్చి 17 న ఇప్పటి సెర్బియా ప్రాంతంలో యుద్ధ శిబిరంలో మార్కస్ అరీలియస్ మరణించాడు. చివరలో వారం రోజులపాటు జబ్బు పడ్డాడని చెప్తారు. కాని తన పట్లా, లోకం పట్లా, దేవతల పట్లా ఎటువంటి ఫిర్యాదులూ లేకుండా పూర్తిమనశ్శాంతితో అతడు సెలవు తీసుకున్నాడని చెప్పవచ్చు.

13-11-2022

One Reply to “మెడిటేషన్స్-14”

  1. విశ్వ శాంతి శ్రేయస్సు కాంక్షించే మరో చిన్న మార్కస్ కు నా 🛐

Leave a Reply

%d