మెడిటేషన్స్-13

పొద్దున్నే లేచి మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటే, మార్కస్ అరీలియస్ రాసుకున్న వాక్యం ఒకటి గుర్తొచ్చింది. మెడిటేషన్స్ పదకొండో అధ్యాయం చివరలో ఆయన తన పూర్వకాలపు తత్త్వవేత్తల వాక్యాలు కొన్ని రాసుకున్నాడు. అందులో పైథాగొరస్ అనుయాయుల గురించి రాసుకున్న ఈ మాటలు (11:27) గుర్తొచ్చాయి:

తెల్లవారి లేచినప్పుడు ఆకాశం వైపు చూడమని చెప్తుంటారు పైథాగొరస్ అనుయాయులు. ఆ వేళల్లో సమస్త ఖగోళమూ క్రమం తప్పకుండా ఎలా పరిభ్రమిస్తోందో గమనించమంటూ మనం కూడా అలానే మన పనులు చేసుకోవాలని చెప్తారు. అంతే కాదు వాటి నిర్మలత్వాన్నీ, ఎట్లాంటి ఆచ్ఛాదనలూ లేని వాటి స్వరూపాన్ని కూడా గుర్తుచేసుకొమ్మంటారు. ఎందుకంటే నక్షత్రాలకు ముసుగులుండవు.

ఎంత గొప్ప మాట! నక్షత్రాలకు ముసుగులుండవు. నిజానికీ, నిజాయితీకీ ముసుగు తొడుక్కునే పనిలేదు. వాటి నైర్మల్యమే వాటి ఆచ్ఛాదన. వాటి సూటిదనమే వాటి అలంకారం. పదకోండో అధ్యాయంలో మరొకచోట ఈ భావననే మరొకలాగా హృదయానికి హత్తుకునే విధంగా రాసుకుంటాడు. చూడండి (11:15) ఈ మాటలు:

నేను నీతో నిక్కచ్చిగా ఉండాలనుకుంటున్నాను అనే చెప్పేవాడు ఎంత కపటంగా, ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు!సోదరా, నువ్వేం చేస్తున్నావు? ఇలాగ ముందస్తు గా చెప్పుకోవలసిన పని ఉందంటావా? నీ చేతలెట్లా ఉంటాయో ఇంతలోనే తెలిసిపోకుండా ఉండదంటావా? నిజానికి నువ్వెలాంటివాడివో అదంతా నీ మాట్లాడే పద్ధతిలో తెలిసిపోకుండా ఉంటుందా? నీ శీలమెట్లాంటిదో నీ నొసటి మీద కనిపిస్తూనే ఉంటుంది. నీ ఉద్దేశాల్ని నీ కళ్ళు వెల్లడిస్తూనే ఉంటాయి. ప్రేమలో పడ్డవాళ్ళకి తమ ప్రేమికుల అంతరంగం కళ్ళల్లో కనబడ్డట్టే. నిజాయితీపరుడూ, సజ్జనుడూ అయిన మనిషి నీ పక్కనుంటే వాడి వాసన ఇట్టే తెలిసిపోతుంది, చూడు స్నానం చెయ్యనివాడి పక్కనుంచి వెళ్తే మనకి నచ్చినా నచ్చకపోయినా వాడి వంటిమీంచి వాసన మనకి తగిలినట్టే. కాబట్టి నిరాడంబరత్వాన్ని నటించి ప్రయోజనం లేదు, అది ముసుగులో దాచిన కత్తిలాంటిది. తోడేళ్ళలాంటి మనుషులతో స్నేహంకన్నా భ్రష్టత్వం మరొకటి లేదు. వీలైనంతవరకూ వాళ్ళకి దూరంగా ఉండు. సరళస్వభావులు, దయార్ద్రహృదయులు, సజ్జనులు వాళ్ళ వాళ్ళ చూపుల్లో వెల్లడయ్యే తీరతారు. ఆ విషయంలో మనం పొరపడటం అసాధ్యం.

మొదటినుంచీ ప్రకృతీ, అంతరంగ ప్రకృతీ, స్వభావమూ అనే మాటలు మాట్లాడుతూ వస్తున్నందుకు అరీలియస్ ఇలా రాసుకోవడం ఎంతో సముచితంగా ఉంది. వదనం హృదయానికి సూచిక అంటే ఇదే కదా. మన అంతరంగాన్ని ఏమీ చేసీ మరుగు పరచలేం. మనం సరళస్వభావులమయితే అది మన కళ్ళల్లో, మన శ్వాసలో ద్యోతకం కాకుండా మనం ఆపలేం. అది ఎంత కొట్టొచ్చినట్టుగా ఉంటుందంటే స్నానం చెయ్యని వాడి వంటినుంచి వచ్చే దుర్వాసన లాగా అనడం ఉందే, ఆ పోలిక నాకు మరీ నచ్చింది. నిజమే, చాలాసార్లు నిజాయితీపరులు తక్కిన మనుషుల్లో మొదట రేకెత్తించే భావతరంగం repulsion నే. కాని గమనించవలసిందేమంటే నక్షత్రాలు ముసుగులు తొడుక్కోన్నట్టే మంచివాళ్ళకు ముసుగులు తొడుక్కోవలసిన పని ఉండదు, కపటులు ముసుగులు తొడుక్కున్నా లాభం లేదు.

దాదాపుగా ప్రపంచంలోని అన్ని మతగ్రంథాలూ, సెక్యులర్ నీతివేత్తలూ కూడా శీలవిద్య గురించి మాట్లాడుతూ వచ్చారు. మనుషులు శీలవంతులుగా ఉండటంలోని వ్యక్తిగత, సాంఘిక ఆవశ్యకత గురించి చెప్పడంలో ఎవరి urgency వారిది, ఎవరి శైలి వారిది. అందరూ చెప్పే సత్యాలు, హితవచనాలూ అవే అయినప్పటికీ, ఆ శైలి వల్ల, వాళ్ళ పరిశీలనల్లోనూ, పదప్రయోగాల్లోనూ వాళ్ళు చూపించే అద్వితీయత వల్ల ఒక్కొక్కరూ ఒక్కొక్క రకంగా ఆకట్టుకుంటారు. అరీలియస్ కూడా అలానే.

అన్నిటికన్నా ముఖ్యం ఆ చూపు. దాన్నే మనం దర్శనం అంటాం. ఎడిత్ హామిల్టన్ The Roman Way లో స్టోయిక్కుల గురించి రాస్తూ జువెనల్ రచనల్లో రోమన్లు తమ తమ వ్యక్తిగత జీవితాల్లో ఎంత భోగలాలసతలో కూరుకుపోయారో చెప్తే, టాసిటస్ రోమన్ పౌర జీవితం ఎంత ఉన్మాదప్రాయంగా పరిణమించిందో వివరిస్తాడని చెప్తూ కానీ వాళ్ళ సమకాలీనులైన సెనెకా, ఎపిక్టెటస్, అరీలియస్ రచనలకు వచ్చేటప్పటికి, నిర్మలత్వంతో, మంచితనంతో, ధీర హృదయంతో కూడుకున్న వాతావరణం కనిపిస్తుందని రాస్తుంది. సెనెకా ఉత్తరాల్లో, ఎపిక్టెటస్ సంభాషణల్లో, అరీలియస్ డైరీలో కనిపించేలాంటి ఉదాత్త జీవితం ప్రపంచ సాహిత్యంలో చాలా తక్కువ రచనల్లో మాత్రమే కనవస్తుందని చెప్తుంది. ప్రాచీన రోమ్ చరిత్రలోని చివరి అధ్యాయానికి వచ్చేటప్పటికి తీవ్రవైరుధ్యాలు పక్కపక్కనే కనిపిస్తాయని చెప్తూ ఒకవైపు మానవజాతి అత్యంత పతనావస్థకు చేరుకున్న క్షీణత కనిపిస్తూ ఉండగా, మరొకవైపు మానవుడిలోని దైవత్వం పట్ల చెక్కుచెదరని విశ్వాసం కూడా కనవస్తుందని రాసింది.

మన సాంఖ్యుల్లానే స్టోయిక్కులు కూడా కొందరు ఈశ్వరవాదులు, కొందరు నిరీశ్వరవాదులు. అరీలియస్ స్పష్టంగా ఈశ్వరుణ్ణి నమ్మాడు. కాని ఆ ఈశ్వరుణ్ణి ఎపిక్టెటస్ తరహాలో చాలాసార్లు ప్రకృతితో, ప్రకృతిని నడిపించే సూత్రంతో, మానవసంకల్పంతో, సాంఘిక పరమార్థంతో ఒకటిచేసి చూస్తుంటాడు. కాని ఏ పేరు పెట్టి పిలిచినా, వాళ్ళందరిలో కనవచ్చే నమ్మకం-మానవుడి సంకల్పం, అతడి అస్తిత్వ పరమార్థం అతడి దేహానికే పరిమితం కాదనే. వేదాంతులు ఆత్మని నమ్మినట్టుగా, ఆత్మని నిప్పు కాల్చలేదు, నీరు ముంచలేదు అనే నమ్మకంలోంచే తమ జీవనశక్తిని తోడుకున్నట్టుగా, స్టోయిక్కులు కూడా ఒక పారమార్థిక దిశగా తమ ఆలోచనల్ని తీర్చిదిద్దుకోవడం మనకి కనిపిస్తుంది. ఎపిక్టెటస్ అన్నాడట, ‘నువ్వు తలుపులు మూసుకుని, ఒక్కడివే చీకట్లో ఉన్నప్పుడు నువ్వొక్కడివే ఉన్నావనుకోకు, నీతో పాటు దేవుడు కూడా ఆ గదిలో ఉన్నాడు’ అని. ఆయనకి తెలియదు, ఆయన ఆ మాటలు చెప్పిన పది పన్నెండు శతాబ్దాల తరువాత తిరుక్కోయిలూర్ క్షేత్రంలో ముగ్గురు వైష్ణవసాధువులు, బయట కుంభవృష్టి కురుస్తూండగా, తామొక ఇరుకు నడవాలో ఒకరికొకరు చోటు చేసుకుంటూ సర్దుకుంటూ నిలబడి ఉండగా, తమ ముగ్గురితో పాటు మరొక నాలుగ వ్యక్తి కూడా అదృశ్యంగా తన హస్తాల్తో తమని దగ్గరగా తీసుకున్నట్టు అనుభూతి చెందారని. వైష్ణవంలో శరణాగతి, భక్తి, ప్రపత్తి ప్రభవించిన క్షణం అది. అందుకే అరీలియస్ ని చదువుతుంటే అనాసక్తియోగమూ, శరణాగతి రెండూ అల్లుకుపోయి కనిపిస్తుంటాయి.

‘భగవంతుడు సజ్జనుడికి ఐశ్వర్యాల్నివ్వడు. అతణ్ణి సదా పరీక్షిస్తుంటాడు, మరింత దృఢపరుస్తుంటాడు, అతణ్ణి అతడికోసమే సంసిద్ధపరుస్తుంటాడు అన్నాడుట సెనెకా.

‘నీ వృత్తి ఏమిటి?’ అని ప్రశ్నించుకున్నాడు అరీలియస్ తనని తాను. ఆ ప్రశ్నకి ఏమి జవాబు రాసుకున్నాడో (11:5) చూడండి:

నీ వృత్తి ఏమిటి? మంచిగా ఉండటం.

ఒక అనువాదంలో దీన్ని profession అనీ మరొక అనువాదంలో art అనీ అనువదించారు. ఏ పదమైనా కూడా విలువైనదే ఆలోచించదగ్గదే, అనుసరించదగ్గదే. మంచివాడు కావడం ఒక వృత్తిగా, ఒక కళగా-ఎలా అనుష్టించినా జీవితాన్ని సార్థకం చేసేదే. కాని ఒక చక్రవర్తి తన వృత్తి మంచివాడు కావడం అని చెప్పుకోవడాన్ని చూడాలి మనం. అది గాంధీని కోర్టులో నీ వృత్తి ఏమిటి అని అడిగినప్పుడు తానొక నేతగాణ్ణని చెప్పడం లాంటిది. స్వయంగా బారిష్టరు, అధునిక విద్య చదువుకున్నవాడు, తాను అరెష్టయింది పత్రికారచన వల్ల-కానీ తన వృత్తి ఏమిటని చెప్పుకోవలసి వచ్చినప్పుడు ఆయన తనని తాను ఒక నేతగాడిగానే వాజ్ఞ్మూలంలో చెప్పుకున్నాడు.

మంచివాడు కావడమనే వృత్తికీ మామూలు వృత్తులకీ తేడా ఏమిటంటే, ఇక్కడ పనిగంటలు ఉండవు, జీతభత్యాలు ఉండవు, నీపైన అధికారివి నువ్వే, నీ కింద పనిచేసే సిబ్బందీ నువ్వే. అయితే ఆ వృత్తి నిరాఘాటంగా సాగుతున్నట్టు తెలిసేదెట్లా? ఇదిగో, ఇలా (11:4) చెప్పుకుంటున్నాడు:

నలుగురికీ పనికొచ్చే పని ఏదైనా చేసానా? మంచిది, అయితే, నా జీతభత్యాలు నాకు ముట్టినట్టే.

మరి ఆ ఉద్యోగం చేయడానికి ఏదన్నా పద్ధతి ఉందా? మామూలుగా ఉద్యోగాలు చెయ్యడానికి మాన్యువళ్ళు, మాడ్యూళ్ళు ఉంటాయి. మంచివాడిగా జీవించడమనే ఉద్యోగానికి అటువంటి సూత్రాలేమైనా ఉన్నాయా?

ఉన్నాయంటున్నాడు. ఈ మాటలు (11: 19) చూడండి.

నీ అంతరంగం నీకు దారిచూపేదిగా ఉంటున్నప్పుడు దానికి అడ్డుపడే నాలుగు వికల్పాలపట్ల నువ్వెప్పుడూ జాగ్రత్త వహించాలి. వాటిని గుర్తుపట్టినవెంటనే ఈ నాలుగు పద్ధతుల్లో ఆ వికల్పాల్ని  ఆనవాళ్ళు మిగలకుండా తుడిచిపెట్టెయ్యాలి. నాలుగు సూత్రాలు: మొదటిది, ఈ ఆలోచన అనవసరం అని చెప్పుకోవడం. రెండవది, ఈ ఆలోచన మన సాంఘిక బంధాన్ని బలహీనపరుస్తుందని చెప్పుకోవడం. మూడవది,ఈ మాటలు నీవి కావు అని చెప్పుకోవడం, అంటే మనిషి తన అంతరంగపు లోతుల్లోంచి మాట్లాడకపోవడం కన్నా అసంగతం మరేముంటుంది? ఇక నాలుగవది, నీలోని దైవత్వం నీలోని క్షుద్రత్వంతో పోటీపడి దానిముందు తలవంచే పరిస్థితి వస్తున్నందుకు నిన్ను నువ్వు అభిశంసించుకోవడం. అంటే నీ అంతరంగం నీ దేహం ముందు, దాని సుఖాలముందు తలవొగ్గుతున్నందుకు నువ్వు ఖిన్నుడివి కావడం అన్నమాట.

చాలాసార్లు మనం అంతరంగం, అంతరాత్మ, అంతర్వాణి అనే పదాలు వాడుతున్నప్పుడు మనలో ఒకే ఒక్క గొంతు వినిపిస్తున్నట్టుగా చెప్తుంటాం. కాని అనుభవంలో మనకి తెలిసేదేమిటంటే, మనలో ఒకటి కాదు, చాలా సార్లు రెండు గొంతులు వినిపిస్తూ ఉంటాయని. అందులో ఒకటి ఈశ్వరవాణి, రెండవది సైతాను పలుకు. కాని మనం వింటున్నది ఈశ్వరవాణినా లేక రాక్షసమాయనా తేల్చుకోవడమెలాగు? ఆధ్యాత్మిక వేత్తలు ఇందుకు రకరకాల ఉపాయాలు సూచించారు. గాంధీ గారు చెప్పినదేమంటే, నీకు వినిపించే అంతర్వాణినే సత్యం, అదే దేవుడు, ఆ సత్యమే దేవుడు, కాని ఆ సత్యం నీకు అహింసాముఖంలో మాత్రమే గోచరించాలి అని చెప్పారు. అంటే నీ అంతర్వాణి ఇతరుల్ని హింసించమని చెప్తున్నదనుకో, అది అంతర్వాణి కాదన్నమాట. దాదాపుగా ఈ సూత్రాన్ని పట్టుకునే ఆయన ఎన్నో మహోద్యమాలు నడపగలిగాడు. కాని ఏది అహింస అన్న ప్రశ్న తలెత్తినప్పుడు, స్థూలంగా సమాధానం చెప్పుకోగలిగినా, సూక్ష్మ స్థాయిలో జవాబు దొరకని పరిస్థితి ఉంటుంది, అందుకనే ఆయన ఎన్నో సార్లు ఉపవాసాలు చేసాడు, ప్రాయోపవేశాలకు పూనుకున్నాడు, అహర్నిశలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంతకన్న  సులభమైన ఉపాయం మరేదన్నా దొరుకుతుందా అని నేను చాలా ఏళ్ళు చాలా పుస్తకాలు చదివాను. చివరికి ఇగ్నేషియస్ లయోలా చెప్పిన మాట ఒకటి నాకు చాలా విశ్వసనీయంగా అనిపించింది. ఆయన ఏమన్నాడంటే, నీకు నీ అంతరంగం ఏదన్నా చెప్తోందని అనిపించినప్పుడు, ఆ మాటలు నీకు కటువుగా వినిపిస్తే, సందేహం లేదు, నీ అంతర్వాణినే. కాని ఆ మాటలు నీకు ఆహ్లాదంగా వినిపిస్తున్నాయా, అయితే, మేలుకో, చూసుకో, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని.

మన అంతరంగాన్ని మనం సమీపించడానికి అడ్డుపడే వికల్పాలకు అరీలియస్ సూచించిన ఈ నాలుగు ఉపాయాలూ కూడా విలువైనవే. మరీ ముఖ్యంగా, నీ అంతరంగంతో ‘ఇది నువ్వు మాట్లాడుతున్న మాటలు కాదు’ అని చెప్పడం. అది ఎటువంటిదంటే, కొండమీద యేసు తనని ప్రలోభపరుస్తున్న సైతానుతో, ‘ముందు నా కళ్ళముందు నుంచి తప్పుకో’ అని ఆజ్ఞాపించడం లాంటిది.

ఇప్పటిదాకా అరీలియస్ రాసుకుంటూ వచ్చిన మెడిటేషన్స్ లో ఆయన పదే పదే ఏమి చెప్తున్నాడో ఇప్పటికి స్పష్టత వచ్చినట్టు. ఆయన చెప్తున్నదేమంటే, నువ్వు శీలవంతుడివిగా మారే క్రమంలో నీకు అడ్డంకులు రెండు మార్గాల్లో ఎదురవుతాయి. ఒకటి నీలోంచే, నీ అంతరంగంలోంచి. వాటిని ఎలా గుర్తుపట్టాలో, వాటిని ఎట్లా అదుపు చేసుకోవాలో పైన చెప్పాడు. ఇక రెండవది, నీ తోటిమనుషుల నుంచి ఎదురయ్యే అడ్డంకులు. వాటి గురించి ఏమి చెప్తున్నాడో (11:9) చూడండి.

నీ ఎరుకతోటీ, నిన్ను నడిపిస్తున్న వివేచనతోటీ నువ్వు నడిచే దారిలో నీకు అడ్డంగా నిలబడుతున్న వాళ్ళు నిన్ను నీ దారినుంచి పక్కకు తప్పించలేరు. కాబట్టి నువ్వు వాళ్ళ పట్ల ఔదార్యం వహించడం మానెయ్యకు. అయితే, రెండు విషయాల్లోనూ, అంటే, నీ మనోసంకల్పాలు చెదరకుండా చూసుకోవడం, అలాగని వాళ్ళని దూరం చేసుకోకుండా ఉండటం, రెండింటిలోనూ జాగ్రత్తగా ఉండు. గుర్తుపెట్టుకో, వాళ్ళపట్ల చికాకు పడటం కూడా ఒకలాంటి బలహీనతనే. నిన్ను అడ్డగించేవాళ్ళకీ, నిన్ను వేధించేవాళ్ళకీ భయపడి నీ దారినుంచి పక్కకు తప్పుకోవడమూ బలహీనతనే. భయంవల్ల తన ప్రయత్నాలు మానుకునేవాడూ, సాటిమనుషులనుంచి దూరంగా జరిగిపోయేవాడూ ఇద్దరూ తమ బాధ్యతలనుంచి పక్కకు తప్పుకుంటున్నట్టే.

మనుషుల్ని వదులుకోకూడదు, కాని వాళ్ళు నీ ధర్మాన్ని అడ్డగించకూడదు, ప్రపంచాన్ని వదులుకోకూడదు, కాని ప్రపంచం తాలూకు అభిప్రాయాలు నిన్ను శాసించేవి కాకూడదు-ఇవే మెడిటేషన్స్ లో మనకు పదే పదే కనవచ్చే అభ్యాససూత్రాలు.

పదకొండో అధ్యాయంలో ఆయన తన పూర్వతత్త్వవేత్తల సుభాషితాలు కొన్ని రాసుకున్నాడని చెప్పాను కదా. మచ్చుకి రెండు మూడు చూడండి:

సాధారణంగా ప్రజల్లో వ్యాప్తిలో ఉండే నమ్మకాలు సోక్రటీసు దృష్టిలో పిల్లల్ని భయపెట్టడానికి పనికొచ్చే బూచాళ్ళు మాత్రమే (11:23).

స్పార్టన్లు ఏవేనా పండగలు, ఉత్సవాలు జరుపుకునేటప్పుడు తమ అతిథులకి నీడపట్టున కుర్చీలు వేసి తాము మాత్రం ఎక్కడో ఒకచోట సర్దుకు కూచునేవాళ్ళు. (11:24)

ముందు ఎలా చదవాలో, రాయాలో నేర్చుకున్నాకనే, మనం చదవడానికీ, రాయడానికీ ఉపక్రమిస్తాం. జీవించడం కూడా అలానే. (11: 29)

నీ సంకల్పాన్ని ఎవరూ దోచుకోలేరు-ఎపిక్టెటస్. (11:36)

సోక్రటీసు ఇలా అడిగేవాడు: ‘మీరేమి కోరుకుంటున్నారు? వివేచనతో మెలగాలనా లేక ఎలా పడితే అలా మెలగాలనా?’ ‘వివేచనతోనే’. ‘అది ఎటువంటి వివేచన? ఉన్నతవిషయాల గురించిన ఆలోచనలా లేక అధమ విషయాల గురించా’? ‘నిర్మలమైన విషయాల గురించిన ఆలోచనలు’. ‘మరి అటువంటి ఆలోచనలకోసం ఎందుకు ప్రయత్నం చెయ్యడం లేదు’? ‘ఎందుకు? మాకు ఇప్పటికే ఆ ఆలోచనలు ఉన్నాయి కదా’. ‘అయితే మరెందుకట? మీలో మీకిన్ని విభేదాలూ, ఇన్ని కొట్లాటలూనూ?’

11-12-2022

3 Replies to “మెడిటేషన్స్-13”

  1. కరోనా సమయం లో మీరు కథల గురించి చెప్పి పుస్తకాల పట్ల నా దృక్పదాన్ని మార్చారు ఇప్పుడు జీవితం పట్ల నా దృక్పదం మార్ప్చుకోవడానికి మీ ఆలోచనలు ఉపయోగపడుతున్నాయి ధన్యవాదాలు

Leave a Reply

%d bloggers like this: