మెడిటేషన్స్-12

సమాచార సాధనాలు ఇంతగా అందుబాటులో లేని కాలంలో, ఏళ్ళ తరబడి మనుషులు తమ పల్లెల్లో తమ ఇరుగుపొరుగు మధ్య జీవితకాలం తప్పించుకోలేక బందీలుగా గడిపిన కాలంలో వాళ్ళకి పక్కవాళ్ళ అభిప్రాయాలు చాలా ముఖ్యంగా తోచడంలో ఆశ్చర్యం లేదు. పొరుగు వాడి అభిప్రాయమే ప్రజాభిప్రాయంగా నమ్మక తప్పేది కాదు. ఇప్పుడు క్షణంలో కొన్ని వందల అభిప్రాయాలు నీ గోడమీదనో, లేదా నీ ఇన్ బాక్స్ లోనో, లేదా నీ వాట్స్ అప్ లోనో ప్రత్యక్షమవుతున్నప్పుడు, ఏ అభిప్రాయానికి నువ్వు ప్రతిస్పందించాలి?దేన్ని ప్రజాభిప్రాయంగా స్వీకరించాలి? నా చుట్టూ ఉన్నమనుషుల్లో ఎక్కువ గందగగోళం ఈ అభిప్రాయాల వరదవల్ల సంభవిస్తున్నదనే అనుకుంటున్నాను. ఎందుకంటే మనుషులు తమ అస్తిత్వానికీ, తమ నమ్మకాలకీ, అరకొర పరిజ్ఞానంతో తాము ఏర్పరచుకుంటున్న విశ్వాసాలకీ ఎదటివాళ్ళ మద్దతు కోరుకుంటున్నారు. కాని పూర్వులు చెప్పినట్టుగా ఇదంతా మాయ. ఎందుకంటే మన అస్తిత్వసత్యం అభిప్రాయాల మీద ఆధారపడి లేదు. నీ అనుభవాలు నువ్వు మాత్రమే లోనయ్యేవి. ఎదుటివాళ్ళ ప్రశంస కాని, అభిశంస గాని వాటిని వీసమెత్తుకూడా ప్రభావితం చెయ్యలేవు.

సరిగ్గా అరీలియస్ ఈ మాటలే రాసుకున్నాడు. చూడండి (10:13):

నువ్వు పొద్దున్నే నిద్రలేస్తూనే నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నువ్వు మంచి పని చేస్తున్నప్పుడు మరొకళ్ళు దాన్ని చెడ్డదని నిందిస్తున్నందువల్ల ఆ పనిలో ఏదైనా మార్పు ఉంటుందా? ఏ మార్పూ ఉండదు. నిజానికి తమని తాము గొప్పగా భావించుకుంటూ ఇతరుల్ని ఊరికినే పొగిడేవాళ్ళూ, తెగిడేవాళ్ళూ నిద్రపోతున్నప్పుడో, అన్నం తింటున్నప్పుడో ఎలా ఉంటారో నీకు తెలియంది కాదనుకుంటాను. వాళ్ళేం చేస్తుంటారో, ఏది చెయ్యకుండా తప్పించుకుంటూ ఉంటారో, దేని వెనకాతల పరుగులు పెడుతుంటారో, ఎట్లా దొంగిలిస్తారో, దోచుకుంటారో, అది కూడా కాళ్ళతోటీ చేతుల్తోటీ కాదు, వాళ్ళకే చెందిన అత్యంత ముఖ్యమైన భాగం తోటి, అదంతా నీకు తెలుసు. వాళ్ళే కనుక వాళ్ళల్లోని ఆ అమూల్య భాగాన్ని  నీతినీ, ధర్మాన్నీ, ఆనందాన్నీ, సత్యాన్నీ పొందడానికి ఉపయోగించి ఉంటే, ఎంత అద్భుతమైన ఉన్నతి సాధించగలిగి ఉండేవారో కదా.

మనుషుల పట్ల ఏహ్యత, ఏవగింపు కలక్కుండా ఉండటం ఏ మనిషికైనా అసాధ్యం, అరీలియస్ కి అయినా సరే. ఈ మాటలు (10:19) చూడండి:

ఆహారనిద్రామైథునాల్లోనూ, విసర్జనాది క్రియల్లోనూ మనుషులు ఎలా ఉంటారో ఆలోచించు, అదే కొద్దిగా అధికారం చేతికి చిక్కగానే ఎలా రంకెలు వేస్తూ, పెడబొబ్బలు పెడుతుంటారో చూడు. కొద్ది సేపటికిందటిదాకా వాళ్ళే కదా బానిసల్లాగా పరియాచన చేసుకుంటూ ఉండేవాళ్ళు, మళ్ళా మరికొంత సేపటికి మళ్ళీ బానిసలుగానే ప్రవర్తించబోతుంటారు కదా!

అలాగని నువ్వు నీ ఇరుగుపొరుగునుంచి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోతే నిజమైన మనిషిగా రూపొందగలవని అరీలియస్ ఎప్పటికీ అనడు. ఎందుకంటే మనిషి ప్రధానంగా సాంఘికజీవి అని అతడి నమ్మకం. తన తోటిమనుషుల నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకునే మనిషి తెగిపడ్డ అవయవం లాంటివాడని ఒకచోట రాసుకున్నాడు. కాని సృష్టిలో మరే ప్రాణికీ లేని అవకాశం మనుషులకి ఉందని కూడా అనుకున్నాడు. అదేమంటే రాలిన ఆకు తిరిగి చెట్టుకొమ్మని అతుక్కోదు. కాని మందినుంచి విడిపోయిన మనిషి తిరిగి మళ్ళా తన మానవసమూహాన్ని చేరుకోగలడు, వాళ్లల్లో ఒకడు కాగలడు. సమస్య మనుషుల్తో లేదు, మనఃస్థితితో ఉంది. అందుకనే ఇలా ( 10:23) చెప్పుకుంటున్నాడు:

ఒక విషయం ఎప్పుడూ మర్చిపోకు. ఇక్కడున్నట్టే ప్రతి ఒక్కచోటా ఉంటుంది. అది కొండకొమ్ముమీద గానీ లేదా సముద్రపుటొడ్డున గానీ మరెక్కడన్నా గానీ.

కానీ నీ మనఃస్థితిలో మాత్రం నువ్వు ఒకింత ఎడంగానే ఉండాలి. నువ్వెక్కడున్నా నగరమధ్యంలోనే ఉన్నట్టే ఉండాలి, కాని నీ ఎరుకలో మాత్రం తక్కినవారికన్న ఒకింత ఎత్తులోంచే ప్రపంచాన్ని పరికించగలగాలి. ఈ మాటల్లో (10:15)అదే చెప్పుకుంటున్నాడు:

నీకు మిగిలిన జీవితకాలం చాలా స్వల్పం. బతకబోయే కొద్ది కాలం కొండమీద బతుకుతున్నట్టు జీవించు.  తాను ఒక నగరమధ్యంలోనే బతుకుతున్నట్టుగా భావించినంతకాలం మనిషికి ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా ఏమీ తేడా ఉండదు. కాని తన అంతరంగ సత్యాన్ని తెలుసుకున్న మనిషి ఎలా జీవిస్తున్నాడో తక్కినవాళ్ళు చూడనివ్వు. వాళ్ళు అతణ్ణి భరించగలిగారా మంచిది, లేదా వాళ్ళు అతణ్ణి చంపేయనీ. అంతే తప్ప తక్కినవాళ్ళల్లాగా బతకడం వృథా.

మనిషి సంఘజీవి కాబట్టి ఈ సమస్యలన్నీ. మనిషి జీవితసార్థక్యత తననీ, తోటిమనుషుల్నీ నడిపిస్తున్న ప్రకృతికి అనుగుణంగా పని చెయ్యడంలో ఉంది. కాబట్టి తోటిమనుషుల అభిప్రాయాలకి విలువ ఇవ్వకుండా ముందుకు పోగలగడం అసాధ్యం. కానీ నలుగురికి అభిప్రాయాలకీ విలువ ఇస్తూ కూచున్నాకూడా ముందుకు పోగలగడం అసాధ్యం. ఇదొక చిక్కుముడి. కాబట్టే అరిలీయస్ ఈ చిక్కుముడిమీద అంతగా దృష్టిపెట్టాడు.

చాలా సార్లు ఇతరులమీద మనం ఆరోపణలు చేసేముందు, మన అసంతృప్తి వెళ్ళగక్కేముందు మనం కూడా వాళ్ళకేమీ భిన్నం కాదని మర్చిపోతూ ఉంటాం. వాళ్ళ పనులు మనల్ని ఎంత బాధిస్తున్నాయో మన మాటలు కూడా వాళ్ళని అంతే బాధిస్తూ ఉండవచ్చు. ఈ vulnerability లో మనుషులంతా దాదాపుగా సమానులే.  అందుకే అరీలియస్  ఇలా (10:30) రాసుకున్నాడు:

ఎవరైనా నిన్ను బాధపెట్టినప్పుడు వెంటనే నీలోకి నువ్వు చూసుకుని ‘నువ్వు కూడా ఇలాంటి తప్పు చేసావా ఎప్పుడేనా?’ అని ప్రశ్నించుకో. అంటే ఉదాహరణకి డబ్బే సర్వస్వం అనుకోవడంగాని లేదా సుఖాలకోసం పాకులాడటం కాని, కీర్తికండూతితో కొట్టుకుపోవడం గాని చేసావా ఎప్పుడేనా అని ప్రశ్నించుకో. నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఉండగానే నీ కోపం కరిగిపోవడం గమనిస్తావు. ఆ ప్రశ్నలకి మరొక్క ప్రశ్న కూడా జోడించుకుంటే మరీ మంచిది. అదేమంటే అతడు ఏ పరిస్థితుల్లో, ఏ ఒత్తిడి మధ్య ఈ పని చేసి ఉంటాడు లేదా చెయ్యకుండా ఎలా ఉంటాడు అని అనుకున్నావా ఇంకా మంచిది, నీకు చాతనయితే, అతడి మీద ఆ ఒత్తిడి తగ్గించగలిగావా, మరీ మంచిది.

మానవసంబంధాల గురించి మనం ఎందుకు అంత తీవ్రంగానూ, దీర్ఘంగానూ ఆలోచిస్తామంటే వాటిద్వారానే మనం మన జీవితానికొక అర్థాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తాం. అరీలియస్ లాంటి వాళ్ళ ఆలోచనల్లో బలం, ప్రాసంగికత ఎక్కడుందంటే, అవి మన సంబంధాల్లో మనం అనుభవిస్తున్న noise ని తగ్గించుకోవడమెలానో చెప్తుంటాయి కాబట్టి. అరీలియస్ ఆ మాటలు ఒక స్కూల్ టీచర్ లాగా కాకుండా, జీవితాంతం తనతో తాను వాదించుకుంటూ, గొడవపడుతూ, ఏ మేరకో స్పష్టత తెచ్చుకున్నవాడు చెప్పే మాటలుగా ఉండటమే వాటి విలువ. అసలు పదవ అధ్యాయం మొదలుపెడుతూనే తనతో తాను ఏమి చెప్పుకుంటున్నాడో (10:1) చూడండి:

ఓ మనసా! నువ్వెప్పటికి మంచిదానివి కాగలుగుతావు? ఎప్పటికి మరింత సరళంగా, అనాచ్ఛాదితంగా, సంపూర్ణంగా రూపొందగలుగుతావు? నిన్ను కప్పుతున్న దేహం కనిపిస్తున్నంత స్పష్టంగా నువ్వు కూడా ఎప్పటికి కనిపించగలుగుతావు? ఎప్పటికి నువ్వు సంతృప్తినీ, ఆత్మీయతనీ మనసారా గ్రోలగలుగుతావు?ఏదో ఒక కొరత లేమి నిన్ను బాధించకుండా, మరేదీ కోరకుండా, చరాచరాల్లో దేనిపట్ల గాని సుఖాసక్తి పొందకుండా ఎప్పటికి ఉండగలుగుతావు? లేదా కనీసం అధికసమయం వాటిని కోరకుండా? లేదా ఇంతకన్నా సుఖశీతోష్ణాలుండే సీమల్ని, దేశాల్ని తలుచుకోకుండా? లేదా ఇంతకన్నా సులభంగా, సుఖంగా కలగలిసిపోగల మనుషులకోసం వెంపర్లాడకుండా? వాటన్నిటిబదులు నీకు ఏది ఉందో దానితో తృప్తిపడు, ప్రస్తుతాన్ని అంగీకరించు. అదే పదివేలు. ప్రతి ఒక్కటీ దేవతలు నీకిస్తున్న బహుమానమేననీ, విషయాలూ, పరిస్థితులూ ఇప్పుడూ, మరెప్పుడూ కూడా చక్కగానే ఉంటాయనీ, ఉన్నాయనీ నిన్ను నువ్వు ఒప్పించుకో. అవి పూర్ణ సజీవమానవుడికోసం ఏమి దాచిపెట్టినా లేదా ఏమి రూపొందించినా అవన్నీ కూడా చక్కనివీ, సమ్మతమైనవీ, సుందరమైనవేననీ, వాటన్నిటినీ అవి తమలో పొదువుకుని మరింత బహుళంగా, విరళంగా మరింత శుభప్రదసంతోషాల్నే సమకూరుస్తాయనీ నమ్ము. మరొకర్ని నిందించకుండా, మరొకరి నిందకు గురికావలసిన పని లేకుండా దేవతలకీ, మానవులకీ కూడా ఒక సహచరుడిగా నీ స్థానాన్ని ఎప్పటికి స్వీకరిస్తావు?

ఆశ్చర్యమనిపిస్తుంది, అనాది నుండి మానవుడి శుభకామన ఇదే కావడం: తాను ఒకరికి భయపడకూడదు, ఒకరిని భయపెట్టకూడదు. ఒకరిని నిందించకూడదు, ఒకరి నిందకు గురికాకూడదు.

సాధ్యమేనా? పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ ఆకాంక్ష వల్ల మనం మరింత పారదర్శకంగా మారతాం. ఎంత చక్కటి మాట చెప్పాడు. మన దేహం కనిపిస్తున్నంత స్పష్టంగా మన దేహంలోపల దాగి ఉన్న మన అంతరంగం కూడా కనిపించాలట. ఆ కోరిక ఒక్కటి చాలు, నువ్వు ప్రతి రోజూ నిద్రలేవగానే, ఆ కోరికను గుర్తు చేసుకుంటూ ఉన్నా కూడా, నీకూ, నీ పక్కవాడికీ మధ్య సంబంధాలు మరింత తేటపడగలవనడంలో సందేహం లేదు.

బసవేశ్వరుడి వచనం ఒకటి ఉంది. ‘నేను దారిలో పోతున్నప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఎవడు వీడు ఎవడు వీడు, ఎవడు వీడు అనకూడదు, వీడు నా వాడు, వీడు నా వాడు, వీడు నా వాడు అని అనుకోవాలి ‘ అని. Noise, opacity- మానవసంబంధాలనుంచి దూరంగా పెట్టవలసిన పదాలు ఈ రెండూ అనడంలో సందేహం లేదు.

ఆలోచిస్తే ఇదేమీ కష్టమైన విద్య కాదనిపిస్తుంది. కావలసిందల్లా అభ్యాసం. మన పసితనంలో మనం మన పరిమిత ప్రపంచంలో ఇలానే ఉండేవాళ్ళం. కాని మనం ఇల్లు దాటి, మన కుటుంబాన్ని దాటి విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు, మన బడి, మన చదువు, మన చుట్టుపక్కలు ప్రతి ఒక్కటీ మనల్ని ఇందుకు విరుద్ధ దిశలో నడిపించడం మొదలుపెడతాయి. మనల్ని ఈ ప్రేమవిద్యకు దూరం చేస్తాయి. మనుషుల్ని ప్రేమించగలిగి, వారిని శపించవలసిన అవసరం కలగని మనుషులు కనబడటం మనకి రాను రాను అరుదై పోతుంది. చివరికి మనం ఏ స్థితికి చేరుకుంటామంటే, ఈ విద్వేషాలూ, ఈ విభాగాలూ మానవ జీవితానికి సహజం అని నమ్మే స్థితికి చేరుకుంటాం. కాని సరిగ్గా అటువంటప్పుడే, ఇదిగో, ఇటువంటి వాక్యాలు (10: 35) మనం చదవడం అత్యవసరమనిపిస్తుంది.

చక్కగా, ఆరోగ్యంగా ఉన్న నేత్రాలు ప్రతి ఒక్కదృశ్యాన్నీ చూడగలగాలి, కాదు నేను కేవలం కంటికి పచ్చగా కనిపించేవి మాత్రమే చూస్తాను అంటే అప్పుడది కంటికి కామెర్లు వచ్చినట్టే లెక్క. అట్లానే ఆరోగ్యంగా ఉండే ఘ్రాణశ్రోత్రేంద్రియాలు ప్రతి ఒక్కదాన్నీ పీల్చగలగాలి, వినగలగాలి. తిరగలి తనలో దేన్ని తిప్పినా పిండిచెయ్యగలిగినట్టు, ఆరోగ్యంగా ఉన్న ఉదరం ఏది పెట్టినా తిని అరాయించుకోగలిగేటట్టుగా ఉండాలి. అలాగే ఆరోగ్యవంతమైన అంతరంగం తనకేది సంప్రాప్తించినా స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండాలి. ఎంతసేపూ నా పిల్లలు బావుండాలి, నేనేం చేసినా నలుగురూ మెచ్చుకోవాలి అనుకుంటూ ఉండటం తమకి నచ్చినవాటినే కళ్ళు చూస్తామనడంలాంటిదే, లేదా మెత్తగా ఉన్నవాటినే దంతాలు కొరుకుతామనడం లాంటిదే.

రోజూ పరిగెత్తడం వల్ల రక్తప్రసరణం బాగా జరిగినట్టుగా, శరీరాన్ని వంచి యోగాభ్యాసం చెయ్యడం వల్ల దేహం తన పటుత్వాన్ని నిలుపుకోగలిగినట్టుగా, ప్రతి కూల పరిస్థితులు, ప్రతికూల అనుభవాలు మొదట్లో భరించడానికి కష్టంగా అనిపించినా దీర్ఘకాలంలో అవి మన స్థైర్యాన్నీ, సామర్థ్యాన్నీ పెంచేవిగానే కనిపిస్తాయి. ఇప్పటి పరిభాషలో comfort zone- దాన్నుంచి బయటపడకుండా జీవితంలో పురోగతి అసాధ్యం. అరీలియస్ ఏం చెప్తున్నాడో (10:33:4) చూడండి:

తనకి సంభవిస్తున్న అనుభవాల్ని సరిగ్గా వాడుకోగలిగితే మనిషి మరింత పురోగమిస్తాడనే చెప్పవచ్చు.

మనం ఏదన్నా చేపట్టినప్పుడు, ఏవైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తడం చాలా సహజం. కాని సరిగ్గా అప్పుడే వాటిని దాటడానికి ఒక తారకమంత్రం ఉపదేశిస్తున్నాడు అరీలియస్. ఈ మాటలు (10:29) చూడండి:

నువ్వెప్పుడు ఏ పని చేస్తున్నా కూడా, క్షణకాలం ఆగి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఇది చెయ్యకుండానే ఎక్కడ మరణిస్తానో అన్న భావన వల్ల మృత్యువు నిన్ను భయపెడుతోందా?

గొప్పమాట. ఈ పని చెయ్యకుండానే నేనెక్కడ మరణిస్తానో అన్నంత ఆతృత కలిగితే అప్పుడు నువ్వు ఏ పని చేపట్టినా అది మహత్కార్యమే అవుతుంది. అదీ, నీకూ సమాజానికీ కూడా కల్యాణప్రదమే అవుతుంది.

అయితే మరొక మాట. నువ్వు నిజంగానే మరణించవలసి వచ్చిందే అనుకో.  అది నీ చుట్టూ ఉన్నవారికి ఉపశమనంగా అనిపిస్తోందా? ఇది కూడా చూసుకోవాలి మరి. బుద్ధుడంతడివాడు నిర్వాణం చెందినప్పుడు ఒక శిష్యుడు అన్నాడట: ఈయన బతికున్నాళ్ళూ అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తూండేవాడు. ఇప్పుడు మనకి ఆ బెడద లేదు, స్వేచ్ఛగా మసలుకోవచ్చు అని. ఒక మనిషి శీలవంతుడిగా జీవించాలనుకోవడం చాలాసార్లు తోటిమనుషుల మీద కలిగించే ఒత్తిడి మామూలుగా ఉండదు. అరీలియస్ కి ఈ సంగతి తెలుసు. ఆయన ఇలా (10:36) చెప్పుకుంటున్నాడు:

తాను మరణించబోతున్నప్పుడు తన చుట్టూ మనుషులు నిలబడి లోపల్లోపల సంతోషించకుండా ఉన్నవాడికన్నా అదృష్టవంతుడు మరొకరు ఉండరు. అతడు మంచివాడూ, వివేకవంతుడూ అనుకో, అటువంటి మనిషి దగ్గర నిలబడి ‘అబ్బా ఈ స్కూలు మాష్టరు బెడద వదిలింది, ఇకనుంచి హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు’ అని ఒక్కడేనా అనుకోకుండా ఉంటాడా?’నిజమే, ఆయన మనలో ఎవరిపట్లా కఠినంగా ఉండలేదు, కాని మౌనంగానే మనల్ని ఖండిస్తూ ఉండేవాడు కదా’, అని ఆ మనిషి గురించి అనుకోకుండా ఉండరు. అదే మన విషయానికొస్తే వాళ్ళు సంతోషంగా ఊపిరి పీల్చుకోడానికి ఇంకెన్ని కారణాలు ఉంటాయో కదా !నువ్వు మరణించేటప్పుడు ‘ఎట్లాంటి జీవితం నుంచి సెలవు తీసుకుంటున్నాను. బతికున్నంతకాలం ఎవరికోసం నేనంతలాగా కష్టపడ్డానో, పట్టించుకున్నానో, ప్రార్థనలు చేసానో, ఆ నా సహచరులే, ఇప్పుడు నేను పోతే ఒకింత ఊపిరి పీల్చుకోవచ్చనుకుంటున్నారు అనుకున్నావనుకో,  ఈ లోకం నుంచి మరింత సులువుగా సెలవుతీసుకోగలుగుతావు. అటువంటప్పుడు ఇంకా ఈ జీవితాన్ని పట్టుకుని ఎందుకు వేళ్ళాడటం? అలాగని వాళ్ల పట్ల దయగా ఉండటం మానకు, చెక్కుచెదరని మనఃస్థితితో, ఆదరంగా, ఔదార్యంతో, మృదువుగా ప్రవర్తించు. మనిషి అనాయాసమరణానికి లోనయినప్పుడు అతడి ఆత్మ సుఖంగా దేహం నుంచి విడివడగలుగుతుంది. నీవాళ్ళనుంచి నీ నిష్క్రమణ కూడా అంత సులువుగానూ ఉండాలి. నీ బంధువులనుంచి సెలవుతీసుకుంటావే, అలా ఎలాంటి పెనగులాటా లేకుండా, ఏ బలవంతమూ లేకుండా, అలా నిష్క్రమించడం కూడా ఒక ప్రకృతిధర్మమే.

చివరికి ఈ చర్చ అంతా చేసాక ఒక్క మాట (10:16) చెప్పుకున్నాడు:

మంచివాడిగా ఉండటమెలా అనే ఈ చర్చ ఇంక కట్టిపెట్టి ముందు మంచివాడిగా బతకడం మొదలుపెట్టు.

ఆ మొదటి అడుగు ఎలా వేయడమంటే, ఏడవ  అధ్యాయంలో రాసుకున్న ఈ మాటలు (7:56) గుర్తుతెచ్చుకోవాలి:

నువ్వు మరణించబోతున్నావనీ, నీ జీవితం ఇప్పటితో పూర్తయిందనీ అనుకో. ఇక ఇప్పణ్ణుంచి జీవించే ప్రతి ఒక్క క్షణం నీకు అదనపు బహుమతి కింద లెక్క, దాన్ని నీ అంతరంగ అనుసారం గడపడం మొదలుపెట్టు.

11-11-2022

Leave a Reply

%d bloggers like this: