మెడిటేషన్స్-11

Reading Time: 5 minutes

ఈ వ్యాసాలు చదువుతున్న మరొక మిత్రురాలు నిన్న నన్నొక ప్రశ్న అడిగారు. ‘ అందరికీ ఇలాంటి మనసు ఉండదు..కొందరు చిన్నచిన్నవాటికే ఈర్ష్యపడుతూ మనల్ని ఏదో ఒకటి అంటూ ఇల్ ట్రీట్ చేస్తుంటారు..అలాంటప్పుడు కనీసం సెల్ఫ్ డిఫెన్సు ఐనా చేసుకోవాలి కదా..వారి పై కనికరం చూపించి వదిలేస్తే మళ్ళీ ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ‘ అని. నేను వెంటనే ఏమీ జవాబివ్వలేదు. అరగంట తరువాత ఆమె మళ్ళా ‘మీ సమాధానం నాకెంతో విలువైనది ‘ అని మెసేజి పంపించారు.

ఇవాళ మెడిటేషన్స్ తొమ్మిదవ అధ్యాయం గురించి రాయాలి.ఆమె ప్రశ్న కి ఇందులో ఏదైనా సమాధానం దొరుకుతుందా అని చూసాను. ఈ వాక్యాలు (9:34) కనిపించాయి:

ఆ మనుషుల జీవితాన్ని నడుపుతున్న సూత్రాలేమిటి? వాళ్ళు ఎలాంటి పనుల్లో మునిగితేలుతుంటారు? వాళ్ళు ఏ కారణాలకోసం ప్రేమిస్తుంటారు దేన్ని గౌరవిస్తుంటారు? వాళ్ళ అంతరంగాల్ని విప్పి చూస్తున్నట్టుగా ఊహించుకో. వాళ్ళ నిందిస్తే నీకు హాని కలుగుతుందనీ, ప్రశంసిస్తే నీకు మంచి జరుగుతుందనీ అనుకుంటున్నారా? ఎంత వెర్రితనం!

అసలు స్టోయిక్ తత్త్వశాస్త్రమంతా ఈ అంశం చుట్టూతానే తిరుగుతుంది.  అదేమంటే, ఒకడు నిన్ను బాధపెట్టడం నీ చేతుల్లో లేదు. కాని ఆ బాధని స్వీకరించడం, అంగీకరించడం, వాడు నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలని కోరుకుంటున్నావో అలాగే నువ్వు నీ గురించి భావించుకోవడం- ఇవి నీ చేతుల్లోనే ఉన్నాయి. వాడి మాటలకి విలువ ఇవ్వడం నీ సొంత నిర్ణయం. అప్పుడు తప్పు నీది, వాడిది కాదు. అరీలియస్ ఇంకా ఇలా (9:27) అంటున్నాడు:

ఒకడు నిన్ను నిందిస్తున్నప్పుడు లేదా నిన్ను ద్వేషిస్తున్నప్పుడు లేదా మనుషులు నిన్ను విమర్శిస్తున్నప్పుడు, వారి అంతరంగాల్లోకి చొచ్చుకుపోయి వాళ్లెలాంటివాళ్ళో ఊహించడానికి ప్రయత్నించు. వాళ్లకి నీమీద ఏదో ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉండి తీరాలన్న నీ ఆందోళన అర్థం లేనిది అని గ్రహిస్తావు. అయినా కూడా నువ్వు వాళ్ల పట్ల ఒకింత దయగా ఉండక తప్పదు. స్వభావరీత్యా వాళ్ళు నీ స్నేహితులు. దేవతలు కూడా వారికి రకరకాలుగా, స్వప్నాల్లోనో లేదా శకునాల ద్వారానో వాళ్ళకంటూ ఒకదారి చూపిస్తూనే ఉన్నారు, కనీసం వాళ్ళు కోరుకుంటున్నదారి.

మనుషులందరి మధ్యా ఒక సహజబంధం ఉందనేది అరీలియస్ గాఢంగా నమ్మిన విషయం. అది పవిత్రబంధం అని కూడా ఆయన నమ్మాడు. చాలాసార్లు మన తోటిమనుషులు మనల్ని బాధపెడుతున్నప్పుడు, ఆ బాధ అకారణం అని మనం భావిస్తున్నప్పుడు, ఆయన మనకు చెప్పే సలహా ఏమిటంటే, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు చేస్తున్నది నిన్నెలా బాధిస్తున్నదో వివరించు, అయినా కూడా వాళ్ళు వినలేదా, ఇదిగో, ఈ మాట (9:38) చెప్తున్నాడు:

ఒక మనిషి తప్పు చేస్తున్నాడా దాని భారం అతడిదే.

ఆ వాక్యంతో ఆగకుండా ఇలా కూడా అంటున్నాడు:

బహుశా అతడు తప్పు చేసి ఉండకపోవచ్చు కూడా.

నా ఇన్నేళ్ళ జీవితంలో రెండు సంగతులు గమనించాను. మొదటిది, మన విలువైన సమయమంతా, ఈ అపార్థాల గురించిన ఆలోచనలతోనే గడుపుతున్నాం. రెండవది, కొన్నాళ్ళు గడిచిపోయాక, వాళ్ళూ ఉండరు, ఆ అపార్థాలూ ఉండవు. ఉండరంటే, ఉండరని కాదు, వాళ్ళకి అంతకు ముందు మన జీవితంలో మనం ఇచ్చిన స్థానంలో ఉండరు. వాళ్లగురించేనా, వాళ్ల మాటల గురించేనా అప్పట్లో అంతగా కొట్టుమిట్టాడేం అనిపిస్తుంది. నవ్వు కూడా వస్తుంది. కాని నిజంగా జాలి కలగవలసిన విషయం ఇది. జాలి వాళ్ళ మీద కాదు, మన మీద. ఎంత విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకున్నాం వాళ్ల గురించీ, వాళ్ల మాటల గురించీ తలపోస్తూ, తలపట్టుకుంటూ!

అందుకనే బ్రహ్మాస్త్రం లాంటి ఒక ఉపాయం చెప్తాడు అరీలియస్. ఈ వాక్యం (9:20)

ఎదుటివాళ్ళ తప్పుల్ని ఎక్కడివాటిని అక్కడే వదిలెయ్యి.

ఎక్కడివాటిని అక్కడే వదిలెయ్యడం. ఎంతమంచి మాట. అయిదవ అధ్యాయంలో కూడా ఇటువంటి మాటలే (5:25) చెప్తాడు:

వాడు తప్పు చేస్తున్నాడా? అయితే నాకేం సంబంధం? వాడి సంగతి వాడు చూసుకుంటాడు. అది వాడి పని, వాడి సమస్య. ఈ విశ్వాన్నంతా నడుపుతున్న సూత్రమేముందో అది నాలో కూడా ఉందని నేను గుర్తుపెట్టుకుంటే చాలు, అది నన్నేమి చెయ్యమని చెప్తుందో అది చేసుకుంటూ పోతే చాలు.

ఎదటివాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళకి వాళ్ళుగా చేస్తున్నవీ, నీ పట్ల చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నవీ కూడా, ఎక్కడివక్కడ వదిలెయ్యడం నిజంగా ఒక సాధన. ఎందుకంటే మనకి తెలీకుండానే మనం వాటిని మోసుకుంటూ తిరుగుతూనే ఉంటాం. ఒకడు నిన్నేదో అంటాడు. లేదా నిన్నేదో అన్నాడని మరొకడు నీతో చెప్పి ఉంటాడు. గమనించారా, అది హటాత్తుగా ఒక ముల్లు గుచ్చుకున్నట్టుగా కలుక్కుమంటూ ఉంటుంది. అలా ఎన్ని ముళ్ళు మనతో మోస్తున్నామో కదా. మనం ఎప్పుడేనా ఏ గరికచేలలోంచో నడిచివచ్చినప్పుడు ఆ పూతికముళ్ళు మన దుస్తులకి తగులుకుని ఉంటే వెంటనే వాటిని ఏరిపారేస్తాం. అలాగే మనుషుల్తో మన ప్రతి కలయిక తర్వాతా, ఆ కలయికలో మనల్నేవేనా ముళ్ళు గుచ్చుకుని ఉంటే వాటిని అక్కడే ఏరిపారేసుకోవాలి. ఎక్కడివక్కడే.

అలాగని తప్పించుకొమ్మని చెప్పటం లేదు ఆయన. అతనిది passive philosophy కాదు. ఈ మాటలు (9:11) కూడా చూడండి:

నీకు చాతనయితే, ఆ తప్పులు చేస్తున్నవాళ్ళు ఆ తప్పులు చేయకుండా సరిదిద్దు. నీకు చాతా కాదా, దయగా ఉండు. దయగా ఉండటమనేది దానికదే గొప్ప బహుమానం. దేవతలు వాళ్ళ పట్ల కూడా దయచూపించకపోరు. వాళ్ళు కోరుకున్నది- ఆరోగ్యమో, సంపదలో, కీర్తిప్రతిష్టలో అనుగ్రహించకపోరు. దేవతలు అంత దయార్ద్రహృదయులు. ఆ దయ నువ్వు కూడా చూపించగలవు. మరి నువ్వు దయార్ద్రహృదయుడిగా ఉండకుండా నిన్నేది అడ్డగిస్తోంది?

తొమ్మిదవ అధ్యాయంలో చివరి మెడిటేషన్ (9: 42) సుదీర్ఘమైన భావవీచిక. అందులో ఈ అంశాన్నే మరింత లోతుగా మననం చేసాడు. చూడండి:

ఎవరేనా సిగ్గుమాలిన పనుల్తో నిన్ను బాధపెడితే నిన్ను నువ్వు వెంటనే ప్రశ్నించుకో- ఇంత సిగ్గుమాలిన మనుషులు ఈ లోకంలో ఉండటం సాధ్యమేనా అని. సాధ్యం కాదనే అంటాను. అటువంటప్పుడు ఆ అసాధ్యమైన విషయం గురించి ఎందుకు తలపోయడం? నువ్వనుకుంటున్న ఆ సిగ్గుమాలిన మనిషి కూడా ఈ ప్రపంచం నడవడానికి అవసరమే. ద్రోహులు, జిత్తులమారులు, దుర్మార్గులు-ప్రతి ఒక్కరి విషయంలోనూ కూడా ఇదే గుర్తుపెట్టుకో. నిజంగానే అలాంటి మనుషులు ఈ ప్రపంచంలో ఉండటం అసంభవమని నీకు నువ్వు చెప్పుకోగానే వాళ్లల్లో ప్రతి ఒక్కరి పట్ల నీలో ఒక కరుణ ఉదయిస్తుంది. అంతే కాదు, ఎటువంటి తప్పిదాన్నైనా సరే సరిదిద్దగల శక్తి కూడా మనకి ప్రకృతి ప్రసాదించిందని గుర్తుకొస్తుంది. క్రూరత్వానికి విరుగుడుగా సాధుత్వాన్ని, అలాగే రకరకాల తప్పిదాలకు రకరకాల విరుడుగుల్ని ప్రకృతి మనకి అందించింది.  తప్పు చేస్తున్న ప్రతి వాడూ దారితప్పినవాడు, తన గమ్యం మర్చిపోయినవాడూనూ. అలా దారి తప్పిన ప్రతి ఒక్కడికీ హితవు చెప్పి తిరిగి దారికి తేవడం నీకు సాధ్యమే.

అదీకాక నువ్వు నిజంగా గాయపడ్డది ఎక్కడని? ఎప్పుడని? నీకు కోపం తెప్పిస్తున్నవాళ్ళెవరూ కూడా నిజంగా నీ మనసుని బాధపెట్టగలిగినవాళ్ళు కారు. నీ మనసుని ఎవరేనా నిజంగా బాధపెడుతున్నారంటే అది నువ్వే. వాళ్ళకి అసలు చోటే లేదు.

పైగా, అజ్ఞాని అజ్ఞానిలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం ఏముంది? అలోచించు. వాడు అజ్ఞాని కాబట్టి అలా అజ్ఞానంగా ప్రవర్తించి ఉంటాడని నువ్వు ముందే ఊహించకపోవడం నీ తప్పు కాదా? వాడు అలాంటి తప్పు చేసే అవకాశం ఉందని గుర్తుపట్టగలిగే వివేచన నీకున్నప్పుడు నువ్వు ఆ సంగతి మర్చిపోయి, ఇప్పుడేమో, వాడు చూడు ఎలాంటి తప్పులు చేస్తున్నాడో అని ఆశ్చర్యపోతున్నావు.

అన్నిటికన్నా ముఖ్యం, అవిధేయత, కృతఘ్నత లాంటి పదాలు వాడేముందు, నిన్ను నువ్వు సరిచూసుకో. తప్పు పూర్తిగా నీదే అని తెలుస్తుంది. వాడు నీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాడని నువ్వు నమ్మావు. పైగా నువ్వు వాడికి ఒక మేలు చేసినప్పుడు దాన్ని అక్కడితో వదిలిపెట్టక, అలా మేలు చెయ్యడం దానికదే నువ్వు నీకిచ్చుకోగల బహుమానం అని భావించకుండా ఇంకా దేనికోసమో ఎదురుచూస్తున్నావు. అంటే వాడినుంచి నువ్వు మళ్ళా బదులు కోరుకుంటున్నావా? నీ స్వభావానికి అనుగుణంగా నువ్వొక మంచి పని చేసావు, అది చాలదా? నువ్వెప్పుడో చేసిన ఆ మంచిపనికి ఇప్పుడెందుకు వెలగడుతున్నావు? కళ్ళు తాము చూస్తున్నదానికి తిరిగి బదులు కోరుకున్నట్టు, పాదాలు తాము నడుస్తున్నదానికి మళ్ళా ప్రతిఫలం కోరుకున్నట్టు. అవి ఏ నిర్ధిష్ట ప్రయోజనం కోసం రూపొందాయో ఆ పని చేయడంతోనే ఆ ప్రయోజనం పూర్తయిపోయింది కదా. అలాగే మనిషి కూడా మంచిపనులు చేయడానికే పుట్టాడు. నలుగురి మంచి కోసం అతడేమి తలపెట్టినా, ఏమి చేసినా, అతడు దేనికోసం పుట్టాడో ఆ పనినెరవేర్చుకున్నట్టే కదా.

ఇంత సుదీర్ఘంగా నడిచిన ఆలోచన సారాంశమే ఎనిమిదో అధ్యాయంలో ఒక్కవాక్యంగా (8:59) రాసుకున్నాడు:

మనుషులు పుట్టిందే ఒకరికోసం ఒకరు. కాబట్టి తెలియచెప్పడానికి ప్రయత్నించు లేదా సహించి సర్దుకు పో.

దీనికిముందు ఏడో అధ్యాయంలో ఈ మాటలు (7:73) కూడా:

నువ్వో మంచి పనిచేసినప్పుడు, ఎదుటివాడు దాన్ని అందుకున్నప్పుడు ఇంక మూడో దాంతో పనేమిటి? చేసిన మంచిపనికి, మూర్ఖుల్లాగా, ప్రతిఫలం కోసం ఎదురుచూడటమా?

నాకేమనిపిస్తోందంటే, మనం జీవితంలో పొందుతున్న చాలా నిరాశా, నిస్పృహ, మనుషులమీదా, దేవుడిమీదా మనం చేస్తున్న ఫిర్యాదులూ, ప్రధానంగా గతాన్నీ, భవిష్యత్తునీ దృష్టిలో పెట్టుకుని చేసేవే. అరీలియస్ దృష్టిలో గతం లేదు, ఆగతం లేదు. ఉన్నదల్లా వర్తమానం, అది కూడా ఈ క్షణం, ఇప్పుడు మాత్రమే. అదొక్కటే నీ చేతుల్లో ఉన్నది. మనం తలపెట్టే పెద్ద పెద్ద ప్రణాళికలు, మనకై మనం చెప్పుకునే పెద్ద పెద్ద విషయాలు, అవన్నీ మనం గాల్లో కట్టే మేడలు. నిజానికి మనం చెయ్యగలిగిందీ, చెయ్యవలసింది, ఇప్పుడు, ఈ క్షణం, మనముందు ఏముందో ఆ పని మాత్రమే. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ వాక్యాలు (9:29) చూడండి:

ఈ ప్రపంచాన్ని నడిపించే సూత్రం ఒక శీతాకాలపు గాలి లాంటిది, అది తనతో పాటు తన చుట్టూ ఉన్న మొత్తాన్నీ లాక్కొస్తుంది. కాని తమ రాజకీయాల్లో తాము కూరుకుపోయి తత్త్వశాస్త్రాన్ని ఔపోశన పడుతున్నామనుకునే ఈ మనుషులు ఎంత నిర్భాగ్యులు! వట్టి వెర్రిముఖాలు! సోదరా! ఇప్పుడు నువ్వేం చెయ్యాలని నీ ప్రకృతి కోరుకుంటుందో అది చెయ్యి చాలు. అది చెయ్యడం నీ చేతుల్లో ఉంటే వెంటనే చెయ్యడం మొదలుపెట్టు. ఆ పని చెయ్యడం మొదలుపెట్టావని నలుగురూ చూస్తున్నారా లేదా అని దిక్కులు చూడకు. ప్లేటో కలలుగన్న ఆదర్శరాజ్యం కోసం తపించడం మాని ముందు నువ్వు చేస్తున్న చిన్నపనితో తృప్తిపడు. అదేమీ చిన్నపని కాదని గుర్తుపెట్టుకో. తమని తాము తత్త్వవేత్తలుగా పరిగణించుకుంటున్న ఈ మనుషులు ఎంత అల్పులు? చీమిడి కారుతున్న ముఖాలూ వాళ్ళూనూ! వాళ్ళ అభిప్రాయాలు మార్చగలిగేదెవ్వరు? చెప్పింది విధేయంగా పాటిస్తున్నట్టు పైకి కనిపిస్తూ లోపల్లోపల ఈసురోమని మూలుగుతుండే వీళ్ళకి  తమ అభిప్రాయాలు మార్చుకోకపోతే బానిసత్వం తప్ప వేరే గత్యంతరమేముంది? సరే, అలెగ్జాండరు గురించి, ఫిలిప్పస్ గురించి, డెమెట్రియస్ గురించి చెప్తావా? వాళ్ళు మానవప్రకృతిని అర్థం చేసుకోగలిగారా? దాని ప్రకారం నడుచుకోగలిగేరా? వాళ్ళకి అది చాతకాకనే వాళ్ళ జీవితాలు విషాదకరంగా ముగిసాయా? అలాగైతే వాళ్ళని అనుసరించవలసిన ఖర్మ నాకు పట్టలేదు. తత్త్వశాస్త్రపు దారి చాలా సరళం, సులభం, దాన్నుంచి పక్కకు తప్పించి గర్వం వైపూ, ఆభిజాత్యం వైపూ నా చూపు మరల్చకు.

చాలా విలువైన మాటలు. మనుషులు 2500 ఏళ్ళుగా తిరిగి తిరిగి చేస్తున్న పొరపాటు ఒక్కటే. మనం అయితే ఆదర్శరాజ్యం గురించో లేదా మరోప్రపంచం గురించో కలలుగంటో, ఇప్పుడు ఈ క్షణాన జీవించవలసిన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాం. చిన్నపనితో మొదలుపెట్టడం మనకి నచ్చదు. చిన్నపని నిజానికి చిన్నదేమీ కాదు. ఏదో ఒక చిన్నపని, నీ మనసుకి నచ్చిన పని, నలుగురికీ అందులో ఒక అందమో, ఆనందమో దొరికే పని, అది ఒక మొక్క పెంచడం కావచ్చు, ఒక బొమ్మ గియ్యడం కావచ్చు, ఒక పాట కట్టడం కావచ్చు. అట్లాంటి క్షణాల్లోనే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఆ మేరకు ఒక ఆదర్శరాజ్యంగా మారగలదని మనం మర్చిపోతున్నాం.

ఇదే హితవు ఆయన మరొక మెడిటేషన్ లో కూడా ఇంత స్పష్టంగానూ రాసుకున్నాడు. మామూలుగా స్టోయిక్కులు ఎపిక్యూరియన్లను అంగీకరించరని చెప్పాను. కాని తన భావాలకు సన్నిహితంగా ఉన్న మాటలు ఎపిక్యూరస్ చెప్పి ఉంటే వాటిని గుర్తుచేసుకోడానికి అరీలియస్ కి ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఈ మాటలు (9:41) వినండి:

ఎపిక్యూరస్ చెప్తున్నాడు, నాకు ఒంట్లో బాగాలేనప్పుడు నా సంభాషణలు నా అనారోగ్యం గురించి ఉండవు. నన్ను చూడటానికి వచ్చినవాళ్ళతో నేను నా అనారోగ్యం గురించి మాట్లాడే బదులు విషయాలు ముందునుంచీ ఎలా ఉండేవో, ఇప్పుడు నా దేహం రోగగ్రస్తంగా ఉన్నప్పుడు కూడా కలతచెందకుండా, లోకహితం గురించి ఎలా ఆలోచిస్తూ ఉందో, ఆ విషయాలు మాట్లాడతాను. నాకు చికిత్స చేస్తున్న వైద్యులు తామేదో ఘనకార్యం చేస్తున్నట్టుగా కనిపించడం నాకు ఇష్టం ఉండదు, నా జీవితం ఎప్పటిలానే సంతోషంగానే గడిచిపోతున్నట్టే కనిపించాలనుకుంటాను. కాబట్టి, నువ్వు జబ్బు పడ్డప్పుడు ఆయన తాను జబ్బుగా ఉన్నప్పుడు ఏం చేసాడో అదే చేయి, జబ్బు లేనప్పుడు ఆయన ఎలా ఉండేవాడో అలానే ఉండు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తత్త్వశాస్త్రాన్ని వదిలిపెట్టకు. నీ నెత్తిమీద ఏమన్నా విరుచుకుపడనీ నువ్వు మాత్రం పోచుకోలు కబుర్లలో పాలుపంచుకోకు. అన్ని తత్త్వశాస్త్రాలూ ఇదే చెప్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీదనే దృష్టిపెట్టు, అందుకు ఏ సాధనం దొరికితే ఆ సాధనం మీదనే మనసుపెట్టు.

మళ్ళీ మొదటికి వద్దాం. నా మిత్రురాలు అడిగిన ప్రశ్న దగ్గరికి. మనుషులు మనల్ని ఇల్ ట్రీట్ చేస్తూ ఉంటే మనమేం చెయ్యాలి? ఒకరు మనల్ని అకారణంగా బాధించడం కూడా ఒకలాంటి వైరల్ ఫీవర్ లాంటిదే. మన నిమిత్తం లేకుండానే మనల్ని అస్వస్థుల్ని చేస్తుంది అది. కాదనను. కాని, సరిగ్గా అప్పుడే, మన అంతరంగ ప్రకృతిని మనం కాపాడుకోవాలి. బయటివాళ్ళ మాటల నీడలు దాని మీద పడకుండా చూసుకోవాలి. పక్కవాళ్ళనుంచో, మననుంచో జాలికోసం ఎదురుచూడటం మానేయాలి. మనం చేస్తూ ఉన్న పని ఏదన్నా ఉంటే దాని మీద దృష్టి పెట్టడం మంచిది. ఆ చేసే పని ఇంకాస్త బాగా చెయ్యడానికి ప్రయత్నిస్తే మరీ మంచిది.

10-11-2022

2 Replies to “మెడిటేషన్స్-11”

  1. “మనుషులు పుట్టిందే ఒకరికోసం ఒకరు. కాబట్టి తెలియచెప్పడానికి ప్రయత్నించు లేదా సహించి సర్దుకు పో”. Sounds simple, yet deeply meaningful. Thank you!

Leave a Reply

%d bloggers like this: