మెడిటేషన్స్-9

ఒక పారిజాతం మొక్క తెచ్చి కుండీలో నాటి టెర్రేస్ మీద పెట్టాను. ఈ ఏడాదికి అది పూస్తుందనుకోలేదు. కాని మొన్న విజ్జి ‘పారిజాతం ఒక పువ్వు పూసింది చూసారా’ అంది. వెంటనే ఒక్క ఉదుటున పైకి వెళ్ళాను. అప్పటికే ఆ పువ్వు కుండీలో రాలి ఉంది. ఆ పువ్వుని చూడగానే చాలాసేపు నా కళ్ళని నేను నమ్మలేకపోయాను.

ఎక్కణ్ణుంచి వచ్చింది ఈ పువ్వు? ఈ తెల్లని తునక? ఈ పరిమళపు మొలక? సూర్యుడూ, ఆకాశమూ, మట్టీ, నీళ్ళూ, శరత్కాలమూ కలిసి ఈ మొక్కనుంచి పాలచినుకులాంటి ఈ పువ్వుని బైటికి తీసుకొచ్చాయి. వాటన్నిటితో పాటు నా ఎదురుచూపు కూడా. నేను తన కోసం నిరీక్షిస్తున్నానని ఈ పువ్వుకి తెలిసి ఉండాలి. ఆ మొక్క తన వేర్లనుంచీ నా పిలుపు విని ఉండాలి.

సరిగ్గా ఇదే (7:9) చెప్తున్నాడు మార్కస్ అరీలియస్.

అన్ని విషయాలూ ఒకదానిలో ఒకటి అంతర్భాగంగా ఉన్నాయి. వాటన్నిటిమధ్యా ఒక పవిత్రబంధం నెలకొని ఉంది. ఒకదానితో అనుసంధానం కాకుండా మరొకటి లేదు.విషయాలన్నీ పరస్పర సమన్వయంతోనే ఈ విశ్వవ్యవస్థ ఏర్పాటయ్యింది. అన్ని విషయాలూ కలిసి ఒకటే విశ్వం, అన్నిటా వ్యాపించి ఉన్నది ఒకడే దేవుడు, ఒకటే పదార్థం, ఒకటే సూత్రం, ప్రాణులన్నిటిలోనూ ఒకటే ఎరుక, ఒకటే సత్యం, ఆ ఎరుకని పంచుకుంటున్న జీవులన్నిటిలోనూ ఒకటే పరిపూర్ణత.

ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ వాక్యాలు. ఇది స్పష్టంగా ఉపనిషద్వాణి. ఒక మనిషి అద్వైతానికి చేరుకోవడమంటే ఇలాగ. జ్ఞానం వల్ల విడుదల లభిస్తుందని ఉపనిషత్తులు పదే పదే చెప్తూ వచ్చాయంటే, ఇందుకే కదా. ఒకసారి ఇటువంటి జ్ఞానం కలిగాక ఆ మనిషి ప్రపంచాన్ని పరికించే తీరు, తోటి మనుషుల్తో ప్రవర్తించే తీరు ప్రత్యేకంగా ఉండక తప్పదు. మెడిటేషన్స్ ఏడవ అధ్యాయమంతా దానికి నిరూపణ. చూడండి ఈ (7:3) వాక్యాలు:

ఊరేగింపుల్లోని శుష్కపటాటోపం, రంగస్థలం మీద ప్రదర్శన, గొర్రెలమంద, కర్రసాము, కత్తిసాము, కుక్కపిల్లలముందు విసిరిన ఎముక ముక్క, చెరువులో చేపలకోసం జల్లిన రొట్టెతునకలు, వీపున బరువు మోసుకుంటూ సాగే చీమలబారు, భయంతో అటూ ఇటూ పరుగెత్తే చుంచెలకలు, దారం లాగినప్పుడల్లా కదిలే కీలుబొమ్మలు-ఇట్లాంటి వాటి మధ్య, వాటిని చూసి ఏవగించుకోకుండా, సహిస్తూ జీవించడం నీ బాధ్యత. గుర్తుపెట్టుకో, ఒక మనిషి వేటికి విలువనిస్తున్నాడో వాటిని బట్టే అతడి విలువ లెక్కకొస్తుంది.

సరిగ్గా ఇట్లాంటి మాటలే (మత్తయి, 7:2) క్రీస్తు కూడా చెప్పాడు. నువ్వు ఎదటిమనిషిని ఏ తూనికతో కొలుస్తావో ఆ తూనికతోనే నిన్నూ కొలుస్తారు అని. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నువ్వు చేరుకున్న జ్ఞానానికి చేరుకోకపోయినప్పటికీ, నువ్వు వాళ్ల మధ్యనే మసల వలసి వచ్చినప్పటికీ, వాళ్ళని ఏవగించుకోకుండా ఉండటమే నిజమైన నైతిక శిక్షణ. వారి కోసం పనిచెయ్యి. అలాగని వారి ప్రలోభాల్లో పాలుపంచుకోకు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకింత ఎత్తునుంచి పరికించినప్పుడు. ఈ మాటలు (7: 48) వినండి:

నువ్వు మనుషుల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఈ ప్రాపంచిక విషయాల్ని పైనుంచి చూస్తున్నట్టుగా భావించు. వాళ్ళ సమావేశాలు, సైన్యాలు, సేద్యం, కాయకష్టం, పెళ్ళిళ్లు, ఒప్పందాలు, పుట్టుకలు, చావులు, న్యాయస్థానాల గోల, ఎడారులు, ఆటవిక తెగలు, విందులు, విలాపాలు, విపణివీథులు- అన్నీ కలగలిసి కనిపిస్తాయి, పరస్పర విరుద్ధాలైన విషయాలు చక్కగా ఒకదానితో ఒకటి శ్రుతికుదురుకున్నట్టుగా కనిపిస్తాయి.

కాబట్టి మనిషి ఆరాటపడవలసింది ప్రపంచం గురించి కాదు, ముందు తన గురించి. తాను మంచివాడు కావడం ఎట్లా?  అందుకే ఆయన స్పష్టంగా ఇలా ( 7:15) చెప్పుకున్నాడు:

ఎవరు ఏం చెప్పనీ, ఏమి చెయ్యనీ, నేను మాత్రం మంచిగా ఉండి తీరాలి. బంగారమో, మరకతమో, మాణిక్యమో ‘ఎవరు ఏమననీ, ఏం చెయ్యనీ, నేను మాత్రం మరకతంగానే ఉంటాను, నా రంగు నేనే అట్టేపెట్టుకుంటాను’ అని అనుకుంటున్నట్టుగా.

కాని ఆ మంచితనం ప్రపంచాన్ని పట్టించుకోకపోవడం వల్ల వచ్చేది కాదు. ప్రపంచాన్ని పట్టించుకో. ప్రపంచ అభిప్రాయాన్ని పట్టించుకోకు-ఇదీ అరీలియస్ పదే పదే తనకి తాను చెప్పుకుంటున్న విషయం. నలుగురికోసం పనిచెయ్యడం ఒక బాధ్యతగా కాదు, అది ప్రేమగా పర్యవసించాలని ఆయన తనకి తాను పదే పదే గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. ఈ మాటలు (7:13) చూడండి:

మంచి చెయ్యడం దానికదే ఒక ప్రయోజనంగా నిన్ను సంతోషపరచడంలేదంటే నువ్వింకా దాన్ని ఒక బాధ్యతగా నెరవేరుస్తున్నావే తప్ప, నీ పట్ల నువ్వు దయ చూపించుకోవట్లేదని అర్థం.

ఎటువంటి మాట! తోటిమనిషికి మరే ప్రతిఫలాపేక్ష లేకుండా మంచి చెయ్యడం అనేది మన పట్ల మనం దయ చూపించుకోవడం అట. భక్తి, జ్ఞాన, కర్మ యోగాలు ఇంతగా మేళవించిన మరొక వాక్యం కనలేము.

అటువంటి జ్ఞానికి కూడా ఆందోళన ఉంటుందా? ఉంటుందట. కాని ఒకే ఒక్క ఆందోళన. ఈ మాటలు (7:20) వినండి:

నన్ను కలతపెట్టేది ఒకటే విషయం. ఎప్పుడైనా మనిషి ప్రకృతికి విరుద్ధమైంది ఏదన్నా చేస్తానేమో అని భయం. లేదా ఏదైనా చెయ్యకూడని విధంగా చేస్తానేమో అని లేదా చెయ్యకూడని వేళలో చేస్తానేమో అని.

చెయ్యకూడని పని, చెయ్యకూడని పద్ధతి, చెయ్యకూడని సమయం- మనిషి విషాదానికి లోనయితే ఈ మూడింటివల్లనే. అందుకే బైరాగి అన్నాడు. ‘దేవా, క్షమించు మమ్మల్ని,  చేసినవి చేసినందుకు, చేయనవి చేయనందుకు’ అని. ఎరుక ఉన్నప్పటికీ మనిషి ఎందుకు ఈ తప్పులు చేస్తాడు? మానసిక కల్పనలవల్ల, ఊహాగానాలవల్ల.  ఏడవ అధాయంలో ఒక ఎంట్రీ భావగర్భితంగా, నర్మగర్భితంగా, ఆయన ఏదో వ్యక్తిగత సందర్భంలో రాసుకున్నట్టుగా కనిపిస్తుంది, కాని అదిమనందరికీ కూడా వర్తించేదే. ఆ వాక్యాలు (7:17) చూడండి:

సంతోషం గొప్ప దైవం. లేదా గొప్ప విషయం; కాని ఊహాగానమా? నువ్విక్కడేం చేస్తున్నావు? పో, ఇక్కణ్ణుంచి. దేవుళ్ళను వేడుకుని మరీ చెప్తున్నాను, ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. నాకు నీ అవసరం లేదు. నువ్వింకా పాతపద్ధతిలో వస్తూనే ఉన్నావు. అయినా నాకు నీమీద కోపం లేదు. దయచేసి వెళ్ళిపొమ్మని మాత్రమే చెప్తున్నాను.

ఇది చాలా ఆశ్చర్యకరమైన పేరాగ్రాఫు. ఒకరకంగా చెప్పాలంటే అరీలియస్ రాసుకున్న ఒక వర్క్ షీటు. పొరపాటున ఆయన పుస్తకంలో పెట్టుకుని మర్చిపోతే మనకి చేరిందని అనుకోవచ్చు. వర్క్ షీటు అంటే ఆయన తనని తాను  నియంత్రించుకోవడానికి ఏ ఆధ్యాత్మిక అభ్యాసాలు చేసుకున్నాడో అటువంటి ఒక అభ్యాస పత్రం అన్నమాట. మనిషి మనసుని మలినపరిచేది ఊహాగానమే అనడంలో ఏ సందేహమూ లేదు. మనవాళ్ళు శమదమాలు అనే రెండు మాటలు వాడారు. శమము అంటే సుఖాల గురించి ఊహలు, పరికల్పనలు చేయకుండా ఉండే మనఃస్థితి. దమము అంటే గతంలో ఊహలద్వారా గాని, లేదా చేతల ద్వారా గాని మనం పొందిన సుఖాన్ని మళ్ళీ మళ్లీ తలచుకోకుండా ఉండే మనఃస్థితి. సుఖాల గురించిన ఊహలే సంతోషాన్ని కలుషితపరుస్తాయనేది ఎంతో అభ్యాసం చేసినవాడికి గాని స్ఫురించని అంతర్దృష్టి.

మరి సంతోషం ఎక్కడుంది? ఎలా లభిస్తుంది? అందుకు నీలోకి నువ్వు తవ్వుకో అంటున్నాడు, ఈ మాటల్లో (7:59):

నీలోతుల్లోకీ తవ్వుకుంటూ పో. నువ్వు తవ్వుకుంటూ పోయే కొద్దీ ఏ క్షణమైనా ఉప్పొంగడానికి సిద్ధంగా ఉన్న మంచితనపు ఊట ఒకటి ఉంది నీలో, చూసుకో.

లోపలకి ప్రయాణించడం, లోపలకి మరలడం, అంతరంగ విహారం, లోచూపు, అంతరంగాన్ని ఆశ్రయించడం- ఎన్ని పేర్లతో వివరించినా ఇదే ఆయన పదే పదే చెప్పేది. అది నీనుంచి ఎవరూ కొల్లగొట్టలేని ఆస్తి. ఈ మాటలు (7:63) చదవండి:

తత్త్వవేత్త ప్లేటో అన్నట్టుగా నీ సమ్మతి లేకుండానే నీ  సత్యాన్ని ఎవరూ కొల్లగొట్టలేరు. ఇదేమాట న్యాయానికీ, సమదృష్టికీ, ఔదార్యానికీ ప్రతి ఒక్క విలువకీ వర్తిస్తుంది. ఇదెప్పటికీ గుర్తుపెట్టుకో, అప్పుడే మనుషుల్తో మరింత సౌమ్యంగా మసలడం నేర్చుకుంటావు.

దీన్ని మనవాళ్ళు అసిధారావ్రతం అన్నారు. అంటే కత్తి అంచుమీద నడవడం. అరీలియస్ దీన్ని కుస్తీపట్టడం అన్నాడు. ఆయన స్వయంగా రాజు, సేనాధిపతీ కాబట్టి చాలాసార్లు యుద్ధపదజాలం వాడటంలో ఆశ్చర్యం లేదు. జీవితకళ అంటే నీతో నువ్వు తలపడటమే. ఈ మాటలు (7: 61) చూడండి:

జీవించడం అనే కళ నాట్యం కన్నా కూడా కుస్తీకి దగ్గరగా ఉండే విద్య. నువ్వు సదా సంసిద్ధుడివిగా ఉండాలి, ఎప్పుడు హటాత్తుగా ఏ వేటుపడుతుందోనని ఏమరుపాటులేకుండా చూసుకోవాలి.

ఆశ్చర్యం లేదు. ఈ విషయంలో అరీలియస్ చీనా యుద్ధతంత్రవేత్త సన్-జు కి దగ్గరగా వస్తాడు. అలాగని మల్లయుద్ధంలోనో, యుద్ధంలోనో గెలిచినంతమాత్రాన నీ మీద నువ్వు పూర్తిగా ఆధిపత్యం సంపాదించినట్టు కాదు. స్పార్టాలో ఒకప్పుడు ఒక మల్లయోధుడు ఉండేవాడట. ఒకసారి మల్లయుద్ధంలో అతడి ప్రత్యర్థి అతణ్ణి ఓడించాడు. అప్పుడెవరో అతడితో అతడి ప్రత్యర్థిని గొప్పవాడని ప్రశంసించారట. ఆ మాటలు విని ఆ మల్లయోధుడు తల అడ్డంగా ఊపి, ‘అతడు నన్ను కింద పడెయ్యడంలో మాత్రమే గొప్పవాడు’ అన్నాడట. అరీలియస్ ఆ సంఘటన దృష్టిలో పెట్టుకుని ఇలా (7: 52) రాసుకున్నాడు:

ఆఁ!. కిందపడెయ్యడంలో మాత్రమే గొప్పవాడు. కాని నలుగురినీ కలుపుకుని పోగలగడంలో కాదు, వినయంలో కాదు, తనకి ఎదురయ్యే ప్రతి ఒక్కదాన్నీ సహించగలగడంలో కాదు, ఇతరుల తప్పులు వెతక్కుండా ఉండటంలో కాదు.

మన చదువులు, మన ఉద్యోగం, మన పరిజ్ఞానం, మన వాక్చాతురి మనకి ఇదే నేర్పుతున్నాయి, ఎదుటివాణ్ణి కిందపడేయడం ఎలా అన్నదే. కాని తక్కినవి నేర్పడం లేదు- నలుగురినీ కలుపుకుని పోగలడం ఎలా అన్నది, ప్రతికూలతల్ని సహించడం ఎలా అన్నది, ఇతరుల తప్పులు వెతక్కుండా ఉండటం ఎట్లా అన్నది.

మనం చాలా తొందరగా లోనుకాగల బలహీనత మనుషుల్ని విమర్శించడం. వాళ్ళ తప్పొప్పుల జమాకర్చు రాయడం. కాని ఇందుకు మనం చెప్పుకునే సమర్థన ఏమిటంటే, నేను మంచివాణ్ణేగాని వాళ్ళు నన్ను ఆ స్థితికి తీసుకువస్తున్నారు, నేనేం చెయ్యను అని. కాని సరిగ్గా ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలంటాడు అరీలియస్. ఈ మాటలు (7:65) చూడండి:

మానవద్వేషులు మనుషుల్ని ద్వేషించినట్టుగా నువ్వు మానవద్వేషిని ద్వేషించకు.

ఇటువంటిదే మరొక మాట, ఆరవ అధ్యాయంలో కూడా (6:6) ఉంది.

నీ శత్రువు మీద నువ్వు తీర్చుకోగల గొప్ప ప్రతీకారం నువ్వు వాడిలా ఉండకపోవడమే.

అందుకనే ఈ మాటలు (7:71) కూడా రాసుకున్నాడు:

నీ బలహీనతల్నించి తప్పించుకోగలిగీ తప్పించుకోకపోవడం హాస్యాస్పదం. కాని నీ పక్కవాళ్ళ బలహీనతలనుంచి తప్పించుకోడం మాత్రం అసాధ్యం.

ఇది స్టోయిక్ వైఖరి సారాంశం. ప్రతి ఒక్క వస్తువుకీ, విషయానికీ, ప్రవర్తనకీ రెండు హాండిళ్లు ఉంటాయి, ఒకటి నువ్వు పట్టుకోగలిగిందీ, రెండోది నువ్వు పట్టుకోలేనిదీ అంటాడు ఎపిక్టెటస్. కాబట్టి నువ్వు పట్టుకోగలిగే హాండిలు తోనే దాన్ని పట్టుకోవడం మంచింది కదా అంటాడు. మానవసంబంధాలనే పాత్రకి రెండు అంచెలుంటే ఒకటి నువ్వు, రెండవది నీ పక్కవాడు. నువ్వు పట్టుకోగలిగిన అంచు మీద దృష్టిపెడితే, కనీసం ఒకవేపేనా అది తొణక్కుండా ఉంటుంది కదా.

ఇటువంటి అవగాహన తనలో నిలుపుకోడానికి అరీలియస్ జీవితకాలం సాధన చేసాడని ఈ వాక్యాలు (7: 67) సాక్ష్యమిస్తాయి:

..ఎప్పుడూ ఒకటి మనసులో పెట్టుకో. సంతోషంగా జీవించడానికి కావలసిన సామగ్రి చాలా స్వల్పం. నువ్వొక శాస్త్రవేత్తవో లేదా తత్త్వవేత్తవో కాలేకపోయావు కాబట్టి ఆశ వదులుకోకు. స్వతంత్రుడిగా ఉండటం, వినయంగా మసులుకోవడం, నలుగురితో కలిసి నడవడం, దేవుడికి విధేయుడిగా ఉండటం- ఇవి ఎప్పటికీ నీ చేతుల్లో ఉన్నవే.

అది నువ్వొక పారిజాతం మొక్కని నాటుకోవడం లాంటిది. ప్రపంచాన్ని మార్చగలవో లేదో, ప్రభాతాన్ని సుందరతరం చేసుకోవడం మాత్రం నీ చేతుల్లో ఉన్నదే. నీ ప్రకృతీ, బయటి ప్రకృతీ ఈ రెండింటి మధ్యా ఒక పవిత్రబంధం ఉంది. అది సమస్త సృష్టి కూడబలుక్కుని నీ కోసం ఒక పారిజాతం పుష్పించేలాగా చెయ్యగలగడం.

8-11-2022

Leave a Reply

%d bloggers like this: