మెడిటేషన్స్-8

మెడిటేషన్స్ మీద నా వ్యాసాలు చదువుతున్న ఒక మిత్రురాలు నన్ను ఇలా అడిగింది:

‘జీవితాన్ని సంతృప్తికరంగా, సార్థకంగా ఉంచే పనులు చెయ్యాలి. నిజమే, కాని దీనిలోనే సంతృప్తి, సార్థకత ఉందని ఎలా తెలుస్తుంది? మనసు ఒక చోట స్థిరంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి? ఎరుక ఉండాలి. కానీ, ఆ ఎరుక ఎప్పటికీ అలానే ఉండాలంటే ఏమి చెయ్యాలి? మనక్సుకు తెలుసు ఈ విషయాలన్నీ. చదివినప్పుడు, conscious గా ఉన్నప్పుడు బాగానే అనిపిస్తుంది. అది అచేతనావస్థలో కూడా దృఢంగా నాటుకుపోవాలంటే అమి చెయ్యాలి? రోజూ వీటిని చిన్నప్పుడు ప్రతిజ్ఞ చెప్పినట్టు చదువుకోవాలా? కానీ, ప్రతిజ్ఞ దాదాపు 15 సంవత్సరాలు చెప్పినా దానిని పాటిస్తున్నామా? లేదు కదా, ఎప్పుడూ ఎరుకతో సహవాసం చెయ్యడం ఎలా? ‘

ఈ ప్రశ్నలు చదివి కొంతసేపు నేను నితుత్తరుడిగా ఉండిపోయాను. ఆమెకు ఏమని చెప్పాలి? చివరికి, ఇలా జవాబిచ్చాను:

‘ఈ ప్రశ్నలు నావి కూడా. అందుకే మెడిటేషన్స్ చదువుతున్నాను’ అని.

సత్యం తెలియడం వేరు, అది జీవితంలో ఆచరణకు రావడం వేరు. తెల్లవారుజామున నిద్రలేవడం మంచిదని తెలియడం వేరు. లేవడానికి అలారం పెట్టుకోవడం వేరు. నిజంగా లేవడం వేరు. కాని గీత, దమ్మపదం, తిరుక్కురళ్, సువార్తలు, సుభాషితాలు నువ్వు ఆ ప్రయత్నం వదలకు అని చెప్తాయి. నిన్ను నువ్వు పదే పదే హెచ్చరించుకుంటో, గుర్తుచేసుకుంటో ఉండు అని చెప్తాయి. ఈ విషయం మార్కస్ అరీలియస్ కి బాగా తెలుసు. అందుకనే ఆయన ప్రతిరోజూ, యుద్ధక్షేత్రంలో కూడా తనని తాను మందలించుకుంటూనే ఉన్నాడు. మనిషిని ఇటువంటి శీలంవైపుగా తిప్పే విద్యని ఆయన philosophy అని అన్నాడని గుర్తుపెట్టుకుంటే, అయిదవ అధ్యాయంలో రాసుకున్న ఈ మాటలు పదేపదే గుర్తుచేసుకోదగ్గవి. ఆయనిలా అంటున్నాడు:

ప్రతి ఒక్కటీ నువ్వనుకున్న సూత్రాల ప్రకారం, నియమాల ప్రకారం చెయ్యలేకపోతే అందుకు నిరుత్సాహపడకు, అసంతృప్తిచెందకు, నిస్పృహకు లోనవకు. నువ్వనుకున్నట్టు చెయ్యలేకపోయావా మళ్ళా మొదలు పెట్టు, ఆ ప్రయత్నంలో నువ్వు చాలావరకూ నీ మానవత్వాన్ని కాపాడుకోగలిగితే సంతోషమే. అసలు పదే పదే అలా వెనక్కి రావడాన్నే ఇష్టపడు. శీలవంతమైన జీవితం గురించిన నీ ఆలోచన తనకి చదువుచెప్పే ట్యూటరు దగ్గరికి పిల్లవాడు వచ్చినట్టుగా ఉండకూడదు. అది కళ్ళకలక వచ్చినప్పుడు మందు వేసుకుంటావే అలా ఉండాలి, లేదా దూదితో కళ్ళు అద్దుకుంటావే అలా, లేదా ఇంత చన్నీళ్ళతో కళ్ళు కడుక్కుంటావే, అలా ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నీ వివేచనని తప్పి ఎప్పటికీ నడవలేవు. దానిలోనే నీకు స్తిమితం చిక్కుతుందని గుర్తుపెట్టుకో. 

ఈ మాటలు నాకు చాలా నచ్చాయి. మనం పూర్తిగా పాటించగలిగినా, పాటించలేకపోయినా కూడా మనకై మనం పెట్టుకున్న ఆ శీలపారమితలోనే మనకి నిజమైన తృప్తి, ధైర్యం, నిలకడ అని మనం గుర్తుపెట్టుకోవాలి. శీలవిద్య మనం ట్యూషన్ లాగా పదే పదే చెప్పించుకోవలసింది కాదు. పదే పదే మనకు మనం చెప్పుకోవలసింది. అది కలకపడ్డ మన కళ్ళకి స్వస్థత నిచ్చే మందు అనుకున్నప్పుడు పదేపదే అప్రయత్నంగా మన చేతులు ఆ మందుకోసం వెతుక్కుంటాయి.

ఆయన ఇంకా ఇలా (5:31) అంటున్నాడు:

నువ్విప్పటిదాకా దేవతలతో, నీ తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, పిల్లలతో, గురువులతో, నీ చిన్నప్పుడు నిన్ను పెంచిపెద్దచేసినవాళ్ళతో నీ స్నేహితులతో, నీ బంధువులతో, నీ సేవకులతో ఎలా ప్రవర్తిస్తూ వచ్చేవు? ఇప్పటిదాకా వాళ్ళని మాటల్లోగాని చేతల్లోగాని ఇసుమంత కూడా కష్టపెట్టకుండా ఉన్నావా? ఇంతదాకా నువ్వు ఎన్ని అనుభవాల గుండా నడచుకుంటూ వచ్చేవో గుర్తుతెచ్చుకో, నువ్వింతదాకా ఎన్ని అనుభవాలు సహించావో అదంతా గుర్తుతెచ్చుకుంటే నీ కథ పూర్తిగా చెప్పుకున్నట్టే, నీ ఉద్యోగబాధ్యత పూర్తయినట్టే. ఎన్ని సార్లు నువ్వు సౌందర్యాన్ని చూసావో, ఎన్ని సుఖదుఃఖాల పట్ల తితిక్షవహించగలిగావో, ఎంత కీర్తి వదులుకోగలిగావో, నీ పట్ల క్రూరంగా ప్రవర్తించినవారి పట్ల ఎంత కనికరం చూపగలిగావో అదంతా గుర్తుతెచ్చుకో.

ఈ వాక్యాల్లో నాకు కనిపించిన అర్థమేమిటంటే, మనం శీలవిద్యని సాధనచేసుకోలేకపోతున్నామని అనుకుంటున్నాం కాని, నిజానికి మన జీవితాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుంటే, మనం నిజంగా శీలవంతులుగా గడిపిన క్షణాలు తక్కువేమీ కాదనిపిస్తుంది. నిజానికి ఆ తలపు మనల్ని మరింత శీలవంతులుగా జీవించడానికి ప్రోత్సాహమిస్తుందనిపిస్తుంది. డా.కలాం ఆత్మకథ చదివినప్పుడు నాకు అనిపించింది ఇదే. కలాం తన జీవితంలో తాను ఎవరెవరిపట్ల కృతజ్ఞుడిగా ఉండాలో ఆ క్షణాల్నీ, ఆ అనుభవాల్నీ పైకెత్తి చూపినందువల్లనే ఆ రచన మనకెంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నది.

సరిగ్గా ఈ మాటల దగ్గరనుంచే మనం ఆరో అధ్యాయంలో అడుగుపెట్టవచ్చు. ఈ వాక్యాలు (6:11) చూడండి:

చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను కలతపెడుతున్నట్టయితే సత్వరమే నీలోకి మరలిపో. నువ్వు భరించలేనంతగా సహించవలసిన పనిలేదు. తిరిగి తిరిగి నీలోకి చూపుసారించడంద్వారానే నువ్వు మరింత పట్టుచిక్కించుకుంటావు.

ఆరవ అధ్యాయం పెద్ద అధ్యాయం. అందులో చాలా వాక్యాలు ఎన్నో శతాబ్దాలుగా జిజ్ఞాసువుల్ని ఆకర్షిస్తూనే వున్నాయి. కొన్ని వాక్యాల గురించి మనం ఎంత సేపనా మననం చేయవచ్చు. ఉదాహరణకి  నేను నా మొదటివ్యాసంలో ఎత్తి రాసుకున్న వాక్యాల్లో  6:30  చివరి వాక్యాలు- ఈ పార్థివ జీవితానికి ఒకటే ఫలం-మనసు నిర్మలంగా ఉంచుకోవడం, నలుగురికీ పనికొచ్చే పనులు చేయడం.అన్న వాక్యాలే చూడండి. ఈ భూమ్మీద జీవించినందుకు మనకు లభించే ఒకే ఒక్క పంట మనసుని నిర్మలంగా ఉంచుకోవడం, నలుగురికి పనికొచ్చే పనులు చెయ్యడం-అంటున్నప్పుడు అరీలియస్ మనిషి తాలుకు బాధ్యత గురించి మాట్లాడుతున్నాడు కాని ఆ బాధ్యత ఉద్యోగ బాధ్యత కాదు. నిజానికి ఆయన తన రచనలో ఎక్కడా కూడా రాజుగా తాను నిర్వహించవలసిన, నిర్వహించిన బాధ్యతల గురించి మాట్లాడడు. ఆయన దృష్టిలో మనిషి నెరవేర్చవలసిన అతి  పెద్ద బాధ్యత తన పట్ల తాను నెరవేర్చుకోవలసిన బాధ్యత. తనను తాను ఎల్లప్పుడూ నిర్మలంగా నిలుపుకోవడం. శీలవంతుడు కాగలడం, మంచివాడిగా మారడం.

మనసుని నిర్మలంగా ఉంచుకోవడం, నలుగురికి పనికొచ్చే పనులు చెయ్యడం అనే రెండు పార్శ్వాల్లో కూడా ఆయన దృష్టి ఎంతసేపూ మనసుని నిర్మలంగా ఉంచుకోవడం మీదనే అధికంగా ఉంది అని చెప్పవచ్చు. నలుగురికోసం పనిచెయ్యడం కూడా నిర్మలమైన మనస్సునుంచే రావాలి అని ఆయన భావించాడు. అందుకే ఏదో ఒక జీవికకోసం చేసే ఉద్యోగాన్ని, అది చివరికి రోమన్ సామ్రాజ్యాన్ని నడపడమైనా కూడా, దాన్ని ఆయన జీవితపరమార్థంగా భావించలేకపోయాడు. ఈ మాటలు (6:12) చూడండి:

నీకు ఏకకాలంలో సవతితల్లీ, తల్లీ కూడా ఉన్నట్లయితే నువ్వు నీ సవతితల్లి పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తావు, కాని నీ తల్లినే ప్రేమిస్తావు. రాజాస్థానమూ, తత్త్వశాస్త్రమూ నీకు సవతితల్లి, తల్లి లాంటివి. పదే పదే శీలవిద్యలో తలదాచుకో. అది నీ రాజోద్యోగం తాలూకు అనుభవాల్ని భరించగలిగేవిగా మారుస్తుంది, అలాగే నిన్ను కూడా నీ తోటి ఉద్యోగులు భరించగలిగేవాడిగా మారుస్తుంది.

గ్రీకు, రోమన్ కథల్లో, మన కథల్లోలాగానే, సవతితల్లి క్రూరత్వానికి ప్రతీక. ఆయన రాజుగా తన బాధ్యతల్ని సవతితల్లితో పోల్చడం గమనించదగ్గది. ఆ మాట చదవగానే నాకు నా ఉద్యోగమే గుర్తొచ్చింది. ఉద్యోగం చేసినన్నాళ్ళూ నేను కూడా ఆ ఉద్యోగ బాధ్యతల్ని ఎంత ప్రేమించినా, అది సవతితల్లిని మర్యాదగా చూసుకోవడమేనని ఇప్పటికి గ్రహిస్తున్నాను. తత్త్వశాస్త్రం, అంటే శీలవిద్య, లేదా నీ ఆత్మవిద్య లేదా నీ అంతరంగవిహారం నీకు ప్రపంచాన్ని భరించదగ్గదిగా మార్చడం సరే, అంతకన్నా గొప్పమాట, ప్రపంచం నిన్ను భరించదగ్గదిగా మారుస్తుందనడం.

తాను సమాజం పట్ల చూపించవలసిన బాధ్యత, తన పట్ల తాను చూపించుకోవలసిన బాధ్యత- ఈ రెండింటి మధ్యా ఉన్న భేదాన్ని ఉపనిషత్తులు కూడా పట్టుకున్నాయి. మొదటిదాన్ని అవి పరావిద్య అన్నాయి. కొన్నిసార్లు అవిద్య అని కూడా అన్నాయి. కాని మనిషి తన గురించి తాను తెలుసుకోవడాన్ని మాత్రమే విద్య అన్నాయి. లోకం పట్ల తాము చాలా బాధ్యత చూపిస్తున్నామనుకునేవాళ్ళు తమ సంకల్పాలు ఎక్కణ్ణుంచి పుడుతున్నాయో గ్రహించుకోవలసి ఉంటుంది. ‘నేను చేస్తున్నాను’ అనే భావన ‘నేను కాబట్టి చేస్తున్నాను’ అనే స్వాతిశయంగా మారడానికి ఆట్టే సేపు పట్టదు. అరీలియస్ ఇలా (6:13) అంటున్నాడు:

నువ్వు జీవితమంతా సాధన చేయవలసిన విషయం ఒకటుంది. విషయాలు నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు వాటిని నగ్నంగా చూడటానికి ప్రయత్నించు. తమ గురించి తాము స్వాతిశయంగా మాట్లాడుకుంటున్నదాన్నుంచి వాటిని బయటపడవేసి చూసుకో. వాటి హీనత్వాన్ని గమనించు. మన వివేచనని ప్రలోభపరచేవాటిలో స్వాతిశయాన్ని మించింది లేదు. నీ పని నీకు చాలా ముఖ్యం అనిపించే క్షణాలుంటాయి చూడు, ఆ క్షణాలే నువ్వు ఆ ప్రలోభానికి లొంగిపోయిన క్షణాలని గుర్తుపెట్టుకో..

అలాగని కర్మ చెయ్యకుండా ఉండలేం. ఉపనిషత్తుల విచారణ ప్రధానంగా ఈ కర్మ-జ్ఞాన ద్వంద్వం గురించే. ‘కర్మ యొనర్చమొడమెలాగు, ఈ బాధ్యత కఠిన తరం’ అంటాడు బైరాగి. అయిదవ అధ్యాయంలో అరీలియస్ ఒక మాట (5: 36) రాసాడు:

నువ్వు ఎదటి వాళ్ళ కష్టాల్ని మరీ ఎక్కువగా ఊహించుకుని వాటిలో పడి కొట్టుకుపోకు. నువ్వు ఎంత చేయగలవో, నీకు ఎంత చాతనవుతుందో అంతే చెయ్యి, ఒకవేళ వాళ్ళు శోకిస్తున్నది మరీ ఏమంత ముఖ్యమైన విషయం కాకపోయినా సరే నువ్వేమి చెయ్యగలవో అదంతా చెయ్యి.. కాని ఆ నష్టం నీకు సంభవించిన నష్టంగా భావించకు. అలా భావిస్తే అది పొరపాటు. గుర్తుందా, ఆ నాటకంలో ఆ ముసలాయన తన పెంపుడుకొడుకు ఆడుకుంటున్న బొంగరాన్ని తిరిగి తీసుకువస్తాడు చూడు, అది వట్టి బొంగరమే, బొమ్మనే అని తెలిసినా కూడా-అలాగ అన్నమాట.

సందేశం చాలా సరళంగానూ, స్పష్టంగానూఉ ఉంది. నువ్వు పనిచెయ్యాలి. నలుగురికోసం పనిచెయ్యాలి. వాళ్ళ కష్టాలు నీ దృష్టిలో కష్టాలు అయినా, కాకపోయినా సరే. అలాగని ఆ కష్టాల్ని నువ్వు నీ మనసులోకి తీసుకోకూడదు. పిల్లవాడి బొంగరం పోగొట్టుకుంటే వెతికి తెస్తావే, అలాగ, అంటే, అది పిల్లవాడికి చాలా ముఖ్యం, కాని, నీకు తెలుసు అది బొంగరం మాత్రమే అని.

ఈ స్పష్టతకి వచ్చాక, పనులు చెయ్యడం చాలా సులభం. ఈ స్పష్టత, దీన్నే భగవద్గీత ‘జ్ఞానం’ అంది, అరీలియస్ దీన్ని దేవుడు, వివేచన, సత్యం, logos అనే రకరకాల పేర్లతో వ్యవహరిస్తాడు. ఏ పేరుతో సూచిస్తేనేం? ఆయన ఈ మాటలు (6:7) రాస్తున్నప్పుడు గీతాకారుడిలానే మాట్లాడుతున్నాడు:

ఆ ఒక్కటే నీకు సంతోషం, సుఖం కావాలి. దృష్టి భగవంతుడి మీద పెట్టుకుని ఒక సామాజిక కర్తవ్యం నుంచి మరొక సామాజిక కర్తవ్యానికి ప్రయాణించడం.

ఇక్కడ భగవంతుడు అంటే నిర్మలమైన అంతరంగం. నిర్మలమైన అంతఃకరణ, సమాజసేవ- ఇవి రెండూ విడి విడి అంశాలు కావు. ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు. అందుకనే బైరాగి ఇలా (నూతిలో గొంతుకలు: హేమ్లెట్ స్వగతం) అంటున్నాడు:

శుద్ధ కర్మ జ్ఞానాగ్నిని ప్రజ్వరిల్ల చేయగలదు

జ్ఞ్నానవహ్ని కర్మలనూ తేజరిల్ల చేయగలదు

కర్మకు, జ్ఞానానికి శ్రుతి కుదిరినపుడు

ఎగిరే విహంగాలకుండదు ఆవేదన

సంశయాన్ని చూసి స్వేచ్ఛ బెదరనపుడు

మానవుని కుండదు తనతో వాదన.

ఇప్పుడు మళ్ళా నా స్నేహితురాలు అడిగిన ప్రశ్న దగ్గరికి వద్దాం. ఎప్పుడూ ఎరుకతో సహవాసం చెయ్యడం ఎలా? అని అడిగింది ఆమె. ఆమెకన్నా ముందు అరీలియస్ తనకి తానే ఈ ప్రశ్న వేసుకున్నాడు. అందుకనే ఇలా (6:23) రాసుకున్నాడు:

జంతువులకి ఎరుక లేదు. అలాగే వస్తువులకీ, విషయాలకీ కూడా. అందుకని వాటిపట్ల ఔదార్యం చూపించు. మనుషుల విషయానికి వస్తే, వాళ్ళకి వివేచన ఉంది, కాబట్టి, వాళ్ళ పట్ల సాంఘికబాధ్యత చూపించు. ప్రతి ఒక్క సందర్భంలోనూ దేవుళ్ళని తలుచుకుంటూ ఉండు. ఎంతకాలం పాటు ఇలా నడుచుకుంటూ ఉండగలవని చింతించకు. పూర్తి ఎరుకతో మూడుగంటల పాటు గడిపినా చాలు.

ఈ మాటలు నాకు కన్ ఫ్యూసియస్ ను గుర్తుతెస్తున్నాయి. ఆయన ఇలా (అనలెక్ట్స్, 4:8) అన్నాడు:

ఆ దారి ఎటువంటిదో పొద్దున్న తెలిస్తే, సాయంకాలానికల్లా ఈ లోకం నుంచి నిశ్చింతగా సెలవు తీసుకోగలను.

కాబట్టి అరీలియస్ ఇలా (6: 19)స్పష్టంగా చెప్పుకున్నాడు:

నీకు ఏదైనా పని దుస్సాధ్యమని అనిపించినప్పుడు అది మనుషులందరికీ అసాధ్యమని అనుకోకు. ఏ మనిషికైనా తన స్వభావం ప్రకారం సాధ్యం కాగల పని నీకు కూడా సాధ్యమే నని తెలుసుకో.

ఎందుకంటే మనుషులందరినీ కలుపుతున్న ప్రకృతి ఒకటే. కావలసిందల్లా ఓపిక పట్టడం. తిరిగి తిరిగి తన అంతరంగాన్ని శరణుజొచ్చడం. మరొకచోట ఇలా (6:21) అంటున్నాడు:

నేను సరిగ్గా ఆలోచించలేకపోతున్నాననీ, సరిగ్గా ప్రవర్తించలేకపోతున్నాననీ ఎవరైనా నన్ను ఒప్పించగలిగితే సంతోషంగా నన్ను మార్చుకుంటాను. నాకు కావలసింది సత్యం. సత్యం ఏ మనిషినీ గాయపరచదు. కాని ఎవడు తన అజ్ఞానానికే అంటిపెట్టుకుని ఉంటాడో వాడికి గాయాలు తప్పవు.

కాబట్టి ఆ వెంటనే ఇలా (6:22) అనుకున్నాడు:

నేను నా పనిచేసుకుపొతాను. తక్కినవాటితో నాకు నిమిత్తం లేదు. ఎందుకంటే తక్కినవన్నీ అయితే నిర్జీవాలు లేదా, ఎరుకలేనివి అదీ కాదా దారితప్పినవి.

ఆరవ అధ్యాయానికి సారాంశ ప్రాయంగా చెప్పదగ్గ వాక్యాలుగా ఈ మాటలు(6:39) కనిపిస్తున్నాయి:

నీ జీవితం ఎక్కడ కొనసాగవలసి ఉందో ఆ పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకో. ఏ మనుషుల మధ్య నీ జీవితం గడపవలసి వస్తే వారినే ప్రేమించు, అలాగని ఏదో మామూలుగా కాదు, హృదయపూర్వకంగా ప్రేమించు.

8-11-2022

One Reply to “”

  1. శరీరము పార్థివము
    జీవితమొక ప్రయాణం
    చింతన పారమార్థికం

    మీకవితాత్మక ఆధ్యాత్మిక భావనలు
    ఆస్వాద్యములు. చింతనామృత గుళికలు

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%