మెడిటేషన్స్-7

Reading Time: 5 minutes

నా చిన్నప్పుడు తాడికొండలోనూ, ఆ తర్వాత సాగర్ లోనూ పొద్దున్నే అయిదింటికి నిద్రలేపేసేవాళ్ళు. ఆ తర్వాత గంట సేపు వ్యాయాయం ఉండేది. ఇక ఆ తర్వాత రాత్రి పడుకునేదాకా నిముషం కూడా విరామం ఉండేది కాదు. ఆ తర్వాత ఏళ్ల తరబడి నేను పొద్దున్న పూట లేవకపోవడం ఒక వ్రతంగా జీవించేను. రాజమండ్రిలో ఉన్నంతకాలం రాత్రి చాలా సేపటిదాకా కబుర్లు చెప్పుకుని ఇంటికి వచ్చి పడుకున్నాక పొద్దున్న తొమ్మిదింటిదాకా లేచేవాణ్ణి కాను. ఆ తర్వాత ఉద్యోగ జీవితంలో కూడా చాలాకాలం పాటు రాత్రి పొద్దు పొయేదాకా పనిచెయ్యడం, పొద్దున్న ఆలస్యంగా లేవడం అలవాటయిపోయింది. నా సహోద్యోగులు, ప్రజలు కూడా నా అలవాటుని మన్నించి వదిలెయ్యడంతో నేను చాలా కాలం అలాగే గడిపేను. కాని పొద్దుటి పూట లేవడం ఎంత అవసరమో, అది కేవలం నా శారీరిక ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, నా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంత అవసరమో తెలిసాక ఇక నన్ను నేను సంతోషంగా మార్చుకోగలిగాను. ఇప్పుడు నా రోజువారీ జీవితంలో అత్యంత శుభప్రదమైన క్షణాలేవంటే తెల్లవారు జాము వేళలనే చెప్పగలను.

తెల్లవారు జామున లేవడం ఒక నైతిక ఉద్యమం అని రాసుకున్నాడు థోరో వాల్డెన్ లో. అది నీ ‘ఇకిగాయి’ ని నిర్ణయిస్తుంది అంటారు జపనీయులు. ఇకిగాయి అంటే జీవితానికొక అర్థం. ఎటువంటి అలసట ఉండనివ్వు, కాని నిన్ను పొద్దున్నే నిద్రలేపేసేదేదో నీ జీవితానికి ఉండాలి. నా చిన్నప్పుడు మా డ్రిల్లు మాష్టారి విజిలు మమ్మల్ని నిద్రపోనిచ్చేది కాదు. కాని అది బయటి ఒత్తిడి. నీ చిన్నప్పుడు నిన్ను శారీరికంగా చక్కటి జీవితానికి శిక్షణ ఇవ్వడంలో భాగంగా నీ తండ్రినో, తల్లినో, ఉపాధ్యాయుడో నిన్ను ఒత్తిడి చేస్తాడు. కాని పెద్దయ్యాక ఆ ఒత్తిడి నీలోంచే రావాలి. నువ్వు తెల్లవారు జామునే నిద్రలేవడానికి ఆ రోజు నీకేదో ఒక ముఖ్యమైన పని ఉండాలి. ఏదో ఒక సార్థక కారణం ఉండాలి. అది ఇకిగాయి.

కాని అది కూడా రెండవ దశ. మనిషి దాన్ని కూడా దాటాలి. నువ్వు పొద్దున్నే లేవడం మరే పని కోసం కాదు, నీ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి కాదు, అసలు అన్నిటికన్నా ముందు నిన్ను సంతోషపెట్టుకోవడం కోసం, ప్రతి ప్రత్యూషానా నీకు నువ్వు ఇచ్చుకోగల కానుక కావాలి అది. ఆ మాటలే రాస్తున్నాడు మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ అయిదవ అధ్యాయంలో.

పొద్దున్నే నువ్వు బద్ధకంగా నిద్రలేస్తున్నప్పుడు, ఒకటి గుర్తుచేసుకో-నేను ఒక మనిషిగా జీవించడానికి నిద్ర లేస్తున్నాను అని చెప్పుకో. నేనెందుకు జీవిస్తున్నానో ఆ పనులు చేయడానికీ ఎందుకు ఈ ప్రపంచంలోకి కొనిరాబడ్డానో ఆ పనులు చేయడానికి నిరుత్సాహం ఎందుకు? నేను పుట్టింది ఇదుగో ఇలా వెచ్చగా పక్క మీద పడుకుని ఉండటానికేనా?

ఆ తర్వాత వాక్యాలు తనతో తనకే ఒక సంభాషణ. అతడిలో ఒకడు ఇలా జవాబిస్తున్నాడు:

కానీ ఇలా వెచ్చగా పడుకుంటే హాయిగా ఉంటుంది కదా.

అంటే నువ్వు కేవలం నీ సుఖం కోసమే బతుకుతావా? పనికోసమో, పాటు పడటం కోసం జీవించాలనుకోవా? చూడు, చిన్న చిన్న మొక్కలు, పిట్టలు, చీమలు, సాలీళ్ళు, తేనెటీగలు ఈ ప్రపంచంలో వాటివాటి సముచిత స్థానాల్ని నిలబెట్టడంకోసం అహర్నిశలు పనిచేయడం లేదా? అలాంటప్పుడు నువ్వు మనిషిగా నీకు అప్పగించిన పని చెయ్యడానికి విముఖత చూపిస్తావా? నీ స్వభావానికి అనుగుణంగా నువ్వు చెయ్యవలసిన పని చెయ్యడానికి తొందరపడవద్దా?

కానీ విశ్రాంతి కూడా అవసరం కదా.

అవసరమే. కాని ప్రకృతి దానికి కూడా కొన్ని పరిమితులు పెట్టింది, తినడానికీ, తాగడానికీ పెట్టినట్టే. అయినా కూడా నువ్వు ఆ పరిమితులు దాటి, అవసరమైనదానికన్నా ఎక్కువే వాడుకుంటున్నావు. కానీ అదే నువ్వు చెయ్యాల్సిన పనుల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చెయ్యవలసిందానికన్న తక్కువలోనే ఆగిపోతున్నావు. నీ పూర్తి సామర్థ్యంతో పని చెయ్యడమే లేదు.

ఆసక్తికరమైన ఈ అంతరంగ సంవాదం తర్వాత ఆయన తనని తానిట్లా మందలించుకుంటున్నాడు (5:2):

ఇంతకీ సంగతేమిటంటే, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం లేదు-లేకపోతే నువ్వు నీ స్వభావాన్నీ, ఆ స్వభావం నీ నుంచి ఆశిస్తున్న  ప్రయోజనాన్నీ రెండింటినీ ప్రేమించి ఉండేవాడివి.

ఇది చాలా సరైన మాట. తెల్లవారు జామున లేవటం ఒక ధార్మిక కర్తవ్యం అని థోరో అన్నాడు కాని, ఇది అంతకన్నా ఎక్కువ సన్నిహితంగా వినిపిస్తున్నది. నేను తెల్లవారు జామునే లేవడమంటే నా పట్ల నా ప్రేమని చూపించుకోవడం. ఒక పక్షిలాగా, తేనెటీగలాగా నా స్వభావం కూడా తెల్లవారుతూనే నాలో ఉన్న సామర్థ్యాలకు అనుగుణంగా ఈ ప్రపంచనిర్మాణానికి పాటుపడటం. ఈ ప్రపంచానికి సహకరించాలి కాబట్టి తెల్లవారుజామునే నిద్రలే అంటే అది ఒత్తిడి అవుతుంది. కాని అసలు తెల్లవారుజామునే లేవడం నీలోని ప్రకృతి స్వభావం కాబట్టి నిద్రలే అని చెప్పడంలో ఎంత ప్రేమ ఉంది!

ఆయన ఇంకా ఇలా చెప్పుకుంటున్నాడు:

మనుషులు తాము చేసే పనుల్ని ఇష్టపడేవాళ్ళని చూడు, వాళ్ళు తిండీ, నిద్రా పట్టించుకోకుండా, స్నానం, సంధ్య లేకుండా ఎలా పనిచేస్తుంటారో. ఒక కమ్మరి తన కొలిమి పనిని ఇష్టపడినదానికన్నా, ఒక నర్తకి తన నాట్యాన్ని ఇష్టపడినదానికన్నా, ఒక లోభి తన డబ్బుని ఇష్టపడినదానికన్నా, కీర్తికాముకుడు చిన్నపాటి కీర్తికి కూడా విలువ ఇచ్చేదానికన్నా నువ్వు నీ ప్రకృతిని, నీ స్వభావాన్ని తక్కువగా లెక్కవేసుకుంటున్నావు. వాళ్ళు చూడు, వాళ్ళ వాళ్ళ వ్యామోహాల్లో వాళ్ళెంతలా కూరుకుపోతారంటే తినడం, నిద్రపోవడం కూడా మర్చిపోతారు, తాము దేనికి అంటిపెట్టుకున్నారో అదే ధ్యాసలో గడుపుతారు. అలాంటప్పుడు సమాజంలో నలుగురికీ పనికొచ్చే పనులు చెయ్యడం నీ దృష్టిలో అంత ముఖ్యంకాదా? అంత గౌరవప్రదం కాదా? 

ఈ మాటలు మరొకరెవరేనా, అంటే ఒక కవినో, పండితుడో రాసుకుని వుంటే వాటి స్ఫురణ వేరే విధంగా ఉండేది. కాని ఒక చక్రవర్తి, తన జీవితంలో చివరి ఇరవయ్యేళ్ళు యుద్ధాల్లోనే గడుపుతూ,రాజ్యభారాన్ని నెత్తిన మోస్తూ, చివరికి యుద్ధ క్షేత్రంలోనే తనువు చాలించిన చక్రవర్తి ఈ మాటలు రాసుకున్నాడంటే అర్థం ఏమిటి? ఆయన తెల్లవారేక కూడా నిద్రలేవకుండా ఉండేవాడని అనుకోలేం. సామాజిక హితం కోసం పనిచేయడం కోసమే జీవించినవాడు ఈ మాటలు తనకి తాను హితవు గా చెప్పుకున్నాడని కూడా అనుకోలేం. కానీ ఆయన ఈ మాటలు మరొకరి కోసం రాయలేదే? మరి ఎందుకని ఈ హితవు చెప్పుకున్నాడు?

మెడిటేషన్స్ లో ఎక్కడా కూడా అరీలియస్ చక్రవర్తిగా తాను చేసిన పనుల గురించిగాని, నెరవేర్చిన కర్తవ్యాల గురించి గాని గొప్పగా చెప్పుకోలేదు. అసలు ఆ ప్రస్తావనలు కూడా దాదాపుగా తేనేలేదు. ఆయన వినయానికి అది తగినదే. కాబట్టి ఇక్కడ తన కర్తవ్యం అని చెప్పుకుంటున్నప్పుడు దేని గురించి ఆయన మాటాడుతున్నాడు?

మార్కస్ అరీలియస్ మొదటినుంచీ రెండు అంశాల గురించీ చెప్తూ వచ్చాడు. ఒకటి మనసు నిర్మలంగా ఉంచుకోవడం, రెండోది నలుగురికీ పనికొచ్చే పనులు చేయడం. ఇక్కడే ఆయన తన కాలపు తత్త్వవేత్తలందరికన్నా భిన్నంగా కనిపిస్తాడు, చివరికి స్టోయిక్కులనుండి కూడా భిన్నంగా. స్టోయిక్కులు లాజిక్, ఫిజిక్స్, ఎథిక్స్ మూడింటి గురించి మాట్లాడేరు. కాని అరీలియస్ వాళ్ళనుంచి ఎథిక్స్ ఒక్కటే తీసుకున్నాడు. తర్కమూ, మీమాంసా, ఖగోళశాస్త్రమూ లాంటివన్నీ పండితుల పని అనుకున్నాడు. తాను వాటి వెంటపడకుండా అనుగ్రహించినందుకు దేవుళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నాడు కూడా.

కాని ఎథిక్స్ విషయంలో ఆయన రెండు పార్శ్వాలు చూసాడు. ఒకటి నువ్వు నీ మనసుని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం, రెండోది ఒక సామాజిక జీవిగా జీవించడం. సామాజికంగా నలుగురికీ పనికొచ్చే పనులు చెయ్యాలన్న అతడి సంకల్పంలో, చిత్తశుద్ధిలో ఎటువంటి సందేహం లేదు. కాని సమాజం అంటే ఎవరు? ఆయన రచనల్లో తరచు ‘వాళ్ళు’ కనబడతారు. ‘వాళ్ళు’ అంటే తన చుట్టూ ఉండే వాళ్ళు, రాజోద్యోగులు, సైనికాధికారులు, బహుశా, కవులూ, పండితులూ కూడా. వాళ్ళు చాలా వరకూ అజ్ఞానంలోనే ఉన్నారనీ, వాళ్ళ మనోనైర్మల్యాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారనీ ఆయన ఎన్నో సార్లు తన ఆవేదనని నిర్మొహమాటంగా రాసుకుంటూ వచ్చాడు. నువ్వు లోకహితం కోసం పనిచెయ్యాలనుకున్నప్పుడు, లోకం అనగానే నీకు ముందు కనిపించేది వాళ్ళే. వాళ్ళ గురించి తాను పొద్దున్నే లేవాలా? వాళ్ళ గురించి ఈ రాజ్యభారం మొయ్యాలా? పైకి కనబడని ఒక నిర్వేదం ఆయన మెడిటేషన్స్ లో చాలా చోట్ల మనకి కనిపిస్తూంటుంది. నేనీ యుద్ధం ఎందుకు చెయ్యాలి అని అర్జునుడు లోనైన విషాదయోగం లాంటిదే అది కూడా. ఈ వాక్యాలు (5:11) చూడండి:

నేనిప్పుడు ఏ కర్తవ్యంకోసం నా ఆత్మకి పనిచెప్పాలి? ప్రతి సారీ నన్ను నేను ఈ ప్రశ్న వేసుకుంటూనే ఉంటాను. నన్ను నడిపిస్తున్న ఆ జీవనసూత్రం నాలో ఏ భాగంలో ఉంది? నిజానికి నాదిగా చెప్పుకుంటున్న ఈ ఆత్మ ఎవరిది? శిశువుదా? లేక యువకుడిదా లేక ఒక అబలదా లేక నియంతదా లేదా ఒక పెంపుడు జంతువుదా లేక క్రూరమృగానిదా?

‘నూతిలో గొంతుకలు’ కవితలో బైరాగి ఇటువంటి ప్రశ్ననే అడుగుతాడు:

ఆవలనున్న సాగరంలో, రజనీ నైశ్శబ్ద్యంలో

నేనెవణ్ణి? ప్రభువునా? బానిసనా?

మెదులుతున్న మాంసపు ముద్దనా? మానిసినా?

ఈ అగ్నిశిఖల్లోంచి, ఈ రక్తమఖం లోంచి

నూతన జననమా? ప్రాక్తన మరణమా?

లోకహితం కోరుకుంటున్న ఆ ‘నేను’ ఎవరు? అది తన ఆత్మలో ఎక్కడ ఉంది? అది తనవాళ్ళుగా భావిస్తున్నది ఎవరిని? ఈ వాక్యాలు (5:10:1)చూడండి:

వాస్తవాలు ఏదో తెరమాటున కప్పడిపోయినట్టు ఉన్నాయి కాబట్టే, తత్త్వవేత్తలకి, అది కూడా మామూలు తత్త్వవేత్తలు కాదు, వాళ్ళకి సత్యం పట్టుబడనట్టే అనిపించింది. చివరికి స్టోయిక్కులు కూడా సత్యాన్ని అర్థం చేసుకోవడం కష్టమని భావించారు. ఇక మన ఇంద్రియాలద్వారా మనం గ్రహిస్తున్నది కూడా నిత్యం మార్పుకు లోనయ్యేదే. అసలు మార్పుకి లోని కాని మనిషి అంటూ ఎక్కడున్నాడు? అసలు విషయాల గురించి ఆలోచించినా కూడా అవేమీ చిరకాలం నిలబడేవి కావని తెలుస్తుంది. ఎంత విలువలేనివో కూడా బోధపడుతుంది. ఆపాటి ఆలోచనలూ జ్ఞానమూ దొంగలకీ, వ్యభిచారులకీ, లైంగికబానిసలకీ కూడా వుండేవే కద! పోనీ నీతో పాటు కలిసి జీవిస్తున్న వాళ్ళ నైతికత చూద్దామా అంటే వాళ్ళ అభిప్రాయాలతో అంగీకరించడం కష్టం. అసలు వాళ్ళని భరించడమే కష్టం.

ఈ నిరాశ ఇక్కడితో ఆగలేదు. ఇంకా ఇలా (5:10:2) రాసుకున్నాడు:

ఇటువంటి చీకటిలో, మురికిలో, కాలమూ, దేశమూ కూడా నిరంతరం కదిలిపోతూకలగలిసిపోతున్న సమయంలో, నిరంతరం సంచలిస్తున్న వస్తు దృశ్య సముదాయంలో నిజంగా విలువైనదంటూ ఏదన్నా ఉందా? అసలు మనం దేనిమీదైనా నిజంగా దృష్టి పెట్టవలసి ఉందా? ఏమో! ఊహించలేకపోతున్నాను. కాని సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే మనిషి కర్తవ్యం అంటూ ఉంటే అది తనని తాను ఓదార్చుకోవడం, సహజంగానే సంభవించగల ముగింపుకోసం ఎదురుచూడటం, ఆలస్యం పట్ల అసహనం చెందకపోవడం, అన్నిటికన్నా ముఖ్యం, ఈ రెండు సూత్రాల పట్ల అచంచలవిశ్వాసంతో నిలబడి ఉండటం. ఒకటి, ప్రకృతికి, అంటే నీ ఆత్మస్వభావానికి విరుద్ధంగా నాకూ ఏదీ సంభవించదు అనుకోవడం, రెండోది, నాలో ఉన్న దైవానికి విరుద్ధంగా నేనేదీ చెయ్యలేనని నమ్మడం. ఎందుకంటే, నాలోని దైవానికి వ్యతిరేకంగా నాతో ఎవరూ ఏమీ చేయించలేరని నాకు తెలుసు.

మెడిటేషన్స్ లోని అత్యంత నిరాశాపూర్వకంగా కనిపించే ఈ పేరాగ్రాఫు అత్యంత ఆశావహ వాక్యాలతో ఆయన ముగించాడు. చీకటివెలుగులు ఇలా విడదీయలేనంతగా కలిసిపోయిన మరొక మెడిటేషన్ కూడా ఈ అధాయంలో (5:33:2) ఉంది. చూడండి:

మన ఇంద్రియాల్ని ఆకర్షిస్తున్న విషయాలు సదా మారిపోయేవీ, చంచలాలూ అయినప్పుడు, మన ఇంద్రియ గ్రహణజ్ఞానాన్ని మనం పూర్తిగా నమ్మలేనప్పుడు, మనం మన ఆత్మ అని చెప్పుకునేది రక్తపోటు తప్ప మరేమీ కాదనుకున్నప్పుడు,  ఇటువంటి ప్రపంచం మధ్యలో కీర్తిప్రతిష్టలు అనేవి వట్టి డొల్ల అని తెలిసిపోయాక, ఇంకా ఇంకా మనం ఈ జీవితాన్ని పట్టుకు వేలాడాలి? ఏది ఏమైనా కానీ, ఒకింత వేచి ఉందాం, బహుశా మనం మరణించవచ్చు లేదా మరో స్థితిలోకి పరివర్తన చెందవచ్చు.  ఆ చివరి క్షణం సంభవించే ఈ లోగా మనకి ఏది ఆసరా? దేవుళ్ళని స్తుతించడం, నతించడం. మనుషులకి మంచి చెయ్యడం. సహించడం, భరించడం. తక్కిందంతా మన రక్తమాంసాలచేతుల్లోనూ, మన ఊపిరితిత్తుల పరిథిలోనూ లేనిదే.

to bear and to forbear. ఇది స్పష్టంగా ఎపిక్టెటస్ మాట. దీన్నే సాయిబాబా లాంటి సూఫీలు సంతోషంతో ఓపిక పట్టడం అన్నారు. ఆ ఓపిక పట్టడంలో. ఉన్నంతలో, ఇక్కడ ఉన్న నాలుగు రోజుల్లో నలుగురికీ మంచి చెయ్యాలని చెప్పడం చిన్న మాట కాదు.

కాబట్టి నేను పొద్దున్నే ఎందుకు లేవాలి అనే ప్రశ్న ఆయన వేసుకోవడంలో ఉద్దేశ్యమేమిటంటే నువ్వు ఏదో ఒక సామాజిక హితాన్ని కోరి పొద్దున్నే లేవాలని నీకు చెప్పుకుంటున్నప్పుడు, ఆ సామాజిక హితంలో, ఆ సమాజమూ, హితమూ అనే రెండు విలువలూ కూడా నిశిత పరిశీలనకు నిలబడినా, నిలబడకపోయినా కూడా, నువ్వు లేవక తప్పదు. ఎందుకంటే అది నీ ఆత్మస్వభవానికి అనుగుణంగా ఉండేది కాబట్టి. ఈ అంశాల్నే అరవిందులు తన గీతాభాష్యంలో ‘స్వభావము’, ‘స్వధర్మం’ అనే భావనల ద్వారా వివరించే ప్రయత్నం చేసారు. కర్మ చెయ్యాలన్న భావన, అంటే ఒక పని చెయ్యవలసిన పని అనే భావన మనిషిలోని ప్రకృతినుంచే పుడుతుందని అరవిందులు అంటారు. కాని ఆ ప్రకృతి సత్త్వరజస్తమాలు మూడింటితోనూ కలిసిఉంటుందనీ, దాన్ని సాత్త్వికీకరించుకునే ప్రయత్నం చేసినప్పుడు స్వభావం స్వధర్మంగా మారుతుందనీ అంటాడు.

అరీలియస్ ఇంత దీర్ఘసాధన మీద దృష్టిపెట్టడు. ఆయనవి చాలా సరళసూత్రాలు. నీలో ఉన్న అంతఃప్రకృతి స్వభావసిద్ధంగా దైవీగుణాలు కలిగి ఉన్నదే అని గుర్తుపెట్టుకుంటే చాలంటాడు. ఈ మాటలు (5:27) చూడండి:

దేవుళ్ళతో కలిసి జీవించు. దేవుళ్ళతో నిత్యసహజీవనం చేసేవాడు తనకి తన ఆత్మ ఏది అప్పగించిందో దానితో తృప్తి చెందుతున్నానని వాళ్ళకి చూపిచగలుగుతాడు. తనలోని దైవం తాను ఏమి చేయాలని కోరుకుంటున్నదో తను అది చెయ్యగలనని నిరూపిస్తాడు. అటువంటి అంతరాత్మని సర్వేశ్వరుడు జ్యూస్ ప్రతి ఒక్కరికీ అనుగ్రహించాడు ఆ అంతరాత్మ వాళ్ళకి మార్గదర్శకుడిగా, సంరక్షకుడిగా ఉండటానికే అనుగ్రహించాడు. మనలో ఈ దైవత్వాన్నే మనం అవగాహన, వివేచన అని పిలుస్తున్నాం.

స్పష్టంగా ఉంది కదా. దేవుళ్ళతో కలిసి జీవించు. తెల్లవారుజామునే ఎందుకు నిద్రలేవాలంటే దేవుళ్ళతో కలిసి జీవించడం ఎలా ఉంటుందో ఆ వేళల్లో నీకు మరింత బాగా అర్థమవుతుంది కాబట్టి.

6-11-2022

2 Replies to “మెడిటేషన్స్-7”

  1. చిన్నవిగానూ, సాధారణమైనవిగానూ అనిపించే దైనందిన విషయాలను తరచి చూస్తే, ఆ లోతుల్లోకి వెళ్లగలిగితే – అనేకానేక మౌలికాంశాలపై మనకుండే అవగాహన ప్రస్ఫుటమవుతుంది. ఈ రకమైన చింతన లేదా శోధన – కలిగించగల స్ఫురణ, సందర్శన – వీటికి మంచి ఉదాహరణ ఈ వ్యాసం. నేటి ఉదయాన్నే నాకీ స్పష్టతను అందించినందుకు ధన్యవాదాలు! – ఉణుదుర్తి సుధాకర్

    1. మీరు ఈ వ్యాసం చదివారంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ స్పందనకు బహుథా ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: