
శరత్కాల ప్రత్యూషాల్లో ఏ కొండ దగ్గరో, ఆ నది ఒడ్డునో, ఏ సరస్తీరానో గడిపితే బాగుణ్ణనిపిస్తుంది. విశాలమైన జలరాశి ఎదటనో, లేదా అడవిలో చెట్లమధ్యనుంచి తొలి సూర్యరశ్మి ఏటవాలుగా పడుతున్నప్పుడు పొద్దున్నే ఆ కొండవాలుబాటన నడిస్తే బాగుణ్ణనిపిస్తుంది. కానీ, ఇప్పుడు, ఈ క్షణాన, ఈ ఇంట్లో కూచుని ఆకాశాన్నంతా ఆవరించిన అరుణకాంతి నిన్నూ, నీ ఇంటినీ, నీ నగరాన్నీ జాగృతపరుస్తున్నవేళ, కుమార్ గంధర్వ ఆలపిస్తున్న భటియార్ రాగాన్ని వినడంలో కూడా అంతే ఆనందం ఉంది. ఇళ్ళ కప్పుల మీంచి తెల్లని మంచు ఆవిరి, గులాబి రంగు ఉషఃకాంతితో కలిసి నువ్వు రోజూ చూస్తున్న దృశ్యాన్నే ఏదో ప్రత్యేకమైన కాంతిలో ముంచు తేలుస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా నీలోపల ఆరు తామరపూలు నెమ్మదిగా రేకలు విప్పుకోవడం నీకు అనుభవానికి వస్తూనే ఉంటుంది.
ఆనందం, సౌందర్యం నీలోనే ఉన్నాయనీ, అయినా కూడా కస్తూరి మృగం కస్తూరికోసం అడవి అంతా గాలించినట్టు నువ్వు ఎవరు నీకు ఆనందాన్నిస్తారా అని ప్రతి ఇంటి తలుపూ తట్టి చూస్తున్నావనీ, ప్రతి ఫోను పిలుపుకేసి ఆశగా చూస్తున్నావనీ ఇప్పుడు కొత్తగా ఎవరూ చెప్పనక్కర్లేదు. కాని నీకు తెలిసిన ఆ సంగతినే నువ్వు మర్చిపోతున్నప్పుడు మళ్ళా మళ్ళా ఎవరో ఒకరు నీకు చెప్పడంలో నువ్వు ఉలిక్కిపడే ఒక మెలకువ ఉంది. ఇదిగో, మార్కస్ అరీలియస్ రాసుకున్న ఈ మాటలు (4:3:1) చదివినప్పటిలా:
మనుషులు సాధారణంగా ఎక్కడికో ఒక చోటకి పోయి విడిది చేయాలనుకుంటారు. పల్లెపట్టుకో లేదా సాగరతీరానికో, కొండల్లోకో. నీలో కూడా ఈ కోరికతక్కువేమీ కాదు. ఇది చాలా ప్రాపంచికమైన ఆకాంక్ష. కానినీకు నీ అంతరంగంలోకి పోయి విడిది చెయ్యగల అవకాశం నీ చేతుల్లోనే ఉంది. తన మనోలోకంలోకి ప్రయాణించగల మనిషికి దొరికేటంత నిశ్శబ్దం, వేసటనుంచి విడుదల మరెక్కడా దొరకవు. ఏ ఆలోచనల్లోకి చూపు సారించిన వెంటనే మనిషి గొప్ప మానసిక ప్రశాంతి పొదంగలుగుతాడో అటువంటి ఆలోచనలే నీకున్నప్పుడు. మానసిక ప్రశాంతి అంటే మనసుని సక్రమంగా పెట్టుకోవడమే అని స్పష్టంగా చెప్తున్నాను. సదా ఈ విహారాన్ని తెరిచిపెట్టుకో. ఎప్పటికప్పుడు కొత్త జవసత్త్వాలు పుంజుకో. నీ జీవితాన్ని నడిపే సూత్రాలు మౌలికంగానూ, సరళంగానూ ఉండేటట్టు చూసుకో. ఎంత సులభంగా ఉండాలంటే నువ్వు వాటిని గుర్తుచేస్తుకోగానే అవి నీ మొత్తం ఆత్మని శుభ్రపరిచేంతగా. విషయాల పట్ల నీకు కలుగుతున్న అసంతృప్తినుంచి విడుదల చేసి నిన్ను మళ్ళా ఈ ప్రపంచంలోకి కొత్తగా, పరిశుద్ధంగా ప్రవేశపెట్టేంతగా.
అంతరంగ విహారం అనవచ్చు దీన్ని. తనలోకి తాను ప్రయాణించడం- దీన్ని మించిన బలమైన దుర్గం మరొకటి లేదంటాడు మార్కస్ మరోచోట. నాలుగవ అధ్యాయమంతా ప్రధానంగా ఈ ఇతివృత్తం మీదనే నడుస్తుంది. ఇంకా ఇలా అంటున్నాడు (4:3:4) చూడండి:
అప్పుడు ఇదొక్కటే మిగుల్తుంది. నువ్వు నీదనే ఆ చిన్ని అంతరంగంలోకి మరలిపోయినప్పుడు. నిన్ను నువ్వు మరే విషయాలతోటీ బాధపెట్టుకోకు, స్వతంత్రుడివిగా ఉండు, విషయాల్నిమనిషిగా, మానవత్వం కలిగినవాడిగా, పౌరుడిగా, మర్త్యుడిగా చూడటానికి ప్రయత్నించు. నువ్వట్లా నీ అంతరంగంలో మునకలేసినప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకో. ఒకటి, బయటి విషయాలు ఎప్పటికీ నీ ఆత్మని తాకలేవని, ఎందుకంటే, అవి బయటివి కాబట్టి. అయినా మనం బాధ పడుతున్నామంటావా, అది మన అభిప్రాయాల వల్ల, మన ప్రతిస్పదనల వల్ల మనకి మనం పెట్టుకునే బాధలు తప్ప మరేమీ కాదనేది. ఇక రెండోది, నువ్వు చూస్తున్న ఈ విషయాలన్నీ ఇంతలోనే మారిపోతాయి, ఇవేవీ కలకాలం నిలబడేవి కావు, ఇప్పటికే నువ్వెన్ని మార్పులు చూసావో జ్ఞాపకం పెట్టుకో. ఈ విశ్వమంతా ఒక నిత్యపరివర్తన. జీవితమంటే ఒట్టి అభిప్రాయం మాత్రమే.
ఈ మాటలు స్పష్టంగా ఎపిక్టెటస్ మాటలు. స్టోయిక్కుల ఆత్మస్థైర్యం, అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా నిబ్బరంగా నిలవగల మనోబలం వారికి ఈ దృక్పథం నుంచే వచ్చాయి. ‘ బాధలు పడేవాళ్ళేగాని, పెట్టేవాళ్ళు లేరు’ అని జిల్లెళ్ళమూడి అమ్మ అనేదని సుదర్శనంగారు చాలా ఏళ్ళ కిందట నాతో అన్నారు. అది స్టోయిక్కుల మాట. నిన్నొకడు అవమానించాడు. వాడట్లా నిన్ను అవమానించకుండా ఆపడం బహుశా నీ చేతుల్లో లేకపోవచ్చు. కాని దానికి బాధపడకుండా ఉండటమైతే, స్పష్టంగా నీ చేతుల్లోనే ఉన్నది. అందుకనే అతడు జీవితమంటే ఒట్టి అభిప్రాయం తప్ప మరేమీ కాదు అని అన్నాడు. ఈ మాటలు (4:7) చూడండి:
ఆ అభిప్రాయం పక్కకు తీసెయ్యి, అప్పుడు ‘నన్ను వాడు బాధపెట్టాడు చూడు’ అనే ఫిర్యాదు కూడా పక్కకి పోతుంది. ‘నన్ను వాడు బాధ పెట్టాడు’ అనే ఫిర్యాదు కూడా పక్కకు తీసెయ్యి, అప్పుడు ఆ బాధ కూడా పక్కకి పోతుంది.
ఆ తర్వాత వాక్యం ఇలా (4:8) ఉంది:
మనిషిని ఇప్పుడున్నదానికన్నా తక్కువచేయలేనిదేదీ, అతడి జీవితాన్ని కూడా తక్కువపరచలేదు. అప్పుడతణ్ణి ఏదీ కూడా బయటనుంచీ బాధపెట్టలేదు, లోపలనుంచీ బాధపెట్టలేదు.
స్టోయిక్కుల దృక్పథం ఆసరాగా వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుతున్నవాళ్ళు ప్రధానంగా ఈ అంశం మీదనే దృష్టిపెడుతున్నారు. ఎందుకంటే ఒకడు నిన్ను ఏదో అంటాడు, లేనిపోని ఆరోపణలు చేస్తాడు, అభాండాలు వేస్తాడు. వాడు అవి చెయ్యకుండా నువ్వు ఆపలేవు. కాని వాటికి ప్రతిస్పందించకుండా ఉండటం మాత్రం పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది. అంటే మనసులో బాధపడి పైకి వ్యక్తం చెయ్యకుండా ఉండటం కాదు. అసలు మనసులోనే కించిత్ క్లేశానికి కూడా తావీయకపోవడం అన్నమాట. ఆలోచించు. నువ్వు చిన్నపాటి మనస్తాపానికి గురయినా అవతలి వాడి ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తున్నట్టే. నిన్ను బాధపెట్టాలనే, నీ మనోస్థైర్యాన్ని బలహీన పర్చాలనే వాడు ఆ మాటలు అంటున్నాడు. నువ్వు బాధపడితే ఏమవుతుంది? వాడికి సంతోషం కలుగుతుంది. అది వాడి సమస్య. కాని నీ సంతోషం సన్నగిల్లినందువల్ల నువ్వు చెయ్యాలనుకున్న ఎన్నో మంచిపనులుచెయ్యలేకపోతావు. క్షణం పాటు నువ్వు అసంతోషానికి గురయినా అది ఈ విశ్వానికే ఎంతో పెద్ద విపత్తు అని గ్రహించు. కనకనే అరీలియస్ ఇలా (4:11) అంటున్నాడు:
నిన్ను బాధపెట్టినవాడు విషయాల్ని ఎలా వ్యాఖ్యానిస్తున్నాడో చూసి దాన్నిబట్టి ఏ అభిప్రాయానికి రాకు. లేదా ఆ విషయాల్ని నువ్వు ఎలా చూడాలని వాడు భావిస్తున్నాడో అలా చూడకు. విషయాల్ని ఉన్నదున్నట్టుగా చూడు. సత్యాన్ని సరళంగా చూడు.
జీవితమంటే వట్టి అభిప్రాయం మటుకే అన్నది చాలా ఆలోచించదగ్గ మాట. మనం మన జీవితాన్ని నేరుగా జీవించడం కన్నా ఎలా జీవిస్తున్నామని నలుగురూ భావించాలని కోరుకుంటున్నామో అటువంటి అభిప్రాయాలతో జీవిస్తున్నాం. లేదా మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో ఆ అభిప్రాయాల్ని కొనసాగించడానికో లేదా వాటిని సరిదిద్దడానికో అహర్నిశం తాపత్రయపడుతున్నాం. నీ చుట్టూ ఉన్న మిత్రులు నువ్వు నిరాడంబరంగా జీవిస్తున్నావని అంటున్నారనుకో, నువ్వు నిజంగానే నిరాడంబరంగా ఉన్నానా లేనా అని అనుక్షణం పరికించుకుంటూనే ఉంటావు. ఈలోపు ఎవడో నువ్వు నిరాడంబరంగా జీవిస్తున్నట్టు నటిస్తున్నావు తప్ప నిజంగా నిరాడంబరంగా జీవించడం లేదు అంటాడు. ఆ మాట నీకు గొప్ప ఆందోళన కలిగిస్తుంది. వాడు ఆ మాట అన్నప్పుడు అది తక్కిన మిత్రుల మీద ఏమన్నా ప్రభావం చూపించిందేమోనని కంగారు పడతావు. ఇలా నిన్ను నువ్వొక విషమ చక్రంలోకి నెట్టుకుంటావు. కానీ, గుర్తుపెట్టుకో, అంతా వట్టి అభిప్రాయాల దుమారం మాత్రమే. చివరికి నీ గురించి నువ్వు ఏర్పరచుకుంటున్న అభిప్రాయాలతో సహా.
ఈ మాటలు ఇప్పటి సోషల్ మీడియా ప్రపంచానికి చెందినవి లాగా వినిపిస్తున్నాయి కదా. కాదు, రెండువేల ఏళ్ళ కిందట జీవితమంతా మహాయుద్ధాల్లో గడిపిన ఒక చక్రవర్తి ఇలా (4:18) రాసుకున్నాడు:
తన పక్క వాడు ఏమనుకుంటున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో అని చూడకపోతే ఎంత చికాకు తప్పుతుందని. మనిషి చూసుకోవలసింది తనకి తాను ఏం చేసుకుంటున్నాడని. ఆ చేసేదేదో నిర్మలంగానూ, న్యాయసమ్మతంగానూ ఉండేట్టు చూసుకోవడం. అగాధాన్ చెప్పినట్టుగా పక్కవాళ్ళు ఎంత దారితప్పారో చూడటం మాని ముందు నువ్వు దారి తప్పకుండా చూసుకో.
మనం పక్కవాళ్ల అభిప్రాయాలకి ఎందుకంత విలువ ఇస్తాం? కొడవటిగంటి కుటుంబరావు ఎక్కడో రాసింది గుర్తు, మనని ఎవరేనా ఏదేనా అన్నప్పుడు అందుకు లవలేశమైనా కారణం ఉందేమో అని మనకు అనిపిస్తుందట, అలా అనిపించడం వల్ల మనం బాధపడతాం అని రాసాడాయన. నిజానికి మనల్ని బాధపెట్టాలనుకున్నవాళ్ళు సరిగ్గా ఈ వ్యూహాన్నే అమలు చేస్తారని సైకాలజిస్టులు చెప్తున్నారు. మనల్ని వేధించేవాళ్ళు- దగ్గరివాళ్ళూ, దూరంవాళ్ళూ కూడా మనలో ఒక FOG ఏర్పరుస్తారట. FOG అంటే fear, obligation, guilt. అవి మూడూ కలిసి పొగమంచులాగా మన మనసుని చుట్టేస్తాయి. అందులోనూ guilt చాలా ప్రమాదకరమైంది. అది ఎదుటివాళ్ళు మనకి తెలీకుండానే మన రక్తంలోకి ఎక్కించే విషం. వాళ్ళు నీలో ఒక అపరాధ భావన ప్రవేశపెడతారు. ఉదాహరణకు నువ్వు నీ కుటుంబంతో కలిసి పండగ చేసుకున్నావు. ప్రపంచంలో ఇంతమంది దుఃఖంతోనూ, దారిద్య్రంతోనూ బాధపడుతూ ఉంటే నీకు పండగ చేసుకునే హక్కు ఉందా అంటాడు వాడు. అది నీ మానసిక సంతులనాన్ని చెదరగొట్టేస్తుంది. దీనికి కారణం మనం మన పనులకి సామాజిక ఆమోదం కోసం చూస్తూండటం.
సామాజిక అమోదం కోసం ఎందుకు చూడాలి? అది అక్కడితో ఆగదు. ఇంకా ముందుకుపోయి ప్రశంసని కోరుకుంటుంది. చిన్నప్పణ్ణుంచీ మనని సమాజం ఈ శిక్ష-బహుమానం అనే పరికరాలతోటే తనకి అనుగుణంగా తర్ఫీదు చేసుకుంటుంది. తనకి అనుకూలంగా ఉంటే బహుమానం, తనని కాదంటే శిక్ష. మనం పెద్దయ్యాక కూడా మనకు తెలీకుండానే, మన స్పందనల్లో, ప్రతి స్పందనల్లో, వీటికోసమే,సమాజం కేసి చూస్తుంటాం. పెద్దయ్యాక ఈ శిక్ష ఆరోపణల రూపంలోనూ, బహుమానం ప్రశంసలరూపంలోనూ బయటపడుతుంది. అందుకని మనశ్శాంతిని కోరుకునే మనిషి తన జీవితంలోంచి అన్నిటికన్న ముందు బయటికి నెట్టేయాల్సింది ప్రశంసని. చక్రవర్తి అరీలియస్ ఇలా (4:20) రాస్తున్నాడు:
అందంగా ఉన్నది ప్రతి ఒక్కటీ తనలో తాను, తనకై తాను అందంగా ఉన్నదే. అది స్వయంపరిపూర్ణం. దానికి వేరే ప్రశంసలు అక్కర్లేదు. మనం ప్రశంసించడం ద్వారా దాన్నిమరింత బాగుచెయ్యలేం, లేదా పాడుచెయ్యలేం. జనబాహుళ్యం అందమైనవనే వాటి విషయంలో, అంటే ప్రాపంచిక వస్తువుల విషయంలో, కళాఖండాల విషయంలో కూడా నేను ఈ మాటలే చెప్తాను. నిజంగా అందమైనదానికి మరొక దానితో పనిలేదు. సత్యం, న్యాయం, దయార్ద్రహృదయం, నిజాయితీ- వీటినిమించి అదనంగా మరొకటేదీ అవసరం లేదు. చెప్పండి, వీటిలో ప్రశంసించడం వల్ల ఏదైనా మరింత సుందరంగా మారిందా లేక విమర్శించడం వల్ల వికృతమయిందా? పొగడనంతమాత్రాన మరకతమణికి వన్నె తగ్గుతుందా? లేక బంగారానికి? దంతపు సామగ్రికి? రాజవస్త్రాలకి? వీణకి? లేదా చిన్న చాకుకి?పువ్వుకి? పూలపొదరిల్లుకి?
ప్రశంసలకి పొంగడంలోనూ, తెగడ్తలకి కుంగడంలోనూ, సూక్ష్మంగా ఉన్నది మరణభీతి అని అరీలియస్ అనుమానించాడు. అందుకనే నాలుగవ అధ్యాయంలో అధికభాగం, జీవితం ఎంత అశాశ్వతమో, అందులో నిన్ను ప్రశంసించేవాళ్ళూ, విమర్శించేవాళ్ళూ కూడా ఎంత అచిరకాలంలో ఈ ప్రపంచం నుంచి కనుమరుగవుతారో పదే పదే చెప్తాడు. చివరికి రాబోయే కాలాల్లో నీకు లభిస్తుందేమో అని నువ్వు ఆశపడే యశస్సు కూడా అర్థం లేనిదంటాడు. అప్పుడు కూడా మనలాంటివాళ్ళే, మనలాంటి అరకొర అభిప్రాయాలతోటే నిన్ను అంచనా వేస్తుంటారు తప్ప మరేమీ కాదంటాడు.
మరి ఈ జీవితం జీవించినదానికి ఫలమేమిటి? మనం దేన్ని చూసి సంతోషపడాలి? మన జీవితం సార్థకమైందని మనకి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు?
ఎవరూ చెప్పనవసరం లేదంటాడు. నువ్వు ప్రకృతికి అనుగుణంగా, నిన్ను నడిపిస్తున్న జీవననియమానికి అనుగుణంగా జీవించడమే నీ జీవితానికి సార్థకత అంటాడు. ఆలివ్ పండు చూడండి. అది చెట్టున పిందెగా మొదలై, కాయగా మారి, పండుగా పండి, ఒకరోజు తొడిమ వడలి నేలరాలిపోతుంది. నీ జీవితం కూడా అలానే పరిణమించాలంటాడు. 48 వ మెడిటేషన్ లో చివరి మాటలు (4:48) చూడండి:
ఈ కాలప్రవాహంలో నీకు దక్కిన ఈ చిన్న వ్యవధిని ప్రకృతికి అనుగుణంగా గడుపుకో. తనని పుట్టించిన ప్రకృతికి అభివాదాలు సమర్పించుకుంటూ, తనని కని పెంచి పెద్దచేసిన చెట్టుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆలివ్ పండు ఎలా నేలరాలిపోతుందో అంతే తృప్తిగా నీ ప్రయాణం ముగించు.
దీన్నే వైదిక ఋషి ఆలివ్ పండు అనే బదులు పండుదోసకాయలాగా తొడిమ విడిపోవాలనే కోరికగా వ్యక్తంచేసాడు.
నాల్గవ అధ్యాయంలో 23 వ మెడిటేషన్ ఒక వేదసూక్తంలాగా ఉంటుంది. చూడండి. ఇక్కడ ఆయన ప్రకృతిని, విశ్వచాలన సూత్రాన్ని, తన అంతరాత్మని అన్నిటినీ ఒక్కటిగా భావించి నేరుగా ఆ సత్యంతో మాట్లాడుతున్నాడు:
ఓ విశ్వమా! నాతో శ్రుతి కుదురుకున్న ప్రతి ఒక్కటీ నీతో శ్రుతి కుదురుకున్నదే. ఈ జీవితంలో నాకు తొందర లేదు, ఆలస్యం లేదు. ప్రతి ఒక్కటీ నువ్వు నిర్ణయించిన వేళనిబట్టే లభిస్తుంది. ఓ ప్రకృతీ! నీ ఋతువులు నాకు ఏది అనుగ్రహించినా అదే మహాప్రసాదంగా కళ్ళకద్దుకుంటాను. అన్నీ నీలో ఉన్నవే. ప్రతి ఒక్కటీ తిరిగి నిన్నే చేరుకుంటాయి. కవి ఏథెన్సు నగరాన్ని ప్రశంసిస్తూ చక్రవర్తులు నిర్మించిన నగరమా అన్నాడు. నువ్వయితే దేవుడి నగరమా అని కదా అంటావు!
అందుకనే నాలుగవ అధ్యాయాన్ని ఈ వాక్యాల్తో (4:51) ముగిస్తాడు:
ఎప్పుడూ తక్కువదూరం పట్టే దారి ఎంచుకో. ఏది ప్రకృతి సమ్మతమో దానికి ఎక్కువ దూరం నడవనక్కర్లేదు. ఏమి మాట్లాడినా, ఏది చేసినా నీ అంతరంగ వివేచనకి అనుగుణంగా చెయ్యి. అటువంటి దారి దొరికిన మనిషి అన్ని చికాకులనుంచీ ఆరాటాలనుంచీ, యుద్ధాలనుంచీ, ఆడంబర ప్రదర్శనలనుంచీ బయటపడతాడు.
దైవ నగరం. City of Jeus. తర్వాత రోజుల్లో అగస్టైన్ సాధువు దీన్ని City of God అన్నాడు. భగవంతుడి పట్టణం. అది గూగుల్ మాప్స్ లో కనబడదు. కానీ నా అంతరంగంలోకి చూపు సారిస్తే నేను రోజూ చూసే ఈ నగరంలోనే, ఇక్కడే, ఆ నగరం ప్రత్యక్షమవుతుంది.
30-10-2022
Chaala adbhutamga vundi naaku yentho prasanthata nichindi
Thank you very much!
No words… 🛐
Thank you