మెడిటేషన్స్-4

Reading Time: 4 minutes

నిన్ను ఇంకా ఏవైనా బయటి విషయాలు ప్రలోభపెడుతున్నాయా? అయితే మళ్ళా నువ్వొక నీతిపాఠం నేర్చుకోవాలి, ఎక్కడికీ తిరక్కుండా కూచో అంటున్నాడు అరీలియస్ మెడిటేషన్స్ రెండవ అధ్యాయంలో.

మొదటి అధ్యాయంలో ఆయన తనను, మనిషిగా రూపొందించినవారికి ధన్యవాదాలు చెప్పుకుంటే, రెండవ అధ్యాయంలో తన జీవన ప్రాధాన్యతల్ని వివరిస్తున్నాడు.

స్టోయిక్కుల్ని వాళ్ళ కాలం నాటి ఇతర గ్రీకు, రోమన్ తాత్త్వికుల నుండి వేరు చేసిన ముఖ్యవిషయం ఏమిటంటే, వాళ్ళు మనసుని నిర్మలంగా ఉంచుకోవడం మాత్రమే కాదు, పదిమందికీ పనికొచ్చే పనూలు చెయ్యాలని కూడా భావించారు. ప్లేటో అనుయాయులకీ, అరిస్టాటిల్ అనుయాయులకీ మనసుని నిర్మలంగా ఉంచుకోవడం కన్నా సత్యానికి ఎలా చేరువ కాగలం అన్నదానిమీదనే ఎక్కువ ఆసక్తి. ఈ ప్రపంచం గురించిన జ్ఞానం ఆలోచన వల్ల వస్తుందని అకడెమీషియన్లూ, లేదు అనుభవం వల్ల వస్తుందని అరిస్టాటిల్ శిష్యులూ తగవు పడుతూ ఉన్నారు. మరొకవైపు ఎపిక్యూరియన్లు ఈ ప్రపంచాన్ని నడిపించే ఒక వ్యవస్థ అంటూ ఏదీ లేదనీ, కాబట్టి, వీలైనంతవరకూ జీవితానందాన్ని పొందడం మీదనే దృష్టిపెట్టడం మంచిదని చెప్తూ వచ్చారు.

స్టోయిక్కుల్లో గ్రీకు తత్త్వవేత్తలు మనిషీ, ప్రపంచమూ కూడా ఒక సూత్రం ప్రకారం నడుస్తారని చెప్తూ ఆ సూత్రాన్ని వారు ప్రకృతి అనీ, హేతువు అనీ, ఆలోచించగలిగే స్వభావం అనీ, తనకీ, లోకానికీ కూడా ఏది మంచినో దాన్ని ఎంచుకోగల వివేకమనీ-ఇలా రకరకాల పేర్లతో వివరిస్తూ వచ్చారు. స్టోయిక్కులు పూర్తి భౌతికవాదులు, కాబట్టి మనిషి మరణించినప్పుడు మట్టిలో కలిసిపోతాడు, అతణ్ణి అంతదాకా నడిపించిన జీవనసూత్రం ప్రకృతిలో కలిసిపోతుందని చెప్పారు. మనిషిలానే ప్రపంచం కూడా ఒకరోజుకి లయమైపోతుందనీ, మళ్ళా భౌతికపదార్థాల కలయిక వల్ల కొత్త ప్రపంచం ఏర్పడుతుందనీ, ఇలా ఇప్పటికి ఎన్నోసార్లు జరుగుతూ వచ్చిందనీ చెప్తూ వచ్చారు.

తనని నడిపించే ఆ జీవనసూత్రాన్ని కనుగొనడమే మనిషి జీవనపరామర్థం అని చెప్తూ, దానికి నైతికమైన నడవడిక చాలా అవసరం అని వారు భావించారు. మనసుని నిర్మలంగా ఉంచుకోవడమంటే అదే. అయితే తొలినాటి స్టోయిక్కులకి మనిషి నిర్వహించవలసిన సామాజిక పాత్రమీద ఎక్కువ ధ్యాస లేదు. కాని వారిని అనుసరించిన తొలి రోమన్ స్టోయిక్కులు, ఎపిక్టెటస్ తో సహా,  నియంతృత్వాన్ని ఎదిరించడానికి తమ ప్రాణాలు పణం పెట్టారు లేదా దేశబహిష్కారానికి గురయ్యారు. తొలి గ్రీకు స్టోయిక్కులు Stoics. ఆలోచనాపరులు మాత్రమే. రోమన్ స్టోయిక్కులు stoic కూడా. ఆలోచన మాత్రమే కాదు, ఆచరణ కూడా ముఖ్యమని నమ్మినవారు. మార్కస్ అరీలియస్ లో ఈ రెండు పార్శ్వాలూ సమంగా వికసించాయి. అందుకనే ఆయన్ని చదువుతుంటే, కన్ ఫ్యూసియస్ ఉదాహరణలు చదువుతున్నట్టూ, తాను సత్యం తెలుసుకున్నాక, ఆ సత్యాన్ని నలుగురితో పంచుకోకుండా ఉండలేకపోయిన బుద్ధుడి సంభాషణలు చదువుతున్నట్టూ అనిపిస్తుంది.

రెండవ అధ్యాయంలో మార్కస్ తనకి తాను చెప్పుకుంటున్నది ప్రధానంగా ఒకటే విషయం. నువ్వు నీ మనసుని ఎంత నిర్మలంగా ఉంచుకుంటావో అంతగా సమాజానికి పనికొస్తావు అని. దాన్ని ఆయన తనకి తాను సూటిగా, స్పష్టంగా చెప్పుకోవడంతో మనకి ఆ మాటలు చదువుతున్నప్పుడు, ఏ వ్యాఖ్యానమూ అవసరం లేకుండానే ఆ సందేశం సరాసరి మన హృదయంలోకి సరసరా ప్రవహిస్తుంది.

నీ మనసుని నువ్వు నిర్మలంగా ఎందుకు ఉంచుకోవాలంటే, నువ్వూ, నీ తోటివాడూ, ఈ ప్రపంచమూ అన్నీ కూడా ఒకే ప్రకృతిలో భాగాలు. నువ్వు సరిగా ఉండకపోతే ఆ మేరకు ఈ ప్రకృతి భంగపడుతుంది. ఎదుటివాడు సక్రమంగా ఉన్నాడా లేదా అని ఆలోచించడం కన్నా నువ్వు సక్రమంగా ఉన్నావా లేదా అన్నది ఆలోచించు ముందు అంటాడు. అసలు రెండవ అధ్యాయం మొదలుపెడుతూనే ఏమంటున్నాడో చూడండి:

పొద్దున్నే లేస్తూనే ఇలా చెప్పుకుంటూ నీ రోజుమొదలుపెట్టు: ‘ఈ రోజు నేను ఎంత మాత్రం తీరికలేనివాళ్ళని, కృతఘ్నుల్ని, దురహంకారుల్ని, మోసగాళ్ళని, అసూయాపరుల్ని, నలుగురితో కలవలేనివాళ్ళని కలుసుకోబోతున్నాను. కాని వాళ్ళ లా ఉండటానికి కారణం వాళ్ళకి ఏది మంచో, ఏది చెడునో తెలియకపోవడం. కాని నేను మంచిని చూసాను. అది అందంగా ఉంటుందని గ్రహించాను. చెడుని కూడా చూసాను. అది అందవికారంగా ఉంటుందని గ్రహించాను. నాకు హాని చేస్తున్న మనిషి ప్రకృతి కూడా నాకులాంటి ప్రకృతే. మా ఇద్దరిలోనూ ప్రవహిస్తున్నది ఒకటే రక్తం. మా ఇద్దరిదీ ఒకటే జాతి, అంతేకాదు, అతనిలోనూ, నాలోనూ ఉన్న ప్రజ్ఞ, దైవత్వం కూడా ఒకటే ప్రకృతికి సంబంధించినవి. కాబట్టి వాళ్ళల్లో ఏ ఒక్కరూ నాకు హానిచెయ్యలేరు. ఎవ్వరూ కూడా నా ఆలోచనల్ని వికృతపరచలేరు. నేను నా సొంతమనిషి మీద ఎలా కోపం తెచ్చుకోగలను? అతణ్ణి ద్వేషించలేను కూడా. ఎందుకంటే కాళ్ళూ, చేతుల్లాగా, కనురెప్పల్లాగా, పలువరసలో పై వరసా, కింద వరసాలాగా మేమిద్దరం ఒకరితో ఒకరం కలిసిపనిచేయడానికి పుట్టాం తప్ప ఒకరికి మరొకరం అపకారం తలపెట్టడానికి కాదు. అలా ఒకరికొకరం హానిచేసుకోవడం ప్రకృతిస్వభావానికి విరుద్ధం. ఒకరికొకరం వ్యతిరేకంగా పనిచేసినందువల్ల చివరికి మిగిలేది వట్టి అలసట తప్ప మరేమీ కాదు.

ఈ భావాలు మనకి కొత్త కాదు, ఈశావాస్య ఉపనిషత్తు నుంచి మహాత్మాగాంధీ దాకా ఈ మాటలు పదే పదే చెప్తూనే వచ్చారు. కాని మనం వాటిని వట్టిమాటలు గానే వింటూ ఉన్నాం కాబట్టి, వాటినుంచి గట్టిమేలు ఏదీ స్ఫురించడం లేదు. మార్కస్ అరీలియస్ అవే మాటలు మాట్లాడుతున్నాడు. కాని ఆ conviction మనల్ని సంభ్రమానికి గురిచేస్తుంది. ఇంకా ఇలా అంటున్నాడు (2:9) చూడండి:

ఇదొక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పుడూ. మొత్తం ప్రకృతి ఏమిటి, నా ప్రకృతి ఏమిటి, ఈ రెండూ ఏ విధంగా ఒకదానికొకటి సంబంధించి ఉన్నాయి, నేను అనే ఈ భాగాన్ని తనలో పొదువుకున్న ఆ మొత్తం ప్రకృతి ఏమిటి అన్నది తరచి చూసుకో. నువ్వు ఆ మొత్తం ప్రకృతిలో ఒక భాగం కాబట్టి ఆ ప్రకృతికి అనుగుణంగా ఉండే విషయాల్ని నువ్వు చెప్పాలనుకుంటే, ఆచరించాలనుకుంటే అడ్డుపడటం ఎవరికీ సాధ్యం కాదని తెలుసుకో.

నువ్వూ ప్రకృతీ ఒకటనే ఎరుక కలిగిన తర్వాత దాన్ని ఒక నమ్మకమగా ఎలా దృఢపరుచుకోవాలో ఆ spiritual exercises మెడిటేషన్స్ అని ఇప్పుడు మనకి అర్థమవుతున్నది. ఇద్దరిలోనూ, నాలోనూ, నా పక్కవాడిలోనూ కూడా ఉన్నది ఒకటే ప్రకృతి అయినప్పుడు నేను నా పక్కవాడి గురించిన తలపోతలు మాని నన్ను నేను సరిదిద్దుకోవడం ఎలా అన్నదాని మీద దృష్టి పెట్టడం మంచింది. ఈ మాటలు (2:8) చూడండి:

మరొకమనిషి మనసు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించడంవల్ల కొన్నిసార్లు బాధ తప్పదు. కాని తన మనసులో ఏముందో తెలుసుకోకపోవడం మాత్రం తప్పనిసరిగా బాధకలిగించి తీరుతుంది.

సోక్రటీసు ‘నిన్ను నువ్వు తెలుసుకో ‘అని అన్నాడని మనకు తెలుసు. కాని దాన్ని లోకం పెడచెవిన పెట్టింది. ఎందుకంటే మనుషులుగా మన ఆసక్తి ఎంతసేపూ పక్కవాణ్ణి తెలుసుకోవడం మీదనే.

తనని తాను తెలుసుకోవడమంటే ధ్యానంలో కూరుకుపోవడం కాదు, లేదా తనని తాను నిరాకరించుకోవడమూ కాదు. అది తనని తాను ఎప్పటికప్పుడు నిర్మలంగా ఉంచుకోవడం. తన మనసుని నిర్మలంగా ఉంచుకోవడం ఒక కర్త్యవ్యంగా కాదు, ఒక ఉద్యమంగా చెయ్యాలంటాడు. ఎంత అత్యవసరంగా చెయ్యాలంటే, నువ్వు ఈ క్షణమే ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తావన్నంత త్వరగా చెయ్యాలంటాడు. గోచరిస్తున్న ప్రపంచం చాలా తొందరగా అగోచరమైపోతూ ఉంటుంది. ఆట్టే సమయం లేదు. అందుకని నువ్వు ఏ పని తలపెట్టినా, ఏ పని చేసినా, ఇదే నీ జీవితంలో నువ్వు చెయ్యబోతున్న చివరి పని అన్నట్టుగా చెయ్యి అంటాడు. నీ జీవితాన్ని సంతృప్తికరంగా, సార్థకంగా జీవించడానికి ఏ పనులు అవసరమో అవి మాత్రమే చెయ్యి చాలు అంటాడు.

రెండవ అధ్యాయంలో మరొక అంశం, అనవసరమైన అధ్యయనాన్ని వదిలిపెట్టమనడం. మనిషి అంటే రక్తమాంసాలు, శ్వాస, తనని నడిపించే ఒక జీవనసూత్రం-ఈ మూడే అంటాడు అరీలియస్. నువ్వు ఈ క్షణంలో మరణించబోతున్నట్టుగా ముందు నీ రక్తాస్థిగత దేహాన్ని పక్కనపెట్టు, శ్వాస అంటావా, వట్టి గాలి. ఇక మిగిలేది జీవనసూత్రం. నిన్ను ముందుకు నడిపిస్తున్న ఒక వివేకం. దాన్ని పట్టుకో. పుస్తకాలు పక్కన పారెయ్యి. ఇప్పటికే ముసలివాడివయ్యావు, ఇంకా నీ మనసుని బానిసబతుకు బతకనివ్వకు. గతం గురించీ, భవిష్యత్తు గురించీ తలపోతలు కట్టిపెట్టు. నీ చేతుల్లో ఉన్నది ఈ క్షణం మాత్రమే. జీవితమంటే ఈ క్షణం తప్ప మరేమీ కాదు. కాబట్టి ప్రతి క్షణం మీదా ఒక రోమన్ లాగా, ఒక మనిషిలాగా దృష్టి పెట్టు. ఒక మనిషిలాగా అంటే నిర్మల హృదయుడివిగా ఉండు అనడం. ఒక రోమన్ లాగా అంటే ఆ నిర్మల హృదయంతో పదిమందికీ పనికొచ్చే పనులు చెయ్యడం. గాంధీ ఈ మాటలే మరొక విధంగా చెప్పాడు, సత్యం, అహింస అని. అహింస అంటే మనసుని నిర్మలంగా ఉంచుకోవడం. సత్యం అంటే అద్వైతులు చెప్పినట్లుగా లోకసంగ్రహం.

జీవితంలో మనిషికి లభించగల గొప్ప అనుగ్రహం తను నిర్మలుడని తెలుసుకోవడం. తన నిర్మలత్వాన్ని కాపాడుకోవడం తన చేతుల్లోనే ఉందని తెలుసుకోవడం. ఒకసారి ఆ ఎరుక కలిగిన తర్వాత, ఆ పనిచెయ్యకుండా ఉండటం కన్నా దురదృష్టం మరొకటి ఉండబోదు. ఆయన ఇలా (2:4) చెప్పుకుంటున్నాడు :

నువ్వు ఈ పని ఎన్ని సార్లు వాయిదా వేసుకుంటూ వస్తున్నావో గుర్తుతెచ్చుకో. నీకు దేవుడు ఎన్నిసార్లు అవకాశమిచ్చాడో కూడా గుర్తుతెచ్చుకో. ఇప్పటికైనా ఏ విశ్వంలో నువ్వు ఒక భాగంగా ఉన్నావో, ఆ విశ్వప్రణాళికలో నీ అస్తిత్వం కలిసిఉందనీ, నీ మనుగడకి ఒక కాలవ్యవధి నిర్ణయించి ఉందనీ గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా నీ మనసులో మబ్బులు తొలగించుకోకపోతే, అది కూడా తొలగిపోతుంది, నువ్వూ తొలగిపోతావు, ఇక మళ్ళా ఏదీ వెనక్కి రాదు.

ఈ మాటలు చిన్నప్పుడు బళ్ళో గోడల మీద చదువుకున్న నీతివాక్యాల్లాగా కనిపించవచ్చు. కానీ ఇప్పుడు మన అశాంతికి, అసంతృప్తికి ఇంతకన్నా ఔషధం మరొకటి లేదు. ఈ మాటలు (2:6) చూడండి

నీకు నువ్వు హాని చేసుకుంటూనే ఉండు, మనసా, హాని చేసుకుంటూనే ఉండు. ఇంక నిన్ను నువ్వు గౌరవించుకునే అవకాశం నీకు దొరకదు. ఏ ఒక్కరికీ జీవితకాలం సరిపోదు. నీ జీవితమా దాదాపుగా అయిపోవచ్చింది. కాని నీ ఆత్మ తనని తాను గౌరవించుకోదు సరికదా, తన గౌరవాన్ని పక్కవాళ్ల చేతుల్లో పెట్టేసింది.

మనకి నేడు ఇంతకన్నావర్తించే వాక్యాలు వేరే కనిపించవు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం మన గౌరవం కోసం పక్కవాళ్ళ మీద ఆధారపడుతున్నాం. మన విశ్వాసాలకూ, సంతోషాలకూ సామాజిక ఆమోదం కోసం చూస్తున్నాం. మన సోషల్ మీడియా చూడండి. ప్రతి ఒక్కడూ తన సమ్మతి, అసమ్మతి ద్వారా నీ వ్యక్తిత్వాన్ని నియంత్రించగలనని భావిస్తున్నాడు. కాని నిజానికి నీ జీవితానికి పూర్తి అధికారివి నువ్వే. నువ్వు ఆ విషయం మర్చిపోయి నీ జీవితాన్ని పక్కవాడి చేతుల్లో ఎప్పుడు పెట్టేసావో అప్పుడే నీకు నువ్వు హాని చేసుకోవడం మొదలుపెట్టేసావు.

మరి దీన్నుంచి విముక్తి ఏమిటి?

ఒకే ఒక్క మార్గం. Philosophy అంటున్నాడు (2:17). ఆ ఫిలాసఫీ ఏమిటో ఇలా చెప్తున్నాడు:

నీలో ఉన్న దైవత్వాన్ని హింసనుంచి కాపాడుకో. దానికి హాని జరక్కుండా చూసుకో. సుఖదుఃఖాలకి అతీతంగా నిలుపుకో. మరొకడు ఇది చెయ్యాలని గాని, చెయ్యలేదని గాని చూడకు, అన్నిటికన్నా ముఖ్యం, నీకు సంభవిస్తున్న ప్రతి ఒక్కదాన్నీ స్వీకరించడం నేర్చుకో.

నాలో ఉన్న దైవత్వాన్ని హింస నుంచి కాపాడుకొమ్మంటున్నప్పుడు ఆ హింస నిజానికి బయటి వాళ్ళు పెట్టేదికాదు, నాకై నేను పెట్టుకునేదే అని తెలుసుకోవడమే మెడిటేషన్స్ చదివినందువల్ల నాకు ఒనగూడిన స్పష్టత.

30-10-2022

Leave a Reply

%d bloggers like this: