మెడిటేషన్స్-3

సాయంకాలం మేడ మీద నిల్చొంటే గాలంతా పున్నాగపూల వాసన. తలతిప్పి చూసాను. వీథికి రెండిళ్ళ అవతల నిండుగా పూసిన పున్నాగచెట్టు. ఈ సువాసన ఒక్క పూలదేనా? కాదు. ఇది శరత్కాల సౌరభం. సూర్యకాంతి, వానలు కురిసివెళ్ళిపోయిన శుభ్రమైన ఆకాశం, రాత్రుళ్ళు విరబూసే వెన్నెల- వీటన్నిటితోనూ పున్నాగపూల మొక్క మాట్లాడుకున్నప్పుడు ఆ ఆత్మీయ సంభాషణ మనని ఇలా ఒక సుగంధంగా తాకుతుందన్నమాట.

ఒక మనిషిలో మంచి తలపులు కలగడం కూడా ఇలాంటిదే. ఆ మనిషి ఎప్పటివాడుగానీ, ఏ భాషలో ఆలోచించి ఉండనీ, అతడికి కలిగిన మంచి తలపుల మధురసువాసన మనల్ని ఎక్కడున్నా వచ్చి తాకుతుంది. మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ లానే. అయితే, తనకి కలిగిన మంచితలపులకి తన తల్లిదండ్రులు, గురువులు, మిత్రులు ప్రతి ఒక్కరూ కారణమనే ఎరుక మార్కస్ కి ఉంది. మనుషులూ దేవతలూ కలిసి నిర్మిస్తే తప్ప ఒక మనిషి మనిషిగా రూపొందలేడని గుర్తుపట్టాడు ఆయన, అందుకనే తన గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనుషులకీ, దేవతలకీ కృతజ్ఞతా సమర్పణగా రాసుకున్నాడు.

మెడిటేషన్స్ గ్రంథంలోని పన్నెండు అధ్యాయాల్లో తక్కిన పదకొండూ ఒక ఎత్తు. మొదటి అధ్యాయం ఒక్కటీ ఒక ఎత్తు. మన పూర్వకవులు తమ కావ్యాలకు అవతారిక రాసుకునేవారు చూడండి, అట్లాంటి రచన అది. అందులో మన కవులు దేవుణ్ణీ, పూర్వకవుల్నీ, తమను ఆదరించిన రాజుల్నీ అందర్నీ ప్రస్తుతించేవారు. మార్కస్ కూడా అట్లానే తన అభ్యుదయానికి కారణమనుకున్నవారందరినీ అందులో స్తుతించాడు. మన పూర్వకవులు మంచివాళ్ళని స్మరించుకోవడంతో పాటు కుకవి నింద కూడా చేసేవారు. కాని మార్కస్ అరీలియస్ అటువంటి నింద ఏదీ చెయ్యలేదు. తాను ఏది కాకుండా తన గురువులూ, దేవతలూ కాపాడేరని చెప్పుకుంటున్నప్పుడు ఈ జీవితంలో వదిలిపెట్టవలసిన దారులేవో చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.

మొదటిసారి చదివినప్పుడు కేవలం ధన్యవాద సమర్పణగా కనిపించే ఈ అధ్యాయం నిజానికి తక్కిన అన్ని అధ్యాయాలకూ ప్రాతిపదిక. తన గురువులూ, మిత్రులూ, దేవతలూ తనకొక జీవితాదర్శాన్ని చూపించినందువల్లనే, తన ఆత్మకి జవసత్త్వాలు చేకూర్చినందువల్లనే, తరువాతి అధ్యాయాల్లో తన ఆలోచనల్ని శుభప్రదం చేసుకోగలిగాడనీ మనకి తేటతెల్లమవుతుంది. అందుకనే ఎ.బి.రూథర్ ఫర్డ్ అనే పండితుడు మెడిటేషన్స్ మొదటి అధ్యాయంలాంటి రచన మొత్తం ప్రాచీన సాహిత్యంలోనే మరొకటి లేదన్నాడు. ఆ అధ్యాయం మీద ఆయన ఏకంగా ఒక పుస్తకం కూడా రాసాడు.

ఇటీవల వెలువడ్డ ఒక అనువాదం మొదటి అధ్యాయానికి ‘ఋణాలూ, పాఠాలూ’ అనే శీర్షిక పెట్టింది. అది కూడా నిజమే. అందులో ఆయన తాను ఎవరెవరికి ఎందుకు ఋణపడ్డాడో చెప్పుకున్నాడు. ఆ ఋణాలన్నీ విద్యాఋణాలు, తనకు వాళ్ళు మానవత్వ పాఠాలూ, నైతికతా పాఠాలూ చెప్పినందుకు తాను తీర్చుకోలేని ఋణాలు. తన గురువులగురించీ, పెద్దల గురించీ ప్రస్తుతిస్తూ మార్కస్ వాళ్ళు తనకి ఏ అంశాల్లో దారి చూపించారో చెప్తున్నప్పుడు ఆ అంశాలన్నీ తనలో మూర్తీభవించాయని చెప్పుకోవడం అతడి ఉద్దేశం కాదు. తాను వాటిని శ్లాఘించవలసిన విషయాలుగా, ఆచరించవలసిన ఆదర్శాలుగా, నలుగురికీ పైకెత్తి చూపవలసిన ఉదాహరణలుగా చెప్తున్నాడని మాత్రమే గ్రహించాలి.

మొదటి అధ్యాయంలో పదిహేడు ధన్యవాద సమర్పణలు ఉన్నాయి. వాటిని అతడు వాటిన కూర్చిన పద్ధతిలో గొప్ప శిల్పం కూడా ఉంది. అందులో ఒక్కొక్క సమర్పణా ఒక్కొక్కవాక్యం నుండి మొదలై నిడివి పెరుగుతూ వస్తుంది. అలాగని మరీ నిడివిగా కాదు. మార్కస్ అరీలియస్ చాలా మితభాషి. ఆయన ఎక్కువ విశేషణాలూ, అత్యుక్తులూ, అతిశయోక్తులూ వాడడు. చెప్పిన ఒకటి రెండు విషయాలూ కూడా ఎన్నో సంఘటనల్నీ, ఎన్నో అనుభవాల్నీ ఒకటి రెండు మాటల్లోకో, వాక్యాల్లోకో కుదించి చెప్తాడు.

ఆ పదిహేడు ధన్యవాదాల్లోనూ మొదటి నాలుగూ తన కుటుంబపెద్దలకి చెప్పినవి. తన తాతకి, తన చిన్నప్పుడే గతించిన తండ్రికి, తల్లికి, తల్లి తండ్రికీ. ఆ తర్వాత తొమ్మిది తన గురువులకీ, తొలి ఉపాధ్యాయులకీ చెప్పినవి. ఆ తర్వాత తన సోదరుడికీ, ఒక స్టోయిక్ సెనేటర్ కీ చెప్తాడు. పదహారవ ప్రస్తుతి తనని దత్తత తీసుకున్న తండ్రి, తన ముందు రోమ్ ను పాలించిన చక్రవర్తికి చెప్పుకున్న కృతజ్ఞతా సమర్పణ. మొత్తం అధ్యాయంలో ఎక్కువ నిడివి కలిగిన ప్రస్తుతి ఇదే. ఈ ప్రశంస ద్వారా మార్కస్ తన తండ్రి తన పట్ల చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పడం కన్నా కూడా ఎక్కువగా ఆదర్శవంతుడైన రాజు ఎలా ఉండాలో చెప్పినట్టుగా అనిపిస్తుంది.

గ్రీకులు ప్రధానంగా ప్రజాస్వామిక వాదులు. రోమన్లు అన్నివేళలా ప్రజాస్వామ్యం వైపు నిలబడలేకపోయారు. రోమ్ కొన్నిసార్లు గణతంత్రం వైపూ, కొన్ని సార్లు రాచరికంవైపూ, మరికొన్నిసార్లు కర్కశమైన నియంతృత్వం వైపూ మొగ్గు చూపుతూ వచ్చింది. రోమ్ ని నియంతలు పాలించినప్పుడు తత్త్వవేత్తల్ని బహిష్కరిస్తూ వచ్చారు, లేదా వధిస్తూ వచ్చారు. అరీలియస్ తనదాకా నడిచిన రోమన్ చరిత్రను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. అతడు రాచరికవారసుడే అయినప్పటికీ, తనముందు కాలాల్లో నియంతల్ని ధిక్కరించిన తాత్త్వికులకి వారసుడిగా జీవించాలనే అనుకున్నాడు. అందుకనే అతణ్ణి ప్రజాస్వామిక చక్రవర్తి అనవచ్చు. తర్వాత రోజుల్లో చరిత్రకారులు అతణ్ణి ‘రాజర్షి’ (Philosopher-King) అని కొనియాడటం ఇందువల్లనే.

ప్రాచీన గ్రీకు, రోమన్ కాలాల్లో Philosophy అనే మాటకీ, ఇప్పుడు మన విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్నదానికీ మధ్య చాల తేడా ఉంది. ప్రాచీన గ్రీకుల ముందు రెండు ఆదర్శాలుండేవి. ఒకటి Sophism, రెండవది, philosophy. రెండూ Sophos అంటే, జ్ఞానానికి సంబంధించినవే అయినప్పటికీ మొదటి దాంట్లో పాండిత్యప్రకర్షకి, వాక్చాతుర్యానికీ, వాదవివాద కౌశల్యానికీ పెద్ద పీట ఉండేది. కాని ఒక మనిషి జ్ఞానాన్ని ప్రేమిస్తే అది అతడి నడవడికలో, శీలంలో కనిపించవలసిందే తప్ప పాండిత్యంలోనూ, వాదవివాదల్లో నేర్పులోనూ కాదని సోక్రటిస్ భావించాడు.

మార్కస్ అరీలియస్ కి కూడా చిన్నప్పుడు రెటారిక్, సాహిత్యం, తర్కం, న్యాయం వంటి శాస్త్రాల్లోనూ, సంగీతం, చిత్రకళ వంటి కళల్లోనూ శిక్షణ ఇచ్చినప్పటికీ, అతడి యవ్వనకాలంలో అతడి దృష్టి పాండిత్యం అంటే rhetoric మీంచి philosophy మీదకు మళ్ళింది. అతడికి యవ్వనదినాల్లో చదువు చెప్పిన గురువు సన్నిహితుడు జూనియస్ రస్టికస్ అనే స్టోయిక్కు ఇందుకు కారణం. అతడే ఎపిక్టెటస్ ను అరీలియస్ కు పరిచయం చేసాడు. తన దగ్గర ఉన్న ఎపిక్టెటస్ రచనల సంపుటాన్ని అరీలియస్ కు ఇచ్చాడు. అందుకు గాను అరీలియస్ అతడికి జీవితమంతా ఋణపడ్డానని చెప్పుకున్నాడు..

తన కుటుంబపెద్దలనుంచీ, గురువులనుంచీ, స్నేహితులనుంచీ, పూర్వపు స్టోయిక్కు తత్త్వవేత్తలనుంచీ మార్కస్ అరీలియస్ ఒక philosopher గా జీవించాలనే కోరికనీ, అలా జీవించడానికి అవసరమైన శిక్షణనీ, మనఃస్థితినీ పొందినట్టుగా మనం గ్రహించవచ్చు. ఆయనకి రోమన్ పౌరులు ఇచ్చిన అనేక బిరుదుల్లో philosophus అనేది కూడా ఒకటి. కాని అప్పటి రోమన్లకు అరీలియస్ మెడిటేషన్స్ అనే పుస్తకం రాసినట్టు తెలీదు. నిజానికి ప్రాచీన గ్రీకు, రోమన్ సంస్కృతుల్లో ఒక మనిషి రాసిన పుస్తకాలవల్లా, చేసిన చర్చల వల్లా కాక, అతడు జీవించిన విధానం వల్ల మాత్రమే అతణ్ణి philosopher గా గుర్తించేవారు. ఇందుకు గొప్ప ఉదాహరణలు సోక్రటీస్, ఎపిక్టెటస్ లే. వాళ్ళిద్దరూ ఏ పుస్తకాలూ రాయలేదు. కాబట్టి అరీలియస్ తనకై తాను ఏ విలువల్ని రాసుకుంటూ ఉన్నాడో అటువంటి విలువల్ని తన నిత్యజీవితంలో కనపరిచేడనీ, కాబట్టే, ఆయన్ని రోమన్లు philosopher అని పిలిచేరనీ మనం నమ్మవచ్చు.

మెడిటేషన్స్ మొదటి అధ్యాయంలో చివరి కృతజ్ఞతా సమర్పణ దేవతలకు చెప్పుకున్న ధన్యవాదాలు. పైన ఇచ్చిన వివరణల నేపథ్యంలో, ఆ ధన్యవాద వాక్యాల్ని చదివితే మార్కస్ అరీలియస్ దేనిగురించి ఆరాట పడ్డాడో మనకి అర్థమయిపోతుంది.

చూడండి, ఆ వాక్యాలు (1:17), నా తెలుగులో.

దేవతలకి నేను చాలా ఋణపడి ఉంటాను. నాకు మంచి తాతల్ని, తల్లితండ్రుల్ని, మంచి సోదరిని, మంచి ఉపాధ్యాయుల్ని, మంచి సన్నిహితుల్ని, మంచి బంధువుల్ని, స్నేహితుల్ని, దాదాపుగా ప్రతి ఒక్కరినీ మంచి వారిని అనుగ్రహించినందుకు. నేను వాళ్ళ పట్ల ఎటువంటి తప్పిదం చేసే పరిస్థితిలో పడనందుకు మరిన్ని ధన్యవాదాలు. నా మనఃస్థితి ప్రకారం చూస్తే నేను అటువంటి తప్పిదాలు ఏవో ఒకటి చెయ్యడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాని నా పెద్దల మంచితనం నన్ను అటువంటి పరిస్థితులనుంచీ, అటువంటి పరీక్షలకు నిలబడవలసిన అవసరం నుంచీ తప్పించింది.

నేను నా తాతగారి ఉంపుడుగత్తె పెంపకంలో పెరిగి పెద్దయ్యే పరిస్థితి లేకుండా చేసినందుకు కూడా దేవతలకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా యవ్వనంలోని పవిత్రతను కాపాడుకోగలిగినందుకు, యుక్తవయస్సు రాకపూర్వమే నా యవ్వనాన్ని పరీక్షించుకోనందుకు, అది కూడా తగిన సమయం వచ్చేదాకా ఆగగలినందుకు ఎంతో ధన్యుణ్ణి.

నన్ను అన్నిరకాల అధికార మదం నుంచి తప్పించిన ఒక తండ్రి, ఒక చక్రవర్తి పాలనలో పెరిగినందుకు, అంగరక్షకులు, చీనిచీనాంబరాలూ, దివిటీలు, వైభవాలూ, ఇంకా అలాంటివే ఆడంబరాలేవీ అవసరంలేని భవంతిలో నన్ను ఆయన పెంచి పెద్దచేసినందుకు కృతజ్ఞుణ్ణి. తాను ఒక వైపు రాజుగా నిర్వహించవలసిన అధికారిక బాధ్యతలకు ఎటువంటి భంగం వాటిల్లకుండానే నాతో ఒక కుటుంబ వ్యక్తిగా సన్నిహితంగా మెలిగాడు ఆయన.

నాకు లభించిన సోదరుణ్ణి చూసి నన్ను నేను ఎప్పటికప్పుడు మరింత మెరుగుపర్చుకుంటూ వచ్చాను. అతడు కూడా ఎప్పటికప్పుడు నా పట్ల గౌరవాన్నీ, అభిమానాన్నీ చూపిస్తూనే వచ్చాడు. అటువంటి సోదరుడు లభించినందుకు దేవతలకు ధన్యవాదాలు.

నాకు చక్కటి పిల్లలు పుట్టినందుకు. వాళ్ళు మందబుద్ధులుగానో, వికలాంగులుగానో పుట్టనందుకు కూడా ఎంతో ధన్యుణ్ణి.

వాక్చాతుర్యంలోనూ, కవిత్వంలోనూ, తక్కిన శాస్త్రాల్లోనూ చెప్పుకోదగ్గ ప్రావీణ్యం సంపాదించలేకపోయినందుకు కూడా దేవుళ్ళకి నమస్కరిస్తున్నాను. ఒకవేళ నేను ఆ విద్యలకే పూర్తిగా అంకితమై ఉంటే పూర్తి ప్రావీణ్యం సంపాదించి ఉండేవాణ్ణి. అది వేరే సంగతి. అలాగే చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన గురువులకి తగిన పదవులు ఇవ్వగలిగినందుకూ, వాటిని వాళ్ళు ఇష్టపడ్డందుకూ కూడా ధన్యుణ్ణి. వాళ్ళు కూడా వయసులో చిన్నవాళ్ళే కాబట్టి, వాళ్లకి ఆ గౌరవాన్నివ్వడం మరొకరోజుకి వాయిదా వెయ్యనందుకు కూడా నాకు సంతోషంగా ఉంది. అప్పొలొనియస్, రస్టికస్, మాక్సిమస్ లు వ్యక్తిగతంగా తెలిసినందుకు, నా ఆత్మస్వభావానికి అనుగుణంగా జీవిచడమెలానో వారినుంచి తెలుసుకున్నందుకు, అలా జీవించిన జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నందుకు కూడా ధన్యుణ్ణి.

దేవతలమీద ఆధారపడ్డందుకు, వారి నుంచి ఎప్పటికప్పుడు ఆశీస్సులూ, అభినందనలూ, ఆదరణా లభిస్తున్నందువల్ల నా ఆత్మస్వభావానికి అనుగుణంగా జీవించడానికి నాకు ఎటువంటి అడ్డంకీ లేకపోయింది. ఒకవేళ ఆ దారిలో నేనేదైనా వెనకబడితే అది నా లోపంవల్లనేకాని దేవతల ఆగ్రహానికి గురయినందువల్ల మాత్రం కాదు. వారి ఆదేశాల్ని పాటించడం వల్లనే నా శరీరం ఇన్నేళ్ళుగా పూర్తి ఆరోగ్యంతో మనగలుగుతూ ఉంది.

నా ఇంట్లో పనిచేసే పరిచారకులు బెనెడిక్టా, థియొడటస్ లను నేను ఎన్నడూ తాకనందుకు, ఒకవేళ వాళ్ల పట్ల ఏవైనా శారీరిక వాంఛలు తలెత్తి ఉంటే మరుక్షణమే వాటినుంచి బయటపడగలిగినందుకు కూడా ధన్యుణ్ణి. నా గురువు, సన్నిహితుడు రస్టికస్ తో అప్పుడప్పుడు తగాదా పడినా కూడా నేను అతడి మీద నా కోపాన్ని మరీ అతిగా చూపించనందుకు కూడా సంతోషిస్తున్నాను. లేకపోతే తర్వాత రోజుల్లో చాలా చింతించవలసి ఉండేది.

తన చిన్నవయసులోనే మా అమ్మ స్వర్గస్తురాలుకావడం విధివిలాసమే అయినప్పటికీ, ఆమె తన చివరి రోజుల్లో నా దగ్గర ఉండటం నా భాగ్యం. ఎప్పుడైనా ఎవరికైనా అవసరమైనప్పుడు వారికి సాయం చెయడానికి నాకు అవకాశం లేదని ఎవరూ చెప్పకపోవడం నా అదృష్టం. అలాగే మరొకరి సహాయాన్ని అర్థించవలసిన అవసరం లేకుండా చేసినందుకు కూడా నేను దేవుళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎంతో వినయసంపన్నురాలు, అనురాగవతి, సరళస్వభావి అయిన భార్య దొరికినందుకూ, నా పిల్లలకి చక్కటి గురువులు పుష్కలంగా దొరికినందుకూ కూడా కృతజ్ఞుణ్ణి. ఎప్పుడైనా తీవ్ర అనారోగ్యంపాలయినప్పుడు, కళ్ళు తిరిగినప్పుడో, కక్కుకున్నప్పుడో నాకు కలలో కనిపించి పరిష్కారాలు చెప్పినందుకు కూడా దేవతలకి ఋణపడి ఉంటాను.

ముఖ్యంగా నా దృష్టిని తత్త్వశాస్త్రం వైపు మళ్ళించినందుకు, నేను ఏ సోఫిస్టుల చేతుల్లోనూ పడనందుకు, చరిత్రగ్రంథాలు రాయడంలోనో, తార్కిక వాదవివాదాల్లోనో, లేదా స్వర్గనరకాల మీమాంసలోనో నా కాలాన్ని వృథాచెయ్యనివ్వనందుకూ దేవతలకి సదా ఋణపడి ఉంటాను. ఎందుకంటే ఈ చర్చలూ, రచనలూ చెయ్యాలంటే దేవతల అనుగ్రహం తప్పనిసరి, మనకి ఆ ప్రాప్తం కూడా ఉండాలి మరి.

30-10-2022

4 Replies to “మెడిటేషన్స్-3”

  1. మార్కస్ లా మేము కూడ మీకు ఎంతో ఋణపడి ఉన్నము సార్ 🙏

Leave a Reply

%d bloggers like this: