
శరత్కాలపు అపరాహ్ణం. దూరంగా రోడ్డు పక్క నిండుగా విరబూసిన కోవిదార వృక్షం. లేత ఎరుపు పూల గుత్తులమీద తూనీగలు. ఆ బహీనియా పరిమళం మేడలూ, మిద్దెలూ దాటి కిటికీలోంచి నా మీద ప్రసరిస్తూ ముంచెత్తుతూ ఉన్నది. ఆ సుకోమలమైన సౌరభం నన్ను తాకుతున్నదని నాకు తెలుస్తున్నందుకు నాకెంతో సంతోషంగా అనిపించింది. నువ్వు దేనిలోనూ కూరుకుపోలేదనీ, పూలగాలి నిన్ను పలకరిస్తే దోసిలిపట్టి నిలబడటానికి సంసిద్ధంగా ఉన్నావనీ తెలియడంలో గొప్ప అస్తిత్వానందం ఉంది.
ఇన్నేళ్ళ ఉద్యోగ జీవితం నన్ను పూర్తిగా మొద్దుపరచలేదని అర్థమవుతున్నది. మార్కస్ అరీలియస్ ఇలా రాసుకున్నాడు (మెడిటేషన్స్, 6:30):
వాళ్ళు నిన్నొక సీజరుగా మార్చకుండా జాగ్రత్తపడు. నీ దుస్తులకి రాజలాంఛనాలు తగిలించకుండా చూసుకో. నిరాడంబరంగా, మంచిగా, నిర్మలంగా, గంభీరంగా, ఎట్లాంటి నటనలూ లేకుండా మసలుకో. న్యాయానికి మిత్రుడిగా, దేవతలకి విధేయుడిగా, దయగా, అనురాగపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించు. నువ్వు చేసే పనులన్నిటిలోనూ సాహసవంతుడిగా ఉండు. నిన్ను తత్త్వశాస్త్రం ఎటువంటి మనిషిగా రూపొందించాలనుకున్నదో అటువంటి మనిషివి కావడానికి ప్రయత్నించు. దేవుళ్ళని ప్రార్థించు, మనుషులకి సాయం చెయ్యి. జీవితం చాలా చిన్నది. ఈ పార్థివ జీవితానికి ఒకటే ఫలం- మనసు నిర్మలంగా ఉంచుకోవడం, నలుగురికి పనికొచ్చే పనులు చేయడం.
నా ఉద్యోగ జీవితం నన్నొక సీజరుగా మార్చకుండా నన్ను కాపాడింది భగవంతుడి అనుగ్రహమే. అటువంటి అనుగ్రహం ఉందని గుర్తుపట్టడం కూడా ఒక అనుగ్రహమే. ఇదిగో, పొద్దు వాటారబోతున్న ఈ వేళ కిటికీలోంచి నన్ను తాకుతున్న కోవిదార పూల తావిలాగా.
ఆ మధ్య వైజాగ్ వెళ్ళినప్పుడు పేజెస్ లో మార్కస్ అరీలియస్ ‘మెడిటేషన్స్’ కొత్త అనువాదం కనబడింది. పీజియన్ బుక్స్, 2020. చాలా ఏళ్ళ కిందట పాశ్చాత్య తత్త్వశాస్త్రాన్ని పరిచయం చేస్తూ నేను వెలువరించిన ‘సత్యాన్వేషణ’ (2003) లో స్టోయిక్ తత్త్వశాస్త్రం గురించి పరిచయం చేసి, కొందరు స్టోయిక్కుల రచనలనుంచి కొన్ని వాక్యాలు తెలుగులో అనువదించకపోలేదు. అలాగే పదేళ్ళ కిందట ఎపిక్టెటస్ గురించి కూడా ఒక పరిచయం రాసాను. కాని ఈ పుస్తకం తెచ్చుకున్నప్పటినుంచీ అరీలియస్ భావాల్నీ, ఈ ప్రపంచంలో మనిషి ఆత్మస్థైర్యాన్ని అలవర్చుకోవడానికి ఆయన రాసుకున్న సూత్రాల్నీ మీతో వివరంగా పంచుకోవాలనిపిస్తూ ఉంది.
మెడిటేషన్స్ పన్నెండు అధ్యాయాల గ్రంథం. కాబట్టి ముందు ఆ గ్రంథం గురించీ, ఆ రచయిత గురించీ స్థూలంగా పరిచయం చేస్తూ, ఒక్కొక్క అధ్యాయం గురించీ ఒక్కొక్క పరిచయ వ్యాసం రాయాలని అనుకుంటున్నాను. చివరలో రాసినదాన్ని పునశ్చరణ చేస్తూ మరొక వ్యాసం రాస్తాను.
మార్కస్ అరీలియస్
రోమన్ సామ్రాజ్యాన్ని హద్రియన్ అనే చక్రవర్తి పరిపాలించినరోజుల్లో ఆయనకి సంతానం లేదు. ఒకతణ్ణి దత్తత తీసుకోవాలి అనుకున్నాడు. కాని అతడు కూడా మరణించాడు. అప్పుడు ఆంటోనేనస్ పియస్ అనే ఆయన్ని దత్తత తీసుకున్నాడు. కాని చిన్నవయసులోనే తండ్రిని పోగొట్టుకున్న మార్కస్ అరీలియస్ నీ, తాను ముందు దత్తత తీసుకోవాలనుకున్న ఏలియస్ సీజర్ కొడుకు లూసియస్ నీ దత్తత తీసుకోవాలని షరతు పెట్టాడు. ఆ విధంగా మార్కస్ అరీలియస్ రాజగృహంలోకి ప్రవేశించాడు. అంటోనెనియస్ పియస్ తన తరువాత మార్కస్ అరీలియస్ చక్రవర్తి బాధ్యతలు స్వీకరిస్తాడని సెనేట్ కి చెప్పాడు. అతడు 161 లో మరణించినప్పుడు మార్కస్ అరీలియస్ తనతో పాటు తన దత్తత సోదరుడు లూసియస్ ని కూడా చక్రవర్తిగా ప్రకటించాడు. దాంతో రోమన్ సామ్రాజ్యానికి మార్కస్, లూసియస్ ఇద్దరూ చక్రవర్తులుగా కొనసాగారు. అయితే లూసియస్ 169 లో అకాలంగా మరణించడంతో మార్కస్ అరీలియస్ ఒక్కడే చక్రవర్తిగా పాలించవలసి వచ్చింది. ఆ విధంగా ఆయన 161 నుండి 189 లో మరణించేదాకా దాదాపు ఇరవయ్యేళ్ళపాటు రోమన్ చక్రవర్తిగా పాలన సాగించాడు.
రోమ్ చరిత్రకు సంబంధించిన పండితుడు గిబ్బన్ దృష్టిలో సా.శ.96 నుంచి 180 దాకా ఎనభయ్యేళ్ళ పాటు రోమన్ పాలన రోమ్ చరిత్రలోనేకాక ప్రపంచ చరిత్రలో కూడా సువర్ణ అధ్యాయం. రోమ్ ని పాలించిన అయిదుగురు ఉత్తమ చక్రవర్తుల్లో అరీలియస్ చివరివాడే కాక, అతడి మరణంతోటే ఆ స్వర్ణయుగం కూడా అంతమైపోయింది.
మార్కస్ చక్రవర్తి కాకముందు, అతడి మేనమామ పెంపకంలో చేరగానే రాజకుటుంబీకులకి లభించే ఉన్నత విద్య అతడికి లభించింది. గ్రీకు, లాటిన్ భాషల్లోనూ, సాహిత్యం, అలంకార గ్రంథాలు, తత్త్వశాస్త్రం,న్యాయశాస్త్రాల్లోనూ, చిత్రకళలోనూ, యుద్ధకౌశల్యాల్లోనూ శిక్షణ లభించింది. కొన్నాళ్ళు స్టోయిక్కుల పద్ధతిలో తాపస జీవితం కూడా జీవించాడు.
ఆంటోనెనియస్ చక్రవర్తిగా ఉన్నప్పుడు మార్కస్ విద్యార్థి జీవితం గడిపినప్పుడు రోమ్ శాంతిని చవిచూసింది. కాని అరీలియస్ రాజు అయినతర్వాత అతడి సామ్రాజ్యాన్ని ఊహించని ఉపద్రవాలు చుట్టుముట్టాయి. ఇటలీలో వరదలు, కరువు, ఆసియాలో భూకంపం, ఉత్తర దిక్కున తిరుగుబాట్లు, బ్రిటన్ లో సామంతుల విద్రోహం- వీటన్నిటినీ అతడు ఎదుర్కోవలసి వచ్చింది. ఇంతకన్నా పెద్ద సమస్య రాజ్యం నలుమూలలా తలెత్తిన తిరుగుబాట్లు. ముఖ్యంగా డాన్యూబ్ నదికి ఉత్తరాన జర్మన్ల తిరుగుబాట్లు. వాటిని అణచడం కోసం ఆయన మూడేళ్ళ పాటు డాన్యూబ్ తీరంలోనే ఉండిపోవలసి వచ్చింది. చివరి పదేళ్ళూ ఆయన దాదాపుగా రోమ్‌కి బయటనే గడిపాడు. అటువంటి యుద్ధయాత్రల్లోనే తన భార్య కూడా మరణించింది. చివరకి తాను కూడా 180 లో డాన్యూబ్ తీరంలో అనారోగ్యంతో మరణించాడు.
అయితే అతడు చక్రవర్తిగా పాలనాబాధ్యత స్వీకరించినప్పుడే రెండు రాజ్యాలమీద పాలన బాధ్యతకు తనని తాను సమాయత్తపరుచుకోవడం మొదలుపెట్టాడు. మొదటి రాజ్యం, రోమన్ సామ్రాజ్యం. రెండవ రాజ్యం తన ఆత్మ సామ్రాజ్యం.
మెడిటేషన్స్
అతడి జీవితంలోని చివరి ఇరవయ్యేళ్ళల్లోనూ, ఒకవైపు సుశిక్షితుడైన సేనాధిపతిగా, చక్రవర్తిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే మరొక వైపు ఎవరికీ తెలియకుండా తనని తాను ఎప్పటికప్పుడు మానసికంగా, ఆత్మికంగా సరిదిద్దుకుంటూ, కఠోరమైన ఆత్మక్రమశిక్షణ అలవర్చుకుంటూ గడిపేడు. అలా తనని తాను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే క్రమంలో అతడు తనకోసం తాను కొన్ని సూత్రాలు రాసిపెట్టుకుంటూ వచ్చేడు. వాటినే మనం Meditations అని పిలుస్తున్నాం.
మార్కస్ అరీలియస్ రోమన్. కాని తాను రాసుకున్న సూత్రాలు గ్రీకులో రాసుకున్నాడు. ఎందుకంటే అప్పటికి లాటిన్ వ్యవహారభాష, రాజభాష అయినప్పటికీ, గ్రీకునే ఇంకా తత్త్వశాస్త్ర భాషగా కొనసాగుతూ ఉంది. మార్కస్ అరీలియస్ గ్రీకులో తనకోసం అటువంటి కొన్ని ఆదేశసూత్రాలు రాసిపెట్టుకున్నట్టుగా అతడి సమకాలికులకి గాని, చివరికి కొడుక్కి కూడా తెలియదు. Meditations గురించి మొదటిసారి మనకు తెలిసిన ప్రస్తావన ఆయన మరణించిన మూడు వందల ఏళ్ళ తరువాత కనిపిస్తున్నది. ఆ తర్వాత మరొక వెయ్యేళ్ళ పాటు ఆ గ్రంథం గురించి ఎవరికీ తెలియదు. కాన్ స్టాంటినోపుల్ తురుష్కుల వశమయ్యాక, అక్కణ్ణుంచి యూరోప్ కు తరలివచ్చిన జ్ఞానసంపదలో భాగంగా మెడిటేషన్స్ రాతప్రతి కూడా తరలి వచ్చింది. దాన్ని మొదటిసారిగా పదహారో శతాబ్దంలో పుస్తకంగా ముద్రించారు. ఇక అప్పణ్ణుంచీ అది సత్యాన్వేషకులపాలిట పెన్నిధిగా మారిపోయింది. ఇరవయ్యవశతాబ్దంలో దానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనువాదాలు రావడమే కాక, మరీ ముఖ్యంగా, గత యాభై ఏళ్ళుగా అది వ్యక్తిత్వ వికాస గ్రంథంగా కొత్త ప్రశస్తిని సముపార్జించుకుంటూ వుంది.
Meditations అనే పేరుతో పిలుస్తున్నప్పటికీ, అందులో రాసుకున్న నోట్సుకీ ధ్యానానికీ ఏమీ సంబంధం లేదు. వాటికి మార్కస్ పెట్టుకున్న పేరు Address to Himself అంటే తనకోసం తాను లేదా తనకి తాను చెప్పుకున్నవి అని అనుకోవచ్చు. వాటి గురించి మనకు లభిస్తున్న ప్రస్తావనల్లో మొదటిది అని చెప్పదగ్గది క్రీ.శ నాల్గవ శతాబ్దం నాటి ప్రస్తావన. ఆ పుస్తకం గురించి మాట్లాడిన ఒక తాత్త్వికుడు వాటిని exhortations అన్నాడు. అంటే ఉపదేశాలు అనుకోవచ్చు. మరీ సూటిగా చెప్పాలంటే మందలింపులు అనుకోవచ్చు. ప్రపంచ సాహిత్యంలో మరే తాత్విక రచనకీ లేని ప్రత్యేకత ఈ గ్రంథానికి ఇదే అని చెప్పవచ్చు. అదేమంటే ఉపనిషత్తులు, ప్లేటో సంభాషణలు మొదలైనవి ఇద్దరు ముగ్గురిమధ్య లేదా అంతకన్నా ఎక్కువమంది మధ్య నడిచిన సంవాదాలు. తక్కిన తాత్త్విక రచనలు, అంటే బుద్ధుడి సంభాషణలవంటివి, అరిస్టాటిల్ రచనల వంటివి ఎవరో ఒకరిని ఉద్దేశించి చేసిన ప్రసంగాలు లేదా ఉపదేశాలు. కాని మెడిటేషన్స్ ఆత్మతో చేసుకున్న సంభాషణలు. ఆత్మసంవాదాలు.
ఇవి తనకి తాను చెప్పుకున్న హితోపదేశాలు కాబట్టి, వాదవివాదాల్లో పాల్గొని మరొకర్ని ఒప్పించవలసిన బాధ్యత, బరువు వీటికి లేవు. నిజానికి ఇందులో కొత్త సత్యాలంటూ కూడా ఏమీ లేవు. ఉన్న సత్యం ఒక్కటే. అది మానవుడి మర్త్యత్వం. జీవితం అశాశత్వం. అలాగని అర్థరహితం కాదు. జీవించక తప్పదు. కాని జీవించవలసిన ఆ జీవితాన్ని మరింత క్రమశిక్షణతో, అతి తక్కువ క్లేశంతో గడపడం ఎలా అన్నదే వాటి లక్ష్యం.
ఇవి డైరీలు కూడా కావు. లేదా రోజు మొదలుపెడుతూనే ఒక నవీన సంతోషాన్ని స్వాగతించాలనుకునే జర్నల్ కూడా కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఇదొక exercise book. Spiritual exercises. బాగా ఊపిరి పీల్చి వదులుతూ, రక్త ప్రసారం మరింత సక్రమంగా ఉండటానికి మనం అనుదినం చేసే వ్యాయామాల గురించి పుస్తకం రాసుకుంటే ఎలా ఉంటుందో అటువంటి పుస్తకం అన్నమాట. కాని ఈ వ్యాయామం శరీరానికి కాదు, మనసుకి, బుద్ధికి, హృదయానికి, ఆత్మకి. సక్రమంగా జీవించాలంటే ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో మనకి తెలుసు. కాని ఆ తెలిసిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పుకునే మానసిక హితబోధ ఇది. అష్టాంగ యోగాన్ని ఉపదేశించిన బుద్ధుడూ, కొండ మీద ప్రసంగం చేసిన యేసుక్రీస్తూ తమకోసం తాము పుస్తకం రాసుకుని ఉంటే అది ఇలానే ఉంటుందని చెప్పగలం.
ఇందులో రెండు కంఠాలు వినిపిస్తాయి. ఒకటి తనలోని బలమైన వ్యక్తిత్వం. ప్రలోభాలకు లొంగని మనిషి. రెండవ కంఠం తనలోని బలహీన వ్యక్తిత్వం. తనలోని ఉన్నత పార్శ్వం తనలోని దుర్బల పార్శ్వాన్ని ఎప్పటికప్పుడు మందలించుకుంటూ, దారి చూపిస్తూ, కర్తవ్యాన్ని చెప్పడం ఈ గ్రంథం స్వభావం. ఒక విధంగా ఇది కూడా భగవద్గీతనే. అయితే ఇక్కడ పార్థుడూ, పార్థసారధీ ఒక్కరే.
29-10-2022
కిటికీలోంచి నన్ను తాకుతున్న కోవిదార పూల తావిలాగా.
Thank you very much for reading this!
Thanks Sir🙏