పాకుడు రాళ్ళు

నాటకం ఏడింటికి. ‘రంగభూమి’లో అడుగుపెట్టేటప్పటికి 7.03. శ్రీనివాస రాజు నాకోసం టిక్కెట్టు తీసుకున్నాననీ, గేటు దగ్గర పేరు చెప్తే చాలనీ అన్నాడు. హడావిడిగా గేటు తీసుకుని లోపలకి అడుగుపెడుతూ గుమ్మం దగ్గర ఉన్నమనిషితో నాకు టిక్కెట్టు తీసుకున్నారని చెప్తూ నా పేరు చెప్పాను. కాని ఎక్కడ నిలబడతారు, హౌస్ ఫుల్ అన్నాడు ఆ కుర్రవాడు. లోపల అడుగుపెట్టి చూద్దును కదా, నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. అక్కడ పాదం మోపడానికి కూడా చోటు లేదు. కుర్చీలన్నీ నిండిపోగా ఎక్కడ ఖాలీ ఉంటే అక్కడ కూర్చున్నవాళ్ళు కూర్చున్నారు, నిలబడ్డవాళ్ళు నిలబడి ఉన్నారు.

నా అదృష్టం కొద్దీ ఇంకా నాటకం మొదలవలేదు.

శ్రీనివాసరాజుకి ఫోన్ చేసాను. అతడు రెండవ వరసలో లేచి నిలబడి నన్ను ముందుకు రమ్మంటో చెయ్యూపాడు. తక్కినవాళ్లంతా నన్ను అసూయగా చూస్తుండగా వాళ్ళ మధ్యనుంచి చోటు చేసుకుంటూనే రెండవవరస వైపు కదిలాను.

పాతికేళ్ళుగా ఎదురుచూస్తున్నాను ఇట్లాంటి రోజు కోసం. ఒక నాటకం కోసం ప్రేక్షకులు ఇలా విరగబడే రోజు కోసం.

నిభా థియేటర్ ఎన్ సెంబుల్ వారు రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళు నవలని నాటకంగా మలిచిన ప్రదర్శన. గంటా నలభై అయిదునిమిషాల ఏకబిగి నాటకం. సమయం ఎలా ప్రవహించిపోయిందో తెలియలేదు. నాటకం పూర్తయ్యేసరికి దాదాపు పది నిముషాల పాటు ఆగకుండా కరతాళధ్వనులు. ఈలలు, కేకలు. రంగస్థల బృందాన్ని పరిచయం చేసాక కూడా ప్రేక్షకులు లేవల్లేదు. తామొక అపురూపమైన ritual ఒకదాంట్లో పాల్గొన్నట్టూ, ఆ అనుభూతి ఏదో తాము ఇంకా తమలోకి ఇంకించుకున్నట్టూ అలానే కూచుండిపోయారు. నటీనటులు, సాంకేతిక బృందం పరిచయాలు పూర్తయ్యాక దర్శకురాలు నస్రీన్ ఇషాక్ ని మాట్లాడమన్నప్పుడు ఆమె కూడా రెండుమూడు నిమిషాల పాటు మాటల కోసం వెతుక్కున్నది. ‘ఈ స్పందన నాకు నమ్మశక్యం కాకుండా ఉన్నది. ఈ ఆదరణని నేనింకా నాలోకి ఇంకించుకునే ప్రయత్నంలోనే ఉన్నాను’ అందామె.

దాదాపు ఆరువందల పేజీల నవలని నలుగురు యువతీయువకులు పది యూనిట్ల నాటకంగా స్టేజి ప్లే రాసుకున్నారు. సన్నివేశం వెనక సన్నివేశం episodic పంథాలో కథ చెప్పుకుంటూ, సాంప్రదాయిక సన్నివేశాల్నీ, ఆధునిక థియేటర్ టెక్నిక్స్ నీ, సురభి ప్రత్యేకతల్నీ కలగలుపుకోవడంతో పాటు నాలుగైదు పాటలు కూడా చేర్చుకున్నారు. గుంటూరు దగ్గర పల్లెటూళ్ళల్లో నాటకాల కంపెనీ వాతావరణం మొదలుకుని, మంగమ్మ అనే ఒక యువతి మంజరిగా మారి మద్రాసులో కాలూని తెలుగు చలనచిత్రరంగాన్ని శాసించడంతో పాటు బాలీవుడ్ లో విజయాలు నమోదు చేసుకున్న పరిణామాన్ని కళ్ళముందే ప్రవాహసదృశంగా చూపిస్తోపోయేరు. పల్లెటూళ్ళల్లో నాటకాలు ఆడే పద్ధతి, టికెటు కౌంటర్లు, మద్రాసు సినిమామాయాజాలం, బాలీవుడ్ ఇంద్రజాలం మొదలైనవన్నీ కళ్ళకు కట్టిన తీరు గొప్పగా ఉంది.

‘పాకుడు రాళ్ళు’ నవల ఎప్పుడో రాజమండ్రి రోజుల్లో చదివేను. అది ప్రధానంగా ఒక ఏకాకి గురించిన చిత్రణ అని గుర్తున్నది. ఒక పల్లెటూరి పిల్ల మంజరిగా మారడానికి, ఆమె ఒకదానివెనక ఒకటి మెట్లు ఎక్కుతూ ఎంత ఎత్తుకి ప్రయాణిస్తుంటే, అంతగానూ పైకి లేవలేనంత అగాధంలోకి కూరుకుపోతూ ఉండే జీవితం. ఆమెతో పాటు ఆమె చుట్టూ నిర్మాతలు,నటులు, దర్శకులు, ఫైనాన్సియర్లు, పనివాళ్ళు, వేశ్యలు, దొంగలు, పోలీసులు, పాత్రికేయులు, బ్లాక్ మెయిలర్లు, లోఫర్లు, బ్రోకర్లు ఆమెని ఆసరా చేసుకుని పాకుడురాళ్ళ మీద నడిచే ఆ నవలని మరవడం కష్టం. అది ఒకరకంగా నవలగా రాసిన మృచ్ఛకటికం, కన్యాశుల్కం.

కాని నిన్న ప్రదర్శన చూస్తే నాకొక విషయం అర్థమయింది. కన్యాశుల్కం నాటకం ఎన్ని సార్లు చదివినా ఇంకా అవగతం కానిదేదో ఎనిమిది గంటల పూర్తినిడివి ప్రదర్శన చూసినప్పుడు అర్థమయింది. కాని ఆరువందల పేజీల నవల నీకు సూటిగా చెప్పలేనిదాన్ని దేన్నో ఈ రెండు గంటల ప్రదర్శన ఎంతో సూటిగా చెప్పగలిగింది అనిపించింది. అన్నిటికన్నా ముఖ్యం, నవల, నాటకం ఒక ఎత్తూ, నిన్న ప్రదర్శనలో మంజరి పాత్రధారిణి భావన అభినయ విన్యాసం ఒక్కటీ ఒక ఎత్తు. ఆమె చూపుల్లో పలికించిన estranged look నన్ను చాలాకాలమే వెంటాడుతుంది. గంటా నలభై అయిదు నిమిషాల నిడివిలో ఆమె రంగస్థలం మీద లేని నిమిషం లేదు. ఒకరకంగా అది ఆమె ఏకపాత్రాభినయం అన్నా ఆశ్చర్యం లేదు. నాటకం పూర్తయి, నటీనటగణం పరిచయాలు పూర్తయ్యేక, ప్రేక్షకులు లేస్తూండగా, నేను నా ఎదట ఉన్న ముందు వరస కుర్చీలు దాటుకుంటో ఒక్క ఉదుటున స్టేజి మీద అడుగుపెట్టి ఆమెని అభినందించకుండా ఉండలేకపోయాను. కేవలం అభినయ సామర్థ్యం కాదు, ఎంతో energy, stamina ఉంటే తప్ప ఆ విధంగా నటించడం కష్టం. గ్లిజరీన్ అవసరం లేకుండానే కన్నీళ్ళు పెట్టగల ఒక మహానటి గురించి విన్నాం. నిన్న ప్రత్యక్షంగా చూసాను. అటువంటి కళాకారిణి కోసం నాటకరంగం ఒక యుగం పాటు వేచి ఉండగలదని చెప్పవచ్చు.

అలాగని తక్కినవారిని తక్కువచేయలేం. శ్రీనివాసరాజు స్వయంగా దర్శకుడు. నాటకం పూర్తవగానే అతడు నాతో అన్నమాట: ‘ఇది artists drama. మొత్తం ప్రదర్శనలో డైరక్టరుకి ఇరవై మార్కులు, కళాకారులకి ఎనభై మార్కులు వేస్తాను’ అన్నాడు. ఒప్పుకోదగ్గ మాటనే.

దర్శకురాలు నస్రీన్ ఇషాక్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో 1999 లో గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారు. హైదరబాద్ విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫాకల్టీగా పనిఏసారు. ఇంతకుముందు షేక్ స్పియర్ ‘మేక్బెత్’ ను, చలం ‘మైదానం’ ను కూడా ప్రదర్శించారు. రంగస్థల స్థలాన్నీ, సమయాన్నీ ఆమె వినియోగించుకున్న తీరు, theatrical effects, సౌండ్, లైట్, ప్రాప్స్ మొదలైనవాటిని వాడుకున్న పద్ధతి ఆమె ప్రావీణ్యాన్ని చెప్తూనే ఉన్నాయి. స్త్రీని డబ్బు సంపాదించిపెట్టే సాధనంగా సమాజం చూడటం మొదలుపెట్టగానే ఆమె చుట్టూ మనుషులు అదృశ్యమై, mob తయారయ్యే క్రమాన్ని ఆమె ఎంతో సమర్థవంతంగా చూపించగలిగింది. నాటకం చివరకు వచ్చేటప్పటికి మంజరి మాట్లాడిన ఈ మాటల దగ్గరికి వచ్చేటప్పటికి, మంజరి ఏకకాలంలో public, private జీవితాలు రెండింటినీ మోస్తో, ఆ బరువుకింద ఎలా కుంగిపోతూ ఉన్నదో మనం పూర్తిగా అనుభూతి చెందుతాం. ఈ మాటలు:

‘జీవితంలో విషాదం డబ్బులేకపోవడం కాదు, మనల్ని ప్రేమించేవాళ్ళు లేకపోవడం. మనం ప్రేమించడానికి ఎవ్వరూ దొరక్కపోవడం. ‘

నవల ఇక్కడితో ముగిసింది. కాని నాటకంలో మంజరి ఆత్మహత్య చేసుకోగానే మళ్ళా రంగస్థలమంతా అన్నిరకాల ముఖాలతో mob ప్రత్యక్షం కాగానే, వాళ్ళతో పాటు దర్యాప్తు కోసం వచ్చిన పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ‘ఆమె స్వగ్రామం ఏది? ఆమె తల్లిదండ్రులు ఎవ్వరు? ‘అని ప్రశ్నించినప్పుడు రంగస్థలమంతా ఘనీభవించిన నిశ్శబ్దం. ఇప్పుడు మాట కూడా శిలగా మారిపోయిందని చెప్తాడు నెరేటర్.

సమకాలిక జీవితంలో ఈ నవలకూ, నాటకానికీ ఎంతో ప్రాసంగితక ఉందనీ, అందుకనే దీన్ని తాము ఎంపికచేసుకున్నామని బ్రోచర్ లో రాసుకున్నారు. అవును. Public space లో, అది కూడా సినిమా రంగంలో ఉన్నవారి పట్ల మన చూపు, మన మోజు, మన బహిరంగ, రహస్యోద్రేకాలు మునుపటికన్నా మరింత తీవ్రతరం అవుతున్న కాలంలో ఉన్నాం మనం. కాని ఒక నటిగురించో, ఒక సినిమా గురించో అవసరమైనదానికన్నా మనం ఎక్కువ మాట్లాడుకునే ప్రతి ఒక్క మాటా ఆ నటినో, ఆ కళాకారుణ్ణో మరింత estrangement కి గురిచేస్తుందని గుర్తుపెట్టుకుంటే చాలు. రెండు గంటల నాటకం తర్వాత ఈ insight కలక్కుండా బయటికి రావడం కష్టం.

31-10-2022

One Reply to “పాకుడు రాళ్ళు”

  1. సినీ జీవితాలని ప్రధానంగా రచించిన నవల అయినా మీరన్నట్టు సమకాలీన అంశాలను చక్కగా చెప్పారు రావూరి వారు. ఈ నవలని చిన్న నాటకంగా తీసుకురావడం పెద్ద సాహసమే. విజయవంతం అయితే తప్పక అభినందనీయమే

Leave a Reply

%d bloggers like this: