తుమ్ రాధే బనో శ్యామ్

Reading Time: 3 minutes

ఇంటికి వచ్చేటప్పటికి వీథంతా పున్నాగ పూల పరిమళంతో నిండిపోయి ఉంది. అప్పటిదాకా విన్న కబీర్, టాగోర్ గీతసునాదం నా మనసుని ఇంకా ఒక భ్రమరంలాగా అంటిపెట్టుకుంది. మరీ ముఖ్యంగా  ‘తుమ్ రాధే బనో శ్యామ్..’

‘ఈ రోజు లా మకాన్ లో కళా బితాన్, హైదరాబాద్ వారు కబీర్, టాగోర్ ల మానవతావాదం, మిస్టిసిజం అనే అంశం మీద ఒక స్వరాంజలి సమర్పిస్తున్నారు, వస్తారా’ అని ఆదిత్య మెసేజి పెట్టాడు మొన్న. అందులో ఒక్కరి పేరున్నా కూడా, అది ఎంత దూరంలో ఉన్నా కూడా వెళ్ళకుండా ఉండను, అట్లాంటిది, కబీరు, టాగోర్ ఇద్దరి కవిత్వమూ వినే అవకాశం ఎలా వదులుకుంటాను?

నా ఆశలు వమ్ముకాలేదు. ప్రోగ్రాము 7.30 కి అని ఉంది కాని నేను పావుగంట ఆలస్యంగా చేరుకున్నాను. కాని ఆ బృందం ఇంకా మైకులు సరిచేసుకుంటున్నారు. ‘మీ కోసమే ఆగినట్టున్నారు’ అన్నాడు ఆదిత్య.

ఆ బృందంలో సోహిని అనే ఆమె గతంలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజిలో ఫాకల్టీ గా పనిచేసారు. ఆమె కబీరు, గాంధి, టాగోర్ లు ముగ్గురూ దీన, దరిద్ర, దళిత భారతదేశానికి ఎటువంటి ఆశని, ఓదార్పునీ అందించారో వివరంగా చెప్తూ ఆ తర్వాత ప్రతి గీతానికీ ముందు చిన్న చిన్న వివరణలు ఇస్తూ ఉన్నారు. ఆమె వివరణల తర్వాత కబీరు, నరసీ మెహతా, కృష్ణ భక్తిగీతాల్ని బర్నౌలి భట్టాచార్య అనే ఆమె ఆలపించారు. టాగోర్ గీతాల్ని లహరి భట్టాచార్య అనే ఆమె ఆలపించారు. అభిజిత్ తబలా, సురీందర్ వేణువు తో వారికి సహకరించారు.

మొదటగా బర్నౌలి భట్టాచార్య గాంధీజీని స్మరిస్తూ ఆయనకి ఎంతో ఇష్టమైన నరసీ మెహతా కృతి ‘వైష్ణవ జనతో తేనే కహియే..’ని ఆలపించారు. గంటకు పైగా సాగిన ఆ స్వరాంజలిని చివరగా మరలా బర్నౌలి కబీరు దోహాలతో ముగించారు. ఆమెది తారస్థాయి కంఠస్వరం. ఆమె ఆలపిస్తున్నంతసేపూ హైదరాబాదు మొత్తం నిశ్చలంగా నిలబడిపోయిందని చెప్పవచ్చు. రవీంద్ర సంగీత్ ఆలపించిన లహరిది సుకోమల స్వరం. ఆమె టాగోర్ గీతాలు ఆలపిస్తున్నప్పుడు మనసు శరత్కాల కాశవనాల్లో తిరుగాడుతూనే ఉంది.

మహిమాన్వితమైన ఆ కవిత్వాలు, మనోహరమైన ఆ స్వరలకు సోహిని ఇస్తూ వచ్చిన వ్యాఖ్యానం ఎంతో భావస్ఫోరకంగా ఉంది. ఆమె కబీరునూ, టాగోర్ ను పోలుస్తూ చేసిన ఎన్నో పరిశీలనలు ఎంతో ఉన్నతస్థాయి సాహిత్యాభిరుచికి అద్దం పడుతూ ఉన్నాయి. ఆమె చెప్తున్నదాన్ని బట్టి కబీరు కవిత్వంలో మట్టివాసన ఎక్కువ. ఒక కుమ్మరి కుండ చేసినట్టుగా, ఒక వడ్రంగి కొయ్యనరికి పీట తయారు చేసినట్టుగా, ఒక తోటమాలి పూలతోటకు నీళ్ళుపట్టినట్టుగా ఆ కవిత్వం ఇంద్రియ సన్నిహితంగా ఉంటూనే ఇంద్రియాతీత లోకం వైపు మేల్కొల్పుతుంది. టాగోర్ ఆకాశానికి చెందిన కవి. ఆయన గీతాలు intellectual గానూ, aesthetic గానూ ఉంటాయి అందామె. ఆకాశంలో ఎగిరే కొంగలబారులు, గ్రీష్మాంతవేళ దిగంతమ్మీంచి తరలివచ్చే కారుమబ్బులు, సుదూరానికీ ప్రవహించే నదిమిలమిలల్ని గుర్తు చేసే కవిత్వం అది.

ఆ ఇద్దరి కవితల్తో పాటు, బర్నౌలి ‘తుం రాధే బనో శ్యామ్ ‘ అనే సుప్రసిద్ధమైన టుమ్రీ ఒకటి ఆలపించింది. ఆ గీతం చూడండి:

తుమ్ రాధే బనో శ్యామ్
సబ్ దేఖేంగే బ్రిజ్ బామ్
సబ సఖియన్ మిల్ నాచ్ నాచావో
వో హై బ్రిజ్ ఘనశ్యామ్

(శ్యామసుందరా, నువ్వు రాధవి గా మారు, బ్రజభూమిలోని స్త్రీలందరూ నిన్నే చూస్తారు. సఖీజనమంతా చేరి ఆ బ్రజభూమి సుందరుణ్ణి, మేఘశ్యామమోహనుణ్ణి నాట్యమాడిస్తారు. )

ఈ టుమ్రీని సోహిని కబీరు, టాగోర్ ల కవిత్వపు వెలుగులో వ్యాఖ్యానించిన తీరు అద్భుతం. ఆమె ఏమంటుందంటే, కవి ప్రేమికుణ్ణి తన ప్రేయసిగా మారి చూడమంటున్నాడు అని. ఈ జానపదగీతంలో కృష్ణుణ్ణి రాధ వేషం వేసుకుని రమ్మని మాత్రమే అంటున్నదనే ఇంతదాకా అందరూ అర్థం చేసుకున్నారు. కాని ‘ఓ ప్రేమికా, నువ్వు నీ ప్రేయసిగా మారు’ అనే మాటలో సముద్రమంత స్ఫురణ ఉంది. కబీరు ప్రేమగీతాల్లోని విరహం, టాగోర్ ప్రేమ గీతాల్లోని వేదన మొత్తం ఒక్క వాక్యంలోకి కుదిస్తే అది ‘తుమ్ రాధే బనో శ్యామ్ ..’అనడమే అవుతుంది.

ఆ గీతాలాపన వినండి.

Tum Radhe Bano Syam,Thumri, Singer, Barnauli Bhattacarya at La Makaan, Hyderabad 29-10-2022

మరొక గీతం, టాగోర్ సుప్రసిద్ధ గీతం ‘నిభృతొ ప్రాణేరు దేబొతా జెఖానే జాగాన్ ఎకా..’ . ఆ గీతానికి నా తెలుగు మాటల్లో:

ఎక్కడ ప్రాణదేవత ఏకాంతంలో మేల్కొంటుందో
అక్కడ మనం మన హృదయద్వారాలు తెరిచిపెడదాం. ఈ రోజు మనం ఆయన్ని దర్శించబోతున్నాం.
ఆ ఆగంతకుణ్ణి వెతుక్కుంటూ రోజంగా కలయతిరిగాను
హారతివేళ ఆ సాయంకాల ప్రార్థన కొత్తగా అనిపించింది
నీ జీవనకాంతినుంచే నా జీవనజ్వాలను వెలిగించుకుంటాను.
ఓ పూజారీ, నేను నా నివేదన సమర్పిస్తాను
ఎక్కడ నిఖిల సాధన ఒక పూజారచనగా మారుతుందో
ఆ పూజలో నేను కూడా నా దీపాన్ని జోడించుకుంటాను.

ఆ గీతాలాపన ఇక్కడ వినండి

‘Nibhrito praner..’ Tagore song, Singer Lahari Bhattacharya

సంగీతాంజలి పూర్తికాగానే ఆ గాయికల్ని, ఆ వ్యాఖ్యాతని అభినందించాను. నేను కూడా కబీరు ని తెలుగులోకి అనువదించాననీ, మనసుకి తోచినప్పుడల్లా టాగోర్ గురించి రాసుకుంటూనే ఉంటానని చెప్పాను.

ఇంటికి వస్తున్నంతసేపూ నా మదిలో ఒకటే ఆలోచన. తెలుగులో ఇటువంటి ఒక ఊహ చెయ్యలేమా? టాగోర్, కృష్ణ శాస్త్రి లేదా కబీరు, త్యాగయ్య- ఒక బెంగాలీ గాయిక, తెలుగు గాయిక లేదా ఒక హిందుస్తానీ విదుషి, ఒక తెలుగు స్వరకర్త కలిసి ఇలా కావ్యహారతి పట్టలేరా?

30-10-2022

6 Replies to “తుమ్ రాధే బనో శ్యామ్”

  1. 🙏. ఆ మధుర గాన పరిమళాన్ని మాకు కూడా చవిచూపి నందుకు నమస్సులు సర్

  2. TAGORE AND KABIR JI BOTH ARE TWO MYSTIC SAINTS , BEING INTRODUCED TO US BY YOU TODAY SIR. SHALL START TASTING THE NECTAR IN THEIR WRITINGS …

Leave a Reply

%d bloggers like this: