ఉసిరికాయలు

Portrait of Anton Chekhov (1860-1904) 1902 (oil on canvas); by Nilus, Peter Alexandrovich (1869-1943); 29×37.5 cm; State Central Literary Museum, Moscow, Russia; Ukrainian, out of copyright

మొన్న రాజమండ్రి డైరీ ముగిస్తూ చెకోవ్ Gooseberries (1898) కథని ప్రస్తావించేక, ఆ కథ తీసి మరోసారి చదివాను. దాన్ని మీతో పంచుకుంటే బాగుంటుందనిపించి తెలుగుచేసాను. దీని ఇంగ్లిషు మూలం Constance Garentt రష్యన్ నుంచి చేసిన అనువాదం.

ఈ కథలో చెహోవ్ టాల్ స్టాయి తరహా ఆలోచనా విధానాన్ని ఎద్దేవా చెయ్యడమే కాదు, దానిలో జీవితం కుంచించుకుపోతుందని కూడా అంటున్నాడు. టాల్ స్టాయి రాసిన ‘మనిషికి ఎంత నేల కావాలి?’ (1886) కథకి ఇందులో ప్రతిధ్వని గమనించవచ్చు. ఈ రెండు కథల్నీ కలిపి ఒక విమర్శకుడు ఇటీవల చేసిన ఆసక్తికరమైన విశ్లేషణ https://www.ribbonfarm.com/2013/11/13/the-gooseberry-fallacy/ లో చూడవచ్చు.

ఇంతకీ Gooseberries కి ఉసిరికాయలు పూర్తి సమానార్థకం కాదు. కొంతవరకూ రాచ ఉసిరికాయలు అనవచ్చు. కానీ అది కూడా సమానమైన పదం కాదు. కథ సజావుగా నడవడం కోసం ఉసిరికాయలు అనే పదం వాడక తప్పలేదు.

పొద్దుణ్ణుంచీ ఆకాశం మబ్బుపట్టి ఉంది. రోజు చాలా స్తబ్ధుగా ఉంది. అలాగని మరీ వేడిగా లేదు. గ్రామసీమ మీద మబ్బులు చాలా సేపటి నుంచీ కమ్ముకుని ఉండటంతో వాతావరణం మరీ నిస్తేజంగానూ, బరువుగానూ ఉంది. వాన వస్తుందని అనిపిస్తున్నదిగాని, రావడం లేదు. పశువుల డాక్టరు ఇవాన్ ఇవనోవిచ్, హైస్కూలు ఉపాధ్యాయుడు బుర్కిన్ అప్పటికే చాలాసేపటినుంచీ నడుస్తూ ఉండటంతో అలిసిపోయారు. ఆ పొలంగట్ల మీద ఎంతసేపు నడిచినా దూరం తగ్గుతున్నట్టే లేదు. దూరంనుంచి మిరొనొసిత్స్కొయె గ్రామంలోని గాలిమరలు లీలగా కనిపిస్తున్నాయి. కుడిపక్కగా సాగిన కొండల వరస గ్రామానికి అవతల దూరదిగంతంలో కనుమరుగవుతున్నది. వాళ్ళిద్దరికీ కూడా తాము నడుస్తున్నది నది ఒడ్డున అని తెలుసు. అక్కడ ఉన్నది పచ్చికమైదనాలూ, ఆకుపచ్చని విల్లో చెట్లూ, ఇళ్ళూ అనీ, ఆ కొండల మీదకి వెళ్ళి చూస్తే అవతలవైపంతా విస్తారమైన మైదానం, టెలిగ్రాఫు తీగలూ, దూరంగా గొంగళిపురుగులాగా పాకే రైలుబండీ, వాతావరణం బాగుంటే దూరంగా పట్టణం కూడా కనిపిస్తాయని కూడా తెలుసు. ఇప్పుడు ఆ మబ్బుపట్టిన వాతావరణమంతా ఏదో స్వాప్నికఛాయతోనూ, పేలరంగుల్లోనూ కనిపిస్తుంటే, ఇవాన్ ఇవనోవిచ్, బుర్కిన్ ఇద్దరూ కూడా ఆ గ్రామసీమతో ప్రేమలో పడకుండా ఉండలేకపోయారు. తమ భూమి ఎంత గొప్పది, ఎంత సుందరమైంది అని అనుకోకుండా ఉండలేకపోయారు.

‘నువ్వు కిందటిసారి ప్రొకోఫీ ధాన్యం గిడ్డంగికి వెళ్ళివచ్చినప్పుడు నాకో కథ చెప్పబోయావు గుర్తుందా’ అనడిగాడు బుర్కిన్.

‘అవును. నేను మా తమ్ముడి గురించే చెప్పాలనుకున్నాను.’

ఇవాన్ ఇవనోవిచ్ దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలి కథ చెప్పడానికి ఉపక్రమిస్తూ పైపు వెలిగించాడు. కాని సరిగ్గా అప్పుడే వాన మొదలయ్యింది. అయిదు నిమిషాల్లో  మొత్తం ఆకాశానికి చిల్లులు పడ్డట్టు కురవడం మొదలుపెట్టింది. ఆ వాన ఎప్పటికి ముగుస్తుందో తెలియలేదు. ఇవాన్ ఇవనోవిచ్, బుర్కిన్ ఇద్దరూ కూడా క్షణం పాటు  సందేహిస్తూ ఆగిపోయేరు. అప్పటికే వానలో తడిసిపోయిన కుక్కలు తమ కాళ్ళ మధ్య తోకాడించుకుంటూ వాళ్ళనే చూస్తున్నాయి.

‘మనం ఎక్కడో ఒకచోట తలదాచుకోవాలి. అలెహిన్ ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. పద పోదాం’ అన్నాడు బుర్కిన్.

‘సరే, పద.’

వాళ్ళు పక్కకు తిరిగి, కోసిన పంటపొలాల మధ్యనుంచి కొన్నిసార్లు నేరుగా, కొన్ని సార్లు పక్కకి తిరుగుతూ నడిచి రోడ్డుమీదకు చేరుకున్నారు. అక్కడ వాళ్ళకి పోప్లార్ చెట్లు, తోటా, ఎర్రటి కప్పుల్తో ధాన్యం కొటార్లు కనబడ్డాయి. దూరంగా నది మిలమిల. విస్తారమైన జలరాశి పక్కనే తెల్లటి స్నానపు గది, గాలిమర. అది సోఫినో. అలేహిన్ ఉండేదక్కడే.

అక్కడ నీటిమర తిరుగుతూ ఉంది. దాని చప్పుడులో వాన చప్పుడు కలిసిపోతున్నది. ఆనకట్ట ఊగిపోతున్నది. తడిసిన గుర్రాలు తమ బళ్ళ దగ్గరే తలవాల్చి నిలబడి ఉన్నవి. మనుషులు నెత్తిన గోతాములు కప్పుకుని అటూ ఇటూ తిరుగుతున్నారు. అక్కడంతా బాగా చెమ్మగా, బురదగా పాడుపడినట్టుగా ఉంది. నీళ్ళు చల్లగానూ, క్రూరంగానూ కనిపిస్తున్నాయి. అప్పటికే అంతా తడితడిగా, చికాగ్గా, అసౌకర్యంగా ఉండటం ఇవాన్ ఇవనోవిచ్ కి, బుర్కిన్ కి తెలుస్తూ ఉంది. పాదాలకి బురద అంటుకుని వాళ్ళ అడుగులు బరువుగా పడుతున్నాయి. వాళ్ళు ఆ ఆనకట్ట దాటి ఆ గిడ్డంగుల దగ్గరికి చేరేటప్పటికి ఒకరి పట్ల ఒకరికి కోపమొచ్చిందా అన్నంతగా మాటామంతీలేకుండా అయిపోయారు.

అక్కడ ధాన్యం మిల్లులో ధాన్యం పొట్టు తీసి ఊక చెరిగే యంత్రం చప్పుడు వినిపిస్తోంది. ఆ తలుపు తెరిచి ఉంది. దుమ్ము తెరలుతెరలుగా తేలివస్తోంది. గుమ్మం దగ్గర అలేహిన్ నిల్చొని ఉన్నాడు. నలభయ్యేళ్ళ వయసు. పొడుగ్గా, లావుగా ఉన్నాడు. పొడవైన జుట్టు. అతణ్ణి చూస్తే ఒక భూస్వామి లాగా కనబడటం లేదు. ఏదో విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిలానో లేదా కళాకారుడిలానో కనిపిస్తున్నాడు. అతడు తొడుక్కున్న తెల్లచొక్కా బాగా మాసిపోయి కనిపిస్తోంది. నడుంకి బెల్టు బదులు తాడు చుట్టుకున్నాడు. పాంటుకి బదులు నిక్కరులోనే ఉన్నాడు. అతడి కాళ్ళకున్న బూట్లకి బురద, గడ్డీ అంటుకుని కనిపిస్తున్నాయి. అతడి కళ్లచుట్టూ, ముక్కుమీదా నల్లటి నుసి. అతడు ఇవాన్ ఇవనోవిచ్ నీ, బుర్కిన్ నీ గుర్తుపట్టాడు. వాళ్ళని చూడటం అతడికి సంతోషమనిపించింది.’లోపలకి పదండి, నేనొక్క నిమిషంలో వచ్చేస్తాను ‘ అన్నాడు.

అది రెండు అంతస్తుల పెద్ద ఇల్లు. అలెహిన్ కింద అంతస్తులో ఉంటున్నాడు. అర్థచంద్రాకారంగా వంపు తీర్చిన పైకప్పు, చిన్న కిటికీలు. ఒకప్పుడు ఆ ఇంట్లో కోర్టు ఉద్యోగులు ఉండేవారు. అక్కడంతా చాలా సాదాసీదాగా ఉంది. యవధాన్యంతో తయారైన రొట్టెలు, చౌక వోడ్కా, గుర్రపు జీను ల వాసన. అతడు పై అంతస్తులో ఉన్న గదిలోకి దారి తీసాడు. తన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మాత్రమే తెరిచే గది. ఇవాన్ ఇవనోవిచ్ ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఒక పనిమనిషి వారికి ఎదురయ్యింది. ఆమె అందంగా ఉంది. ఆమెని చూసి ఆ ఇద్దరూ క్షణం పాటు ఆగిపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

మిమ్మల్నిట్లా కలుసుకోవడం నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను అన్నాడు అలేహిన్, వాళ్ళతో పాటే హాల్లో అడుగుపెడుతూ. ‘పెలగేయా’ అని పిలిచాడు అలేహిన్ ఆ యువతిని. ‘భలే వచ్చారు. చూడు’ అంటో ‘వాళ్ళకి మార్చుకోడానికి గుడ్డలివ్వు. నేను కూడా గుడ్డలు మార్చుకుని వస్తాను. అసలు ముందు నేను పోయి స్నానం చేసి రావాలి. ఈ వసంతకాలం మొదలయినప్పణ్ణుంచీ ఇప్పటిదాకా స్నానం చెయ్యనేలేదు. మీరు కూడా నాతో పాటు స్నానశాలకి వస్తారా? ఈ లోపు మనవాళ్ళు ఇక్కడన్నీ సర్దిపెడతారు’ అన్నాడు.

ఆ అందమైన పెలగేయ, ఎంతో సంస్కా రవంతురాలుగానూ, ఎంతో సుకుమారంగానూ కనిపిస్తున్నది, ఆమె సబ్బూ, తువ్వాళ్ళూ తెచ్చిపెట్టింది. అలేహిన్ తన అతిథుల్ని తీసుకుని స్నానశాలకు వెళ్ళాడు.

గుడ్డలు విప్పుకుంటూ ‘చాలా రోజులయ్యింది, స్నానం చేసి’ అన్నాడు. ‘మా నాన్న కట్టించాడు, ఈ స్నానశాల, ఎంత బాగుందో చూడండి. కానీ నాకు స్నానం చెయ్యడానికి సమయమే చిక్కదు’ అని కూడా అన్నాడు.

అతడు అక్కడ మెట్ల మీద కూచుని తన పొడవాటి జుత్తుకి,మెడకి సబ్బుపట్టించాడు. అతడి చుట్టూ నీళ్ళు దుమ్మురంగు తిరిగాయి.

‘నిజమే’ అన్నాడు ఇవాన్ ఇవనోవిచ్ సాభిప్రాయంగా, అతడి తలవైపే చూస్తూ.

‘అవును, స్నానం చేసి చాలా కాలం అయ్యింది ..’అన్నాడు అలేహిన్ ఒకింత సిగ్గుపడుతూ, మరోసారి సబ్బురుద్దుకుంటూ. ఈ సారి అతడి చుట్టూ నీళ్ళు నీలంగా, సిరారంగులోకి మారేయి.

ఇవాన్ ఇవనోవిచ్ బయటికి వెళ్ళి ఆ నీళ్ళల్లో దబ్బున ఒక మునకేసాడు. తన రెండు చేతులూ విశాలంగా చాపి ఆ వానలోనే ఈతకొట్టాడు. ఆ నీళ్ళని అతడు కెరలిస్తూండటంతో కలువు పూలు పైకీ కిందకీ అల్లల్లాడేయి. అతడు ఆ చెరువు మధ్యదాకా ఈదుకుంటూ పోయాడు. ఇక్కడ దూకి అక్కడ పైకి తేలాడు. అలా ఈదుతో ఆ చెరువు లోతెంతో కొలవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు.

‘ఆహా ఎంత బాగుంది’ అంటూనే ఉన్నాడు పదే పదే, సంతోషంగా ఈదుతో. ‘అహా, భలేగా ఉంది’ అనుకుంటూ మిల్లుదాకా ఈదాడు, తన తల వెల్లకిలా చాపి వానకు ఎదురుమొహం పెట్టాడు. బుర్కిన్, అలేహిన్ స్నానం చేసి దుస్తులు మార్చుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యాక కూడా అతడింకా ఈదుతూనూ, మునకలేస్తూనే ఉన్నాడు. ‘అహాహా, ఎంత బావుంది, దేవుడా, ఎంత దయచూపిస్తున్నావు’ అంటో ఉన్నాడు.

‘ఇంక చాలు రా’ అంటో కేకేసాడు బుర్కిన్.

వాళ్ళు మళ్ళా ఇంట్లోకి వెళ్ళారు. పైన మేడమీద భోజనాల గదిలో దీపం వెలిగించారు. ఇవాన్ ఇవనోవిచ్, బుర్కిన్ ఇద్దరూ కూడా పట్టు వస్త్రాలు, మెత్తని చెప్పులు ధరించి చేతులకుర్చీల్లో కూచున్నారు. అలేహిన్ కూడా స్నానం చేసాక కొత్త కోటు ధరించి, తల దువ్వుకుని,ఆ గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉన్నాడు. ఆ వెచ్చదనాన్నీ, ఆ పరిశుభ్రతనీ, ఉతికి చలువచేసిన దుస్తుల్నీ, చెప్పుల మెత్తదనాన్నీ అనుభూతి చెందుతో ఉన్నాడు. ఆకర్షణీయమైన పెలగేయ ఆ తివాసీ మీద చప్పుడు చెయ్యకుండా మెల్లగా అడుగులు వేస్తూ వచ్చి మృదువుగా చిరునవ్వుతో ఒక ట్రేలో తేనీరు, జామ్ అందించింది. అప్పుడు ఇవాన్ ఇవనోవిచ్ కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథ బుర్కిన్, అలేహిన్ లు మాత్రమే కాదు, ఆ గదిలో గోడలమీద బంగారు ఫ్రేము కట్టిపెట్టిన ఫొటోల్లో ఉన్న స్త్రీలూ, పిల్లా జెల్లాతో పాటు తమ  గంభీరమైన దృక్కుల్తో ఆఫీసర్లు కూడా వింటున్నట్టుగా ఉంది.

‘మేమిద్దరం అన్నదమ్ములం’ ఇవాన్ ఇవనోవిచ్ చెప్పడం మొదలుపెట్టాడు. ‘నేనూ, నా తమ్ముడు నికొలాయ్ ఇవనోవిచ్, నా కన్నా రెండేళ్ళు చిన్నవాడు. నేను ఉన్నత విద్య చదువుకుని వెటర్నరీ సర్జన్ ని అయ్యాను. కాని నికోలాయ్ పందొమ్మిదేళ్ళ వయసునుంచే ప్రభుత్వోద్యోగంలో కుదురుకున్నాడు. మా నాన్న షిమ్షా-హిమలాయస్కీ చిన్నప్పుడే సైనికపాఠశాలలో చేరాడు. నెమ్మదిగా ఆఫీసరు హోదాకి ఎదిగాడు. తాను మరణించేటప్పటికి మాకు చిన్నపాటి ఎస్టేటు, కులీన హోదా విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన పోయిన తరువాత ఆ సుక్షేత్రం అప్పుల్లోనూ, వ్యాజ్యాల్లోనూ చిక్కుకుంది. కాని మా బాల్యం మాత్రం ఆ పల్లెటూళ్ళో అడ్డూ అదుపూ లేకుండా గడిచింది. రైతుబిడ్డల్లాగా మేము కూడా పగలు రాత్రీ పొలాలమ్మటా, అడవులమ్మటా తిరిగేవాళ్ళం. గుర్రాల్ని మేతకు తీసుకుపోయేవాళ్ళం. కట్టెలు కొట్టేవాళ్ళం. చేపలు పట్టేవాళ్ళం. అట్లాంటివే ఏవేవో పనులు. మీకో సంగతి తెలుసా? జీవితంలో ఒక్కసారేనా చేపలు పట్టినవాడు, శీతాకాలంలో పక్షులు వలసపోవటం చూసిన వాడు, హేమంతకాలపు చల్లటి, ప్రకాశవంతమైన దినాల్లో కొంగలు బారులు బారులుగా ఎగరడం చూసిన వాడు నిజమైన పట్టణవాసి ఎప్పటికీ కాలేడు. అతడు తన జీవితమంతా కూడా స్వేచ్ఛకోసం పరితపిస్తూనే ఉంటాడు. ఆ ప్రభుత్వకార్యాలయంలో మా తమ్ముడి జీవితం దుర్భరంగా ఉండేది. ఏళ్ళు గడిచిపోయాయి. అతడు అదే చోట అవే కాగితాలు రాసుకుంటూ ఎప్పుడూ ఒకటే సంగతి ఆలోచిస్తూ గడిపేవాడు. తిరిగి మళ్ళా ఆ పల్లెటూరికి ఎప్పుడు వెళ్ళిపోతానా అన్న ధ్యాసలోనే గడిపేవాడు. ఈ కోరిక నెమ్మదిగా బలమైన ఆకాంక్షగా మారి చివరికి అతడు ఎక్కడో ఏదో నది ఒడ్డునో, చెరువు కిందనో చిన్నపాటి పొలం కొనుక్కున్నాడు.’

‘వాడు చాలా మంచి మనిషి. మృదుస్వభావి. నాకు వాడంటే చాలా ఇష్టం. కానీ తన జీవితమంతా ఆ చిన్నపాటి పొలానికే బందీగా అంటిపెట్టుకుపోవాలన్న వాడి కోరికని మాత్రం హర్షించలేకపోయేను. మనిషికి ఆరడుగుల నేల మించి ఎక్కువ అవసరం లేదన్నది ఒప్పుకోదగ్గ మాటే. కాని ఆరడుగులు సరిపోయేది, శవానికి, మనిషికి కాదు.  నేలమీద మక్కువ పెంచుకుని పొలంపని చేసుకుంటే బావుంటుందంటారు కొందరు మేధావులు. మంచిదే. కాని ఆ పొలాలు కూడా ఆరడుగుల నేలలకన్న ఎక్కువేమీ కాదు. పట్టణ జీవితం నుంచి, సంఘర్షణనుంచి, జీవితసంరంభం నుంచి పారిపోయి తన చిన్నపాటి పొలంలోనో, తోటలోనో కూరుకుపోవడం- దాన్ని జీవితమనలేం. అది అంధత్వం, సోమరితనం. అదొక తరహా రొమాంటిసిజం. మంచిపనులు చెయ్యడానికి అవకాశంలేని ఆశ్రమవాసం. మనిషికి కావలసింది ఆరడుగుల నేలనో లేదా చిన్నపాటి సుక్షేత్రమో కాదు. అతడికి మొత్తం భూగోళం అవసరం కావాలి, మొత్తం ప్రకృతి కావాలి, తనలోని స్వేచ్ఛాజీవి తన కౌశల్యాల్ని, అద్వితీయతల్ని మొత్తం బయటకు తేవడానికి అవసరమైన అవిరళ ఆకాశం కావాలి.’

‘నా తమ్ముడు నికొలాయ్ ప్రభుత్వ కార్యాలయంలో కూచుని తాను పండించుకున్న కాబేజిల్ని తినే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుండేవాడు. ఆ కాబేజీల తాజాపరిమళం ఆ పొలం నిండా పరుచుకుని ఉండగా, ఇంతపచ్చగడ్డి పచ్చడి కలుపుకుని రొట్టెలు తింటూ, ఆరుబయట ఎండలో పడుకునో లేదా ఆ గుమ్మం దగ్గరే కూచుని ఆ అడవినీ పొలాన్నీ గంటల తరబడి తదేకంగా చూస్తోనో గడపాలనుకున్నాడు. తోటలు పెంచడం ఎలా అని రాసిన పుస్తకాలు, వ్యవసాయ పంచాంగాలు వాడికి గొప్ప సంతోషం చేకూర్చేవి. అవి వాడి ఆత్మకి అన్నం పెడుతున్నట్టుండేవి. వాడు వార్తాపత్రికలు కూడా చదువుతుండేవాడు గాని, ప్రధానంగా, ప్రకటనలకోసం వెతుక్కునేవాడు. ఎక్కడైనా ఏదైనా సాగుభూమీ, పచ్చికబయలూ, ఇళ్ళూ, భవంతీ వంటి వాటితో కూడుకున్న వ్యవసాయ క్షేత్రాలు, నది, తోట, మిల్లు, మిల్లు చెరువులూ లాంటివి ఎక్కడైనా అమ్మకానికి వస్తున్నాయా అని చూసేవాడు. ఆ ప్రకటనలు చూడగానే తోటల మధ్య కాలిబాటల్నీ, పూలనీ, పండ్లనీ, పక్షుల గూళ్ళనీ, చెరువులో చేపల్నీ, అలాంటి వాటినే ఇంకేవేవో కలలు కంటూండేవాడు. ఆ కలల్లో కనిపించే దృశ్యాలూ కూడా అతడు చూసిన ప్రకటనలకి అనుగుణంగా మారిపోయేవి. కాని ఎందుకనో అతడు ఎన్ని కలలు కన్నా ప్రతి ఒక్క కలలోనూ ఉసిరికాయలు మాత్రం తప్పనిసరిగా ఉండేవి. ఉసిరిచెట్లు లేకుండా మాత్రం ఏ ఇల్లూ, ఏ పల్లెటూరి మారుమూలలూ కూడా అతడి ఊహల్లోకి వచ్చేవి కావు.’

‘పల్లెటూరి జీవితానికి దానికుండే సౌకర్యాలు దానికున్నాయి’ అనేవాడు. ‘నువ్వు నీ ఇంటిముందు అరుగు మీద కూచుని టీ తాగుతుంటావు, ఎదురుగుండా చెరువులో బాతులు ఈదుతుంటాయి. తియ్యటి సుగంధం ఒకటి గాలంతా పరుచుకుని ఉంటుంది.. వాటిమధ్య ఉసిరి చెట్లు కాపుకొస్తుంటాయి.’

‘వాడు తను కొనబేయే సుక్షేత్రం పటం ఒకటి గీసుకుంటూ ఉండేవాడు. ప్రతి పటంలోనూ తప్పనిసరిగా కుటుంబానికి ఒక ఇల్లు, పనివాళ్ల ఇళ్ళు, కూరగాయలతోట, ఉసిరికచెట్లు ఉండేవి. వాడు చాలా పిసినారి జీవితం జీవించేవాడు. తిండిమీదా, తాగుడుమీదా, గుడ్డల మీదా  పైసా పైసా లెక్కరాసుకు మరీ కర్చుపెట్టేవాడు. చూడ్డానికి అడుక్కుతినేవాడిలాగా కనిపించేవాడు. కాని డబ్బు ఆదాచేస్తూ ఎప్పటికప్పుడు బాంకులో దాచుకుంటూ ఉండేవాడు. వాడి లోభత్వం చూస్తే భయమేసేది. వాణ్ణి కలవాలనిపించేదికాదు. ఎప్పుడేనా ఏవేనా పండగలకీ పబ్బాలకీ పదో పరకో పంపిస్తూండేవాణ్ణి. కాని వాటిని కూడా బాంకులో చేర్చేస్తుండేవాడు. ఒకసారి ఒక మనిషిని ఒక ఆలోచన ఆవహించాక ఇక ఎవరూ ఏమీ చెయ్యగలిగేది ఉండదు.’

‘ఏళ్ళు గడిచాయి. వాణ్ణి అక్కణ్ణుంచి మరో జిల్లాకి బదిలీ చేసారు. అప్పటికి వాడికి నలభయ్యేళ్ళు దాటాయి. అయినా వాడింకా పత్రికల్లో ప్రకటనలు చదువుతూనే ఉండేవాడు. డబ్బు దాచుకుంటూనే ఉండేవాడు. అప్పట్లోనే పెళ్ళి చేసుకున్నాడని కూడా విన్నాను. ఉసిరిచెట్ల తోట ఉండే సుక్షేత్రాన్ని కొనుక్కునే ఉద్దేశ్యంతో వాడు తనకన్న వయసులో పెద్దదీ, ఏమంత అందగత్తె కానిదీ అయిన ఒక సంపన్న వితంతువుని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పట్ల ప్రేమతో కాదు, ఆమె దగ్గర దుడ్డు ఉందని మాత్రమే. పెళ్ళి చేసుకున్నాక కూడా వాడు అదే పంథా కొనసాగించాడు. ఆమెకి తిండిపెట్టేవాడు కాడు, ఆమె డబ్బు కూడా బాంకులో వేసుకుంటూ ఉండేవాడు.

ఆమె మొదటి భర్త పోస్టుమాష్టరు పని చేస్తుండేవాడు. అతడి వల్ల ఆమెకి ఇంట్లో తయారుచేసిన పానీయాలంటేనూ, మిఠాయిలంటేనూ ఇష్టం పుట్టింది. కాని ఈ రెండో భర్త వల్ల తినడానికి చాలినంత రొట్టె కూడా దొరికేది కాదు. ఆమె ఆ జీవితాన్ని తట్టుకోలేకపోయింది. మూడేళ్ళ తరువాత ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది కూడా. కాని ఆమె అకాల మరణానికి తానే కారణమని మా వాడికి కలలో కూడా అనిపించలేదని మీరు గ్రహించేవుంటారు. డబ్బు కూడా ఓడ్కాలాగా మనిషిని వింతపశువుగా మారుస్తుంది. మా ఊళ్ళో ఒక షావుకారుండేవాడు. వాడు చచ్చిపోయేటప్పుడు ప్లేటునిండా తేనె తెమ్మని చెప్పి వాడిదగ్గర ఉన్న కరెన్సీనోట్లు, లాటరీ టిక్కెట్లూ అన్నీకూడా ఆ తేనెలో రంగరించుకుని తినేసాడు. వాటివల్ల మరొకడెవడూ లబ్ధి పొందకూడదని వాడి ఉద్దేశ్యం. నేనో సారి రైల్వే స్టేషన్ దగ్గర పశువుల్ని తనిఖీ చేస్తున్నప్పుడు పశువుల దళారీ ఒకడు రైలుకింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. మేమతణ్ణి వెంటనే వెయిటింగ్ రూమ్ కి తీసుకువెళ్ళాం. రక్తం కారుతూనే ఉంది. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అతడేమో తన కాలు ఎక్కడ పడిపోయిందో చూడమని అడుగుతున్నాడు. అతడి ఆలోచనలన్నీ దానిమీదనే ఉన్నాయి. ఆ తెగిపడ్డ కాలుకి ఉన్న బూటులో ఇరవై రూబుళ్ళు ఉన్నాయట. అవి ఎక్కడ పోతాయో అని అతడు భయపడుతూనే వున్నాడు.’

‘అదొక వేరే నాటకంలో కథలాగా ఉంది’ అన్నాడు బుర్కిన్.

‘మా వాడి భార్య మరణించిన తరువాత మా తమ్ముడు తన ఎస్టేటు వ్యవహారాలు తనే చూసుకోవడం మొదలుపెట్టాడు’ అని చెప్తూ క్షణం  పాటు ఆగి ఇవాన్ ఇవనోవిచ్ మళ్ళా చెప్పడం మొదలుపెట్టాడు. ‘నువ్వు ఏమి కొనాలా అని అయిదేళ్ళ పాటు ఆలోచిస్తూ ఉండవచ్చు, చివరికి పొరపాటున నువ్వు కొనుక్కున్నది నువ్వు అంతదాకా కలగన్నలాంటిది కాకపోవచ్చు. మా వాడు ఒక మధ్యవర్తిద్వారా మూడువందల ముప్పై మూడు ఎకరాల భూమి కొన్నాడు. అది ఎవరో కుదవపెట్టిన భూమి. దానిలో కుటుంబంతో ఉండటానికి ఒక ఇల్లూ, పనివాళ్ళకి నివాసం, పార్కు కూడా ఉన్నాయి. కాని తోట లేదు, ఉసిరి చెట్లు లేవు. బాతులు ఈదులాడటానికి చెరువు లేదు. ఒక నది అయితే ఉందిగాని, ఆ నీళ్ళు కాఫీరంగులో ఉంటాయి. ఎందుకంటే ఆ నదికి అవతలి ఒడ్డున ఇటుకబట్టీల కార్ఖానా, ఎముకలు కాలబెట్టే కార్ఖానా ఉన్నాయి. కాని నికోలాయి వాటి గురించి ఏమంత పట్టించుకోలేదు. వాడు వెంటనే ఇరవై ఉసిరి మొక్కలు తెప్పించి  నాటించాడు. పూర్తిస్థాయి గ్రామీణుడిగా జీవించడం మొదలుపెట్టాడు.’

‘కిందటేడాది నేను వాణ్ణి చూడటానికి వెళ్ళాను. అసలు వాడి జీవితం ఎలా నడుస్తోందో చూద్దామని వెళ్ళాను. వాడు నాకు రాసే ఉత్తరాల్లో ఆ ఎస్టేటుని చుంబరొక్లొవ్ లేదా హిమలయస్కోయే ఎస్టేట్ అని వ్యవహరిస్తుండేవాడు. ఆ ఎస్టేటుకి చేరుకునేటప్పటికి మధ్యాహ్నం అయింది. చాలా వేడిగా ఉంది. ఎక్కడ చూసినా గోతులూ, తుప్పలూ, కంచెలూ. ఒకపక్క అత్తిచెట్లు వరసలు. వాటిమధ్య నుంచి ఎలా దారిచేసుకోవాలో తెలియలేదు. గుర్రాన్ని ఎక్కడ కట్టాలో కూడా తెలియలేదు. నేను ఇంట్లో అడుగుపెట్టేటప్పటికి బాగా బలిసిన ఎర్రటి కుక్క ఒకటి ఎదురొచ్చింది. అది చూడ్డానికి పందిలాగా ఉంది. అది మొరగబోయింది గాని సోమరితనం వల్ల దాని గొంతుపెగల్లేదు. ఒక లావుపాటి ఆమె, వంటమనిషి, కాళ్ళకి చెప్పుల్లేకుండానే వంటింట్లోంచి బయటకు వచ్చింది. చూడ్డానికి ఆమె కూడా ఒక వరాహంలానే ఉంది. తన యజమాని భోంచేసి విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పింది. నేను మా తమ్ముణ్ణి చూడబోయాను. వాడు లోపల పరుపుమీద కూచుని ఉన్నాడు. కాళ్లమీద బొంత కప్పుకుని ఉన్నాడు. ఇదివరకటికన్నా ఇప్పుడు వయసు మీద పడ్డట్టు కనిపిస్తున్నాడు. బాగా లావెక్కాడు. చర్మం ముడతలు పడింది. వాడి చెంపలు, ముక్కు, నోరు అన్ని కూడా పైకి పొడుచుకువచ్చినట్టు కనిపిస్తున్నాయి. వాడు ఏ క్షణానేనా ఆ బొంతలోకి ముసుగు తన్నేసేలాగా ఉన్నాడు.’

‘మేము ప్రేమపూర్వకంగా ఒకరినొకరం కావలించుకున్నాం. మా కళ్ళల్లో ఆనందబాష్పాలు తొణికిసలాడాయి. ఒకప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళమనీ, ఇప్పుడు ఇద్దరికీ జుత్తు నెరిసిందనీ, కాటికి కాళ్ళు చాపుకు కూచున్నామనే ఊహవల్ల ఆ బాష్పాలు అశ్రువులుగా కూడా మారేయి. వాడు లేచి దుస్తులు తొడుక్కుని తన ఎస్టేటు చూపించడానికి నన్ను తీసుకుపోయాడు.’

‘ఎలా ఉంది నీకిక్కడ?’ అనడిగాను.

‘దేవుడి దయవల్ల అంతా బాగానే ఉంద’ని జవాబిచ్చాడు.

‘ఇప్పుడు వాడు ఇంకెంతమాత్రం ఆ పూర్వం రోజులనాటి పిరికి గుమాస్తా కాడు. ఇప్పుడు  వాడు భూస్వామి, పెద్దమనిషి. ఆ కొత్త పాత్రకి వాడు బాగా అలవాటు పడ్డాడు. అలవాటు పడుతున్నాడు. దాన్ని వాడు ఇష్టపడుతున్నాడు. బాగా తింటున్నాడు, స్నానం చేస్తున్నాడు. బాగా లావెక్కాడు. గ్రామసంఘంతోనూ, రెండు కార్ఖానాలతోనూ కూడా మంచి సంబంధాలే నెరపుతున్నాడు. రైతులు తనని ‘దొరగారూ’ అని పిలవకపోతే కోపం వస్తుంది వాడికి. ఇప్పుడు ఇంక తన ఆత్మవిముక్తికి సంబంధించిన అంశాల మీద దృష్టి సారిస్తూ ఉన్నాడు. చెప్పుకోదగ్గట్టుగా, పెద్దమనిషి తరహాలో, దానధర్మాలు చెయ్యడం మొదలుపెట్టాడు,  మామూలుగా కాదు, తానేం చేసినా నలుగురికీ తెలిసేటట్టుగా అన్నమాట. ఆ దానధర్మాలు కూడా ఎట్లాంటివి అనుకున్నారు! రైతులకి ఎట్లాంటి జబ్బు చేసినా ఇంత సోడా, ఇంత ఆముదమూ మందుగా ఇస్తాడు. తన పుట్టినరోజు నాడు ఊరు మధ్యలో వేడుకలాగా సందడి చేసి రైతులందరికీ ఒక గాలను ఓడ్కా ఉచితంగా పోస్తాడు. వాళ్ళకి చెయ్యవలసిన దానధర్మమంటూ ఉంటే అదేనని వాడి నమ్మకం. అబ్బా! ఆ గాలన్లకొద్దీ వోడ్కా!తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఒక రోజు వాడు అంటే ఆ భూస్వామి బీద రైతులు తన పొలంలో అనుమతిలేకుండా చొరబడ్డారని జిల్లా అధికారిముందు ఫిర్యాదు చేస్తాడు. ఇంకోరోజు మళ్లా తనే వాళ్ళకి గాలను వోడ్కా తాగిస్తాడు. వాళ్ళు అదంతా తాగి ఆహా ఒహో అంటో అరుచుకుంటో వాడికాళ్లమీద పడి మొక్కుతుంటారు.’

‘జీవితంలో మార్పు వస్తే మంచికి రావాలి. మంచి తిండికి సోమరితనం తోడైతే అది రష్యన్ ని అత్యంత పొగరుమోతుగానూ, ఆత్మవంచకుడిగానూ మారుస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు తనకంటూ సొంత అభిప్రాయాలు ఏర్పరచుకోడానికి భయపడుతుండే నికొలాయి ఇవనోవిచ్ ఇప్పుడు తాను ఏది మాట్లాడితితే అదే వేదవాక్కు అనుకునే స్థితికి చేరుకున్నాడు. దేనిమీదైనా అభిప్రాయం చెప్తే అది ప్రధానమంత్రిలాగా చెప్తుంటాడు. ఉదాహరణకి ‘విద్య చాలా అవసరం, కానీ రైతుల విషయంలో మరీ తొందర అవసరం లేదు’  అనో లేదా ‘పిల్లల్ని దండించడం మంచిదికాదు అనేది గొప్ప సూత్రం, కానీ కొన్ని సందర్భాల్లో అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదు’ -లాంటి మాటలన్నమాట.

‘నాకు రైతులగురించి బాగా తెలుసు. వాళ్ళ పట్ల ఎలా ఉండాలో తెలుసు’ అంటాడు. ‘రైతులు అచ్చం నాకులాంటి వాళ్ళే. నేను నా చిటికెన వేలు కదిపితే చాలు, వాళ్ళు నా మెప్పు కోసం ఏమైనా చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు’ అంటాడు.

‘చూడండి, ఈ మాటలు చెప్తున్నప్పుడు వాడు చాల వివేకవతుణ్ణనుకుంటూ, మర్యాదాపూర్వకంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ‘మనలాంటి మర్యాదస్తులు’, ‘నాలాంటి పెద్దమనిషి’ అనే మాటలు కనీసం ఇరవైసార్లన్నా అని ఉంటాడు. ఒకప్పుడు మా తాతయ్య కూడా రైతు అనే విషయం, మా నాన్న సైనికుడనే విషయం మర్చిపోయినట్టే ఉన్నాడు. చివరికి అతుకులబొంతలాంటి మా ఇంటిపేరు షిమ్షా-హిమలయస్కీ కూడా ఇప్పుడు వాడి చెవులకి ఎంతో శ్రావ్యంగానూ, గొప్పగానూ, గర్వించదగ్గదిగానూ వినిపిస్తోంది.’

‘కాని ఇంతకీ నేను చెప్పాలనుకున్నది వాడి గురించి కాదు, నా గురించే. ఆ ఊళ్ళో ఆ పొలంలో వాడితో గడిపిన ఆ కొన్ని గంటల్లోనే నాలో వచ్చిన మార్పు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ సాయంకాలం మేము టీ తాగుతున్నప్పుడు వంటమనిషి ఒక పళ్ళెంలో ఉసిరికాయలు తెచ్చి మా బల్ల మీద పెట్టింది. అవి కొన్నవి కావు. వాడి సొంత ఉసిరికాయలు. వాడు నాటిన మొక్కలనుంచి మొదటిసారిగా ఏరితెచ్చినవి. నికొలాయి ఇవనోవిచ్ వాటిని మందహాసంతో మౌనంగా తేరిపారచూసాడు. వాడి కళ్ళల్లో నీళ్ళు నిండాయి. ఉద్రిక్తత వల్ల గొంతులోంచి మాటలు పెగల్లేదు. ఒక ఉసిరికాయ తీసుకుని నోట్లో వేసుకున్నాడు. తనకి ఇష్టమైన ఆటబొమ్మని దొరకబుచ్చుకున్న పిల్లవాడిలాగా విజయగర్వంతో నాకేసి చూసి

‘ఎంత బావున్నాయి’ అన్నాడు.

వాటిని ఆబగా తినడం మొదలుపెట్టాడు. ‘ఆహ్! చాలా బావున్నాయి. నువ్వు కూడా తినిచూడు’ అన్నాడు.

అవి ఇంకా పక్వం కాలేదు, పుల్లగా ఉన్నాయి. కాని పుష్కిన్ అన్నట్లుగా

”మనల్ని బాధపెట్టే సత్యాలకన్నా ఉద్రేకించే అసత్యాలే మనకెంతో ఇష్టమనిపిస్తాయి.”

‘తాను కన్న కలలు అంత కొట్టొచ్చినట్టుగా నిజం చేసుకున్న ఒక మనిషి ఆ రోజు నాకు  కనిపించాడు. తన జీవితాశయాన్ని సాధించుకున్నవాడు. తాను కోరుకున్నది పొందినవాడు, తనతోనూ,తన విధితోనూ తృప్తి చెందినవాడన్నమాట. మానవ సంతోషం గురించి తలుచుకున్నప్పుడల్లా సాధారణంగా నా తలపుల్లో కొంత విషాదపు జీరకూడా తొంగిచూస్తూ ఉంటుంది. ఈసారి ఒక సంతోషభరితుడైన మనిషిని చూడగానే నా తలపులు బరువెక్కి దాదాపుగా నిస్పృహగా మారిపోయేయి.ఆ రాత్రి నన్ను మరింత దిగులు కమ్మింది. మా తమ్ముడి పడగ్గది పక్కనే నాకు కూడా పడక కోసం ఏర్పాటు చేసారు, ఆ రాత్రి వాడు చాలా సేపు మెలకువగానే ఉన్నట్టూ, మాటిమాటికీ ఆ ఉసిరికాయలు తెచ్చుకుని తింటున్నట్టూ తెలుస్తూనే ఉంది. ఈ ప్రపంచంలో నిజంగా ఎంతమంది సంతృప్తమానవులు, సంతోషభరితులు ఉన్నారో కదా అనుకున్నాను. ఊపిరాడనివ్వనంత మంది ఉన్నారు. జీవితం చూడండి: బలవంతుల దాష్టీకం, సోమరితనం, బలహీనుల అజ్ఞానం, మూర్ఖత్వం, మన చుట్టూ నమ్మశక్యం కానంతగా పరుచుకున్న దారిద్య్రం, తొక్కిసలాడుతున్న జనాభా, దివాలాకోరుతనం, తాగుడు, ఆత్మవంచన, అబద్ధాలు.. కానీ చూడండి, ఇళ్ళల్లో, వీథుల్లో ఎంత ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుందో చూడండి. ఈ పట్టణంలో నివసిస్తున్న యాభై వేలమందిలో ఒక్కడు కూడా, అరిచి గగ్గోలు పెట్టేవాడు, తన అసంతృప్తిని వెళ్ళగక్కేవాడు, ఒక్కడంటే, ఒక్కడు కూడా కనిపించడు. మనుషులు కూరలకోసం దినుసుల కోసం బజారుకి వెళ్ళి వస్తుంటారు. వండుకు తింటారు, రాత్రి కాగానే పడుకుంటారు, నోటికొచ్చిన చెత్తంతా వాగుతుంటారు, పెళ్ళిచేసుకుంటారు, ముసలివాళ్ళవుతుంటారు, చచ్చిపోయినవాళ్ళని యథావిధిగా స్మశానానికి మోసుకుపోతుంటారు.. కాని ఎవరు దుర్భరమైన వేదన అనుభవిస్తున్నారో వాళ్ళ గొంతు ఎక్కడా వినబడదు. జీవితంలో దారుణమైందీ, భరించలేనిదీ మనకి కంటికి కనిపించకుండా ఎక్కడో జరిగిపోతూంటుంది. ప్రతి ఒక్కటీ ప్రశాంతంగానూ, నిశ్శబ్దంగానూ గోచరిస్తూంటుంది. మూగగణాంకాలు తప్ప మరేవీ నోరెత్తవు. ఎంతమంది మనుషులు మతిస్తిమితం పోగొట్టుకుని ఉంటారు, ఎన్ని గాలన్ల వోడ్కా ఏరులై ప్రవహించి ఉంటుంది, ఎంతమంది పిల్లలు పుష్టికరమైన అహారం దొరక్క మరణించి ఉంటారు..బహుశా విషయాలు సక్రమంగానే ఉన్నట్టు కనిపించడం అవసరమే కావచ్చు, బాధపడేవాళ్ళు తమ బాధల్ని మౌనంగా భరిస్తూ ఉంటారు కాబట్టే సంతోషిస్తున్న మానవుడు తన సంతోషాన్ని అనుభవించగలుగుతున్నాడు, ఆ నిశ్శబ్దమే లేకపోతే ఆ సంతోషం అసాధ్యం. ఇదొక సార్వత్రిక ఆత్మవంచన. సంతోషంగానూ, సంతృప్తిగానూ జీవితం గడుపుతున్న ప్రతి ఒక్క మనిషి తలుపు వెనకా ఒకడు నిలబడి ఈ ప్రపంచంలో ఎంతో మంది బాధలుపడుతున్నారని సుత్తితో మోది మరీ చెప్పవలసి ఉంటుంది. ఈ రోజు అతడి జీవితం సంతోషంగా గడుస్తున్నట్టుగా అనిపించవచ్చుగాక, కాని జీవితం నేడో రేపో అతడి ముందు ప్రత్యక్షంకాక తప్పదు.  రోగాలు, లేమి, నష్టాలు అతడి తలుపు తట్టినప్పుడు వాటిని వినడానికీ, చూడటానికీ ఎవరూ రారు. ఇవాళ అతడు ఎవరి కష్టాలూ ఎలా వినడంలేదో, చూడటం లేదో అలాగే. కాని అలా సుత్తి పట్టుకు నిలబడ్డవాడంటూ ఎవడూ లేడు కాబట్టే సంతోషంగా జీవిస్తున్న మానవుడు సంతోషంగా కాలం గడుపుతున్నాడు, రోజువారీ సమస్యలు బయట చెట్లలో కదలాడే గాలిలాగా అతణ్ణి బలహీనంగా తాకి పక్కకు చెదిరిపోతూంటాయి, అంతా సాఫీగా సాగిపోతూంటుంది.’

‘నేను కూడా ఎంత సంతోషంగానూ, సంతృప్తిగానూ జీవిస్తూ ఉన్నానో ఆ రాత్రి నాకు అర్థమయింది’ అన్నాడు ఇవాన్ ఇవనోవిచ్. తాను కూచున్న దగ్గర నుంచి లేచి నిలబడి అతను తన మాటలు కొనసాగించాడు: ‘భోజనందగ్గరా వేటదగ్గరా నేను కూడా చట్టాన్నీ, నీతిసూత్రాల్నీ పక్కన పెట్టేస్తూనే ఉంటాను. రైతుల్తో ఎలా వ్యవహరించాలో అని ఆలోచిస్తూనే ఉంటాను. నేను కూడా సైన్సుని మరీ పట్టించుకోనక్కర్లేదనీ, సంస్కృతి అన్నిటికన్నా ముఖ్యమనీ, సాధారణ ప్రజానీకానికి ప్రస్తుతానికి చదవడం, రాయడం నేర్పితే చాలనీ అని అనుకుంటూనే ఉంటాను. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు వరమే, గాలిలాగా అవి లేకపోతే మనిషి బతకలేడు నిజమే కాని, వాటికోసం మరికొంత కాలం ఆగవలసి ఉంటుందనే అంటూంటాను కూడా.  అవును, నేను కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటానుగాని, ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, ఎందుకోసం ఆగాలి?  స్వేచ్ఛ ఒక్కసారిగా అకాశంలోంచి ఊడిపడదు, నెమ్మదిగా, కాలక్రమంలో రూపుదిద్దుకుంటుంది అంటారా? కాని ఆ అంటున్నవాళ్ళెవరు? వాళ్ళు చెప్తున్నదే నిజమని నిరూపణ ఏమిటి? అప్పుడు ప్రకృతి పరిణామం గురించీ, కనిపించేవాటన్నిటిలోనూ ఉండే సామాన్యధర్మాల గురించీ చెప్పడం మొదలుపెడతారు. కాని, ఇదిగో, నేను- ఒక సజీవ, చైతన్యమానవుణ్ణి ఇక్కడ నిల్చున్నాను. నా ముందొక గండి పడి ఉంది. అది దానికదే పూడుపడిపోతుందనో లేదా ఎవరో ఇంతమట్టిపోసి పూడుస్తారనో ఎదురుచూస్తున్నాను. కాని అలా ఎదురుచూసే బదులు దాన్ని ఒక్క గెంతుతో దాటెయ్యవచ్చుకదా లేదా చిన్న వంతెన కట్టడం మొదలుపెట్టొచ్చు కదా.అదీకాక దేనికోసం వేచి ఉండాలి? జవసత్త్వాలు పూర్తిగా సన్నగిల్లిపోయేదాకానా? ఈలోగా ప్రతి ఒక్కరూ బతకాలి కదా, ప్రతి ఒక్కరూ బతకాలనుకుంటారు కదా.’

‘నేను ఆ మర్నాడు పొద్దున్నే మా తమ్ముడి దగ్గరనుంచి వచ్చేసాను. వచ్చినప్పణ్ణుంచీ ఈ పట్టణ జీవితం దుర్భరంగా అనిపిస్తూ ఉంది.ఇక్కడి నిశ్శబ్దం, ప్రశాంతి నన్ను బాధిస్తున్నాయి. కిటికీలోంచి బయటికి చూడాలంటే భయంగా ఉంది, ఎందుకంటే సాయంకాలంపూట సంతోషభరితులుగా ఒక కుటుంబం బల్ల చుట్టూ చేరి టీ తాగుతూండటం కన్నా నన్ను నొప్పించే దృశ్యం మరొకటి కనిపించడం లేదు. నేను వృద్ధుణ్ణైపోయాను. పోరాడే శక్తి లేదు. అలాగని ద్వేషించలేను కూడా. నేను చెయ్యగలిగిందల్లా నాలోనేను కుమిలిపోవడమే. విసిగిపోవడమే. రాత్రుళ్ళు ఈ ఆలోచనల్తో నా బుర్ర వేడెక్కిపోయి నిద్రపట్టదు.. అహా నేను మళ్ళీ యువకుణ్ణైపోయానా అన్నట్టు ఉంటుంది.’

తన మాటలు కలిగించిన ఉద్రిక్తత వల్ల ఇవాన్ ఇవనోవిచ్ అటూ ఇటూ పచార్లు చేస్తూ ‘నేను నిజంగా యువకుణ్ణైపోతేన ‘ అని అంటూనే ఉన్నాడు.

ఉన్నట్టుండి అలేహిన్ దగ్గరికి వెళ్ళి అతడి చేతులు తన చేతుల్లోకి తీసుకుని వేడుకోలు స్వరంతో ‘పావెల్ కోన్ స్టాంటినోవిచ్, సంతృప్తిగా, మౌనంగా ఉండిపోకు, నీకు నువ్వు జోలపాడుకోకు, నువ్వింకా యువకుడిగా,బలంగా, ఆత్మవిశ్వాసభరితుడిగా ఉండగానే సుఖమయజీవితంలో కూరుకుపోకు. సంతోషమంటూ ఏదీ లేదు. ఉండటానికి వీల్లేదు కూడా. మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉన్నాయనుకుంటే ఆ పరమార్థం సంతోషమైతే కాదు, అంతకన్నా గొప్పది, మరింకేదో మరింత న్యాయసమ్మతమైంది, ఉంది. దయచేసి దాన్ని వెతుకు’ అన్నాడు.

జాలిగొలిపే గొంతుతో, వేడుకుంటున్నట్టుగా అతణ్ణి తనకేదో వ్యక్తిగతంగా సాయం చెయ్యమని అడుగుతున్నట్టుగా ఇవాన్ ఇవనోవిచ్ ఆ మాటలు మాట్లాడేడు.

కొంతసేపు ఆ ముగ్గురూ ఆ డ్రాయింగు రూములో తలోమూలా తమ తమ కుర్చీల్లో మౌనంగా ఉండిపోయేరు. ఇవాన్ ఇవనోవిచ్ చెప్పిన కథ బుర్కిన్ కీ, అలేహిన్ కి కూడా ఏమంత బాగా అనిపించలేదు. పైన గోడలమీంచి బంగారు ఫ్రేములు కట్టిన పటాల్లోంచి సైనికాధికారులూ, స్త్రీలూ తమని చూస్తూ ఉండగా, ఉసిరికాయలు తినే ఒక బీద గుమస్తా కథ వినడం, వాళ్లకి ఏమంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఆ సమయంలో వాళ్ళకి ఎంచాతనో ఎవరేనా నాగరీకులైన పురుషుల గురించి, స్త్రీల గురించీ మాట్లాడుకుంటే బాగుణ్ణనిపించింది. ఆ గోడలమీద పటాల్లోంచి తమకేసి చూస్తున్న ఆ మనుషులు కూడా ఒకప్పుడు ఈ గదిలోనే మసిలారనీ, కూర్చున్నారనీ, టీ తాగారనీ ఆ డ్రాయింగు రూములో ప్రతి ఒక్కటీ- ఆ షాండ్లియర్లు, వాటి కవర్లూ, ఆ చేతుల కుర్చీలూ, వాళ్ళ కింద తివాసీ వాళ్లకి గుర్తుచేస్తున్నట్టుగా అనిపించింది. చప్పుడు చెయ్యకుండా తమకి అన్నీ అమర్చిపెట్టే ఆ అందమైన పెలగేయ ఆ కథకన్నా ఎక్కువ ఆకర్షణీయమనిపించింది.

అలేహిన్ కి నిద్ర ముంచుకొస్తూ ఉంది. అతను ఆ రోజు మరీ పొద్దున్నే మూడున్నరకే లేచి పనిలోకి వెళ్ళిపోయాడు. అందుకని ఇప్పుడు అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. కాని తీరా తను వెళ్ళిపోయాక తన అతిథులు మరేమన్నా చక్కటి విషయాలు మాట్లాడుకుంటారేమో అని అక్కడే కదలకుండా కూచున్నాడు. ఇవాన్ ఇవనోవిచ్ అప్పటిదాకా చెప్పింది సరైనదా కాదా అని అతడు ఆలోచించడం లేదు. అలాగని ఆ వచ్చినవాళ్ళు రూకలగురించో, ఎండుగడ్డిగురించో, తారు గురించో అలాంటిదే ఏదో ఒకటి తన జీవితంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నదాని గురించి దేని గురించీ మాట్లాడటం లేదు. కాబట్టి అతడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే సంతోషంగా వింటూ ఉన్నాడు.

‘ఇంక పడుకుందామా’ అన్నాడు బుర్కిన్ లేస్తూ. ‘నాకు సెలవిప్పించండి’ అన్నాడు.

అలేహిన్ కూడా సెలవు తీసుకుని మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయాడు. అతిథులు మాత్రం పైన ఉండిపోయారు. ఆ గది చాలా పెద్దగా ఉంది. అక్కడ నగిషీ చెక్కిన రెండు పెద్దచెక్క మంచాలు ఉన్నాయి. ఒక మూల దంతంతో చేసిన సిలువ బొమ్మ ఉంది. అందమైన పెలగేయ ఎంతో చక్కగా సర్దిపెట్టిన ఆ పక్కల మీద ఉతికి చలువచేసిన దుప్పట్లు సువాసనలీనుతూ ఉన్నాయి.

ఇవాన్ ఇవనోవిచ్ నిశ్శబ్దంగా దుస్తులు మార్చుకుని పడుకున్నాడు.

తన తలమీంచి బొంత లాక్కుంటూ ‘దేవుడా, పాపులం మమ్మల్ని క్షమించు’ అనుకున్నాడు.

పక్కన బల్ల మీద అతడి పైపునుంచి పొగాకు వాసన ఘాటుగా వస్తూ ఉంది. చికాకుపెడుతున్న ఆ వాసన ఎక్కణ్ణుంచి వస్తున్నదో అర్థం కాక బుర్కిన్ కి చాలాసేపు నిద్రపట్టలేదు.

ఆ రాత్రంతా కిటికీ అద్దాల మీద వాన చిటపటచప్పుడు చేస్తూనే ఉంది.

25-10-2022

Leave a Reply

%d bloggers like this: