అద్వితీయ జయగాథలు

Reading Time: 3 minutes

PUDAMI TALLI NESTAM

నెక్కంటి సుబ్బారావుది పశ్చిమగోదావరి జిల్లా ఆచంట గ్రామం. ఇప్పుడు ఆయన ఎనభై ఆరేళ్ళ వృద్ధుడు. ఈ మధ్య ఆయన్ని మింట్ పత్రిక తలుచుకుంది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళల్లో భారతదేశం రూపురేఖలు మార్చిన పది ఆవిష్కరణల గురించి రాస్తూ ఆ పత్రిక ఐ.ఆర్. 8 వరి వంగడాన్ని కూడా వాటిల్లో ఒకటిగా పేర్కొంది. 1966-67 కు పూర్వం దేశం ఆహారధాన్యాల్ని దిగుమతి చేసుకోవలసిన పరిస్థితుల్లో ఉండేది. ఆ పరిస్థితినుంచి దేశాన్ని తిండి గింజల విషయంలో స్వావలంబన సాధించిన సస్యవిప్లవానికి దారి చూపించిన వంగడం అది. దాన్ని మొదటిసారిగా ప్రయోగాత్మకంగా అమలు చేసి అద్భుతమైన ఫలితాలు రాబట్టిన రైతు నెక్కంటి సుబ్బారావు.

ఆ రోజుల్లో ఎకరాకి పదిహేను బస్తాల దిగుబడి పెద్ద విషయం. కొత్తరకం వరివంగడాలు వాడి సుబ్బారావు ఎకరాకి 45 బస్తాల దిగుబడి సాధించారు. గోదావరి జిల్లాల్లాంటి సాంప్రదాయిక సస్యక్షేత్రాల్లో కొత్తరకం వరివంగడాలు, సేద్యపు పద్ధతులు ప్రవేశపెట్టడం అంత సులభం కాదు. తన తోటి రైతుల్ని తన వైపుకు తిప్పుకోవడం ఎంతో నాయకత్వ లక్షణాలు, ప్రభావశీలమైన వ్యక్తిత్వం ఉంటే తప్ప సాధ్యమయ్యే విషయాలు కావు. అదీకాక కొత్త వంగడాల్ని లాబరేటరీనుంచి క్షేత్రస్థాయికి తీసుకువచ్చినప్పుడు అగ్రానమిస్టులు ప్రయోగశాల పరిమితుల్లోనే ఆలోచిస్తూ ఉంటారు. ఆ వంగడాల్ని తమ శీతోష్ణస్థితులకీ, తమ నేల స్వభావానికీ అనుగుణంగా మలుచుకోవడం అందరికీ సాధ్యం అయ్యే విషయం కాదు. కాని సుబ్బారావుకు ఆ చాకచక్యం ఉంది. కాబట్టే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ సాధించలేనిదాన్ని ఆయన తన గ్రామంలో సాధించాడు.

దాంతో 60 ల చివర్లో, 70 ల మొదట్లో భారతీయ రైతులకు ఆచంట తీర్థస్థలిగా మారిపోయింది. భారతరత్న సి.సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.స్వామినాథన్ ల తో సహా, భారతదేశ వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులు, రాజకీయనాయకులు ఆ ఊరు సందర్శించడానికి బారులు తీరారు. వరి పంట తో పాటు సుబ్బారావు మొక్కజొన్నలో కూడా అటువంటి సాహస ప్రయోగాలే చేసి అద్భుతమైన ఫలితాలు రాబట్టేరు. దాంతో ఆయనకు ధాన్ పండిత్, కృషి పండిత్ లతో సహా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. 2009 లో బిల్ గేట్స్ భారతదేశం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన వ్యవసాయ సదస్సుకి ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించేడు. అప్పుడు ఆయన్ని సలహాలు, సూచనలు అడిగితే వ్యవసాయ పరిశోధనకు గాను పరిశోధనా సంస్థలకే నేరుగా గ్రాంట్లు విడుదల చెయ్యమని కోరాడు. గేట్స్ ఫౌండేషన్ ఆ అభ్యర్థను అంగీకరించింది కూడా.

భారతీయ సస్యవిప్లవంలో నెక్కంటి సుబ్బారావు పోషించిన పాత్ర క్షీర విప్లవంలో డా.కురియన్, అంతరిక్ష పరిశోధనలో ప్రొ. విక్రం సారాభాయి, ఉపగ్రహాల ప్రయొగంలో డా. కలాం చేసిన కృషికి సమానమైన కృషి. కాని అటువంటి ఘనకీర్తి కలిగిన తెలుగువాడికి మింట్ పత్రిక జైకొట్టేదాకా మనకి తెలియకపోవడం దురదృష్టం.

ఒకసారి ఆయన గురించి తెలిసిన తరువాత మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం సహజంగానే కలుగుతుంది. ఆ ఆసక్తిని తీర్చడానికా అన్నట్టు ఆయన ప్రయాణాన్ని ‘పుడమితల్లి నేస్తం ‘అనే కథగా మలిచి మనకి అందిస్తున్నారు డా.గోటేటి లలితాశేఖర్. ఆమెది కూడా ఆచంట గ్రామమే. కాని తర్వాత రోజుల్లో గుంటూరు వచ్చేసారు. గొప్ప సాహిత్యాభిమాని, భావుకురాలు. ఆమె తన చిన్నతనంలో సుబ్బారావుగారిని చాలా దగ్గరగా చూసారు. ఆ జ్ఞాపకాల సహాయంతో, అపారమైన గౌరవంతో మనముందుంచిన పుస్తకం పుడమి తల్లి నేస్తం.

అయితే భారతదేశం సస్య విప్లవం రోజులనుంచి చాలా దూరం ముందుకు వచ్చేసింది. సస్య విప్లవం భారతదేశానికి ఆహారస్వాతంత్య్రం సాధించిన మాట నిజమేగాని, ఆర్థిక అంతరాల్ని కూడా తీవ్రంగా పెంచిందన్న మాట కాదనలేం. ఆ ఆర్థిక అంతరాలు, తర్వాత రోజుల్లో, విద్య, ఉద్యోగితల్లో కూడా అంతరాలుగా బయటపడ్డాయి. సస్య విప్లవం భూస్వాముల్ని మరింత ధనికుల్ని చేసింది. సేద్యంలో రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగం అడ్డూ అదుపూ లేకుండా చేసింది. అందుకని ఇప్పుడు భారత గ్రామీణ అభివృద్ధిని, గ్రామ స్వరాజ్యాన్ని కోరుకునేవారు సన్నకారు, చిన్న రైతుల్ని, రైతుకూలీల్ని సంఘటిత పరిచి వారి ఆర్థిక స్వావలంబన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల్తో పనిలేని సేంద్రియ వ్యవసాయంతో ప్రయోగాలు చేస్తున్నారు. పర్యావరణ సమతౌల్యం భంగపడకుండా ఆహారభద్రతని నిలుపుకోడానికి ZBNF ఉద్యమం చేపడుతున్నారు.

నాకు ఆశ్చర్యం కలిగింది ఎక్కడంటే, లలిత గారు తన కథల పుస్తకంలో ఇటువంటి కొత్తతరం రైతుల గురించీ, నాయకుల గురించీ కూడా రెండు కథలు రాయడం. ఒకరు విజయనగరం జిల్లా బాడంగికి చెందిన శాంతి. ఆమె దీక్షా మహిళా వెల్ఫేర్ సొసైటీ స్థాపించి దానిద్వారా రైతు సహకార ఉద్యమం నడుపుతున్నది. మరొకరు నందేల ఏడుకొండలు. ఆయన మైక్రో బయాలజీలో ఎమ్మెసీ పూర్తిచేసి, మల్టీ నేషనల్ కంపెనీలో చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టి పిడుగురాళ్ళలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. తన పొలంలోనే ఇల్లుకట్టుకుని తన తల్లిని, కుటుంబాన్ని చూసుకుంటున్నాడు.

తెలుగు సాహిత్యంలో భూమిగురించి, భుక్తి గురించి రాయని వాళ్ళు లేరు. భూమి పోరాటాల గురించి విస్తారమైన సాహిత్యం దాదాపుగా అన్ని ప్రక్రియల్లోనూ వచ్చింది. కాని రైతు కడగండ్లనీ, దోపిడీనీ, పీడననీ చిత్రించడం పట్ల తెలుగు రచయితకి ఉన్న ఆసక్తి రైతు విజయగాథలు నమోదు చెయ్యడం మీద లేదు. జయగాథల గురించి చెప్పడమంటే ప్రభుత్వానికి మద్దతు పలికినట్టుగానూ, pro-establishment వైఖరి అవలంబించినట్టుగానూ భావిస్తాడు తెలుగు రచయిత. కాని అది అతడి పరిమితుల్నే తెలియచెప్తుంది తప్ప, అతడి అవగాహనని కాదు. ప్రతి జయగాథా ముందు ఒక మనిషి తన పరిస్థితుల మీద విజయం సాధించిన నాయకత్వ గాథ. social entrepreneur గా మారితే తప్ప ఏ రైతూ బీదరికం నుంచి బయటపడడు. ఆ ప్రయాణం ప్రధానంగా అతనిదీ, అతని సహచరులదీను. ప్రభుత్వం వారికి సహాయపడి ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే కథ.

నేను తెలుగు రచయితలనుంచి, పత్రికలనుంచి, ప్రసార మాధ్యమాల నుంచి ఇటువంటి కథలు ఆశిస్తాను. స్ఫూర్తిదాయకమైన ఇటువంటి జీవితాల గురించి తెలుసుకుని ఒకరిద్దరు మారినా అది గొప్ప విషయమే. కాని వ్యవసాయ విశ్వవిద్యాలయాలనుంచో, రైతుకూలీ ఉద్యమాల నుంచో కాక, ఒక సాధారణ గృహిణి, తన మధ్యతరగతి డ్రాయింగు రూము నుండి ఇటువంటి పుస్తకం వెలువర్చడం నాకు సంభ్రమాన్ని కలగచేస్తున్నది. ఈ మధ్య కుందుర్తి స్వరాజ్య పద్మజగారు రాసిన ‘ఆకుపచ్చని నేల కోసం’ కూడా ఇంత విస్మయాన్నీ కలిగించింది.

లలితగారికి నా అభినందనలు. ఆమె డా. సుబ్బారావు గారి జీవితప్రయాణాన్ని మరింత విస్తృత రూపంలో తీసుకురావాలనీ, అలాగే మరిన్ని జయగాథల్ని వెలుగులోకి తేవాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


పుడమి తల్లి నేస్తం, అమరావతి పబ్లికేషన్స్, 4-21-81, చైతన్యపురి, సాయిబాబా రోడ్, గుంటూరు-522 007, ఫొన్: 92915 30714, వెల రు.100/-

24-10-2022

5 Replies to “అద్వితీయ జయగాథలు”

 1. వ్యవసాయం గురించిన విషయాలు అందునా విజయగాథలు నాకు చాలా ఇష్టం.నేను గ్రాడ్యుయేషన్ తరువాత వ్యవసాయం చేయాలనుకున్నా కుటుంబ పరిస్థితుల వల్ల కుదరలేదు.అయినా ఆ ఆసక్తి తగ్గలేదు.కాగజ్ నగర్ ఉన్నప్పుడు ఇంటి ముందు చిన్న తోటతో తృప్తిపడే వాడిని.అప్పుడు నాకు నా కుమారుడు సహకరించాడో లేదో గుర్తుల్ని కానీ అది తన పైన మంచి ప్రభావం కలిగించిందని చెప్పగలను.ఇప్పుడు అమెరికాలో తన ఇంటి వెనుక పూలచెట్లు,పండ్ల చెట్లు,కూరగాయల చెట్లు పెంచడం నాకు సంతోషాన్ని కలిగిస్తూంది.వీడియో కాల్ చేస్తే తోటంతా తిరిగి చూపిస్తాడు.మన విద్యా విధానాన్ని కర్షక ప్రాధాన్యం కావిస్తేబాగుండేదని నేను పని చేసిన పల్లె బడుల విద్యార్థులను చూసినప్పుడు అనిపించేది.వంద మందిలో పది మంది పై చదువులకు అర్హత కలిగి ఉంటారు.ఆ పదిమంది కోసమే మన విద్యా విధానం రూపొందించ బడింది.మిగతా తొంభై మందికి సరియైన మార్గదర్శకం సాంకేతిక వ్యావసాయిక రంగాల వైపు నడిపించేదిరా ఉంటే బాగుండేది.
  మీరన్నది వాస్తవం.మన రచయితలు విధ్వంసాన్ని చెప్పినంతగా విజయాలను ప్రస్తుతించరు.మంచి విషయాన్ని ఎత్తి చూపారు.అభినందనలు.

  1. మీ ప్రతిస్పందన చాలా సంతోషంగా ఉంది. అందులోనూ ఇంత చక్కటి అనుభవాన్ని మీరు పంచుకున్నందుకు మరీ సంతోషంగా ఉంది.

   1. FARMERS FACE MANY PHYSICAL AND MENTAL HURDLES ALONG THE LENGTH OF THEIR LIFE. SUICIDES ARE ALSO MORE COMMON AMONG FARMERS, DUE TO UNCERTAIN WEATHER, CROP PRICE DISCREPANCIES , AND CREDIT/LOAN ISSUES . HOWEVER JAI KISAN , AS FUTURE IS FOR THOSE ENTER INTO ORGANIC FARMING WITH PASSION AND ATLEAST ALSO AS A HOBBY .

   2. చినవీరభద్రుడి గారి విశ్లేషణకూ, సూచనలూ కృతజ్ఞతలు. వారు వచ్చిన సభలు సాహితీ సౌరభంతో వెల్లివిరుస్తాయి.తెలుగుసాహిత్యం లో
    వారిస్ధానం నెమలి పింఛం వంటిది..

Leave a Reply

%d bloggers like this: