రాజమండ్రి డైరీ: మలిమాట

రాజమండ్రి డైరీలో పేజీలు పూర్తయ్యాయి. మీకు లానే నేను కూడా ఆ పేజీల్ని ఆసక్తిగా చదివాను. నా యవ్వనకాలంలో ఆ పట్టణంలో ఆ మిత్రబృందంతో గడిపిన ఆ రోజులు, ఆ గురువులు, ఆ చర్చలు, ఆ పుస్తకాలు, ఆ సినిమాలు అన్నీ కళ్ళముందు మెదిలాయి.

నిజానికి అప్పటికి నేను రాజమండ్రి వెళ్ళి నాలుగేళ్లు గడిచిపోయాయి. ఆ ఊరు తన వాతావరణంతో, తన జిజ్ఞాసతో, తన ప్రకర్షతో, తన సాహిత్యసౌరభంతో నన్ను ఆకర్షించిన ఆ తొలిరోజులు, గౌతమీ గ్రంథాలయంలో నేను తత్త్వశాస్త్రం అధ్యయనం చేసిన ఆ సాయంకాలాలు, గోదావరి ఒడ్డున గడిపిన ఆ రాత్రులు ఇందులో నమోదు కానే లేదు. నిజానికి ఇవి రాజమండ్రిలో నా చివరి దినాల అనుభవాలు. తొలిప్రేమలోని ఉద్వేగం నెమ్మదిగా గాఢమైన అనుబంధంగా మారుతూ, ఒకళ్ళనొకళ్ళు విడిచి ఉండలేక, అలాగని అంటిపెట్టుకోనూలేక, నలుగులాట పడే దశ తాలూకు కథనం.

ఆలోచించాను, ఆ రోజుల్లో ఏది నా ప్రధానమైన అనుభవం? దేని గురించి నా కీలకమైన వెతుకులాట? పైపైన ప్రవహించి పోయే జలాల కింద గోదావరి లోతుల్లో దాచుకున్న ఆరాటం దేనిగురించి? మళ్ళా చదువుకుంటే నాకు అనిపించింది, ఆ రోజులంతటా నేను సార్థకమైన పనికోసం, నలుగురికీ పనికొచ్చేవిధంగా శ్రమించే దైనందిన జీవితం గురించి తపిస్తూ ఉన్నానని. ఉద్యోగం చేస్తున్నాను నిజమే, కాని ఆ ఉద్యోగం నాకు అర్థవంతంగా అనిపించలేదు. బహుశా ఇప్పుడు చెప్పవచ్చు, ఆ ఉద్యోగాన్ని కూడా ఒక బాధ్యతగా నెరవేరిస్తే నీకు అసంతృప్తి ఉండకపోయి ఉండేదని. నువ్వు చెయ్యకతప్పని ఆ పనిని ఇష్టపడి ఉండవలసింది అని.

కాని అవి మార్క్స్ ని చదువుకున్న రోజులు. ఎలియనేషన్ గురించి చర్చించుకున్న రోజులు. శ్రామికుడు తన పనిలో ప్రతిఫలాన్నే కాదు, పనిలో పరమార్థానికి కూడా దూరమవడమే ఎలియనేషన్ అని మార్క్స్ చెప్పాడు. మనిషి పనిచేస్తున్నప్పుడు తనని తానొక జంతువుగా అంటే ఎద్దులానో, గాడిదలానో భావించుకుంటూ, తింటున్నప్పుడూ, తాగుతున్నప్పుడూ మాత్రమే తనని తాను మనిషిగా భావించుకుంటాడు, శ్రమ పరాయికరణ చెందడంలోని వైపరీత్యం ఇది అన్నాడు మార్క్స్.

బహుశా ఆ కాలమంతా, నలుగురం కలిసి పనిచెయ్యగల అనుభవం సాహిత్యం చదువుకోవడం, చర్చించుకోవడం, నాటకాలు రాయడం, వెయ్యడం, పుస్తకాల గురించి మాట్లాడుకోవడం, నలుగురికీ చెప్పడం-ఇదే. కాబట్టే, ఆ క్షణాల కోసం అంతగా ఉవ్విళ్ళూరేవారమనీ, ఆ క్షణాలే జీవితంగానూ, తక్కిందంతా రొటీన్ గానూ భావించేవాళ్ళమనీ అర్థమవుతున్నది. కాని ఆ పని కూడా ఎందుకు మమ్మల్ని పూర్తిగా సంతృప్తిపరచలేదో అర్థం కాకుండా ఉన్నది. నలుగురం కలిసి, మాట్లాడుకున్నాక, ఎవరి దారిన వారం ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళా మమ్మల్ని ఒంటరితనం ముంచెత్తడం మాలో ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వస్తూనే ఉండింది. ఆ డైరీలో పేజీలు ఇప్పుడు చదువుతుంటే ఏదో పందొమ్మిదో శతాబ్ది రష్యన్ నవల చదువుతున్నట్టుగా ఉంది. చివరికి శరభయ్యగారి లాంటి భావుకుడూ, జ్ఞానీ కూడా companionless, అదే అసలు దుఃఖమంతానూ అని అన్నాడంటే, అంతకన్నా ఒంటరి జీవితం మరొకటి ఉందా అనిపిస్తున్నది. అదే ఆ జీవితంలోని విరోధాభాస. అంత చురుకైన మిత్రబృందం, కాని ఎవరికి వారు తమలో తాము ఒక ఒంటరి గుహను మోసుకుంటూ తిరుగుతూనే ఉండటం.

చెకోవ్ Gooseberries కథలోలాగా సంతోషంగానో, సోమరిగానో గడిపే ప్రతి ఒక్క మనిషివెనకా ఒకరు సుత్తి పట్టుకుని జీవితవాస్తవాల్ని మోదిచెప్తూండాలి. అలాగని ఆ రోజుల్లో జీవితవాస్తవాలు, ఉద్యమాలు, పోరాటాలూ మాకు తెలియవని కాదు. కాని అవి మా రోజువారీ జీవితంలో భాగం కాలేదు. ఇప్పుడు కూడా నా నమ్మకం అదే. ఏ ఉద్యమమైనా, పోరాటమైనా మనుషుల దైనందిన జీవితంలోకి ఇంకకపోతే, అది ఏ కొద్దిమందో చేసే పోరాటంగానే మిగిలిపోతుంది. వాళ్ళకి, ప్రధాన స్రవంతి సమాజం అప్పుడప్పుడు సానుభూతి పలుకుతూ, తాను మాత్రం సాయంకాలం కాగానే టెలివిజన్ చూస్తూ గడుపుతుంటుంది.

ఆ రోజుల్లో చాపకింద నీరులాగా అనుభవానికొచ్చిన ఆ వెలితి, ఆ ఒంటరితనం అలా వుంచి, అంత దగ్గరగా, అంత దైనందినంగా కలిసి అభిప్రాయాలూ, అనుభూతి పంచుకునే మిత్రబృందం నాకు మళ్లా లభించలేదు. ఆ కలయికల్లో, ఆ కబుర్లలో ఆకర్షణ ఎటువంటిదో గాని అది నా తక్కిన యాంబిషన్స్ అన్నింటినీ మరపించేసింది. ఆ రోజుల్లో నేను కటిక పేదరికం చవిచూసాను. వచ్చే జీతం మా అవసరాలకి ఏ మూలకీ సరిపోయేదీ కాదు. రెండో తేదీ తర్వాత మళ్ళా చేతిలో పది రూపాయలు కూడా ఉండేవి కావు. కాని ఇప్పుడు ప్రయత్నించి గుర్తు తెచ్చుకుంటే తప్ప ఆ విషయాలు గుర్తు రావడంలేదు. గుర్తొస్తున్నవల్లా ఆ రోజువారీ కలయికలు, ఆ వారాంత ప్రయాణాలు, ఆ వెన్నెల రాత్రులు మాత్రమే.

23-10-2022

2 Replies to “రాజమండ్రి డైరీ: మలిమాట”

  1. పందొమ్మిదో శతాబ్ది రష్యన్ నవల చదువుతున్నట్టుగా ఉంది. నిజం. ఇంకా.. నాకు చలం మ్యూజింగ్స్ చదువుతున్న ఆనందాన్నీ ఇచ్చింది

    1. మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు. మీరు ఈ బ్లాగ్ ఫాలో అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

Leave a Reply

%d bloggers like this: