
20-12-1986
స్మితా పాటిల్ మీద చిన్న write-up రాసాను. ‘ఆధునిక జీవితమూ, modern media నాకు ఎందుకు ఇష్టమంటే అవి మాత్రమే ఆమెలాంటి మిత్రురాల్ని ఇవ్వగలవు కనుక. ఇక స్మితా ఎందుకు ఇష్టమంటే ఆమె ఆధునిక జీవితాన్నీ, ప్రచారసాధనాల్నీ సృజనాత్మకంగా మార్చివేసింది కనుక’ అని రాసాను.
రాత్రి బి.ఎస్. గోపీచంద్ లతో ‘మాయాబజార్’ కి.
సాయంకాలం ఆఫీసు మేడమీంచి చూస్తే వూరంతా క్రిస్మస్ కాంతులు. చల్లని గాలులు తెరలు, తెరలుగా..
‘అవకాశం, ఆనందం, ఆలోకం..
క్రీస్తు వెలసినాడు మరల, లోకమంత నిశ్శోకం.’
బైరాగి మనసులో మెదుల్తున్నాడు.
21-12-1986
జహీరా బేగంగారి తమ్ముడి పెళ్ళి. ముస్లిం వివాహం ఇదే చూడటం. నిరాడంబరంగా వుంది. Sanctity విషయంలోనూ, rituality విషయంలోనూ అన్ని religions ఒకటే అన్పించింది. పెళ్ళికూతుర్ని చూడాలన్న కుతూహలం కూడా నెరవేరింది. లోపల మంచం మీద feverish నేత్రాల్తో నూర్-ఎ-ఛష్మే…
సాయంకాలం టివిలో ‘మంథన్’ ఫిల్మ్. శ్యాం బెనిగల్ చాలా success అయ్యాడు. మంచి సంయమనమూ, అవగాహనా వున్నాయి. ముఖ్యంగా ముగింపు. Uncompromising restraint. అసలు బెనిగల్ ఇలాంటివే తియ్యగలడు. మానసాంతర్యాల లోతుల్ని అతను explore చెయ్యలేడు. Basically, he is a documentarian.
22-12-1986
అక్క పాల్వంచ నుంచి వుత్తరం రాసింది. సీతారాం కీ, అనిల్ కీ, జగన్నాథరావుగారికీ వుత్తరాలు రాసాను. చండీదాస్ కి కూడా రాయకుండా వుండలేకపోయాను.
నిన్న రా-నుంచి అందిన ఉత్తరం. దానిలో ఆవిరికక్కిన ద్వేషం. రాత్రి గోపీతో చాలాసేపు వ్యథపడ్డాను. ఆ వుత్తరం, అతని వాక్యాలు.. వీటికన్నా ఆ వెనక ఉన్న దౌర్బల్యం, ఉపశమనం కాని ద్వేషం, అణుచుకోలేని ego conflict -ఇవే మరింత బాధపెట్టాయి.నా నమ్మకాల్ని నీరసపరిచే ఈ స్నేహాలు ఒకదాని వెనక ఒకటి ఎందుకు నాకిలా? ఎవరో ఒకరిద్దరు strong minded people తప్ప తక్కినవాళ్ళంతా ఎందుకు నాతో ఇట్లా ద్వేషంలోకి వస్తారు? నిజంగా నేను వాళ్ళకి ఇస్తున్నదేమిటో, communicate చేస్తున్నదేమిటో వాళ్ళకి అర్థం కాదా? లేక అర్థమయ్యీ, దాన్ని తట్టుకోలేకపోతున్నారా? లోపం ఎక్కడుంది? నాలోనా? వాళ్లలోనా?
23-12-1986
రెండు రోజులుగా మబ్బు. రాత్రిపూట సన్నని జల్లు. తెలియని ఆహ్లాదమేదో లోపల వికసించింది. బయటి రొద బయటనే వీగిపోతోంది. అట్లాంటి ఆహ్లాదాన్ని మరింత ఆహ్లాదపరుస్తో సైగల్ ప్రేమ పాటలు.
పా-ని మళ్ళీ కలిసాను. ఆ అమ్మాయితో మాట్లాడుతోంటే ఎప్పటి నిర్మలమయిన ఆ presence, ఇప్పటి ఆ అమ్మాయి courage. ఇవే, ఎంతో చల్లగా.
రాత్రి తమ్ముడితో కబుర్లు.
‘సిరిసంపదలు’ ఫిల్మ్ కి, ఆ పైన రూమ్‌కి.
24-12-1986
Nirvana is utter extinction of all that is base in us1 – కాని ఇదెలా సాధ్యం? ఎట్లా మనలోని నేలబారుతనం ఇంకిపోతుంది? దాన్ని ఒదుల్చుకోవాలనే కదా యీ ప్రయత్నాలు? కాని Is it possible without any noise, rapture or rambling? Is it attainable in all silence and utter humility?
సి.హెచ్.ఆత్మ గానం. ఆత్మగానమే.
25-12-1986
సుదర్శనం మాష్టారి యింటికి పొద్దున్న వెళ్ళాను. ఏమీ చర్చించాలని కాదు, కొన్ని క్షణాల ఆయన presence కోసం. కాని ఆయనే అడిగితే చెప్పాను: ‘అసలు సంసార వృక్షం అనే కాదు, మీ సృజనాత్మక సాహిత్యమంతా కూడా expression of detachment. కాని యీ నిస్సంగత్వం ఒట్టి నిస్సంగత్వం కాదు. గొప్ప love లోంచి వచ్చింది. experience ని రెండు చేతులూ చాపి ఆహ్వానించేదే తప్ప reject చేసేది కాదు’ అని. బహుశా నేను core of the soul నే touch చేసి వుండాలి. ఆయన దాన్నే అట్లా విశదపరుస్తోన్నారు.
సాయంకాలం వేదిక meet. కొత్త కార్యవర్గం. ఇన్నాళ్ళకు free అయ్యాను. ఇంక నెమ్మదిగా యీ institutional bonds ని ఒదుల్చుకోవాలి.
చాలా రాత్రి దాకా శరత్, బి.ఎస్. గోపీ. over drink. నెమ్మదిగా నా మిత్రులు దానికి లోబడటం చూస్తున్నాను. అక్కడ మాత్రమే తమ real face ని బయటపరుచుకోవడం.
26-12-1986
పెళ్ళికి వెళ్లలేకపోయాను, ఎంత ఉత్సాహం వున్నా.
చిన్ననాటి మిత్రులు, ఆ రోజులన్నీ ఎక్కడికి పోతాయి? ఆ అమ్మాయి కుటుంబం, మరీ చిన్నప్పటి దినాలు, ఆ తర్వాత మిషన్ స్కూల్లో, కాలేజి హాస్టల్లో ఆ అమ్మాయి చదువు. ఇవాళ మరొక ముఖ్యమైన దశలో ప్రవేశిస్తోంది. ఎప్పుడయినా తన నిష్కపటమయిన స్నేహం, courage-ఇవే అంతగొప్పగానూ నిలుస్తాయి. గడిచిపోయిన ఆ రోజులు, ఆ రాత్రులు, ఆ కబుర్లు, ఆ అర్థం లేని కలయికలు-ఇవి తమ ప్రభావాన్ని తాము చూపిస్తూనే వుంటాయి.
I wish all the best of the world to them.
రాత్రి పాల్వంచ నుండి ఇంటికి వెళ్తూ నాన్నగారు.
27-12-1986
పెళ్ళి బాగా జరిగిందని పిల్లలు చెప్పారు.
కొత్త దంపతులు హోటల్ మేడూరిలో లంచ్ ఇచ్చారు. నేను పెళ్ళికి వెళ్ళనందుకు నొచ్చుకోవడం తెలుస్తూనే వుంది..
సాయంకాలం కాకినాడకి.
28-12-1986
సోమరిగా గడిపాను.
Work అనేది ఒట్టి నిర్ణయంలోంచో, ఒక తీర్మానం లోంచో కాదు, ప్రేమలోంచి రావాలి. అప్పుడే అది పరిపూర్ణమైన శ్రమ అవుతుంది. నా సోమరితనం ప్రేమలేకపోవడం లోంచి వచ్చిందే. ఇది నన్ను క్రూరపరచడం, brutalising, కూడా తెలుస్తోంది. కాని, నిజంగా నాకు ప్రేమలేదా? లేక దాన్ని వ్యక్తం చెయ్యగలిగే శక్తి లేదా?
29-12-1986
ఇక్కడికి వచ్చేసరికల్లా room vacate చెయ్యాల్సిన అవసరం. an unwarranted problem.
Severe headache తో అట్లా పడి వున్నాను రార్తి దాకా. సుబ్బూ, తమ్ముడూ company.
రాత్రి ‘లేడీస్ టైలర్’ ఫిల్మ్ కి.
30-12-1986
ఇలా రూమ్ కోసం తిరిగే బదులు మూడు నాలుగు నెలలు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోతే బాగుణ్ణు అన్పిస్తోంది.
మాష్టార్ని కలిసాను. సుదర్శనంగారి నవలలు చదివారుట. చాలా యింప్రెస్స్ అయినానని చెప్పారు. ఆయన మరీ సన్నిహితంగా తెలిసారని అన్నారు. A true compliment.
చాలా రోజుల తర్వాత మళ్ళీ కాసేపు గౌతమీ లైబ్రరీలో.
31-12-1986
సంవత్సరం ముగింపుకొచ్చింది. ఇట్లా యీ సంధ్యవేళ ఆఫీసు గదిలో కూచుంటే- వెళ్ళిపోతున్న సంవత్సరం మృదువుగా, నిర్లిప్తంగా వెళ్ళిపోతున్నట్లే వుంది.
నది ప్రవహిస్తూనే వుంది. తీరాలు పంకిలాలై కంపుకొడుతున్నాయి. దూకితే నదీగర్భంలోకి దూకాలి. వెచ్చగానో, చల్లగానో. అద్భుతమో, అనుభవమో-అది-కాని ఇట్లా ఈ వొడ్డున, యీ దుమ్ములో, దుర్గంధంలో నది ఏమర్థమవుతుంది? ప్రవాహం ఏం సందేశాన్నిస్తుంది?
అయినా hopeful గా చూస్తాను. ఇది నా విధి. బహుశా ఇది ఒక్కటే అన్ని విధుల్లోకి ఆనందకరమైన విధి అనుకుంటాను.
17-10-2022
________________________
1 గాంధీ డైరీలో ప్రతి పేజీలోనూ ఒక గాంధీ కొటేషను ఉంటుంది. ఈ వాక్యం కూడా అటువంటి కొటేషనే, గాంధీగారిది.