
7-12-1986
కాకినాడ వెళ్ళలేదు. భాస్కరరాజూ1, ఆయన ట్రూప్ wait చేస్తుంటారు. ఇవాళ అంతా ప్రయత్నించాను. నా వల్ల కాదు, ఆ lifeless characters మీద ఇంక నేను experiment చెయ్యగలిగిందీ, రాయగలిగిందీ ఏమీ లేదు.
మధ్యాహ్నం పెమ్మరాజు ఇంట్లో. అతని నిష్కపట సాన్నిహిత్యం, దాని సారళ్యమూ చల్లగా తాకినాయి.
టివిలో మధ్యాహ్నం ఒక మళయాళం ఫిల్మ్. కొన్ని కొన్ని చోట్ల careful narration. కాకపోతే ఎంతమాత్రం అర్థం కానిది, రాత్రి వచ్చిన, కుమార్ సాహ్ని ‘తరంగ్’. దాన్ని ఆ ఇక్బాల్ మసూద్ ఎందుకంత మెచ్చుకున్నాడో అర్థం కాలేదు.
8-12-1986
టాల్ స్టాయి Adolescence పూర్తి చేసాను. ఇప్పుడు ఆయన ‘యవ్వనం’ వైపు.
వసీరా కవిత్వం manuscript పెమ్మరాజునుంచి తీసుకుని చూసాను. చాలా గొప్ప force ఉన్న వాక్యశకలాలూ, కవితలూను. అతని మూగగొంతుక, దుఃఖాశ్రువులు- అంతరాంతరాల్లోంచీ కదిలిస్తున్నాయి. A harsh and naked expression. కత్తి అంచు మీద నెత్తుటిబొట్టులా వుంది ఆ కవిత్వమంతా.
9-12-1986
జగన్నాథరావుగారి నుంచి ఫోన్.
వెల్చేరు నారాయణరావు నన్ను చూడాలనుకుంటున్నారని.
అక్క, పాపాజీ ఇంకా రాలేదు. ఏ వార్తా తెలియదు.
మాష్టారు మేఘసందేశం మొదలుపెట్టారు. In his unparalleled way. నెమ్మదిగా దిగులునీ, మృదువయిన ఏదో అనిర్వచనీయమైన బాధని గుండెలోకి రేపుతారు- ఆ sickness కోసం-అట్లా నేనూ, గోపీచంద్రుడూ.
లత Indigo Mood-
వూదా వలయాల్లోకి, ఆమె స్వరతరంగాల మీంచి.
10-12-1986
పొద్దున్న పిల్లలకి David Copperfield చెప్తున్నాను. కాని వాళ్ళు impatient గా టైం చూసుకుంటో.
సాయంకాలాలు ఇలా మాష్టారి సన్నిధిన కాళిదాసుని అద్భుతలోకాల్లో విహరణ. గోపీచంద్.
అజంతా నుంచి ఉత్తరం ‘పుస్తకం అద్భుతం’ అంటో.
ఆ కథ నన్ను ఒత్తిడి చేస్తోండగానే అ-రాసిన ఉత్తరాన్ని చూపించింది గిరిజ. కథ-మామూలు ప్రేమకథలాంటి విఫలప్రణయగాథ-కాని ఆ వైఫల్యంలో, ఆ విషాదంలో నేను చూస్తున్న అందమో, సత్యమో ఆవిష్కరణకి రావాలి.
రాత్రులు ఇలా టాల్ స్టాయిని చదువుతో.
బయట మృదువైన వెన్నెల, లోపల సంగీతధ్వనులు.
11-12-1986
అజంతాకి రిప్లై.
రాత్రులు ఆవరించిన అలసటతో మగతగా వాలుతున్నాయి. నీరసంగా నిద్రకి జారుతో ఏవేవో కల్పనలు చిత్రించుకుంటున్నాను.
జీవితం వేరు, జీవితం గురించి చింతించడం వేరు.
12-12-1986
సాయంకాలం మాష్టారి దగ్గరకు వెళ్ళేటప్పటికి బసవపురాణం చదివించుకుంటో ప్రొఫెసరు వెల్చేరు.
మాష్టారు నిజంగా సాహిత్యజీవి. తనని అలా శ్రమపెట్టాలనే, తనని మనుషులు అందుకోసం వేధించాలనే ఆయన తపన- బల్లనిండా పుస్తకాలు పరుచుకుని-గొప్ప ఉత్సాహంతో కవిత్వం చదువుతోన్న ఆ మనిషి-ఎంత చాదస్తం నుంచీ, బాదరబందీ నుంచీ తప్పించుకున్నాడో.
రాత్రి మిత్రుల కలయిక. noisy meetings. ఆ రొదనే అట్లా భరిస్తో, దాని మధ్యనే వేదిక వార్షికోత్సవం plans.
13-12-1986
మధ్యాహ్నం అయింది కాకినాడ వెళ్ళేటప్పటికి. అక్కా, పాపాజీ వచ్చే వున్నారు. బావగారు మాత్రం పాల్వంచలోనే attending to his mother.
సెమినార్ కి మధ్యాహ్నం అక్కా, నేనూ వెళ్ళాం. చాలా rotten trash. ఒక్క రామారావు మాష్టారి honest words తప్ప. ఉదయం ప్రొఫెసర్ హరగోపాల్ గొప్ప క్లారిటీతో మాట్లాడేడని శరత్ అన్నాడు.
14-12-1986
రోజంతా సెమినార్ వాతావరణంలోనే. పొద్దున్న మోహన ప్రసాద్ speech, most unexpected, but terribly poetic and precise. ఆ ఆనందం ఆయనతో అట్లా చాలాసేపు పంచుకున్నాను. అక్కని కలిసి, ఆ పైన ఇస్మాయిల్ గారి దగ్గరికి. ఇస్మాయిల్ గారు ఇవాళ మరీ మృదువుగా వున్నాడు. తన వ్యాససంకలనం ఇచ్చాడు.
మధ్యాహ్నం శరత్, శ్రీరామమూర్తీ లంచ్ కి వచ్చారు. చంటి. రాత్రి కూడా. రామారావు మాష్టారు, వక్కలంక రామకృష్ణ డిన్నర్ కి వచ్చారు.
కేతువిశ్వనాథ రెడ్డి, చలసాని ప్రసాదరావు, మహీధర రామ్మోహనరావూ పరిచయమయ్యారు. మాట్లాడేను, పుస్తకాలిచ్చాను.
ఈ దినసరి కార్యక్రమం, ఈ కలయికలు, ఇలా ఉండగా, ఉదయం నుంచీ-స్మితా పాటిల్ పోయిందన్న వార్త-కలుక్కుమంటూంది, ఎవరో ఆత్మీయురాలు, మనని అర్థం చేసికొన్న మంచి మిత్రురాలు పోయిందనీ.
15-12-1986
రాత్రి స్మైల్ ఇంట్లో వెల్చేరుతో ఇష్టాగోష్టి. మిత్రులు వచ్చారు. active conversation, at times, leaping into discussion వెల్చేరు-అంతా బాగానే వుంది కాని-too clever, ఆ తెలివితేటలు, ఆ precautionary conversation నన్ను చాలా ఇబ్బందిపెట్టేయి. ఆయన నమ్మకాలు మిత్రుల్ని. కాని, నాకు వాటి పట్ల ఏమంత నమ్మకం లేదు.
మిత్రుల్తో చాలాకాలానికి మృదువయిన సాయంకాలం.
16-12-1986
మధ్యాహ్నం వెల్చేరు, స్మైల్-మహాలక్ష్మిలో lunch కి పిలిచారు. మూడింటికి ఆయన plane కి వెళ్ళేదాకా కూడానే వున్నాను. ఆయన నిన్నటికన్నా మరింత amicable గానూ, nearerగానూ వచ్చాడు, but only in movements. నిన్నటికన్నా ఇవాల్టి ఆయన మాటలు మరీ దూరంగానూ, self contradictory గానూ వున్నాయి. ఏ కారణం చాత ఆయన్ని అట్లా ఆ కాసేపూ అంటిపెట్టుకున్నానో తెలియకుండా వుంది. ముఖ్యం, గోపీచంద్ పొయెట్రీని అలా అన్న తర్వాత.
జగన్నాథ రావుగారికి ఫోన్ చేసాను. ప్రొగ్రాం గురించి ఇంకా స్పష్టంగా decide చెయ్యలేకపోయాం.
17-12-1986
ఆఫీసు మూడు నాలుగురోజుల్నుంచీ reeking with the worst smell. ఈ rumours, scandals లేదా ఇట్లాంటి happenings మన సామాజికం ఎంత క్షుద్రమో నెత్తిమీద మోది మరీ చెప్తాయి. తప్పుకొందామనుకున్నా, దూరంగా వుండాలని ప్రయత్నించినా- ఆ ప్రయత్నాలు కూడా ఆ విషయాన్ని మరీ project చేయడానికే.
సాయంకాలం శరభయ్యగారి దగ్గర.
జగన్నాథరావుగారికి ఫోన్ చేసాను. రామారావు మాష్టారి బంధువు పోయారట. programme వాయిదా వేస్తామని చెప్పాను..
18-12-1986
ఉదయం సుదర్శనంగారు ఆఫీస్ కి వచ్చారు టెలిఫోన్ పని మీద. చాలాసేపు చాలావిషయాల మీద కబుర్లు. చండీదాస్ నా పొయెట్రీని మెచ్చుకుంటూ తనకి ఉత్తరం రాసాడని- సాయంకాలం రమ్మంటే-వెళ్ళాను. అతని ఉత్తరం తాలూకు ఆనందం, అంతసేపు మాష్టారి సాన్నిధ్యం నుంచి ఆనందం-నిన్నటి బరువునుంచీ, worry నుంచీ తేలికపరిచాయి.
రాత్రి శరత్ ఇంట్లో మిత్రులం. సాహితీవేదిక కొత్త కార్యవర్గం గురించీ, కొత్తసంవత్సరం ప్రణాళికల గురించీ.
19-12-1986
ఉదయం అనుకోకుండా ఢిల్లీ నుంచి తమ్ముడు. చాలా విశేషాల్తో. కాని అతని యింతకాలంగా సాగిన effort వెనుక దూరదేశ జీవనం తాలూకు దిగులు, అత్యాధునిక జీవితం ఇచ్చే నిరాశ, విరక్తీను.
అన్నిటికన్నా మధ్యాహ్నం, వాళ్ళిద్దరూ! ‘మా పెళ్ళికి నువ్వు రావాలి అన్నాడు వాడు గొంతు పెగుల్చుకుని. ఒళ్ళంతా shiver అవుతూ. చెప్పొద్దూ, ఆ క్షణాన అన్నీ మర్చిపోయేను. తీవ్రమయిన compassion కి లోనయ్యేను. సాయంకాలం మిత్రుల్తో మళ్ళీ ఆ అమ్మాయిని కల్సినప్పుడూ ఇంకా ఆ ఉద్వేగం. అనేక విషయాల్నీ, మర్మాల్నీ గుర్తించని యీ ఉద్వేగాన్ని మిత్రుడు మందలించాడు, అక్కలాగే. కాని ఏం చెయ్యను? కనీసం ఇట్లాంటి క్షణాల్లో అయినా నన్ను పసివాడుగా బతకనివ్వరేం?
‘సంసారవృక్షం’ ఇన్నాళ్ళకు చదివేను.
మాష్టారి detachment గొప్పది. కాని దాని నిజమయిన శ్రేష్టత ప్రపంచం వైపుగా ఆయన ప్రసరిస్తున్న ప్రేమలో వుంది. ఎంత ప్రేమలేకపోతే, ఆయన అంత ఆనందాన్ని explore చేస్తాడు?
17-10-2022
____________
1ప్రసిద్ధ రంగస్థల దర్శకుడు. ఎక్కువమంది గుర్తుపట్టాలంటే, మరో చరిత్ర సినిమాలో మాధవి అన్నయ్యగా నటించిన కళాకారుడు.