రాజమండ్రి డైరీ-12

24-10-1986

రాత్రి అజంతాలో డిన్నర్. బి.ఎస్. రామకృష్ణ, విజయుడు. నిన్నటి నీడలు ఇవాళ చెదిరిపోయాయి.

ఉదయం ఇరగవరపు తమ్మిరాజు అనే ఆయన వచ్చి పరిచయం చేసుకున్నాడు. రేపు మధ్యాహ్నం దొమ్మేరులో వాళ్ళ పిల్లలకి శ్రీ శ్రీ గురించి చెప్పాలిట. రేపటి హడావిడి అలా వుంచి, పిల్లలకి కవిత్వం గురించి చెప్పగలిగే సరళత, సూటిదనం వున్నాయా?

కాని ఆయన అంత పెద్దవాడూ తన humbleness తోనూ, యిష్టంతోనూ మొహమాటపెట్టేసాడు. ప్రస్తావవశాన, ఆ స్కూలు గురించీ, పిల్లల గురించీ చెపుతున్నపుడు ‘మీలాంటి వాళ్ళే ఆ profession కి కావాలి’ అన్నాను. ఆయన కన్పించీ కన్పించని చిరునవ్వుతో ‘ఆ మాట అల్లా వుంచండి, ఇవాళ to be truthful is a sin, to be capable is a sin and to be sincere is a sin’  అన్నాడు.

రాత్రి గోపీని కలిసాను. బి.ఎస్ అన్నట్టే ఇంకా తేరుకోలేదు. అయినా ఆ తేరుకోకపోడంలోంచే గొప్ప clarity తోనూ, విజ్ఞతతోనూ బయటికొస్తాడు.

25-10-1986

..మధ్యాహ్నం meeting చాలా pleasant గా వుంది. పిల్లలు, ఆ స్కూల్ నన్ను elevate చేసి వుండకపోతే అంత తృప్తిగా మాట్లాడగలిగేవాణ్ణి కాను. ఇక తమ్మిరాజు గారి ఆనందం సరేసరి. తిరిగివస్తున్నప్పుడు కార్లో ఆయన డ్రైవర్ వీపుగా మీదుగా వంగి ‘అదేమిటి నువ్వు meeting కి రాలేదు. శ్రీ శ్రీ పేరు విన్నావా? గొప్ప కవి. ఈయన అద్భుతంగా మాట్లాడేరు ఇవాళ ‘అంటున్నాడు.

26-10-1986

రాత్రి ప్రయాణం ఉల్లాసంగా వుంది. విజయవాడలో రాజా స్టేషన్ కి వచ్చాడు. పొద్దున్న నాంపల్లిలో రాజారామ్మోహన రావూ, ఆపైన సుందర్రావూ,. వాళ్ళు రామ్మోహనరావుగారి ఇంటికి, నేను సుందరంతో.

పిల్లలూ, ఒదినా.

సాయంకాలం రామ్మోహనరావు గారి ఇంట్లో గడిపాం. మళ్ళీ టివిలో గాంధి. Hindi version. అంతకన్నా ఉర్దూలో అయితే బాగుండేది అనుకున్నాం. కాని ధీరుడయిన ఆ మహాపురుషుడి కథ, దాని ప్రకాశం తెలుస్తూనే వుంది.

రేపటి ఇంటర్వ్యూ ఆలోచనలు. అక్కని పెద్దన గారి పద్యం ఒకటి చెప్పమన్నాను1. ‘చూచి ఝుళంఝుళత్కటక సూచిత వేగ పదారవిందయై.. ‘ పద్యం చెప్పి ‘చలత్ సౌందర్యం ఇది’ అంది.

27-10-1986

A nervous day. అనుకున్నట్టే, డిగ్రీ సర్టిఫికెట్2 లేని కారణం చేత ఇంటర్వ్యూకి reject చేసారు. కాని వచ్చినవాడు సుందరం. పట్టుబట్టి, ఓపికపట్టి interview 31st కి  postpone చేయించాడు. But till 3.30 , what I experienced is hell-ఇంత tension ఎందుకు పడుతున్నానో కూడా అర్థం కాలేదు. సుందరం లేకపోయుంటే మొదటి అరగంటలోనే ఇంటర్వ్యూ ఒదిలేసి వెళ్ళిపోయుండేవాణ్ణి.

This disturbed everybody. అక్క మరీ sentimental గా feel అయింది..

రాత్రి పదకొండింటికి విజయవాడ వైపు.

28-10-1986

రాజమండ్రి చేరేటప్పటికి పదయింది. No RL mail. వైజాగ్ వెళ్ళక తప్పలేదు. విజయుడు, రామకృష్ణ కలిసారు.

విశాఖ సాయంకాలం ఏడింటికి వెళ్ళాను. మామయ్యగారు నన్ను చూడగానే తెరిపిపడ్డారు. ఆయన వంతు tension ఆయన పడ్డ సంగతి తెలుస్తూనే వుంది. certificate తీసుకున్నాను. వెంటనే return కావాలనుకున్నానుగానీ, వాళ్ళతో పాటు ఈ రాత్రి విశ్రాంతిగా గడపాలనే అనిపించింది. రాత్రి చాలాసేపటిదాకా పిల్లలు చుట్టూ చేరారు, నిద్రకమ్ముకొస్తున్న నాతో మాటాడిస్తో.

29-10-1986

వైజాగ్ నుంచి వస్తూ అన్నవరంలో దిగాను. ఆ గుడీ, ఆ వాతావరణం చెదరని పరిమళంతో అలానే వున్నాయి. కాని ఎక్కణ్ణుంచో ప్రశ్నలూ, సందేహాలూ. దేవస్థానం కాంటీన్ లో వాడుపెట్టిన అన్నం నన్ను చాలా కలతపెట్టింది. కష్టం కూడా కలిగింది. ‘మరో రెండు అంతస్థులు లేపు’ అన్నాను వాడితో. వాడు గంభీరంగా, కొంత ఎకసెక్కంగా ముఖం పెట్టి, ‘అదిగో, చూడు పైన లేపుతున్నాను’ అన్నాడు. నిజంగానే వాడు మేడలు లేపుతున్నాడు. బయట మెట్ల మీద హీనంగా అడుక్కుంటున్నవాళ్ళు. దేవస్థానం నన్ను సమాధానపర్చకపోగా మరింత దిగులు పుట్టించింది.

అలాగే బస్సులో. నిజంగా నా స్థానం ఏమిటి? నేను జీవితక్షేత్రంలో ఎలాగ నిలబడాలి? ఏం ఎయ్యాలి? ఏం చెయ్యకూడదు? I am worried.

deeply.

రాత్రి సైన్స్ ఫెయిర్ లో శరత్ ప్రసంగం. మ్యూజిక్ కాలేజి programme లో రామకృష్ణ పాట. అలీఘర్ నుంచి చట్టి తన పసినవ్వుతో. ఇంకా విజయుడు, రామకృష్ణ, సుబ్బూ..

ఈ మత్తెక్కించే రాజమండ్రి వాతావరణంలోంచి ఇంటర్వ్యూ కోసం మళ్ళీ హైదరాబాద్ కి.

30-10-1986

ఉదయం ఎనిమిది అయింది హైదరాబాద్ వచ్చేసరికి. మధ్యాహ్నం కమిషన్ కి report చేసాను. రేపు interview అయిపోతే, యీ nervousness నుంచి relief.

విశాలాంధ్ర లో లెనిన్ సెలక్టెడ్ వర్క్స్, పెన్ వారన్ నవల్  All the Kings Men కొన్నాను. వైకం మహమ్మద్ బషీర్ నవల కూడా.

మబ్బుపట్టినవాతావరణంలోనే సుందరంతో కలిసి వూరంతా తిరిగాను. సాయంకాలం గోపాలకృష్ణ, రేణుక గారి యింటికి వెళ్ళాం. ఆమె చాలా సాధారణమయిన మనిషిగానీ, ఆయన మాత్రం a very straight man, with a decent outlook. రామకృష్ణ మిత్రులందరిలోనూ ఈ సరళస్వభావం కన్పిస్తోంది. అది సహజం కూడాను.

31-10-1986

మధ్యాహ్నం మూడింటికి ఇంటర్వ్యూ. ఆలివ్ గ్రీన్ పాంట్, సన్నని డిజైన్  white shirt లో వున్నాను. ఉల్లాసంగానూ, కొంత కుతూహలంతోటీ, కొంత బెదురుతోటీ లోపలకి అడుగుపెట్టాను.The Commission was so cooperative that my tension was eased away. చాలా కొద్దిసేపు, కాని చాలా విషయాల్ని touch చేస్తూ, రాజ్యాంగం, సాహిత్యం,తత్త్వశాస్త్రం, సామాజిక జీవితం- అన్నిటిమీదా. సి.సుదర్శన్ head of the board. He did not question except remarking here and there whenever I was faulty.

చాలా unsatisfactory గా answer చేసాను. President of India ఇప్పుడు ఏఏ దేశాలు పర్యటిస్తున్నాడు అన్నదానికి చెప్పలేకపోగా మాయానాగరికత గురించి తెలిసింది కూడా చెప్పలేకపోయాను. వాళ్ళు దీన్నుంచి ఏమి assess చేసుకుంటారు, నాకు ఉద్యోగం ఏమిస్తారు3 అన్నది అలా వుంచి, అసలు I am disappointed at the very outset.. నా daily life  ఎంత జడంగా, చైతన్యరహితంగా వుందో ఇది చెప్తోంది.

కాని తృప్తి ఏమిటంటే, I faced it in all dignity and tranquility. I might have failed in answers but not in answering. If it has any say, it is enough.

(నవంబరు 1 నుంచి డిసెంబరు 6 దాకా ఎంట్రీల్లేవు)

17-10-2022

____________

1 మరుసటి రోజు ఇంటర్వ్యూలో తెలుగు సాహిత్యం గురించి అడుగుతారేమో, ఒక పద్యం చెప్పవచ్చు అని అడిగి, ఆ పద్యం బాగా బట్టీపట్టాను. ఆ ఇంటర్వ్యూకి నేను ప్రిపేరయింది అదొక్కటే. కాని ఆ మర్నాడు ఇంటర్వ్యూ కాలేదు. మళ్ళీ సారి ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేకపోయాను. కానీ, ఆ బోర్డులో ఉన్న అబ్దుల్ కరీం ఖాన్ అనే మెంబరు, దేవుడు అడిగించాడా అన్నట్టు, ‘మీరు తెలుగు సాహిత్యం ఒక ఆప్షనల్ గా రాసారు కదా, మీ దృష్టిలో తెలుగులో గొప్ప పుస్తకం ఏది? ‘ అనడిగాడు. ‘నిస్సందేహంగా కన్యాశుల్కం ‘ అన్నాను. ‘నిస్సందేహం’ అన్న మాటకి ఆయనకి చిరునవ్వొచ్చింది. ‘నిస్సందేహంగానా? ఎందుకని?’ అనడిగాడు మళ్ళా. ఆ తర్వాత రెండు, మూడు నిమిషాల పాటు నేను అది ఇంటర్వ్యూ అని మర్చిపోయి కన్యాశుల్కం నాటకం గురించి వారికి వివరించడం మొదలుపెట్టాను. బహుశా ఆ ఒక్క సమాధానానికే వాళ్ళు నన్ను ఆ ఇంటర్వ్యూలో సెలక్టు చేసి ఉంటారు. ‘సాహిత్యం అన్నం పెడుతుందా?’ అనే మాట వినబడేది నా చిన్నప్పుడు. కాని, నా వరకూ, సాహిత్యం నాకు మంచి ఉద్యోగం ఇచ్చిందని చెప్పగలను. ఆ తర్వాత, ఆ ఉద్యోగం ఆధారంగానే ముప్పై రెండేళ్ళ తరువాత ఐ.ఎ.ఎస్ కి ప్రమోషన్ కూడా దొరికింది.

2నా దగ్గర ప్రొవిజినల్ సర్టిఫికెటు ఉంది, కాని వాళ్ళు ఫైనల్ సర్టిఫికెట్టు అడిగారు.

3చిత్రంగా ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు నన్ను సెలక్టు చేసారు. ఆ గ్రూప్ 1 రిక్రూట్ మెంటులో నాకు జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా ఉద్యోగం వచ్చింది. 1987 లో ఆ ఉద్యోగం రావడంతో నేను రాజమండ్రి వదిలిపెట్టేసాను. ఆ ఇంటర్వూకి బాగా ప్రిపేరై వెళ్ళి ఉంటే, నాకు మరో ఉద్యోగం వచ్చి ఉండేది. ముప్పై ఏళ్ళ పాటు గిరిజనుల్తో కలిసి పని చేసే అవకాశం దొరికి ఉండేది కాదు. రాజమండ్రి ఆ రకంగా నాకు మేలు చేసిందనే ఇప్పుడు అనుకుంటున్నాను.

4 Replies to “రాజమండ్రి డైరీ-12”

  1. నిజమే మీరు ఊహించినట్టే మరో పెద్ద ఉద్యోగం దొరికి ఉండవచ్చు. కానీ మీ సేవలు గిరిజనులకి మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి ఇప్పుడు లభించినట్టు లభించేవి కావేమో ?

  2. కన్యాశుల్కం నాకు ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది ఎన్నిసార్లు చదివినా. బహుశా అదే నాటకీయత గొప్పతనమేమో

Leave a Reply to D Koundinya saiCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading