
13-10-1986
ఉల్లాసకరమైన దశమి. ఉల్లాసం మనుషుల్లోంచే పుడుతుంది. అది మళ్ళీ మనల్ని మనుషులుగా బతికిస్తుంది.
సాయంకాలం అయింది విశాఖ వెళ్ళేటప్పటికి. అత్తయ్య యింటికి వెళ్ళాం. అక్కడికే జగన్నాథ రావు గారు వచ్చారు. మామయ్యగారితో యూనివెర్సిటీ విషయం ప్రస్తావించాను.
రాత్రి వెన్నెల్లో సముద్రాన్ని చూడాలంటే మామయ్యగారు తీసుకువెళ్ళారు. సముద్రం ఒక అధివాస్తవిక చిత్రం. దాన్ని smiling sea అని ఎప్పటికీ అనుకోలేను. ఏకక్షణాన నవ్వుతుంది, హుంకరిస్తుంది, విలపిస్తుంది. దీనంగా గొణుక్కుంటుంది. వెన్నెల్లో సముద్రం ఎంత సుందరమో అంత విషాదకరం. ఈ మహానగరాన్ని నేపథ్యంలో పెట్టుకుని ఈ విషాదాన్ని చూడటం కన్నా ఏ దూరతీరంలోనో ఏకాకిగా చూసి వుండాల్సింది. నిజమే. నాలో గొథే లేడు. classicist ని కావాలని నేను చేస్తున్న ప్రయత్నాలు ఆత్మరక్షణ ప్రయత్నాలే. నేను హోల్డర్లిన్ ని. ఇవాళ మార్టిన్ వాల్ఫెర్ వ్యాసం చదివినప్పుడు ఇలాగే అనుకున్నాను. సముద్రం ముందు పసిగా నిలబడీ ఇలాగే అనుకుంటున్నాను.
14-10-1986
యూనివెర్సిటీలో పని దాదాపుగా అయినట్టే…
15-10-1986
ఇన్నాళ్ళకి ఎస్-ని కలిసాను. నెలరోజులుగా mental depression కి వైజాగ్ లో treatment తీసుకుని మొన్నే వచ్చానన్నాడు. ఒక serious illness నుంచి తేరుకుని పత్యం తీసుకుంటున్నవాడిలా వున్నాడు. వాడిని అలా చూడటం చాలా relief గా వుంది. అందుకే ఇంకా ఏమీ ప్రస్తావించకుండా, చర్చించకుండా వచ్చేసాను.
సాయంకాలం CS ని కలిసాను. ఈ మధ్య మద్రాసు వెళ్ళివచ్చాడుట. నన్ను కూడా film field కి వెళ్ళమన్నాడు. కాకినాడలో అతను మరీ ఒంటరి అయిపోయినట్టుగా ఉన్నాడు. కాని, he is a man always aware of the limitations of life. అతని gentlemanliness కూడా ఆ వివేకంలోనే వుంది. contentment ఉన్నవాడు.
16-10-1986
ఉదయం. రాజమండ్రికి, పాపాజీ కూడా. మళ్లీ routine. నెత్తిన మొట్టుపెట్టే స్తబ్ధత.
మధ్యాహ్నం సీతారాం కలిసాడు. ఇంకా మిత్రులూ. రాత్రి చాలాసేపు రామకృష్ణతో. ఈ హడావిడిలోనూ, కలయికల్లోనూ, కబుర్లలోనూ, ఏదో తెలియని తెరనీ, దాని మీది చీకట్లనీ, నీడల్నీ అట్లా భావిస్తో వుండిపోయాను. ఇదీ అని చెప్పటానికి వీల్లేని మనఃస్థితి.’ అంత dull గా వున్నావేమిటి? ‘ అని ఎవరన్నా అడిగితే ‘కాదు, కాస్త peaceful గా వుంది’ అని కూడా అనేస్తున్నాను.
పిల్లల1 ఇంగ్లీష్ పేపర్స్ దిద్దుతుంటే-చాలా dissatisfyingగా వుంది. వాళ్ళకి ఎంత ప్రయత్నించినా నేను సరయింది అనుకుంటున్న పద్ధతిలో చదువు చెప్పలేను. వాళ్ళకి అది అక్కర్లేదు. పోనీ అనుకుందామా అంటే, spelling mistakes, grammar mistakes, copying ఈ dust లోంచి విద్య అన్నదాన్ని ఎలా ప్రకాశింపచెయ్యగలం?
గోదావరి శర్మకి వుత్తరం రాసాను. ‘ఒకవేళ ఏదన్నా పటాటోపమూ, ప్రగల్భమూ, incoherence నా కవిత్వంలోవుంటే అది నా జీవితంలో కూడా వున్నాయన్నమాట. But, I can not denounce what I am experiencing’ అని.
17-10-1986
పిల్లలకి దిద్దిన పేపర్లు ఇస్తూ చాలా explain చేసాను. వివరంగానే వాళ్ళ grammar mistakes, approachలోని defectsచెప్పుకొచ్చాను. కాని, ఇంతచేసినా I could not satisfy myself. ఎందుకో harsh గా behave చేసానా అన్పించింది. నేను కటువుగా వున్నానేమోగాని, క్రూరంగా లేను. I am very much concerned. ఇదంతా విఫలమయిపోతోందేమో అన్న బెంగలోంచి అలా అన్పించిందో.
18-10-1986
Mild days.
19-10-1986
Godavari Basin Development మీద National Seminar కి వెళ్ళాను మధ్యాహ్నం. ఎక్కువసేపు ఉండలేదు..
సాయంకాలం మిత్రులంతా ఇంటిదగ్గర కలిసారు.
20-10-1986
ఉదయాన్నే శాస్త్రీ2, శ్రీకాంత్3 ఆఫీసుకి వచ్చి పలకరించి ఇంటికి రమ్మన్నారు. మధ్యాహ్నం వెళ్ళేటప్పటికి మాష్టారు కూడా. నాతో పాటు బి.ఎస్. రామకృష్ణ. శ్రీకాంత్ విశ్వనాథ తొలిరచనలపైని తన వ్యాసాన్ని వినిపించాడు. మంచి study, delicate approach. కానీ విన్నది మాష్టారు. గొప్ప హుందాతనంతో thanks అన్నారు. ఇక రాత్రి తొమ్మిదింటిదాకా అతనితో కబుర్లు. నా కవిత్వసంపుటి గురించీ, కథ4 గురించీ ఎంతో ఇష్టంగా ప్రస్తావించాడు. alienation- ఆ మాట అతన్ని ఎందుకు పట్టదు? గాయపడ్డవాడికే గాయపడ్డవాడు అర్థమవుతాడు. Sound medium కి మంచి నాటిక రాయమని అడిగాడు. ఇంకా కొత్తపల్లి, గోపీచంద్, సుబ్రహ్మణ్యం, శరత్, విజయుడు..మిత్రులంతా కలిసారు. పైగా విశాఖనుంచి మల్లాప్రగడ surprising గా.
రాత్రి ఈ ఉత్సాహంలోంచి, ఈ ఆనందపు దుమారం నుంచి ఇంటికి వెళ్ళాక గోపీచంద్ చెప్పుకొచ్చాడు. సాయంకాలం మల్లాప్రగడకీ, సుబ్బూకీ వై- చేసిన హితబోధ గురించి. సారాంశమల్లా బా- ని నమ్మొద్దనీ..ఇందులో ఎవరి motives వారివి. పైకి బా- ఒక explanation. ఎంత నిస్త్రాణ ఆవరించిందని!
‘పద్మాల ఆశ చూపించి పంకం నేలంతా ఆక్రమిస్తూనే వుంది.’5
22-10-1986
నమ్మకం అనేది అత్యంత సున్నితమైన భావన. దాని sensitivity ని protect చేస్తున్నప్పుడే అది దృఢంగా వుంటుంది. ఎవరన్నా rough గా, నీచంగా ఒక్క మాటతో, ఒక్క అకార్యంతో దాన్ని ఛిన్నాభిన్నం చెయ్యగలరు. ఇదీ ఇప్పుడు నేను చూస్తున్నది.
శిథిలమయిన నమ్మకం మళ్ళీ పెరిగి, మళ్ళీ పాదుకొన్నప్పుడు ఇంకా దృఢపడుతుంది. ఇక ఎన్ని shocks ని అయినా తట్టుకుని రాటుపడుతుంది. ఎవ్వరూ తెంపలేనంతగా తీగసాగుతుంది. ఇదీ నాకు అర్థమవుతున్నది. కాని, ఇది నిజమే అయినా, ఈ నమ్మకమే మనుషుల్ని కలిపి వుంచేది అయినా, తొలినాళ్ళ ఆ కలయికలోని freshness, తావి, ప్రకాశము ఇంకా నిలుస్తాయా? తప్పనిసరిగా కలీ ఉండటం వేరు-దాన్ని బంధం అంటాం. నమ్మకంలోని స్వేచ్ఛ దానికెక్కడిది?
నమ్మకం, పరస్పర విశ్వాసం-ఎంతో ఆరోగ్యంగా వుండే మానవసమాజాల్లోగాని సాధ్యం కాదు అనుకోవాల్సి వస్తోంది. దాన్నే మరోలా కూడా చెప్పవచ్చు. నమ్మకం లేందే, విశ్వాసం పాదుకోందే మనుషుల సంబంధాలు ఆరోగ్యంతో తొణికిసలాడవు- అని.
23-10-1986
ఉదయం పెమ్మరాజుతో. అతని గురించి విన్నదానికన్నా ఒక sincere man ని serious man ని చూతున్నాను. నేననుకోవడం ఇప్పుడిప్పుడే అతనూ తనలోని గాఢత దిక్కుగా ఆసక్తుడవుతున్నాడు.
16-10-2022
_______________________
1 సదనం హైస్కూల్లో పిల్లలకి ఇంగ్లిషు చెప్పడం మొదలుపెట్టాను. కాని అది ఎన్నో రోజులు సాగలేదు.
2 పి.వి.ఎస్. శాస్త్రి. పంచాయతీ శాఖలో ఎక్జిక్యూటివ్ ఆఫీసరుగా పనిచేసాడు. బాలగంగాధర్ తిలకి కి చాలా దగ్గర మిత్రుడు.
3ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. శాస్త్రి ఆయన్ని శ్రీకాంత్ అని పిలిచాడు కాబట్టి నేను కూడా శ్రీకాంత్ అని రాసుకున్నానుగాని, అంత చనువు ఉండి కాదు.
4‘గృహోన్ముఖంగా’ కథ. ఆ ఏడాదే ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితం.
5‘నిర్వికల్ప సంగీతం’లో ఒక కవితలో వాక్యం.